Categories
Vipra Foundation

గోపాష్టమి విశిష్టత – కార్తీక శుక్లపక్ష అష్టమి (గో పూజ పరదేవతా పూజ)

కార్తీక మాసం లోని ప్రతిరోజు ఏదో ఒక విశేషంతో కూడి యున్నది. గోపాష్టమి దీపావళికి ఎనిమిదో రోజున వస్తుంది. కార్తీక శుద్ద అష్టమి, దీన్నే గోప అష్టమి అని విశేషంగా పిలుస్తారు. గోవు సర్వ దేవతల నిలయం.సకల దేవతలు వివిధ భాగాలలో కొలువై ఉంటారు.గోవుకి ప్రదక్షిణలు చేసి, గోవు యొక్క ప్రుష్ఠ భాగం అనగా వెనక తోక భాగం వైపుకి వెళ్ళి పసుపు, కుంకుమలు సమర్పణ చేసి వీలయితే అరటి పళ్ళు కాని, నీటిలో నాన బెట్టిన నవ ధాన్యాలను బెల్లం తో కలిపి పెట్టడం వల్ల నవగ్రహాలతో పాటు సకల దేవుళ్ళ అనుగ్రహము కలుగుతుంది. వాస్తవానికి గోవు అన్నది బ్రహ్మ సృష్టిలో లేదు.గోవుని అష్ట వసువులు వేల సంవత్సరాల యజ్ణము చేసిన తర్వాత ఉద్భవించిన మాతృ స్వరూపం.తర్వాత గోవు సకల దేవతలకు నియమం అయింది. ఒక్కో భాగం మీద ఒక్కో దేవిదేవతలూ ఆశీనులై ఉంటారు.గోవును సందర్శన చేసినప్పుడు కామధేను స్తుతి కాని ఎదైనా గోవు యొక్క నామం కాని జపం చేయాలి.గోవుకి ఏదైనా తినిపిస్తే అది సకల దేవతలకు ఆరగించిన ఫలితాన్నిస్తున్నది.

గోపూజ పశు పూజ కాదు. అది పరదేవతకు పూజ చేయడం. చతుర్ముఖ బ్రహ్మ సృష్టిలో అన్ని ప్రాణులు వచ్చాయి. గోవు ఒక్కటి మాత్రం బ్రహ్మ సృష్టిలోనిది కాదు. అష్ట వసువులూ ఒక్క సంవత్సరం పాటు హోమం చేసి, ఆ తపశ్శక్తి చేత ఒక గోవును సృష్టించారు. ఆ గోవు యొక్క సంతానంగా ఇవాళ ఇన్ని గోవులు వచ్చాయి.

వేదం గోవుని ఏమని చెప్పిందంటే “గౌరగ్నిహోత్రః” అంది. గోవు “అగ్నిహోత్రము”. అగ్ని స్వరూపమే గోవు. అంటే అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో, గోవు కూడా అంత ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు. మీరు ప్రతీ రోజూ యజ్ఞం చేసి అగ్నిహోత్రం యొక్క అనుగ్రహం పొందడం ఎంత కష్టమో, అంత తేలికగా పొందడానికి అవకాశం గోపూజ.

గోవు పృష్ట భాగమునందు కాస్త పసుపు, కుంకుమ వేసి నమస్కారం పెడితే లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలు అవుతుంది. లక్ష్మీదేవి ఉండే స్ధానములు ఐదే. 1.ఏనుగు కుంభస్థలం 2.ఆవు వెనక తట్టు 3.తామరపువ్వు 4.బిళ్వదళం వెనుక ఈనెలు ఉండే భాగం 5.సువాసిని పాపట ప్రారంభస్ధానం. అందుకే గోవుని ఆరాధన చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

ఒక్క గోదానానికి మాత్రం వేదం ఏం చెప్పిందో తెలుసా! గోవుని దానం చేస్తే పుచ్చుకున్నవాడు వెయ్యి గోవులు పుచ్చుకున్నాడని, మీరు వెయ్యి గోవులు ఇచ్చారని వేస్తారు. గో సహస్రమని తప్ప, ఒక్క గోవుని దానం చేసాడని వెయ్యరు. ఒక్క గోదానంలోనే ఆ గొప్పతనం.

మీకొక రహస్యం చెప్పనా! గోసేవ చేసాడనుకోండి, గోగ్రాసం పెట్టాడనుకోండి. అంటే కాసిన్ని పచ్చగడ్డి గోవుకి తినిపించి, ప్రదక్షిణం చేసి, గంగడోలు ఇలా దువ్వి, గోవు పృష్టభాగంలో పసుపు, కుంకుమ వేసి వెళితే ఏం చేస్తారని చెప్పిందో తెలుసా వేదం! ఆయన సేవించిన ఆవు శరీరానికి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్కపెడతాడు. ఒక్కొక్క వెంట్రుకని ఒక్కొక్క సంవత్సరంగా తీసుకుని ఆ సంవత్సరంలో ఈయన నూరు యజ్ఞాలు చేసారని లెక్క వేస్తారు.

“కామాక్షి పరదేతకు అరటిపండు తినిపించడం సాధ్యంకాదు. కానీ పరదేవతకు అరటిపండు తినిపిస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక్క గోవుకు అరటిపండు తినిపిస్తే అంత ఫలితమూ వస్తుంది”.

**గవో మేచాగ్రతో నిత్యం! గావః పృష్టత ఏవచ!

గావో మే హృదయేచైవ! గవాం మధ్యే వసామ్యహం!**

భావముగోవులు నా ఎదుట, నా వెనుక, నా హృదయమునందు నిత్యము ఉండుగాక, నేను ఎప్పుడూ గోవుల మధ్య ఉందును గాక (స్కాంద పురాణాంతర్గతము).

శ్రీ కృష్ణ భగవానుడు గోపూజ చేసి మనకు తరుణోపాయం చూపారు. అందుకే గోపూజ చేసిన వారికి మోక్షం సులభ సాధ్యము. గోవు సమస్త దేవతా స్వరూపము.

గోమహత్యము :

గోపాదాలు – పితృదేవతలు,

పిక్కలు – గుడి గంటలు,

అడుగులు – ఆకాశగంగ,

కర్ర్ఇ – కర్ర్ఏనుగు,

ముక్కొలుకులు – ముత్యపు చిప్పలు,

పొదుగు – పుండరీకాక్షుడు,

స్తనములు- చతుర్వేదములు,

గోమయము – శ్రీ లక్ష్మి,

పాలు – పంచామృతాలు,

తోక – తొంబది కోట్ల ఋషులు,

కడుపు – కైలాసము,

బొడ్డు – పొన్నపువ్వు,

ముఖము – జ్యేష్ఠ,

కొమ్ములు – కోటి గుడులు,

ముక్కు – సిరి,

కళ్ళు – కలువ రేకులు,

వెన్ను – యమధర్మరాజు,

చెవులు – శంఖనాదము,

నాలుక – నారాయణ స్వరూపము,

దంతాలు – దేవతలు,

పళ్ళు – పరమేశ్వరి,

నోరు – లోకనిధి.

ప్రాతఃకాల గో దర్శనం శుభప్రదము.

పూజించుట మోక్షప్రదము.

స్పృశించుటచే ఉత్తమ తీర్థ స్నాన ఫలము కలుగుతుంది.

ఉదయాన్నే లేచి గో మహాత్మ్యాన్ని పఠిస్తే సకల పాపాలు తొలిగిపోతాయి.

అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, తెలిసీ తెలియక చేసిన పాపాలు నశిస్తాయి.

మధ్యాహ్న కాలములో పఠిస్తే వెయ్యి గుళ్ళల్లో దీపారాధన చేసిన ఫలము, జన్మాంతరము ఐదోతనము ఇచ్చునట్లు, రాత్రి పూటపఠిస్తే యమబాధలు వుండవు.

గోమహాత్మ్యాన్ని ఒకసారి పఠించినవారికి మూడు నెలల పాపము, సంధ్యవేళ గోమహాత్మము పఠించిన వారి ఇంటికి శ్రీ మహాలక్ష్మి స్వయముగా విచ్చేస్తుంది.

కాళరాత్రి గోమాహాత్మ్యము పఠిస్తే కాలయముని భయము దూరమవుతుంది.

నిత్యము గోమాహాత్మ్యము పఠించిన వారికి నిత్యము చేసిన పాపములు దూరమవుతాయి.

విన్నవారికి విష్ణులోకము చెప్పిన వారికి పుణ్యలోకము ప్రాప్తిస్తాయి.

ఎదురుగా కదలాడే తల్లి, తండ్రి, గురువు, గోమాత వంటి ప్రత్యక్ష దైవములను గుర్తించలేక దేవుడెక్కడున్నాడు అనుకొనే అజ్ణానులము మనము, కనుక మిత్రులారా మనము చేయవలసినది కేవలము చదవటము మాత్రమే, చదివి పుణ్యమును సంపాదించుకోవటము ఎంతసులభము.

ఓం కామధేనవే నమః

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం ఏడో అధ్యాయం : శివకేశవార్చన విధులు

             కార్తీకమాసానికి సంబంధించి వశిష్టులవారు జనకమహారాజుకు ఇంకా ఇలా చెబుతున్నారు…

 “ఓ రాజా! కార్తీక మాసం, దాని మహత్యం గురించి ఎంత తెలిసినా… ఎంత చెప్పినా తనివి తీరదు. ఈ మాసంలో శ్రీమహావిష్ణువును సహస్ర కమలాలతో పూజించినవారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. తులసీదళాలతోగానీ, సంహస్రనామ పూజ చేసినవారికి జన్మరాహిత్యం కలుగుతుంది. కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకింద సాలగ్రామం పెట్టి భక్తితో పూజించిన వారికి మోక్షం కలుగును. అలాగే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టుకింద భోజనం పెట్టి, తను తినిన సర్వపాపాలు తొలగిపోవును.

       కార్తీకమాసంలో దీపారాధనకూ ప్రత్యేక స్థానముందని ఇదివరకే చెప్పాను. అయితే అలా రోజూ దీపారాధన చేయలేనివారు ఉదయం, సాయంత్రం వేళల్లో ఏదైనా గుడికి వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారాలు చేసినా… వారి పాపాలు నశించును. సంపత్తిగలవారు శివకేశవుల ఆలయాలకు వెళ్లి భక్తితో దేవతార్చన చేయించినట్లయితే… వారికి అశ్వమేథ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. అంతే కాకుండా వారి పితృదేవతలకు కూడా వైకుంఠం ప్రాప్తి కలుగుతుంది. శివాలయానికి గానీ, విష్ణువు ఆలయానికి గానీ జంఢా ప్రతిష్టించాలి. అలా చేసినవారి దరిని కూడా యమ కింకరులు సమీపించలేరు. కోటి పాపాలైనా… సుడిగాలిలా కొట్టుకుపోతాయి.

       ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవుపేడతో అలికి, వరిపిండితో శంఖు చక్ర ఆకారాలతో ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి, వాటిపై నిండా నువ్వుల నూనె పోసిన దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం రాత్రింబవళ్లు ఆరకుండా చూడాలి. దీనినే నంద దీపం అంటారు. ఈ విధంగా చేసి, నైవేద్యం పెడుతూ… కార్తీకపురాణం చదివినట్లయితే.. హరిహరులు ఇద్దరూ సంతసిస్తారు. అలా చేసిన వ్యక్తి కైవల్యం పొందుతాడు. అందుకే కార్తీకమాసంలో శివుడిని జిల్లేడుపూలతో అర్చిస్తారు. దీనివల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది. సాలగ్రామానికి ప్రతినిత్యం గంధం పట్టించి, తులసిదళంతో పూజించాలి. ఏ మనిషీ ధనబలం కలిగి ఉంటాడో… అతను ఆ మాసంలో పూజాదులు చేయడో… అతను మరుజన్మలో కుక్కలా పుట్టి, తిండి దొరక్క ఇంటింటికీ తిరిగి, కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో మరణాన్ని పొందుతాడు. కాబట్టి కార్తీకమాసంలో నెలరోజులై పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైనా చేస్తే… అవి విశకేశవులను పూజించిన ఫలితాన్నిస్తుంది. అందుకే ఓ మహారాజ… నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు” అని చెప్పారు.

నమ శివాభ్యం నవ యౌ వనాభ్యాం పరస్ప రాశ్లి ష్ట వపుర్ధ రాభ్యాం

నాగేంద్ర కన్యా వృష కేత నాభ్యం నమో నమ శంకర పార్వతీ భ్యాం”

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి సప్తమధ్యాము – సప్తమదిన పారాయణము సమాప్తం

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం ఆరో అధ్యాయం : దీపారాధన విధి, మహత్యం

       తిరిగి వశిష్టుడు ఇలా చెబుతున్నాడు. ”ఓ రాజ శేష్ట్రుడా! ఏ మానవుడు కార్తీక మాసంలో క్రమం తప్పకుండా రోజూ పరమేశ్వరుని, శ్రీ మహా విష్ణువును, పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తాడో… వాడు అశ్వమేథ యాగం చేసినంత పుణ్యం సంపాదిస్తాడు. అలాగే ఎవరైతే కార్తీకమాసమంతా దేవాలయంలో దీపారాధన చేస్తారో… వారికి కైవల్యం ప్రాప్తిస్త్తుంది. దీంతోపాటు దీపదానం కూడా ఈ నెలలో పుణ్యలోకాలను కలుగజేస్తుంది. దీపదానానికి సంబంధిత వ్యక్తి తనంతట తాను స్వయంగా పత్తిని తీసి, శుభ్రపరిచి, వత్తులు చేయాలి. వరిపిండితో ప్రమిదను చేసి, వత్తులు అందులో వేసి, నేతితో దీపాన్ని వెలిగించాలి. ఆ ప్రమిదను బ్రాహ్మణుడికి దానమివ్వాలి. శక్తికొలది దక్షిణ సైతం ఇవ్వాలి. ఇలా ప్రతిరోజూ చేస్తూ… కార్తీక మాసం ఆఖరిరోజున వెండితో చేసిన ప్రమిదలో, బంగారంతో వత్తిని చేయించి, ఆవునెయ్యిపోసి దీపం వెలిగించాలి. పిండి దీపాన్ని ప్రతిరోజూ ఏ బ్రాహ్మణుడికి దానం చేస్తున్నారో… వెండి ప్రమిదను సైతం చివరిరోజు అదే బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల సకలైశ్వర్యములు పొందడమే కాకుండా, మరణానంతరం మోక్షాన్ని పొందగలరు” అని వివరించారు. దీపదాన సమయంలో కింది స్త్రోత్రాన్ని పఠించాలి.

శ్లో|| సర్వ జ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సు ఖవాహం

దీపదానం ప్రదాస్యామి శాంతి రాస్తూ సదామమ||

       “అన్ని విధముల జ్ఞానం కలుగ చేయునదియు, సకల సంపదలు నిచ్చునది యగును ఈ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక!” అని పై శ్లోకానికి అర్థం. దీపదానం తంతు పూర్తయ్యాక బ్రాహ్మణ సమారాధన చేయాలి. అంత శక్తిలేనివారు కనీసం పదిమంది బ్రాహ్మణులను భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. పురుషులుగాని, స్త్రీలుగాని ఎవరైనా ఈ దీపదానం చేయవచ్చు. ఇది సిరి సంపదలు, విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగిన సుఖాలను అందజేస్తుంది. దీనిని గురించి ఒక ఇతిహాసం ఉంది” అంటూ వశిష్టులవారు ఇలా చెబుతున్నారు.

లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట

       పూర్వ కాలమున ద్రావిడ దేశంలో ఒక గ్రామాన ఒక స్త్రీ ఉంది. ఆమెకు పెండ్లి అయిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. దీంతో ఆమె ఇల్లుల్లూ తిరిగి, పాచిపని చేస్తూ జీవనం గడపసాగింది. తాను పనిచేసే ఇళ్లలోనే యజమానులు పెట్టింది తినేది. ఏమైనా మిగిలినా, ఎవరైనా వస్తువులిచ్చినా… దాన్ని ఇతరులకు విక్రయించి, సొమ్ము కూడబెట్టుకునేది. ఆ విధంగా కూడబెట్టిన మొత్తాన్ని వడ్డీలకు ఇస్తుండేది. అయితే ఆమెకు దైవభక్తి అనేది లేదు. ఒక్కదినమైననూ ఉపవాసమున్న దాఖలాలు లేవు. దేవుడిని మనసారా ధ్యానించి ఎరుగదు. పైగా వ్రతాలు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూసి, అవహేళన చేసేది. ఏనాడు బిక్షగాడికి పిడికెడు బియ్యం పెట్టక, తనూ తినక ధనాన్ని కూడబెట్టసాగింది.

        అలా కొంతకాలం గడిచింది. ఒకరోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించేందుకు బయలుదేరి, మార్గమధ్యంలో ఈ స్త్రీ ఉండే గ్రామానికి వచ్చాడు. ఆ రోజు అక్కడొక సత్రంలో మజిలీ చేశాడు. అతడు ఆ గ్రామ మంచిచెడులు తెలుసుకుంటూ… ఆ స్త్రీని గురించి తెలుసుకున్నాడు. ఆమె వద్దకు వెళ్లి ”అమ్మా… నా మాటలు విను. నీకు కోపం వచ్చినా సరే. నేను చెబుతున్న మాటల్ని ఆలకించు. మన శరీరాలు శాశ్వతాలు కాదు. నీటి బుడగల వంటివి. ఏ క్షణంలోనైనా పుటుక్కుమనొచ్చు. ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకుపోతుందో ఎవరూ చెప్పలేరు. పంచభూతాలు, సప్తధాతువులతో నిర్మితమైన ఈ శరీరంలో ప్రాణం, జీవం పోగానే చర్మం, మాంసం కుళ్లిన దుర్వాసనలతో అసహ్యంగా తయారవుతుంది. అలాంటి శరీరాన్ని నీవు నిత్యం అని భ్రమిస్తున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన. బాగా ఆలోచించు. అగ్నిని చూసిన మిడత అది తినే వస్తువు అనుకుని, ఉత్సాహంగా వెళ్తుంది. కానీ, దగ్గరకు వెళ్లే వరకు తెలియదు. అప్పటికే జరగాల్సింది జరిగిపోతుంది. ఆ మిడత బూడిదవుతుంది. మనుషులు కూడా అలాగే ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారంలోపడి నశిస్తున్నారు. కాబట్టి నామాట విను. ఇప్పటికైనా నువ్వు సంపాదించినదాంట్లో కొంత దానధర్మాలు చేసి, పుణ్యాన్ని సంపాదించు. ప్రతిరోజూ శ్రీమన్నారాయుణుడిని స్మరించు. వ్రతాలు చేయి. మోక్షాన్ని పొందవచ్చు. నీ పాప పిరహారార్థంగా వచ్చే కార్తీక మాసంలో వ్రతాన్ని పాటించు. రోజూ ఉదయాన్నే నిద్రలేచి, సాన్నమాచరించి, దాన ధర్మాలతో బ్రాహ్మణులను సంతుష్టపరుచు. నువ్వు ముక్తిని పొందగలవు” అని సూచించాడు.

       ఆ బ్రాహ్మడు చెప్పిన మాటల్ని బుద్ధిగా విన్న ఆ వితంతువు ఆ రోజు నుంచి మనసు మార్చుకుని, దానధర్మాలను చేస్తూ… కార్తీక వ్రతం ఆచరించింది. ప్రతిరోజూ దీపారాధన చేయడంతోపాటు, యథాశక్తి దీపదానం చేసింది. దీంతో ఆమెకు జన్మరాహిత్యమై మోక్షాన్ని పొందింది. “కాబట్టి రాజా… కార్తీక మాసంలో ప్రతిరోజూ ఒక పర్వదినమే. ప్రతి కార్యం మోక్షదాయకమే” అని జనకుడు తెలిపాడు.

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య షష్ట్యమాధ్యాయో సంపూర్ణ:

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకంలో ఛట్ పూజ “సూర్య షష్ఠి”

       కార్తీకమాసంలో జరుపుకునే పూజ ఛట్ పూజ. ఛట్ పూజను దళ ఛట్, ఛతి, సూర్య షష్ఠి అని కూడా అంటారు. మన ప్రాచీన పండుగల్లో ఛట్ పూజ ఒకటి. భూమ్మీద తమకు మనుగడ కల్పిస్తున్న సూర్యభగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆయురారోగ్య, ఆనందాలను ప్రసాదించమని ప్రార్ధిస్తారు. సూర్యుని ఆరాధించడంవల్ల కుష్టు వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమౌతాయని నమ్ముతారు. తాము, తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. మనదేశంలో ఉత్తరాదిన ఈ ఛట్ పూజ ఎక్కువగా జరుపుకుంటారు.

       ఛట్ పూజ కార్తీకమాసం శుక్ల షష్ఠి నాడు జరుపుకుంటారు. షష్టినాడు జరుపుకునే పండుగ, సూర్యుని ఆరాధించే పండుగ కనుక సూర్య షష్ఠి అంటారు. కొందరు ఈ ఛట్ పూజను కార్తీక షష్ఠికి రెండు రోజులు మొదలుపెట్టి, రెండురోజుల తర్వాతి వరకు అంటే నాలుగురోజులపాటు జరుపుకుంటారు. పవిత్ర నదిలో పుణ్యస్నానం చేస్తారు. నీటిలో వీలైనంత ఎక్కువసేపు నిలబడి సూర్యభగవానుని ఆరాధిస్తారు. దీపాలు వెలిగిస్తారు. పండ్లు, ఫలాలు ప్రసాదంగా సమర్పిస్తారు.

       ఛట్ పూజ చేసేవారు ఉపవాసం ఉంటారు. కొందరైతే దీక్షబూని 36 గంటల పాటు కనీసం నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. ఛట్ పూజ జరుపుకున్నవారు కపటం లేకుండా నిజాయితీగా ఉంటారు. ఆడంబరాలకు దూరంగా గడుపుతారు. మంచంమీద కాకుండా నేలమీద ఒక దుప్పటి పరచుకుని పవళిస్తారు.

పాండవులు, ద్రౌపది ఛట్ పూజ చేసినట్లు మహాభారతంలో కథనాలు ఉన్నాయి.

        బీహార్, జార్ఖండ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, చండీగఢ్, గుజరాత్, గయ, రాంచీ, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ప్రముఖంగా జరుపుకుంటారు. మనదేశంలో సంస్కృతీ సంప్రదాయాలు కొంతవరకూ తగ్గుతుండగా ఇక్కణ్ణుంచి వెళ్ళి ఇతర దేశాల్లో నివసిస్తున్న మనవాళ్ళు హిందూ పండుగలు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఛట్ పూజను సైతం విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు వేడుక చేసుకుంటున్నారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం అయిదో అధ్యాయము : వనభోజన మహత్యం

       వశిష్టుడు తిరిగి జనకమహారాజుతో ఇలా అంటున్నాడు… ”ఓ జనక మహారాజా! కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయమున నందు గాని విష్ణాలయము నందు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము తప్పక చేయాలి. అలా చేసినవారి సర్వ పాపములును నివృతియగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్తారు. భగవద్గీత కొంత వరకు పఠించిన వారికీ విష్ణు లోకం ప్రాప్తిస్తుంది. ఒక్క శ్లోకములో ఒక్క పదమైననూ కంఠస్థం చేసినట్లయితే విష్ణు సాన్నిధ్యం పొందుతారు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరి కాయలతో నిండిఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యదోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడన భోజనం చేయాలి. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షణ తాంబూలములతో సత్కరించి నమస్కరించాలి. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణకాలక్షేపం చేయాలి. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మంపోయి నిజ రూపం కలిగింది” అని చెప్పారు. అది విన్న జనకుడు ”ముని వర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మం ఎలా కలిగింది? దానికి గల కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. దానికి వశిష్టుడు ఇలా చెబుతున్నాడు…

కిరాతుడు, ఎలుకలకు మోక్షం

       రాజా! కావేరి నదీ తీరంలో ఒక గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడున్నాడు. ఆయనకో కొడుకున్నాడు. అతని పేరు శివశర్మ. చిన్నతనం నుంచి భయం భక్తి లేక గారాబంగా పెరిగాడు. దీనివల్ల నీచ సహవాసాలు అలవాటయ్యాయి. అతని దురాచారాలు చూసిన తండ్రి ఒకరోజు అతన్ని పిలిచి ”బిడ్డా…! నీ అపచారాలకు అంతు లేకుండా పోతోంది. నీ గురించి ప్రజలు ఎన్నో రకాలుగా చెప్పుకొంటున్నారు. నన్ను నిలదీస్తున్నారు. నీ వల్ల వస్తున్న నిందలకు నేను సిగ్గుపడుతున్నాను. నలుగురిలో తిరగలేకపోతున్నాను. కనీసం ఈ కార్తీక మాసంలోనైనా నువ్వు బుద్ధిగా ఉండు. నదిలో స్నానం చేయి. శివకేశవులను స్మరించి, సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చేయి. నీ పాపాలు తొలగిపోయే అవకాశాలుంటాయి. నీకు మోక్షం ప్రాప్తిస్తుంది” అని చెప్పాడు. దానికి ఆ పిల్లాడు మూర్ఖంగా… ”స్నానం చేస్తే మురికి పోతుంది. అంతే…! దానికి వేరే ఏమైనా వస్తుందా? స్నానం చేసి పూజ చేస్తే దేవుడు కనిపిస్తాడా? గుళ్లో దీపం పెడితే లాభమేమిటి? ఇంట్లో పెడితే వెలుగైనా వస్తుంది కదా?” అని ఎదురు ప్రశ్నలు వేశాడు.

       దాంతో ఆ బ్రాహ్మడు ”ఓరీ నీచుడా! కార్తీక మాస ఫలాన్ని ఎంత చులకన చేస్తున్నావు. నీ అంతటి కొడుకు నాకెందుకు? నీవు అడవిలో ఉన్న రావిచెట్టు తొర్రలో ఎలుక రూపంలో బదుకుదువుగాక” అని శపించాడు. ఆ శాపంతో గజగజా వణికిపోయిన శివశర్మ తండ్రి పాదాలపై పడి… ” నన్ను క్షమించండి. అజ్ఞానాంధకారంలో పడి దైవాన్ని, దైవకార్యాలను చులకన చేశాను. నాకు ఇప్పుడు పశ్చాత్తాపమైంది. నాకు శాపవిమోచనం చెప్పండి” అని కోరాడు. అంతట ఆయన ” బిడ్డా! నా శాపం అనుభవించక తప్పదు. అయితే నీవు ఎలుక రూపంలో ఉన్నా.. కార్తీక మహత్యాన్ని వింటే నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తిని పొందుతావు” అని ఊరడించాడు.

       తండ్రి శాపంతో శివశర్మ ఎలుక రూపాన్ని ధరించి, అడవికి పోయి, చెట్టు తొర్రలో నివసిస్తూ, పండ్లు తింటూ బతకసాగాడు. కావేరీ నదీతీరాన ఉన్న రావిచెట్టు తొర్రలో అతను నివాసమేర్పరుచుకోవడం వల్ల నదీస్నానానికి వచ్చేవారు అక్కడున్న వృక్షం కింద విశ్రమించేవారు. నదీ స్నానం చేసేవారు రామాయణ, మహాభారతాలు, పురాణగాథల్ని చెప్పుకొనేవారు. కార్తీకమాసంలో ఒకానొకరోజున మహర్షి విశ్వామిత్రుడు తన శిష్యులతో కలిసి అక్కడకు వచ్చాడు. ప్రయాణ బడలిక వల్ల ఆ రావిచెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో తన శిష్యులకు కార్తీకపురాణ విశేషాన్ని బోధిస్తున్నారు. చెట్టు తొర్రలో ఎలుక రూపంలో ఉన్న శివశర్మ కూడా ఆ కథను విన్నాడు. రుషిదగ్గర ఉన్న పూజా సామాగ్రిలో తినేందుకు ఏమైనా దొరుకుతుందేమోనని చెట్టు మొదట నక్కి చూస్తున్నాడు.

అంతలో ఒక కిరాతకుడు చెట్టుకింద ఉన్నవారిని దూరం నుంచి చూసి ”ఓహో… ఈ రోజు నా పంట పండింది. ఈ బాటసారులను దోచుకుంటే డబ్బేడబ్బు” ఆలోచించసాగాడు. అతనలా ఆలోచిస్తూ దగ్గరకు వచ్చేసరికి మునులను చూశాడు. ఒక్కసారిగా అతని బుద్ధి మారిపోయింది. వారందరికీ నమస్కరించి ”మహానుభావులారా…! మీరెవరు? ఎందుకు ఇక్కడకు వచ్చారు? మీ దివ్య దర్శనంతో నా మనసు పులకించిపోతోంది” అని అన్నాడు. అంతట విశ్వామిత్రుడు ” ఓ కిరాతకా! మేం కావేరీ నదీ స్నానమాచరించేందుకు ఇక్కడకొచ్చాం. ఇప్పుడు కార్తీక పురాణం పఠిస్తున్నాం. నువ్వుకూడా ఇక్కడ కూర్చొని వినవచ్చు” అన్నారు.

       అటు ఎలుక, ఇటు కిరాతకుడు శ్రద్ధగా కథ వినసాగారు. కథ వింటుండగా… కిరాతకుడికి తన పూర్వజన్మ వృంతాతమంతా జ్ఞాపకమొచ్చింది. పురాణ శ్రవణం తర్వాత రుషులకు దండం పెట్టి, సాష్టాంగం చేసి, వెళ్లిపోయాడు. ఎలుక కూడా పురాణమంతా వినడం, చెట్టుకింద దొరికిన ఫలాలను బుజించడం వల్ల తన స్వరూపాన్ని పొందగలిగింది. ఎలుక రూపం నుంచి విముక్తి పొందిన శివశర్మ విశ్వామిత్రుడితో ”మునివర్యా! ధన్యుడనయ్యాను. మీ వల్ల నేను మూషిక రూపం నంచి విముక్తి పొందాను” అని తన వృత్తాంతమంతా చెప్పాడు.

        “కాబట్టి జనకమహారాజా…! ఈ లోకంలో సిరిసంపదలు, పరమున మోక్షాన్ని కోరేవారు తప్పక ఈ కార్తీక పురాణాన్ని చదివి, ఇతరులకు వినిపించాలి. బంధుమిత్రులతో కలిసి వనభోజనమాచరించాలి” అని వివరించారు.

            స్కాంధపురాణాంతర్గతమైన కార్తీక మహత్యం అయిదో అధ్యాయం సంపూర్ణం

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం నాలుగో అధ్యాయము : దీపారాధన మహిమ

       వశిష్టుడిని చూసి జనక మహారాజు తిరిగి ఇలా అడుగుతున్నాడు. “మీరు చెబుతున్న ఇతిహాసాలు వినేకొద్దీ ఆసక్తి కలిగిస్తున్నాయి. మీరు చెబుతున్న విషయాలు వినేకొద్దీ తనివి తీరకున్నట్లే ఉన్నది. కార్తీకమాసంలో ప్రధానంగా ఎలాంటి పనులు చేయాలి? ఎవరిని ఉద్దేశించి పూజలు చేయాలో వివరించండి ప్రభూ…!” అని ప్రార్థించాడు.

       జనకుడి కోరికను మన్నించిన వశిష్టమహాముని ఇలా చెబుతున్నారు… ”ఓ జనకా! కార్తీక మాసంలో సర్వ సత్కార్యాలూ చేయొచ్చు. దీపారాధన అనేది అత్యంత ముఖ్యమైనది. అత్యంత ఫలితాన్ని ఇచ్చేది ఇదే. సూర్యాస్తమయ సమయంలో అనగా… సంధ్యవేళ శివకేశవుల సన్నిధిలోగానీ, తలుపుల దగ్గరగానీ దీపాలు వెలిగించిన వారి సర్వపాపాలు తొలగిపోతాయి. కార్తీకంలో దీపారాధన అనేది వైకుంఠ ప్రాప్తికి తొలిమెట్టులాంటిది. ఆవునేయితోగానీ, కొబ్బరినూనెగానీ, విప్పనూనె, అది లేనప్పుడు ఆముదముతోనైనా దీపాలను వెలిగించాలి. దీపారాధన ఏ నూనెతో చేసినా… ఆ ఫలితం ప్రాప్తిస్తుంది. ఇందుకు ఒక చక్కటి కథ ఉంది. చెబుతాను. శ్రద్ధగా విను.. ” అని ఇలా చెప్పసాగాడు…

శతృజిత్ కథ

       పూర్వము పాంచాల దేశాన్ని ఏలుతున్న రాజుకు సంతానం లేకపోవడంతో అనేక యజ్ఞ యాగాలు చేశాడు. చివరకు విసుగు చెంది గంగానదీ తీరంలో తపస్సు చేయసాగాడు. అంతట ఓ మునిపుంగవుడు అటుగా వచ్చి… ”ఓ పాంచాల రాజా…! నీకెందుకీ తపస్సు? నీ కోరిక ఏమిటి?” అని ప్రశ్నించాడు. దానికి పాంచాల రాజు ”మునిపుంగవా… నాకు అష్టైశ్వర్యాలు, రాజ్యం, సంపదనా ఉన్నాయి. అయితే నా వంశాన్ని నిలిపేందుకు పుత్ర సంతానం లేదు. అది నన్ను కృంగి కృశించేలా చేస్తోంది. అందుకే ఈ తీర్థంలో నేను తపస్సు చేస్తున్నాను” అని చెప్పాడు. అంతట ఆ ముని ”ఓయీ…! కార్తీక మాసంలో శివ సన్నిధిలో శివుడికి ప్రీతిగా దీపారాధన చేయి. నీకోరిక నెరవేరగలదు” అని చెప్పి వెళ్లిపోయాడు.

పాంచాలరాజు వెంటనే తన దేశానికి వెళఙ్ల పుత్రసంతానం కోసం అత్యంత భక్తిశ్రద్ధలతో కార్తీక మాసంలో నెలరోజులూ దీపారాధన చేయించి, దాన ధర్మాలు చేస్తూ నియమంగా వ్రతం ఆచరించాడు. ఆ పుణ్యకార్యం వల్ల రాజు భార్య గర్బం దాల్చింది. నవమాసాలు నిండిన తర్వాత ఒక శుభముహూర్తాన కొడుకుని కన్నది. రాజకుటుంబీకులు ఎంతో సంతోషంతో దేశమంతటా పుత్రోత్సవం చేయించారు. బ్రాహ్మణులకు దానధర్మాదులు చేశారు. ఆ పిల్లవాడికి ‘శతృజిత్’ అని పేరుపెట్టారు. ఎంతో గారాబంగా పెంచసాగారు. కార్తీకమాసంలో దీపారాధన వల్ల పుత్రసంతానం కలిగినందువల్ల తన దేశమంతటా ప్రతియేడు కార్తీకమాస వ్రతాలు, దీపారాధన చేయించాలని ఆదేశించాడు.

       శతృజిత్ అలా దినదినప్రవర్తమానమగుచూ… సకల శాస్త్రాలు అభ్యసించాడు. ధనుర్విద్య, కత్తిసాము తదితర విద్యల్లో ఆరితేరాడు. అయితే… యవ్వనంలోకి ప్రవేశించగానే… తల్లిదండ్రుల గారాబం, దుష్టుల సహవాసం వల్ల తన కంటికి నచ్చిన స్త్రీలను బలాత్కరించుచూ, వారి మానాన్ని దోచుకోసాగాడు. అతన్ని ఎదిరించిన వారిని దండించసాగాడు. అలా తన కామవాంఛ తీర్చుకొంటూ లోకకంటకుడిగా మారాడు.

       తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన సంతానమని అతని తప్పులను చూసీచూడనట్లు వినీ విననట్లు ఉండసాగారు. శత్రుజిత్ ఆ రాజ్యంలో తన కార్యాలకు అడ్డుచేప్పేవారిని నరుకుతానని కత్తిపట్టుకుని తిరుగుతూ ప్రజల్ని భయకంపితులను చేశాడు. ఒకరోజు అతనికి ఒక బ్రాహ్మణ పడుచు కనిపించింది. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుడి భార్య. అమిత రూపవతి. ఆమె అందచందాలను వర్ణించడం మన్మథుడి తరమూ కాదు. ఆమెను చూడాగానే రాకుమారుడు కొయ్యబొమ్మలా నిశ్చేష్టుడై కామవికారంతో నిల్చుండిపోయాడు. ఆమెవద్దకు వెళ్లి తన కామవాంఛను తెలిపాడు. ఆమె కూడా అతని సౌందర్యానికి మోహితురాలైంది. కులం, శీలం, సిగ్గు విడిచి అతని చేయి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకుని పోయి భోగాలను అనుభవించింది.

       ఇలా ఒకరికొకరు ప్రేమపరవశంతో ప్రతిరోజూ అర్ధరాత్రివేళలో అజ్ఞాత ప్రదేశంలో కలుసుకునేవారు. కొంతకాలం తర్వాత ఆ సంగతి ఆ బ్రాహ్మణుడికి తెలిసింది. దీంతో తన భార్యను, రాకుమారుడిని ఒకేసారి చంపాలని నిర్ణయించుకున్నాడు. ఒక కత్తి సంపాదించి, సమయం కోసం నిరీక్షించసాగాడు. ఆ రోజు కార్తీక పౌర్ణమి. ఆ ప్రేమికులిద్దరూ పాడుబడ్డ శివాలయంలో కలుసుకోవాలని అనుకున్నారు. అర్ధరాత్రి వారు రహస్య మార్గంలో వెళ్లారు. ఈ సంగతిని పసిగట్టిన ఆ బ్రాహ్మణుడు సైతం అంతకు ముందే కత్తితో అక్కడ సిద్ధంగా ఉండి, గర్భగుడిలో నక్కి కూర్చున్నాడు. కాముకులిద్దరూ గాఢాలింగనం చేసుకుని, చీకటిగా ఉన్నందున దీపం పెట్టాలని అనుకున్నారు. అంతట ఆమె తన పైట చెంగును చించగా, ఇద్దరూ కలిసి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించారు. ఆ తర్వాత వారిద్దరూ మహదానందంతో రతిక్రీడలు సల్పుకొన్నారు. అదే అదునుగా భావించిన ఆ బ్రాహ్మనుడు తన కత్తిని తీసి ఒకే వేటుతో తన భార్యను, ఆ రాకుమారుడిని ఖండించాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కార్తీక పౌర్ణమి, సోమవారం కావడం వల్ల కన్నుమిన్ను తెలియనంతగా కామంతో కళ్లుమూసుకుపోయిన రాకుమారుడు, ఆ బ్రాహ్మణ స్త్రీలను శివసాన్నిధ్యానికి తీసుకెళ్లేందుకు శివదూతలు రాగా… బ్రాహ్మణుడిని తీసుకెళ్లేందుకు యమకింకరులు వచ్చారు. దీంతో ఆ బ్రాహ్మడు ”కన్నూమిన్నూ కానని రీతిలో కామక్రీడలు సాగిస్తూ వ్యభిచరించే ఆ మూర్ఖులకోసం శివదూతలు రావడమేమిటి? నాకోసం యమదూతలు రావడమేమిటి?” అని ప్రశ్నించాడు.

       ఆ మాటలకు యమకింరులు ఇలా చెబుతున్నారు… ”ఓ విప్రోత్తమా…! ఎవరెంతటి నీచులైనా.. ఈ రోజు అత్యంత పవిత్రమైన దినం. కార్తీకపౌర్ణమి, సోమవారం కలిసి వచ్చింది. తెలిసో తెలియకో వారు శివాలయంలో దీపం వెలిగించారు. ఆ కారణంగా అప్పటి వరకు వారు చేసిన పాపాలన్నీ నశించిఓయాయి. కాబట్టి వారిని కైలాసానికి తీసుకెళ్లేందుకు శివదూతలు వచ్చారు” అని చెప్పారు.

       ఈ సంభాషణ అంతా విన్న రాకుమారుడు ”అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలా ఉన్నా.. మేం ముగ్గురం ఒకే సమయంలో ఒకే స్థలంలో చనిపోయాం. కాబట్టి ఆ ఫలితమంతా మా అందరికీ వర్తించాల్సిందే” అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణుడికి దానం చేశారు. వెంటనే ఆ బ్రాహ్మణుడు సైతం పుష్పక విమానమెక్కి శివసాన్నిధ్యాన్ని చేరాడు.

       “జనక మహారాజా…! శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ఆ ప్రేమికుల పాపం పోవడమే కాకుండా, కైలాస ప్రాప్తికూడా కలిగింది. కాబట్టి కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొందుదురు” అని వశిష్టుల వారు వివరించారు.

ఇతి శ్రీ స్కాందపురాణాంతర్గత తవశిష్ట ప్రోక్త కార్తీక పురాణం చతుర్థ అధ్యాయ: సమాప్త:

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

నాగుల చవితి

       “నాగుల చవితి” దీపావళి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది. పుట్టిన బిడ్డలు బ్రతకక పోతేను, పిల్లలు కలుగక పోతేను, నాగ ప్రతిష్ట చేసి పూజించటం సాంప్రదాయం. అలా నాగ మహిమతో పుటిన సంతానానికి, నాగలక్ష్మి, నాగేశ్వరరావు, నాగయ్య వగైరా పేర్లు పెట్టుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని నమ్మకం.

ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘ వెనుబాము’ అని అంటారు. అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో “పాము” ఆకారంలో వుంటుందని “యోగశాస్త్రం” చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ‘సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే “శ్రీమహావిష్ణువు” కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.

ఈ చవితి రోజున ఉదయమే, తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి, నాగరాజుకు పూజించి పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు, తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ పుట్ట మట్టిని పుట్టబంగారం అని, దానిని కొద్దిగా తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటారు. ముఖ్యముగా చెవి బాధలు వున్నవారికి ఈ పుట్టబంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు. ఆ సందర్భంగా పుట్ట వద్ద “దీపావళి” నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.

నాగులచవితి పాటలు కూడా మన తెలుగువారిలో ఎంతో ప్రసిద్ధం:

నన్నేలు నాగన్న, నాకులమునేలు,

నాకన్నవారల నాఇంటివారల ఆప్తమిత్రులనందరిని ఏలు.

పడగ తొక్కిన పగవాడనుకోకు,

నడుము తొక్కిన నావాడనుకొనుము.

తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము.

ఇదిగో! నూకనిచ్చెదను మూకనిమ్ము. పిల్లల మూకను నాకిమ్ము.

అని పుట్టలో పాలు పోస్తూ, నూక వేసి వేడుకుంటారు. అలాగే,

పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!

గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!

చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!

వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!

పుట్టలోని నాగేంద్రస్వామి !! ….

       అంటూ తాము పోసిన పాలు నాగేంద్రుడు తాగితే, తమ మనసులోని కోర్కెలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం.

ఆలయాలలో నాగదేవతలకు ఘనంగా పూజలు చేస్తారు. ప్రతి ఏటా నాగులచవితి రోజున తిరుమలలో కోనేటిరాయుడైన శ్రీవారిని పెద్దశేష వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ. అలాగే గురువారం వాహన సేవకు ఆరోజంతా వుపవాసముండి మరునాడు పారాయణ చేసి భుజిస్తారు. పాముపడగ నీడ పడితే పశువులకాపరి కూడా ప్రభువు అవుతాడంటారు !

కాని పాములకు పుట్టలో పాలు పోయడం వల్ల వాటి ప్రాణాలకు హాని అని,అందుకని వాటి సహజ నివాసములలో పాలూ, గుడ్లూ వెయ్యొద్దని చెప్తున్నారు. దానికి బదులు ఇళ్ళలోనే బియ్యం పిండితో నాగ మూర్తులను చేసి, వాటికి శాస్త్రోక్తంగా అన్నీ సమర్పించవచ్చు.

       ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని – ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూ వస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే… అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయి!. అలా ప్రకృతిపరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. నాగుపాముల సహజ నివాసాలను ఉండనిచ్చి, ప్రకృతిని కాపాడుకుంటే అంతకన్నా గొప్ప పూజ ఇంకొకటి ఉంటుందా!. ఈ పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలస్తారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం మూడో అధ్యాయము : కార్తీక మాస స్నాన మహిమ

       వశిష్టుడు తిరిగి ఇలా చెబుతున్నాడు…. ”జనక మహరాజా! కార్తిక మాసంలో చిన్న దానము చేసినా… అది గొప్ప ప్రభావాన్ని చూపి, సకల ఐశ్వర్యాలను కలుగజేస్తుంది. అంతేకాకుండా… మరణానంతరం శివసాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుంది. అయితే కొందరు అస్థిరములైన భోగభాగ్యాలను విడువలేక, కార్తిక స్నానములు చేయక, అవినీతి పరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి , కుక్క, పిల్లి గ జన్మింతురు.. అయితే దాన ధర్మాలు చేయలేకపోయినా…. కార్తీక మాస శుక్ల పార్ణమి రోజున తప్పనిసరిగా స్నాన, దాన, జపతపాదులు చేయాలి. ఆ రోజు స్నానం చేయనివారు చండాలాది జన్మలెత్తి, చివరకు బ్రహ్మరాక్షసిగా పుడతారు. దీన్ని గురించి నాకు తెలిసిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను… సవివరంగా విను…” అని ఇలా చెప్పసాగాడు.

బ్రహ్మ రాక్షసులకు ముక్తి

       దక్షిణభారత దేశంలోని ఓ గ్రామంలో మహావిద్వాంసుడొకడుండేవాడు. తపోశక్తి సంపన్నుడై, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడైన ఆ బ్రాహ్మడి పేరు తత్వనిష్ఠుడు. ఒకరోజా బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయాలని సంకల్పించాడు. అఖండ గోదావరికి వెళ్లాడు. ఆ తీర్థ సమీపంలో ఓ మహావటవృక్షంపై భయంకర ముఖంతో, పొడవైన జుట్టు, బలిష్టమైన కోరలు, నల్లని బాన పొట్టతో చూసేవారికి అతి భయంకరంగా కనిపించే మూడు బ్రహ్మరాక్షసులున్నాయి. ఆ మార్గం మీదుగా వెళ్లే బాటసారులను బెదిరించి, వారిని భక్షించడం వాటి ప్రధాన విధి. మూడు బ్రహ్మర్షాసుల వల్ల ఆ ప్రాంతంలో భయోత్పాతాలేర్పడ్డాయి. తీర్థయాత్రల్లో ఉన్న ఆ బ్రాహ్మణుడు గోదావరిలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి సన్నద్ధమవుతుండగా… యథావిధిగా చెట్టు నుంచి దిగిన బ్రహ్మర్షాసులు అతన్ని చంపేందుకు యత్నించాయి. ఆ బ్రాహ్మణుడు భీతిచెంది… భయంతో నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించాడు. ‘ప్రభో… ఆర్తత్రాణ పరాయణా! అనాథరక్షకా… ఆపద్భాందవా… గజేంద్రుడిని, ద్రౌపదిని, ప్రహ్లాదుని రక్షించిన రీతిలో నన్నూ ఈ పిశాచాల బారి నుంచి కాపాడు తండ్రీ!” అని వేడుకొన్నాడు. నారాయణ మంత్రంతో కూడిన ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయమైంది. ”మహానుభావా… మీ నోటి నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతిని విని మాకు జ్ఞానోదయమైంది. మమ్మల్ని రక్షించండి”  అని ప్రాధేయపడ్డాయి.

       అంతటితో కాస్త ధైర్యం తెచ్చుకున్న తత్వనిష్ఠుడు మెల్లగా వాటితో ఇలా మాట్లాడసాగాడు… ”ఓయీ… మీరెవరు? మీకు ఈ రాక్షసరూపం ఎలా వచ్చింది? మీ కథేంటి?” అని ప్రశ్నించాడు.

       దీనికి ఆ బ్రహ్మరాక్షసాలు ఇలా చెప్పసాగాయి… ”ఓ విప్రపుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శనభాగ్యం వల్ల మాకు పూర్వజన్మలోని కొంత జ్ఞానం కలిగింది. మీకు మా వల్ల ఏ అపాయం కలుగదు.” అంటూ ఒక బ్రహ్మరాక్షసుడు తన కథను వివరించసాగాడు.

       “నాది ద్రావిడ దేశం. బ్రహ్మనుడను. నేను మహా పండితుడనని గర్వంతో విర్రవీగేవాడిని. న్యాయాన్యాయ విచాక్షణలు మాని, పశువువలె ప్రవర్తించాను. బాటసారులు, అమాయక గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా దనం లాక్కొన్నాను. దుర్వ్యసనాలకు లోనై… భార్య, పుత్రులను సుఖపెట్టక, పండితులను అవమానపరుస్తూ… లోకకంటకుడిగా ఉండేవాడిని. అయితే… ఓ బ్రాహ్మణుడు కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తూ భూత తృప్తికోసం బ్రాహ్మణ సమారాధన చేయాలనే ఉద్దేశంతో పదార్థ సంపాదన నిమిత్తం నగరానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు. అయితే… నేను ఆ పండితుడిని దూషించాను. కొట్టి, అతని వద్ద ఉన్న ధనం, వస్తువులు తీసుకుని, ఇంటి నుంచి గెంటేశాను. దీంతో దు:ఖంతో పాటు, కోపాన్ని వ్యక్తం చేసిన ఆ బ్రాహ్మణుడు తనన్ను రాక్షసుడవై నరమాంస భక్షణ గావించాలని శపించాడు. బ్రహ్మాస్త్రమునుంచైనా తప్పించుకోవచ్చు కానీ, బ్రాహ్మణ శాపం తప్పించడం ఎవరితరమూ కాదు. దీంతో క్షమించమని అతన్ని ప్రార్థించాను. అప్పుడు గోదావరీ తీరంలోని వటవృక్షంపై నివసించమని చెప్పాడు. ఒక బ్రాహ్మణుడి వల్ల పునర్జన్మ జ్ఞానం పొందుతావని, ఆ బ్రాహ్మణుడే నిన్ను కాపాడతాడని చెప్పాడు” అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని వివరించాడు.

       ఇక రెండో రాక్షసుడు ”ఓ ద్విజోత్తమా…! నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మనుడనే. నేను నీచుల సహవాసంతో తల్లిదండ్రులను బాధించాను. వారికి తిండిపెట్టకుండా, మాడ్చి, అన్నమోరామచంద్రా అనేలా చేశాను. వారు ఆకలితో అలమటిస్తుంటే… నేను వాళ్ల ఎదుటే భార్యాపిల్లలతో పంచభక్ష్య పరమాన్నాలు తిన్నాను. నేను ఎలాంటి దానధర్మాలు చేయలేదు. నా బంధువలను కూడా హింసించాను. వారి ధనాన్ని అపహరించి రాక్షసుడిలా ప్రవర్తించాను. ఇదే నా రాక్షస జన్మకు కారణం. నన్నీపాపం నుంచి ఉద్దరించు” అని ప్రార్థించెను.

       మూడో రాక్షసుడు కూడా తన వృత్తంతమును వివరిస్తూ… ”ఓ మహానుభావా! నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయములో అర్చకునిగా పనిచేసేవాడిని. స్నాన మైనను చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండే వాడిని. భగవంతునికి ధూప దీప నైవేద్యము లైనా సమర్పించక, భక్తులు తీసుకొచ్చే వస్తువులు, ధనాన్ని నా ఉంపుడుగత్తెకు ఇచ్చేవాడిని. మధ్యమాంసాలను సేవించి పాపాలను మూటకట్టుకున్నాను. అందుకే ఈ రూపాన్ని మూటగట్టుకున్నాను. కాబట్టి నాపై దయుంచి విముక్తిని కలిగించు” అని ప్రార్థించెను.

తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచముల దీరగాథలె విని ”ఓ బ్రహ్మ రాక్షసులరా! భయపడండి. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోర అపచారాల వల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండి మీకు విముక్తిని కలిగింతును” యని, వారిని ఓదార్చి… తనతో తీసుకెళ్లాడు. ఆ ముగ్గురితో చేతనవిముక్తి సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా… ఆ ముగ్గురూ వారి రాక్షస రూపాన్ని వదిలి, దివ్యమైన రూపాలను ధరించారు. శాపవిమోచనమవడంతో ఆ ముగ్గురూ వైకుంఠానికి వెళ్లారు.

       తిరిగి వశిష్టుడు ఇలా చెబుతున్నాడు ”ఓ జనక మహారాజా! కేవలం గోదావరి నదిలో స్నానమాచరించిన ఫలితం వారికి శాపవిముక్తిని గావించింది. ఈ కార్తీకమాసంలో నదీస్నానం ఎంతో ఫలితాన్నిస్తుంది. ఎంతటి కష్టాలెదురైనా… ఈ మాసంలో స్నానాలు ఆచరించాలి” అని వివరించారు.

ఇతి స్కాంధ పురాణే తర్గత, వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం… తృతీయోధ్యాయం సంపూర్ణం.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

త్రిలోచన గౌరీ వ్రతం

       కార్తీకమాసంలో తదియ తిథి రోజున త్రిలోచనగౌరి వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతం చేయటం వెనకున్న తత్వాన్ని చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు.

సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ

వాగర్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

       జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ॥ అనే శ్లోకాన్ని తప్పనిసరిగా నేర్చుకుంటారు. వాక్కు, అర్థము- ఈ రెండింటినీ విడదీయలేరు. వీటికున్న సంబంధం అవినాభావమైనది. శివపార్వతులు కూడా ఈ వాక్కు, అర్థములాంటివారేనని ఈ శ్లోక అర్ధం. అందుకే వీరిద్దరినీ ప్రకృతి పురుషులుగా వర్ణిస్తూ ఉంటారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా అది అయోమయానికి, అవ్యవస్థకు, అనాచారానికి దారి తీస్తుంది. ప్రకృతినుంచి పురుషుడు విడిపోయాడనుకోండి శివం కాస్తా – శవమవుతుంది. ఈ విధంగా ప్రకృతిపురుషుల కేళి జరిగే ప్రదేశమే కైలాసం. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు మూర్తీభవించినట్టుగా వుంటుంది. శివుడు చిన్మయ రూపంలో ఉంటాడు. అంతే కాదు శివలింగం ఎంత తడిస్తే ఎంత చల్లబడితే ఎంత ఆరాధన చేస్తే లోకాలు అంత చల్లబడుతాయి. కార్తిక మాసం ఉపాసనా కాలం కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే పాపాలు తీరుతూ ఉంటాయి. ఈ పాపాలు ఎందుకు తీరాలనే ప్రశ్న చాలా మందికి ఉదయిస్తుంది. దీనికి సమాధానమే

శంకరాచార్య విరిచిత

       పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం

       ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే॥ స్తోత్రం. ఈ సంసార భ్రమణ పరితాపం వదిలిపోవటానికి, రెండు జన్మాల మధ్య పరితాపాన్ని త్యజించటానికి తోడ్పడేవాడు ఈశ్వరుడు. అంతే కాదు మానవ జననానికి కారణం కోరిక. ఈ కోరికకు ఒక రూపం మన్మథుడు. అలాంటి మన్మ«థుడిని తన మూడో కంటి మంట చేత దహనం చేసిన వాడు ఈశ్వరుడు. అయితే ఈ చర్యలన్నింటిలోను అమ్మవారి ప్రమేయం కూడా ఉంటుంది. అందుకే పరమేశ్వరుడి కన్ను శివుడిది మాత్రమే కాదు, పార్వతీ దేవిది కూడా. అందుకే ఆమెను త్రిలోచన అని కూడా పిలుస్తారు. తన భక్తులకు శివుడు ఎలాంటి వరాలిస్తాడో.. అమ్మవారు కూడా అంతే దయతో భక్తులను కనికరిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ తీరినట్లే. అందుకోసమే కార్తిసమాసంలో తిదియనాడు త్రిలోచనగౌరి వ్రతం చేస్తారు. ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పూలతో పూజ చేస్తారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం ద్వితీయ అధ్యాయం : సోమవార వ్రత మహిమ

       వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు ”జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే… కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబతాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.

       “కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి. నదీస్నానం చేసి, తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి, సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ… ఆ రాత్రంతా జాగరణ చేసి, పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీస్నానమాచరించాలి. నువ్వులను దానం చేయాలి (తిలాదానం). తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత, తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి, సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాదికాలు నిర్వహించలేనివారు సైతం కనీసం ఉపవాసం ఉంటే… కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసముంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.

కుక్క కైలాసానికి వెళ్లుట…

       “పూర్వ కాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్టురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్హణుడికి ఇచ్చి పెళ్లి చేశాడుఏ. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు, శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని ‘అపర బ్రహ్మ’ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో, కన్నుమిన్నుగానక పెద్దలను దూషించేది. అత్తమామలను, భర్తను తిట్టడం, కొట్టడం, రక్కడం చేసేది. పురుషసాంగత్యంతో వ్యభిచారిణియై… తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు, బట్టలు, పువ్వులు, ధరించి దుష్టురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా… ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కలవారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ… కర్కశ అని పేరుపెట్టి ఎగతాళి చేసేవారు.

        ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా… ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతిరహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పారేసి, పైన చెత్తచెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురులేదని, అడ్డూఅదుపు ఉండదనే అహంకారం పెరిగి… ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి, నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణసంకరురాలైంది. అంతటితో ఆగకుండా… కన్యలు, పెళ్లైన మహిళలకు దుర్బుద్దులు నేర్పి, పాడుచేసి, విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది.

       ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది. చేసినపాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము, రక్తం కారుతూ, క్రమంగా కుష్టువ్యాధిబారిన పడింది. రోజురోజుకూ ఆమె శరీర పటుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమెకోసం వంతులవారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడామెవైపు కన్నెత్తికూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి, పురుగులు పడి చనిపోయింది.

       బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరవు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని, విటులతో సుఖించినందుకు ఇనుపస్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనపగదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణిలుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులు, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో, చెవిలో పోశారు. ఇనపకడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కంఉబీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒకత్తే కాకుండా, ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచజన్మలు ఎత్తుతూ, క్రిమికీటకాలుగా పుట్టి.. చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది.

కుక్కజన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికీ తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే.. తిట్టేవాడు తిడుతున్నారు. పిల్లలు తరుముతున్నారు. అయితే… ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతమాచరించి, ఉపవాసముండి, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి, ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి, కాళ్లూచేతులు కడుక్కునేందుకు వెళ్లాడు. అయితే… ఆ కుక్క గబగబా వెళ్లి ఆ ఆహారాన్ని భుజించింది.

వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపెంచిన బలియన్నం కావడం… కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసముండడం, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క ‘విప్రోత్తమా… నన్ను కాపాడుము’ అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి. ‘రక్షించు… రక్షించు…’ అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు ‘ఎవరు నీవు? నీ వృత్తాతమేమిటి?’ అని ప్రశ్నించాడు. అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. పదిహేను జన్మల క్రింద సద్భ్రాహ్మణుడి భార్యయైన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్టువ్యాధితో దినదినగండంగా బతికి, చనిపోయిన తీరును, నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ‘ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి, ఇక్కడ పెట్టిన బలిఅన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా…! నాకు మహోపకరాంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి, నాకు మోక్షం కలిగించు’ అని ప్రార్థించింది.

దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. అలాచేసిన వెంటనే… ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క తన జన్మను చాలింది, సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివసాన్నిథ్యాన్ని చేరుకుంది.”

ఇతి శ్రీ సాంద పురాణే తర్గత, వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే ద్వితీయ అధ్యాయం సమాప్తం.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)