Categories
Vipra Foundation

ఋషి పంచమి

       భాద్రపద శుద్ధ పంచమిని రుషి పంచమిగా వ్యవహరిస్తారు. ఆరోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు. అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కులగురువు వశిష్టుడు. విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యపమహర్షి. రుషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.

సప్తఋషి ధ్యాన శ్లోకములు :

       కశ్యప ఋషి : కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః| ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః||

ఓం అదితి సహిత కశ్యపాయ నమః||

       అత్రి ఋషి : అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణమ్| సత్కర్మనిరతం శాంత మర్చయే దత్రిమవ్యయమ్||    ఓం అనసూయా సహిత అత్రయేనమః||

       భరద్వాజ ఋషి : జటిలం తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్| కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్||    ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః||

       విశ్వామిత్ర ఋషి : కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకమ్| దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనమ్||     ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః||

       గౌతమ ఋషి : యోగాఢ్యః సర్వభూతానాం అన్నదానరతస్సదా| అహల్యాయాః పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః||    ఓం అహల్యా సహిత గౌతమాయనమః||

       జమదగ్ని ఋషి : అక్షసూత్ర ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్| దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే||     ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః

       వసిష్ఠ ఋషి : శివధ్యాన రతం శాంతం త్రిదశైరభి పూజితమ్| బ్రహ్మసూనుం మాహాత్మానం వసిష్ఠం పూజయేత్సదా||    ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః||

కశ్యపత్రి ర్భరద్వాజో విశ్వా మిత్రోథ గౌతమః| వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తథా||   సప్తఋషిభ్యో నమః

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

వినాయక వ్రతకల్పం-పూజావిధానం

పూజకు కావాల్సిన సామాగ్రి :

పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, వత్తలు, 21 రకాల పత్రి, ఉద్దరిణ, నైవేద్యాలు.

పూజా విధానం ప్రారంభం :-

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. (వినాయకుని ధ్యానించవలెను).

(ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని-)

శ్లో||అపవిత్రః పవిత్రోవా

సర్వావస్థాం గతోపివా|

యస్మరేత్ పుండరీకాక్షం

సభాభ్యంతరస్శుచిః||

ఓం పుండరీకాక్ష… పుండరీకాక్ష… పుండరీకాక్షాయ నమః

(అనుకుని అనంతరం కుడిచేతి బొటన వ్రేలితో – ఆ ఉద్ధరిణె లోని నీళ్ళను తమ తలపై మూడు సార్లు చల్లుకొనవలెను)

దీపం :-

ఓం గురుభ్యో నమః

దీపమును వెలిగించి – గంధ పుష్పాదులతో అలంకరించి – దీపదేవతాభ్యో నమః అని నమస్కరించుకోవాలి.

దీప శ్లోకం చదువుకోవాలి…..

ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితోభవ అని చదివిన తర్వాత ఆచమనం చేయాలి.

శ్లోకం : ‘ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి.. సానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు’ య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం’ అని చదువుకోవాలి.

పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్దం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లువేసి, పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.

పసుపు గణపతిని పూజించాలి :-

వినాయక చవితి రోజున చేయుటకు వినాయక వ్రతము ప్రముఖ శుభకార్యం కాబట్టి ముందు పసుపుతో చేసిన గణపతి పూజించవలెను. పసుపుతో చేసిన గణపతికి కుంకుమ పెట్టి తమలపాకులో ఉంచవలెను. చిన్నపల్లెములో బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపుతో చేసిన గణపతి తమలపాకుతో పాటు ఉంచవలెను.స్వామి వారు తూర్పు దిశ చూస్తున్నట్లు ఉండవలెను. కొబ్బరి నూనే లేదా ఆవునేతితో దీపము వెలిగించి, గణపతికి నమస్కరించి ఈ విధముగా చదువ వలెను.

ఆచమ్య:

ఓం కేశవాయ స్వాహా – ఓం నారాయణాయ స్వాహా – ఓం మాధవాయ స్వాహా – ఓం గోవిందాయ నమ: – విష్ణతే నమ: మధుసూదనాయ నమ: – త్రివిక్రమాయ నమ: – వామనాయ నమ: – శ్రీధరాయ నమ: – హృషీకేశాయ నమ: – పద్మనాభాయ నమ: – దామోదరాయ నమ: – సంకర్షణాయ నమ: – వాసుదేవాయ నమ: – ప్రద్యుమ్నాయ నమ: – అనిరుద్ధాయ నమ: – పురుషోత్తమాయ నమ: – అధోక్ష జాయ నమ: – నారసింహాయ నమ: – అచ్యుతాయ నమ: – జనార్దనాయ నమ: – ఉపేంద్రాయ నమ: – హరమే నమ: – శ్రీ కృష్ణాయ నమ:.

భూతోచ్ఛాటనము :-

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

అంటూ శ్లోకము చదివి – అక్షతలు కొన్ని వాసన చూసి ఎడమచేతి ప్రక్కనుండి వెనుకకు వేసుకోవాలి.

అథః ప్రాణాయామః (కుడి చేతి బొటన వ్రేలు, మధ్య వ్రేలులతో రెండు నాసికా పుటములను బంధించి)

ఓం భూః, ఓం భువః , ఓగ్ం సువః, ఓం మహః ఓం జనః, ఓం తపః , ఓగ్ం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధీయోయనః ప్రచోదయాత్

ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం, (మూడు సార్లు జపించవలెను)

శ్లో!! శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే !!

వినాయక ప్రార్ధన :-

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక:

లంబోధరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప:

ధూమకేతు ర్గణాధ్యక్ష:, ఫాలచంద్రో గజానన:

వక్రతుండ శ్శూర్పకర్ణో హేరమ్బ: స్కన్ద పూరజ:

షోడశైతాని నామాని య: పఠే చ్చ్రుణుయా దపి,

విద్యారమ్బే విహహే చ ప్రవేశే నిర్గమే తథా,

సజ్గ్రామే సర కార్యేషు విఘ్నస్తస్య నజాయతే.

అభీప్సితార్ధసిద్ధ్యర్ధం పూజితో యస్సు రైరపి,

సరవిఘ్నచ్చిదే తస్మైగణాధి పతయే నమ: !!

సంకల్పం :- అనంతరం అక్షతలు తీసుకుని సంకల్పం చెప్పుకొనవలెను.

ఓం ॥ మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభేశోభనే ముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (శ్రీశైలానికి ఏ దిక్కులో వుంటే ఆ దిక్కు పేరు చెప్పుకోవాలి), అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ…… నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ ….వాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్ ….గోత్రః …. నామధేయః, శ్రీమతః ….గోత్రస్య ….నామధేయస్య (పూజ చేసే వారు గోత్రం, పేరు చెప్పుకోవాలి.

పూజకు కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పాలి) ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థయిర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం, వర్షేవర్షేప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థీ ముద్దిశ్య, శ్రీ వరసిద్ధి వినాయకదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

(అంటూ కుడిచేతి మధ్యవేలితో నీళ్ళు ముట్టుకోవాలి)

ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే ।

తదంగ కలశపూజాం కరిష్యే ॥

కలశపూజ :-

కలశం గంధపుష్పాక్షతై రాభ్యర్చ్య ( కలశానికి గంధపు బొట్లు పెట్టి, అక్షతలు అద్ది, లోపల ఒఖ పుష్పాన్ని వుంచి.. తదుపరి ఆ పాత్రను కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రాలను చదవాలి.)

కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:

మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యేమాత్రుగణా: స్మృతా: !!

కుక్షౌతు సాగరా: సరే సప్తదీపా వసుంధరా !

ఋగ్వేదో విథ యజుర్వేద: సామవేదో అథర్వణ: !

అంగైశ్చ సహితా: సరే కలశాంబు సమాశ్రితా: !!

ఆయాన్తు దేవ పూజార్ధం దురితక్షయకారకా: !

గంగే చ యమునే చైవ గోదావరి సరసతి !

నర్మదే సింధూకావేరి జలేవిస్మిన్ సన్నిధిం కురు !!

కలశోదకేన పూజాద్రవ్యాణి దేవమండప మాత్మానం చ సంప్రోక్ష్య.

(కలశమందలి జలమును చేతిలో పోసికొని, పూజకోఱకై, వస్తువులమీదను దేవుని మండపమునందును తన నెత్తిమీదను చల్లుకొనవలసినది.)

తదంగతేన వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే.

ప్రాణ ప్రతిష్ట : పుష్పముతో పసుపు గణపతి తాకుతూ ఈ క్రింది విధముగా చదువ వలెను.

మం !! అసునీతే పునరస్మాసు చక్షు:

పున: ప్రాణ మిహనో ధేహి భోగమ్,

జ్యోక్సశ్యేమ సూర్య ముచ్చరంత

మనుమతే మృడయాన సస్తి.

అమృతం వై ప్రాణా అమృత మాప: ప్రాణానేవ యథాస్థాన ముపహయతే.

సామిన్ సరజగన్నాథ యావత్పూజావసానకమ్ !

తావత్తం ప్రీతిభావేన బింబే విస్మిన్ సన్నిధిం కురు !!

ఆవాహితో భవ, స్థాపితో భవ , సుప్రసన్నో భవ , వరదో భవ, అవకుంఠితో భవ ,

స్థిరాసనం కురు, ప్రసీద, ప్రసీద, ప్రసీద.

ఓం గణానాంత్వా గణపతిగ్ంహావామహే కవిం కవీనాం ముమమశ్శ్రవస్తవం| జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్యన్నూతిభిస్సీద సాదనమ్.

పూజా విధానమ్ : షోడశోపచార పూజ

శ్లోకం: భవసంచితపాఫౌఘవిధంసనవిచక్షం !

విఘ్నాంధకార భాసంతం విఘ్నరాజ మహం భజే !!

ఏకదన్తం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్బుజం !

పాశాంకుశధరం దేవం ధాయే త్సిద్ధివినాయకమ్ !!

ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం !

భక్తాభీష్టప్రదం తస్మా ద్ధ్యాయే త్తం విఘ్ననాయకమ్ !!

శ్రీ వరసిద్ధి వినాయకం ధ్యాయామి.

శ్లోకం: అత్రా విగాచ్ఛ జగదంద్య సురరాజార్చితేశర

అనాధనాధ సరజ్ఞ గౌరీగర్బసముద్భవ !!

శ్రీ వరసిద్ధి వినాయకం ఆవాహయామి.

శ్లోకం: మౌక్తికై: పుష్పరాగైశ్చ నానారత్నే రిరాజితం !

రత్నసింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్ !!

శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆసనం సమర్పయామి.

శ్లోకం: గౌరీపుత్ర! నమస్తే విస్తు శంకర ప్రియనందన !

గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్ష తైర్యుతం !

శ్రీ వరసిద్ధి వినాయకాయ అర్ఘ్యం సమర్పయామి.

శ్లోకం: గజవక్త్ర నమస్తేవిస్తు సరాభీష్టప్రదాయక !

భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ దిరదానన !

శ్రీ వరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి.

శ్లోకం: అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత !

గృహాణ విచమనం దేవ !తుభ్యం దత్తం మయా ప్రభో

శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆచమనీయం సమర్పయామి.

శ్లోకం: దధిక్షీర సమాయుక్తం మాధా హ్హ్యేన సమనితం

మధుపర్కం గృహాణేదం గజవక్త్య నమోవిస్తుతే

శ్రీ వరసిద్ధి వినాయకాయ మధుపర్కం సమర్పయామి.

శ్లోకం: స్నానం పంచామృతై ర్దేవ గృహాణ గణనాయక

అనాధనాధ సరజ్ఞ గీరాణవరపూజిత !

శ్రీ వరసిద్ధి వినాయకాయ పంచామృతస్నానం సమర్పయామి.

శ్లోకం: యా ఫలిని ర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణి:

బృహస్పతి ప్రసూతా స్తానో ముంచన్తగ్ హస:

శ్రీ వరసిద్ధి వినాయకాయ ఫలోధకేన సమర్పయామి.

శ్లోకం: గంగాది సరతీర్దేభ్య ఆహ్రుతై రమలైర్జలై :

స్నానం కురుష భగవ న్నుమాపుత్త్ర నమోవిస్తుతే

శ్రీ వరసిద్ధి వినాయకాయ శుద్దోదక స్నానం సమర్పయామి.

శ్లోకం: రక్తవస్త్రదయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణ తం

లంబోదర హరాత్మజ శ్రీ వరసిద్ధి వినాయకాయ వస్త్రయుగ్మం సమర్పయామి.

శ్లోకం: రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయం గృహాణ దేవ సరజ్ఞ భక్తానా

మిష్టదాయక శ్రీ వరసిద్ధి వినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి.

శ్లోకం: చందనాగురుకర్పూరకస్తూరీ కుంకుమానితం విలేపనం సురశ్రేష్ఠ !

ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్ శ్రీ వరసిద్ధి వినాయకం గంధాన్ సమర్పయామి.

శ్లోకం: అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం స్తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద

శంభుపుత్ర నమోవిస్తుతే శ్రీ వరసిద్ధి వినాయకాయ అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి.

శ్లోకం: సుగన్ధాని చ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోవిస్తుతే

శ్రీ వరసిద్ధి వినాయకాయ పుష్పై సమర్పయామి.

అథాంగ పూజా:

పుష్పాణి పూజయామి: అథాంగ పూజ పుష్పాలతో పూజించాలి.

గణేశాయ నమ: పాదౌపూజయామి !!

ఏకదంతాయ నమ: గుల్పౌ పూజయామి !!

శూర్పకర్ణాయ నమ: జానునీ పూజయామి !!

విఘ్నరాజాయ నమ: జంఘే పూజయామి !!

అఖువాహనాయా నమ: ఊరూ పూజయామి !!

హేరంబాయ నమ: కటిం పూజయామి !!

లంబోదరాయ నమ: ఉదరం పూజయామి !!

గణనాథాయ నమ: హృదయం పూజయామి !!

స్థూలకంఠాయ నమ: కంఠం పూజయామి !!

స్కందాగ్రజాయ నమ: స్కంధౌ పూజయామి !!

పాశహస్తాయ నమ: హస్తౌ పూజయామి !!

గజవక్త్రాయ నమ: వక్త్రం పూజయామి !!

శూర్పకర్ణాయ నమ: కర్ణౌ పూజయామి !!

ఫాలచంద్రాయ నమ: లలాటం పూజయామి !!

సరేశరాయ నమ: శిర: పూజయామి !!

విఘ్నరాజాయ నమ: సరాణి అంగాని పూజయామి !!

ఏకవింశతి పత్రపూజ: 21 రకాల పత్రాలతో పూజించాలి.

సుముఖాయనమః – మాచీపత్రం పూజయామి।

గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి।

ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి।

గజాననాయ నమః – దుర్వాయుగ్మం పూజయామి

హరసూనవేనమః – దత్తూరపత్రం పూజయామి।

లంబోదరాయనమః – బదరీపత్రం పూజయామి।

గుహాగ్రజాయనమః – అపామార్గపత్రం పూజయామి।

గజకర్ణాయనమః – తులసీపత్రం పూజయామి,

ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి,

వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి।

భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి,

వటవేనమః – దాడిమీపత్రం పూజయామి,

సర్వేశ్వరాయనమః – దేవదారుపత్రం పూజయామి,

ఫాలచంద్రాయ నమః – మరువకపత్రం పూజయామి,

హేరంబాయనమః – సింధువారపత్రం పూజయామి

శూర్పకర్ణాయనమః – జాజీపత్రం పూజయామి,

సురాగ్రజాయనమః – గండకీపత్రం పూజయామి,

ఇభవక్త్రాయనమః – శమీపత్రం పూజయామి,

వినాయకాయ నమః – అశ్వత్థపత్రం పూజయామి,

సురసేవితాయ నమః – అర్జునపత్రం పూజయామి।

కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి।

శ్రీ గణేశ్వరాయనమః – ఏకవింశతి పత్రాణి పూజయామి.

శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా :-

ఓం గజాననాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం వినాయకాయ నమః

ఓం ద్వైమాతురాయ నమః

ఓం ద్విముఖాయ నమః

ఓం ప్రముఖాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం కృతినే నమః

ఓం సుప్రదీప్తాయ నమః

ఓం సుఖనిధయే నమః

ఓం సురాధ్యక్షాయ నమః

ఓం సురారిఘ్నాయ నమః

ఓం మహాగణపతయే నమః

ఓం మాన్యాయ నమః

ఓం మహాకాలాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం లంబజఠరాయ నమః

ఓం హయగ్రీవాయ నమః

ఓం ప్రథమాయ నమః

ఓం ప్రాజ్ఞాయ నమః

ఓం ప్రమోదాయ నమః

ఓం మోదకప్రియాయ నమః

ఓం విఘ్నకర్త్రే నమః

ఓం విఘ్నహంత్రే నమః

ఓం విశ్వనేత్రే నమః

ఓం విరాట్పతయే నమః

ఓం శ్రీపతయే నమః

ఓం వాక్పతయే నమః

ఓం శృంగారిణే నమః

ఓం ఆశ్రితవత్సలాయ నమః

ఓం శివప్రియాయ నమః

ఓం శీఘ్రకారిణే నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం బల్వాన్వితాయ నమః

ఓం బలోద్దతాయ నమః

ఓం భక్తనిధయే నమః

ఓం భావగమ్యాయ నమః

ఓం భావాత్మజాయ నమః

ఓం అగ్రగామినే నమః

ఓం మంత్రకృతే నమః

ఓం చామీకర ప్రభాయ నమః

ఓం సర్వాయ నమః

ఓం సర్వోపాస్యాయ నమః

ఓం సర్వకర్త్రే నమః

ఓం సర్వ నేత్రే నమః

ఓం నర్వసిద్దిప్రదాయ నమః

ఓం పంచహస్తాయ నమః

ఓం పార్వతీనందనాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం కుమార గురవే నమః

ఓం కుంజరాసురభంజనాయ నమః

ఓం కాంతిమతే నమః

ఓం ధృతిమతే నమః

ఓం కామినే నమః

ఓం కపిత్థఫలప్రియాయ నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం బ్రహ్మరూపిణే నమః

ఓం మహోదరాయ నమః

ఓం మదోత్కటాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం మంత్రిణే నమః

ఓం మంగళసుస్వరాయ నమః

ఓం ప్రమదాయ నమః

ఓం జ్యాయసే నమః

ఓం యక్షికిన్నరసేవితాయ నమః

ఓం గంగాసుతాయ నమః

ఓం గణాధీశాయ నమః

ఓం గంభీరనినదాయ నమః

ఓం వటవే నమః

ఓం జ్యోతిషే నమః

ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః

ఓం అభీష్టవరదాయ నమః

ఓం మంగళప్రదాయ నమః

ఓం అవ్యక్త రూపాయ నమః

ఓం పురాణపురుషాయ నమః

ఓం పూష్ణే నమః

ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః

ఓం అగ్రగణ్యాయ నమః

ఓం అగ్రపూజ్యాయ నమః

ఓం అపాకృతపరాక్రమాయ నమః

ఓం సత్యధర్మిణే నమః

ఓం సఖ్యై నమః

ఓం సారాయ నమః

ఓం సరసాంబునిధయే నమః

ఓం మహేశాయ నమః

ఓం విశదాంగాయ నమః

ఓం మణికింకిణీ మేఖలాయ నమః

ఓం సమస్తదేవతామూర్తయే నమః

ఓం సహిష్ణవే నమః

ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః

ఓం విష్ణువే నమః

ఓం విష్ణుప్రియాయ నమః

ఓం భక్తజీవితాయ నమః

ఓం ఐశ్వర్యకారణాయ నమః

ఓం సతతోత్థితాయ నమః

ఓం విష్వగ్దృశేనమః

ఓం విశ్వరక్షావిధానకృతే నమః

ఓం కళ్యాణగురవే నమః

ఓం ఉన్మత్తవేషాయ నమః

ఓం పరజయినే నమః

ఓం సమస్త జగదాధారాయ నమః

ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్ అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

శ్రీ మహాగణాధిపతయే నమ: అష్టోత్తర శత నామ పూజామ్సమర్పయామి.

శ్లోకం: దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥

శ్రీ మహాగణాధిపతయే నమ: ధూపమాఘ్రాపయామి. (అగరోత్తులు వెలిగించి దూపము చూపించాలి)

శ్లోకం: సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే దీపం శ్రీ మహాగణాధిపతయే నమ: దీపందర్శయామి. (దీపానికి నమస్కరించవలెను).

ధూపదీపనంతరం శుద్దాచమనీయం సమర్పయామి.

శ్లోకం: సుగంధా సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్,

భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక,

నైవేద్యం సమర్పయామి।

మహాగణాధిపతయే నమ: నైవేద్యం సమర్పయామి.

నైవేద్యం:- బెల్లము వండిన ప్రసాదం మీద నీరు చల్లి చుట్టూ నీరు వేసి క్రింది విధముగా చదివి నివేదనము చేయవలెను.

ఓం భూర్భువస్సువ:ఓం తత్సవితుర్వేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్. నీళ్ళు పుష్పంతో చల్లి ఓం సత్యం త్వర్తేన పరిషించామి. పుష్పము నీటిలో ముంచి నైవేద్య పదార్ధమ్ చుట్టు తిప్పాలి.

ఓం అమృతమస్తు | ఓమ్ అమృతోపస్తణమసి ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా (క్రిందివిధంగా చదివి కలశములోని నీటి వదలవలెను.)

మధ్య మధ్య పానీయం సమర్పయామి.

శ్లోకం: సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక

మహాగణాధిపతయే నమ: సువర్ణపుష్పం సమర్పయామి.

శ్లోకం: పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం

మహాగణాధిపతయే నమ: తాంబూలం సమర్పయామి।

శ్లోకం: ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ।

ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి (కర్పూరం వెలిగించి గంట మ్రోగించాలి)

అథ దూర్వాయుగ్మ పూజా :

వినాయకునికి ఎక్కువ ప్రీతికరమైనవి దూర్వలు. దూర్వులు అనగా గరక పోచలు. గ్యాస్ అనగా గడ్డి ప్రతిచోట ఉండును. చిగురులు కల గరిక పోచలు వినాయకుడు పూజలో వజ్రాల కన్న, బంగారు పూవులు కన్న ఎక్కువ విలువ కలిగినవి. గణేశుడే స్వయంగా ” మత్పూజా భక్తినిర్మితా మహీత స్వల్పకవాపీ వృధా దూర్వంకురై ర్వినా ” అంటే భక్తితో చేసిన పూజ గొప్పది.గరిక లేకుండా పూజ చేయరాదు.

“వినా దూర్వాంకు రై: పూజా ఫలంకేనాపి నాప్యతే తస్మాదిషసి మద్భ త్వరిత రేఖా భక్తీ సమర్పితా దూర్వా దతతీ యత్ఫలం మహత్ నతత్క్ర్ తుశతై రాదా నైర్ ర్వ్ ఉష్టానా సంచయై: “

శ్లోకం: యస్యస్మృతాచ నామూక్త్యా తప: క్రిమాదిషు|న్యూనం సంపూర్ణతాం యాంతి సద్యో వందే గణాధిప | మంత్రహీనం క్రియా హీనం భక్తిహీనం గణాధిప | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన అవాహనాది షోడశోపచార పూజయా భగవన్ సర్వాత్మక: శ్రీ మహాగణాధిపతి: వరదోభవతు అని ఉదకం అక్షితలను చేతిలో వేసుకుని గణపతి కాళ్ళ దగ్గర వదిలి వేయాలి.మనస్పూర్తిగా స్వామికి నమస్కారం చేసుకోవాలి.

పూజ చేసిన అక్షితలను, పుష్పములు శిరస్సున ధరించవలెను.

నమస్కారము, ప్రార్థన :-

శ్లోకం: ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన, ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,

అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన, పునరర్ఘ్యం సమర్పయామి,

ఓం బ్రహ్మ వినాయకాయ నమః నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన, ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్ వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.

శ్రీ వినాయక వ్రత కథ :-

గణపతి జననము: సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను। గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు। తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు। ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు। అతడు అజేయుడైనాడు।

భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాదు। నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు। గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించినాడు గజముఖాసురుడు ఆనందంతో “ఏమి కావలయునో కోరుకో” అన్నాడు। విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు। శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు। గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది। తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించినాడు। అయినా మాట తప్పుట కుదరదు। కుక్షియందున్న శివుని ఉద్దేశించి “ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది। నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది” అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు। నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు। శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు।

అక్కడ పార్వతి భర్త రాకను గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది। తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది। అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది। దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది। అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసినది। ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది।

శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు।

జరిగిన దానిని విని పార్వతి విలపించింది। శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించినాడు। గణేశుడు గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు। విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడు.

గణపతిని ముందు పూజించాలి: గణేశుడు అగ్రపూజనీయుడు

ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి మాట ఏమిటి? ఈ గజాననునికి ఆ స్థానము కలుగవలసి ఉంది। శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాదు। శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు। “మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు। కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు। గజాననుడుమిగిలిపోయినాడు। త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమర్థించినాడు। వినాయకుని బుద్ది సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు। నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు। అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు। వినాయకునికే ఆధిపత్యము లభించినది।

చంద్రుని పరిహాసం : గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ। ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు।

(చంద్రుడుమనస్సుకు సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడనను సరణీయుడైనాడు। ఆతని మాన్యత నశించింది। నింద్యుడయినాడు। ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి। అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు అవుతారు। నిందలకు గురియగుతారు।

చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించినారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించినాడు. బాధ్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించినాడు. ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడినది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడినది.

శ్యమంతమణోపాఖ్యానము : చంద్ర దర్శనం నీలాపనింద: ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించింది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారము నీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించాడు. అతనికి ఆ సూచన రుచించలేదు.

అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళినాడు. అది ఆతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయింది. నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు. ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది.

అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించింది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉంది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది ఒక దినము కాదు, రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది. అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించాడు. అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అది శ్రీరామకార్యము గాదు కాన అప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణీతో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు.

శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.

వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభచించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై బాధ్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశ తత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సాంప్రదాయమయినది.

పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు… సింహ ప్రసేనమవధీత్‌ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడింది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడింది.

ఉద్వాసన : యజ్ఞేన యజ్ఞ మయజంత దేవా: తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్యచం తే యత్ర పూర్వే సాధ్యాస్సతి దేవా: శ్రీ మహాగణపతిం యధాస్థానం ప్రవేశయామి శోభనార్ధే పునరాగమనాయచ|| పసుపు గణపతిని తమలపాకుతో తీసి పూజా మందిరం ఈశాన్య భాగంలో ఉంచవలెను.

విఘ్నేశ్వర చవితి పద్యములు :- ప్రార్థన

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌

మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.

కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై

యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.

తలచెదనే గణనాథుని

తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా

దలచెదనే హేరంబుని

దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌

అటుకులు కొబ్బరి పలుకులు

చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌

నిటలాక్షు నగ్రసుతునకు

బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.

వినాయక మంగళాచరణము :-

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు

కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు – జయమంగళం నిత్య శుభమంగళం

వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి

మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి – జయమంగళం నిత్య శుభమంగళం

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు

సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు – జయమంగళం నిత్య శుభమంగళం

ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు

బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు – జయమంగళం నిత్య శుభమంగళం

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను

పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను – జయమంగళం నిత్య శుభమంగళం.

సర్వేజనాః సుఖినో భవంతు.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

హరితాళిక గౌరీ వ్రతం

హరితాళిక వ్రతం, సువర్ణగౌరీ వ్రతం : భాద్రపద శుక్ల పక్ష తదియనాడు “హరితాళిక వ్రతం” లేదా “సువర్ణ గౌరీ వ్రతం” “పదహారు కుడుముల తద్ది” ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం.

హరితాళిక వ్రతం విశిష్టత

కైలాస శిఖరమందు పార్వతి ఒకనాడు పరమశివుడిని ఇలా అడిగింది  “స్వామీ! తక్కువ శ్రమతో, ధర్మాచరణతో ఎవరు నిను భక్తిక్షిశద్ధలతో సేవిస్తారో వారికెలా ప్రసన్నుడవౌతావో తెలుపుమని ప్రార్థించింది. అంతేకాక, జగవూత్పభువైన మీరు నాకు యే తపోదాన వ్రతమాచరించుటచే లభించారు”అని అడిగింది.  ప్రసన్నవదనంతో పరమశివుడు ‘‘దేవీ! వ్రతాల్లోకి చాలా ఉత్తమమైంది, అత్యంత రహస్యమైన వ్రతమొకటున్నది. దాన్నెవరాచరించినా నేను వారికి వశుడనైతాను. భాద్రపద శుక్లపక్షంలో హస్తనక్షవూతంతో కూడిన తదియయందీ వ్రతాన్నాచరించినవారు సర్వపాప విముక్తులవుతారు. ‘‘దేవీ! నీవు నీ చిన్ననాట హిమాలయాల్లో ఈ మహా వ్రతాన్ని ఎలా ఆచరించాలో చెబుతాను. విను!” అన్నాడు.

                భూలోకమున వివిధ పక్షులతో, విచిత్ర మృగాలతో మంచుచేత కప్పబడి బహుసుందరమైన హిమవత్పర్వతము కలదు. హిమవంతుడా ప్రాంతానికి ప్రభువు. నీవాతని కూతురువు. చిన్నతనం నుంచే శివభక్తురాలవు. యుక్తవయసు వస్తున్న నీకు వరుడెవరగునా?యని హిమవంతుడాలోచించగా, త్రిలోక సంచారి నారద మునీశ్వరులొకనాడు మీ తడ్రి వద్దకు వచ్చాడు. అర్ఘ్య పాద్యాలందించి మీ తండ్రి నిను చూపి, ఈ కన్యనెవరికిచ్చి వివాహం చేయవపూను? తగిన వరుడెవరని నారదుని అడిగినాడు. వెంటనే నారదుడు ‘ఓ గిరిరాజా! నీ కన్యారత్నమున కన్నివిధముల యోగ్యమైనవాడు బ్రహ్మాదిదేవతలలో విష్ణువు. అతడు పంపితేనే నీ వద్దకు వచ్చానన్నాడు. సంతోషంతో హిమవంతుడు మునీందరా ఆ విష్ణుదేవుడే స్వయంగా ఈ కన్యను కోరి నినుపంపాడు కనుక గౌరవించి, అతనికిచ్చి వివాహం చేస్తానని వెంటనే తెలుపుమన్నాడు. నారదుడందుకంగీకరించి బయలుదేరాడు.

హిమవంతుడానందంతో భార్యాపిల్లలకావిషయం తెలిపాడు. కుమార్తెను దగ్గరకు పిలిచి “ఓ పుత్రీ! గరడవాహనునితో నీ వివాహం నిశ్చయం చేస్తున్నానని” తెలిపెను. ఆ మాటలు విని పార్వతి తన మందిరంలోకి వెళ్లి పొర్లిపొర్లి దుఃఖించసాగింది. ఇది చూసిన పార్వతి ప్రియసఖి ఆమె మనసా పెండ్లికి సుముఖంగా లేదని తెలుసుకుని స్నేహితురాలికొక ఉపాయం చెప్పింది. నీ త్రండి జాడ తెలియని అడవిలోకి మనమిద్దరం కొంతకాలం పారిపోదామని చెప్పింది. ఆమె అనుమతితో ఇద్దరూ వనవూపాంతానికి ప్రయాణమైనారు. కుమార్తె కనిపించుటలేదని గిరిరాజు హాహాకారాలు చేసి, ఏడ్చి మూర్ఛిల్లాడు. నీవు పరమశివుని గూర్చి ఘోర తపస్సు చేశావు. అడవిలో దొరికిన ఫలాలతో, పుష్పాలతో, పత్రాలతో అనేక విధాల పూజించావు. నీభక్తికి మెచ్చి సైకత లింగాన్ని (ఇసుక) చేసుకొని పూజిస్తున్న నీకు భాద్రపదశుక్ల తదియనాడు నేను ప్రసన్నుడైనాను. చెలికత్తెచే హరింపబడినావు కనుక ఈ వ్రతాన్ని ‘‘హరితాళిక వ్రతం” అంటారు. ఆరోజు శివరావూతివలె ఉపవసించి, రాత్రంతా జాగరణతో ఎవరైనా పరమశివుని సైకత లింగాన్ని పత్రపుష్పాలతో పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు, సంపత్తులు కలుగుతాయి” అని పరమేశ్వరుడు పార్వతితో చెప్తాడు. 16 ఉత్తరేణి ఆకులతో 16 వరుసల దారాన్ని 16 గ్రంథులు ముళ్లు వేసి తోరానికి గ్రంథిపూజచేసి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం నోచుకోవాలి. తెల్లవారి వినాయక చవితిరోజు దంపతులకు భోజ, వస్త్ర, దక్షిణ తాంబూలాలతో పార్వతీ పరమేశ్వరులుగా భావించి పూజించాలి. ముత్తైదువలంతా చవితి తెల్లవారుఝామున మేళతాళాలతో సైకతలింగరూపంలోని సాంబశివుని దగ్గరలోని జలాశయంలో నిమజ్జన చేయాలని శివుడు పార్వతికి తెలియజేయాలి. కథ తప్పినా వాక్కు తప్పదు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

పోలాల అమావాస్య

     శ్రావణ బహుళ అమావాస్య రోజును  పోలాల అమావాస్య అని అంటారు. ఈ పండగ కు కందమొక్క మరియు బచ్చలి మొక్కకు పూజ చేస్తారు. పూజలో ఒక కథ కూడా చెప్తారు. ఇది పెళ్ళయిన ఆడవాళ్ళు పిల్లల కలవారు వారి శ్రేయస్సు కోసం చేస్తారు.  పిల్లలు లేనివారు పిల్లలు కలగటానికి ఈ పూజ చేస్తారు.  ఈ పూజలో ఆడపిల్లు కావాలనుకునేవారు గారెలు దండ అమ్మవారికి వేస్తామని, మొగపిల్లలు కావలి అనే కోరిక కలవారు పూర్ణం బూరెలు దండ అమ్మవారికి వేస్తామని మొక్కుకుంటారుట.  ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు.  నివేదనగా నవకాయ కూర చేస్తారు, ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినపకుడుములు చేసి అమ్మవారికి నేవేదిస్తారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఎద్దు బొమ్మలు మట్టి తో చేసి పూజించడం :

వ్యవసాయం కలవారు ఎద్దులకు పూజ చేస్తారు, అదే వ్యవసాయం లేనివారు ఎద్దు బొమ్మలు మట్టి తో చేసి వాటికి పూజ చేస్తారు. ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాలలో కనిపిస్తూ వుంటుంది. గ్రామీణ ప్రాంతాలకి చెందిన ప్రజలు ‘పోలాంబ’ పేరుతో అమ్మవారిని పూజిస్తారు. ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీరసారెలు సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందనీ … ఫలితంగా వర్షాలు పంటలకి అనుకూలంగా కురుస్తాయని విశ్వసిస్తుంటారు. జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలంటే పితృదేవతల ఆశీస్సులు కావాలి. అలాగే వర్షాలు బాగా కురవాలంటే గ్రామదేవత అయిన పోలేరమ్మ అనుగ్రహం వుండాలి. వర్షాలుపడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు ఆరోగ్యంగా వుండాలి. పంటలు బాగా పండినప్పుడే ఆవులకు మేత దొరుకుతుంది. ఫలితంగా లభించే పాలు ఆ కుటుంబ సభ్యులను ఆరోగ్యపరంగాను… ఆర్ధికంగాను ఆదుకుంటాయి. తమ జీవనాధారానికి తోడ్పాటుని అందించే దేవతను, పెద్దలను పశువులను పూజించే పర్వదినంగా పోలాల అమావాస్య కనిపిస్తుంది. గ్రామదేవతను ఆరాధిస్తూ వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినం కనుక ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రత్యేకతను సంతరించుకుని తన విశిష్టతను చాటుకుంటూ వుంటుంది.

పోలాల అమావాస్య పూజా విధానం :

  1. పూజచేసే చోట శుభ్రంగా అలికి, వరిపిండితో ముగ్గువేసి, ఒక కందమొక్కను(కొందరు 2 కందమొక్కలను తల్లి పిల్లలుగా పూజిస్తారు) వుంచి, దానికి పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను(ఆనవాయితీ ప్రకారం కొంతమందికి 4 తోరాలు వుండవు 2 తోరాలే ఉంటాయి) అక్కడ వుంచి, ముందుగా వినాయకుడికి పూజను చేయాలి. గమనిక : కందమొక్క దొరకని పక్షంలో కందపిలక పెట్టి పూజ చేసుకొనవచ్చును.
  2. తర్వాత మంగళగౌరీదేవిని కానీ, సంతానలక్ష్మిని కానీ ఆ కందమొక్కలోకి ఆవాహనచేసి షోడశోపచార పూజను చేయవలెను.
  3. తొమ్మిది పూర్ణం బూర్లు మరియు తొమ్మిది గారెలు, తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.
  4. తదుపరి కధను చదువుకొని కధా అక్షతలను శిరస్సున ధరించాలి.
  5. అనంతరం బాగా మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తయిదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించాలి.
  6. తాంబూలం లో కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి.
  7. ఆ తర్వాత కందమొక్కకు ఒక తోరాన్ని కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి(సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న పిల్ల కందమొక్కకు సమర్పించవచ్చును).

ఏయే నైవేద్యములను సమర్పించాలి :

  1. ఆడపిల్లకావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు సమర్పించాలి.
  2. మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు (ఉన్నవాళ్ళు ) అమ్మవారికి సమర్పించాలి.
  3. పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం, గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు.
  4. గోదావరి జిల్లాలో కొందరు పనసఆకులతో బుట్టలు కుట్టి, ఇడ్లీపిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతారు. వీటినే పొట్టిక్కబుట్టలు అని అంటారు.

పోలాల అమావాస్య వ్రత కధ :

ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములుండేవారు. వారికి పెళ్లిళ్లయి భార్యలు కాపురానికి వచ్చారు. చాలామంది పిల్లలతో వారంతా సుఖంగా కాలం గడుపుతున్నారు. అందులో, ఏడో కోడలికి ఏట పిల్లాడు పుడతాడు. కానీ పోలాల అమావాస్య రోజు చనిపోతాడు. అలాగా ఆరు సంవత్సరాలు జరుగుతుంది. అప్పటికే ఆమె తోడికోడళ్ళు దేప్పటం మొదలుపెడతారు – ఆమె వలన వారు ఆ పండుగ జరుపుకోలేకపోతున్నారు అని. ఆ బాధ భరించలేక ఏడవ సంవత్సరం పిల్లాడు కోన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చాపలో చుట్టేసి ఉంచేస్తుంది. అందరూ పూజ చేసుకుంటారు. అది అయ్యాక, ఆమె ఆ బాబుని భుజం మీద వేసుకుని స్మశానానికి ఏడుస్తూ వెళ్తుంది. అది చూసిన పార్వతీపరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఎదురయ్యి  “ఎవరమ్మా నీవు? ఎవరా బాబు? ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడుగుతారు. దానికి ఆమె – “ఎవరైతే ఏమిటమ్మ – మీరు ఆర్చేవారా తీర్చేవారా?” అని అడుగుతుంది. దానికి వారు – “మేమే ఆర్చేవారము – తీర్చేవారము – చెప్పవమ్మా” అంటారు. ఆమె తన గోడు చెప్పుకుంటుంది. వారు ఓదార్చి అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు ఆమె భుజం మీద ఉన్నా బిడ్డతో సహా, ఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వచ్చేస్తారు. వారిని చూసిన ఆశ్చర్యంలో ఆ దంపతులను చూద్దాం అని తిరిగేసరికి వారు ఉండరు. అప్పుడు – అది పార్వతీపరమేశ్వరులు అని తెలుసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె తోడికోడళ్ళు ఈమె అదృష్టానికి అబ్బురపోయి క్షమార్పణ చెప్పుకుంటారు. అప్పటినుండి ఆమె ప్రతి ఏట తప్పకుండా పోలాల అమావాస్య పూజ జరుపుకుంటుంన్నారు.”

ఈ కథ విన్న తరువాత చెప్పినవారు: “పోలేరమ్మ, నీ ఇల్లు పాలతో, నేతితో అలుకుతాను. నా ఇల్లు ఉచ్చతో, పియ్యతో అలుకు”, అంటారు. వినడానికి కొంచం వింతగా వుంటుంది.  కాని  అది వారి  పిల్లల మీద ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది. ఆ కథ అక్షింతలు చదివినవాళ్ళు, విన్నవాళ్లు తలపై వేసుకుంటారు.  తరువాత పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి  తోరం చేసి ఆ తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపుకోమ్మును చిన్నపిల్లలుకు కడతారు.  అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

భాద్రపద మాసం ప్రాముఖ్యత

      భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతున్నాయి. చాంద్రమానం ప్రకరం భాద్రపద మాసం ఆరవమాసం, వర్షఋతువులో రెండో మాసం. చంద్రమాన రీత్యా ఈ మాసంలోని పూర్ణిమ తిథినాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలోగానీ ఉండడంవల్ల ఈ మాసానికి ‘భాద్రపద మాసం’ అనే పేరు ఏర్పడింది. ఈ మాసం లో ఒంటి పూట భోజనం చేస్తే ధన సమృద్ది ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసం లో విశేష ఫలితాన్నిస్తాయి.

శుద్ధ తదియ : వరాహ జయంతి మరియు హరితాళిక వ్రతం, సువర్ణగౌరీ వ్రతం

దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీమహావిష్ణువు దశావతారాలను ధరించినట్లు అందరికీ తెలిసిన విషయమే. అట్టి దశావతారాలలో మూడవ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని, ఐదవదైన శ్రీ వామనావతారాన్ని భాద్రపద మాసంలోనే శ్రీమన్నారాయణుడు ధరించి దుష్టశిక్షణ గావించాడు.అందుకే ఈ మాసంలో ‘దశావతార వ్రతం’ చెయాలనే శాస్త్ర వచనం. ఈ అవతారం ఆవిర్భవించినది భాద్రపద శుద్ధ తదియగా “వరాహ జయంతి”గా పిలువబడుచున్నవి.

       భాధ్రపదంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు : హరితాళిక వ్రతం, సువర్ణగౌరీ వ్రతంని కూడా రోజునే జరుపుకొంటారు

      భాద్రపద శుక్ల పక్ష తదియనాడు  ‘హరితాళిక వ్రతం’ లేదా  ‘సువర్ణ గౌరీ వ్రతం’ ‘పదహారు కుడుముల తద్ది’ ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం. ఈ వ్రతాన్ని ఆచరించి, ఉపవాసం జాగరణ చేస్తారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తే కష్టాలు తొలగి, అష్టైశ్వర్యాలతో తులతూగుతారు.

శుక్ల చవితి : వినాయక చవితి

      భాద్రపదం అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయకచవితి పర్వదినమే. ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను ‘వినాయక చవితి’ లేదా  ‘గణేశ చతుర్ధి’ పర్వదినంగా జరుపుకుంటారు. ఈనాడు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు, 21 పత్రాల్తో పూజించి , వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను.

శుక్ల పంచమి : ఋషి పంచమి

       భాద్రపద శుద్ద పంచమి నాడు ఋషి పంచమి జరుపుకొంటారు. ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోశ్చితాత్మకమైన వ్రతం. ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుశ్రావ సమయం లో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది అని భావిష్యపురాణం లో చెప్పబడింది.  ఈ వ్రతం లో ముఖ్యం గా ఆచరించవలసినది, బ్రహ్మహణుడికి అరటి పళ్ళు, నెయ్యి, పంచదార, దక్షిణ ఇవ్వాలి. ఒంటి పూట భోజనం చేయాలి. అంతే గాక ఆ భోజనం ధాన్యం, పాలు, పెరుగు, ఉప్పు, పంచాదారలతో తయారైనదవకుండా ఉండాలి. పళ్ళని స్వీకరించడం శ్రేయస్కరం.

       బౌద్ద జయంతి ని కూడా ఈ రోజునే జరుపుకొంటారు. బుద్దుని భోధనలు మానవుని ధర్మబద్దమైన, పవిత్రమైన జీవనానికి వెలుగు బాట వేసాయి. ప్రపంచం లోని ధర్మమతస్తాపనకు బుద్దుడు అత్యున్నత స్థానం వహించాడనే విషయంలో ఏమాత్రం భేదాభిప్రాయాలు లేవు.

శుక్ల షష్ఠి : షష్ఠి /సూర్య షష్ఠి

        భాద్రపద శుద్ద షష్ఠి /సూర్య షష్ఠి, సప్తమి కలసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం, ఈరోజున సూర్యుడిని ఆవుపాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం తో ప్రాశనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువఫలం కలుగుతుందని శాస్త్రం లో చెప్పబడింది. షష్ఠి తో కూడిన సప్తమి ఉంటే కనుక  సుబ్రహ్మణ్య స్వామి ని పూజిస్తే ఎటువంటి పాతకాలైన నశిస్తాయి.

       భాద్రపద శుద్ద అష్టమి నాడు కేదారవ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సంప్రదాయ సిద్దంగా ఆచరిస్తుంటారు. భాద్రపద శుద్ద దశమి నాడు దశావతార వ్రతం ఆచరించడం, దేవ, ఋషి, పితరులకు తర్పణాలు చేయడం ముఖ్యమైన విధులు.

శుక్ల అష్టమి : రాధాష్టమి

          భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. సకల లోక జగజ్జనని రాధాదేవి అవతార సందర్భాన్ని స్మరించుకుంటూ, ఆమె మహత్వాన్ని ధ్యానిస్తూ ఈ పండుగను చేసుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడి అర్ధాంగి రాధాదేవి అని, ఆమె శ్రీకృష్ణుడి కంటే భిన్నమైంది కాదని బ్రహ్మవైవర్త పురాణం నలభై ఎనిమిదో అధ్యాయం వివరిస్తోంది. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినం రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.

శుక్ల ఏకాదశి : పరివర్తన ఏకాదశి

     తొలి ఏకాదశినాడు క్షీరాబ్దిపై శేషతల్పంమీద శయనించిన శ్రీమహావిష్ణువు ఈ దిన ప్రక్కకు పొర్లుతాడు అంటే పరివర్తన చెందుతాడు కనుక దీనికి ‘పరివర్తన ఏకాదశి’  అని, ‘విష్ణు పరివర్తన ఏకాదశి’ అని ‘పద్మ పరివర్తన ఏకాదశి’  అని పేరు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించడంవల్ల కరువుకాటకాలు రావని, వచ్చి వుంటే విముక్తి లభిస్తుందని కథనం.

శుక్ల ద్వాదశి : వామన జయంతి

      భాద్రపద శుద్ద ద్వాదశి వామన జయంతి గా  చెప్పబడింది. దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీమహావిష్ణువు ఈ దినం ధరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈనాడు వామనుడిని పూజించి, వివిధ నైవేద్యములు సమర్పించి, పెరుగును దానం చేయాలని శాస్త్ర వచనం. ఈ రోజున వామనున్ని ఆరాదిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది.

శుక్ల చతుర్డశి : అనంత చతుర్ధశి

     అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ‘అనంత చతుర్దశి వ్రతం’ లేదా ‘అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.

 శుక్ల పూర్ణిమ : ఉమామహేశ్వర వ్రతం 

      భాద్రపద పూర్ణిమ రోజు ఉమామహేశ్వర వ్రతం  జరుపుకొంటారు, భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.

మహాలయ పక్షం ప్రారంభం :

భాద్రపద పూర్ణిమ తో మహాలయపక్షం ఆరంభమవుతుంది, అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృ పక్షం అని కూడా అంటారు. మృతులైన పితరులకు, పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణలివ్వాలి. శ్రాద్దాన్ని యధాశక్తి గా ఈ దినాలలో చేయాలి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే ‘మహాలయ పక్షం’ అని పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షంలో పదిహేనురోజులపాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులను నిర్వహించడం, పిండప్రదానం చేయడం ఆచరించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రకమైన విధులను నిర్వహించడంవల్ల గయలో శ్రాద్ధ విధులను నిర్వహించినంత ఫలం లభిస్తుంది.

బహుళ విదియ : బృహత్యుమావ్రతం (ఉమా మహేశ్వర వ్రతం)

బహుళ తదియ: ఉండ్రాళ్ళ తదియ (తద్దె)

      భాద్రపద బహుళ తదియ ని ఉండ్రాళ్ళ తద్దేగా చెప్పబడింది. ఇది  స్త్రీలు చేసుకొనే పండుగ, ముఖ్యం గా కన్నె పిల్లలు గౌరీ దేవి ని పూజించి, ఉండ్రాళ్ళను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడింది. స్త్రీలక అయిదవతనం వృద్ది చెందుతుంది.

బహుళ ఏకాదశి : అజ ఏకాదశి

     అజ ఏకాదశికే ‘ధర్మప్రభ ఏకాదశి’ అని కూడా పేరు. పూర్వం గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రతం చేసి రాజ్యాన్ని, భార్యాకుమారులను పోగొట్టుకుని కాటికాపరిగా పని చేసిన హరిశ్చంద్రుడు వాటిని తిరిగి పొందినట్లు పురాణ కథనం. ఈ ఏకాదశినాడు వ్రతం ఆచరించడంతోపాటు నూనెగింజలు దానం చేయాలని శాస్త వచనం.

బహుళ అమావాస్య : మహాలయమావాస్య

       భాద్రపద కృష్ణఅమావాస్య /పోలాల అమావాస్య/మహాలయమావాస్య, ఈ రోజున పితృ తర్పణాలు, దానధర్మాలు చేయడం ఆచారం. ఈ రోజున స్త్రీలు పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు ముఖ్యం గా సంతానం కొరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

బతుకమ్మ వేడుకలు ప్రారంభం (పెత్రమావాస్య)

     బతుకమ్మ బతుకుని కొలిచే పండుగ. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య ‘ఎంగిలిపూవు బతుకమ్మ’గా పెత్రమావాస్య రోజు పెద్దవిగా బతుకమ్మలను పేర్చి, సంబరం చేసుకుంటూ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పిలుచుకుంటూ ఆనాటి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు ఈ వేడుకలు కొనసాగిస్తారు. బతుకునిచ్చే తల్లిని శక్తిరూపంగా భావిస్తూ, లక్ష్మీ, గౌరి దేవీలను అభేదిస్తూ, తీరుతీరు పూలతో, ఆటపాటల ద్వారా పూజిస్తూ, రకరకాల వంటలు నైవేద్యాలుగా సమర్పిస్తూ, మనకున్నంతలో కొత్త బట్టలు, నగలు ధరిస్తూ, ఆడబిడ్డల్ని పండుగకు ఆహ్వానించుకొని జరుపుకునే గొప్ప వేడుక బతుకమ్మ.

              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

ఉపాధ్యాయ దినోత్సవం – డా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి

మన దేశ తొలి ఉపాధ్యక్షుడు, రెండవ అధ్యక్షుడు అయిన సర్వేపల్లి రాధాకృష్ణ సెప్టెంబర్‌ 5న జన్మించారు. ఆయన జన్మించిన రోజును దేశవాసులు ‘టీచర్స్‌ డే’గా జరుపుకుంటున్నారు. 1962 నుంచి 1967 వరకు దేశ అధ్యక్షుడిగా పనిచేశారు రాధాకృష్ణ. ఆ సమయంలో కొందరు విద్యార్థులు, స్నేహితులు రాధాకృష్ణన్‌ను కలిసి ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని అతనివద్దకు వచ్చినప్పుడు, “నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేను ఎంతో గర్విస్తాను”, అని చెప్పి ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ప్రేమను చాటారు. అప్పటినుండి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో “ఉపాధ్యాయ దినోత్సవం” గా జరుపుకుంటున్నారు.

జననం – విద్యాభ్యాసం  ప్రారంభ జీవితం, విద్య…

గొప్ప వేదాంతి…

సర్వేపల్లి రాధాకృష్ణ గొప్ప వేదాంతిగా పేరుతెచ్చుకున్నారు. 1888 సంవత్సరం సెప్టెంబర్‌ 5న జన్మించిన  శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ మద్రాసుకు 40 మైళ్ళ దూరంలోని తిరుత్తణి లో సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించారు. సర్వేపల్లి వారిది అతి సాధారణ బ్రాహ్మణ కుటుంబం. తండ్రి జమిందారు వద్ధ చిన్న ఉద్యోగం చేశేవారు. తిరుత్తణి లో జన్మించిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మాతృ భాష తెలుగు. ఆయన తిరుత్తణిలోని ప్రైమరీ బోర్డు హైస్కూల్‌లో ప్రాథమిక విద్య ముగియగా, తిరుపతిలోని హెర్మన్స్‌బర్గ్‌ ఎవాంజెలికల్‌ లూథర్‌ మిషన్‌ స్కూల్‌లో సైతం ఆయన చదువుకున్నారు. మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. అనంతరం ఎం.ఎ. పూర్తిచేశారు. ఇక డాక్టర్‌ రాధాకృష్ణన్‌ అనుకోకుండా వేదాంతం చదువుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వేదాంతంపై ఎంతో ఆసక్తి కనబరిచి అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో వేదాంతంపై ఎన్నో రచనలు చేశారు. ఆయన రచనలు ఎందరినో ప్రభావితుల్ని చేశాయి.

మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఎం ఏ ఆర్ట్స్ పట్టా అందుకున్నారు. సర్వేపల్లి గారికి, శివకామమ్మ గారితో 1904 లో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1975 ఏప్రిల్‌ 17న మృతిచెందారు.

ఇక ఆయన దేశ తొలి ఉపాధ్యక్షుడిగా 1952 నుంచి 1962 వరకు పనిచేయగా దేశ అధ్యక్షుడిగా1962 నుంచి 1967వరకు పనిచేశారు. రాధాకృష్ణ తన వేదాంత పద్ధతులతో పాశ్చాత్య దేశాలు, మన దేశానికి మధ్య వారధిని నిర్మించేందుకు ప్రయత్నించారు.

గొప్ప ప్రొఫెసర్‌గా…

కోల్‌కతా యూనివర్సిటీలోని కింగ్‌ జార్జ్‌ వి చైర్‌ ఆఫ్‌ మెంటల్‌ అండ్‌ మోరల్‌ సైన్స్‌లో సర్వేపల్లి రాధాకృష్ణ ప్రొఫెసర్‌గా 1921 నుంచి 1935 వరకు పనిచేశారు. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో 1936 నుంచి 1952 వరకు పనిచేయడం విశేషం. ఆయన ఉత్తమ అధ్యాపకుడిగా విద్యార్థులకు చక్కటి విద్యాబోధన చేస్తూ పలువురి ప్రశంసలనందుకున్నారు. ఆయన ప్రతిభకుగాను నైట్‌హుడ్‌(1931), భారతరత్న (1954), ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ (1963) అవార్డులను అందజేశారు. ఇక 1909లో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. అనంతరం మైసూర్‌ యూనివర్సిటీ వేదాంతం ప్రొఫెసర్‌గా అతన్ని నియమించింది.

ఈ సమయంలో ఆయన ప్రముఖ జర్నల్స్‌ ద క్వెస్ట్‌, జర్నల్‌ ఆఫ్‌ ఫిలాసఫీ, ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆప్‌ ఎథిక్స్‌కు ఎన్నో ఆర్టికల్స్‌ రాశారు. ఆయన తొలిసారిగా ‘ది ఫిలాసఫి ఆఫ్‌ రవీంద్రనాథ్‌’ అనే పుస్తకాన్ని రాశారు. ఆయన ఠాగూర్‌ ఫిలాసఫీని ఉత్తమ వేదాంతంగా పేర్కొన్నారు. ఇక రాధాకృష్ణన్‌ ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌గా 1931 నుంచి 1936 వరకు పనిచేశారు. 1939లో పండిత్‌ మదన్‌ మోహన్‌ మాలవ్య బనారస్‌ హిందూ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌గా చేయాలని రాధాకృష్ణన్‌ను విజ్ఞప్తిచేశారు. దీంతో రాధాకృష్ణన్‌ బనారస్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించి 1948 సంవత్సరం జనవరి వరకు పనిచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డాక్టర్‌ రాధాకృష్ణన్‌ యునెస్కోలో ఇండియా ప్రతినిధిగా 1952 వరకు కొనసాగారు. ఇక 1952లో దేశ ఉపాధ్యక్షుడిగా ఆయన ఎంపికయ్యారు. ఆ తర్వాత దేశ రెండవ అధ్యక్షుడిగా 1962 నుంచి 1967 వరకు పనిచేసి ఎంతో పేరుతెచ్చుకున్నారు.

చేపట్టిన పదవులు

మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తాత్విక శాస్త్ర ఉపన్యాసకుడిగా, ఉపప్రాధ్యాపకుడుగా, ప్రాధ్యాపకుడిగా వివిధ పదవులను అలంకరించారు.

    1918 నుండి 1921 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రాధ్యాపకుడిగా (ప్రొఫెసర్) పనిచేసారు.

    1921లో, అప్పటి భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ముఖ్య తాత్విక పీఠమైన, కింగ్ జార్జ్ 5 చెయిర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ కు రాధాకృష్ణన్‌ను నియమించారు.

    1926 జూన్‌లో బ్రిటనులో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రేసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. తరువాత ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయం నిర్వహించే అంతర్జాతీయ తాత్విక కాంగ్రేసులో సెప్టెంబర్ 1926లో కూడా కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు.

    1929లో, ఆక్స్‌ఫర్డులోని మాంచెస్టరు కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేయుటకు ఆయనను ఆహ్వానించారు. దీనివలన ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలోని విద్యార్ధులకు “తులనాత్మక మతము”(Comparative Religion) అనే విషయం మీద ఉపన్యాసము ఇవ్వగలిగే అవకాశము వచ్చింది.

    1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపసంచాలకునిగా (వైస్ ఛాన్సలర్) పనిచేసారు.

    1936లో, స్పాల్డింగ్ ఫ్రొఫెసర్ ఆఫ్ ఈస్ట్రన్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ అనే పీఠంలో ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలో 1952లో భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించే వరకు కొనసాగారు.

    1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి కులపతిగా (వైస్ ఛాన్సలర్) పనిచేసారు.

    1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేసారు.

    1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం తరుపున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించారు.

    1948లో విశ్వవిద్యాలయాల విద్యా కమీషనుకు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డారు.

    1948లో యునెస్కో కార్యనిర్వాహక బృందానికి అధ్యక్షుడిగా ఉన్నారు.

    1952లో యునెస్కో అధ్యక్షునిగా ఎంపికయ్యారు.

    1962లో బ్రిటీషు ఎకాడమీకి గౌరవసభ్యునిగా ఎన్నుకోబడ్డారు.

గౌరవములు

    ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.

    1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్టాత్మక సర్ బిరుదు ఈయనను వరించింది.

    1954లో మానవ సమాజానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు పొందారు.

    1961లో జర్మనీ పుస్తక సదస్సు యొక్క శాంతి బహుమానం (Peace Prize of the German Book Trade) పొందారు.

    1963 జూన్ 12న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కి గౌరవ సభ్యునిగా ఎన్నుకోబడ్డారు.

    ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆక్స్‌ఫర్డు, కేంబ్రిడ్జి, మొదలయినవాటి నుండి వందకు పైగా గౌరవ పురస్కారాలు మరియు డాక్టరేటులు సంపాదించారు.

    ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయము సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్ధం రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్ను ప్రకటించింది.

రచనలు

        The Ethics of the Vedanta and Its Material Presupposition

 (వేదాంతాలలోని నియమాలు మరియు వాటి ఉపయోగము ఒక తలంపు)(1908) – ఎం.ఏ. పరిశోధనా వ్యాసం.

        The Philosophy of Rabindranath Tagore   (రవీంద్రుని తత్వము)(1918).

        The Reign of Religion in Contemporary Philosophy

 (సమకాలీన తత్వముపై మతము యొక్క ఏలుబడి)(1920).

        Indian Philosophy  (భారతీయ తత్వము)(2 సంపుటాలు) (1923 మరియు 1927).

        The Hindu View of Life  (హిందూ జీవిత ధృక్కోణము)(1926).

        The Religion We Need  (మనకు కావలిసిన మతము)(1928).

        Kalki or The Future of Civilisation  (కల్కి లేదా నాగరికత యొక్క భవిష్యత్తు)(1929).

        An Idealist View of Life  (ఆదర్శవాది యొక్క జీవిత ధృక్కోణము)(1932).

        East and West in Religion  (ప్రాక్‌ పశ్చిమాలలో మతము)(1933).

        Freedom and Culture  (స్వాతంత్ర్యం మరియు సంస్కృతి)(1936).

        The Heart of Hindusthan  (భారతీయ హృదయము)(1936).

        My Search for Truth (Autobiography) (నా సత్యశోధన(ఆత్మకధ))(1937).

        Gautama, The Buddha  (గౌతమ బుద్ధుడు)(1938).

        Eastern Religions and Western Thought

   (తూర్పు మతాలు మరియు పాశ్చాత్య చింతన) (1939, రెండవ కూర్పు 1969).

        Mahatma Gandhi    (మహాత్మా గాంధీ)(1939).

        India and China   (భారత దేశము మరియు చైనా)(1944).

        Education, Politics and War  (విద్య, రాజకీయం మరియు యుద్దము)(1944).

        Is this Peace    (ఇది శాంతేనా)(1945).

        The Religion and Society  (మతము మరియు సంఘము)(1947).

        The Bhagwadgita   (భగవధ్గీత)(1948).

        Great Indians   (భారతీయ మహానీయులు)(1949).

        East and West: Some Reflections   (తూర్పు మరియు పడమర: కొన్ని చింతనలు)(1955).

        Religion in a Changing World    (మారుతున్న ప్రపంచంలో మతము)(1967).

సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క ముఖ్య కొటేషన్లు

మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం.

ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విధ్యార్థిగా ఉండు, అది నిన్ను మరింతగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది.

ద్వేషాన్ని ద్వేషంతో చల్లార్చలేము. ప్రేమాభిమానాలతోనే చల్లబర్చగలము.

  • వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)
Categories
Vipra Foundation

అజ ఏకాదశి / అన్నద ఏకాదశి

శ్రావణ మాసం, బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి లేక అన్నద ఏకాదశి అంటారు. దారిద్ర్యంతో బాదపడుతున్న సమయంలో, జీవితంలో బాగా కష్టాలు ఎదుర్కుంటున్న సమయంలో ఈ ఏకాదశి నాడు ఉపవసించి శ్రీ హరిణి విష్ణు సహస్రానామలతో అర్చిన్చినట్లయితే తప్పక కష్టాలు తొలిగిపోతాయని పురాణాలూ చెబుతున్నాయి.

శ్రీ కృష్ణుడు యుధిష్టర మహా రాజు కి వివరించిన పురానా గాథ

పూర్వము హరిశ్చంద్రుడు అనే రాజు ఉండేవాడు ఎప్పుడు సత్యాన్ని పలికే వాడు. రాజు గారికి చంద్రమతి అని బార్య, లోహిత్శవ అనే కొడుకు ఉండేవాడు. జీవితంలో ఎప్పుడు అబద్దం చెప్పేవాడు కాదు. సత్యవ్రతాన్ని పాటించేవాడు. సత్యవ్రతాన్ని పరిక్సించడానికి విశ్వామిత్ర రుషి హరిశ్చంద్రునితో అబద్దం చెప్పించాదట. దాని మూలంగా రాజు సర్వస్వం కోల్పోయి బార్య కొడుకులను ఒక బ్రాహ్మణుని దగ్గర సేవకులుగా పెట్టి తను ఒక్కడే వేరే పని చేస్తూ జీవనం సాగించేవాడు.

అలా ఉన్న సమయం లో ఒకసారి గౌతమ మహర్షి రాజు గారి పని చేస్తున్న రాజ్యాన్ని సందర్శించే సమయం లో రాజు గారిని చూసి అతని వృత్తాంతము తెలుసుకొని మహర్షి నీకు నేను ఒక ఉపాయం చెప్పదను అని చెప్పి శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి రోజు భక్తీ శ్రద్దలతో ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువును భక్తీ శ్రద్దలతో పూజిస్తే తప్పకుండ మీరు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఉంటుంది, అనగా రాజు గారు మహర్షి చెప్పిన వీదంగా చేసి తిరిగి తన రాజ్యాన్ని, బార్య, కొడుకులను పొందాడు అని పురాణం చెబుతుంది. శ్రావణ మాసం లో బహుళ పక్షం లో వచ్చే ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన మనం చేసుకున్న పాపా లు అన్ని హరిస్తాయని, అశ్వమేధ యాగం చేస్తే వచ్చు పుణ్యం కలుగుతుంది అని పురాణాలూ చెబుతున్నాయి .

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

శ్రీకృష్ణ జన్మాష్టమి

       సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని ”కృష్ణాష్టమి” గా వేడుక చేసుకుంటాం. శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమిని “గోకులాష్టమి”, “అష్టమి రోహిణి”, “శ్రీకృష్ణ జన్మాష్టమి”, “శ్రీకృష్ణ జయంతి”, “శ్రీ జయంతి”, “సాతం ఆతం”, “జన్మాష్టమి” – ఇలా రకరకాలుగా వ్యవహరిస్తారు. కృష్ణ జన్మాష్టమి శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినముశ్రీకృష్ణుని జన్మదినమైన అష్టమి రోజున జరుపుకునే కృష్ణాష్టమి పండుగను ఉట్ల పండుగ అని కూడా అంటారు.

      శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యప్పిండి లేదా ముగ్గుతో బాల గోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ద్వారాలకు మావిడాకులు, వివిధ పూవులతో తోరణాలు కట్టి, కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరచి, చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో పూజిస్తారు. పాయసం, వడపప్పు, చక్రపొంగలి లాంటి ప్రసాదాలతో బాటు శొంఠి, బెల్లంతో చేసిన పానకం, వెన్న, మీగడ, పాలు నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా అటుకులను తప్పనిసరిగా సమర్పిస్తారు. కృష్ణుడికి కుచేలుడు ప్రేమగా అటుకులను ఇచ్చాడు. ఆ అటుకులు తీసుకుని, కుచేలునికి సర్వం ప్రసాదించాడు గనుక, ఈ పర్వదినాన బెల్లం కలిపిన అటుకులను పూజలో తప్పకుండా ఉంచుతారు.

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని, అష్టమి నాడు ఉపవాసం ఉండి, నవమి ఘడియల్లో పారణతో ముగిస్తారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి.

దశావతారాలలో శ్రీకృష్ణావతారం విశిష్టమైనది. కృష్ణుని అవతారం.. దశావతారాలలో సంపూర్ణ మానవావతారం. ఈ అవతారానికి ముందున్న రామ, పరశురామ, వామన అవతారాలు మానవావతారాలే అయినప్పటికీ ఆ అవతారాలలో లేని పరిపూర్ణత శ్రీకృష్ణావతారంలో కనపడుతుంది. ఒక మానవులలో ఉండే కపటోపాయాల వద్ద నుండీ దైవం ప్రదర్శించే లీలల వరకూ మహావిష్ణువు, కృష్ణావతారంలో ప్రదర్శించారు. శ్రీకృష్ణుని జననం దగ్గర నుండే ఈ లీలా వినోదం ప్రారంభమైంది. ఆయన పుట్టుక చెరసాలలో జరిగింది, అప్పుడు మొదలు ఆయన గోకులానికి చేరడం వరకూ శిశు ప్రాయంలోనే చేసిన లీలలు చర్వితచర్వణం. బాలకృష్ణుడిగా శకటాసుర, పూతన వంటి రాక్షసులను అంతమొందించాడు. ఇవన్నీ శ్రీ మహావిష్ణువు లీలలే… శ్రీ మహావిష్ణువు ఆర్తత్రాణపరాయణుడు. ఈ ఆర్తత్రాణపరాయణ్వానికి గజేంద్ర సంరక్షణ ఒక ఉదాహరణ. ఈ సంఘటనను తీసుకుంటే. గజేంద్రుడు మొసలి వాతపడ్డాడు. సకల ప్రయాత్నాలు చేశాడు, ఓడాడు. నీవే తప్ప నితః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్ / రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా”  అని మొత్తుకున్నాడు. అప్పుడు స్వామి ఎలా ఉన్నాడు, రమావినోదిఅయి ఉన్నాడు, లక్ష్మి దేవితో సరసల్లాపాలలో ఉన్నాడు,  విన్నాడు విహ్వల నాగేంద్రము ‘పాహి పాహి’ యన గుయ్యాలించి సంరంభియై”  

సిరికింజెప్పడు శంఖ చక్ర యుగముంజే దోయి సంధింపడు

పరివారంబును జేరడభ్రగపతిం బన్నింప డాకర్ణికాం

తర ధమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోద్ధత శ్రీ కుచో

పరి చేలాంచల మైన వీడడు గజ ప్రాణాన నోత్సాహియై

స్వామి గజప్రాణం రక్షించాలనే ఆవేశంలో బయలుదేరాడు! ఎలా? లక్ష్మికి చెప్పడు. రెండు చేతుల్లో శంఖచక్రాలు ధరించడు. భ్రత్యులను పిలవడు గురుడుని కోసం చూడడు. చెవుల మీద పడిన జుట్టును సవరించడు. లక్ష్మీదేవి చన్నుల మీద చెంగునైనా వదలడు.

ద్రౌపది, తనకు వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తన భర్తలను సాయం అర్ధించలేదు. మరెవర్నీ ప్రాధేయపడలేదు. “కృష్ణా.. నన్ను నువ్వే కాపాడాలి” అంటూ శ్రీకృష్ణుని వేడుకుంది. తనను నమ్మి, శరణు వేడినవారిని దైవం ఎన్నడూ విడిచిపెట్టదు. కృష్ణుడు అందించిన దివ్య వస్త్రంతో ద్రౌపది అవమానం నుండి బయటపడింది. కాళియ నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితం అయింది. అంతేనా.. ఆ విషపు వేడికి నీలు మరుగుతూ, నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది. ఆ వేడి సేగలకు తట్టుకోలేక పక్షులు, నదిలో పడి చనిపోసాగాయి. ఇది చూసిన బాల కృష్ణుని మనసు ఆర్ద్రమైంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దైవ లక్షణం కదా! యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని, కాళీయుని కోరల్లోంచి వెలువడుతోన్న విషం నుండి పశుపక్ష్యాదులను కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు.  

కాళీయ సర్పం కృష్ణుని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయింది. తక్షణం బుద్ధి చెప్పాలని, తన పొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది.ఒడ్డున ఉన్నగోప బాలికలు, యశోదమ్మ అందరూ కంగారుపడ్డారు. భయాందోళనలకు లోనయ్యారు. దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి, కోపంతో బుసలు కొట్టింది. ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపై నృత్యం చేశాడు. శ్రీకృష్ణుడు ఒక్కో పడగమీదికి లంఘిస్తూ కాళియ మర్దనం చేస్తోంటే కాళీయుడు తగ్గిపోయాడు. పడగలు దెబ్బతిన్నాయి. రక్తం ధారలు కట్టింది. కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడాడు. కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి, కాళీయుని క్షమించమని కోరాయి. కృష్ణుడు దయ తలచాడు.. కాళీయుని వెంటనే యమునానది వదిలి వెళ్ళి, రమణక ద్వీపానికి వెళ్ళమన్నాడు. కాళీయుడు కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునాజలం పవిత్రమైంది, అందరూ ఆనందించారు.

మమాఖిల పాప ప్రశమనపూర్వక సర్వాభీష్ట సిద్ధయే ‘శ్రీ జన్మాష్టమీ వ్రతమహం కరిష్యే

అనే మంత్రాన్ని స్మరిస్తూ పూజ చేసుకోవాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు వీధుల్లో ఉట్లు కట్టి ఆడే ఆట రక్తి కడుతుంది. ఆ ఉట్టిని పైకీ, కిందికీ లాగుతూ ఉంటారు. ఒక్కొక్కరూ పోటీ పడుతూ ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నిస్తారు.

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కృష్ణ లీలల్ని స్మరించుకుందాం.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

విశ్వహిందూ పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం

                  విశ్వ హిందూ పరిషత్ 29 ఆగష్టు 1964 లో స్థాపించబడింది, విశ్వ హిందూ పరిషత్ ప్రధాన లక్ష్యం హిందూ సమాజమును ఏకీకృతం చేయడం, సేవ చేయడం, హిందూ ధర్మాన్ని రక్షించడం. విశ్వ హిందూ పరిషత్ ను సంక్షిప్తంగా వి.హెచ్.పి అంటారు. ఇది భారతదేశంలోని హిందూ మితవాద సంస్థ మరియు హిందుత్వ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. విశ్వ హిందూ పరిషత్ హిందూ జాతీయ సంస్థల యొక్క గొడుగు సంఘ్ పరివార్ కు చెందినది. ఇది హిందూ దేవాలయాల నిర్మాణం మరియు పునరుద్ధరణలలో, గోసంరక్షణ, మత మార్పిడి, హిందూ జాతీయవాదం, హిందూ సంస్కరణల వంటి అంశాలలో ఇంకా అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది.

                విశ్వ హిందూ పరిషత్ ను కేశవరాం కాశీరాం శాస్త్రి 1964 లో స్థాపించారు. హిందూ ఆధ్యాత్మిక నేత చిన్మయనంద, పూర్వ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యుడు ఎస్.ఎస్.ఆప్టే, జయచామరాజేంద్ర వడయార్, నందారి సిక్కుల యొక్క ఉన్నత ఆధ్యాత్మిక అధిపతి సద్గురు జగ్జీత్ సింగ్ మరియు సిక్కు నాయకుడు మాస్టర్ తారా సింగ్ సహ వ్యవస్థాపకులు. దీనికి చిన్మయనంద వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఆప్టే వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు.

                 “విశ్వ హిందూ పరిషత్” అనే ఈ పేరును సంస్థ సమావేశంలో ప్రతిపాదించి నిర్ణయించారు మరియు 1966 లో కుంభ మేళా ప్రారంభ సమయంలో ప్రయాగ (అలహాబాద్) వద్ద హిందువుల ప్రపంచ సదస్సు నిర్వహించారు.

                వి.హెచ్.పి మొదటి చర్చనీయాంశ సమావేశం పవాయ్, సాందీపుని సంధ్యాలయ, బొంబాయిలో 29 ఆగష్టు 1964 న జరిగింది. జన్మాష్టమి పండుగ నాడు ఏర్పాటుచేసుకున్న ఈ సమావేశానికి ఆర్.ఎస్.ఎస్ అధినేత ఎం.యస్.గోల్వాల్కర్ ఆతిథ్యం వహించారు. హిందూ, సిక్కు, బౌద్ధ మరియు జైన మతస్తుల నుండి అనేకమంది ప్రతినిధులు, అలాగే దలైలామా ఈ సమావేశానికి హాజరయ్యారు. భజరంగ్ దళ్ (యువజన విభాగం), దుర్గా వాహిని (మహిళా విభాగం) ఇలా అనేక విభాగములు వి.హెచ్.పి లో అంతర్భాగములు.

                “భారత మూలాలకు చెందిన అన్ని మత విశ్వాసాలను ఏకం చేయాలి” అని “హిందూ” (“హిందూస్తాన్” ప్రజలు) అనే పదం చెబుతుందని కావున అన్ని మతాలకు చెందిన అనుయాయులకు ఇది వర్తించబడుతుందని గోల్వాల్కర్ వివరించారు.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవం

     అవతార త్రయంలో చివరిగా శ్రీ రాఘవేంద్ర స్వామి తమ అఖండ పుణ్యరాశిని లోక కళ్యాణార్థమై భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ భక్త జనుల కామధేనువై, కల్పవృక్షమై దీన జనులను ఉద్దరిస్తూ మంత్రాలయంలో సశరీరముగా బృందావన ప్రవేశం చేశారు. స్వామి బృందావన ప్రవేశం అయిన సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.

   శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతములో ఓ ప్రముఖమైనగురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. వీరు వైష్ణవాన్ని (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించాడు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్నిఅవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. వీరు శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు(పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సమాధి అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.

     విజయనగర సామ్రాజ్యము లోని ఒక పండిత కుటుంబానికి చెందినవారు రాఘవేంద్రులు. విజయనరగర సామ్రాజ్య పతనము తరువాత వీరి పూర్వీకులు కావేరీ తీరములోని కుంభకోణానికి చేరారు. అక్కడి మఠాధిపతి “సురేంద్రతీర్ధులు” వీరి కుటుంబ గురువులు. తిమ్మణ్ణ భట్ట, గొపికాంబలకు 1519లో మన్మధనామ సంవత్సరం పాల్గుణశుద్ద సప్తిమి గురువారం నాడు తమిళనాడు రాష్ట్రంలోని భువనగిరి గ్రామంలో ”వెంకన్నభట్టు”గా జన్మించారు. శ్రీ వెంకటేశ్వరుని కృపతో జన్మించినవాడు. బాల్యములోనే ప్రతిభ కలవాడుగా గుర్తింపు పొందారు. వ్యాకరణము, సాహిత్య, తర్క, వేదాంతాలనన్నింటినీ అధ్యయనం చేశారు. సంగీత శాత్రము అభ్యసించి స్వయముగా కృతులను కన్నడ భాషలో రచించారు. చిన్నతనంలోనే సరస్వతి అనే యువతితో వివాహం జరిగింది. వివాహం అనంతరం కూడా ఉన్నత విధ్యను అభ్యసించడానికి కుంబకోణానికి వెళ్ళి అక్కడ శ్రీ సుదీంద్రతీర్ధుల వద్ద విధ్యను అభ్యసించారు. అక్కడే శ్రీ మాన్‌ న్యాయసుధ, పరిమళ అనే గ్రంధాలను రచించారు. మహభాష్య వెంకటనాధచార్య, పరిమళచార్య అనే బిరుదులను పొందారు. తంజావురిలో యజ్‌క్షానారాయణ దీక్షీతులకు ఆయనకు మధ్వద్వైత సిద్దాంతలపై జరిగిన వాదానలో వెంకటనాధుడే విజయం పొంది భట్టచార్యులు అనే బిరుదును కైవసం చేసుకున్నారు.

      ద్వైత మధ్వ మహాపీఠానికి అస్ధాన విద్వాంసులుగా నియమితులయ్యారు. దేశ సంచారం ముగించుకొని స్వగ్రామానికి చేరిన ఆయనకు లక్ష్మీనారాయణ అనే కుమారుడు జన్మించారు. సుధీంద్రతీర్ధస్వామి మఠం ప్రతిష్టను వెంకన్నభట్టు నిలిపేవారు. సుధీంద్రతీర్ధస్వాములకు వయసు పైబడింది. ఆయన వారసుడుగా మఠం కీర్తిని నిలిపే ఉత్తరాధికారిగానియమించే ఆలోచన మొదలైంక్ది. సుధీంద్రతీర్ధస్వామి వారి దృష్టి వెంకణ్ణభట్టు మీద ఉండేది. కానిఆయన సంసారి. సన్యాస దీక్షకు సిద్ధము గాలేడు. అయినా తగిన వారసుడు వెంకన్నభట్టు అనే నిర్ణయానికి వచ్చి తంజావూరు తీసుకువెళ్ళి భార్యకు తెలియకుండా వెంకన్నభట్టుకు సన్యాసదీక్ష ఉప్పించి “రాఘవేంద్రతీర్ధులు” గా నామకరణము చేశారు. భర్త సన్యాసదీక్ష తీసుకున్న వార్త విన్న భార్య సరస్వతి ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఎన్నో కష్టాలను అనుభవించి బావిలో దూకి బలవన్మరణము చెందింది.

     తంజావురు రాజు రాఘునాధ్‌ నాయకుడి ఆధ్వర్యంలో 1623 పాల్గుణ శుద్ద విదియనాడు మద్వపీఠ సంప్రదాయ ప్రకారం సన్యాస ఆశ్రమం స్వీకరించారు. గురుప్రణవ మంత్రం భోదించి శ్రీ సుదీంద్ర తిర్తులవారు ఆయనకు 1621 ధుర్మతినామ సంవత్సరంలో శ్రీ రాఘవేంద్ర యోగి దీక్షా నామాన్ని ఇచ్చారు. నాటి నుండి వెంకటనాధుడు శ్రీ రాఘవేంద్ర స్వామిగా మారారు. ఆ తరువాత మఠ సంప్రదాయల ప్రకారం ఉత్తరదేశ యాత్రకు వెళ్ళి ఎన్నో మహిమలను చూపారు. పలువురిని పాపవిముక్తులను చేశారు. కొన్నేళ్ళ తరువాత శ్రీ రాఘవేంద్రులు పవిత్ర తుంగభద్ర నది తీరాన కీ.శ.1671 విరోధినామ సంవత్సరం శ్రావణ బహుళ విధియ గురువారం సూర్యోదయంకు ముందు మూల రాముణ్ణ ఆద్భుత గాణంతో పూజించి మంత్రాలయం బృందవనంలో సజీవ సమాది అయ్యారు. ఆ గానానికి ఆలయంలోని వేణుగోపాల స్వామి విగ్రహాలు సైతం నాట్య చేశాయి. అప్పటి నుండి స్వామి బృందవనం నుండి అనేక మహిమలను చాటుతూ కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా, కొరికలు తీర్చే గురు సార్వభౌముడిగా దేశవ్యాప్తంగా పేరుపోందారు. భక్తిశ్రద్ధలతో స్వామి వారిని కొలుస్తే సకల సంపదలు ఫలిస్తాయని భక్తులు నమ్మకంతో ఎందరో కొలుస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుకుందము.

     ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము, పట్టణము. మధ్వాచార్యుల పరంపరలో ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారిపుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నదీతీరంలో ఉన్నది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. మంత్రాలయం అసలు పేరు ‘మాంచాలే’. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర తీర్ధుల దేవాలయం. ఆయన శ్రీ హరి భక్తుడు. కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్దాపించడానికి వసంకల్పాన జన్మించిన కారణజన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర అసంఖ్యాకంగా ఉన్న స్వామి భక్తులకు ఎంతో ఉత్తేజాన్ని, భక్తి భావాన్ని కలుగజేస్తుంది.

      రాఘవేంద్ర స్వామి జీవిత విశేషాలు : పూర్వాశ్రమంలో రాఘవేంద్ర స్వామి అసలు పేరు వెంకటనాథుడు. ఆయన ఒక గృహస్తుడు. ఆయన భార్య పేరు సరస్వతి, కుమారుడు లక్ష్మీనారాయణ. ‘గురు సుధీంద్ర తీర్థ’ వెంకటనాదుని గురువు. అత్యంత ప్రతిభావంతుడైన వెంకటనాధుని తన తదనంతరం పీఠం భాధ్యతలు స్వీకరించమని సుధీంద్ర తీర్ద ఆదేశించాడు. గురు స్దానాన్ని చేపట్టాలంటే గృహస్ద జీవితాన్ని వదులు కోవాలి. గృహస్ధు గా తన భాధ్యతలకు పూర్తి న్యాయం చెయ్యలేననే కారణంతో గురు ఆఙ్ఞను వెంకటనాధుడు వినయంగా తిరస్కరించారు. కానీ కాలక్రమంలో దైవ సంకల్పం వల్ల వెంకటనాధుడు సన్యాసాన్ని స్వీకరించి, పీఠం గురు స్దానాన్ని అలంకరించడం జరిగింది. అప్పడినుండి ఆయన గురు రాఘవేంద్రుడుగా ప్రసిద్దుడయ్యారు.

      ఆయన తన జీవితమంతా అవిశ్రాంతంగా శ్రీ హరి మహాత్మ్యాన్ని ప్రవచించి, విస్తృతి చేశాడు. శ్రీ హరి కృప వల్ల ఆయన నయం కాని రోగాలను నయం చేయడం, మరణించిన వారిని బ్రతికించడం, నిరక్షరాస్యుడైన వెంకన్నను పండితునిగా చేయడం వంటి ఎన్నో మహిమలను ప్రదర్ళించారు. అలాంటి వాటిలో బాగా చెప్పుకోదగింది ఆదోని రాజు సిద్ది మసూద్ ఖాన్ గర్వాన్ని అణచడం. స్వామిని అవమానించాలనే ఉద్దేశ్యంతో సిద్ది మసూద్ ఖాన్ పంపిన మాంసం తో కూడిన తినుబండారాలను స్వామి పళ్ళు గా మార్చడంతో ఖాన్ రాఘవేంద్ర స్వామి శరణు వేడి వెంటనే ఒక అత్యంత సస్యశ్యామలమైన జాగీరుని స్వామికి సమర్పించాడు. స్వామి నవ్వుతూ జాగీరుని తిరస్కరించి తను తుంగభద్రా నదికి తల్లిగా భావించే మంత్రాలయాన్ని మాత్రం స్వీకరించారు. ఆంధ్ర ప్రధేశ్ లోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున మంత్రాలయం ఉంది.

      అక్కడినుండి ప్రైవేటు జీపులు, ఆటోల లాంటి ప్రైవేటు వాహనాల సాయంతో మంత్రాలయానికి సులువుగా చేరుకోవచ్చు. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 6గంటల నుండి మద్యాహ్నం 2గంటల వరకు, సాయంత్రం 4గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య దేవాలయాన్ని దర్శించవచ్చు. ఇటీవలి కాలంలో దేవాలయానికి లభించిన “బంగారు రథం” ప్రత్యేక ఆకర్షణ. వెండి, మామూలు రథాలు దేవాలయంలో ఉన్నా బంగారు రథం దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం కన్నుల పండువగా ఉంటుంది. దేశం లోని పలు ప్రాంతాలనుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. యూత్రికులను ఇంతగా ఆకర్షిస్తున్న ఈ దేవాలయం మూడువందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది.

      ఈ మఠాన్ని ప్రీతికా సన్నిధి అని కూడా అంటారు. ఇక్కడ సాధారణంగా చూసే బృందావనమే కాక రాఘవేంద్ర స్వాముల విగ్రహం కూడా ఉంటుంది. ప్రపంచం మొత్తంలో రాఘవేంద్రులవారి విగ్రహం ఇది ఒక్కటే. మిగిలిన ప్రదేశాలలో ఆయనను బృందావనంగానే చూస్తారు. 1836 నుండి 1861 కాలంలో దీనిని శ్రీమదాచార్య పరంపరలో శ్రీ సుజనానేంద్ర తీర్ధరు స్ధాపించారు. పర్యాటకులు ఇక్కడి పంచ బ్రిందావనం కూడా చూడవచ్చు. దీనిలో అయిదుగురు రుషులు అంటే శ్రీ సుజనేంద్ర తీర్ధ, శ్రీ శుబోధేంద్ర తీర్ధ, శ్రీ సుప్రజనేంద్ర తీర్ధ, శ్రీ సుజనానేంద్ర తీర్ధ మరియు శ్రీ శుక్రుతీంద్ర దీర్ధల అవశేషాలుంటాయి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)