Categories
Vipra Foundation

స్వామీ వివేకానంద వర్ధంతి

     (జనవరి 12, 1863 – జూలై 4, 1902)

    స్వామీ వివేకానంద ‘‘ఒక వ్యక్తి తనను తాను ఎలా భావిస్తాడో అదే అవుతాడు. తాను బలహీనుడినని భావిస్తే బలహీనుడే అవుతాడు, బలవంతుడిని అని భావిస్తే బలవంతుడే అవుతాడు, కార్యసాధన యత్నంలో ఎదురయ్యే ఆటంకాలను, పొరపాట్లను లక్ష్యపెట్టకూడదు. ఓటమిని లెక్క చేయకూడదు. తిరోగమనాలనూ సహించాలి. లక్ష్యసాధన కోసం వెయ్యి ప్రయత్నాలైనా చేయాల్సిందే. అప్పటికీ ఫలించకపోతే మరో ప్రయత్నానికి సిద్ధం కావాలి”

    “నీ శక్తే నీ జీవితం… నీ బలహీనతే నీ మరణం…”

       ఇటువంటి ఎన్నో అమూల్యమైన జీవిత సత్యాలను ప్రపంచానికి చాటిచెప్పిన మహామనిషి స్వామీ వివేకానంద. మహా గురువు రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన వివేకానందుని పూర్వ నామం నరేంద్ర నాధుడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రసంగాలు చేసి వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములను సమాజానికి అందించారు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే చిరకాలంగా నిలిచిపోయే మహోన్నత ఆధ్యాత్మిక నాయకుడు. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.

తన భావాలను సమాజానికి పంచి మేల్కొలిపిన మహానుభావుడు. తన ప్రసంగాలతో భారతదేశాన్ని జాగృతము చేశారు. అంతేకాదు విదేశాలలో సైతం తన ఉపన్యాసములతో జీవిత పరమార్థాన్ని బోధించాడు. హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు. ఆయన వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి వివేకానందుడే.

       తన గురువు రామకృష్ణుడు నేర్పిన ‘జీవుడే దేవుడు’ అనేది వివేకానందుని మంత్రముగా మారింది. ‘దరిద్ర నారాయణ సేవ’ ఆ భగవంతునికి చేసే సేవతో సమానమన్నారు. విశ్వమంతా బ్రహ్మం నిండి ఉందనీ, హెచ్చు తగ్గులు లేవనీ చాటారు. అందరు తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వాన్ని చాటిచెప్పారు.

       ఇలా హిందూ ధర్మాన్ని దశదిశలా వ్యాపింపచేసిన వివేకానందుడు… విదేశాలలో పర్యటనలు ముగించుకుని మన దేశానికి తిరిగి వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ 39 ఏళ్ళ వయసులోనే పరమపదించారు.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

డాక్టర్స్ డే

“శరీరే జర్ఝరీ భూతే,  వ్యాధిగ్రస్తే కళేబరే, !   ఔషథం జాహ్నవీ తోయం, వైద్యోనారాయణోహరిః !!”

       ప్రాణం పోసేది దేవుడైతే.. ప్రాణం నిలిపేవాడు డాక్టర్. అందుకే  వైద్యోనారాయణో హరి అన్న నానుడి నిజం. ప్రతి వృత్తి దేనికదే సాటి అయినప్పటికీ వైద్య వృత్తి వాటికి భిన్నమైనది. మృత్యువు చివర అంచులదాకా వెళ్ళిన వారికి ప్రాణం పోసే శక్తి ఈ వృత్తికి ఉంటుంది. అందుకే వైద్య వృత్తి పవిత్రమైనది . నిబద్దత , త్యాగనిరతి డాక్టర్ల నైజం. తమ వ్యక్తిగత జీవితాన్ని పక్కకు పెట్టేసి తెల్లకోటుకే ప్రాదాన్యమిస్తారు. ఎదుటవ్యక్తి ప్రాణాలు కాపాడడానికి …ఎప్పుడు రోగికి మంచి చేయాలనే తపన పడేవాడే నిజమైన డాక్టర్.  జీవితకాలం రోగుల సేవలో తరించిపోయే డాక్టర్ల కోసం ప్రపంచమంతా ఒక రోజును కేటాయించింది. అదే వాల్డ్ డాక్టర్స్ డే. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు.

        ఇవాళ డాక్టర్స్ డే. దీనికి అనేక ఏళ్ల చరిత్ర ఉంది. డాక్టర్ బీసీ రాయ్ ప్రముఖ భారతీయ వైద్యుడు. ఆయన సేవలతో భారతీయ వైద్య రంగానికి విశిష్ట గుర్తింపు తీసుకొచ్చారు. కోల్ కతా మేయర్ గా,  యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా , కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పని చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎంగా కూడా పని చేశారు. ఆయన సమాజానికి చేసిన సేవలకు  ప్రతిష్టాత్మక భారత రత్న అవార్డు లభించింది. బీసీ రాయ్ స్మారకార్థం ప్రతి ఏటా జూలై ఒకటిన డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఎంతోమంది డాక్టర్లు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్స్ డే  సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకుందాం.

      సాక్షాత్తు భగవంతునిగా భావించే వైద్య వృత్తి లో ఉంటూ, మంచి సేవా భావం కల్గిన వైద్యులందరికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి

(1921, జూన్ 28 – 2004 డిసెంబర్ 23)

            పివి గారి శతజయంతి ఉత్సవాలు ఆధికారికంగా జూన్ 2020 నుండి ఏడాది పాటు నిర్వహించిన సంధర్భంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియాజేస్తూ, అలాగే పివి గారికి తగిన గౌరవప్రదమైన స్థానం ఇవ్వడానికి వారికి భారతరత్న కొరకై కేంద్రం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింస్తుందని ఆశిస్తూ, వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ…

       భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు, పాములపర్తి వేంకట నరసింహారావు 1921, జూన్ 28న జన్మించాడు. పి.వి.నరసింహారావు, పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. అపర చాణక్యుడిగా పేరుపొందిన వాడు. భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం.

రాష్ట్ర రాజకీయాల్లో పీవీ

       1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు.

       ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాదు లో కంటే, ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు.తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నాడు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. నిజానికి భూసంస్కరణల విషయంలో పీవీకి సమకాలీన రాజకీయ నాయకులతో ఉన్న విభేధాల కారణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసివచ్చిందని కొందరి వాదన.

కేంద్ర రాజకీయాల్లో పీవీ

       తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. మొదటిసారిగా లోక్సభ కు హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యాడు. రెండోసారి మళ్ళీ హనుమకొండ నుండే లోక్సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి ఎనిమిదో లోక్సభకు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్ళీ రాంటెక్ నుండే తొమ్మిదో లోక్సభకు ఎన్నికయ్యాడు. నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి 1991 లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్సభలో అడుగుపెట్టాడు. 1980 – 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను వివిధ సమయాల్లో నిర్వహించాడు.

ప్రధానమంత్రిగా పీవీ

       ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్సభలో అడుగుపెట్టాడు. సాటి తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని నంద్యాల పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలలో ఎన్.టి.రామారావు ఆయనపై తెలుగు దేశం అభ్యర్ధిని పోటీలో పెట్టలేదు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెసు పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకు ఉన్న అపార అనుభవం ఆయనకు ఈ క్లిష్టసమయంలో తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు ఆయన అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి కూడా. ప్రధానిగా ఉండగా మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పుకు నాంది పలికింది.

పీవీ విశిష్టత

       బహుభాషా పండితుడు, పీవీ. తెలుగుతో సహా, 17 భాషలలో ధారాళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఆయనది. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో ను అబ్బురపరచాడు.

పీవీ నరసింహారావు చాలా నిరాడంబరుడు. తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచిన నిజాయతీపరుడు. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి ఎప్పుడూ అంగీకరించేవారు కాదు. అలాంటి వ్యక్తి చివరిదశలో కోర్టుల చుట్టూ తిరగడానికి ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది. ఆయనకాగతి పట్టడానికి కారణం ఉత్తరాది లాబీ. కానీ ఎన్ని కష్టాలొచ్చినా తుదివరకూ నిండుకుండలానే ఉన్నారాయన.

2004 డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూసాడు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

వటసావిత్రి వ్రతం

       సకల సౌభాగ్యాలను ప్రసాదించడంతో పాటూ వైధవ్యం నుంచి కాపాడేవ్రతం – ‘వటసావిత్రీ వ్రతం’. దీనిని జ్యేష్ఠ శుధ్ధ పూర్ణిమనాడు ఆచరించాలి. ఆ రోజు వీలుకాకపోతే జ్యేష్ఠబహుళ అమావాస్యనాడు ఆచరించవచ్చు. పూర్వం నారద మహర్షి సావిత్రికి ఈ వ్రతాన్ని గురించి వివరించినట్లు కథనం.

        ఈ వ్రతాచరణ వెనుక ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. పూర్వం అశ్వపతి, మాళవి దంపతులకు ‘సావిత్రి’ అనే కుమార్తె వుండేది. యుక్తవయస్కురాలెైన సావిత్రికి నీకు ఇష్టమైనవాడిని వరించమని తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. రాజ్యం శత్రువులపాలు కావడంతో అరణ్యంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తోన్న ద్యుమత్సేనుడి కుమారుడెైన సత్య వంతుని వివాహమాడతానని తల్లిదండ్రులకు తెలిపింది. సత్య వంతుడి ఆయుష్షు మరో సంవత్సరమేనని నారదుడు చెప్పినప్ప టికీ, సావిత్రి పట్టుపట్టడంతో సత్యవంతుడితోనే వివాహం చేశా రు. మెట్టినింట చేరి భర్త, అత్తమామలకు సేవ చేయసాగింది. సత్యవంతుడు ఒకనాడు యజ్ఞ సమిధలు, పుష్పాలకోసం అడ వికి బయలుదేరగా, సావిత్రీ భర్తను అనుసరించింది. సమిధుల ను కోసి చెట్టు దిగిన సత్యవంతుడు తలభారంతో సావిత్రి ఒడి లో తలపెట్టుకుని పడుకున్నాడు. నారదుడు చెప్పిన సమయం ఆసన్నమైనదని సావిత్రి గుర్తించింది. కొద్దిసేపటికి యముడు తన దూతలతో వచ్చి సత్యవంతుడికి యమపాశం వేసి తీసుకుని పోసాగాడు. సావిత్రి కూడ తన భర్తను అనుసరించి వెళ్ళసాగిం ది. యముడు వారించినప్పటికీ భర్త వెంటే తనకూ మార్గమని చెప్పి వెళ్తూండడంతో ఆమె పతి భక్తిని మెచ్చిన యముడు సావి త్రిని వరం కోరుకోమన్నాడు.

       ‘మామగారికి దృష్టి ప్రసాదించండి’ అని ఓ వరాన్ని కోరింది, యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తుండడంతో, యముడు మరో వరాన్ని కోరుకోమన్నా డు. మామగారు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ప్రసా దించమని కోరింది, యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తూండడంతో, ఆమె పతిభక్తిని మెచ్చి మూడో వరం కోరుకోమనగా – ‘నేను పుత్రులకు తల్లిని అయ్యేట్లు వరాన్ని ప్రసాదించండి’ అని కోరింది. యముడు సావిత్రి పతిభక్తిని మెచ్చి ఆ వరాన్ని ప్రసాదించాడు. సావిత్రి అడవిలో వటవృక్షం కింద ఉన్న భర్త శరీరం వద్దకు చేరింది. భర్త లేచి కూర్చోగా, వటవృక్షం వరకు పూజ చేసి భర్తతో సహా రాజ్యానికి చేరినట్లు కథ నం. వటవృక్షాన్ని, సావిత్రిని పూజిస్తూ చేసి ‘వట సావిత్రి వ్రతం’ అమల్లోకి వచ్చినట్లు పురాణ కథనం.

వ్రత విధానం

       వ్రతాన్ని చేసే వారు ముందు రోజు రాత్రి ఉపవాసం ఉం డాలి. వ్రతం రోజు తెల్లవారుఝామునే నిద్రలేచి తలస్నా నం చేసి, ఇంటిని శుభ్రపరిచి, దేవుడిని స్మరించుకుని, పూజావస్తువులను తీసుకుని వటవృక్షం (మర్రి) చెట్టు వద్దకు వెళ్ళి, చెట్టు మొదలు వద్ద అలికి ముగుగ్లు వేసి, సావిత్రీ సత్యవంతులను ప్రతిష్టించాలి. వారి చిత్రపటాలు దొరకపోతే పసుపుతో చేసిన బొమ్మలనుగానీ ప్రతిష్టించు కోవాలి.

మనువెైధవ్యాదిసకలదోషపరిహారార్థం బ్రహ్మసావిత్రీ ప్రీత్యర్థం

సత్యవత్సావిత్రీ ప్రీత్యర్థంచ వటసావిత్రీ వ్రతం కరిష్యే అనే శ్లోకంతో సంకల్పించాలి.

చెప్ప వలసిన శ్లోకం:

       వట మూలే స్తితో బ్రంహ వట మధ్యే జనార్దనః వటాగ్రే తు శివం విద్యాత్ సావిత్రివ్రత సమ్యుత వట సిన్చామితే మూలం సలిలైహి రంరుతోపయైహి ||

       తర్వాత వినాయకుడు, సావిత్రీసత్యవంతులు, యమధర్మరాజు, బ్రహ్మదేవుడు, వటవృక్షాన్ని పూజించాలి. వట వృక్షమూలంతో బ్రహ్మ, మధ్యభాగంలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉంటారు కనుక త్రిమూర్తులను పూజించిన ఫలం కలుగుతుంది. పూజానంతరం ‘నమోవెైవస్వతాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ వటవృక్షానికి దారాన్ని చుడుతూ, 108 ప్రదక్షిణలు చేసి నెైవేద్యం సమర్పిం చడంతో పాటూ ముతె్తైదువులకు, బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలను సమర్పించాలి. ఇలా మఱ్ఱిచెట్టు చుట్టూ దారాన్ని చుట్టడం వల్ల మఱ్ఱి చెట్టు యొక్క దీర్ఘాయుర్దాయంతో, తన భర్త ఆయుర్దాయాన్ని బంధించినట్లవుతూ తన ఐదవతనం వర్థిల్లుతుందనేది ప్రతి స్ర్తీమూర్తి కోరిక.

       కొందరు స్ర్తీలు ఈపండుగను పూర్ణిమనాడు మాత్రం అనుసరిస్తుంటారు. మూడు రోజుల పాటు ఈ పర్వాన్ని అనుసరించే స్ర్తీలు, త్రయోదశి ఉదయాన్నుంచి, పెైర్ణమి నాడు సాయంకాలం వరకు ఉపవసిస్తారు. పూర్తిగా నిరాహారంగా ఉండలేని వారు నీళ్ళు, పాలు, తేనీరు, పళ్ళు పుచ్చుకోవచ్చు.

       అయితే ఈ వ్రతాన్ని మనదేశంలో ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధంగా చేస్తుంటారు. కొంతమంది పూర్ణిమ నాటి మధ్యాహ్నం పురోహితునితో సావిత్రి కథను చెప్పించుకుంటారు. పురోహితుని ద్వారా కథను వింటే తప్ప ఆ వ్రతానికి ఫలం దక్కదని కొంతమంది నమ్మకం. ఇలా వటసావిత్రి వ్రతవిధానాన్ని చేయవచ్చు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

ఏరువాక పున్నమి, వృషభపూజ

     భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి మూలస్తంభం లాంటిది వ్యవసాయం. దానికి తొలి పనిముట్టు నాగలి, ముఖ్యవనరు వర్షం. ఆ వర్షం కురిసే కాలం మొదల య్యేప్పుడు రైతులు కృతజ్ఞతతో జరిపే పండుగ ‘కృషిపూర్ణిమ’. దీనికే హలపూర్ణిమ, ఏరువాక పున్నమి అనే పేర్లున్నాయి. ‘ఏరు’ అంటే నాగలి అని, ‘ఏరువాక’ అంటే దుక్కి ప్రారంభం అనీ అర్థాలున్నాయి. వ్యవసాయానికి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రుణ్ని పూజించడం, నాగలిని పూజించి వ్యవసాయ పనులు మొదలుపెట్టడం జ్యేష్ఠపూర్ణిమ పర్వదిన ముఖ్యాంశాలు. రైతులు ఈ పండుగ జరపడానికిగల కారణాన్ని పరిశీలిస్తే- నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠపూర్ణిమ. చంద్రుడు ఓషధులకు అధిపతి. ఓషధులు (మంచు, ఎరువు, సూక్ష్మధాతువులు) పుష్కలంగా ఉంటేనే వ్యవసాయం అధిక ఫలసాయాన్నిస్తుంది. పై కారణాలన్నింటివల్ల జ్యేష్ఠపూర్ణిమనాడు ఈ పర్వదినాన్ని జరుపుతారు.

       వ్యవసాయానికి ఆలంబన అయిన పశుసంపద, భూమి, పనిముట్లకు ప్రాధాన్యమిచ్చి పూజించడం ఈ పూర్ణిమ ప్రత్యేకత. నాగలిని శుభ్రపరచి, పసుపు, కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. దానితోపాటు పశువులను అలంకరించి వాటితో వ్యవసాయ భూమికీ పూజచేస్తారు. పశువుల కొట్టాలు, కళ్ళాలు మొదలైనవాటినీ శుభ్రంచేసి అలంకరిస్తారు. ఆపైన పొంగలిని (కొన్ని ప్రాంతాల్లో పులగం) వండి వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ని పూజించి నివేదన చేస్తారు. ఆ తరవాత ఆ పదార్థాలను ఆవులకు, ఎడ్లకు తినిపిస్తారు. నాగలిని పూన్చి, పశువులను, బళ్లను మేళతాళాలతో వూరేగించి భూమిలో తొలి వ్యవసాయ పని ప్రారంభిస్తారు. కొన్నిచోట్ల తొలిదుక్కిలో రైతులు కూడా ఎడ్లతో సమానంగా కాడికి రెండోవైపు నిలిచి భూమిని దున్నుతారు. పశువులగెత్తం (ఎరువుగా మారిన పశువుల పేడ) పొలాలకు తరలించే ప్రక్రియా ఈ పూర్ణిమనాడే ప్రారంభిస్తారు.

       ఉత్తర భారతదేశంలో దీన్ని ‘ఉద్వృషభయజ్ఞం’ అని పిలుస్తారు. వృషభం అంటే ఎద్దు. ఉద్ధృతం అంటే లేపడం. అంతవరకు వేసవివల్ల కాస్త విశ్రమించిన పశువులను వ్యవసాయం కోసం సిద్ధపరచడమని అర్థం.

       రుగ్వేదంలోనూ వ్యవసాయ పనుల ప్రారంభ దినాన చేసే గౌరవసూచకమైన ఉత్సవ ప్రసక్తి ఉంది. అధర్వణ వేదంలోనూ ‘అనడుత్సవం’ అనే పేరుతో ఒక ఉత్సవం జరపాలని ఉంది. దీనిలో భాగంగా హలకర్మ (నాగలిపూజ), మేదినీ ఉత్సవం (భూమి పూజ), వృషభ సౌభాగ్యం (పశువుల పూజ) మొదలైన ప్రక్రియలు చేయాలని చెబుతున్నాయి. ఇవేకాకుండా అనేక పురాణాల్లోనూ ‘కృషిపూర్ణిమ’ ప్రసక్తి ఉంది. వరాహమిహిరుడు రచించిన ‘బృహత్సంహిత’లోను, పరాశరుడు రాసిన ‘కృషిపరాశరం’లోనూ ఈ ఉత్సవ ప్రసక్తి ఉంది. కర్ణాటక ప్రాంతంలో ‘కారణిపబ్బం’ అని పిలుస్తారీ ఉత్సవాన్ని.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)  

Categories
Vipra Foundation

అంతర్జాతీయ యోగా దినోత్సవం

     ప్రాచీన సంస్కృతి,ఖండాంతరాలకు జ్ఞాన విద్యను అందించిన భారతదేశంలో ప్రతి సంవత్సరం జూన్ 21 జరిగే యోగా దినోత్సవం నిర్వహణపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. అప్పటి కేంద్ర ఆయుష్షు శాఖా మంత్రి శ్రీపాద నాయక్..అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణపై..సూర్యనమస్కారములను తొలగించామని చెప్పడం..ముస్లింలను సైతం ఇందులో భాగస్వామ్యం చేయటమే. ప్రపంచానికే యోగా నేర్పిన భారత్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవంపై భిన్నాభిప్రాయాలు నెలకొనడం నిజంగా దౌర్భాగ్యమే. యోగా అనేది శారీరిక,మానసిక ఉల్లాస కోసమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

               యోగా దినోత్సవ రోజు దేశంలో అన్ని యోగా పీఠాలు, కేంద్రాలు దృష్టి సారించాయి. ‘యోగీశ్వరం ప్రణమ్యాం’ ‘యోగాభ్యాసే సమారంభే’  యోగం చేస్తే ఈశ్వరునికి ప్రణామం చేసినట్టే..దాన్ని అభ్యసిస్తే ఏదైనా సాధ్యమే అన్నట్టు మన ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి. ఆది శంకరాచార్య,మహా అవతార్ బాబాజీ,పరమహంస యోగానంద, కాకభుషుండులు వంటి యోగి పుంగవులు ఈ దేశంలో కాలినడకతో యోగ విద్యను ప్రపంచానికి చెప్పినవారే. ఆధునిక కాలానికి చెందిన ఎక్కిరాల కృష్ణామాచార్యులు, రమణానందుల వారు..కూడా బోధిస్తోంది..యోగా గురించే.         యోగా..మానవ జీవన విధానంలో ఒక దైనందిన చర్యగా గుర్తించాలన్నదే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యం. సహాజంగా దేశంలో పలు ఆశ్రమాల్లో..పీఠాల్లో మహర్షుల జన్మదినాలు..ఉత్సవాల్లో..యోగా గురువులు తమ వంతు కర్తవ్యంగా యోగాను అనుసరించే పద్దతులను తెలియ చెబుతున్నారు.

                 ఆ సందర్భంలోనే మరింతగా బాహ్య ప్రపంచలోకి వెళ్లేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాల్సి ఉందనేవారు ఉన్నారు. అత్యధిక మెజార్టీ స్థానాలతో ప్రభుత్వం చేపట్టిన మోడీ సర్కార్…ఈ బృహత్తర కార్యక్రమ అమలుకు శ్రీకారం చుట్టడమే కాక ఐక్యరాజ్య సమితి ముందు అంతార్జీతీయ యోగా దినోత్సవాన్ని నిర్ణయించింది అంతేగాక ఈ కార్యక్రమాన్ని అమలు చేసి చూపడం ప్రభుత్వ గురుతర బాధ్యత అని నిరూపించింది. దేశ రాజధానిలో రాజ్పథ్ లో జూన్ 21 న యోగా దినోత్సవాన్ని నిర్వహించి, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ’ఆర్ట్ ఆఫ్ లివింగ్ ’వ్యవస్థాపకుడు రవిశంకర్ గారి సూచనలు తీసుకుని యోగా అనేది సామాన్యుడి నుంచి ఉన్నత స్థానంలో ఉన్న ఏ ఒక్కరైనా పాటించవచ్చు అని తెలిజెప్పారు. యోగా అంటే కలియక అన్న విషయం..ప్రస్తుత ప్రజలు అంతగా తెలియకపోయినా.. ఆధునిక యుగంలో యోగా అనేది శారీరిక శ్రమ కలిగిన ఆసనాలు, వ్యాయామానికి సంబంధించిందే. గతంలో భారత దేశ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పేందుకు నాటి రాజులు, చక్రవర్తులు పర్యటనలు చేసేవారు. అలానే ఈ రాకెట్ యుగంలో మోడీ సర్కార్..ప్రపంచ దేశాల పర్యటనలు చుట్టి…దేశ విశిష్టత, ప్రాచీన సంస్క్రతి తెలియ చెప్పడమే కాక.. యోగా దినోత్సవాలను నిర్వహించడం లాంటి చర్యలకు ఉపక్రమించారు. జూన్ 21 అన్న విషయం 2015 యేడాదిలో ఖరారైంది.. అగ్రదేశమైన అమెరికా దౌత్య కార్యాలయంలో కూడా యోగా దినోత్సవ నిర్వహణ జరుగుతోంది. యోగా కు పుట్టినిల్లు అయిన భారత్ లో యోగా దినోత్సవాన్ని.. ప్రపంచం యావత్తు మెచ్చుకునేలా జరుగుతున్నాయి . ఆ విధంగానే మోడీ ప్రభుత్వం సిద్ధపడినా..కొంత మంది ముస్లిం నేతలు..ఆ దినోత్సవంపై మతం రంగు పులమడం దురదృష్టమే. మోడీ ప్రభుత్వంలో పని చేస్తున్న ప్రతీ ఒక్క ఎంపీ…అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తమ తమ కార్యక్షేత్రాల్లో నిర్వహిస్తున్నారు… కొంతమంది ఛాందస వాదులు మతం అన్న పదాన్ని జోడిరచడం సిగ్గుచేటు.

       అయితే ఈ దినోత్సవం నాడు ఏ వర్గానికి చెందిన వారిపై బలవంతంగా రుద్దకపోయినా ప్రభుత్వ పరంగా దేశ వ్యాప్తంగా అదే రోజు యోగా నిర్వహణ కార్యక్రమం అధికార యంత్రాంగం మాత్రం నిర్వహణ చేస్తుంది.

2015 న మొదటిసారి రాజ్ పథ్ లో స్వయంగా ప్రధాని మోడీ ఉదయం ఈ కార్యక్రమంలో పాల్గొని, దేశ ప్రజలను యోగా దినోత్సవ నిర్వహణపై మరింతగా దృష్టి పెట్టించేలా చేసారు. ప్రభుత్వ పరంగా ఆయుష్షు శాఖ..యోగా నిర్వహణపై అన్ని చర్యలు తీసుకుంటుండగా ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం అభ్యంతరం చెప్పగా మరికొంత మంది ముస్లిం పెద్దలు..ప్రధాని మోడీని కలిసి అభినందలు తెలిపారు కూడా. అయితే యోగా నిర్వహణలో సూర్యనమస్కారములను తీసేసినట్టుగా ఆయుష్షు శాఖ మంత్రి చెప్పడంతో… యోగా దినోత్సవం నాడు ఏం చేస్తారనే ప్రశ్నలు తలెత్తడంతో ఆసనాలు మాత్రమే ఉంటాయని చెప్పింది. అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న యోగా దినోత్సవంలో భారత్ నిర్వహింస్తున్న పాత్ర అమోఘం. అంతేనా అంతార్జీతయంగా 177 దేశాలు మద్దతు పలకడం అందునా వాటిలో 47 దేశాలు ఇస్లామిక్ అయి ఉండటం… యోగా నిర్వహణపై భారత్ అమలు నిర్ణయాన్ని ప్రపంచ దేశాలన్నీ కొనియాడటం గర్వించదగ్గ విషయం. అయితే బయట గెలిచిన మోడీ ప్రభుత్వం…ఇంట నిర్వహించబోతున్న యోగా నిర్వహణపై అంధరి చేత శభాష్ అనిపించుకుంది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

నిర్జల ఏకాదశి

       మనిషి భోజన ప్రియుడు. ఆకలి వేసినా వేయకపోయినా ఆహారాన్ని సేవించే జీవి ఒక్క మనిషి మాత్రమే! ఆహారాన్ని దేహాన్ని పోషించేదిగా కాకుండా, నాలుకకు రుచిని ఇచ్చేదిగా భావించేదీ మనిషి ఒక్కడే. ఆహారంతో మనిషికి ఉండే ఈ సంబంధం అతనికి అనారోగ్యాన్ని ఎలాగూ కలిగిస్తుంది… ఇంద్రియ సుఖాల పట్ల అతనికి ఉన్న మోహానికి ఉదాహరణగా నిలుస్తుంది. అలా నిరంతరం ఈ భౌతిక ప్రపంచంలో మునిగిపోయే మనిషిని కాస్త ఆధ్మాత్మిక దిశకు మళ్లించేందుకు పెద్దలు సూచించిన ఉపాయమే ఏకదశి ఉపవాసాలు!

 నిర్జల ఏకాదశి !

       ఒకో మాసానికి రెండు చొప్పున ఏడాదిలో 24 ఏకాదశులు ఏర్పడతాయి. ఈ 24 ఏకాదశులూ ఉపవాసం చేయదగ్గవే. పైగా ప్రతి ఏకాదశికీ ఒకో విశిష్టతను కల్పించారు. భీష్మ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదైకాదశి… ఇలా ప్రతి ఏకాదశికీ ఓ పేరు ఉంది. అలాగే జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడు వచ్చే రోజుని ‘నిర్జల ఏకాదశి’ అన్నారు. నిర్జల అన్న పేరులోనే జలం సైతం తీసుకోకుండా సాగించే ఏకాదశి అని స్ఫురిస్తుంది. దీనినే భీమ ఏకాదశి లేదా పాండవ ఏకాదశి అని కూడా అంటారు.

       ఇలా భీమునితో ఈ ఏకాదశి ముడిపడటం వెనుక ఒక పురాణ గాధ లేకపోలేదు. భీముడు భోజన ప్రియుడు అన్న విషయం తెలిసిందే! అలాంటి భీమునికి, తన చుట్టు పక్కల వారంతా ఏడాది పొడవునా ఏకాదశీ వ్రతాలను ఆచరించి పుణ్యాన్ని పొందడం కనిపించింది. వారితో పాటుగా తాను కూడా 24 ఏకాదశుల నాడు ఉపవాసం చేయాలని ఉన్నా, ఆకలికి ఆగలేని శరీర తత్వం అతనిది. దీనికి ఏదో ఒక ఉపాయాన్ని చెప్పమంటూ, భీముడు వేదవ్యాసులవారిని వేడుకున్నాడట. దానికి వ్యాసుల వారు అందించిన సూచనే ‘నిర్జల ఏకాదశి’. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశినాడు నిరాహారంగానే కాకుండా నిర్జలంగా సైతం నువ్వు ఉపవాసం ఉండగలిగితే… ఏడాదిలోని అన్ని ఏకాదశులలోనూ ఉపవాసం చేసినంత ఫలితం వస్తుందని సూచించారు. ఆనాటి నుంచి ఈ ఏకాదశి భీమ/ పాండవ ఏకాదశిగా పేరు పొందింది. అన్ని ఏకాదశులకూ సాటి ఈ నిర్జల ఏకాదశి.

 నిర్జలంగానే ఎందుకు!

       మనిషి ఆకలికైనా కొన్నాళ్లు తట్టుకోగలడు కానీ దాహానికి మాత్రం తట్టుకోలేడు. సమయానికి తగినంత నీరు లభించకపోతే, అతనిలోని అణువణువూ ఆర్చుకుపోతుంది. కానీ ఎప్పుడన్నా ఓసారి నిర్జలంగా ఉపవాసం ఉండటం కూడా మంచిదే! ఎందుకంటే ఘనాహారం తీసుకోకుండా కేవలం నీటి మీదే ఆధారపడి చేసే ఉపవాసాలు చాలా సులువు. పైగా అలాంటి సమయాలలో నీటిని తీసుకుంటూ ఉండటం వల్ల శరీర ధర్మం ఎంతో కొంత సాగుతూ ఉంటుంది. తాగిన నీటిని జీర్ణం చేసుకునేందుకు మన జీర్ణ వ్యవస్థ, కిడ్నీలు, పాంక్రియాస్‌ పనిచేస్తూనే ఉంటాయి. కానీ నిర్జలంగా ఉన్న రోజున ఆయా శరీరభాగాలన్నీ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే ఎక్యూట్ పాంక్రియాటిస్‌ వంటి సమస్యలు ఏర్పడినప్పుడు, రోగిని కనీసం నీటిని కూడా అందించరు వైద్యలు. దాంతో సదరు అవయం తిరిగి ఆరోగ్యాన్ని పుంజుకునేందుకు తగిన విశ్రాంతిని కల్పిస్తారు.

        అలాగని ఇలా తరచూ నిర్జల ఉపవాసం ఉండటమూ మంచిది కాదు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు, శారీరిక శ్రమ చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు… ఒంటికి తగినంత నీరు అందకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఒంటికి తగినంత నీరు లభిస్తూ ఉండకపోతే కిడ్నీలు దెబ్బతినిపోతాయి. అందుకనే ఏడాదికి ఒక్కమారే ఇలా నిర్జలంగా ఉపవాసం ఉండమని సూచించి ఉంటారు పెద్దలు. మరో పక్క ఇలా నీరు సైతం తీసుకోకుండే సాగించే ఉపవాసంతో దైవం పట్ల మనిషికి ఉన్నా ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటించినట్లు అవుతుంది. అందుకనే రంజాన్‌ నాడు చేసే ఉపవాసాలు కూడా నిర్జలంగా సాగడం గమనార్హం.

 విధానం

       అన్ని ఏకాదశి ఉపవాసాలకు అటూఇటూగానే ఈ నిర్జల ఏకాదశి కూడా సాగుతుంది. దశమి నాడు ఒంటిపూట భోజనం; దశమినాటి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆచరించడం; నిర్జల ఏకాదశినాడు ఆచమనానికి తప్ప చుక్క నీరు కూడా ముట్టకుండా ఉపవాసాన్ని సాగించడం; ఏకాదశినాడు విష్ణుమూర్తిని దర్శించి, సేవించి, పూజించుకోవడం; ఏకాదశి రాత్రివేళ పురాణ కాలక్షేపంతో జాగరణ చేయడం; ద్వాదశి నాడు ఒక అతిథిని భోక్తగా పిలిచి, ఉపవాస వ్రతాన్ని విరమించడం…. ఇలా సాగుతుంది ఈ నిర్జల ఏకాదశి.

       పచ్చి మంచినీరు సైతం ముట్టకుండా సాగుతుంది కాబట్టే… మిగతా ఏకాదశులు అన్నింటిలోనూ ఉపవాసం ఉన్నంత పుణ్యఫలం దక్కుతుందని పెద్దలు చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది!

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కొత్తపల్లి జయశంకర్‌ వర్ధంతి

(ఆగష్టు 6, 1934 – జూన్ 21, 2011)

    తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ (ఆగష్టు 6, 1934 – జూన్ 21, 2011) వరంగల్ జిల్లా ఆత్మకూరు (వరంగల్ జిల్లా) మండలం పెద్దాపూర్ (ఆత్మకూరు) గ్రామశివారు అక్కంపేట లో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారి గా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టి ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ 2011, జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు.

       బాల్యం : 1934 , ఆగస్టు 6 న వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట లో జయశంకర్‌ జన్మించాడు. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంత్‌రావు. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. జయశంకర్‌ తల్లిదండ్రులకు రెండో సంతానం. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారి గా మిగిలిపోయాడు.

       ఉద్యోగ జీవితం : బెనారస్‌, అలీగఢ్‌ విశ్వవిద్యాలయాలనుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశాడు. 1975 నుంచి 1979 వరకు వరంగల్‌ లోని సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1979 నుంచి 1981 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్‌ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు అదే యూనివర్శిటీకి ఉపకులపతిగా పనిచేశాడు.

       అధ్యాపకుడిగా : అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నూరిపోశారు. ఎమ్జన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేశారు. సీకేఎం కళాశాల అంటేనే జిల్లాలో విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా అప్పట్లో పేరుండేంది. విప్లవకవి వరవరరావు లాంటి వాళ్లు ఆ కాలేజీలో అధ్యాపకులుగా వ్యవహరించారు. ఎమ్జన్సీ గడ్డురోజుల్లో ఆయన కళాశాలను నడిపి ఎంతో మంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని ఆయన నిర్బంధం నుంచి కాపాడారు. ఆయన అధ్యాపకుడిగా హన్మకొండలోని మల్టీపర్సస్ స్కూల్లో మొదట తెలుగు బోధించారు. ఒక అధ్యాపకున్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం సర్వసాధారణమే కానీ ఒక అధ్యాపకుడే తన విద్యార్థుల్ని గుర్తుపెట్టుకొని పేరుపెట్టి పిలవడం ఒక్క జయశంకర్ సార్‌కే సాధ్యం అంటూ ఆయనకు తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని, ప్రముఖ సాహీతివేత్త రామశాస్త్రి కన్నీళ్లపర్యంతమయ్యారు. జయశంకర్ విద్యార్థుల్లో అనేక మంది దేశవిదేశాల్లో ప్రస్తుతం ప్రముఖ స్థానంలో ఉన్నారు. వీరిలో కేయూ మాజీ ప్రొఫెసర్ ఎన్. లింగమూర్తి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్ కే. సీతారామావు తదితరులు అనేక మందికి ఆదర్శ గురువు జయశంకర్.

       తెలంగాణా ఉద్యమంలో : 1969 తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1952 లో జయశంకర్ నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్, ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954 లో ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చాడు. కె.సి.ఆర్ కు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించాడు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశాడు. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశాడు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశాడు. అబ్ తొ ఏక్ హీ ఖ్వాయిష్ హై, వొ తెలంగాణ దేఖ్‌నా ఔర్ మర్‌జానా’ (ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలి, తర్వాత మరణించాలి) అని అనేవాడు.

       విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీదాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తిచేయడంలో ఆయన పాత్ర మరవలేనిది. విద్యార్థి దశ నుంచే తెలం’గానం’ ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమంలోకి ఉరికి ఆనా టి నుంచి సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశా లాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సా ర్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన అపర మేధావి కొత్తపల్లి జయశంకర్. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణకోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించే మహనీయుడు. తెలంగాణ డిమాండ్‌ను 1969 నుంచి నిశితంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతీరోజూ రచనలు చేసిన అక్షరయావూతికుడు ఆయన.

       తెలంగాణలోని ప్రతీపల్లె ఆయన మాటతో పోరాట గుత్ప అందుకున్నది. ఆయన తిరగని ప్రాంతం లేదు. తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద, విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలో, సమావేశాల్లో తెలంగాణ రణన్నినాదాన్ని వినింపించిన పోరాట శీలి.

       అస్తమయం : మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి! మా తెలంగాణ మాగ్గావాలి..!! యాభై ఏళ్లుగా ఇదే ఆకాంక్ష.. ఇదే శ్వాస.. ఇదే లక్ష్యం.. ఇదే జీవితం.. ఇందులోనే మరణం! ఉద్యమాన్ని శ్వాసించిన మహోపాధ్యాయుడు ప్రొఫెసర్ కొత్త పల్లి జయశంకర్ రెండేళ్లు గొంతు క్యాన్సర్‌తో బాధపడ్డారు.  మీరు చేయాల్సింది మీరు చేశారు. ఈ సమయంలో నేను ఇక్కడ ఇక ఉండలేను. నేను వరంగల్‌కే పోతాను. నన్ను పంపండి’  అంటూ ఆయన పుట్టిన గడ్డమీద మమకారంతో ఇక్కడికి వచ్చారు. ఇంట్లోనే వైద్యులు ఆయనకు అన్నిరకాల వైద్యసేవలు అందించారు. 21.6.2011 మంగళవారం రోజున తెల్లవారుజాము నుంచి ఆయన పల్స్‌రేట్ పడిపోవడంతో ఆక్సిజన్ అందించారు, చివరకు అదేరోజు ఉదయం 11.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

దశపాప హర దశమి – గంగావతరణం (జ్యేష్ఠశుద్ధ దశమి)

” జ్యేష్టమాసి, సితేపక్షే, దశమ్యాం, బుధ హస్తయో,| వ్యతీపాతే, గరానందే, కన్యాచంద్రే, వృషౌరవౌ|| “

        జ్యేష్ట మాసము, శుక్లపక్షం, దశమి, వ్యతీపాత యోగము, గర కరణము, బుధవారము, హస్తా నక్షత్రములున్నందు వలన ఆనంద యోగము, కన్య యందు చంద్రుడు, వృషభమందు రవి, ఇవి పదిరకాలైన కాల విశేషాలు. ఈ పదీ కలిసి వచ్చిన రోజును దశపాప హర వ్రతము చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అదే దశపాప హర వ్రత లక్షణములు. 

గంగావతరణ జ్యేష్ఠ శుక్ల దశమీ బుధవారం హస్తా నక్షత్రంలో అయినట్లుగా వాల్మీకి రామాయణం చెప్తోంది అంటున్నారు. వైశాఖ మాస శుక్ల సప్తమి నాడు గంగావతరణం జరిగిందని గ్రంథాంతరాల్లో ఉంది. గంగావతరణకు ఇది మరొక తిధి. ఈ రోజు గంగావతరణ అయినా కాకపోయినా ఈ పండుగ గంగానదిని ఉద్దేశించి చేయబడింది కావడం నిజం. ఈ వ్రత విధానం (దశపాపహర దశమి) స్కంధ పురాణంలో ఉంది. గంగాదేవి కృపను సంపాదించటమే ఈ పండుగ ప్రధానోద్దేశం. ఈ రోజున గంగా స్నానం చేసి పూజ చేసి గంగా స్తోత్రం పఠిస్తే దశ విధ పాపాలు తొలుగుతాయి అని వ్రతగ్రంధం.

ఈ గంగాత్మక దశమికి మరోపేరు దశపాపహార దశమి అని; దశ హర దశమి అని కూడా అంటారు. దీనికి శాస్త్ర ప్రమాణం

శ్లోః లింగం దశాశ్వ మేధేశం

దృష్ట్యా దశహరాతి ధే

దశ జన్మార్జితైః పాపైః

త్యజ్యతే నాత్రసంశయః

దశహర తిధినాడు దశాశ్వ మేధ ఘట్టంలోని లింగము చూచినట్లయి తే లోగడ పది జన్మలలో చేసిన పాపం నిస్సందేహంగా నశిస్తుందని తాత్పర్యం.

స్నాన సంకల్పంలో కూడా ఈనాడు ‘‘మమ ఏతజ్జన్మ జన్మాంతర స ముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం దహ హర మహా పర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే” జన్మ జన్మాంతరాల నుండి వచ్చిన పది విధాలైన పాపాలు పోగొట్టే స్నానమని దీని భావం. పూజ కూడ పది పూవ్వులతో, పది రకాల పళ్ళతో నైవేద్యంగా చేస్తారు అని చెబుతారు.

గంగా దేవి పూజా మంత్రం

నమో భగవతె్యై దశపాపహరాయై

గంగాయై నారాయణై్య

రేవతె్యై దక్ష్రాయై శివాయై

అమృతాయై విశ్వరూపిణై్య

నందినై్య తేనమోనమః

ఓం నమశ్శివాయై నారాయణై్య

దశహరాయై గంగాయై నమోనమః

షోడశపచర విధిచే గంగాపూజ చేస్తూ అందులో ఈ మూల మంత్రా న్ని అహోరాత్రులు అయిదు వేలసార్లు జపించి వ్రతం పూర్తి చేయాలి.

        దశ పాపహర దశమి అనగా పది పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. ఇది జ్యేష్ఠ శుద్ధ పాఢ్యమి నుండి దశమి వరకూ చేస్తారు. పంచాంగంలో కూడా దశహరాదశాశ్వమేథేస్నానమ్‌; ఇతి ఆరభ్య దశమీ పర్యంతమ్‌ అని ఉంటుంది. అనగా ఈ రోజు ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలముంటుంది. ముఖ్యంగా గంగానదిలో చేస్తే గొప్ప విశేషం. అందునా కాశీలో దశాశ్వమేధ ఘట్టంలో గంగాస్నానం సంపూర్ణ పుణ్య ఫలం!

ఇక దశవిధ పాపములు :-

1. ఒకరి వస్తువు వారికివ్వకుండా తీసుకోవడం,

2. శాస్త్రము ఒప్పని హింసను చేయడం,

3. పర స్త్రీని కలవడం – ఇవి మూడు శరీరం తో చేసేవి.

4. పరుషము, 5. అసత్యము, 6.కొండెములు, 7. అసంబద్దమైన మాటలు – ఇవి నాలుగూ మాట ద్వారా చేసేవి.

8. ఇతరుల ధనములందు కోరిక,

9. ఇతరులకు ఇష్టముకాని విషయములు చేయతలచడము,

10. వ్యర్ధమైన అహంకారము – ఇవి మూడూ మానసికంగా చేసేవి.

ఇవే పదిరకాలైన పాపాలు.

      ఈ పదిరకాలైన పాపాలూ చేయని మనిషి ఉంటాడా? అని ఆలోచించనక్కర్లేదు. ఏదో ఒక సమయాన ఏదో ఒక పాపం యెంత మంచి వ్యక్తీ అని పేరు పొందిన వారైనా సరే చేసి ఉండక తప్పదు. తప్పులు చేయడం. వాటిని గురించి ఆలోచించక పోవడం. తానూ చేసినవి తప్పులే కావు అనుకోవడం ఈ పది పాపాలకు మించిన పాపం.

      ఏది ఏమైనా మనం మంచి అదృష్టవంతులం, మనం చేసిన తప్పులూ వలన వచ్చే పాపాలూ కడిగేసుకునే ఉపాయాలు మన శాస్త్రాలు, మన పెద్దలూ, మనకు ముందే చెప్పారు.

       అంటే మనం చేసే తప్పులు తప్పక చేస్తామని ముందే ఊహించి మరీ ఉపాయాలు చెప్పారు. వాటిని ఆచరించడమూ, ఆచరించకపోవడమూ మాత్రం మన చేతిలో వుంటాయి. మరి మన బుద్ధి ఎటు ప్రవర్తిస్తుందో, చేయమంటుందో, వద్దంటుందో ఆ సింగినాదం అంటూ వదిలివేస్తుందో చూడాలి, ఏది ఎలా వున్నా దశాపాపహర దశమి మాత్రం మంచి పర్వదినమే .

      శరీరానింకి అంటిన ఎలాంటి మురికైనా సరే నీరు తప్పనిసరిగా కావాలి. అలాగే పాపాలూ పోగొట్టుకోవడానికి కూడా ఆ గంగే గతి, గంగాదేవిని ఆరాధించి సేవించవలసిందే.

      మొట్టమొదటగా దేవలోకంలో దేవకృత్యాలు చేయుటకు సృష్టికర్త అయిన బ్రహ్మ చేతి కమందలమునండు మాత్రమె వుండేది. గంగ, వామనావతార సమయాన బలిచక్రవర్తి వామనస్వామికి మూడడుగుల నేలను దానం చేసే సమయాన స్వామి పాదాలు కడగటానికి ఉపయోగించిన ఆ గంగ విష్ణుపాదోదకమై ఆ తరువాత కైలాస వాసి శంభుని జటయందు చేరి ఓ అలంకరణగా మిగిలివుంది. ఆ సమయాన భగీరథ మహారాజు ప్రయత్నముతో భూమిపైకి దిగి ” భాగీరథి ” అను పేరుతొ వందల కొద్దీ యోజనముల మేర ప్రవహించుచూ మనకు కనిపిస్తూవున్నది.  

       అదే పరమపావని గంగ. లోపలి, బయటి పాపములను కడిగివేసే ఆ తల్లే సర్వ భూతములనూ రక్షిస్తూవున్నది. అలాంటి గంగమ్మ తల్లిని స్మరిస్తేనే చాలు విష్ణులోకం ప్రాప్తిస్తుందని పెద్దలూ చెప్పారు. కల్మష నాశిని, కలుష హారిణి అయిన గంగను ” ఓం నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నారాయన్యై, రేవత్యై, శివాయై, దక్షయై, అమృతాయై, విశ్వరూపిన్యై, నందిన్యైతే నమో నమః ” అంటూ  జ్ఞాన ఐశ్యర్యాది షడ్గుణవతియు, దశవిధ పాపముల హరిన్చునదియు, నారాయణ మూర్తి పాదముల నుండి పుట్టినదియు, రేవతియు, శివయు, దక్షయు, అమ్రుతయు, విశ్వరూపిణియు, నందినియూ, అగు గంగాదేవికి నమస్కారము. అని నమస్కారం చేయడం శాస్త్రాలు చెప్పిన పధ్ధతి.  

   జీవనాధారమూ, ప్రాణాధారమూ, అయిన గంగ లేకుండా ఏదీ జరగదూ, ఉండదూ. అందుకే దశయోగ పర్వదినాన దశపాపహరయైన గంగను ఆరాధించడం ఆచారం. ఓ చిన్నప్రతి మయందు గానీ చెంబులోని తీర్ధమందు( కలశమందు గానీ ) గంగాదేవిని ఆవాహనము చేసి పూజించాలి. తెల్లని వస్త్రాలు ఆ తల్లికి సమర్పించాలి. జ్యేష్టశుక్ల దశమి, ఆనాడు హస్తా నక్షత్రంతో కూడినప్పుడు గంగను యధావిధిగా స్తోత్రం చేసినవారికి అందని సౌభాగ్యాలుండవు. అష్టైశ్వర్యములూ ఇచ్చి ఆశీర్వదించే ఆ గంగమ్మ తల్లి కరుణ అనంతమైనది.

గంగమ్మతల్లి పన్నెండు పేర్లు :

“నందినీ నళినీ

సీతామాలినీ చ మహాపగా

విష్ణు పాదాబ్జ త్రిపధగామినీ

భాగీరథీ భోగవతీ

జాహ్నవీ త్రిదశేశ్వరీ”

       అంటూ గంగమ్మతల్లి పన్నెండు పేర్లనూ తలుస్తూ పదిమార్లు గంగలో మునగడం లేదా ఇంట్లోనైనా సరే  పదిమార్లుగా స్నానం చేయడం ఆచారం. స్నానం చేసేటప్పుడు నల్లనూవులు, పేలాలపిండి, బెల్లము చేసి గంగకు సమర్పించాలని శాస్త్రవచనం. దీనివల్ల జన్మజన్మాంతరాల్లో చేసిన పాపాలూ మూడూ విదాలైనవీ, శరీరంతో చేసిన మూడూ విధాలైన పాపాలూ, నోటి మాటతో చేసిన మూడూ రకాలైన పాపాలూ ( మొత్తం పది ) నశించిపోతాయని పెద్దలు చెప్తారు. అలాగే పది దీపములు పెట్టి గంగకు అర్పించడం శ్రేయస్సునిచ్చే ప్రక్రియ. అలాగే పదిమంది బ్రాహ్మణులకు యవలు, నువ్వులు, దక్షిణ తాంబూలాలతో దానం చేయడం, గోదానం చేయలేక పోయినా చిన్న చిన్న ఆవు బొమ్మ దానం అయినా చేయాలి. మనం చేస్తున్న పాపాలు వదిలించుకునే అద్భుతమైన కాలవిశేషం దశపాపహర  పర్వదినం. ..

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

రంభా వ్రతం

సౌభాగ్యాన్నిచ్చే రంభా వ్రతం

       హిందువుల పంచాంగంలో చైత్ర, వైశాఖాల తర్వాత వచ్చే జ్యేష్ఠం మూడవది. ప్రతి నెలకి దానిదైన ప్రత్యేకత ఉంటుంది. జ్యేష్ఠంలో ముఖ్యమైన పండుగలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రత్యేకించి ‘జ్యేష్ఠ శుధ్ధ తదియ’. దీనిని ‘రంభా తృతీయ’ , ‘రంభా వ్రతం’ అని అంటారు. స్మృతి కౌస్తుభం, పురుషార్థ చింతామణి మొదలైన గ్రంథాలలో దీని ప్రస్తావనను రంభా తృతీయ అని కనుపిస్తుంది. చాలామందికి అసలు ఈ రంభా వ్రతం అంటే తెలియదు. ఎలా చేస్తారు? ఎం దుకు చేస్తారు? అన్నది ధర్మ సందేహమే! పాఠకులలో చాలామందికి పెద్ద పెద్ద పండుగల గురించి తెలిసినట్టుగా ఈ రంభా వ్రతం గురించి అసలు తెలియకపోవచ్చు. చాలా తక్కువమందికే పరిచితమైన రంభా వ్రతం గురించి…

      రంభ అనగానే అప్సరస అనుకుంటారు చాలా మంది. కాని అరటి చెట్టు కు మరో పేరు రంభ. కనుక రంభా వ్రతం అనగానే రంభ అనే అప్సరను పూజించడడం అనుకోవడం సరికాదు. దైవ అంశతో కూడిన అరటి చెట్టును పూజించడమే రంభా వ్రతం. మంచి భర్త కోసం, అన్యోన్యమైన దాంపత్యం కోసం మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు.

       ఈ వ్రతానికి సంబంధించిన కథ ఈ విధంగా ఉంది. తపోనిష్ఠలో ఉన్న పరమశివునికి ఉపచారాలు చేయడానికి పార్వతి తండ్రి హిమవంతుడు తన కుమార్తెను నియమించాడు. ఆమెపైన శివునికి ప్రేమ కలిగించాలని ఆ సమయంలో మన్మధుడు తన మన్మధ బాణాలను సరాసరి శివునిపైనే ప్రయోగించటం చేత రుద్రునికి మనసు చెదిరింది. కోపం వచ్చిన రుద్రుడు ఆగ్రహం పట్టలేక తన మూడవ కన్ను తెరచి మన్మధుని చూచా డు. మన్మధుడు భస్మమయ్యాడు. శివుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పార్వతీదేవి చిన్న బుచ్చుకుని ఇంటికి రాగా ఆమెను తల్లి ఎదురెళ్లి కౌగలించుకుంది. కన్నీరు కార్చిన గిరిజని ఆమె తల్లి తన భర్త దగ్గరకి తీసుకెళ్లింది. అక్కడ హిమవంతుడు సప్త మహామునులతో కూర్చుని సంభాషిస్తున్నాడు. వారికి ఆయన తన కుమార్తె మనోరథం గురించి చెప్పగా.. అందులో ఒకరైన భృగువు, ‘అమ్మాయి! ఒక వ్రతం ఉంది. అది నువ్వు చక్కగా ఆచరిస్తే ఆ పరమశివుడు నీకు భర్త అవుతాడు!’ అని చెప్పాడు. అందుకు సంతోషించిన పార్వతీదేవి అటులనే మహా మునీ దయతో ఆ వ్రతం ఎట్లా చేయాలో తెలుపవలెనని వినయంగా అడిగింది.

       దానికా ముని సంతోషించి, ‘బిడ్డా! ఆ వ్రతాన్ని పెద్దలు రంభావ్రతం అని అంటారు. అసలు ‘రంభ’ అనగా ‘అరటి చెట్టు’  అని అర్థం. ఆ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ తదియనాడు చేస్తారు. ఆ రోజు ఉదయం తలారా స్నానం చేసి అరటి చెట్టు మొదట అలికి ముగ్గు పెట్టాలి. రంభకు అధిష్ఠాన దేవత సావిత్రి. కనుక అరటి చెట్టు కింద సావిత్రీదేవిని పూజించాలని చెప్పాడు.

       దానికి పార్వతీదేవి ‘మహాశయా! సావిత్రీదేవి ఎలా అరటి చెట్టుకు అధిష్ఠాన దేవత అయింద’ ని ప్రశ్నించింది. దానికి భృగువు ‘సావిత్రి, గాయత్రి ఇద్దరూ బ్రహ్మదేవునికి భార్యలు. తన సౌందర్యం చూసుకుని గర్వంతో సావిత్రి తాను బ్రహ్మదేవుని వద్దకు వెళ్లటం మానుకుంది. గాయత్రిదేవి ఆమెకు చాలాసార్లు చెప్పి చూసింది. అయినా సావిత్రి వెళ్లలేదు. దానితో తీవ్రంగా కోపించిన బ్రహ్మ మానవలోకంలో బీజంలేని చెట్టుగా పుట్టు.. ఈ లోకం వదిలిపో అని సావిత్రిని శపించాడు.

       అంతట తన తప్పు అర్థం అయ్యి పశ్చాత్తాపం చెందిన సావిత్ర ‘బ్రహ్మ కాళ్ళ మీద పడి తనని మన్నించ’ మని ప్రార్ధించింది.కానీ బ్రహ్మకు ఆమె పై దయ కలుగలేదు. ఇక గత్యంతరంలేని సావిత్రి భూలోకానికి వెళ్లి, అరటి చెట్టుగా పుట్టింది. అక్కడ ఆమె ఐదు సంవత్సరాలు బ్రహ్మ గురిం చి తపస్సు చేసింది. అంతట బ్రహ్మ మనస్సు అప్పటికి కరిగింది. అంత ట బ్రహ్మ సావిత్రి ముందు ప్రత్యక్షమైనాడు. ఆనాడు జ్యేష్ఠ శుద్ధ తదియ. ‘నీవు ఒక అంశతో అరటి చెట్టును ఆశ్రయించుకొని ఉండు, అలా అరటి చెట్టు ద్వారా నిన్ను పూజించే వారి కోరికలు తీరుతాయి’ అని చెప్పి ‘ఇక నువ్వు నాతో మన సత్యలోకానికి రావచ్చు’ అంటూ ఆమెను తనతో తీసుకెళ్ళాడు. అలా సావిత్రికి శాపవిమోచనం అయిన రోజు కనుక ‘జ్యేష్ఠ శుద్ధ తదియ’ ఒక పండుగగా, పర్వదినంగా అయ్యింది.

 అంతట గిరిపుత్రిక ‘స్వామీ! అయితే ఈ వ్రతం సంపూర్ణంగా చేసే నియమాలు దయతో శలవియ్యండి’ అని కోరింది.

        ‘బిడ్డా! పంచవన్నెల ముగ్గులు వేసిన అరటి చెట్టు కింద ముందు మంట పం వేయవలెను. దానిని రుచికరమైన పదార్ధాలతో నివేదన పెట్టాలి. ఆ అరటి చెట్ల నీడలోనే పద్మాసనం వేసుకుని సాయంకాలం దాకా కూర్చు ని సావిత్ర స్తోత్రము చేస్తూ ఉండాలి. ఆ రాత్రి జాగరణ చేయాలి. పద్మాసనంలో కూర్చుని పగలు సావిత్రి దేవి స్తోత్రం చేస్తూ రాత్రి అరటి చెట్టు కింద విశ్రమించాలి. ఇలా నెలరోజులు చేసిన తర్వాత ఆ రుచికరమైన పదార్ధాలతో నివేదించిన మంటపాన్ని పూజ్య దంపతులకు దానం చేయాలి’  అని చెప్పాడు. ఈ వ్రతాన్ని లోపాముద్ర చేసి భర్తను పొందిందని చెప్పాడు.

       అంత పార్వతీదేవి ఆ విధంగానే రంభావ్రతాన్ని దీక్షతో చేసింది. ఆ దీక్ష కు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇది ఆ రంభా వ్రత గాథ.

        ‘కృత్య సారసముచ్చయం’ అను గ్రంథంలో పంచాగ్న సాధన చేయాలి, పద్మాసనం వేసుకుని కూచుని తపస్సు చేయాలి’  అని ఉంది. అసలు పం చాగ్ని సాధన అంటేనే ‘నాలుగు వైపులా నిప్పుల గుండాలు ఉంచుకుని తాను సూర్యునివైపు కంటి రెప్ప వేయకుండా చూస్తూ ఉండటం..’ ఇది చాలా చాలా కఠోర దీక్ష. అలాంటి దీక్షను నియమ నిష్ఠలతో చేయాలి. ఇందులో అరటి చెట్ల ప్రత్యేకతలను గమనిస్తే ఆ నీడను జ్యేష్ఠ శుద్ధ తది య మొదలు ఆషాఢ శుద్ధ తదియ వరకూ దాదాపు నెలరోజు నివసించ డం అనేది చక్కని ఆరోగ్యాన్నిస్తుంది. ఈ వ్రతం ప్రత్యేకంగా స్ర్తీలకని చెప్పశ్హనవసరం లేదు. వేసవి సమయంలో పగటి పూట అరటి చెట్టు నీడ దాహాన్ని, తాపాన్ని తగ్గిస్తుంది. చలచల్లగా ఉంటుంది.

       ఈ రంభా వ్రతం కాక అరటిచెట్టు సంబంధమైనది కదళీ వ్రతం అని మరొక వ్రతం కూడా ఉంది. అది భారతీయులే చేస్తారు. ఆ వ్రతం చేస్తే స్ర్తీలు సౌభాగ్యవతులై చిరకాలం జీవిస్తారని ఫలశ్రుతి. రాజ్య వ్రతం, త్రి విక్రమ తృతీయా వ్రతం మొదలైన ఇతర వ్రతాలు కూడా నేడు చేస్తారని ఉన్నది. కాని అన్నింటిలోకి రంభావ్రతం కొంతవరకూ ఆచరణలో ఉన్నట్టు కనుపిస్తోంది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)