Categories
Vipra Foundation

సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి

జననం : 31 అక్టోబరు 1875- నాడియర్, గుజరాత్, భారతదేశం

మరణం : డిసెంబరు 15, 1950 (వయసు 75) ముంబయి, భారతదేశం

      భారత దేశపు ఉక్కు మనిషి గా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించాడు. ఇతను ప్రముఖ స్వాతంత్ర యోధుడిగానే కాకుండా స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సపలుడైన ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోధ్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు.        స్వాతంత్రానంతరం జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ, ఉప ప్రధానమంత్రి గానూ బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేధించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్దతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది.

బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబం : 1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నాడియాడ్ లో జవేరీ భాయి, లాడ్‌లా పటేల్‌లకు నాల్గవ సంతానంగా వల్లభభాయి పటేల్ జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగా జరిగిననూ ఉన్నత న్యాయశాస్త్ర చదువులకై ఇంగ్లాండు వెళ్ళి బారిష్టర్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి అహ్మదాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు.

       తన భార్య అయిన ఝవెర్బాను పుట్టింటి నుండి తీసుకొచ్చి గోద్రాలో కాపురం పెట్టాడు. 1904లో ఆయనకు ఒక కుమార్తె – మణిబెన్, 1906లో దహ్యాభాయ్ అను కుమారుడు జన్మించారు. 1909లో ఆయన భార్య కాన్సర్ వ్యాధితో మరణించింది. వల్లభాయ్ కోర్టులో ఒక కేసు గురించి వాదిస్తున్నపుడు ఆమె మరణించిన వార్తను అందించినపుడు ఆ పేపరును చూసి తన జేబులో పెట్టుకొని, తిరిగి కేసు వాదించి గెలిచాడు. ఆ తర్వాతే ఆ వార్తను ఇతరులకు తెలియచేసాడు. ఆమె మరణానంతరం తిరిగి వివాహం చేసుకోరాదని నిశ్చయించుకున్నాడు. తన కుటుంబసభ్యుల సహకారంతో పిల్లలను పెద్దవాళ్ళను చేసాడు.

      36 ఏళ్ళ వయసులో ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ లండన్‌లో ఒక లా కాలేజీలో చేరాడు. 36 నెలల కోర్సును 30 నెలలో పూర్తిచేసాడు, అదీ క్లాసులో ప్రథమ స్థానంలో. తర్వాత అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చి అనతికాలంలోనే గొప్ప లాయరుగా విశేష కీర్తిని ధనాన్ని ఆర్జించాడు. ఆయన ఎప్పుడూ తెల్ల దొరలా సూటు బూటు వేసుకొని దర్జాగా తిరిగేవాడు.

జాతీయ నేతగా : బారిష్టరు పట్టా పుచ్చుకొని ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చిన వల్లబ్ భాయి పటేల్ దేశంలో జర్గుతున్న భారత జాతీయోద్యమం ప్రభావానికి లోనైనాడు. తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1928 లో బార్డోలీ లో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతనికి సర్దార్ అనే పేరు వచ్చింది.

1940, బాంబే, ఏ.ఐ.సి.సి. మీటింగులో గాంధీ, మౌలానా ఆజాద్ లతో పటేల్.

       గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 300,000 మంది సభ్యులతో కలసి దాదాపు 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తనవద్దనున్న తెల్లదొరలు వేసుకొనే బట్టలను అగ్నికి ఆహుతి చేసారు. తన కుమార్తె మణి, కొడుకు దాహ్యాతో కలసి జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్‌లో మద్యపానం, అస్పృశ్యత, కులవిచక్షణలకు వ్యతిరేకంగా పని చేసారు.

       1931 కరాచి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఉప్పు సత్యాగ్రహం, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం మొదలగు ఉద్యమాలలో కూడ ప్రముఖ పాత్ర వహించాడు.

రాజ్యాంగ సభ సభ్యుడిగా : భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లబ్ భాయి పటేల్ మంచి సహకారాన్ని అందించాడు. అంబేద్కర్ ను డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించుటలో ముఖ్య పాత్ర పోషించాడు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్ గా పనిచేశాడు. భారత పార్లమెంటు లో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ లకు నామినేట్ చేయు అధికారానికి కూడ అతనే ప్రతిపాదించాడు.

కేంద్ర మంత్రిగా : దేశ స్వాతంత్రం కోసం విశేషకృషి సల్పిన వల్లబ్ భాయి పటేల్ కు సహజంగానే స్వాతంత్ర్యానంతరం ముఖ్యమైన పదవులు లభించాయి. జవహర్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రిగాను మరియు ఉప ప్రధాన మంత్రిగాను 1947 నుంచి 1950 డిసెంబరు 15న మరణించేవరకు పదవులు నిర్వహించారు.

నెహ్రూతో విబేధాలు : భారత జాతీయోద్యమం సమయంలోనే వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో విబేధించాడు. ముఖ్యంగా 1936 భారతీయ జాతీయ కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ ప్రవచించిన సోషలిజంను వల్లబ్ భాయి పటేల్ వ్యతిరేకించాడు. స్వాతంత్ర్యానంతరం కూడ స్వదేశీ సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కాముకను కాదని బలవంతంగా బలప్రయోగం, సైనిక చర్యలు చేపట్టి విజయం సాధించాడు. కాశ్మీర్ అంశాన్ని ఐక్య రాజ్య సమితికి నివేదించడంలో నెహ్రూతో విబేధించాడు. పాకిస్తాన్ కు చెల్లించవలసిన రూ.55 కోట్లు ఇవ్వరాదని కూడ వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో వాదించాడు. తొలి రాష్ట్రపతి ఎన్నికలలో కూడ చక్రవర్తి రాజగోపాలచారి వైపు నెహ్రూ మొగ్గు చూపగా, వల్లబ్ భాయి పటేల్ రాజేంద్ర ప్రసాద్ ను ప్రతిపాదించి సఫలీకృతుడైనాడు. అలాగే 1950 కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అభ్యర్థి కృపలానీని కాదని పురుషోత్తమ దాస్ టాండన్ ను గెలిపించాడు.

మరణం : 1950 డిసెంబరు 15 న వల్లబ్ భాయి పటేల్ కన్నుమూశాడు. ముంబాయి లో పెద్ద ఎత్తున ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వేలాదిగా ప్రజలు, స్వాతంత్ర్య సమర యోధులు, దేశ విదేశీ రాజకీయ నాయకులు, నివాళులర్పించారు. అతను ప్రస్తుతం మన మధ్య లేకున్ననూ అతని ఘనకార్యాలు, చేపట్టిన చర్యలు ఏ నాటికీ మరువలేనివి.

విమర్శ : ఇతడి జీవిత కాలంలో అనేకానేకులు ఇతడ్ని విమర్శించేవారు. ముస్లింల పట్ల ఇతడు చూపిన వివక్షకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి జాతీయవాదులూ విమర్శించారు.[ఆధారం కోరబడినది] దేశవిభజన కాలంలో ఇతడు చేపట్టిన నిరంకుశ పనులకూ, దేశవిభజన కొరకు చేసిన తొందరపాటుకూ ఇటు హిందువులనుండి, అటు ముస్లింల నుండి విమర్శలందుకొన్నాడు.[ఆధారం కోరబడినది] సుభాస్ చంద్రబోసు విధేయులు సపోర్టర్లు కూడా ఇతడ్ని నిందించారు.[ఆధారం కోరబడినది] గాంధీవిధేయతనుండి రాజకీయ నాయకులను దూరం చేస్తున్నాడనే అపవాదునూ మూటగట్టుకున్నాడు.[ఆధారం కోరబడినది] సోషలిస్టు నాయకులైన జయప్రకాశ్ నారాయణ్ , అశోక్ మెహతా లు సైతం ఇతడిని, పారిశ్రామిక వేత్తల కుటుంబమైన బిర్లా కుటుంబంపై అమిత దయాదాక్షిణ్యాలు చూపాడని, ఇతర పారిశ్రామిక వేత్తలకు అణచి వేశాడని విమర్శించారు. చరిత్రకారులు సైతం ఇతడిని, ప్రాంతీయ రాజ్యాల హక్కులను కాలరాచాడని విమర్శించారు.[ఆధారం కోరబడినది]

          హైదరాబాదు పై పోలీసు ఆక్షన్ సమయాన కూడా ఇతడు అనేక విమర్శలకు గురయ్యాడు.[ఆధారం కోరబడినది] 1948లో హైదరాబాదు రాష్ట్రాన్ని దేశంలో కలిపినప్పుడు అనేక మంది ముస్లిముల్ని బలవంతంగా పాకిస్తాన్ పంపేశాడని. పోలీస్ యాక్షన్(ఆపరేషన్ పోలో) తరువాత ముస్లిములపై విస్తారంగా హింస దౌర్జన్యాలు జరిగాయి. ముస్లిములపై జరిగిన ఈ హత్యాకాండపై విచారణ కోసం మౌలానా ఆజాద్ పట్టుపడగా నెహ్రూ సుందర్ లాల్ కమిటీని వేశాడు. ఆనివేదిక ఇంతవరకూ వెలుగు చూడలేదు. ఈ కుట్రవెనుక పటేల్ ఉన్నాడనే అభాండమూ అపవాదూ ఇతడిపై మోపబడినది.[ఆధారం కోరబడినది]

       ఎన్నో విమర్శలకు ఎదుర్కొని తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని, భారతదేశాన్ని, దాని పటాన్ని ఒకింత పరిపూర్ణం చేయడంలో తన వంతు సహకారం అందించి సకారాత్మక దృష్టితోనే పనిచేశాడనే విశ్వాసం దేశప్రజలలో కలిగేలా గట్టి కృషి సల్పాడు.

బిరుదులు : 1991లో భారత ప్రభుత్వం వల్లబ్ భాయి పటేల్ సేవలను గుర్తించి భారత రత్న బిరుదును మరణానంతరం ప్రకటించించింది.

  • వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)
Categories
Vipra Foundation

ఆస్వయుజ పూర్ణిమ – వాల్మీకి జయంతి

     మహా పుణ్య కవి , రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షి కారణజన్ముడు. వాల్మీకి జీవితం ఎంతో విలక్షణమైనదని, వాల్మీకి తన జీవిత కాలంలో పాపా, పుణ్య కర్మలను ప్రక్షాళన చేశాడు , తన రామాయణ ఇతిహాసం. మానవుడు రచించిన తొలి గ్రంథము , చారిత్రక పురుషుడైన రఘురాముని గురించి ఇతని సమకాలం గురించి చెప్పడమే కాకుండా కథనం మధ్యమంగా ఆనాటి భౌగోళిక విషయాలను క్రోడీకరించాడు. సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కధ. దీనిని “సీతాయాశ్చరితం మహత్” అని వాల్మీకి అన్నాడు. 24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు – వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.

      రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు)గా విభజింప బడినది. వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కధకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక విష్ణుపురాణములో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారము అని చెప్పారు. భాగవతం నవమ స్కంధములో 10, 11 అధ్యాయాలలో రాముని కధ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో రాముని గురించిన అనేక గాధలున్నాయి. వాల్మీకి సంస్కృతంలో ఆదికవి. రామాయణాన్ని వ్రాశాడు. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు.

      చరిత్ర : త్రేతాయుగములో గంగానదీ తీరములో నైమికారణ్యములో అనేకమంది మునులు ఆశ్రమములు నిర్మించుకొని నియమ నిష్టలతో తపస్సు చేస్తూ ఉండేవారు. మునీశ్వరులందరూ బ్రాహ్మణ కుటుంబాలకు చెందివారే. అందులో ఒక ముని పేరు ప్రచస్థాముని .. .. ఇతనికి ఒకకుమారుడు … పేరు ” రత్నాకరుడు ”  ఒకరోజూ రత్నాకరుడు ఆడుకుంటూ అడవిలో దారితప్పి ఎటుపోవాలో తెలియ భయము ఏడుస్తూ ఉన్న సమయాన ఆ దారినిపోయిన ఒక వేటగాడు … ఈ పిల్లవాడిని ఓదార్చి తనవెంట తన నివశిస్తున్న గుడెసె తీసుకు పోయి , తనకు పిల్లలు లేనందున తన కొడుకుగా పెంచుకోసాగెను. ప్రచస్ఠా ముని తన భార్యతోకూడి కుమారుని కొరకు వెదికి దొరక పోయేసరికి , ఏ క్రూరజంతువు తినిఉంటుందని భావించి పుత్రశోఖం తో వెనుదిరిగి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు.  ఇక్కడ బోయకుటుంబానికి చెందిన వేటగాడు , అతని భార్య తమ సొంత కొడుకు గానే రత్నాకరుడు ని పెంచి పెద్దచేసారు. విలువి్ద్యలో మంచి ప్రావీణ్యము , వేట లో నైపుణ్యము సంపాదించిన రత్నాకరుడు మంచి తెలివైనవాడు . తన వేట నైపుణ్యము తో ఆ అడవి లోని పక్షులకు , జంతువులకు యముడుగా తయారయ్యాడు . యవ్వనము వచ్చిన రత్నాకరునికి బోయ   తల్లిదండ్రులు వారి వంశములోని అమ్మాయిని చూసి పెళ్ళిచేసారు. కొంతకాలానికి ముగ్గురు పిల్లతో రత్నాకరుడి కుటుంబము పెద్దది కావడము వలన తన సంపాదన పెంచుకొనేనిమిత్తము  దారిదోపిడి , దొంగతనము లను వృత్తిగా తీసుకొని అవసరమైన చోట బాటసారులను చంపి ధనాన్నిదోచుకుని తన కుటుంబము హాయిగా బ్రతికేందుకు పాటుపడేవాడు .

       ఒకరోజు అడవి దారిలో ఒకచోట కూర్చోని బాటసారులకోసము పొంచి ఉన్న సమయాన ఆ దారిన ” నారద మహర్శి ” రావడము జరిగింది. నారద ముని సర్వసాదారణ మానవరూపలో ఉన్నందున రత్నాకరుడు దోచుకునే ప్రయత్నము చేయగా … తన దగ్గర వీణా , రుద్రాక్షలు , కాషాయ వస్త్రాలు తప్ప ఏమీ లేవని తెలిపినా … వినక చంపివేయదును అని భయపెట్టసాగెను. అప్పుడు ఓ బోయవాడా … దొంగతనము , దోపిడీలు, ఇతరులను హించించి హత్యచేయడము పాపము అని హితబోద పలికినా నమ్మలేదు . ” నీవు ఇన్ని పాపకార్యములు ఎవరికోసము చేయుచున్నావని అడుగగా” … తన కుటుంబపోషనకొరకై తెలిసిన విద్య ఇది ఒక్కటే … పాప పుణ్యాలు నాకు తెలియవు . అప్పుడు నారదముని ఆ బోయవానికి జ్ఞానోదయము కలిగించే ఉపాయము ఆలోచించి .. ” ఓ బోయవాడా నీవు చేయు ఈ పాపాలు నీ కుటుంబ సబ్యులు ఎవరైనా పంచుకుంటారేమో అడిగి తెలుగుకోమని తనతో నారదముని ఆ బోయ ఇంటికివెళ్ళి .. పాపాలు పంచుకుంటారేమో అడుగగా తల్లి దండ్రులు గాని , భార్యా బిడ్డలు గాని అందుకు సమ్మతించగపోగా … కుటుంబపోషణ ఇంటి యజమాని బాధ్యత అని పాపమో , పుణ్యమో అది తనవరకే గాని , తీసుకున్నా వీలు పడదని , పాప పుణ్యాలు ఒకరినుంది ఇంకొరికి ఇవ్వనూలేము , తీసుకోనూలేము అని వారి నిస్సహాయతను తెలియజేసిరి.

       ఆ మాటలు విన్న రత్నాకరుడు పశ్చ్యాత్తాపము చెంది , పాపవిముక్తికై ఉపాయము చెప్పమని నారదుని వేడుకొనెను . అప్పుడు నారదుడు తన నిజ రూపాన్ని బోయవానికి చూపించి భక్తి మార్గానికి ” మరా మరా ” అనే రెండక్షరాల మంత్రాన్ని బోధించెను . అప్పటినుంది నైమికారణ్యము లో రామ రామ రామ మంత్రము తో కొన్ని సంవత్సరాలు తపస్సు చేయగా తనచుట్టూ మట్టి పుట్టలా కప్పివేయడము జరిగింది. బయట తిరిగే బాటసారులెవరికీ తను  కనబడడము జరుగలేదు. నారద మహర్షి తనకున్న దేవతా శక్తులతో రత్నాకరుని కుటుంబానికి ధన , ధాన్య , అశ్వర్యములను ప్రసాదించెను . నారదమునికి తెలుసు ఈ రత్నాకరుడు కారణజన్ముడని .. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత నారదముని తిరిగి అదే దారిన కావాలనే వచ్చి రత్నాకరుడున్న పుట్టను తెరచి , చిక్కి బక్కై , బయటి ప్రపంచముతో సంబంధము లేని ఆ రత్నాకరుని చెవులో రామ రామ రామ అని పలుకగా కళ్ళు తెరచిన ఆ రత్నాకరుని ఆపాదమస్తం ను తన మృదువైన చేతులతో తడివి పునీతము గావించెను. ” ఓ రత్నాకరా నీవు గొప్ప తపశ్సాలివి అయ్యావు . దేవుడు నిన్ను కరుణిచాడు . నీవు మళ్ళీ జన్మించావు ., ఈ పుట్తనుంది పుట్టేవు కావున నీవు  ‘ వాల్మీకి ‘ గా పిలువబడుతూ లోక కణ్యానము కోసము మంచి కావ్యాన్ని వ్రాసెదవు అని ” దీవించి అదృశ్యమయ్యెను. నాటినుంది వాల్మీకి ఎంతోమంది శెస్యులతో తన జీవితాన్ని గడుపసాగెను.

       వాల్మీకి వలస : అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారత దేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత , మహర్షిగా మారి దండకార్యణం (నల్లమల అడవులు) గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలొ పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ.

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం

ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం

వాల్మీకేర్మునిసిమ్హస్య కవితావనచారిణః

శ్రుణ్వన్ రామ కధానాదం కొనయాతి పరాం గతిం

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’ ( మహిషాసుర మర్దిని )

శ్లో||  సిద్ధగంధర్వయక్షాద్యైః అసురైరమరైరపి ।  సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥

దుర్గా ధ్యాన శ్లోకము :

శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాం

శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |

సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం

ధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ||

దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’ . ఈమె సర్వవిధ సిద్ధులనూ ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణంలో 1) అణిమ, 2) మహిమ, 3) గరిమ, 4) లఘిమ, 5) ప్రాప్తి, 6) ప్రాకామ్యము, 7) ఈశిత్వము, 8) వశిత్వము అని సిద్ధులు ఎనిమిది రకాలుగా పేర్కొన బడ్డాయి. బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మ ఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి. అవి…

1) అణీమ, 2) లఘీమ, 3) ప్రాప్తి, 4) ప్రాకామ్యము, 5) మహిమ, 6) ఈశిత్వ వశిత్వాలు, 7) సర్వకామావసాయిత, 8) సర్వజ్ఞత్వం, 9) దూరశ్రవణం, 10) పరకాయ ప్రవేశం, 11) వాక్‍సిద్ధి, 12) కల్పవృక్షత్వం, 13) సృష్టి, 14) సంహారకరణ సామర్థ్యం, 15) అమరత్వం, 16) సర్వన్యాయకత్వం, 17) భావన మరియు 18) సిద్ధి.

సిద్ధిదాత్రి మాత భక్తులకూ, సాధకులకూ ఈ సిద్ధులన్నింటిని ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను దేవి కృపవలననే పొందారని దేవీ పురాణం పేర్కొంటుంది. ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. సింహవాహన. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శనమిస్తుంది.

నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదవరోజున ఉపాసించబడే దేవీ స్వరూపం ఈమెదే. తొమ్మిదవరోజున శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించేవారికి సకల సిద్ధులూ కరతలామలకం అవుతాయి. సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏదీ లేదు. ఈ మాత కృపతో ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్నే జయించే సామర్థ్యం లభిస్తుంది.

ఈ సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రులవ్వడానికి నిరంతరం ప్రతీ వ్యక్తీ ప్రయత్నించాలి. ఈ మాత దయా ప్రభావంవల్ల అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుండి నిర్లిప్తుడవ్వగలడు. అన్ని సుఖాలను పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడు.

నవదుర్గల్లో ‘సిద్ధిదాత్రి’ అవతారం చివరిది. మొదటి ఎనిమిది రోజుల్లో క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విద్యుక్తంగా నిష్ఠతో ఆరాధించి, తొమ్మిదవ రోజు ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావాలి. ఈ దేవిని ఉపాసించడం ముగియగానే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారలౌకిక మనోరథాలన్నీ సఫలమవుతాయి. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తుడికి కోరికలేవీ మిగిలి ఉండవు. ఇలాంటి భక్తుడు అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ దేవి దివ్య లోకంలో విహరిస్తాడు. ఆ దేవీ కృపారసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు. అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే అతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం ఉండదు.

దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ, ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధ పడుతుంది. తన్మహత్త్వాన నిజమైన పరమానందదాయకమైన అమృత పథం మనకు ప్రాప్తిస్తుంది.

ఆకుపచ్చ రంగు, నైవేద్యం : పాయసాన్నం

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

అందరికీ విజయదశమి (దసరా) శుభాకాంక్షలు

శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |

అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||

शमी शमयते पापम् शमी शत्रुविनाशिनी ।

अर्जुनस्य धनुर्धारी रामस्य प्रियदर्शिनी ॥

shamI shamayate paapam shamI shaTruvinaashinI |

arjunasya dhanurdhaari raamsya priyadasrshinI ||

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

విజయ దశమి (దసరా)

దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది. ‘శ్రవణా’ నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి ‘విజయా’ అనే సంకేతమున్నది. అందుకనే దీనికి ‘విజయదశమి’ అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. ‘చతుర్వర్గ చింతామణి’ అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే ‘విజయం’ అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము.

‘శమీపూజ’ చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే ‘జమ్మిచెట్టు’. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న ‘అపరాజితా’ దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించినారు.

శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ ‘అపరాజితా’ దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము పొందినాడు.

శమీపూజ అనంతరం ‘పాలపిట్ట’ను చూచే ఆచారం కూడా ఉన్నది.

      ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

శ్లో” శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |

అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||

పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

చల్దుల(సద్దుల) బతుకమ్మ

పూర్వం చోళ దేశంలో ధర్మాంగదుడనే రాజుకి ఎన్నో నోముల అనంతరం తన అర్థాంగికి శ్రీలక్ష్మి జన్మించగా ఆమెకు ఎన్నో గండాలు వచ్చినప్పటికి బ్రతికి నందువల్ల బతుకమ్మ అని పేరు పెట్టటం జరిగిందని జన శృతి. రాక్షస సంహారం చేసి అలసిపోయిన ఆ ఆదిపరాశక్తిని సేద తీర్చి పది రోజులపాటు ఆ తల్లికి సేవలు చేసి తరించిపోయే మహిళల పాలిట కల్పవల్లి, కరుణామతల్లి ఆ బతుకమ్మ. భాద్రపద అమావాస్య(పెత్రమవస్య)తో ప్రారంభించి మహర్నవమితో ముగించబడే బతుకమ్మ పండుగ నవమిరోజు ‘సద్దుల పండుగ’  పేరుతో తిరిగి పెద్ద ఎత్తున ‘బతుకమ్మ’  పేర్చుకొని వైభవంగా పండుగను జరుపుకుంటరు. బతుకమ్మ బతుకుని కొలిచే పండుగ, బతుకునిచ్చే తల్లిని శక్తిరూపంగా భావిస్తూ, లక్ష్మీ, గౌరి దేవీలను అభేదిస్తూ, ఆటపాటల ద్వారా పూజిస్తూ, రకరకాల వంటలు నైవేద్యాలుగా సమర్పిస్తూ, మనకున్నంతలో కొత్త బట్టలు, నగలు ధరిస్తూ, ఆడబిడ్డల్ని పండుగకు ఆహ్వానించుకొని జరుపుకునే గొప్ప వేడుక బతుకమ్మ.

మైదానానికి చేరుకొని బతుకమ్మ ఆటను ఆడుతరు. బతుకమ్మను పెట్టి ఆడే చోట వెంపలి చెట్టుగాని, పిండిచెట్టు గాని పెట్టి, గౌరమ్మను నిల్పి పూజ చేసి ఆట మొదపూడతరు. స్త్రీలు వలయాకారంగా నిలబడి కుడివైపుకు జరుగుతూ, చప్పట్లు చరుస్తూ, వంగి లేస్తూ, ఒక స్త్రీ పాట చెబుతూ ఉంటే, మిగతా వాళ్ళందరూ పాడుతుంటరు.

ఇలా సాగే బతుకమ్మ ఆట పాటను గమనిస్తే ఈ పండుగ ప్రయోజనమేమిటో అర్థమవుతుంది. అన్ని వర్గాలవారు కలిసి ఆడటంలో మానవ సంబంధాలు, సమిష్టి భావనలు పెంపొందుతయి. భారతదేశ ఔన్యత్యాన్ని, తెలంగాణ ప్రశస్థిని తెలిపే ఈ సాంస్కృతిక విశిష్టత తరతరాలుగా కొనసాగుతోంది. స్త్రీల సమైక్యత, వారిలోని కళాత్మకత ఈ సందర్భంగా చక్కగా వెల్లడవుతుంది.

కుటుంబం, అనుబంధం, చారివూతక నేపథ్యం, పౌరాణికతలు మొదలైనవి జోడించిన పాటల వల్ల రాబోయే తరానికి మౌఖికంగా, ఆచరణాత్మకంగా ఆ సాహిత్యాన్ని, వారసత్వాన్ని అందించిన వాళ్ళం కూడా అవుతం.

బతుకమ్మ ఆట తరువాత స్త్రీలు కోలాటాలు వేస్తరు. ఈ కోలాటాలను కొన్ని చోట్ల కర్రలతో, మరికొన్ని చోట్ల ఇత్తడి, వెండి కోలలతో, మరికొన్ని ప్రాంతాలలో చేతులతో వేస్తూ ఆనందిస్తరు. ఈ కోలాటం పాటలు రసరమ్యంగా, ఆనందంగా, వినోదాత్మకంగా ఉంటయి.

‘చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన….’ అంటూ సాగే పాటపూన్నో పాడుకుంటరు.

అదే విధంగా గౌరిపూజ చేసి, గౌరమ్మ కళ్యాణం (పసుపు ముద్ద గౌరమ్మ) చేసి, గౌరిని అంటే బతుకమ్మను సాగనంపుతూ పాటలు పాడుకుంటరు. ఈ పండుగ వేళ చేసే ప్రతీ పని ఆట, పాట అన్నీ మానవ జీవితంలోని సన్నివేశాలను ముఖ్యంగా స్త్రీలు కోరుకునే పేరంటం, సౌభాగ్యాలను చిత్రిస్తయి.

వినవంతూ నింట్లో పుట్టి హిమవంతూ నింట్లో పెరిగి…’ అంటూ సాగే పాటలు స్త్రీల ఉద్దేశ్యాలను తేటతెల్లం చేస్త్తయి.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బంగారు బతుకమ్మ ఉయ్యాలో !

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బంగారు బతుకమ్మ ఉయ్యాలో !!

ఆనాటి కాలాన … ఉయ్యాలో!

ధర్మాంగు డను రాజు … ఉయ్యాలో!

ఆరాజు భార్యయు … ఉయ్యాలో!

అతి సత్యవతి యంద్రు … ఉయ్యాలో!

నూరు నోములు నోమి … ఉయ్యాలో!

నూరు మందిని గాంచె … ఉయ్యాలో!

వారు శూరు లయ్యి … ఉయ్యాలో!

వైరులచె హత మైరి … ఉయ్యాలో!

తల్లిదండ్రు లపుడు … ఉయ్యాలో!

తరగని శోకమున … ఉయ్యాలో!

ధన ధాన్యములను బాసి … ఉయ్యాలో!

దాయాదులను బాసి … ఉయ్యాలో!

వనితతో ఆ రాజు … ఉయ్యాలో!

వనమందు నివసించె … ఉయ్యాలో!

కలికి లక్ష్మిని గూర్చి … ఉయ్యాలో!

జనకోసం బొనరింప … ఉయ్యాలో! ….

….

ఊరికి ఉత్తరాన ..

ఊరికి ఉత్తరానా … వలలో

ఊడాలా మర్రీ … వలలో

ఊడల మర్రి కిందా … వలలో

ఉత్తముడీ చవికే … వలలో

ఉత్తముని చవికేలో … వలలో

రత్నాల పందీరీ … వలలో

రత్తాల పందిట్లో … వలలో

ముత్యాలా కొలిమీ … వలలో

గిద్దెడు ముత్యాలా … వలలో

గిలకాలా కొలిమీ … వలలో

అరసోల ముత్యాలా … వలలో

అమరీనా కొలిమీ … వలలో

సోలెడు ముత్యాలా … వలలో

చోద్యంపూ కొలిమీ … వలలో

తూమెడు ముత్యాలా … వలలో

తూగేనే కొలిమీ … వలలో

చద్దన్నమూ తీనీ … వలలో

సాగించూ కొలిమీ … వలలో

పాలన్నము దీనీ … వలలో

పట్టేనే కొలిమీ … వలలో

……

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

దుర్గాష్టమి, మహర్నవమి

దుర్గాష్టమి విశిష్ఠత: దుర్గాష్టమిని మహాష్టమి లేక వీరాష్టమి అని కూడా అంటారు. ఈ దినం పూజింపబడే నవదుర్గ మాత “మహాదుర్గ”. కొన్ని చోట్ల అష్టమి రోజున మహాభగళ, నారాయణిదేవిని పూజించడం కద్దు.

దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గాదేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు తల్లి నామం జపిస్తే తొలగిపోతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి, ఎర్రని బట్టలు పెట్టి, ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణం చెయ్యాలి. “ఓం దుం దుర్గాయైనమః” అనే మంత్రాన్ని పఠించాలి. పులగాన్నం నివేదనం చెయ్యాలి, దుర్గ, లలిత అష్టోత్తరాలు పఠించాలి.ఈ దినం “ఆయుధ పూజ లేక అస్త్రపూజ” చేస్తారు (కొన్ని చోట్ల నవమి రోజు, మరికొన్ని చోట్ల దశమి రోజు కూడా చేస్తారు). తాము వాడే పనిముట్లని, సామాగ్రిని శుభ్రపరిచి, వాటికి పూజ చేస్తారు.

అలాగే నవరాత్రులలో ప్రతీ దినం “సుహాసినీ పూజ” చెయ్యడానికి అనుకూలమే ఐనా చాలాచోట్ల అష్టమిరోజున ప్రత్యేకంగా సుహాసినీ పూజ చేస్తారు. ఈ పూజలో ముత్తైదువు ఐన స్త్రీని అమ్మవారి స్వరూపంగా పూజించి, దక్షిణ, పండ్లు, కొత్తబట్టలూ సమర్పించి, భోజనం అర్పిస్తారు. తెలంగాణా ప్రాంతంలో బతుకమ్మ పండుగ ఈ రోజున ప్రత్యేకంగా చేస్తారు. ఇది మహాలయ అమావాస్యరోజున మొదలై, అష్టమిరోజు ముగుస్తుంది. గౌరీ దేవిని బతుకమ్మగా కొలుస్తారు. భక్తులు అమ్మవారికి కుండలలో అన్నం వండుకొని, దానికి కుంకుమ కలిపి భక్తితో మెత్తపై పెట్టుకుని అమ్మవారి ఆలయానికి మోసుకుని వెళ్ళి సమర్పిస్తారు.ఈ రోజున ప్రత్యేకంగా బతుకమ్మ పాటలు పాడుతారు.

//విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణం

కన్యాభిః కరవాలఖేటి విలద్దస్తాభిరాసేవితాం

హస్తైశ్చక్రగదాసిఖే్టి విసిఖాంశ్చాపం గుణం తర్జనీం

బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే//          

మహర్నవమి

       ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకూ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రులలో చివరి రోజు.. అంటే ఆశ్వయుజ శుక్లపక్ష నవమిని ”మహర్నవమి” అంటారు. ”దుర్గాష్టమి”, ”విజయదశమి” లాగే ”మహర్నవమి” కూడా అమ్మవారికి విశేషమైన రోజు అని పండితులు చెబుతున్నారు.

       మహర్నవమి నాడు అమ్మవారిని ”అపరాజిత”గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. కొందరు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజయిన ఈ మహర్నవమి పర్వదినాన ముక్తేశ్వరీ దేవిని అర్చిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ శాక్తేయ సాంప్రదాయులు సిద్ధిధాత్రీ పూజ చేస్తారు.

       మహార్నవమి రోజున ఇతర పిండివంటలతోబాటు చెరుకుగడలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ మొదలైన ప్రదేశాల్లో మహర్నవమి రోజున ”కన్యా పూజ” నిర్వహిస్తారు. నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిదిమంది కన్యా రూపాలు సంకేత పూర్వకంగా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు.

       అమ్మవారికి అభిషేకం చేసి, ముఖాన కుంకుమ దిద్ది, కొత్త బట్టలు సమర్పిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మహర్నవమి నాడు సువాసిని పూజ, దంపతి పూజ జరుపుకుంటారు. ఈ రోజున కుంకుమ పూజ చేయించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు.

       తెలంగాణా ప్రాంతాల్లో మహర్నవమి నాడు బతుకమ్మ పూజ చేసి సరస్వతీ ఉద్యాపన చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో దుర్గాష్టమి రోజున ఆయుధ పూజ చేయగా కేరళ రాష్ట్రంలో మాత్రం మహర్నవమి నాడు ఆయుధ పూజ చేసే సంప్రదాయం కొనసాగుతోంది. నవరాత్రులు ముఖ్యంగా మహర్నవమి సందర్భంగా మైసూరు మహారాజా ప్యాలెస్ ను మహాద్భుతంగా అలంకరిస్తారు.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపము ‘మహాగౌరి’ ( దుర్గ )

శ్లో|| శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః । మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవప్రమోదదా ॥

దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపానికి ‘మహాగౌరి’ అని పేరు. ఈమె పూర్తిగా గౌరవర్ణశోభిత. ఈమె గౌరవర్ణశోభలు మల్లెపూలూ, శంఖం, చంద్రులను తలపింపజేస్తాయి. ఈమె అష్టవర్షప్రాయముగలది (అష్టవర్షభవేద్గౌరీ). ఈమె ధరించే వస్త్రాలూ, ఆభరణాలూ ధవళ కాంతులను వెదజల్లుతుంటాయి. చతుర్భుజ, సింహవాహన. ఒక కుడిచేత అభయముద్రనూ, మరొక కుడి చేతిలో త్రిశూలాన్నీ వహించి ఉంటుంది. ఒక ఏడమచేతిలో డమరుకమూ, మరొక ఎడమ చేతిలో వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈ ముద్రలలో ఈమె దర్శనం ప్రశాంతంగా ఉంటుంది. పార్వతి అవతారంలో ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి కఠోరమైన తపస్సును ఆచరించింది. వ్రియేఽహం వరదం శంభుం నాన్యం దేవం మహేశ్వరాత్ (నారద పాంచరాత్రము) అనేది ఈమె ప్రతిజ్ఞ. భగవంతుడైన శివుణ్ణి పరిణయమాడటానికే దృఢంగా సంకల్పించుకొన్నట్లు తులసీదాస మహాకవి పేర్కొన్నాడు.

జన్మకోటిలగి రగర హమారీ ।  బర ఉఁసంభు న తరహ ఉఁకుఁమారీ ॥

కఠోర తపస్సు కారణాన ఈమె శరీరం పూర్తిగా నలుపెక్కి పోతుంది. ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై, ఈమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన గావిస్తారు. తత్ప్రభావంవల్ల ఈమె శ్వేతవర్ణశోభిత అయి విద్యుత్‍కాంతులను విరజిమ్ముతుంటుంది. అప్పటినుండి ఈమె ‘మహాగౌరి’ అని వాసి గాంచింది.

దుర్గా నవరాత్రోత్సవాల్లో ఎనిమిదవ రోజున మహాగౌరి ఉపాసన విధ్యుక్తంగా నిర్వహించబడుతుంది. ఈమె శక్తి అమోఘమూ, సధ్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషాలన్నీ ప్రక్షాళన చెందుతాయి. వారి పూర్వసంచిత పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. భవిష్యత్తులో కూడా పాపతాపాలుగానీ, దైన్యదుఃఖాలు కానీ వారి దరిజేరవు. వారు సర్వ విధాలా పునీతులై, అక్షయంగా పుణ్య ఫలాలను పొందుతారు.

మహాగౌరీమాతను ధ్యానించటం, స్మరించటం, పూజించటం, ఆరాధించటం, మున్నగు రీతుల్లో సేవించటం వల్ల భక్తులకు సర్వ విధాలైనట్టి శుభాలు చేకూరుతాయి. మనము ఎల్లప్పుడు ఈమెను ధ్యానిస్తూ ఉండాలి. దేవి కృపవల్ల ఎల్లరికీ అలౌకిక సిద్ధులు ప్రాప్తిస్తాయి. మనస్సును ఏకాగ్రచిత్తం చేసి, అనన్య నిష్ఠతో సాధకులు ఈ దేవి పాదారవిందాలను సేవించటంవల్ల వారి కష్ఠాలు మటుమాయమవుతాయి. ఈమె ఉపాసన ప్రభావం వల్ల అసంభవాలైన కార్యాలు సైతం సంభవాలవుతాయి. కనుక సర్వదా సర్వదా ఈమె పాదాలను శరణుజొచ్చటమే కర్తవ్యము. పురాణాలలో ఈమె మహిమలు శతథా ప్రస్తుతించబడ్డాయి. ఈమె సాధకుల మనో వ్యాపారాలను అపమార్గాలనుండి సన్మార్గానికి మరలిస్తుంది. మనం అనన్య భక్తి ప్రపత్తులతో ఈమెకు శరణాగతులమవటం ఎంతో శుభదాయకం.

ఎర్రటి ఎరుపు రంగు, నైవేద్యం : చక్కెర పొంగలి (గుఢాన్నం)(బెల్లమన్నం)

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

‘త్రిరాత్ర వ్రతదీక్ష’

తొమ్మిది రోజులూ దీక్ష పాటించలేనివారు సప్తమి, అష్టమి, నవమి తిథులలో దీక్ష పాటిస్తారు. దీనిని ‘త్రిరాత్ర వ్రతదీక్ష’ అని పిలుస్తారు.

అష్టమి అంటే దుర్గాష్టమిని మహాష్టమి అని కూడా అంటారు. ఆ రోజంతా అష్టమి తిథి ఉంటే దుర్గాష్టమి. అలా కాకుండా అష్టమి వెళ్లి ఆనాడే నవమి తిథివస్తే దానిని మహాష్టమి అంటారు. ఈ దుర్గాష్టమి రోజున అమ్మవారిని సహస్ర నామాలతో, కుంకుమార్చనలతోనూ అర్చిస్తే, సత్ సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ దుర్గాష్టమి రోజు లలితా సహస్ర నామం పఠించేవారికి ఎలాంటి భయాలు దరిచేరవు. నవరాత్రి దీక్షలో మహానవమి మఖ్యమైనవి. మంత్రసిద్ధి జరిగే ఈ రోజుని ‘సిద్దిదా’ అని పిలుస్తారు. నవమి రోజున మహార్నవమిఅంటూ పూజ చేస్తారు. పూర్వకాలంలో జైత్రయాత్రలకు వెళ్ళే రాజులు, చక్రవర్తులు నవమి రోజున ఆయుధ పూజలు చేసేవారు. అలా చేయడంవల్ల వారికి విజయం సంప్రాప్తించేది. కాలక్రమంలో అదే ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఆ రోజు వాహనాలు, యంత్రాలున్నవారు సహస్రనామ పూజగానీ, అష్టోత్తర శతనామ పూజ కానీ చేయడం శ్రేయస్కరం కాగలదు.

దశమి రోజున శమీ పూజ చేస్తారు. దీనిని అపరాజిత పూజ అని కూడా పిల్వడం జరుగుతోంది. ‘శమి’ అంటే జమ్మి. ఈ రోజున జమ్మి చెట్టును పూజిస్తారు. పాండవులు అజ్ఞాత వాసానికి వెళుతూ తమ ఆయుధాలను జమ్మి చెట్టు తొర్రలో దాచారుట. ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు తన గాండీవాన్ని జమ్మి చెట్టుమీద నుంచే తెచ్చుకున్నాడట. తమ కోర్కెలు నెరవేరాలని కోరుకునేవారు తమ గోత్ర నామాలతో శమీపూజ చేయించుకోవడం శ్రేయస్కరం. శమీ పాపాలను నశింపజేస్తుంది. శత్రువులను సంహరిస్తుంది. అంటే శత్రుపీడ లేకుండా చేస్తుంది.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

దుర్గామాత ఏడవ స్వరూపము శక్తి ‘కాళరాత్రి’ ( సరస్వతి )

 శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ ||

వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||

దుర్గామాత ఏడవ స్వరూపము శక్తి ‘కాళరాత్రి’ అనే పేరుతో ఖ్యాతివహించింది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరై ఉంటాయి. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. ఈమెకు గల త్రినేత్రాలు బ్రహ్మాండములాగా గుండ్రనివి. వాటినుండి విద్యుత్కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఈమె నాసికాశ్వాసప్రశ్వాసలు భయంకరములైన అగ్ని జ్వాలలను వెడలగ్రక్కుతుంటాయి. ఈమె వాహనము గార్ధబము లేదా గాడిద. ఈమె తన ఒక కుడిచేతి వరదముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మరోక కుడిచేత అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమచేతిలో ఇనుపముళ్ళ ఆయుధాన్నీ, మరొక ఎడమచేతిలో ఖడ్గాన్నీ ధరించి ఉంటుంది.

కాళరాత్రి స్వరూపము చూడటానికి మిక్కిలి భయానకమైనప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ప్రసాదిస్తుంది. అందువలన ఈమెను ‘శుభంకరి’ అని కూడా అంటారు. కాబట్టి భక్తులు ఈమెను చూసి ఏ భయాన్నిగానీ, అందోళననుగానీ పొందనవసరంలేదు.

దుర్గానవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి మాతను ఉపాసిస్తారు. ఆ రోజు సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమవుతుంది. అతనికి బ్రహ్మాండములలోని సమస్త సిద్ధులూ కరతలామలకములవుతాయి. ఈ చక్రాన స్థిరపడిన సాధకుడి మనస్సు పూర్తిగా కాళరాత్రి స్వారూపంపైనే స్థిరమవుతుంది. ఈమె సాక్షాత్కారం వలన భక్తునికి మహాపుణ్యము లభిస్తుంది. అతని సమస్త పాపాలు, ఎదురయ్యె విఘ్నాలు పటాపంచలైపోతాయి. అతనికి అక్షయ పుణ్యలోప్రాప్తి కలుగుతుంది.

కాళరాత్రి మాత దుష్టులను అంతమొందిస్తుంది. ఈమెను స్మరించినంత మాత్రానే దానవులూ, దైత్యులూ, రాక్షసులూ, భూతప్రేతపిశాచాలూ భయంతో పారిపోవడం తథ్యం. ఈమె అనుగ్రహంవల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. ఈమెను ఉపాసించేవారికి అగ్ని, జలము, జంతువులు మొదలైన వాటి భయం కానీ శత్రువుల భయం కానీ, రాత్రి భయం కానీ – ఏ మాత్రం ఉండవు. ఈమె కృపవల్ల భక్తులు సర్వదా భయవిముక్తులవుతారు.

కాళరాత్రి మాత స్వరూపాన్ని హృదయంలో నిలుపుకొని మనుష్యుడు నిష్ఠతో ఉపాసించాలి. యమ, నియమ సంయమనాలను పూర్తిగా పాటించాలి. త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. ఈ దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించే వారికి కలిగే శుభాలు అనంతాలు. మనం నిరంతరం ఈమె స్మరణ, ధ్యానములను, పూజలనూ చేయటం – ఇహపర ఫల సాధకం.

మెరున్ రంగు (ముదురు ఎరుపు), నైవేద్యం : కదంబం (కూరగాయలతో వండిన అన్నాన్ని)

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)