Categories
Vipra Foundation

తొలి ఏకాదశి, శయన ఏకాదశి

        మన భరతభూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి వొకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరింపబడుతోంది.

       ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి” అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.

అసలు మన పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు(24) ఏకాదశులు వస్తాయి. చాంద్ర మానం ప్రకారం మూడు సంవత్సరాల కొక సార అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవైఆరు ఏకాదశులు వస్తాయి. అన్నిటిలోకి ముఖ్యంగా తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఎక్కువగా జరుపుకుంటాము.

       ఏకాదశి అంటే పదకొండు అని అర్థము. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించబడింది. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో వివరించబడిన సంగతి విదితమే.

       అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొనబడింది.

       తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, సంకల్పం వలన తన శరీరము నుంచి ఒక కన్యకను జనింపజేసినట్లు ఆమెనే “ఏకాదశి” అనీ, ఆమె మూడు వరాలు…

1. సదా మీకు ప్రియముగా ఉండాలి.

2. అన్ని తిధులలోను ప్రముఖంగా ఉండి అందరిచే పూజింపబడాలి.

3. నా తిధి యందు భక్తితో పూజించి ఉపవాసము చేసిన వారికి మోక్షము లభించాలి.

అని కోరినట్లు ఎన్నో పురాణ కథలు చెప్పబడి ఉన్నాయి.

మహా సాద్వీ అయిన సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందని సంతులీలామృత పురాణంలో చెప్పబడింది. అందువల్లనే, ఆ రోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

చాతుర్మాస వ్రతము

      ఆషడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ మాసాల్లో శ్రీ మహావిష్ణువు పాల కడలి మీద శయనిస్తాడు కావున ఈ నాలుగు నెలల్లో ఒక్కోనెల ఒక్కో పదార్ధాన్ని తినరు (వదలివేస్తారు ) దీనినే ‘ చాతుర్మాస ‘ వ్రతము అంటారు .ఈ వ్రతాన్నిగృహస్థులు నాలుగు నెలల పాటు ఆచరించవలసి ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఆషాఢ మాసం లో మొదలైన ఈ వ్రతం శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం వరకు కొనసాగుతుంది. ఒక్కో నెలలో ఒక్కొక్క విధమైన నియమాలతో ఉపవాస దీక్షను ఆచరించ వలసి ఉంటుంది.

వ్రత సంకల్ప విధానం: చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించే వాళ్ళు

          “త్వయి సుప్తే జగన్నాథ,జగత్సుప్తం భవేదిదం|

          విబుద్ధేచ విభుద్యేత,ప్రసన్నో మే భవాచ్యుత||

          చతురో వార్శికాన్ మాసాన్ దేవస్యోత్థాపన వధి|

          శ్రావణే వర్జయేత్ శాకం దధి భాద్రపదే తథా||

          దుగ్ధమాశ్వయుజే మాసి  కార్తికే ద్విదళం త్యజేత్|

          ఇమం కరిష్యే నియమం నిర్విఘ్నం కురుమేచ్యుత||

          ఇదం వ్రతం మయాదేవ!గృహీతం పురతస్తవ|

          నిర్విఘ్నం సిద్ధి మాయాతు ప్రసాదాత్తే రమాపతే||

          గృహీతేస్మిన్ వ్రతే దేవ పంచత్వం యదిమే భవేత్|

          తదా భవతు సంపూర్ణం ప్రసాదాత్తే జనార్దన||”        

    అనే శ్లోకాలను  పఠించాలి.

       భావం: ఈ చాతుర్మాస్యాలలో శ్రావణంలో శాకాన్ని(కూర,దుంప,పళ్ళు,ఆకులు)వదులుతున్నాను,భాద్రపదంలో పెరుగును,ఆశ్వయుజంలో పాలను,కార్తికంలో ద్విదళ ధాన్యాన్ని(రెండు బద్దలుగా వచ్చే పెసలు మొదలైన  గింజలు) విసర్జిస్తున్నాను.ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా ఆచరించేలా అనుగ్రహించు.ఒకవేళ వ్రతం మధ్యలో మరణం సంభవిస్తే వ్రత సంపూర్ణ సిద్ధిని అనుగ్రహించమని” ప్రార్థించి స్వామికి శుద్ధమైన జలంతో అర్ఘ్యం ఇవ్వాలి.

                  ఈ వ్రతం చేయటం వాళ్ళ ఆ సంవత్సరంలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. అంతేగాక దారిద్ర్య బాధలు తొలగడానికి తప్పక ఈ వ్రతాన్ని ఆచరించాలి అని ధర్మ శాస్త్రాల వచనం.

    ఆషాడమాసము లో … ఆకుకూరలు , (విరోచనాలు వాంతులు ఉన్న కాలము కావున ఆకుకూరలు తినకుండా ఉంటే మంచిది ),

    శ్రావణ మాసములో … పెరుగు (గాస్టిక్ ఎసిడిటీ పెరగకుండా ఉండడానికి– కాలములో ఎసిడిటీ ప్రొబ్లంస్ ఎక్కువ కాబట్టి ),

    భాద్రపద మాసము లో … పాలు ( గొడ్లు ఎదకట్టే కాలము కావున ),

    ఆశ్వీయుజ మాసము నుంచి కార్తీకము వరకు పప్పుదినుసులు వదిలేస్తారు.

       ఈ నాలుగు నెలలు ఈ పదార్ధాలు తినరు . ఆశ్వీయుజ, కార్తీక మాసాలలో శాకవ్రతము చేస్తూ ఆకుకూరలు , కంద , చేమ.. తో చాలామంది భోజనం చేస్తారు . ఇవన్నీ అరోగ్యకరమైన సూత్రాలు .

      విష్ణుమూర్తి జ్ఞానసిద్ధునికి చెప్పిన చాతుర్మాస్యవ్రత విదానాన్ని ధనలోభికి అంగీరసుడు వివరించెను

       ఓ మునిశ్రేష్టా! చాతుర్మాస వ్రమతని చెప్పారు కదా… ఏ కారణం వల్ల దానిని ఆచరించాలి? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమిటి? విధానం ఏమిటి? అన్నీ వివరించమని కోరెను. అందులకు అంగీరసుడు ఇలా చెప్పెను…

       ఓ ధనలోభా వినుము… చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రములో శేషుడు పాన్పుగా నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొనును. ఆ నాలుగు నెలలకే చాతుర్మాసమని పేరు. ఈ నాలుగు నెలల్లో శ్రీహరి ప్రీతికొరకు స్నాన, దాన, జపతపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగుతుంది. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు ద్వారా తెలుకొంటిని కాబట్టి ఆ సంగతులను మీకు తెలియజేయుచున్నాను.

       మొదట వైకుంఠమునందు గరుడగంధర్వులు, దేవతలు, వేదాలచే సేవింబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై ఉండగా నారదమహర్షి వచ్చి నమస్కరిస్తాడు. కుశల ప్రశ్నలు అయిన పిదప శ్రీహరి నారదమహర్షిని లోకమంతా ఎలా ఉందని ప్రశ్నిస్తాడు. అప్పుడు నారదుడు శ్రీహరికి, ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా! నీకు తెలియని విషయాలంటూ ఈ సృష్టిలో ఏమున్నాయి. అయినా నన్ను చెప్పమనడంలో నీ గొప్పదనం అర్థమవుతోంది. ఈ ప్రపంచంలో సాధుపుంగవులు, మానవులు కూడా వారికి విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. మరికొందరు భుజింపకూడదని పదార్థాలను భూజిస్తున్నారు. మరికొందరు పుణ్యవ్రతాలు చేస్తూ కూడా మధ్యలో వాటిని ఆపేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార పూరితులై పరులను నిందిస్తూ ఇష్టం వచ్చినట్లు జీవనం సాగిస్తున్నారు. మరి వీరంతా ఎలా ముక్తి పొందుతారో నాకు తెలియడం లేదని మహర్షి ఆవేదన చెందుతాడు. వీరందరినీ ఉద్ధరించేందుకు తగిన మార్గం ఉపదేశించమని అర్ధిస్తాడు.

       అందుకా జగన్నాటక సూత్రధారి శ్రీ మహావిష్ణువు కలవరపడి లక్ష్మీదేవితో పాటు, గరుడ, గంధర్వాది దేవతలతో మునులు ఎక్కువగా ఉండే ప్రదేశానికి వచ్చి వృద్ధ బ్రాహ్మణ రూపంలో తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ లోకంలోని సకల జీవుల్ని పరిశీలిస్తూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, పుణ్యాశ్రమాలు ఇలా అన్ని చోట్ల తిరుగుతుంటాడు. ఈ విధంగా తిరుగుతున్న భగవంతుడిని చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేసేవారు. మరికొందరు ఈ ముసలివాడితో మనకేమి పని అని వారు ఎదురుగానే తప్పుకుతిరిగేవారు, మరి కొందరు అసలు ఈయనవంకే చూసేవారు కాదు. వారందరినీ చూస్తూ ఈ మనుజులను ఎలా తరింపచేయాలి అని ఆలోచిస్తాడు శ్రీహరి. ఈ విధంగా ఆలోచిస్తూనే ఓ రోజు శ్రీహరి నిజరూపంలో లక్ష్మీదేవితో సహా సకల దేవతాగణంతోనూ కలిసి నైమిశారణ్యముకు వెడతాడు.

       ఆ వనమందు తపస్సు చేసుకొంటున్న మునులు స్వయంగా తమ ఆశ్రమాలకు వచ్చిన శ్రీహరిని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, లక్ష్మీనారాయణలను పరిపరి విధాలుగా స్తోత్రాలు చేస్తారు.

       ఈ విధంగా మునులందరూ కలిసి లక్ష్మీనారాయణులను స్తోత్రము చేసిన తదుపరి జ్ఞాన సిద్ధుడను మహాయోగి ఓ దీనబాంధవా! వేదవ్యాసుడని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రులుగా గలవాడివని, నిరాకారుడవని, సర్వజనులచే పూజింపబడుతున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. ఓ నందనందనా మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వల్ల మేము మా ఆశ్రయములు, మా నివాస స్థలములన్నీ పవిత్రములైనవి. ఓ దయామయా మేమీ సంసారబంధం నుండి బయటపడే మార్గాన్ని నిర్ధేశించమని వేడుకొనెను. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనం చేసుకోలేడు. నీ భక్తులకు మాత్రమే నీ దర్శన భాగ్యం కలగుతుంది. ఓ గజేంద్ర రక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! మమ్ము కాపాడమని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధా! నీ భక్తికి నేనెంతో సంతోషించితిని. నీకు ఇష్టమైన వరము కోరుకోమని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరమునుంచి విముక్తుడను కాలేక సతమతమవుతున్నాను కాబట్టి నీ పాద పద్మములపై నా ధ్యానముండునటుల అనుగ్రహించమని వేడుకొనెను.

       అంతట శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధా! నీవు కోరిన విధంగానే వరమిచ్చితిని. అది కాక ఇంకొక వరం కోరుకోమనెను. అప్పుడు జ్ఞానసిద్ధుడు మా బోటి వారే సంసారబంధమునుండి తప్పించుకోలేకపోతున్నతారు. మరి సామాన్యులను కూడా ఉద్దరింపమని కోరగా నారాయణుడు చిరునవ్వుతో భక్తా ఈలోకమందు అనేకమంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారి పాపములు పోవుటకు ఒక వ్రతమును సూచిస్తున్నాను. ఆ వ్రతమును అందరూ ఆచరించవచ్చును. జాగ్రత్తగా వినమనెను.

       నేడు ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై నిద్రకు ఉపక్రమిస్తాను. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తిరిగి నిద్ర లేస్తాను. ఈ నాలుగు నెలల కాలాన్నే చాతుర్మాస్య వ్రతమని అంటారు. ఈ కాలంలో త్రిసంధ్యలలో చేసే పూజలు, వ్రతాలు నాకు ఎంతో ఇష్టం. ఈ సమయంలో ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తూ, ఇతరులచేత చేయిస్తారో వారంతా నా సన్నిధికి చేరుకుంటారు. ఆషాఢ శుద్ధ దశమి నుండి కూరలు, శ్రావణ శుద్ధ దశమి నుంచి పెరుగు, భాద్రపద శుద్ధ దశమి నుండి పాలు, ఆశ్వయుజ శుద్ధ దశమి నుండి పప్పులు తినడం మానివేయాలి. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకు నేను ఇలా శయనింతునని తెలిపి శ్రీమన్నారాయణడు శ్రీమహాలక్ష్మితో పాలసముద్రమునకు వెళ్ళి శేషపానుపుపై పవళించెను.

       ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధునికి చెప్పిన చాతుర్మాస్యవ్రత విదానాన్ని ధనలోభికి అంగీరసుడు వివరించెను. ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ, పురుష బేధము లేదు. అందరూ చేయవచ్చుననెను. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళెనని తెలిపిరి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)              

Categories
Vipra Foundation

గోపద్మ వ్రతం

  ఈ ‘తొలి ఏకాదశి’ నాడు “గోపద్మ వ్రతం” చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు.

        ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని ‘గోమాతకు’ ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి.

       అట్టి గోమాత నివశించే గోశాలను ఈ ‘తొలిఏకాదశి’ దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క “అప్పడాన్ని” వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. అలా, గోపద్మవ్రతం చెయ్యాలి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం (కర్కాటక సంక్రమణం ప్రారంభం)

      భారతదేశంలో ప్రాచీనకాలం నుంచి కాలగణo అద్భుతంగా చేశారు. ప్రతి సంవత్సరాన్ని రెండు అయనాలుగా విభజించారు. ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. పన్నెండు రాశుల్లో సూర్యుని ప్రవేశాన్ని బట్టి ప్రతినెలా సంక్రాతి వస్తుంది. ఆ పరంపరలో మకరరాశిలో సూర్యుని ప్రవేశం ‘మకర సంక్రాతి’గా నాటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంగా ఆచరిస్తారు. అదేవిధంగా కర్కాటక రాశిలో సూర్యుని ప్రవేశాన్ని దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంగా లెక్కిస్తారు. దీనినే కర్కాటక సంక్రాoతి అని కూడా అంటారు. కర్కాటక రాశిలో సూర్యుడి ప్రవేశం నాటి నుంచి మకరరాశిలో సూర్యుడి ప్రవేశం వరకు మధ్య కాలాన్ని దక్షిణాయనం అంటారు. ఆరునెలలు దక్షిణాయనం, ఆరునెలలు ఉత్తరాయణం.

      హిందూమతంలో దక్షిణాయన ప్రారంభం దేవతలకు రాత్రి సమయ ప్రారంభంగా విశ్వసిస్తారు. మానవుడి సంవత్సరకాలం దేవతలకు ఒకరోజు. దేవతలకు దక్షిణాయనం రాత్రి పూటగా, ఉత్తరాయణం పగటిపూటగా పరిగణిస్తారు. పురాణాలలో దక్షిణాయనం ప్రారంభమైన రోజు నుంచి విష్ణుమూర్తి నిద్రకు ఉపక్షికమిస్తాడని విశ్వాసం. దీనినే ‘దేవశయన ఏకాదశి’ అని కూడా అంటారు. ఈ సమయంలోనే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది.

కర్కాటక సంక్రాతి రోజున పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించడం లేదా పిండ ప్రదానం చేయడం పురాణకాలం నుంచి వస్తున్న ఆచారం. మరికొన్ని పురాణాలలో వరాహమూర్తి విష్ణుమూర్తిని పూజించిన రోజుగా ప్రసిద్ధికెక్కింది. తమిళనాడులో దక్షిణాయనం ప్రారంభ నాటి నుంచే ఆడి(ఆషాఢ మాసం) ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి ఎటువంటి పండగలు, శుభకార్యాలు చేసుకోరు. అదేవిధంగా దేవతలకు రాత్రిపూటగా భావించే దక్షిణాయనంలో కొన్ని ముఖ్యమైన పండగలు కూడా వస్తాయి.వాటిలో ప్రప్రథమంగా ‘వరలక్ష్మీ వ్రతం’ శ్రావణమాసంలో వస్తుంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ వ్రతాన్ని భారతదేశమంతా ఆచరించడం అందరికి తెలిసిన విషయమే. రుషులు, సన్యాసులు, పీఠాధిపతులు ఈ కాలంలో చాతుర్మాస్య దీక్షను చేపడుతారు.

దక్షిణాయనం ప్రాముఖ్యత :

     కర్కాటక రాశి నుంచి ధనస్సు రాశి వరకు సూర్యుని గమనాన్ని దక్షిణాయనంగా పరిగణిస్తారు అనగా ఈ సమయం నుంచి కాలంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయి. దానితో మానవుని జీవితం కూడా ప్రభావితమవుతుంది. దీనికి ఉదాహరణ కర్కాటక రాశిలో సూర్యుడి ప్రవేశం అనగా ఈ సమయం వర్షాకాలం. ఈ సమయంలో పంటలు, వ్యవసాయ పనులు ప్రారంభమై ఊపందుకొంటాయి. అదేవిధంగా మిగిలిన మూడు నెలలు చలికాలం వస్తుంది.

ఇక ఆధ్యాత్మికంగా ఇది చాలా విలువైన కాలం. శ్రావణ నుంచి కార్తీక మాసం వరకు చాతుర్మాస దీక్ష చేసే కాలం. ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనదిగా విశ్వసిస్తారు. విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్లే సమయం ఇది. ఆషాఢ శుక్ల ఏకాదశిని హరి శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు యోగనిద్రలో గడిపిన విష్ణువు తిరిగి ద్వాదశి లేదా ఉత్థన ద్వాదశి నాడు యోగనిద్ర నుంచి బయటకు వస్తాడని ప్రతీతి. ఇక ఈ సమయంలోనే ముఖ్య పండగలన్నీ వస్తాయి. నాగ చతుర్థీ, వరలక్ష్మీ వ్రతం, ఉపాకర్మ(క్షిశావణ పూర్ణిమ), శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, రుషిపంచమి, శ్రీ అనంత చతుర్దశి, దేవి నవరావూతులు, విజయదశమి, దీపావళి మొదలగు ముఖ్య పర్వదినాలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. మరో విధంగా దక్షిణాయనంలో పితృపక్షాలు వస్తాయి. ఉత్తరాయణం దేవతలకు ప్రీతికరం కాగా, దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించిందిగా భావిస్తారు. ఈ పితృపక్షాలలో తండ్రులు, తాతలు, తల్లి(చనిపోయిన పెద్దలకు) శ్రాద్ధకర్మలు నిర్వహించడం, వారి పేరుమీద పిండప్రదానం, దాన ధర్మాలు చేయడం ఆనవాయతీగా వస్తుంది.

     ఈ సమయంలోనే అయ్యప్ప మాలా దీక్షాధారణ, కార్తీక మాస దీక్షలు అన్నీ వస్తాయి. వాతావరణంలో వేగంగా జరిగే మార్పులకు తట్టుకొని రోగాల బారిన పడకుండా ఉండేలా పూర్వీకులు రకరకాల దీక్షలు, వ్రతాలు, ఆచారాలను ప్రవేశపెట్టి ఇటు శారీరక రక్షణతోపాటు, మనిషిని దైవం వైపు నడిపించేలా కాలాన్ని విభజించారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

వివస్వత్సప్తమి – వివస్వత సప్తమి

          వివస్వత్సప్తమి,  వైవస్వత  మనువు జన్మదినం. ఇతనే ప్రస్తుతం నడుస్తున్న మన్వంతరానికి అధిపతి. కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు. ఇది 432 కోట్ల సంవత్సరాలు. ఒక కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. మన్వంతరాన్నే మనుయుగమని కూడా అంటారు. మన్వంతరానికి 31,10,40,000 సంవత్సరాలు. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. ఒక్కో మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి, ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గడచి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత నడుస్తున్న కలియుగం లో ఉన్నాము.

వివస్తే ప్రభయా ఆచ్ఛాదయతీతి వివస్వాన్

తన ప్రకాశంతో ఎవరినైనా పూర్తిగా కప్పి, తన శక్తిని ప్రసరించగలిగేవాడే వివస్వానుడు అని చెప్పబడినది.

శక్తిని ప్రసరించగలిగేవాడు కనుక, సూర్య దేవునికి వివస్వతుడనే పేరు కూడా ఉంది. సూర్య దేవునికీ, అతని భార్య అయిన సరయు (శరణ్య) కు జన్మించిన కుమారుడే వైవస్వత మనువు. ఈ మనువుకి శ్రద్ధాదేవుడనే మరో పేరు కూడా ఉంది. ఇతనికి  ఒకసారి తుమ్ము వచ్చినపుడు ముక్కు రంధ్రంనుండి వెలువడిన బిడ్డ ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకు వంశమునకు మూలపురుషుడయ్యాడు. వీరు ఆద్యులైన సూర్య వంశీకులు. ఈ వంశంలోనే శ్రీరామ చంద్రుడు జన్మించాడు.

          ఆషాఢ మాసంలోని శుక్లపక్ష సప్తమిని వివస్వత్సప్తమి లేదా భాను సప్తమి గా జరుపుకుంటారు. హిందూ నమ్మకాల ప్రకారం ఈ రోజున పగటి సమయంతో , రాత్రి  సమయం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిసమానం గా ఉంటుంది. వివస్వత్సప్తమి రోజున సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ రోజున ఆదిత్య హృదయం పఠించటం శ్రేయస్కరం.

సప్తమి  తిథి విశిష్టత

          సప్తమి తిథికి అధిదేవత సూర్య భగవానుడు, ఈ రోజు  సూర్యుడు రథాకారంలో కనిపిస్తాడని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. ఏడు (సప్త) సంఖ్య కు సూర్యునికి విశేషమైన సంబంధం ఉంది. సూర్య భగవానుని జన్మ తిథి సప్తమి. అతని రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి.  అతని కిరణాల్లోని కాంతి ఏడు రంగుల కలయిక. ఒకవేళ  సప్తమి ఆదివారం వస్తే దానిని మరింత విశేషమైనది గా భావిస్తారు. తిథుల్లో సప్తమి, వారాల్లో ఆదివారం సూర్యారాధన కు ప్రశస్తమైనవి.

వివస్వత్సప్తమీ:-

ఆషాఢశుక్లసప్తమీ వివస్వత్సప్తమీ| సా పూర్వవిద్ధా గ్రాహ్యా|

తథా చోక్తం భవిష్యత్పురాణే-

ద్వితీయే మాసి నైదాఘే సప్తమ్యాం శుక్లపక్షకే|

వివస్వాన్నామ రాజేంద్ర సంజజ్ఞే భాస్కరః పురా||

తస్మాత్తం పూజయేత్తత్ర ప్రసూనైర్విధైః శుభైః||

వసిష్ఠః-

షష్ఠ్యా యుతా సప్తమీ తు కర్తవ్యా తాత సర్వదా||ఇతి|

ఇయమేవ పొర్వఫల్గునీ యుతా చేన్మహాపుణ్యఫలప్రదా|

ఉక్తఞ్చ చన్ద్రికాయాం-

భగర్క్షేణ యుతా చేత్ స్యాన్మహాపుణ్యఫలప్రదా ఇతి|

ఆషాఢశుద్ధ సప్తమినాడు వివస్వత్సప్తమి అగును. దీనిని పూర్వవిద్ధగా గ్రహించవలెను. నిదాఘకాలమనగా వేసవికాలము గ్రీష్మర్తువు. అందు రెండవదైఅన ఆషాఢమాస శుక్ల సప్తమినాడు ’వివస్వాన్’ అని పేరుతో భాస్కరుని పూజించవలెను.అని భవిష్యత్పురాణము చెప్పుచున్నది.

షష్ఠితో కూడిన సప్తమి ఫల్గునీ నక్షత్రముతో కూడినచో మహాపుణ్యప్రదమని వసిష్ఠులు చెప్పిరి. చంద్రికా గ్రంథము కూడా ఈ విషయమునే చెప్పినది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

స్కంద పంచమి

      పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్యరూపం-సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనే నామధేయం కేవలం సుబ్రహ్మణ్యానికే సొంతం. దేవసేనాధిపతిగా, సకల దేవగణాల చేత పూజలందుకునే దైవం కుమార స్వామి అని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి షణ్ముఖుని అనుగ్రహం పొందగలిగితే స్కంద పంచమి, కుమార షష్ఠి రోజుల్లో స్వామిని పూజించాలి. కుమార స్వామిని పూజిస్తే గౌరీశంకరుల కటాక్షం మనకు లభించినట్లే.

      శివపార్వతుల తనయుడైన కుమార స్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె భరించలేకపోవడంతో, ఆ శిశువు రెల్లు పొదల్లో జారిపడింది. ఆ శిశువును కృత్తికా దేవతలు ఆరుగురు స్తన్యమిచ్చి పెంచారు. జారిపడినందున ఆ శిశువును స్కందుడని, రెల్లు గడ్డిలో ఆవిర్భవించడంతో శరవణుడని, కృత్తికా దేవతలు పెంచడంతో కార్తీకేయుడని కుమార స్వామిని పిలుస్తారు.

      ఇక సుబ్రహ్మణ్యునికి ఉన్న ఆరు ముఖాలకు ప్రత్యేకతలున్నాయి. మయూర వాహనాన్ని అధిరోహించి కేళీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం, పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం, శూరుడనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం, శరుణు కోరిన వారిని సంరక్షించే ముఖం, శూలాయుధ పాణియై వీరుడిగా ప్రస్పుటమయ్యే ముఖం, లౌకిక సంపదల్ని అందించే ముఖం… ఇలా ఆరు ముఖాల స్వామిగా ఆనంద దాయకుడిగా స్వామి కరుణామయుడిగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్నాడు.

     అందుచేత ఆషాఢ మాస శుక్ల పక్ష పంచమి, షష్ఠి పుణ్య దినాల్లో భక్తులు స్వామిని విశేషంగా సేవిస్తారు. వీటిని స్కంద పంచమి, కుమార షష్ఠి పర్వదినాలుగు జరుపుకుంటారు. స్కంద పంచమినాడు కౌమారికీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

      ఇంకా పంచమి నాడు ఉపవాసం ఉండి, షష్ఠి నాడు కుమార స్వామిని పూజించడం ఓ సంప్రదాయంగా వస్తుంది. నాగ దోషాలకు, సంతాన లేమి, జ్ఞాన వృద్ధికీ, కుజ దోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయ. స్కంద పంచమి, షష్ఠి రోజుల్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

పూరీ జగన్నాథ రథ యాత్ర…… ఆషాడ శుద్ధ విదియ

       జగన్నాధ ఆలయాన్ని శ్రీక్షేత్రం, శంఖు క్షేత్రం, పురుషోత్తమ క్షేత్రమని పిలుస్తారు..37,000 చదరపు మీటర్ల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన అద్భుత వాస్తుకట్టడం జగన్నాథుని ఆలయం.

       ఈ ఆలయాన్ని ఇంద్రద్యుమ్నమహారాజు కట్టించాడట. ఆయనకు విష్ణుమూర్తి కలలో కనిపించి చాంకీ నదితీరాన ఓ కొయ్య కొట్టుకు వస్తుందనీ దాన్ని విగ్రహాలుగా మలచమని అజ్ఞాపించాడట కానీ దాన్ని మలచడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో దేవశిల్పి విశ్వకర్మ మారువేషంలో వచ్చి తాను మలుస్తానని చెప్పాడట. అయితే తాను తలుపులు మూసుకుని విగ్రహాలు చెక్కే సమయంలో ఎవరు రాకుడదని షరతు విధించాడట. ఉత్సుకత ఆపుకోలేని రాజు పదిహేనోరోజున తలుపులు తెరపించడంతో అయన వాటిని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయాడట. దాంతో అలాగే ప్రతిష్టించారన్నది స్థలపురాణం. గోపురాలతో పెద్ద మండపాలతో దాదాపు 120 గుళ్ళు ప్రాంగణంలో ఉన్నాయి.

బలభద్ర, సుబద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలో నుంచి బయటికి తీసుకు వచ్చి భక్తులకి కనువిందు చేస్తారు. ఊరేగించడానికి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాడ శుద్ధ విదియనాడే అయినా అందుకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్యశిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయతృతీయనాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కలని జగన్నాథుడి రథం తయారీకి, 763 ఖండాలను బలరాముడి రథనిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథానికీ వినియోగిస్తారు. .

       సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూడులై యాత్రకు సిద్ధంగా ఉండగా, పూరీ సంస్థానాధీశుడు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను ‘చెరా పహారా’ అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్ళు చిలకరించి కిందకి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణాలు చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడినీ, సుభద్రాదేవినీ అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరీ కళ్ళాపిజల్లి హారతిచ్చి ‘జై జగన్నాథా’ అని పెద్దపెట్టున అరుస్తూ తాళ్ళను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు.

       ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాదుడి గుడి నుంచి మూడుమైళ్ళ దూరంలో ఉండే ‘గుండీచా’ గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటలు పడుతుంది. వారం రోజుల పాటు గుండీచా దేవి ఆతిథ్యం స్వీకరించిన తరువాత దశమిరోజున తిరుగుప్రయాణం మొదలవుతుంది. దీన్ని ‘బహుదాయాత్ర’ అంటారు. ఆరోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి రోజున స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు దీన్నే ‘సునావేష’గా వ్యవహరిస్తారు. ద్వాదశిరోజున విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే.

పూరీ జగన్నాథ దేవాలయం (శ్రీక్షేత్రం)

జగన్నాథుడంటే విశ్వానికి అధిపతి అని అర్ధం. అలాంటి జగన్నాథుడు కొలువైన పురమే “పూరీ”

ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించారు.

       వైష్ణవాలయాల్లో పూరీ జగన్నాథ్ కి విశిష్ట స్తానముంది. ఆదిశంకరుల వారి దృష్టిలో ఈ క్షేత్రానికి విశేష ప్రాముఖ్యత వుంది. 17వ శక్తి పీఠంగా ఇక్కడి విమలాదేవి పూజలందుకుంటోంది. శివకేశవ తత్వానికి ప్రతీక. వైష్ణవ శక్తికి కేంద్రంగా భక్తుల నీరాజనాలందుకుంటోన్న వైభవ క్షేత్రం పూరీ. ప్రతి హిందువూ తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించి తీరాలనుకునే ఒకానొక దివ్యధామం. చార్ ధామ్ క్షేత్రాల్లో అత్యంత ప్రధానమైంది.

       పూరీ జగన్నాథ దేవాలయం, ఒరిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీపట్టణంలో గల ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. ఎప్పటికప్పుడు కొత్తగా చేసే రథాలతో ఆ ఉత్సవ తీరు అద్భుతం. మూలవిరాట్, ఉత్సవ విగ్రహాలు రెండూ ఒకటిగా వుండే ఏకైక ఆలయం. అంతే కాదు మహావిష్ణు అవతారాల్లో ఒకటైన కృష్ణుడు ఇక్కడ తన దేవేరులతో కాక, సోదరుడు బలరాముడు.. సోదరి సుభద్రలతో దర్శనమిచ్చే అరుదైన పుణ్యధామం.. పూరీ జగన్నాథ్ దేవాలయం.

       ఒరియా సాంప్రదాయంలో జగన్నాథుడిగా కృష్ణుడు (కుడి వైపున ఉన్నది). మధ్యలో ఉన్నది సుభద్ర, ఎడమవైపున ఉన్నది బలరాముడు.

       ప్రస్తుతం ఉన్న దేవాలయం గంగ వంశానికి చిందిన కళింగ ప్రభువైన అనంత వర్మ చోడగంగ ( క్రీ.శ 1078—1148) ప్రారంభించాడు. ప్రస్తుతం ఉన్న చాలా నిర్మాణాలు మాత్రం అనంగ భీమదేవుడిచే క్రీ.శ. 1174 లో నిర్మించబడ్డాయి, ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి పద్నాలుగేళ్ళు పట్టింది. ప్రాణప్రతిష్ట క్రీ.శ 1198 లో జరిగింది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

ఆషాఢ మాసం ప్రాముఖ్యత

     పూర్వాషాడ  నక్షత్రం లో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడ మాసం గా చెప్పబడింది. ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది. ఈ మాసం లో చేసే స్నానం, దానం, జపం , పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడం లో చేసే సముద్ర నదీస్నానాలు ఎంతో ముక్తిదాయకాలు . ఆషాఢమాసం లో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం  చేయడం  మంచి ఫలితాలనిస్తుంది.  ఆషాడం మాసం లోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనం లో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణం గా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది.

     ఈ మాసం లోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ కూడా. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు.

     ఆషాడ శుద్ద విదియ నాడు పూరీ  జగన్నాధ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ గా జరుపుతారు.

     ఆషాడ శుద్ద పంచమి  స్కంధ పంచమి గా చెప్తారు. సుబ్రమణ్య స్వామి ని ఈ రోజు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఆషాడ షష్ఠి ని కుమార షష్ఠి గా జరుపుకొంటారు

     ఆషాడ సప్తమి ని భాను సప్తమి గా చెప్పబడింది.  ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు మూడు నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిమనానం గా ఉంటాయి.

     ఆషాడ శుద్ద ఏకాదశి ని తొలి ఏకాదశి అని  శయన ఏకాదశి అని అంటారు. ఈరోజు నుండి చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని అంటారు.

      ఆషాడ మాసంలోనే తెలంగాణా ప్రాంతం లో సంప్రదాయబద్దమైన  బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనం గా చెప్తారు(  భోజనానికి వికృతి పదమే బోనం) . దీనిని అమ్మవారికి  నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు.

      ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం లో ఈ పండుగ అత్యంత వైభవం గా జరుపుకొంటారు. సమస్త జగత్తుకు  కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్ళు, వేపాకులు ఈ బోనం లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికలిగించే వ్యాదుల నుండి ఉపకరించేవి. ఈ సమయం లో ప్రకృతి లో జరిగే మార్పుల వలన అనారోగ్యాలపాలు కాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి.

        ఆషాడం అనారోగ్య మాసం అని కూడా  మనందరికీ తెలుసు. విపరీతమైన ఈదురుగాలుల తో పుల్లచినుకులు పడే సమయం ఈ ఆషాడమాసమే. కాలువలోను, నదులలోను, ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువుల లోనికి వచ్చి చేరిన నీరు మలినం గా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది.

       మనది వ్యవసాయ ఆధారిత దేశం. పొలం పనులన్నీ ఈ మాసం లోనే మొదలు పెడతారు రైతులు. చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు. కాబట్టే ఈ సమయం లోనే వివాహాది శుభముహూర్తాలు  ఎక్కువగా ఉంటాయి , ఈ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన యువకులు ఆరు నెలల కాలం అత్తా గారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే, సకాలం లో జరగాల్సిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటి లాగ కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయం లో విత్తనాలు చల్లక పొతే సంవత్సరమంతా దారిద్ర్యం తో బాధ పడవలసిందే. అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి . అల్లుడు అత్తవారింటికి వెళ్ళ  కూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ద్యాస తో పనులు సరిగా చేయరని ఆషాడమాస నియమం పెట్టారు. అంతే కాకుండా, అనారోగ్య మాసం ఆషాడం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తల నొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం, స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు, అనారోగ్య దినాలలోను  అశుభ సమయాల లోను, గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల  ఆషాడమాసాన్ని కొన్ని పనులకు నిషిద్దం చేసారు మన పెద్దలు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

జగ్జీవన్ రాం వర్ధంతి

       జగ్జీవన్ రాం (ఏప్రిల్ 5, 1908 – జులై 6 1986) పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు మరియు సంఘ సంస్కర్త. బీహార్ లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా కూడా వ్యవహరించారు.

       బయొగ్రఫి పట్టుదల నిండిన ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ తన రాజకీయ జీవితాన్ని ఆదర్శప్రాయంగా కొనసాగించారు. విద్యావేత్తగా, మచ్చలేని నిస్వార్ధ నాయకునిగా, కరవు కోరల్లో చిక్కిన భారతావనిని వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవాన్ని సాకారం చేసి భారత ఆహార గిడ్డంగుల నేర్పరిచిన భారత దార్శనీకునిగా, బ్రిటిష్‌ కాలం నాటి రైల్వే వ్యవస్థను ఆధునికీకరించే దిశగా అడుగులు వేసిన రైల్వేమంత్రిగా, కయ్యానికి కాలుదువ్విన శత్రువును మట్టికరిపించి భారతదేశానికి విజయాన్ని అందించిన భారత సేనకు మంత్రిగా ధీరోదాత్తతను ప్రదర్శించి యావత్‌ భారత్‌ ప్రజానీకం గుండెల్లో నేటికీ సజీవంగా ఉన్నారు. దూరదృష్టితో దీర్ఘకాలిక ప్రణాళికారచనలో ఆయనకు సాటిరారన్న నాటి నాయకుల మాటలు అక్షర సత్యాలు. చివరికంటూ ఉప్పొంగే ఉత్సాహంతో పనిచేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ బీహార్‌ రాష్ట్రంలో షాబాద్‌ జిల్లాలోని చాందా గ్రామంలో శిబిరాం, బసంతీదేవి పుణ్యదంపతులకు 1908 ఏప్రిల్‌ 05న జన్మించారు. వీరిది దళిత కుటుంబం కావడంతో నాటి కుల సమాజపు అవమానాల్ని చవిచూశారు. నాటి అంటరాని తనమే జగ్జీవన్‌ రామ్‌ను సమతావాదిగా మార్చింది. నిరంతరం చైతన్యపూరిత ప్రసంగాలను వినడం, గాంధీజీ నాయకత్వంలో జరిగిన సంపూర్ణ స్వరాజ్య ఉద్యమాలన్ని నిశితంగా గమనించారు. విద్యార్థి దశ నుండే గాంధీజీ (మార్గానికి) అహింసా వాదానికి ఆకర్షితులై 1930లో జరిగిన సత్యాగ్రహోద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు. ఒకవైపు “కులం” అణిచివేతను అధిగమిస్తూనే భారత స్వాతంత్య్ర పోరాటంలో మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శించి నాటి జాతీయ నాయకుల్ని సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ వాడల నుండి ఆత్మవిశ్వాసమనే ఆయుధంతో “కులం” పొరల్ని ఛేదించుకుంటూ రాజకీయాలలో అంచలంచలుగా ఎదిగారు. 1935లో బ్రిటిష్‌ ప్రభుత్వం కల్పించిన పాలనాధికార అవకాశాన్ని, అందిపుచ్చుకొని 27 ఏళ్ల వయసులోనే బీహార్‌ శాసనమండలి సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించి శాసనమండలి సభ్యునిగా, కేంద్రంలో వ్యవసాయ శాఖామంత్రిగా ఆహార శాఖామంత్రిగా, కార్మిక శాఖామంత్రిగా, ఉపాధి పునరావాస మంత్రిగా, రవాణా మంత్రిగా, తంతితపాలా, రైల్వే శాఖా మంత్రిగా ఇంకా కేబినెట్‌ హోదాల్లో పలు పదవులు అలంకరించి ఆ పదవులకే వన్నెతెచ్చిన జగ్జీవన్‌ రామ్‌ అఖండ భారతదేశానికి తొలి దళిత ఉపప్రధానిగా నిజాయితీ, అంకితభావ సేవా తత్పరతలే కవచాలుగా చేసుకొని ఆదర్శప్రాయుడయ్యారు. అందుకే నాటి దేశనాయకులచే “”దేశభక్తుల తరానికి చెందిన మహనీయుడన్న”  బిరుదు పొందిన జగ్జీవన్‌ రామ్‌ది క్రమశిక్షణతో (కూడిన) మెలిగిన జీవితం. అర్దశతాబ్దం పైగా క్యాబినెట్‌ హోదాలో పలు పదవులు అలంకరించి మచ్చలేని నాయకుడుగా పేరొందిన ఆయన నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలి. బాధ్యతల్ని చిత్తశుద్ధితో, నిబద్ధతగా నిర్వర్తించడమే కాకుండా ప్రశంసార్హంగా మెలగడంలో జగ్జీవన్‌ రామ్‌ నేటి యువతకు ఆదర్శం అయ్యారు. ఇది నేటి యువతకు ఉత్తేజాన్నిస్తుంది. ఘనమైన స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహనీయుల సరసన చేరిన జగ్జీవన్‌ రామ్‌ దార్శనీకత నేటి పాలకులకు లేకపోవడం దురదృష్టకరం. ఆయన ఆదర్శాలను, నిస్వార్ధ రాజకీయ సేవను అమలు చేయడంలోప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఒక అడుగు ముందుకేయడమే జీవితాన్ని దేశ సేవకే అంకితం చేసి నవ భారత నిర్మాణానికి పునాదులు వేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆలోచనలు, ఆదర్శవంతమైన జీవితం చిరస్మరణీయమైనది. అతి పిన్న వయస్సులోనే నెహ్రూ తాత్కాలిక మంత్రివర్గంలో (1946) చేరి “బేబి మినిష్టర్‌” గా పిలవబడ్డ జగ్జీవన్‌ రాం అనతికాలంలోనే తన పరిపాలనా దక్షత, ప్రజలపట్ల ఎనలేని ప్రేమ, నిస్వార్ధ సేవతో అసమాన ప్రతిభ కనబరిచి ఎన్నో ఘన విజయాలు సాధించి తిరుగులేని దేశ నాయకునిగా గుర్తింపుపొందారు. అందుకే ఆయన జీవితం ఓ మహా కావ్యం. “”ఆలోచనల్లో దార్శనీకత, మాటల్లో సూటిదనం, నిర్ణయాల్లో పరిపక్వత, కష్టాల్లో మొక్కవోని ధైర్యం, చర్చల్లో మేధావితనం వంటి లక్షణాలే జగ్జీవన్‌రాంను విలక్షణ నాయకుణ్ణి చేశాయి. ప్రత్యర్ధులతో సైతం ఔరా అన్పించుకోగల్గిన రాజనీతజ్ఞత, తర్కం, విషయ పరిజ్ఞానం ఆయన సొంతం. చట్టసభలకు మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికైన బాబూ జగ్జీవన్‌రామ్‌ మౌనం కూడా ఒక్కోసారి ఎదుటివారిని ఆలోచింపచేసింది. అనర్గళ వాక్పటిమతో, అంబేద్కర్‌ సమకాలికుడుగా (16 సంవత్సరాల తేడాతో) దళిత హక్కుల పరిరక్షణలో భుజం కలిపి తనదైన కోణంలో దళితోద్దారకుడుగా పేరొందిన జగ్జీవన్‌రాం ఏనాడూ ఎవ్వరికీ తలవంచని వ్యక్తిత్వంతో చివరికంటా నిలిచాడు. ఇందిరాగాంధీకీ, కాంగ్రెస్‌కు విధేయుడైనప్పటికీ ఏనాడు తలవంచలేదు. తన పదునైన విమర్శలను ఇందిరాగాంధీపై సైతం ఎక్కుపెట్టిన జగ్జీవన్‌రామ్‌ ఆనాడే “ఆత్మగౌరవం” తో తిరుగులేని ధిక్కారాన్ని ప్రదర్శించారు. వ్యంగ్యంతో కూడిన చమత్కారం ఆయన ప్రసంగాలకు రత్నాలద్దినట్టుంటాయన్న నెహ్రూ మాటలు అక్షర సత్యం. దళితులు జనజీవన స్రవంతికి దూరం కావడానికి ఇష్టపడని జగ్జీవన్‌రామ్‌ సమానత్వం కోసం చివరికంటా పోరాడిన యోధుడుగా చరిత్రలో నిలిచిపోయారు. ప్రజలమధ్య, ప్రజల కొరకు సేవ చేసిన ఆయన “1986 జులై 6” న ప్రజలకు శాశ్వతంగా దూరమయ్యారు. ఇప్పుడు ఆయన లేకపోవచ్చు కానీ ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు సజీవంగానే ఉన్నాయి. జాతీయవాదిగా, అవిశ్రాంత కృషిసల్పిన దేశ నాయకునిగా మన గుండెల్లో పదిలంగా ఉన్నారన్నది సత్యం. 78 యేళ్ళ ఆయన జీవితంలో 52 ఏళ్ళ రాజకీయ జీవితం ఎంతో విశిష్టమైంది, విలువైంది నేటితరాలు ఆదర్శవంతమైనదని చెప్పవచ్చు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

పాపాలను నశింపజేసే ‘యోగిని ఏకాదశి’

       యోగిని ఏకాదశి ఏటా జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున వస్తుంది. దీనికి సంబంధించిన గాథను కృష్ణభగవానుడు ధర్మరాజుకు వివరించారు. అలకాపురిని పాలించే కుబేరుడి వద్ద హేమమాలి అనే ఉద్యానవన సిబ్బంది వుండేవాడు. ప్రతిరోజు మానస సరోవరానికి వెళ్లి అక్కడ పుష్పాలను సేకరించి కుబేరునికి ఇచ్చేవాడు. కుబేరుడు ఆ పుష్పాలతో మహాశివున్ని పూజించేవాడు. ఒక రోజు పుష్పాలను తీసుకువస్తున్న హేమమాలి తన ఇంటికి వెళుతాడు. సమయం గడుస్తున్నా అతను రాకపోవడంతో పూజకు ఆలస్యం అవుతోందని కుబేరుడు హేమమాలి ఎక్కడ వున్నాడో తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించాడు. హేమమాలికి ఈ విషయం తెలియడంతో వెంటనే కుబేరుని వద్దకు చేరుకొని క్షమాపణలు చెబుతాడు. అయితే ఆగ్రహంతో వున్న కుబేరుడు అతడు కుష్టువ్యాధితో బాధపడాలని శాపం పెడుతాడు. వెంటనే హేమమాలి భూలోకంలో పడిపోతాడు. భయంకరమైన వ్యాధితో అడవుల్లో తిరుగతూ హిమాలయాల్లోని మార్కండేయ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శించినందుకుఎలా శాపానికి గురైంది వివరిస్తాడు. తనకు శాపవిముక్తి కలిగించాలని వేడుకుంటాడు. దీంతో మహర్షి కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున దీక్ష వుండాలని సూచించాడు. హేమమాలి భక్తితో, శ్రద్ధగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడంతో అతని శాపం తొలగి పూర్వరూపానికి చేరుకుంటాడు. అందుకనే ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించడం మనకు వున్న అనేక పాపాలను తొలగించుకోవచ్చని కృష్ణభగవాన్‌ ఉపదేశంలో పేర్కొంటాడు.

       చేసుకున్నవారికి చేసుకున్నంత’ అనే మాట ఆయా సందర్భాల్లో వినిపిస్తూ వుంటుంది. అంటే ఎవరు చేసుకున్న పాపపుణ్యాలను బట్టి వాళ్లు తగిన ఫలితాలను అనుభవిస్తారని చెప్పబడుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది అనారోగ్యాల నుంచి బయటపడలేక పోతుంటారు. మరికొందరు అప్పుల నుంచి … అపజయాల నుంచి బయటపడలేకపోతుంటారు. తాము నీతి నియమాలతో కూడిన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ, భగవంతుడు ఎందుకు ఇన్ని విధాలుగా బాధలు పెడుతున్నాడని వాళ్లు అనుకుంటూ వుంటారు.

       వాళ్లందరూ కూడా ప్రస్తుతం తాము ఎదుర్కుంటోన్న పరిస్థితులు, గత జన్మలలో చేసిన పాపాలకు ఫలితాలుగా భావించవలసి వుంటుంది. ఆ జన్మలలో చేసిన పాపాలు … అందువలన బాధకి గురైన వాళ్లు పెట్టిన శాపాల కారణంగానే తాము ఇబ్బందులు పడుతున్నామని గ్రహించాలి. మరి జన్మజన్మలుగా వెంటాడుతోన్న ఈ పాపాల బారి నుంచి బయటపడే మార్గమే లేదా? అని చాలామంది ఆవేదనకి లోనవుతుంటారు. అలాంటి వారికి ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా ‘యోగిని ఏకాదశి’ చెప్పబడుతోంది. ‘జ్యేష్ఠ బహుళ ఏకాదశి’ ని యోగిని ఏకాదశిగా చెబుతుంటారు. ఈ రోజున శ్రీమన్నారాయణుడిని పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన, సమస్త పాపాలు .. శాపాలు నశించి పుణ్యఫలాలు కలుగుతాయని అంటారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)