Categories
Vipra Foundation

వైకుంఠ చతుర్దశి విశిష్టత

       కార్తీక శుద్ధ చతుర్దశిని ‘వైకుంఠ చతుర్దశి’గా పిలుస్తుంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజున శివుడిని పూజిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఈ రోజు అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. కర్తవ్యపాలన విషయంలోనే శివకేశవులు వేరుగా కనిపిస్తూ వుంటారు. నిజానికి వారిద్దరూ ఒకటేనని వేదకాలంలోనే చెప్పబడింది.

       ఈ విషయంలో ఒకానొక కాలంలో వాదోపవాదాలు జరిగినప్పటికీ, ఆ తరువాత కాలంలో శివకేశవులకు భేదం లేదనే విషయాన్ని చాలామంది గ్రహించారు. ఇక ఈ కార్తీకమాసాన్ని మించిన పవిత్రమైన మాసం మరొకటి లేదని సాక్షాత్తు శివకేశవులే సెలవిచ్చారు. ఈ మాసమంతా కూడా ప్రతిరోజూ ఓ ప్రత్యేకతను … విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది.

       హరిహరులకు ఇది ఎంతో ప్రీతికరమైన మాసం కనుక ఈ సమయంలో వారి అనుగ్రహాన్ని సంపాదించడం ఎంతో తేలిక. ఈ కారణంగానే ఈ మాసంలో శ్రీమహావిష్ణువును తులసి దళాలతోను … శివుడిని బిల్వదళాలతోను పూజిస్తుంటారు. ఇక లక్ష్మీపార్వతులు కూడా నోములు … వ్రతాలను ఆచరించే ముత్తయిదువులను అనుగ్రహిస్తూ తీరికలేకుండా వుంటారు. అంటే ఇటు లక్ష్మీనారాయణుల ఆశీస్సులు … అటు శివపార్వతుల అనుగ్రహాన్ని అందించే అద్వితీయమైన మాసంగా ఇది చెప్పబడుతోంది.

       ఈ నేపథ్యంలో భక్తుల ముందుకు ఒక వరంగా వచ్చే విశిష్టమైన రోజే ‘వైకుంఠ చతుర్దశి’. సమస్త మానవాళిచే పూజలు అందుకుంటూ వుండే విష్ణుమూర్తి, ఈ రోజున శివుడిని పూజిస్తాడంటే ఇది ఎంతటి పవిత్రమైనరోజో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి నేరుగా కాశీ నగరానికి వెళ్లి అక్కడి విశ్వనాథుడిని అర్చిస్తాడని అంటారు. ఇక ఈ రోజున లింగావ్రతాన్ని ఆచరించి జాగరణ చేసిన వారికి మోక్షం లభిస్తుంది.

        శివకేశవులను ఆరాధిస్తూ అనుగ్రహాన్ని పొందే ఈ రోజున ఇత్తడి కుందుల్లో గానీ, రాగి కుందుల్లో గాని దీపాలను వెలిగించి వాటిని దానాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన సమస్త దోషాలు సకల పాపాలు తొలగిపోతాయి … ఆశించే శుభాలు ఆనందంగా చేకూరతాయి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

హైద్రాబాద్ రాజ్య తెలుగు భాష, గ్రంధాలయోద్యమ, తెలుగు గ్రంధ ప్రచురణోద్యమ వైతాళికులు కీ. శే రావిచెట్టు రంగారావుగారి సంక్షిప్త సమాచారం

స్వస్థలం: మడికొండ మరియు ములుగు, వరంగల్ జిల్లా

బాల్యం: దండంపల్లి, నల్గొండ జిల్లా

నివాసం: హైద్రాబాద్

తలిదండ్రులు: రావిచెట్టు వెంకటమ్మ- నరసింహారావు (మన్సబ్‌దార్)

జననం: 27 నవంబర్ 1877  మరణం: 3 జులై 1910   (33 సం,లు)

ధర్మపత్ని: లక్ష్మీనరసమ్మ

కీ శే రంగారావు దంపతుల సేవా దర్శిని

  • శ్రీ శంకర భగవత్పూజ్య గీర్వాణ రత్నమంజూష – సంస్కృత గ్రంధాలయ వ్యవస్థాపన (క్రీ. శ. 1900 కు పూర్వం)

కొమర్రాజు లక్ష్మణ రావు, రావిచెట్టు రంగారావు, నాయని వెంకట రంగారావు, ఆదిపూడి సోమనాధరావు, మైలవరపు నరసింహ శాస్త్రి గారల బృమ్దాన్ని హైద్రాబాద్ రాజ్య భాష, గ్రంధాలయ, ప్రచురణోద్యమ పితామహులుగా పిలుస్తారు. వీరందరిలో పూర్తిగా తెలంగాణాకు చెందినవారు రావిచెట్టు రంగారావుగారొక్కరే)

  • శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం- వ్యవస్థాపన 1 సెప్టెంబర్ 1901 (రంగారావు గారిస్వగృహం‌లో), తొలి 5 సంవత్సరాలు నిర్వాహకుడు(కార్యదర్శి, గ్రంధపాలకుడు, గణకుడు, భృత్యుడు)
  • రావిచెట్టు రంగారావుగారు కొందరు విద్యార్ధులను తన పోషణలో ఉంచుకొని చదివించారు (వారిలో ఆదిరాజు వీరభద్రరావు గారొకరు)
  • కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయానికి అనుబంధంగా ఒక పాఠశాలను నెలకొల్పి కొంతకాలం నిర్వహించారు.
  • శ్రీ రాజరాజ నరెంద్ర భాషానిలయం, హన్మకొండ 26 జనవరి 1904 
  • విజ్ఞాన చంద్రికా మండలి వ్యవస్థాపన 1906 (ద్రవ్య దాత, కార్యనిర్వాహకుడు), గ్రంధ ప్రచురణకోసం కొంతకాలం మద్రాసుకు కాపురం మార్చారు. 
  • మూసీ వరద (1908) బాధితుల సహాయార్ధం పలుకార్యక్రమాలు చేపట్టారు.
  • కాంగ్రేస్ స్వదేశీ ఉద్యమం (1905) కంటే పదేళ్ళ పుర్వమే స్వదేశీ వాదాన్ని ఆచరించారు. బందరు జాతీయ కళాశాలకు సాయపడ్డారు.
  • మాదరి వెంకట భాగ్యరెడ్డి వర్మకు 1907లో విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురణలను బహూకరించారు
  • ఆయన ఉదారవాది, సామాజిక సామరస్యవాది.
  • రంగారావుగారు చేపట్టిన ప్రతీ కార్యక్రమం‌లో లక్ష్మీనర్సమ్మ గారి సహకారం, క్రియాశీల భాగస్వామ్యం ఉన్నాయి.
  • మహిళాసంఘాలను నెలకొల్పి తన భార్య లక్ష్మినర్సమ్మ గారిని అధ్యక్షులుగా చేసి మహిళాభ్యుదయానికి కృషి చేశారు.
  • రంగారావుగారి మరణానంతరం లక్ష్మీనరసమ్మగారిచ్చిన రూ 3 వేల విరాళంతో ప్రస్తుఅ సుల్తాన్‌బజార్ స్థలాన్ని (పాతపెంకుటిల్లుతో సహా) ఖరీదు చేశారు.
  • హైద్రాబాద్ రాజ్య ప్రజాస్వామిక, సాంస్కృతిక ఉద్యమాలకు సంబందించి ప్రభుత్వ దృష్టిలోకి వెళ్ళిన మొదటి తెలుగువాడు రావిచెట్టు రంగారావుగారే. 

బరోడా (గుజరాత్) రాజు షాయాజీ రావు గైక్వాడ్‌ను (1863- 1939) భారతదేశ ఆధునిక గ్రంధాలయోద్యమ పితామహునిగా గుర్తిస్తారు. ఆధునిక గ్రంధాలయోద్యమం ప్రారంభమైన కాలాన్ని 1907నుండి లెక్కిస్తారు.

హైద్రాబాద్‌లో 1901లో ప్రారంభమైన ఈ ప్రజాగ్రంధాలయ వ్యవస్థ 1926 వరకు 64 గ్రందాలయాలకు చేరింది. ఇది ప్రజలకోసం ప్రజల చేత ప్రజలు స్వచ్ఛందంగా నిర్మించుకొన్న గ్రంధాలయ వ్యవస్థ. ఆంధ్రజన సంఘానికి (1921) ఈ గ్రంధాలయ, ప్రచురణ వ్యవస్థ పూర్వరంగంగా పనిచేసింది.

కీ. శే. రావిచెట్టు రంగారావు గారు మా తాతగారైన రావిచెట్టు రాజేశ్వర్ రావు గారికి అన్నయ్య (పెదనాన్న కొడుకు), రంగారావుగారు నిస్సంతు. మడికొండనుండి  రంగారావుగారు తమ అమ్ముమ్మగారింటికి వెళ్ళగా మాతాతగారు ములుగుకు వెళ్ళారు.

విజ్ఞప్తి:

మాతృభాష, గ్రంధాలయోద్యమాలలో వారి స్ఫూర్తిని కొనసాగించడంకోసం రంగారావు గారి జయంతి (27 నవంబర్), వర్ధంతి (3 జులై)లను ప్రభుత్వం నిర్వహిందచాలి.

రాష్ట్రం‌లోని గ్రంధాలయాలు, విద్యాలయాల్లో రంగారావుదంపతుల చిత్ర పఠాన్ని ఉంచాలి

జయంతిని తెలంగాణా గ్రంధాలయ దినోత్సవంగా ప్రకటించాలి.

రంగారావు దంపతుల విగ్రహాలను టాంకుబండుపై నెలకొల్పాలి

రంగారావు దంపతుల తపాలా బిళ్ళకోసం కెంద్రప్రభుత్వానికి సిఫార్సు చేయాలి

  • ప్రతాపరుద్ర గ్రంధాలయం, మడికొండ వ్యవస్థాపకులు కీ శే పెద్ది శివరాజం గారు మాకు చెప్పిన విషయాలు.
  • తెలంగాణా సాహిత్య వికాసం- కె శ్రీనివాస్ (తెలంగాణా ప్రచురణలు)
  • సంస్కర్త రావిచెట్టు రంగారావు- కుర్రా జితెంద్రబాబు (మిసిమి ఫిబ్రవరి 2012)
  • సమగ్ర ఆంధ్ర సాహిత్యం (నాలుగవ సంపుటం)
  •  కొమర్రాజు లక్ష్మణరావు- ఆజ్మీరు వీరభద్రయ్య
  • మాడపాటి హన్మంతరావు- ఆకెళ్ళ రాఘవెంద్ర

వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం 12వ అధ్యాయం : ద్వాదశి ప్రశంస, సాలగ్రామదాన మహిమ

       వశిష్టుడు తిరిగి ఇలా చెబుతున్నాడు… ”ఓ జనక మహారాజా! కార్తీక మాసంలో కార్తీక సోమవారం, కార్తీక ద్వాదశి, సాలగ్రామ మహిమలను గురించి వివరిస్తాను విను” అని ఈ విధంగా చెప్పసాగాడు.

       “కార్తిక సోమవారం రోజు పొద్దున్నే నిద్రలేచి, రోజువారీ విధులు నిర్వర్తించుకుని, నదికి వెళ్లి, స్నానం చేయాలి. ఆ తర్వాత శక్తికొద్దీ బ్రాహ్మణులకు దానమిచ్చి, ఆరోజంతా ఉపవాసముండాలి. సాయంకాలం శివాలయానికి గానీ, విష్ణువాలయానికి గానీ వెళ్లి, పూజించాలి. నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం భుజించాలి. ఈ విధంగా చేసేవారికి సకల సంపదలు కలగడమే కాకుండా, మోక్షం లభిస్తుంది.

       కార్తిక మాసంలో శనిత్రయోదశి గనక వస్తే… ఆ వ్రతం ఆచరిస్తే నూరు రెట్ల ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశిరోజున పూర్తిగా ఉపవాసం ఉండి, ఆ రాత్రి విష్ణువాలయానికి వెళ్లి, శ్రీహరిని మనసారా ధ్యానించి, ఆయన సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి, మర్నాడు బ్రాహ్మణ సమారాధన చేసినట్లయితే.. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. ఈ విధంగా చేసినవారు సూర్యగ్రహణ సమయంలో గంగానదిలో స్నానం చేసినట్లయితే… కోటి మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినదానికంటే అధిక ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశినాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుంచి లేస్తాడు కాబట్టి, ఆ రోజు విష్ణువుకు అమిత ఇష్టమైన రోజు. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చినట్లయితే… ఆ ఆవు శరీరంలో ఎన్ని రోమాలున్నాయ… అన్నేళ్లు వారు ఇంద్రలోక ప్రాప్తి పొందగలరు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమిరోజున కంచుపాత్రలో ఆవునేతిని పోసి, దీపముంచిన వారు పూర్వజన్మలో చేసిన సకల పాపాలను పోగొట్టుకుంటారు. ద్వాదశిరోజు యజ్ఞోపవీతాలను దక్షిణతో బ్రాహ్మణుడికి దానమిచ్చినవారు ఇహపర లోకాల్లో సుఖాలను పొందగలరు. ద్వాదశిరోజున బంగారు తులసి చెట్టును, సాలగ్రామాన్ని బ్రాహ్మణుడికి దానమిచ్చిన నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ ఉంది. చెబుతాను… శ్రద్ధగా ఆలకించు….” అని ఇలా చెప్పసాగాడు.

సాలగ్రామ దాన మహిమ

       పూర్వము అఖండ గోదావరి నదీ తీరంలోని ఒక గ్రామంలో ఒక వైశ్యుడు నివసించేవాడు. వాడు దురాశపరుడై, నిత్యం డబ్బుగురించి ఆలోచించేవాడు. తాను అనుభవించకుండా, ఇతరులకు పెట్టకుండా, బీదలకు అన్నదానం, ధర్మాలు చేయకుండా, ఎప్పుడూ పర నిందలతో కాలం గడిపేవాడు. తానే గొప్ప శ్రీమంతుడినని విర్రవీగుచుండేవాడు. పరుల ధనం ఎలా అపహరించాలా? అనే ఆలోచనలతోనే కాలం గడిపేవాడు.

       అతడొకరోజు తన గ్రామానికి దగ్గర్లో ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడికి తన వద్ద ఉన్న ధనాన్ని పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాడు. మరి కొంత కాలానికి తన సొమ్ము అడగగా… ఆ బ్రాహ్మణుడు ”అయ్యా! మీకు రావాల్సిన మొత్తాన్ని నెలరోజుల్లో ఇస్తాను. మీ రుణం తీర్చుకుంటాను. ఈ జన్మలో కాకున్నా… వచ్చే జన్మలో ఒక జంతువుగా పుట్టి అయినా… మీ రుణం తీర్చుకుంటాను” అని వేడుకొన్నాడు. దానికి ఆ వైశ్యుడు ”అలా వీల్లేదు. ఇప్పుడు నా సొమ్ము నాకిచ్చేయి. లేకపోతే నీ తలను నరికి ఇవ్వు” అని ఆవేశం కొద్దీ వెనకా ముందూ వెనకా ఆలోచించకుండా కత్తితో ఆ బ్రాహ్మణుడి కుత్తుకను కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయాడు. దాంతో ఆ వైశ్యుడు భయపడి, అక్కడే ఉన్న రాజభటులు పట్టుకుంటారని భయపడి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాతకం కాబట్టి, అప్పటి నుంచి ఆ వైశ్యుడికి బ్రహ్మహత్యాపాపం ఆవహించింది. కుష్టువ్యాధి కలిగి నానా బాధలు పడుతూ కొన్నాళ్లకు చనిపోయాడు. వెంటనే యమదూతలు అతన్ని తీసుకుపోయి, రౌరవాది నరక కూపాల్లో పారేశారు.

       ఆ వైశ్యుడికి ఒక కొడుకున్నాడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగ్గట్లుగానే తండ్రి సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలకు వెచ్చించేవాడు. పుణ్యకార్యాలు ఆచరించేవాడు. నీడ కోసం చెట్లు నాటించడం, బావులు, చెరువులు తవ్వించడం చేశాడు. సకల జనులను సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదించాడు. ఇలా ఉండగా… కొంతకాలానికి త్రిలోక సంచారి అయిన నారదుడు యమలోకాన్ని దర్శించి, భూలోకంలో ధర్మవీరుడి ఇంటికి వెళ్లాడు. ధర్మవీరుడు నారదమహర్షిని సాదరంగా ఆహ్వానించి, అర్ఘ్య పాద్యాదులు అర్పించాడు. చేతులు జోడించి ”ఓ మహానుభావా…! నా పుణ్యం కొద్ది నాకు మీ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించండి” అని వేడుకొన్నాడు. అంతట నారదుడు చిరునవ్వు నవ్వుతూ… ”ఓ ధర్మవీరా! నేను నీకొక హితోపదేశం చేయాలని వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీకమాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు. ఆరోజున స్నాన, దాన, జపాదులు ఏవి చేసినా… అత్యంత ఫలం కలుగుతాయి. నాలుగు జాతులలో ఏ జాతివారైనా… స్త్రీ పురుషులనే బేదం లేకుండా… దొంగ అయినా, దొర అయినా, పతివ్రత అయినా, వ్యభిచారిణి అయినా… కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులా రాశిలో ఉండగా… నిష్టతో ఉపవాసముండాలి. సాలగ్రామదానం చేయాలి. అలా చేసినవారు తండ్రి రుణం తీర్చుకుంటారు. ఈ వ్రతం వల్ల కిందటి జన్మ, ఈ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. నీ తండ్రి యమలోకంలో మహానరక బాధలు అనుభవిస్తున్నాడు. అతన్ని ఉద్దరించేందుకు నీవు సాలగ్రామదానం చేయక తప్పదు.” అని చెప్పాడు. అంతట ధర్మవీరుడు నారదమహామునితో… ”మునివర్యా! నేను గోదానం, భూదానం, హిరణ్యదానం మొదలగు మహాదానాలన్నీ చేశాను. అలాంటి దానాలు చేసినా నా తండ్రి మోక్షాన్ని పొందకుండా నరకానికి వెళ్లినప్పుడు… ఈ సాలగ్రామ దానం చేస్తే ఆయన ఎలా ఉద్దరింపబడతాడు?” అని చెప్పాడు. అతని అవివేకానికి విచారించిన నారదుడు ఇలా చెబుతున్నాడు ”ఓ వైశ్యుడా! సాలగ్రామం శిలామాత్రమే అనుకుంటున్నావా? అది శిలకాదు. శ్రీహరి రూపం. అన్ని దానాల్లో సాలగ్రామదానం వల్ల కలిగే ఫలం గొప్పది. నీ తండ్రి నరక బాధ నుంచి విముక్తి పొందాలంటే ఈ దానం తప్పదు. మరో మార్గం లేదు” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

       ధర్మవీరుడు ధనబలంతో సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతను చనిపోయాడు. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టడం వల్ల అతను ఏడు జన్మలు పులిగా, మూడు జన్మలు కోతిగా, అయిదు జన్మలు ఎద్దుగా పుట్టి, పది జన్మలు స్త్రీగా పుట్టాడు. ఆ తర్వాత పది జన్మలు పందిగా జన్మించాడు. ఆ తర్వాత ఓ పేదబ్రాహ్మణుడి ఇంట్లో స్త్రీగా పుట్టాడు. ఆమె యవ్వనవతి అవ్వగానే… ఓ విధ్వంసుడికి ఇచ్చి పెండ్లి చేశారు. పెళ్లయిన కొంతకాలానికే ఆమె భర్త చనిపోయాడు. చిన్నతనంలోనే ఆమెకు అష్టకష్టాలు సంభవించాయి. తల్లిదండ్రులు, బంధువులు ఆమెను చూసి దు:ఖించసాగారు. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగిందో తెలుసుకునేందుకు తన దివ్యదృష్టిని ఉపయోగించాడు. ఆ తర్వాత ఆమెతో సాలగ్రామ దానం చేయించాడు. ”నాకు బాలవైదవ్యం కారణమైన పూర్వజన్మ పాపాం నశించుగాక” అని సాలగ్రామ దానఫలాన్ని ధారబోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం కావడం వల్ల దాని ఫలంతో ఆమె భర్త పునర్జీవించాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలం అన్యోన్యంగా మెలిగారు. ఆ తర్వాతి జన్మలో ఆమె మరో బ్రాహ్మడి ఇంట్లో కుమారుడిగా జన్మించాడు. నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తిని పొందాడు.

       “కాబట్టి ఓ జనక మహారాజా! శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసినట్లయితే… ఆ ఫలితం ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఆ సాలగ్రామ దానాన్ని నిత్యం ఆచరిస్తూ ఉండు” అని సెలవిచ్చాడు.

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్తేన కార్తీక మహత్య ద్వాదశాధ్యాయ: సమాప్త:  –పన్నెండో రోజు పారాయణం సమాప్తం

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం 11వ అధ్యాయం : మంథరుడు – పురాణ మహిమ

        తిరిగి వశిష్టుడు ఇలా చెబుతున్నారు… ”ఓ జనక మహారాజా! ఈ కార్తిక మాస వ్రతం మహత్యాన్ని గురించి ఎన్నో ఉదాహరణలు చెప్పాను. ఇంకా దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఈ నెలలో విష్ణుదేవుడిని అవిసె పూలతో పూజించినట్లయితే.. చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. విష్ణు అర్చన తర్వాత పురాణ పఠనం చేసినా, చేయించినా, విన్నా, వినిపించినా… అలాంటి వారు వైకుంఠాన్ని పొందుతారు. దీన్ని గురించిన మరో ఇతిహాసాన్ని చెబుతాను. సావధానంగా విను… అని ఇలా చెప్పసాగారు…

       పూర్వము కళింగ రాజ్యంలో మంధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ, అక్కడే భోజనం చేస్తూ, మద్యమాంసాలను సేవిస్తూ… తక్కువ జాతి సాంగత్యంలో గడపసాగాడు. ఆ కారణంగా స్నాన, జప, దీపారాధనలను పాటించకుండా, దురాచారుడిగా తయారయ్యాడు. అయితే… ఆయన భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతవంతురాలు, భర్త ఎంతటి దుర్మార్గుడైనా, పతియే ప్రత్యక్ష దైవమనే ధర్మాన్ని పాటించేది. విసుగు చెందక సకల ఉపచారాలు చేసేది. పతివ్రతాధర్మాన్ని నిర్వర్తిస్తుండేది.

       మంథరుడు ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ, ఆదాయం సరిపోక వర్తకం కూడా చేయసాగాడు. అఖరికి దానివల్ల కూడా పొట్టగడవకపోవడంతో దొగతనాలు చేయడం ఆరంభించాడు. దారికాచి బాటసారుల్ని బెదిరించి, వారిదగ్గర ఉన్న ధనం, వస్తువులను అపహరించి జీవించసాగాడు.

        ఒక రోజు ఒక బ్రాహ్మణుడు అడవిదారిలో పోతుండగా… అతన్ని భయపెట్టి, కొంత ధనాన్ని అపహరించాడు. ఆ సమయంలో ఇద్దరిమధ్యా ముష్టియుద్ధం జరిగింది. అంతలో అక్కడకు ఇంకో కిరాతకుడు వచ్చి, ధనాశతో వారిద్దరినీ చంపేసి, ధనాన్ని తీసుకెళ్లాడు. అంతలో అక్కడ ఒక గుహ నుంచి పులి గాండ్రించుకుంటూ కిరాతకుడిపైన పడింది. కిరాతకుడు దాన్ని కూడా వధించాడు. అయితే పులి చావడానికి ముందు పంజాతో బలంగా కొట్టిన దెబ్బ ప్రభావం వల్ల కొంతసేపటికి తీవ్ర రక్తస్రావంతో అతనుకూడా చనిపోయాడు. కొద్దిక్షణాల వ్యవధిలో చనిపోయిన బ్రాహ్మడు, మంథరుడు, కిరాతకుడు నరకానికి వెళ్లారు. హత్యల కారణంగా వారంతా నరకంలో నానావిధాలైన శిక్షలను అనుభవించారు.

మంధరుడు చనిపోయిన రోజు నుంచి అతని భార్య నిత్యం హరినామ స్మరణం చేస్తూ సదాచారవర్తినిగా భర్తను తలచుకుంటూ కాలం గడిపింది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక రుషి రాగా… ఆమె గౌరవంగా అర్ఘ్యపాద్యాలను పూజించి ”స్వామీ! నేను దీనురాలను, నాకు భర్తగానీ, సంతతిగానీ లేదు. నేను సదా హరి నామాన్ని స్మరిస్తూ జీవిస్తున్నాను. నాకు మోక్షం లభించే మార్గం చూపండి” అని ప్రార్థించింది. ఆమె వినమ్రత, ఆచారాలకు సంతసించిన ఆ రుషి ” అమ్మా… ఈరోజు కార్తీక పౌర్ణమి. చాలా పవిత్రమైనది. ఈ రోజును వృథాచేయకు. ఈ రాత్రి దేవాలయంలో పురాణాలు చదువుతుఆరు. నేను చమురుతీసుకుని వస్తాను. నువ్వు ప్రమిదలు, వత్తులు తీసుకుని రా. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలితాన్ని నీవు అందుకుంటావు” అని చెప్పారు. దానికి ఆమె సంతసించి, వెంటనే దేవాలయానికి వెళ్లి శుభ్రం చేసి, గోమయంతో అలికి, ముగ్గులు పెట్టి, తానే స్వయంగా వత్తి చేసి, రెండు వత్తులు వేసి, రుషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి, దీపారాధన చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తనకు కనిపించిన వారిని ” ఈ రోజు ఆలయంలో జరిగే పురాణ పఠనానికి తప్పకుండా రావాలి” అని ఆహ్వానించింది. ఆమె కూడా రాత్రి పురాణం విన్నది. ఆ తర్వాత కొంతకాలం విష్ణునామస్మరణతో జీవించి, మరణించింది.

       ఆమె పుణ్యాత్మురాలవ్వడం వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠానికి తీసుకెళ్లారు. అయితే ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెం దోషం కలిగింది. కొద్ది నిమిషాలు నరకంలో గడపాల్సి వచ్చింది. దీంతో మార్గమధ్యంలో యమలోకానికి తీసుకెళ్లారు. అక్కడ నరకంలో మరో ముగ్గురితో కలిసి బాధపడుతున్న భర్తను చూసి ఒక్క క్షణం దు:ఖించింది. విష్ణుదూతలతో ”ఓ విష్ణుదూతలారా! నా భర్త, ఆయనతోపాటు మరో ముగ్గురు నరకబాధలు అనుభవిస్తున్నారు. వారిని ఉద్దరించడమెలా?” అని కోరగా… విష్ణుదూతలు ఇలా చెబుతున్నారు.. ”అమ్మా.. నీ భర్త బ్రాహ్మణుడై కూడా స్నానసంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండోవ్యక్తి కూడా బ్రాహ్మనుడే అయినా… ధనాశతో ప్రాణమిత్రుడిని చంపి ధనం అపహరించాడు. మూడోవాడు పులిజన్మను పూర్తిచేసుకున్నవాడు కాగా… నాలుగో కిరాతకుడు. అతను అంతకు ముందు జన్మలో బ్రాహ్మణుడే” అని చెప్పారు. అతను అనేక అత్యాచారాలు చేసి, ద్వాదశిరోజున మధుమాంసాలను భక్షించి పాతకుడయ్యాడు. అందుకే వీరంతా నరకబాధలు పడుతున్నారని చెప్పారు.

విష్ణుదూతలు చెప్పినది విని ఆమె దు:ఖించి ”ఓ పుణ్యాత్ములారా! నా భర్తతోపాటు మిగతా ముగ్గురిని కూడా ఉద్దరించే మార్గముందా?” అని ప్రార్థించింది. దీంతో విష్ణుదూతలు ”అమ్మా! కార్తీక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన పుణ్యఫలాన్ని ధారపోస్తే వారు నరక బాధల నుంచి విముక్తులవుతారు” అని చెప్పారు. దీంతో ఆమె అదేవిధంగా తన పుణ్యఫలాన్ని ధారపోసింది. దీంతో వారంతా ఆమెతో కలిసి మిగతా నలుగురూ వైకుంఠానికి విమానమెక్కి విష్ణుదూతలతో బయలుదేరారు.

       “ఓ జనక మహారాజా! చూశావా? కార్తీకమాసంలో పురాణాలు వినడం, దీపం వెలిగించడం వంటి ఫలితాలు ఎంతటి పుణ్యాన్నిస్తాయో?” అని వశిష్టులు మహారాజుకు చెప్పారు.

ఇది స్కాంధపురాణాంతర్గతంలోని కార్తీక పురాణం పదకొండో అధ్యాయం సమాప్తం…

హరి: ఓం….

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

క్షీరాబ్ది ద్వాదశి – చిలుకు ద్వాదశి – పావన ద్వాదశి – యోగీశ్వర ద్వాదశి

        మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీక మాసం. అందులోనూ అతి విశిష్టమైన తిధి క్షీరాబ్ది ద్వాదశి. కార్తీకమాసంలో వచ్చే శుద్ధ ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి. క్షీరసాగరాన్ని మధించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అనీ, యోగులు, మునులు తమ ఉపవాస దీక్షను విరమించే పవిత్ర తిధి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ క్షీరాబ్ది ద్వాదశి భారతావనిలో ప్రాచుర్యం పొందింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పవళించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశినాడు నిద్ర మేల్కొంటాడు. దాని తర్వాత వచ్చేక్షీరాబ్ది ద్వాదశి ఎంతో పుణ్యదినంగా సమస్త హైందవ జాతి భావిస్తుంది. ఈ రోజున పుణ్యనదిలో స్నానం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈ రోజు అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో, కాశీక్షేత్రంలో కోటిమందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణప్రోక్తంగా చెప్పబడింది. క్షీరాబ్ధి ద్వాదశి శ్రీ మహావిష్ణువు తేజోభరితంగా అమృతకలశాహస్తయై సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని పరిణయమాడిన శుభతిధి. ఈ కారణం చేతనేక్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తయిదువలు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి, శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసీదేవిని శ్రీలక్ష్మీదేవిగానూ, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను తలచడం వల్ల తులసి చెట్టుకు, ఉసిరి కొమ్మకను కలిపి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని సభక్తికంగా పూజించి, వారిద్దరికీ వివాహం జరిపించినట్లుగా భావించి పునీతులవుతారు.

అంబరీషుని విష్ణుభక్తి

       క్షీరాబ్ది ద్వాదశీ మాహాత్మ్యాన్ని భాగవత గాధ అయిన అంబరీషుని కథ సుధామయంగా తేటతెల్లం చేస్తుంది. సప్తద్వీపాల భూభారాన్ని అత్యంత భక్తి సామర్ధ్యాలతో పాలిస్తూ, దానివల్ల ప్రాప్తించిన సిరిసంపదలకు ఏమాత్రం పొంగిపోక, కేవలం విష్ణు పాదాచర్చనమే శాశ్వతమని భావించే చక్రవర్తి అంబరీషుడు. ద్వాదశీ వ్రతాన్ని అత్యంత నియమ నిష్ఠలతో ఆచరించిన అంబరీషుడు, వ్రతాంతాన కాళిందీ నదీజలంలో పుణ్యస్నానం చేసి, మధువనంలో మహాభిషేకవిధాన శ్రీహరికి అభిషేకాన్ని మహిమాన్వితంగా నిర్వహించాడు. తరువాత లోకోపకరమైన సాలవర్ష ప్రవాహాలను కురిపించే మహిమాన్వితమైన ఆరువేల కోట్ల పాడిగోవులను బ్రాహ్మణులకు దానమిచ్చాడు. అనేక బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం పెట్టించి, తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతూ ఉండగా చతుర్వేదాలను విశ్లేషించగల ధీశాలి, అమిత తపస్సంపన్నుడూ అయిన దూర్వాస మహాముని ఆ ప్రాంతానికి విచ్చేశాడు.

       దివ్యమైన ఆ సమయంలో దూర్వాసుని రాకను అతి పవిత్రంగా, ఆనందకరంగా భావించిన అంబరీషుడు ఆ మహామునిని భోజనం చేయమని అర్థించాడు. మహర్షి కాళిందిలో స్నానం చేసి వస్తానని అంబరీషుడికి చెప్పి శిష్యబృందంతో స్నానానికి వెళాడు. నదిలో స్నానం చేస్తూ పరవశంతో పరధ్యానంలో మునిగాడు దూర్వాసుడు. ద్వాదశి ఘడియలలో భుజిస్తే గాని వ్రత ఫలం దక్కదు కాబట్టి విచ్చేసిన బ్రాహ్మణులతో, పండితులతో అంబరీషుడు మంచిచెడులను సమాలోచించాడు. “విబుధులారా! దూర్వాసుడు నా అతిథి. అతనికి మర్యాదలు చేయడం నా విద్యుక్త ధర్మం. మహర్షి భుజించకుండా నేను భోజనం చేస్తే అతని ఆగ్రహానికి, శాపానికి గురి అవుతాను. అయితే, ద్వాదశ ఘడియలలో నేను పారణం చేయకపోతే, వ్రతఫలం దక్కదు, విష్ణుదేవుని కృపావృష్టి నాపై వర్షించదు. బ్రాహ్మణ శాపం కంటే విష్ణుదేవుని కృప ముఖ్యం కాబట్టి నేను ద్వాదశ ఘడియలలో నేను శుద్ధ జలాన్ని సేవిస్తే ఉపవాస దీక్ష ముగించినట్లవుతుంది. భోజనం చేయకుండా వేచి ఉంటాను కాబట్టి పూజ్యనీయుడైన అతిథినీ గౌరవించినట్లవుతుంది. ఒకవేళ, అప్పటికీ ఆగ్రహించి మహర్షి శపిస్తే, అది పూర్వజన్మల ఫలంగా భావించి భరిస్తాను” అని వారితో చెప్పి తన మనస్సులో శ్రీహరిని త్రికరణ శుద్ధిగా ధ్యానించి, కేవలం జలాన్ని సేవించి, దూర్వాస మహాముని రాకకోసం ఎదురు చూస్తున్నాడు.

దూర్వాసుని శాపం

      ఇంతలో నదీస్నానం ముగించి వచ్చిన దూర్వాసుడు జరిగింది దివ్యదృష్టితో గ్రహించి రాజు చేసిన కార్యం మహాపరాధంగా, తనకు జరిగిన ఘోరమైన అవమానంగా భావించి కోపోద్రిక్తుడై, తన కళ్ల నుంచి నిప్పులు రాల్చే విధంగా అంబరీషుని చూస్తూ, తన జటాజూటం నుంచి ఒక కృత్య(దుష్టశక్తి)ని సృష్టించి అతనిపై ప్రయోగించాడు. ఈ పరిణామానికి భయపడిన అంబరీషుడు శ్రీ మహావిష్ణువును ప్రార్ధించగా భక్తవత్సలుడైన శ్రీ మహావిష్ణువు దుష్టరాక్షసులకు మృత్యుసూచకమైన ధూమకేతువు, ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగించాడు. వక్రమైన రాక్షసులను వక్కళించే ఆ సుదర్శన చక్రం ప్రళయకాల అగ్నిహోత్రంలా ఆవిర్భవించి క్షణాలలో దూర్వాసుడు సృష్టించిన కృత్యను దహించివేసి, దురహంకారియైన దూర్వాసుని వెంబడించింది. ముల్లోకాలలోనూ దూర్వాసుని వెంబడించిన సుదర్శన చక్ర ప్రతాప జ్వాలల నుంచి దూర్వాసుని రక్షించటం ఎవరి తరం కాలేదు. ఆ మహర్షి తనకు రక్షనిమ్మని విధాతయైన బ్రహ్మను ప్రార్ధించగా అతనితో బ్రహ్మ “మునివర్యా! నీవు దుర్దాంత మహాదురితాలను మర్దించే సుదర్శన చక్రం నుంచి రక్షించబడాలంటే కేవలం జగద్రక్షకుడైన విష్ణుమూర్తికే అది సాధ్యం.

       అతనినే శరణువేడటం శ్రేయస్కరం” అని చెప్పగా శ్రీ మహావిష్ణువు చెంతకు చేరి దూర్వాసుడు ‘ఓ భక్తవరదా! దయాసింధూ! నీ యొక్క చక్రాగ్ని జ్వాలల నుండి నన్ను రక్షించు ప్రభూ” అని వేడగా అతనితో కేశవుడు ” ఓ మునిసత్తమా! నేను భక్తులకు సదా దాసుడను. తమ భక్తి పాశాలతో నన్ను భక్తులు తమ హృదయాలలో బంధించి ఉంచుతారు. భక్తుల నిష్ఠలు చెరపబడటం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది. నిన్ను ఈ సమయాన రక్షించగలిగిన వ్యక్తి భక్త శ్రేష్ఠుడైన అంబరీషుడు మాత్రమే” అనగా తిరిగి అంబరీషుని చెంతకు వెళ్లాడు దూర్వాసుడు. “ఓ రాజా! ప్రశస్తమైన క్షీరాబ్ధి ద్వాదశి దీక్షలో ఉన్న నిఉన్న అమితంగా బాధించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నన్ను మన్నించు రాజేంద్రా” అనగానే వినయ సంపన్నుడైన అంబరీషుడు “తపోధనా! ఈ రోజు జరిగినవన్నీ భగవత్సంకల్ప యుతాలు, ఆ జగన్నాటక సూత్రధారుని కల్పితాలు”అని సుదర్శన చక్రమును స్తుతించగా, తిరిగి చక్రము తన ఆగ్రహ జ్వాలను తగ్గించుకొని శ్రీహరి సన్నిధికి చేరింది. అంబరీషుడు పెట్టిన మృష్టాన్న భోజనాన్ని ఆరగించిన దూర్వాసముని సంతుష్టుడై “ఓ రాజా! ఈ రోజు లోకాలన్నిటికీ నీ భక్తి యొక్క గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడైంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి పుణ్య తిధి నాడు నీ కథా శ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని, విష్ణు సాయుజ్యాన్ని పొందెదరు గాక” అని అనుగ్రహించినట్లు మహాభాగవతంలో చెప్పబడింది.

అధిక ఫలం

        ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పరమ పవిత్రమైన తిధియై భూలోకంలో జనులను పునీతులను చేస్తోంది. కార్తీక మాసంలో శని త్రయోదశి సోమవారం కంటే ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. ఆ శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి వందరెట్లు ఫలితాన్ని సమకూరుస్తుంది. ఆ కార్తీక పౌర్ణమి కంటే బహుళ ఏకాదశి కోటి రెట్లు అధిక ఫలాన్నిస్తుందనేది ఆర్యోక్తి. బహుళ ఏకాదశి కంటే క్షీరాబ్ది ద్వాదశి అతి విస్తారమైన ఫలాన్ని, పుణ్యాన్ని ఇస్తుందనేది భాగవత వచనం. మాసాలలో అగ్రగణ్యమైన కార్తీక మాసం అతులిత మహిమల వారాశి! కార్తీక మాసాన వచ్చే పవిత్ర తిధులలో అగణిత పుణ్యరాశి క్షీరాబ్ది ద్వాదశి!           

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం పదో అధ్యాయం : అజామీళుని జన్మ వృత్తాంతం

       అజామీళుని వృత్తాంతమంతా విన్న జనక మహారాజు వశిష్టుడితో ఇలా అడుగుతున్నారు… ”ఓ మహానుభావా.. అజామీళుడు ఎంతటి నీచుడైనా అంత్యకాలాన నారాయణ మంత్ర పఠనంతో విష్ణుసాన్నిధ్యాన్ని పొందిన తీరును చక్కగా వివరించారు. అయితే నాకో చిన్న సంశయం. గత జన్మ కర్మ బంధాలు ఈ జన్మలో వెంటాడుతాయన్నట్లు అజామీళుడు కూడా గత జన్మలో చేసుకున్న కర్మలే ఆయనకు మోక్షాన్ని కల్పించాయా?” అని ప్రశ్నించారు.. దానికి మునివర్యులు ”ఓ జనక మహారాజా! నీకు వచ్చిన సందేహమే యమదూతలకు కూడా వచ్చింది. ఆ వృత్తాంతం… అజామీళుడి జన్మ వృత్తాంతం చెబుతాను విను” అని ఇలా చెప్పసాగారు…

       అజామీళుని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకెళ్లాక యమ కింకరులు ధర్మరాజు వద్దకు వెళ్లారు. ”ప్రభూ! మీ ఆజ్ఞ ప్రకారం అజామీళుడిని తీసుకొచ్చేందుకు వెళ్లాం. అక్కడకు విష్ణుదూతలు వచ్చి, మాతో వాదించి అతన్ని పట్టుకెళ్లారు. చేసేది లేక మేము వట్టిచేతులతో తిరిగి వచ్చాం” అని భయకంపితులై విన్నవించుకున్నారు.

       “అరెరె…! ఎంత పని జరిగింది? ఇంతకు ముందెన్నడూ ఇలా కాలేదే? దీనికి బలమైన కారణం ఉండొచ్చు” అని తన దివ్యదృష్టితో అజామీళుడి పూర్వజన్మ వృత్తాతం తెలుసుకున్నాడు. ”ఆహా…! అదీ సంగతి. నారాయణ మంత్రంతో అతను విష్ణుసాన్నిధ్యాన్ని పొందాడు” అని అతని పూర్వజన్మ వృత్తాతం చెప్పసాగాడు.

       అజామీళుడు పూర్వజన్మలో మహారాష్ట్రలోని ఒక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు. అతను అపురూపమైన అందం, సిరిసంపదలు, బలగర్వంతో శివారాధన చేయకుండా ఆలయానికి వచ్చే ధనాన్ని దొంగతనం చేస్తుండేవాడు. శివుడికి ధూపదీప నైవేద్యాలు పెట్టకుండా, దుష్ట సహవాసాలు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు. ఒక్కోసారి శివుడికెదురుగా పాదాలు పెట్టి పడుకునేవాడు.

        అతనికి ఓ పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఏర్పడంది. ఆమె కూడా అందమైనది కావడంతో ఆమె భర్త చూసీచూడనట్లు వ్యవహరించేవాడు. అతను భిక్షాటనకు ఊరూరూ తిరుగుతూ ఏదో ఒకవేళకు ఇంటికి వచ్చేవాడు. ఒకనాడు పొరుగూరికి వెళ్లి, యాచన చేసిన బియ్యం, కూరలు నెత్తినబెట్టుకుని వచ్చి అలసటతో… ”నాకు ఈరోజు ఆకలి తీవ్రంగా ఉంది. త్వరగా వంటచేసి, వడ్డించు” అని భార్యను ఆజ్ఞాపించాడు. ఆమె అందుకు చీదరించుకుని, నిర్లక్ష్యంతో కాళ్లు కడుగుకొనేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. అతని వంక కన్నెత్తైనా చూడలేదు. తన ప్రియుడిపై మనస్సుగలదై భర్తను నిర్లక్ష్యం చేసింది. ఇది భర్త కోపానికి దారి తీసింది. దీంతో అతను కోపంతో ఓ కర్రతో బాదాడు. ఆమె ఆ కర్రను లాక్కొని, భర్తను రెండింతలు ఎక్కువ కొట్టి, ఇంటి బయట పారేసి, తలుపులు మూసేసింది. అతను చేసేదిలేక, భార్యపై విసుగు చెంది, దేశాటనకు వెళ్లిపోయాడు. భర్త ఇంటినుంచి వెళ్లిపోవడంతో సంతోషించిన ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుమీద కూర్చుంది.

        అటుగా వెళ్తున్న ఓ రజకుడిని పిలిచి… ”ఓయీ… నువ్వు ఈ రాత్రికి నా దగ్గరకు రా. నా కోరిక తీర్చు” అని కోరింది. దానికి అతను ”అమ్మా! నువ్వు బ్రాహ్మణ పడతివి. నేను రజకుడిని. మీరు అలా చేయడం ధర్మం కాదు. నేను ఆ పాపపు పనిని చేయలేదు” అని బుద్ధి చెప్పి వెళ్లిపోయాడు. ఆమె ఆ రజకుడి అమాయకత్వానికి లోలోపల నవ్వుకుని, ఆ గ్రామ శివార్చకుడి (అజామీళుడి పూర్వజన్మ) దగ్గరకు వెళ్లింది. వయ్యారాలు వలుకబోస్తూ… తన కామవాంఛ తీర్చమని పరిపరివిధాలా బతిమాలింది. ఆ రాత్రంతా అతనితో గడిపింది. ఉదయం ఇంటికి తిరిగి వచ్చి… ”అయ్యో! నేనెంతటి పాపానికి ఒడిగట్టాను? అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను వెళ్లగొట్టి, క్షణికమైన కామవాంఛకు లోనై… మహాపరాధం చేశాను” అని పశ్చాత్తాపపడింది. ఒక కూలీవాడిని పిలిచి, కొంత ధనమిచ్చి, తన భర్తను వెతికి తీసుకురమ్మని పంపింది. కొన్ని రోజులు గడిచాక ఆమె భర్త ఇంటికి తిరిగిరాగా… పాదాలపై పడి తన తప్పులను క్షమించమని వేడుకుంది. అప్పటి నుంచి మంచి నడవడికతో భర్త అనురాగాలను సంపాదించింది.

        కొంతకాలానికి ఆమెతో కామక్రీడలో పాల్గొన్న శివార్చకుడు వింత వ్యాధితో రోజురోజుకీ క్షీణిస్తూ మరణించాడు. అతను రౌరవాది నరకాల బారిన పడి, అనేక బాధలు అనుభవించి, మళ్లీ నరజన్మ ఎత్తాడు. సత్యవ్రతుడనే బ్రాహ్మణోత్తముని కొడుకుగా పుట్టాడు. గత జన్మలో ఆ బ్రాహ్మణుడు చేసిన కార్తీక స్నానాల వల్ల అతనికి తిరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తించింది. అతనే అజామీళుడు. ఇక ఆ బ్రాహ్మణ మహిళకూడా కొంతకాలానికి చనిపోయి, అనేక నరకబాధలు అనుభవించింది. ఆ తర్వాత ఓ హరిజనుడి ఇంట పుట్టింది. ఆమె జాతకం ప్రకారం తండ్రికి గండం ఉందని తేలడంతో… అతను ఆమెను అడవిలో వదలగా… అక్కడ ఒక ఎరుకలవాడు ఆమెను పెంచాడు. ఆ అమ్మాయే పెరిగి, పెద్దదై అజామీళుడిని మోహించింది. కులాలు వేరుకావడంతో కులసంకరం చేసి, ఇద్దరూ కలిసిపోయారు. అజామీళుడు ఈ జన్మలో కులసంకరం చేసినా… కేవలం అంత్యకాలాన నారాయణ మంత్రం పఠించినందుకు ఆయన విష్ణుసాన్నిధ్యాన్ని పొందాడని యమధర్మరాజు యమభటులకు వివరించిన తీరును జనక మహారాజుకు వశిష్టుడు చెప్పెను.

ఇట్లు స్కాంధ పురాణాంతర్గతమైన, వశిష్టుడితో చెప్పబడిన కార్తీక పురాణం… పదో అధ్యాయం సమాప్తం         

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

భోదన ఏకాదశి-ఉత్థాన ఏకాదశి : కార్తీక శుద్ధ ఏకాదశి

       కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేర్లు. ఆషాడ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశిగా అయ్యింది. దీనినే హరి-భోధిని ఏకాదశి అని కూడా అంటారు.

       తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈరోజునే జన్మించారు.

       ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరన చేసి, మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి.

        ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి బ్రహ్మదేవునికి నారద మహర్షికి మహ్ద్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది. “ఈ ఏకాదశి పాపాలను హరిస్తుంది. 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని ఒక చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగ ఒక జీవుడు,తన వేలజన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈ రోజు మనం చిన్న మంచిపని (పుణ్యకార్యం) చేసినా, అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవు. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానం కలగడంతో పాటు పాపాపరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం ఒక్కసారైన ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుంది” అని బ్రహ్మదేవుడు నారదునితో పలుకుతాడు.

       ఇంకా ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వలన సూర్యగ్రహణసమయంలో పవిత్ర గంగాతీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లబిస్తుంది. వస్త్రదానం చేయడం వలన, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇవ్వడం వలన ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి.

        ఈ రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్దులు, యోగులు అందరూ విష్ణులోకం చేరి కీర్తనలతోనూ, భజనలతోనూ, హారతులతోనూ శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని ధార్మిక గ్రంధాలు చెప్తున్నాయి. అందువల్ల అందరు విష్ణుమూర్తికి హరతి ఇవ్వండి. ఏవైనా కారణాల వల్ల హారతి ఇవ్వడం కుదరకపోతే దేవాలయానికి వెళ్ళండి. అక్కడ స్వామికి ఇచ్చె హారతిని కన్నులారా చూడండి, వీలైతే స్వామికి హారతి కర్పూరం సమర్పించండి. అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది. స్వామి అనుగ్రహం కలుగుతుంది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

తిరువరంగం హయగ్రీవాచారి జయంతి

(1916 నవంబర్ 25 —1991 డిసెంబర్ 05)

       నిజాం వ్యతిరేక పోరాటం లో ప్రముఖ పాత్ర ఆయనది. స్వాతంత్రోద్యమంలో వరంగల్ నుంచి ఎదిగిన తొలితరం కాంగ్రెస్ నాయకుల్లో ఆయనొకరు. రాజకీయ సామాజిక రంగాల్లో ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఆయన తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడిగా గుర్తింపుపొందారు. నిజాం నిరంకుశ పరిపాలనకు వ్య తిరేకంగా స్వామి రామానందతీర్థ నాయకత్వంలో పోరాటం సాగించిన కొద్దిమంది నాయకులలో ఆయన ఒకరు. ఆయనే తిరువరంగం హయగ్రీవాచారి. వరంగల్ పురపాలక సంఘం ప్రథమ చైర్మన్‌గా, మంత్రిగా పనిచేస్తూ విభిన్న వర్గాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ పలు నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనను ప్రత్యేక పాత్ర పోషించారని ఆయన అభిమానులు, కాంగ్రెస్ నాయకులు హయగ్రీవాచారి చేసిన సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు.

బాల్యం విద్యాభాస్యం..

     హయగ్రీవాచారి 1916 నవంబర్ 25న ధర్మసాగర్ గ్రామంలో జన్మించారు. తిరునగరి శ్రీనివాసాచార్యులు-ఆండాళమ్మ ఆయన తల్లిదండ్రులు. మూడొ తరగతి వరకు ధర్మసాగర్‌లోని వీదిబడిలో చదివారు. కాంతంరాజు, రావుల నరసింహరెడ్డి వద్ద పెద్దబాలశిక్ష చదివారు. ఆ తరువాత వారి కుటుం బం హన్మకొండ పట్టణంలో స్థిరపడింది. ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థానంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఉన్నత పాఠశా ల ఉండేది. ఉన్నత పాఠశాలల్లో చదివే రోజుల్లోనే హయగ్రీవాచారిపై జాతీయోద్యమ ప్రభావం అందరిలాగే పడింది. 1932లో నిర్వహించిన కాకతీయ ఉత్సవాలు ఆనాటి యువకులను ఉత్సాహపరిచాయి. ఎంతోమందిలో ఉత్తేజాన్ని నిం పాయి. ఆ ఉత్సవాల నిర్వహణలో పర్సా రంగారావు, ఉద య రాజుశేషగిరిరావు, ఆవంచ వెంకట్రావు, మాదిరాజు రా మకోటేశ్వరరావు, కాళోజీ రామేశ్వర్‌రావులతోపాటు విద్యార్థి సేవాదళ హయగ్రీవాచారి పనిచేశారు. 1935లో హయగ్రీవాచారి మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులై ఇంటర్‌లో చేరారు. హైదరాబాద్ వెళ్లి బీఏలో చేరి మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత ఆయ న పూర్తి జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు.

వరంగల్‌కు అయ్యగారు ముద్ర

     హయగ్రీవాచారిని అందరూ అయ్యగారు అని ముద్దుగా పిలుచుకునేవారు. ఆయన చేపట్టిన అనేక పదవుల ద్వారా అందివచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. వరంగల్ పట్టణానికి పోచంపాడు నీళ్లు తీసుకువచ్చి వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలలో మంచినీటి కొరత తీర్చటంలో హయగ్రీవాచారి ఎంతోకృషి చేశారని ఆయనకు పేరుం ది. సహకార ఉద్యమ వ్యాప్తిలోనూ, బలహీన వర్గాల పురోగతిలోనూ అయ్యగారి అసాధారణమైందని ఆయన అభిమాను లు గుర్తుచేసుకుంటున్నారు. వరంగల్ జిల్లా బోర్డు వైస్ చైర్మన్‌గా హయగ్రీవాచారి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కృషిచేశారని ఆనాటి కాంగ్రెస్ నాయులు పేర్కొంటున్నారు. 1950-52లో వరంగల్ జిల్లా పారిశ్రామిక సలహా మండలి సభ్యులుగా జిల్లా లో పరిశ్రమల స్థాపనకు కృషి చేశారు. రాష్ట్రస్థాయిలో, అఖిలభారత స్థాయిలో వివిధ అంశాలపై మహాసభలు నిర్వహించడంలో ఆయన పాత్ర కృషి చెప్పుకోదగింది. హైదరాబాద్ హిందీ ప్రచార స భ అధ్యక్షుడిగా, హిందీ ప్రతిస్ఠాన్ వ్యవస్థాపకులుగా హిందీ భాషకు ఆయన చేసిన సేవ ఎంతో గొప్పది.

వరంగల్ పురపాలక సంఘం తొలి అధ్యక్షుడిగా..

    వరంగల్ పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడానికి హయగ్రీవాచారి ఎంతో శ్రమించారు. ఆయన కృషి ఫలితంగానే వరంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. వయోజన ఓటింగ్ పద్ధతిపై ఎన్నికైన వరంగల్ పురపాలక సంఘ తొలి అధ్యక్షుడిగా హయగ్రీవాచారి ఎన్నికయ్యారు. స్వాతంత్య్రానంతరం ఆయన చేపట్టిన తొలిపదవి ఇదే..

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. నలుగురి సీఎంల వద్ద మంత్రిగా..

    హయగ్రీవాచారి అవిభాజ్య వరంగల్‌జిల్లా నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, నలుగురు సీఎంల మంత్రివర్గంలో సభ్యుడిగా పనిచేశారు. 1972 నుంచి ఆయన మంత్రిగా పనిచేశారు. పీవీ నర్సింహారావు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, టీ.అంజయ్య, భువనం వెంకట్రామ్‌రెడ్డిగా పనిచేశారు. ఆయన నిర్వహించిన పదవులను సమర్థవంతంగా చేశారనే పేరును సంపాదించుకున్నారు. పంచాయతీరాజ్, సాంకేతిక విద్య మొదలైన శాఖలను ఆయన నిర్వహించిన కాలంలో ఆయా శాఖల నుంచి జిల్లా వాటాను తెచ్చుకోగలిగారని ఆయనకు పేరుంది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం తొమ్మిదో అధ్యాయం : విష్ణు దూతలు-యమదూతల వివాదం

       అజామీళుడిని తీసుకెళ్తున్న విష్ణుదూతలతో యమదూతలు వాగ్వాదానికి దిగారు. విష్ణుదూతలిలా అంటున్నారు… ”ఓయీ యమదూతలారా. మేం విష్ణు దూతలం. వైకుంఠం నుంచి వచ్చాం. మీ ప్రభువైన యముడు ఎవరిని తీసుకురమ్మని మిమ్మల్ని పంపాడు?” అని ప్రశ్నించారు. దానికి వారు ”ఓ విష్ణుదూతలారా… మానవుడు చేసే పాపపుణ్యాలకు సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం, ధనంజయాది వాయువులు, రాత్రింబవళ్లు, సంధ్యాకాలం సాక్షులుగా ఉండి, ప్రతిరోజూ మా ప్రభువుకు విన్నవించుకుంటారు. మా ప్రభువు వారి కార్యకలాపాలను చిత్రగుప్తుడి ద్వారా మాకు చూపించి, ఆ మనిషి అవసానదశలో మమ్మల్ని పంపుతారు” అని చెప్పుకొచ్చారు.

       పాపుల గురించి విష్ణుదూతలకు యమదూతలు ఇలా వివరిస్తున్నారు… ”అయ్యా… అసలు పాపులు అనే పదానికి నరకంలో ప్రత్యేక నిర్వచనాలున్నాయి. వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించు వారు, గోహత్య, బ్రహ్మ హత్యాది మహాపాపాలు చేసినవారు, పర స్త్రీలను కామించిన వారు, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను – గురువులను – బంధువులను- కుల వృతిని తిట్టి హింసించు వారు, జీవ హింస చేయు వారు, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారును, జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేయు వారును, చేసిన మేలు మరచిన కృతఘ్నులు, పెండిండ్లు శుభ కార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారు పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమ ధర్మరాజు గారి ఆజ్ఞ” అని చెప్పుకొచ్చారు.

       తమ సంవాదానిన కొనసాగిస్తూ… ”ఈ అజామీళుడు బ్రాహ్మణుడై పుట్టి, దురాచారాలకు లోనై, కులభ్రష్టుడై జీవ హింసలు చేసి, కామాంధుడి ప్రవర్తించాడు. వావి వరసలు లేకుండా కూతురువరస యువతితో సంబంధం పెట్టుకున్న పాపాత్ముడు. వీడిని విష్ణులోకానికి ఎలా తీసుకెళ్తారు?” అని ప్రశ్నించగా… విష్ణుదూతలిలా చెబుతున్నారు. ”ఓ యమకింకరులారా! మీరెంత అవివేకులు? మీకు సూక్షధర్మాలు తెలియవు. ధర్మసూక్షాలు ఎలా ఉంటాయో చెబుతాం వినండి. సజ్జనులతో సహవాసము చేయువారు, జపదాన ధర్మములు చేయువారు- అన్నదానం, కన్యాదానం, గోదానం, సాలగ్రామ దానం చేయువారు, అనాథ ప్రేత సంస్కాములు చేయువారు, తులసి వనము పెంచువారు, తటాకములు తవ్వించువారు, శివ కేశవులను పూజించు వారు, సదా హరి నామ స్మరణ చేయువారు, మరణ కాలమందు ‘నారాయణా’ యని శ్రీహరిని గాని, ‘శివ’ అని ఆ పరమశివుని గాని స్మరించు వారు, తెలిసిగాని తెలుయక గాని మరే రూపమున గాని హరి నమ స్మరణ చెవిన బడిన వారును పుణ్యాత్ములు! కాబట్టి అజా మీళుడు ఎంత పాపత్ముడైనాను మరణకాలమున ‘నారాయణా’ అని పలికాడు” అందుకే విష్ణుసాన్నిద్ధ్యానికి అతను అన్నివిధాలా అర్హుడు” అని వివరించారు.

       అజామీళుడికి విష్ణుదూతల సంభాషణ ఆశ్చర్యాన్ని కలిగించింది. ”ఓ విష్ణుదూతలారా! పుట్టిన నాటి నుంచి నేటి వరకు శ్రీమన్నారాయణ పుజగాని వ్రతములు గాని, ధర్మములుగాని చేసి యెరుగను. నవ మాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణ మిల్లలేదు. వర్ణాశ్ర మాములు విడిచి కుల భ్రష్టుడనై, నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచో ‘నారాయణా’ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధలనుంచి రక్షించి వైకుంఠానికి తీసుకెళ్తున్నారు. ఆహా! నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వ జన్మ సుకృతము, నా తల్లి తండ్రుల పుణ్య ఫలమే నన్ను రక్షించినది” అని పలుకుతూ… సంతోషంగా విమానమెక్కి వైకుంఠానికి వెళ్లడు.

       “కాబట్టి ఓ జనక మహారాజా! తెలిసిగానీ, తెలియక గానీ నిప్పును ముట్టినప్పుడు బొబ్బలెక్కడం, బాధకలగడం ఎంత నిజమో… శ్రీహరిని స్మరించినంతనే పాపాలు నశించి, మోక్షాన్ని పొందుతారనడం అంతే కద్దు” అని వివరించారు.

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి నవమధ్యాయ: – తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

మహర్షి యాజ్ఞవల్క్యు జయంతి

       విద్యాదికుడు సరస్వతి పుత్రుడని .. సరస్వతీ కటాక్షము ఉన్నవారు దైవసమానులని, వారిని పూజించితే దేవుని పూజించినట్లే అని మన పూర్వీకుల విశ్వాసము . ఉత్తమోత్తమ విద్యాధిపతి యాజ్ఞవల్క్యుడు ..

దేవునితో సమానము .
       కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసాలకు పెట్టింది పేరు ఈ మహర్షి. ఈ మూడు ఉంటే సామాన్యుడు కూడా ఎంతో ఉత్తముడిగా ఎదిగి తీరుతాడని నిరూపించాడు ఈ యాజ్ఞవల్క్య మహర్షి. పూర్వం కురుపాంచాల దేశంలో గంగానదీ తీరాన చమత్కారపురం అనే నగరం ఉండేది. ఆ నగరంలోనే యజ్ఞవల్క్యుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్యపేరు సునంద. ఆ దంపతులిద్దరికీ జన్మించినవాడే యాజ్ఞవల్క్యుడు. యాజ్ఞవల్క్యుడికి ఆయన తండ్రి సమయ సందర్భ కాలోచితంగా చెయ్యాల్సిన సంస్కారాలన్నీ చేయించాడు. దాంతో యాజ్ఞవల్క్యుడు భాష్కలుడి దగ్గర రుగ్వేదాన్ని, జైమిని మహర్షి దగ్గర సామవేదాన్ని, అరుణి దగ్గర అధర్వణవేదాన్ని నేర్చుకున్నాడు.

       ఆ తర్వాత యాజ్ఞవల్క్యుడి తండ్రి యజ్ఞవల్క్యుడు తన కుమారుడిని వైశంపాయన మహర్షి దగ్గరకు పంపాడు. అక్కడ యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు యాజ్ఞవల్క్యుడు. ఆ వేదంతోపాటు మరింకా ఎన్నెన్నో విషయాలను గ్రహించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి అహంకారం, విద్యామదం లాంటివి కలిగాయి. ఆ విషయాన్ని గురువు గ్రహించాడు. ఆ లక్షణాలు కాలక్రమంలో మెల్లమెల్లగా తగ్గిపోతాయని అనుకున్నాడు ఆ గురువు. అయితే యాజ్ఞవల్క్యుడిలో నానాటికీ విద్యామదం పెరగసాగింది.

       అది ఆత్మాభిమానమని యాజ్ఞవల్క్యుడు అనుకున్నాడు. ఓ రోజున వైశంపాయనుడు తన మేనల్లుడు అధర్మమార్గంలో సంచరిస్తున్నాడని తెలుసుకొని కోపం పట్టలేక కాలితో అతడిని తన్నాడు. బ్రాహ్మణుడిని కాలితో తన్నటం బ్రహ్మహత్యతో సమానమని ధర్మశాస్త్రాలు చెప్పిన విషయాన్ని వైశంపాయనుడు కోపం చల్లారిన తర్వాత గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇక ఆ పాపాన్ని ఎవరు పోగొడతారా అని మదనపడసాగాడు. ఆ విషయాన్ని గమనించిన యాజ్ఞవల్క్యుడు గురువు దగ్గరగా వెళ్ళి ఆ పాపాన్ని పోగొట్టడం తనవల్ల తప్ప మరెవరివల్లా కాదని గర్వంగా అన్నాడు. తనపాపం పోవటం అటుంచి అంతటి కష్టకాలంలోను శిష్యుడు అంత గర్వంగా మాట్లాడటం గురువుకు కోపం తెప్పించింది. ఇక తాను ఎలాంటి విద్యలు అతడికి నేర్పబోనని, అప్పటిదాకా నేర్పినవాటినన్నింటినీ కక్కి (ఏవీ గుర్తుంచుకోకుండా మరిచిపోయి) వెళ్ళిపొమ్మని అన్నాడు. గురుద్రోహానికి అదే తగిన శిక్ష అని అన్నాడు. అయితే అప్పటికి యాజ్ఞవల్క్యుడు తాను ఆత్మాభిమానం పేరున గర్వభావాన్ని కలిగివున్నానని తెలుసుకొన్నాడు. క్షమించమని గురువును వేడుకొన్నా లాభం లేకపోయింది. అయితే తనవంతు బాధ్యతగా యాజ్ఞవల్క్యుడు తన తపోబలంతో గురువుకు సంక్రమించిన బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టి తాను నేర్చుకొన్న వేదాలను అక్కడే రక్తరూపంలో కక్కి వెళ్ళిపోయాడు. అయితే ఎంతో విచిత్రంగా యాజ్ఞవల్క్యుడు విసర్జించినదాన్ని కొన్ని తిత్తిరిపక్షులు గ్రహించాయి. అవి తిరిగి ఆ వేదసారాన్ని పలకసాగాయి. ఆ పలుకులే తైత్తిరీయోపనిషత్తుగా ప్రసిద్ధికెక్కాయి.

గురువు దగ్గర నేర్చుకున్నదంతా అక్కడే వదిలివేసిన యాజ్ఞవల్క్యుడు దిగాలుపడి కూర్చోలేదు. ఆత్మస్త్థెర్యంతో సూర్యభగవానుడిని ఆరాధించి ఆయన కరుణకు పాత్రుడై శుక్లయజుర్వేదాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలూ అభ్యసించాడు. అలా అందరికన్నా ఉత్తమోత్తమ విద్యాధిపతిగా యాజ్ఞవల్క్యుడు పేరుతెచ్చుకున్నాడు. కణ్వుడు లాంటి ఉత్తమశిష్యులు ఆయనదగ్గర శిక్షణ పొందాడు.

       ఒకసారి జనకుడు యాగం చేస్తూ మహర్షులందరినీ ఆహ్వానించాడు. యాజ్ఞవల్క్యుడికి ఆహ్వానం వెళ్ళింది. అలా మహర్షులందరూ రాగానే జనకుడు మీలో ఎవరు గొప్ప విద్యావంతులైతే వారొచ్చి ఇక్కడున్న ధనరాశులను తీసుకువెళ్ళవచ్చు అని గంభీరంగా అన్నాడు. అయితే రుషులంతా ఒకరిముఖాలు ఒకరు చూసుకొని తామందుకు అర్హులం కామనుకొంటూ ఊరకనే కూర్చున్నారు. యాజ్ఞవల్క్యుడు మాత్రం లేచి తన శిష్యులను పిలిచి ఆ ధనరాశులను తన ఇంటికి తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు.

       యాజ్ఞవల్క్యుడి ధైర్యాన్ని చూసిన అక్కడివారంతా అతడితో శాస్త్రవిషయాల్లో పోటీకి దిగి యాజ్ఞవల్క్యుడిని అనర్హుడిగా నిరూపించేందుకు ఎన్నోవిధాలుగా ప్రయత్నం చేశారుకానీ అవేవీ వారివల్లకాలేదు. దాంతో జనకుడు ఆ రుషిని గొప్పగా పూజించి సత్కరించాడు. జనకునికి ఆయన అనేక ఆధ్యాత్మిక విషయాలను వివరించి చెప్పాడు. యాజ్ఞవల్క్యుడి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. ఓరోజున విశ్వావసుడు అనే గంధర్వుడు యాజ్ఞవల్క్యుడి దగ్గరకు వచ్చాడు. తత్త్వాన్ని ఉపదేశించమని కోరి ఎంతో నేర్చుకొని యాజ్ఞవల్క్యుడంతటి గొప్పవాడు మరొకడు లేడని ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు. అనంతరకాలంలో ఆ రుషి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు.

        ఆ రోజుల్లో కతుడు అనే ఒక రుషి ఉండేవాడు. ఆయనకు కాత్యాయని అనే పేరున్న కూతురుండేది. ఆమెను యాజ్ఞవల్క్యుడికిచ్చి పెళ్ళిచేశారు పెద్దలు. అయితే మిత్రుడు అనే పేరున్న ఒక బ్రాహ్మణుడి కుమార్తె, పండితురాలైన గార్గి అనే ఆమె శిష్యురాలు అయిన మైత్రేయి యాజ్ఞవల్క్యుడిని వివాహమాడాలని పట్టుబట్టింది. అప్పటికే అతడికి కాత్యాయనితో వివాహం కావటంతో పెద్దలకు ఏంచేయాలో అర్థంకాలేదు. గార్గి ఈ సమస్యకు సమాధానాన్ని వెతికింది. మైత్రేయిని కాత్యాయనికి పరిచయంచేసి ఆ ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేలా చేసింది.

       కాత్యాయని, మైత్రేయి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. అప్పుడు గార్గి అసలు విషయాన్ని కాత్యాయనికి చెప్పింది. కాత్యాయని కూడా మైత్రేయి కోరికను మన్నించి యాజ్ఞవల్క్యుడితో వివాహాన్ని జరిపించింది. అలా యాజ్ఞవల్క్యుడికి ఇద్దరు భార్యలయ్యారు. ఆనాటి రుషులంతా యాజ్ఞవల్క్యుడిలోని విద్యావైభవాన్ని, యోగప్రాభవాన్ని గుర్తించి యోగీంద్ర పట్టాభిషేకం చేశారు.

       ఆయన ప్రకటించిన యోగవిషయాలు యోగయాజ్ఞవల్క్యంగా ప్రసిద్ధికెక్కాయి. చివరలో భార్యలకు కూడా తత్త్వాన్ని ఉపదేశించి ఆయన సన్యాసాన్ని స్వీకరించి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)