Categories
Vipra Foundation

కార్తీకపురాణం 27వ అధ్యాయం : దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించమని శ్రీహరి చెప్పుట

       అత్రిమహాముని తిరిగి అగస్త్యునితో ఇలా చెబుతున్నాడు… ”ఓ కుంభసంభవా! ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇలా చెబుతున్నాడు…” అని వృత్తాంతాన్ని వివరించారు.

       శ్రీమహావిష్ణువు దుర్వాసునితో ఇలా చెబుతున్నాడు… ”ఓ దుర్వాస మహాముని! నీవు అంబరీషుడిని శపించిన విధంగా ఆపాది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారమెత్తుట కష్టం కాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వక తప్పదు. అందుకు నేను అంగీకరించాను. బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండేలా చేయడమే నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట్లో భుజించకుండా వచ్చినందుకు అతను చింతతో ఉన్నాడు. బ్రాహ్మణ పరివృత్తుడైనందుకు ప్రాయోపవేశం (అగ్నిలో దూకి ఆత్మహత్య) చేసుకోవాలని నిర్ణయించాడు. ఆ కారణం వల్ల విష్ణు చక్రం నిన్ను బాధించేందుకు పూనుకుంది. ప్రజారక్షణే రాజధర్మం. ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనట్లయితే… వాన్ని జ్ఞానులైన బ్రాహ్మణులు శిక్షించాలి. ఒక విప్రుడు పాపి అయితే.. మరో విప్రుడు దండించాలి. ధనుర్బాణాలు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుడిని తప్ప, మరెవ్వరూ బ్రాహ్మణుడిని దండించకూడదు. బ్రాహ్మణ యువకుడిని దండించడం కంటే మరో పాపం లేదని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. బ్రాహ్మణుడి సిగబట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడు, విప్రుని ద్రవ్యం అపహరించేవాడు, బ్రాహ్మణుడిని గ్రామం నుంచి తరిమినవాడు, విప్ర పరిత్యాగమొనర్చినవాడు బ్రహ్మ హంతకులే అవుతారు. కాబట్టి ఓ దుర్వాస మహర్షి! అంబరీషుని గురించి తప:శ్శాలి అయిన అంబరీషుడు నీ మూలంగా ప్రాణ సంకటం పొందుతున్నాడు. నేను బ్రహ్మ హత్యచేశానే అని చింతిస్తూ పరితాపం పొందుతున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుడి వద్దకు వెళ్లు. అందువల్ల మీ ఇద్దరికీ శాంతి లభిస్తుంది” అని విష్ణుదేవుడు దుర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుడి వద్దకు పంపాడు.

స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్య మందలి సప్త వింశోధ్యాయం – ఇరవయ్యేడవ రోజు పారాయణం సమాప్తం.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

శనిత్రయోదశి

       నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర,  కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.

 ఏ త్రయోదశి అయితే శనివారము తో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని ‘ శనీశ్వరుడు ‘గా సంబోదించి పరమశివుడు వరము ఇచ్చాడు . శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు.

శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది

       సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆ శని ప్రభావమునకు లోనయ్యాను. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు , శని… ” నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో .. వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తునానని తెలిపాడు. ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. శనివారం త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.

శని” భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం త్రయోదశి రోజు .

        శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.

1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.

2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.

3. వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.

4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు (నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం) అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.

5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా “ఓం నమ:శివాయ” అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.

6. ఆరోజు (కుంటివాళ్ళు,వికలాంగులకు) ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం

7. ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి.

శని మహత్యం

       శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .

       బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి.

శనీశ్వర జపం-శనీశ్వరుడి జప మంత్రాలు

“నీలాంజన సమాభాసం,  రవి పుత్రం యమాగ్రజం

ఛాయా మార్తాండ సంభూతం, తమ్ నమామి శనైశ్చరం”

|| ఓం శం శనయేనమ:||

|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||

|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||

శని గాయత్రీ మంత్రం:

ఓం కాకథ్వజాయ విద్మహే

ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.

|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||

బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన “నవగ్రహ పీడహర స్తోత్రం”:

||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: ||

||ఓం శం శనైస్కర్యయే నమః||

||ఓం శం శనైశ్వరాయ నమః||

||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః ||

||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:||

ఓం నమో శనైశ్వరా పాహిమాం,

ఓం నమో మందగమనా పాహిమాం,

ఓం నమో సూర్య పుత్రా పాహిమాం,

ఓం నమో చాయాసుతా పాహిమాం,

ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం,

ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం,

ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం 26వ అధ్యాయం : దుర్వాసుడు శ్రీహరి శరణు వేడుట

       ఈ విధంగా అత్రిమహముని అగస్త్యునితో – దుర్వాసుడి కోపం వల్ల కలిగిన ప్రమాదాన్ని తెలిపి… మిగతా వృత్తాంతాన్ని ఇలా చెబుతున్నాడు.

       సుదర్శనం తరుముతుండగా… ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకం, భువర్లోకం… పాతాలం, సత్యలోకం… ఇలా అన్ని లోకాలు తిరుగుతూ… తనను రక్షించేవారెవరూ లేకపోవడంతో… వైకుంఠానికి వెళ్లాడు. అక్కడ శ్రీహరిని ధ్యానిస్తూ… ”ఓ వాసుదేవా! పరంధామా! జగన్నాథా! శరణాగతి రక్షకా! నన్ను రక్షించు. నీ భక్తుడైన అంబరీషుడికి కీడు చేయదలిచాను. నేను బ్రాహ్మణుడనై ఉండీ ముక్కోపినై మహా అపరాధం చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడగు భృగు మహర్షి నీ హృదయంపైన తన్నినా సహించావు. ఆ కాలి గురుతు నేటికీ నీ వక్షస్థలంపై కనిపిస్తుంది. ప్రశాంత మనస్కుడవై అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపం పెట్టిన నన్నుకూడా రక్షింపుము. నీ చక్రాయుధం నన్ను చంపడానికి వస్తోంది. దాని బారి నుంచి నన్ను కాపాడు” అని దుర్వాసుడు శ్రీమన్నారాయణుడిని అనేకరకాలుగా వేడుకొన్నాడు. దుర్వాసుడు అహంకారాన్ని వదిలి ప్రార్థించడంతో… శ్రీహరి చిరునవ్వుతో… ”దుర్వాసా! నీ మాటలు యథార్థాలు. నీవంటి తపోధనులు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. నీవు బ్రాహ్మణ రూపాన పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసి, భయపడకుండా ఉండేవారు వారు ములోకాల్లో లేరు. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం ఎలాంటి హింసా కలిగించను. ప్రతి యుగంలో గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనులకు సంభవించే ఆపదలను పోగొట్టడానికి ఆయా పరిస్థితులకు తగిన రూపం ధరించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావిస్తాను. నీవు అకారణంగా అంబరీషుడిని శపించావు. కానీ నేను శత్రువుకైనా మనోవాక్కాయాలలో సైతం కీడు తలపెట్టను. ఈ ప్రపంచంలోని ప్రాణి సమూహం నా రూపంగానే చూస్తాను. అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తున్నాడు. అలాంటి నా భక్తుడిని నీవు అనేక విధాలుగా ధూషించావు. నీ ఎడమపాదంతో తన్నావు. అతని ఇంటికి అతిథివై వచ్చికూడా… నేను వేళకు రానట్లయితే… ద్వాదశి ఘడియలు దాటకుండా నువ్వు భోజనం చేయమని చెప్పలేదు. అతడు వ్రతభంగానికి భయపడి, నీ రాకకోసం ఎదురుచూసి, జలపానం మాత్రం చేశాడు. అంతకంటే అతడు అపరాధమేమిచేశాడు? చాతుర్వర్ణాల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానం దాహశాంతిని, పవిత్రతను చేకూరుస్తుంది కదా? జలపానం చేసినంత మాత్రాన నా భక్తుడిని దూషించావు కదా? అతను వ్రత భంగం కాకూడదనే జలపానం చేశాడే తప్ప, నిన్ను అవమానించాలనే ఉద్దేశంతో కాదు కదా? నీవు మండిపడుతున్నా… దూషిస్తున్నా… అతను బతిమాలి, నిన్ను శాంతిపజేసేందుక ప్రయత్నించాడే తప్ప… ఆగ్రహించలేదు. ఆ సమయంలో నేను అంబరీషుడి హృదయంలో ప్రవేశించాను. నీ శాపం అతనిలో ఉన్న నాకు తగిలింది. నీ శాప ఫలంతో నేను పది జన్మలు అనుభవిస్తాను. అతను నీ వల్ల భయంతో నన్ను శరణు వేడాడు. కానీ, తన దేహం తాను తెలుసుకునే స్థితిలో లేదు. నీ శాపాన్ని అతను వినలేదు. అంబరీషుడు నా భక్తకోటిలో ఒక్కడు. భక్తుల్లో శ్రేష్టుడు. అతను నిరపరాధి, దయాశాలి. ధర్మతత్పరుడు. అలాంటి వాడిని అకారణంగా ధూషించావు. అతన్ని నిష్కారణంగా శపించావు. అయితే… నీవేమీ చింతించకు. ఆ శాపాన్ని నేను స్వీకరించాను. లోకోపకారానికి వాటిని నేను అనుభవిస్తాను. అదెలాగంటే… నీ శాపంలో మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పాన్ని రక్షించేందుకు సోమకుడనే రాక్షసుని చంపేందుకు మత్స్యరూపం ధరిస్తాను. మరికొంత కాలానికి దేవదానవులు క్షీరసాగరంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలుకుతారు. ఆ పర్వతాన్ని నీటిలో మునగకుండా నేను కూర్మరూపం ధరించి, నా వీపున మోస్తాను. వరాహ జన్మనెత్తి హిరణ్యాక్షుడిని వధిస్తాను. నరసింహావతారమెత్తి ప్రహ్లాదున్ని రక్షించి, హిరణ్య కశిపుడిని శిక్షిస్తాను. బలిచక్రవర్తి వల్ల ఇంద్రపదవి కోల్పోయిన దేవేంద్రుడికి సింహాసనాన్ని తిరిగి ఇప్పించేందుకు వామన అవతారం ఎత్తుతాను. వామనుడిని పాతాళానికి తొక్కేస్తాను. భూఆరాన్ని తగ్గిస్తాను. అలాగే లోక కంఠకుడైన రావణుడిని చంపి లోకోపకారం చేయడానికి రఘువంశంలో రాముడనై జన్మిస్తాను. ఆ తర్వాత యదువంశంలో శ్రీకృష్ణుడిగా, కలియుగంలో బుద్ధుడిగా, కలియుగాంతంలో విష్ణుచిత్తుడనే బ్రాహ్మణుడి ఇంట్లో కల్కి అనే పేరుతో జన్మిస్తాను. కల్కి అవతారంలో అశ్వారూఢుడనై పరిభ్రమిస్తూ… బ్రహ్మద్వేషులను మట్టుబెడతాను. నీవు అంబరీషుడికి శాపం రూపంలో ఇచ్చిన పదిజన్మలను ఈ విధంగా పూర్తిచేస్తాను. నా దశావతారాలను సదా స్మరించేవారి పాపాలు తొలగిపోయి.. వైకుంఠ ప్రాప్తిని పొందుదురు. ఇది అక్షర సత్యం” అని చెప్పాడు.

ఇది స్కాంధపురాణాంతర్గతంలో వశిషుడు చెప్పినటువంటి కార్తీక మహత్యంలోని 26అధ్యాయం సమాప్తం

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

ఉత్పన్న ఏకాదశి

         కార్తీకమాసంలో వచ్చే రెండు ఏకాదశి తిథులూ చాలా విశిష్టమైనవి. అసలు ఏకాదశి అన్న దేవతే కార్తీక మాసంలో జన్మించిందని ఓ నమ్మకం! అందుకనే కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పత్తి/ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ సందర్భంగా ఏకాదశి జన్మవృత్తాంతం… అనగనగా మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను మహాబలవంతుడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలుదువ్వడం మొదలుపెట్టాడు మురాసురుడు. ఆ బ్రహ్మరాక్షసుని బారి నుంచి తమను కాపాడమంటూ ముల్లోకాలలోని దేవతలందరూ విష్ణుమూర్తిని ఆశ్రయించారు. దాంతో విష్ణుమూర్తి యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు. ఇరువురికీ మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది. వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవరికీ స్పష్టమైన గెలుపు రాకుంది. ఈలోపల విష్ణుమూర్తి యుద్ధంలో తనకు కలిగిన అలసటను తీర్చుకునేందుకు ఓ గుహలో విశ్రమించాడు.

       విష్ణుమూర్తి విశ్రాంతిని తీసుకుంటున్న విషయం మురాసురునికి చేరింది. విష్ణువు నిద్రలో ఉండగానే అతణ్ని సంహరించాలనుకుని నిదానంగా ఆ గుహను చేరుకున్నాడు. కానీ విష్ణుమూర్తిది అంతా యోగనిద్ర కదా! ఎప్పుడైతే చెడుతలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో, వెంటనే విష్ణుమూర్తిలోంచి ఒక శక్తి ప్రభవించింది. ఆమే ఏకాదశి! కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుని బస్మం చేసింది ఏకాదశి దేవి. తన రక్షణ కోసం ప్రత్యక్షం అయిన ఏకాదశి దేవతను చూసి విష్ణుమూర్తి చాలా ప్రసన్నుడయ్యాడు. `నీకేం వరం కావాలో కోరుకో`మంటూ అభయాన్ని ఒసగాడు. దానికి ఏకాదశి `తాను ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని, ఎవరైతే ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ధ్యానిస్తారో వారి పాపాలన్నీ హరించుకుపోవాలనీ` కోరుకుంది. ఆమె కోరికలకి విష్ణుమూర్తి తన అంగీకారాన్ని తెలుపడంతో ఏకాదశికి విశిష్టత ఏర్పడింది. మురాసురుని సంహరించినందుకు విష్ణుమూర్తికి కూడా `మురారి` అన్న పేరు సార్థకమయ్యింది.

       ఏకాదశినాడు ఉపవాసం ఉండాలనుకునేవారు ఆ తిథి మొదలైనప్పటి నుంచి ఏకాదశి ఘడియలు ముగిసేవరకూ ఎలాంటి పక్వాహారమూ తీసుకోకుండా ఉంటారు. మరి కొందరైతే కేవలం నీటితో మాత్రమే గడుపుతారు. ఉపవాసం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తరచూ ప్రకృతి వైద్యులు చెబుతూనే ఉన్నారు. వారానికి ఓసారి ఉపవాసం ఉంటే మంచిదనీ, అదీ కుదరకుంటే 15 రోజులకి ఒకసారైనా ఉపవాసం ఉంటే శరీరం దృఢంగా ఉంటుందని చెబుతారు. తనని తాను స్వస్థత పరచుకునేందుకు శరీరానికి మనం ఇచ్చే అవకాశమే ఉపవాసం. ఇక అమావాస్య, పౌర్ణమి తిథులు దగ్గరపడుతున్న కొద్దీ జ్యోతిష రీత్యా చంద్రుని ప్రభావం మానవుల మనసు, శరీరాల మీద అధికంగా ఉంటుంది. ఏదాదశిరోజున ఉపవాసం ఉండి ద్వాదశినాడు స్వల్పంగానే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అమావాస్య/పౌర్ణమినాటికి శరీరం దృఢంగా, మనసు తేలికగా ఉంటాయి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం 25వ అధ్యాయం : దుర్వాసుడు అంబరీషుడిని శపించుట

       మహారుషులు అంబరీషుడితో ఇలా చెబుతున్నారు…. ”ఓ అంబరీషా! పూర్వజన్మలో నీవు చేసిన కొద్దిపాటి పాపం వల్ల ఈ అవస్థ వచ్చింది. అయితే నీకు ఒకరు చెప్పడం కంటే… నీ బుద్దితో దీర్ఘంగా ఆలోచించి, నీకెలా అనిపిస్తే అలా చేయి” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో అంబరీషుడు ”ఓ పండితోత్తములారా! మీరు వెళ్లేముందు నా అభిప్రాయం కూడా వినండి. ద్వాదశి నిష్టను వీడడం కంటే.. విప్ర శాపం అధికమైనది కాదు. జలపానం చేయడం వల్ల బ్రాహ్మణుడిని అవమానపరుచుట కాదు. ద్వాదశిని విడుచుటా కాదు. అప్పుడు దుర్వాసులవారు నన్నేల నిందిస్తారు? నిందించరు. నా పుణ్యఫలం నశించదు”  అని చెప్పి నీళ్లు తాగాడు. ఆ మరుక్షణమే దుర్వాస మహాముని స్నానజపాదులు పూర్తిచేసుకుని, అక్కడకు వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ ముని మహా రౌద్రాకారుడై… కళ్ల వెంట నిప్పుకక్కుతూ… ”ఓరీ మదాందా! నన్ను భోజనానికి పిలిచి, నేను రాకుండానే నువ్వు ఎలా తింటావు? ఎంత దుర్మార్గం? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిథికి అన్నం పెడతానని ఆశచూపించి, నాకు పెట్టకుండా నీవు తినగలవా? అలా తినేవాడు మాలభక్షకుడవుతాడు. అలాంటి అధముడు మరుజన్మలో పురుగై పుడతాడు. నీవు భోజనానికి బదులు జలపానం చేశావు. అది కూడా భోజనంతో సమానమైనదే. నువ్వు అతిథిని విడిచి భుజించావు. కాబట్టి, నీవు నమ్మకద్రోహివి అవుతావేకానీ, హరిభక్తుడివి కాలేవు. శ్రీహరి బ్రాహ్మణావమానాన్ని సహింపడు. మమ్మల్ని అవమానిస్తే… శ్రీహరిని అవమానించినట్లే. నీవంటి హరినిందాపరుడు ఇంకొకడు లేడు. నీవు మహాభక్తుడివనే అహంకారం, గర్వంతో ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనానికి పిలిచి, అవమానపరచావు. నిర్లక్ష్యంగా జలాపానం చేశావు. అంబరీషా! నీవు ఎలా పవిత్ర రాజకుటుంబంలో పుట్టావు? నీ వంశం కళంకం కాలేదా?” అని కోపంతో నోటికి వచ్చినట్లు ధూషించాడు. అంబరీషుడు గజగజావణుకుతూ… ముకుళిత హస్తాలతో ”మహానుభావా! నేను ధర్మ హీనుడను, నా అజ్ఞానంతో ఈ తప్పు చేశాను. నన్ను క్షమించి, రక్షించండి… బ్రాహ్మణులకు శాంతి ప్రధానం. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యాలున్నవారు” అంటూ ఆయన పాదాలపై మోకరిల్లాడు. దయార్ద్ర హృదయమేలేని దుర్వాసుడు అంబరీషుడి తలను తన ఎడమ కాలితో తన్ని ”దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటిజన్మలో చేపగాను, రెండో జన్మలో తాబేలుగానూ, మూడో జన్మలో పందిగాను, నాలుగో జన్మలో సింహంగానూ, అయిదో జన్మలో వామనుడిగా, ఆరోజన్మలో క్రూరుడవైన బ్రాహ్మణుడిగా, ఏడో జన్మలో ముధుడవైన రాజుగా, ఎనిమిదో జన్మలో రాజ్యంగానీ, సింహాసనంగానీ లేని రాజుగా, తొమ్మిదో జన్మలో పాషండమతస్తునిగా, పదో జన్మలో పాపబుద్దిగలిగి, దయలేని బ్రాహ్మణుడవై పుట్టెదవు గాక” అని శపించాడు. ఇంకా కోపం తగ్గని దుర్వాసుడు మళ్లీ శపించేందుకు ఉద్యుక్తుడవ్వగా… శ్రీమహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృథాకాకూడదని, తన భక్తునికి ఏ అపాయం కలుగకుండా – అంబరీషుని హృదయంలో ప్రవేశించి ”మునివర్యా! అలాగే… మీ శాపాన్ని అనుభవిస్తాను” అని ప్రాధేయపడ్డాడు. కానీ, దుర్వాసుడు కోపం పెంచుకుని శపించబోగా… శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాడు. ఆ సుదర్శనం ముక్కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుతూ దుర్వాసుడిపై పడబోయెను. అంతట దుర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయడం తథ్యమని భావించి ”బ్రతుకుజీవుడా” అని పరుగు ప్రారంభించాడు. మహాతేజస్సుతో చక్రాయుధం దుర్వాసుడిని తరమసాగింది. దుర్వాసుడు తనను కాపాడమని భూలకంలో ఉన్న మహామునులు, దేవలోకంలో దేవేంద్రుడిని, బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు, కైలాసంలో శివుడు ఇలా కనిపించిన దేవతలందరినీ ప్రార్థింపసాగాడు. వారెవ్వరూ చక్రాయుధం నుంచి దుర్వాసుడిని కాపాడే సాహసం చేయలేదు.

స్కాందపురాణాంతర్గతంలో వశిష్టుడు బోధించిన కార్తీక మహత్యంలోని ఇరవై అయిదో అధ్యాయం సమాప్తం

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం 24వ అధ్యాయం : అంబరీషుని ద్వాదశి వ్రతం

       అత్రిమహర్షి తిరిగి అగస్త్యునితో ఇలా చెబుతున్నారు… ”ఓ కుంభ సంభవా! కార్తీక వత్ర ప్రభావం విన్నావు కదా? ఇది ఎంత విన్నా తనవి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరిస్తాను. సావధానంగా విను…” అని ఇలా చెప్పసాగారు.

       “గంగా, గోదావరి మొదలు నదుల్లో స్నానం చేసినందు వల్ల, సూర్య చంద్ర గ్రహణాల సమయంలో స్నానాదులు చేయడం వల్ల ఎంత ఫలం కలుగుతుందో… శ్రీమన్నారాయణుడి నిజతత్వం తెలిపే కార్తీక వ్రతంలో శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసేవారికి అదే ఫలితం కలుగుతుంది. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్యాల ఫలం ఇతర దినాల్లో చేసిన ఫలానికంటే వేయి రెట్లు అధికంగా ఉంటుంది. ఆ ద్వాదశి వ్రతమెలా చేయాలో చెబుతాను. విను… కార్తీక శుద్ధ దశిమి రోజున, పగటిపూట మాత్రమే భుజించి, ఆ మర్నాడు ఏకాదశి కావడంతో… శుష్కోపవాసం ఉండాలి. ద్వాదశి ఘడియలు వాచ్చక భోజనం చేయాలి. దీనికి ఒక ఇతిహాసముంది. దాన్ని వివరిస్తాను. సావధానంగా ఆలకించు” అని ఇలా చెప్పసాగాడు.

       పూర్వం అంబరీషుడనే రాజు ఉండేవాడు. అతను పరమ భాగవతోత్తముడు. ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశినాడు క్రమం తప్పకుండా వ్రతం చేసేవాడు. ఒక ద్వాదశిరోజున ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నాయి. అందుకు అతను ఆ రోజు తెల్లవారుజామునే లేచి, వ్రతం ముగించి, బ్రాహ్మణ సమారాధన చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో అక్కడకు కోప స్వభావుడు, ముక్కోపి అయిన దుర్వాసుడు వచ్చాడు. అంబరీషుడు ఆయన్ను గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణం చేస్తున్నాను. స్నానమాచరించి త్వరగా రమ్మని ప్రార్థించాడు. స్నానానికి వెళ్లిన దుర్వాసుడు ఎంత సమయమైనా రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి. దాంతో అంబరీషుడు ”ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనానికి రమ్మన్నాను. ఆ ముని నదికి స్నానానికి వెళ్లి ఇంకా రాలేదు. బ్రాహ్మణులకు ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చాను. వారికి భోజనం పెట్టకపోవడం మహాపాతకం. అది గృహస్తునకు ధర్మం కాదు. ఆయన వచ్చేవరకు ఆగితే… ద్వాదశి ఘడియలు దాటిపోతాయి. వ్రతభంగం తప్పదు. ఈ ముని మహాకోప స్వభావం కలవాడు. ఆయన కాకుండా నేను భుజించినా… నన్ను శపిస్తాడు. నాకేమిచేయాలో అర్థం కావడం లేదు. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ద్వాదశి దాటాక భోజనం చేస్తే హరిభక్తిని వదిలినవాడనవుతాను. ఏకాదశినాడున్న ఉపవాసం నిష్పలమవుతుంది”  అని ఆలోచిస్తుండగా… సర్వజ్ఞులైన కొందరు ”శాపం గురించి భయంలేదు” అని తెలుపగా… అంబరీషుడు ద్వాదశి వ్రతం పాటిస్తున్నాని, దుర్వాసుడు వచ్చేవరకు ద్వాదశి ఘడియలు ఆగవని వివరించాడు. వ్రతభంగమా? దుర్వాసుడు రాకముందే భోజనమా? అని ప్రశ్నించాడు. దానికి ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రాలను పరిశోధించి, విమర్శ, ప్రతివిమర్శ చేసుకుని, దీర్ఘంగా ఆలోచించి ఇలా చెప్పారు… “మహారాజా! సమస్త ప్రాణికోటి గర్భాలయాల్లో జటరాగ్ని రూపంలో ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టిస్తాడు. ప్రాణులు భుజించే చతుర్విధాన్నాలు దేహేంద్రియాలకు శక్తిగా మారుతుంది. ప్రాణవాయువు సహాయంతో జటరాగ్ని ప్రజ్వరిల్లుతుంది. అది చెలరేగిన క్షుద్భాద కలుగుతుంది. ఆ తాపం చల్లార్చడానికి అన్నం, నీరు అవసరం. శరీరానికి శక్తి కలిగించేవాడే అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడైన దేవ పూజ్యుడైనవాడు. ఆ అగ్నిదేవుని అందరు సదా పూజించాలి. గృహస్తు, ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెడతానని చెప్పి, అతనికి పెట్టకుండా తిననకూడదు. దానివల్ల మహాపాపం కలుగుతుంది. అందువల్ల ఆయుక్షీణమవుతుంది. దుర్వాసుడంతటివాడిని అవమానమొనరించిన పాపం సంప్రాప్తి కలుగుతుంది” అని వివరించారు.

స్కాందపురాణాంతర్గతంలో వశిష్టుడు చెప్పిన కార్తీకమహత్యంలోని 24అధ్యాయం సమాప్తం

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం 23వ అధ్యాయం : శ్రీరంగ క్షేత్రంలో పురంజయుడు ముక్తిపొందుట

       అగస్త్యుడు తిరిగి అత్రి మహామునితో ఇలా చెబుతున్నాడు… ”ఓ ముని పుంగవా! విజయలక్ష్మి వరించాక పురంజయుడు ఏం చేశాడో వివరిస్తారా?” అని కోరాడు. దీనికి అత్రి మహర్షి ఇలా చెబుతున్నాడు. ”కుంభ సంభవా! పురంజయుడు కార్తీక వ్రతమాచరించడం వల్ల అసమాన బలోపేతుడై అగ్నిశేషం, శత్రు శేషం ఉండకూడదని తెలిసి… తన శత్రురాజులందరినీ ఓడించాడు. నిరాటంకంగా తన రాజ్యాన్ని ఏలాడు. తన విష్ణు భక్తి ప్రభావం వల్ల గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్ష తత్పరుడు, నిత్యాన్నదాన, భక్తి ప్రియవాది, తేజోమంతుడు, వేదవేదాంగవేత్తగా విరాజిల్లాడు. శత్రురాజ్యాలను జయించి, తన కీర్తిని దశదిశలా చాటాడు. శత్రువులు సింహస్వప్నమై… విష్ణు సేవాధురంధురుడై, కార్తీకవ్రత ప్రభావంతో కోటికి పడగలెత్తి, అరిషడ్వర్గాలను జయించాడు. అయినా… అతనిలో తృప్తి లోపించింది. ఏ దేశాన్ని, ఏ కాలంలో, ఏ క్షేత్రాన్ని ఏవిధంగా దర్శించాలి? శ్రీహరిని ఎలా పూజించి కృతార్థుడనవ్వాలి? అని విచారిస్తూ గడిపేవాడు. అలా శ్రీహరిని నిత్యం స్మరిస్తున్న అతనికి ఓ రోజు అశరీర వాణి పలకరించింది” అని అత్రి మహర్షి ఇలా చెబుతున్నాడు…

       పురంజయుడితో అశరీరవాణి ఇలా అంటోంది… ”ఓ పురంజయా! కావేరీనదీ తీరంలో శ్రీరంగ క్షేత్రముంది. దాన్ని రెండో వైకుంఠమని పిలుస్తారు. నీవు అక్కడకు వెళ్లి, శ్రీరంగనాథ స్వామిని అర్చించు. నీవు ఈ సంసార సాగరం దాటి మోక్షప్రాప్తిని పొందగలవు” అని పలికింది. అంతట పురంజయుడు తన రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి, సపరివార సమేతంగా బయలుదేరి, మార్గంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ… ఆయా దేవతలను సేవిస్తూ, పుణ్యనదుల్లో స్నానం ఆచరిస్తూ… శ్రీరంగానికి చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహిస్తుండగా… శ్రీరంగనాథ స్వామి మధ్యలో కొలువయ్యారు. శేషశయ్యపై పవళిస్తున్న ఆయనను గాంచిన పురంజయుడు పరవశంతో చేతులు జోడించి… ”దామోదరా… గోవిందా… గోపాలా… హరే కృష్ణా… హే వాసుదేవా! దాసోహం… దాసోహం…” అని స్తోత్రం చేశాడు. కార్తీకమాసమంతా శ్రీరంగంలోనే గడిపాడు. ఆ తర్వాత వారు అయోధ్యకు బయలుదేరారు. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షంలో కార్తీకమాసం చేయడం… వ్రత మహిమలతో అతని రాజ్యంలోని ప్రజలంతా సుఖశాంతులతో విరాజిల్లారు. పాడిపంటలు, ధనధాన్యాలు, ఆయురారోగ్యాలకు లోటు లేకుండా పోయింది. అయోధ్యానగరం దృఢతర ప్రాకారాలు కలిగి, తోరణ యంత్ర ద్వారాలతో మనోహర గృహగోపురాలు, పురాదులతో, చతురంగ సైన్య సంయుతంగా ప్రకాశించుచుండె. అయోధ్యానగరంలోని వీరులు యుద్ధనేర్పరులై… రాజనీతి కలవారై, వైరి గర్భ నిర్భదకులై, నిరంతరం విజయశీలురై, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరంలోని మహిళు, యువతులు హంసగజామ ఇనులూ, పద్మపత్రాయతలోచనలు, రూపవుతులు, శీలవతులని, గుణవతులని ఖ్యాతి గడించారు.

       శ్రీరంగంలో కార్తీకవ్రతమాచరించి, ఇంటికి క్షేమంగా చేరిన పురంజయుడిని ఆ పుర ప్రజలు మంగళ వాద్యాలతో ఆహ్వానించారు. అలా కొంతకాలం ఐహికవాంఛలను అనుభవించిన పురంజయుడు ఆ తర్వాత వాటిని వదులుకుని, తన కుమారుడికి రాజ్యభారం అప్పగించి, వానప్రస్థాశ్రమం గడిపాడు. జీవితాంతం కార్తీక వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ… అంత్యకాలంలో వైకుంఠానికి చేరుకున్నాడు.

        “కాబట్టి ఓ అగస్త్యా! కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైంది. దాన్ని ప్రతిఒక్కరూ ఆచరించాలి. ఈ కథ చదివినవారికి, విన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది” అని అత్రి మహర్షి వివరించారు.

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య: త్రయోవింశోధ్యాయ(23) సమాప్త:

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీక పురాణం 22వ అధ్యాయం : పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమాచరించుట

అత్రి మహాముని తిరిగి అగస్త్యుడికి ఇలా చెబుతున్నాడు…

       పురంజయుడు వశిష్టులు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు శుచియై దేవాలయానికి వెళ్లి, శ్రీమన్నారాయణుడిని షోడశోపచారాలతో పూజించాడు. శ్రీహరిని గానం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేసి, సూర్యోదయమైన వెంటనే నదికి పోయి, తిరిగి స్నానమాచరించి తన ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో విష్ణుభక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసి మాలలు ధరించి, పురంజయుడి వద్దకు వచ్చి… ”ఓ రాజా! విచారించకు… నువ్వు వెంటనే చెల్లా చెదురై ఉన్న నీ సైన్యాన్ని తీసుకుని, యుద్ధ సన్నద్ధుడివై శత్రురాజులతో పోరాడు” అని చెప్పి పంపాడు. దెబ్బతిని క్రోదంతో ఉన్న పురంజయుడి సైన్యం రెట్టింపు బలాన్ని ప్రయోగిస్తూ పోరాడసాగింది. పురంజయుడు, అతని సైన్యం ధాటికి శత్రురాజులు నిలవలేకపోయారు. అంతేకాకుండా… శ్రీమన్నారాయణుడు పురంజుడి విజయానికి అన్నివిధాలా సహాయపడ్డాడు. ఓటమిపాలైన కాంభోజాది భూపాలరు ”పురంజయా… రక్షింపుము… రక్షింపుము” అని కేకలు వేస్తూ కాలికి బుద్ధి చెప్పారు. పురంజయుడు విజయలక్ష్మితోకలిసి తిరిగి తన రాజ్యానికి వెళ్లాడు.

       శ్రీహరిని నమ్మినవారికి ఓటమి ఉండదనే విషయాన్ని పురంజయుడి వృత్తాంతం నిరూపించింది. అంతకు ముందు కూడా శ్రీహరి అని ప్రార్థించినంతనే ప్రహ్లాదుడికి అతని తండ్రి హిరణ్యకశిపుడు ఇచ్చిన విషం అమృతతుల్యమైంది. ఎన్నో సందార్భల్లో అధర్మం ధర్మంగా మారింది. దైవానుగ్రహం లేనప్పుడు ధర్మమే అధర్మమవుతుంది. తాడు కూడా పాములా కరుస్తుంది. కార్తీక మాసమంతా నదీస్నానమొనర్చి, దేవాలయంలో జ్యోతిలను వెలిగించి దీపారాధన చేసినట్లయితే…సర్వ విపత్తులు తొలగిపోతాయి. అన్ని సౌక్యాలు సమకూరుతాయని అగస్త్యుల వారికి అత్రి మహర్షి వివరించారు.

ఇతి స్కాంధపురాణాంతర్గతేన వశిష్ట ప్రోక్త: కార్తీక మహత్య: 22 అధ్యాయ: సమాప్త:

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీక పురాణం 21 వ అధ్యాయం : పురంజయుడు కార్తీక ప్రభావం

       అలా యుద్ధానికి సిద్ధమైన పురంజయుడికి, కాంభోజాది భూపాలురకు భీకరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రథికులు రథికుడితో, అశ్వసైనికుడు అశ్వసైనికుడితో, గజ సైనికుడు గజ సైనికుడితో, పదాతులు పదాతి దళాలతో, మల్లులు మల్లయుద్ధనిపుణులతో, ఖడ్గ, గద, బాణ, పరశు మొదలు ఆయుధాలు ధరించినవారు అవే ఆయుధాలు ధరించినవారితో ధర్మబద్ధమైన యుద్ధం చేస్తున్నారు. ఒకరినొకరు ఢీకొంటూ.. హూంకరించుకుంటూ.. దిక్కులు దద్దరిల్లేలా సింహనాదాలు చేశారు. శూరత్వం, వీరత్వం ప్రదర్శించేందుకు భేరీ దుందుబులను వాయిస్తూ, శంఖాలను పూరిస్తూ, విజయకాంక్షతో పోరాడారు.

        ఆ రణ భూమి అంతా ఎక్కడ చూసినా… విరిగిన రథాల గుట్టలు, తెగిపడిన మొండాలు, ఏనుగుల తొండాలు, సైనికుల తలలు, చేతులతో నిండిపోయింది. యుద్ధభూమిలో హాహాకారాలు, ఆక్రందనలు మిన్నంటాయి. పర్వాతాల్లా పడి ఉన్న ఏనుగులు, గుర్రాల కళేబరాల దృశ్యాలతో అతి గంభీరంగా, భయంకరంగా రణస్థలి కనిపించింది. యుద్ధవీరుల్ని వీరస్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పకవిమానంపై వచ్చిన దేవదూతలు అక్కడకు చేరుకున్నారు. సూర్యాస్తమయం వరకు యుద్ధం కొనసాగింది. కాంబోజాది భూపాలురకు చెందిన సైన్యం భారీగా నష్టపోయింది. అయినా.. మూడు అక్షౌహిణులున్న పురంజయుడి సైన్యాన్ని అతి నేర్పుతో ఓడించారు. పెద్ద సైన్యమున్నా… పురంజయుడికి అపజయం కలిగింది. దాంతో పురంజయుడు రహస్య మార్గంలో శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేలైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో, సిగ్గుతో దు:ఖించుచుండెను.

       ఆ సమయంలో వశిష్ట మహర్షి వచ్చి, పురంజయుడిని ఊరడించారు. ”రాజా! ఇంతకు ముందు ఒకసారి నీవద్దకు వచ్చాను. నువ్వు ధర్మాన్ని తప్పావు. నీ దురాచారాలకు అంతులేదు. నిన్ను సన్మార్గంలో వెళ్లమని హెచ్చరించాను. అప్పుడు నా మాటల్ని వినలేదు. నీవు భగవంతుడిని సేవింపక అధర్మప్రవర్తుడవైనందునే… ఈ యుద్ధంలో ఓడిపోయి, రాజ్యాన్ని శత్రువులకు అప్పగించావు. ఇప్పటికైనా నామాటలు విను. జయాపజయాలు దైవాదీనాలు. నీవు చింతతో కృంగిపోవడం మాని, శత్రురాజులను యుద్ధంలో జయించి, నీ రాజ్యం నీవు తిరిగి పొందాలని సంకల్పించు. ఇది కార్తీకమాసం. రేపు కృత్తికా నక్షత్ర యుక్తంగా పౌర్ణమి ఉంది. కాబట్టి స్నాన, జపాది నిత్యకర్మలు ఆచరించి, గుడికి వెళ్లి, దేవుడి సన్నిధిలో దీపారాధన చేయి. భగవన్నామ స్మరణంతో నాట్యం చేయి. ఇంట్లో అర్చించినట్లయితే నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు… శ్రీమన్నారాయణుడిని సేవించడం వల్ల విష్ణుమూర్తి ప్రసన్నుడై… నీ శత్రువులను దునిమాడేందుకు చక్రాయుధాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి… రేపు అలా చేసినట్లయితే… పోయిన నీ రాజ్యం తిరిగి పొందగలుగుతావు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసాలు చేయడం వల్లే ఈ అపజయం కలిగింది. శ్రీహరిని మదిలో తలచి, నేను చెప్పినట్లు చేయి…” అని ఉపదేశించాడు.

శ్లో// అపవిత్ర: పవిత్రో పవిత్రోవా సర్వావస్థాంగతోపివా

య్ణ స్మరేత్ పుండరీకాక్షం బాహ్యా భంతర శుచి||

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే, ఏకవింశోద్యాయ సమాప్త్ణ

ఇరవయొక్కటో రోజు పారాయణం సమాప్తం

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీక పురాణం 20వ అధ్యాయం : పురంజయుడు దురాచారుడగుట

       చాతుర్మాస్య వ్రత ప్రభావాన్ని తెలుసుకున్నాక జనక మహారాజు వశిష్ఠుడితో తిరిగి ఇలా అడుగుతున్నాడు… ”ఓ గురువర్యా! కార్తీకమాస మహత్యాన్ని ఇంకనూ వినాలనిపిస్తోంది. ఈ వ్రత మహత్యానికి సంబంధించి ఇంకా ఇతిహాసాలు, ఇతివృత్తాలు, విశేషాలున్నాయా? అనే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది” అని కోరాడు. దానికి వశిష్టులవారు మందహాసంతో ”ఓ రాజా! కార్తీక మాస మహత్యాన్ని గురించి అగస్త్య మహాముని అత్రి మునికి చెప్పిన విషయం వివరిస్తాను” అని ఇలా చెప్పసాగారు.

       పూర్వం ఒకప్పుడు అగస్త్య మహాముని అత్రి మహర్షిని చూసి… ”ఓ అత్రి మునీ! నీవు విష్ణువు అంశలో పుట్టావు. కాబట్టి నీకు కార్తీక మహత్యం ఆమూలాగ్రంగా (ఆది నుంచి అంతం వరకు) తెలుసి ఉంటుంది. కాబట్టి దాన్ని నాకు వివరించు”  అని కోరాడు. దానికి అత్రి మహాముని ”ఓ కుంభసంభవా! కార్తీక మాసానికి సమాన మాసం లేదు. వేదాల్లో సమానమైన శాస్త్రం, ఆరోగ్య సంపదకు సాటిలేని సంపద లేదు. అలాగే శ్రీమన్నారాయణుడికంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనా… కార్తీకంలో నదీస్నానం చేసినా.. శివకేశవాలయాల్లో దీపారాధన చేసినా, దీపదానం చేసినా… దాని ఫలితం చెప్పనలవి కాదు. ఇందుకు ఒక ఇతిహాసముంది. చెబుతాను విను… త్రేతాయుగంలో పురంజయుడనే సూర్యవంశపురాజు అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండేవాడు. అతడు సమస్త శాస్త్రాలను అభ్యసించాడు. న్యాయబద్ధంగా రాజ్యపాలన చేసేవాడు. ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా పాలించేవాడు. అయితే కొంతకాలానికి పురంజయుడిలో మార్పువ చ్చింది. అమిత ధనాశతో, రాజ్యాధికార గర్వంతో జ్ఞానహీనుడై… దుష్టబుద్ధి కలవాడై.. దయాదాక్షిణ్యాలు లేక… లేవ బ్రాహ్మణ మాన్యాలను లాక్కొనడం ఆరంభించాడు. పరమలోభిగా మారాడు. దొంగలను చేరదీసి, వాళ్లతో దొంగతనాలు, దోపిడీలు చేయించాడు. వారు కొల్లగొట్టుకొచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ… ప్రజలను భీతావహులను చేయసాగాడు. కొంతకాలానికి అతని దాష్టీకాలు నలుదిశలా వ్యాపించాయి. ఈ వార్త విన్న కాంభోజరాజు ఇదే సమయమని గుర్తించి, అయోధ్యపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. రథ, గజ, తురగ, పదాతి దళౄలను తీసుకుని అయోధ్యను చేరుకున్నాడు. నగరం నలుమూలలా శిబిరాలు నిర్మించి, యుద్ధానికి సిద్ధపడ్డాడు. గూఢచారుల వల్ల విషయం తెలుసుకున్న పురంజయుడు చసేది లేక… తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. శత్రువు కంటే… తన శక్తి బలహీనంగా ఉన్నా… తుదికంటా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. శాస్త్రసమన్వితమైన రథాన్ని ఎక్కి, సైన్యాధిపతులను పురికొల్పాడు. చతురంగ సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్దుడయ్యాడు. యుద్ధభేరీ మోగించి, సింహనాదాలు గావించి, మేఘాలు గర్జిస్తున్నాయా? అన్నట్లు పెద్దఎత్తున హుంకరించారు. శత్రు సైన్యంపై విరుచుకుపడ్డాడు.

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం వింశాధ్యాయ: (20అధ్యాయం) సమాప్త:

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)