Categories
Vipra Foundation

రవీంద్రనాధ ఠాగూర్ వర్థంతి

(మే 7, 1861 – ఆగస్టు 7, 1941)

       ఆంగ్లేతర సాహిత్య రచనలతో అత్యంత  ప్రతిష్ఠాకరమైన నోబెల్ పురస్కారాన్ని అందుకున్న ప్రతిభాశాలి విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్. ఈయన రచించిన ‘గీతాంజలి’ తదితర బెంగాలీ రచనలు సమాజాన్ని ఉత్తేజరపరిచాయి. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటాయి. ఠాగూర్ రచనలు సర్వ మానవ సౌభ్రాతృత్వ భావనకు ప్రాణం పోశాయి. వీటిని రవీంద్రుడే స్వయంగా ఆంగ్లానువాదం చేయడం మరో విశేషం.

  ఈ అనువాదాల ద్వారా నోబెల్ కమిటీ

       ఈ రచనల సారాంశాన్ని గ్రహించింది. అతడిని 1913లో నోబెల్ బహుమానానికి అర్హుడిగా ప్రకటించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ కోల్‌కతా మహానగరంలోని బ్రాహ్మణ జమిందారీ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి దేవేంద్రనాథ ఠాగూరు, తల్లి శారదాదేవి. ఈ దంపతుల 13వ సంతానం రవీంద్రుడు. ఇతడే కడపటివాడు. ‘ఠాగూర్’ అంటే ‘గౌరవప్రదమైన అయ్యా’ అని అర్థం. రవీంద్రుని తల్లి శారదాదేవి అతడి చిన్నతనంలోనే మరణించారు. దాంతో ఆయన నౌకర్ల చేతిలో పెరిగాడు. రవీంద్రుడి జ్యేష్ట సోదరుడైన ద్విజేంద్రనాథ ఠాగూరు సమాజంలో గౌరవం పొందిన కవి, తత్వవేత్త. మరొక సోదరుడు సత్యేంద్రనాథ్ బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఐసీఎస్ పదవి పొందిన తొలి భారతీయ అధికారి. మరొక సోదరుడు జ్యోతీంద్రనాథ నాటక ప్రయోక్త, సంగీతకారుడు. అందువల్ల జోరాశాంకో జమీందారీ బంగళా ఎప్పుడూ నాటకాలతో, పాశ్చాత్య, బెంగాలీ సంగీత సభలతో, సాహిత్య గోష్ఠులతో కళకళలాడుతూ ఉండేది. రవీంద్రుని సోదరి స్వర్ణకుమారి రచయిత్రి. రవీంద్రుడు ఏ పాఠశాలకు పోకుండానే ఇంటివద్దే విద్యాభ్యాసం చేశాడు. 8 సంవత్సరాల వయసులోనే రవీంద్రుడు పద్యాలు రాయటం ప్రారంభించాడు. ఆయన రాసిన మొట్టమొదటి పద్య సంపుటి ‘భాను సింహ’, అయితే దానిని బెంగాలీ పండితులు ఆమోదించలేదు.

  శాంతినికేతన్‌కు పయనం!

       రవీంద్రునికి 11 సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది. ఆ తరువాత రవీంద్రుడు తన సోదరులతో కలిసి తండ్రి స్థాపించిన శాంతినికేతన్ ఎస్టేట్‌కు వెళ్లాడు. ఆ సమయంలోనే ఆయన హిమాలయాలలోని డల్హౌసీ, పర్వత ప్రాంతాలను దర్శించాడు. ఆ ప్రాంతాలు, శాంతినికేతన్, రవీంద్రుని మనస్సును ఆకట్టుకున్నాయి. రవీంద్రుడు సోదరులతో అక్కడే కొన్ని నెలల పాటు గడిపాడు. ఆ సమయంలోనే ఎందరో ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్రలు, ఆయన తండ్రి జీవిత చరిత్ర, బెంజమిన్ ఫ్రాంక్లిన్ (రచయిత) జీవిత చరిత్ర, ఎడ్వర్ట్ గిబ్బన్ రాసిన రోమన్ సామ్రాజ్య తిరోగతి, పతనం, కాళిదాసు కవిత్వం మొదలైన రచనలను ఆకళింపు చేసుకున్నారు. తాను స్వయంగా రాయడం ప్రారంభించారు.

 న్యాయశాస్త్రం చదివించాలని!

       రవీంద్రుడిని బారిస్టర్‌ని చేయాలనేది తండ్రి దేవేంద్రనాథ్ కోరిక. 1878 సంవత్సరంలో రవీంద్రుణ్ని ఇంగ్లండుకి పంపించారు. ఇంగ్లండులో న్యాయ శాస్త్ర కళాశాలలో చేరినప్పటికీ ఆయన బారిష్టర్ కాలేదు. ఆ చదువు మధ్యలోనే మాని, షేక్‌స్పియర్ రచనలు ‘రెలిజియో మెడిసి’, ‘కొరియొలోనస్’, ‘ఆంటోనీ క్లియోపాత్రా’ మొదలైనవన్నీ ఆకళింపు చేసుకున్నారు. చక్కని ఆంగ్ల భాషలో మాట్లాడటం, రాయటం నేర్చుకున్నారు. ఐరిష్, స్కాటిష్ జానపద గేయాలను నేర్చుకుని, 1880లో స్వదేశం చేరుకున్నారు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను యూరప్ దేశాల సంస్కృతులతో మేళవించి, రెండింటిలోని మంచిని తాను నమ్మిన సిద్ధాంతాలకు అన్వయించాడు.

  వివాహం!

      రవీంద్రుని వివాహం 1883వ సంవత్సరంలో భవతారిణి శాఖకు చెందిన మృణాళినీదేవితో జరిగింది. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. 1890లో జమీ వ్యవహారాల బాధ్యత ఆయన మీద పడింది. ‘షి లై ద హా’ అనే అతిపెద్ద జమీందారీ ఎస్టేట్ (ఈ ప్రాంతం ప్రస్తుత బంగ్లాదేశ్‌లో ఉంది) నిర్వహణలోని లోపాలను సవరించారాయన. వ్యవసాయ భూములను రైతులకు స్వాధీనం చేసి, వారి నుంచి నామ మాత్రపు శిస్తులు వసూలు చేసేవారు. జమీందారీ వ్యవహారాలు చూసుకుంటూనే రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్‌కు మకాం మార్చుకున్నారు. శాంతినికేతన్‌లో ఉన్నప్పుడు రవీంద్రుని పిల్లలిద్దరు, ఆయన భార్య మృణాళిని మరణించారు. దానితో రవీంద్రుడు విరాగిగా మారిపోయారు. 1905వ సంవత్సరంలో రవీంద్రుని తండ్రి దేవేంద్రనాథ్ మరణించడంతో రవీంద్రునికి జమీందారీ జీవితంపై ఆసక్తి నశించింది. రచనావ్యాసంగంలో మునిగిపోయి, ఆందులోనే సాంత్వన పొందారు. రచనలపై నెలకు వచ్చే రెండు వేల రూపాయల రాయల్టీతో సామన్యమైన జీవితం గడపటం ప్రారంభించాడు.

       ఠాగూర్ తన రచనలలో చాలా వాటికి స్వయంగా ఆంగ్లానువాదాలు చేశారు. నోబెల్ బహుమతి అందుకున్న తర్వాత బ్రిటన్ మహారాణి ఠాగూర్‌కు ‘నైట్’ బిరుదు ప్రదానం చేశారు. అయితే రవీంద్రుని దేశభక్తి ఆ బిరుదుని త్యజించేలా చేసింది. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో బ్రిటిష్ సైన్యం భారతీయులను హతమార్చిన సంఘటన ఆయనను తీవ్రంగా కలచివేసింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.

  విశ్వకవి పై జాతిపిత ప్రభావం!

       మహాత్మాగాంధీతో పరిచయం ఏర్పడిన తర్వాత రవీంద్రుడు తనదైన శైలిలో స్వాతంత్య్ర పోరాటం ప్రారంభించారు.  కుల వివక్షను తొలగించటానికి బెంగాల్‌లో శ్రీకారం చుట్టి, దక్షిణాదిన గురువాయూరు దేవాలయంలో దళితులకు ప్రవేశం కల్పించి, అంటరానితనాన్ని నిర్మూలించటానికి ఎన్నో మార్గాలు సూచించారు. పల్లెల పునర్ నిర్మాణం కోసం వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త ఎల్మ్‌హర్‌స్ట్‌తో కలిసి బెంగాల్‌లో ‘శ్రీ నికేతన్ సంక్షేమ సంస్థ’ను స్థాపించి, పల్లె ప్రజలలో మనోవికాసం తేవటానికి కృషి చేశారు. 1930 దశాబ్దంలో కుల నిర్మూలన ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. దానికి సంబంధించిన ఎన్నో నవలలు, నాటకాలు రాశారు.

  భారతీయ ఔన్నత్యాన్ని చాటుతూ…

       రవీంద్రనాథ్ ఠాగూర్ అనేక దేశాలు సందర్శించి ‘విశ్వంలోని మానవులంతా ఒక్కటే’ అనే సందేశాన్ని అందించారు. తాను నమ్మిన బ్రహ్మ సమాజ సిద్ధాంతాల ద్వారా మతాలకు అతీతమైన పరబ్రహ్మమొక్కటే అందరికీ దైవం అని ప్రచారం చేసి ‘విశ్వకవి’, ‘గురుదేవ్’ బిరుదులను శాశ్వతం చేసుకున్నారు. ప్రపంచ పర్యటనలో 35కు పైగా దేశాలలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. విశ్వకవి రవీంద్రుడి జీవితం ఒక విజ్ఞాన సర్వస్వం. ఎవరు ఏ దృష్టితో శోధించినా దానికి సంబంధించిన విషయం, వివరణ లభించక మానదు.

  జనగణమన… అధినాయక..!

       గీతాంజలి,  గోరా, ఘరే బైరే మొదలైన రచనలన్నీ సహజత్వం ఉట్టిపడుతూ సామాన్యులకు అర్థమయ్యేటట్లు వాడుకభాషలో, సరళమైన శబ్దాలతో ఉంటాయి. దేశభక్తిని, విశ్వమానవ సౌభ్రాతృత్వం చాటేటట్లు రాసిన రెండు గీతాలను భారతదేశం (జనగణమన), బంగ్లాదేశ్ (అమార సోనార్ బంగ్ల) జాతీయగీతాలుగా ఎంపిక చేసుకున్నాయి. ఠాగూర్ గీత రచయిత మాత్రమే కాదు… నాటక రచయిత, నాటక కర్త, వక్త, వ్యాఖ్యాత కూడ.

  రవీంద్రుని రచనలు:

       గీతాలు: మానసి (1890); సోనార్ తరి (1890); గీతాంజలి (1910); గీతిమాల్య (1914); తోటమాలి (1913)  (వీటిని స్వయంగా ఆంగ్లంలోకి స్వేచ్ఛానువాదం చేశారు).

       నాటకాలు, కథలు: రాజా (1910); డాక్ ఘర్ (1912); అచలాయతన్ (1912) ; ముక్తధార (1922); రక్తక రవి (1926)

 ‘గోరా’(1910); ఘరే బైరే (1916); యోగా యోగాలు (1929) ; బికారిణి (1929) ,

 నృత్యరూపకాలు: పాత్రపుత్( 1936),  శేషసప్తక్ (1935), శ్యామ (1939), చండాలిక (1939)

        రవీంద్రుడు ఆరోగ్యం క్షీణించిన తర్వాత ‘చార్ అధ్యాయ్ (1934), విశ్వ పరిచయ్ (1937), తీన్‌సంగి, గల్పశిల్ప (1941)’ మొదలైన రచనలు చేశారు. 1941లో రవీంద్రుడు చనిపోయే ముందురోజు అప్పటి ఎలక్షన్ కమిషనర్ అయిన ఏకే సేన్ అనే మిత్రుణ్ని పిలిచి, తన తుది సందేశాన్ని చెప్పారు. ‘నా జన్మ మధ్యలోనే అంతరిస్తోంది. ఈ సమయంలో నా స్నేహితుల వెచ్చని స్పర్శ, ఈ పుడమితల్లి శాశ్వత ప్రేమ, మానవులందరి ఆశీస్సులను నాతో తీసుకుని వెళ్తున్నాను. నేను ఈ ప్రపంచానికి ఇవ్వవలసినదంతా ఇచ్చాను. ఈ రోజు నేను ఖాళీ సంచితో ఉన్నాను. మీరంతా కొంత ప్రేమ, క్షమాపణలు ఇస్తే ఈ ప్రపంచం లేని చోటకి శాశ్వతానందంతో వెళ్తాను’ అని రాయించారు ఠాగూర్. ప్రపంచ ప్రజలందరినీ ఉత్తేజపరిచే సందేశాన్నిచ్చిన విశ్వకవి 1941వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన శరీర త్యాగం చేశారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

కొత్తపల్లి జయశంకర్‌ జయంతి

    తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ (ఆగష్టు 6, 1934 – జూన్ 21, 2011) వరంగల్ జిల్లా ఆత్మకూరు (వరంగల్ జిల్లా) మండలం పెద్దాపూర్ (ఆత్మకూరు) గ్రామశివారు అక్కంపేట లో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారి గా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టి ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ 2011, జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు.

బాల్యం

      1934 , ఆగస్టు 6 న వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట లో జయశంకర్‌ జన్మించాడు. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంత్‌రావు. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. జయశంకర్‌ తల్లిదండ్రులకు రెండో సంతానం. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారి గా మిగిలిపోయాడు.

ఉద్యోగ జీవితం

       బెనారస్‌, అలీగఢ్‌ విశ్వవిద్యాలయాలనుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశాడు. 1975 నుంచి 1979 వరకు వరంగల్‌ లోని సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1979 నుంచి 1981 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్‌ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు అదే యూనివర్శిటీకి ఉపకులపతిగా పనిచేశాడు.

అధ్యాపకుడిగా..

       అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నూరిపోశారు. ఎమ్జన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేశారు. సీకేఎం కళాశాల అంటేనే జిల్లాలో విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా అప్పట్లో పేరుండేంది. విప్లవకవి వరవరరావు లాంటి వాళ్లు ఆ కాలేజీలో అధ్యాపకులుగా వ్యవహరించారు. ఎమ్జన్సీ గడ్డురోజుల్లో ఆయన కళాశాలను నడిపి ఎంతో మంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని ఆయన నిర్బంధం నుంచి కాపాడారు. ఆయన అధ్యాపకుడిగా హన్మకొండలోని మల్టీపర్సస్ స్కూల్లో మొదట తెలుగు బోధించారు. ఒక అధ్యాపకున్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం సర్వసాధారణమే కానీ ఒక అధ్యాపకుడే తన విద్యార్థుల్ని గుర్తుపెట్టుకొని పేరుపెట్టి పిలవడం ఒక్క జయశంకర్ సార్‌కే సాధ్యం అంటూ ఆయనకు తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని, ప్రముఖ సాహీతివేత్త రామశాస్త్రి కన్నీళ్లపర్యంతమయ్యారు. జయశంకర్ విద్యార్థుల్లో అనేక మంది దేశవిదేశాల్లో ప్రస్తుతం ప్రముఖ స్థానంలో ఉన్నారు. వీరిలో కేయూ మాజీ ప్రొఫెసర్ ఎన్. లింగమూర్తి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్ కే. సీతారామావు తదితరులు అనేక మందికి ఆదర్శ గురువు జయశంకర్.

తెలంగాణా ఉద్యమంలో

       1969 తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1952 లో జయశంకర్ నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్, ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954 లో ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చాడు. కె.సి.ఆర్ కు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించాడు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశాడు. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశాడు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశాడు. అబ్ తొ ఏక్ హీ ఖ్వాయిష్ హై, వొ తెలంగాణ దేఖ్‌నా ఔర్ మర్‌జానా’ (ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలి, తర్వాత మరణించాలి) అని అనేవాడు.

       విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీదాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తిచేయడంలో ఆయన పాత్ర మరవలేనిది. విద్యార్థి దశ నుంచే తెలం’గానం’ ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమంలోకి ఉరికి ఆనా టి నుంచి సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశా లాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సా ర్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన అపర మేధావి కొత్తపల్లి జయశంకర్. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణకోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించే మహనీయుడు. తెలంగాణ డిమాండ్‌ను 1969 నుంచి నిశితంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతీరోజూ రచనలు చేసిన అక్షరయావూతికుడు ఆయన.

       తెలంగాణలోని ప్రతీపల్లె ఆయన మాటతో పోరాట గుత్ప అందుకున్నది. ఆయన తిరగని ప్రాంతం లేదు. తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద , విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలో, సమావేశాల్లో తెలంగాణ రణన్నినాదాన్ని వినింపించిన పోరాట శీలి.

అస్తమయం

       మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి! మా తెలంగాణ మాగ్గావాలి..!! యాభై ఏళ్లుగా ఇదే ఆకాంక్ష.. ఇదే శ్వాస.. ఇదే లక్ష్యం.. ఇదే జీవితం.. ఇందులోనే మరణం! ఉద్యమాన్ని శ్వాసించిన మహోపాధ్యాయుడు ప్రొఫెసర్ కొత్త పల్లి జయశంకర్ రెండేళ్లు గొంతు క్యాన్సర్‌తో బాధపడ్డారు.  మీరు చేయాల్సింది మీరు చేశారు. ఈ సమయంలో నేను ఇక్కడ ఇక ఉండలేను. నేను వరంగల్‌కే పోతాను. నన్ను పంపండి’  అంటూ ఆయన పుట్టిన గడ్డమీద మమకారంతో ఇక్కడికి వచ్చారు. ఇంట్లోనే వైద్యులు ఆయనకు అన్నిరకాల వైద్యసేవలు అందించారు. 21.6.2011 మంగళవారం రోజున తెల్లవారుజాము నుంచి ఆయన పల్స్‌రేట్ పడిపోవడంతో ఆక్సిజన్ అందించారు, చివరకు అదేరోజు ఉదయం 11.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కామిన్యై (కామిక) ఏకాదశి – కామ్యైకాదశి

ఆషాఢ మాసంలో వచ్చే పర్వదినాలలో ఒకటి కామ్యైకాదశి (కామిన్యై (కామిక) ఏకాదశి). ఆషాఢ బహుళ ఏకాదశినే కామ్యైకాదశి అంటారు. అంటే ఈ ఏకాదశినాడు చేసే దీక్ష మానవుల సకల కోర్కెలనూ తీరుస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అంటే మన కామ్యాలను తీర్చేదే కామ్యైకాదశి అన్నమాట. ఆషాఢ శుద్ధ ద్వాదశినాడు చాతుర్మాస్యం ప్రారంభిస్తారు. యతులకు, సన్యాసులకు ఇది ఎంతో పవిత్రమైనది ముఖ్యమైంది. కామిక ఏకాదశి అని పిలువబడే రోజున ఆచరించే వ్రతాన్ని పాటిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఈ దినం ఏకాదశీ వ్రతం, ఉపవాసాలను పాటించడంతో పాటు నవనీతము (వెన్న)ను దానం చేయడం మంచిది.   

సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో ఇదొకటి. ఈ కామ్యైకాదశిని తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాత్ వారంతా జరుపుకుంటారు. కాగా, ఉత్తరాది వారికి మాత్రం ఇది శ్రావణ మాసంలో వస్తుంది. చాతుర్మాస వ్రతదీక్షలో భాగంగా రావడంతో ఈ కామ్యైకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

కామ్యైకాదశి పూజా విధానం

కామ్య ఏకాదశి రోజున చాలామంది హిందువులు అత్యంత నిష్ఠగా ఉపవాసం ఉంటారు. ప్రత్యేకించి తులసి దళాలతో ఆ రోజు శ్రీకృష్ణుని పూజిస్తారు. తులసీ దళాలతో పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శత్రుబాధ, ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఒక తులసీ దళం.. నవరత్నాలు, వజ్ర వైఢూర్యాలు, స్వర్ణం, వెండి కంటే అతీతమైందని పురాణాలు చెబుతున్నాయి.ఏమీ తినకుండా కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ నీల్లారం పాటించేవారు కొందరైతే, ఆ నీళ్లు సైతం తాగకుండా పొద్దంతా ఉండేవారు మరి కొందరు. ఇంతటి కఠినమైన ఉపవాసాలు ఉండలేకపోయినా పాక్షిక ఉపవాసం చేయవచ్చు.

కామ్య ఏకాదశి రోజున తులసి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావించి పూజిస్తారు. దీనివల్ల సకల పాపాలన్నీ నివృత్తి కావడమే కాకుండా ఎలాంటి రోగాలైనా తగ్గిపోతాయన్న నమ్మకం భక్తులకు ఉంది. తులసి చెట్టుకు నీళ్లు పోయడం ద్వారా మృత్యుభయం పోయి, యముని కోపం నుంచి రక్షణ లభిస్తుందని కూడా విశ్వసిస్తారు. అలాగే, ఈ పుణ్యం పితృదోషం నుంచి విముక్తుల్ని చేస్తుందని కూడా నమ్ముతారు. మర్నాడు ద్వాదశి రోజున దీక్షను విరమిస్తారు.

అన్ని కోర్కెల్ని తీర్చే పవిత్ర సమయం కాబట్టి, ఈ కామ్య ఏకాదశి నాటి రాత్రి కొందరు భక్తులు నిద్రకు దూరమై జాగరణలో కూడా ఉంటారు. రాత్రంతా శ్రీకృష్ణుని కీర్తనలు, భజనలు చేస్తూ గడుపుతారు. ఇంకొందరు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. ఓం నమో నారాయణాయ నమః అన్న మంత్రోపాసనతో రోజంతా పొద్దు పుచ్చేవారుంటారు. ఇంకొందరు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలనూ సందర్శిస్తారు. గంగ, యమున, గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి పవిత్ర నదులలో పుణ్యస్నానాలు కూడా ఆచరిస్తారు. ఈవేళ విష్ణు దేవాలయాలు భక్తులతో కిక్కిరిసి పోతాయి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

పింగళి వెంకయ్య జయంతి

  (ఆగష్టు 2, 1876 – జూలై 4, 1963)

 “మూడు రంగులు….” భారత స్వాతంత్ర్య  సంగ్రామానికి  ఊహించని  ఉత్సాహాన్ని అందించాయి.

అవే మూడు రంగులు ఒక అర్ధరాత్రి రెప రెప లాడుతుంటే…అది చూసి ఈ  దేశం మురిసిపోయింది.

ఆ మూడు రంగులని చూడగానే  ప్రతి  భారతీయుడి మనసు సంతృప్తి, కీర్తితో ఉప్పొంగి పోతుంది.

ఆ మూడు రంగులే మన బలం… మన ఐకమత్యం… మన కీర్తి…మన గౌరవం…

ఆ మూడు రంగులే 130 కోట్ల భారతీయుల హృదయాలను “ఇండియా” అనే ఎమోషన్ తో మైమర్చేలా చేస్తున్నాయి.

దేశ సరిహద్దులో రక్షణగా ఉండే ప్రతి సైనికుడికి ఆ మూడు రంగులే తోడు, ధైర్యం… ఆ మూడు రంగులు తన పార్థివ దేహం పైన కప్పబడిన, అదే ఈ జన్మకి దక్కిన విశిష్టమైన గౌరవంగా భావిస్తారు ఆ సైనికులు. అది ఆ మూడు రంగులు మనకిచ్చే గర్వం,గౌరవం. “ఈ పతాకం సామాన్యమైంది కాదు…సామ్రాజ్యవాద సూచకం కాదు… ఏ దేశాన్ని ఆక్రమించే విధానాన్ని సూచించే కేతనం అసలే కాదు. ఇది మన స్వాతంత్ర్య చిహ్నం.” భారత రాజ్యాంగ సభలో జాతీయ పతాకాన్ని ప్రవేశపెడుతూ జవహర్ లాల్ నెహ్రూ అన్నమాటలివి. స్వాతంత్ర్య భారత సమర స్ఫూర్తికి పర్యాయపదంగా మారిన “త్రివర్ణ పతాక సృష్టికర్త, బహుభాషావేత్త, స్వాతంత్ర యోధుడు, వ్యవసాయ శాస్త్రవేత్త మరియు జియాలజిస్ట్” గా మన దేశానికి సేవలందించిన పింగళి వెంకయ్య గారి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

ఈయన ఆగస్ట్‌ 02, 1878 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న భట్లపెనుమర్రు గ్రామములో హనుమంతురాయుడు, వెంకతరత్నమ్మ దంపతులకు జన్మించారు. ఈయన 19 సంవత్సరముల వయసులో బొంబాయిలో సైనిక శిక్షణ పొంది దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలొనే మహాత్మ గాంధీ గారిని కలిసారు. అప్పుడు గాంధీ గారితో వెంకయ్య గారికి ఏర్పడిన సాన్నిహిత్యం ఆర్దశతాబ్ధం పాటు నిలిచింది.

యుద్ధం నుండి తిరిగి వచ్చిన తర్వాత వెంకయ్య గారు 1906 నుండి 1922 వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నారు. మద్రాసులో ప్లేగు ఇన్స్పెక్టర్ గా శిక్షణ తీసుకున్నారు. కొంతకాలం  బళ్లారిలో ప్లేగు  ఇన్స్పెక్టర్ గా  పని చేశారు. అది  విసుగు అనిపించి, ఇన్స్పెక్టర్ గా మానేసి శ్రీలంకలోని కొలంబో వెళ్లి పొలిటికల్ ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తయిన తర్వాత  రైల్వే గార్డ్ గా  కొంతకాలం పనిచేశారు. అది కూడా మనసుకు అంతగా నచ్చలేదు.  దాంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్ లోని డి.ఏ.వి కళాశాలలో చేరి,  సంస్కృతం,  ఉర్దూ,  జపనీస్ భాషలో ప్రావీణ్యం పొందారు. ఈయన ప్రొఫెసర్ గొట్టే ఆధ్వర్యంలో జాపనీస్ చరిత్ర అభ్యసించారు. అలా జపాన్ భాషలో అనర్గళంగా  మాట్లాడగలిగే వెంకయ్య గారిని  “జపాన్ వెంకయ్య” గా  సంబోధించేవారు  కొందరూ.

రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్య గారికి వ్యవసాయం పట్ల చాలా మక్కువ ఉండేది. అదే  మక్కువతో వ్యవసాయ శాస్త్రంలో కూడా అధ్యయనం చేశారు. ముక్త్యాల రాజా నాయని రంగారావు బహదూర్ గారు వెంకయ్య గారితో వ్యవసాయ పరిశోధనశాల స్థాపించేలా ప్రోత్సహించారు. ఆ సందర్భంలోనే ఈయన అమెరికా నుండి పత్తి విత్తనాలను తెప్పించి పండించారు. అలాగే ఆయన “వ్యవసాయ శాస్త్రం” అనే గ్రంథాన్ని ప్రచురించారు. ఈయనకి లండన్లోని రాయల్ అగ్రికల్చర్ సొసైటీలో సభ్యత్వం లభించింది.

ఆ తర్వాత వెంకయ్య గారు బందరులోనే ఒక జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పని చేశారు.  వ్యవసాయ శాస్త్రం, చరిత్ర, వ్యాయామం, గుర్రపు స్వారీ  మరియు  సైనిక శిక్షణ కూడా  విద్యార్థులకు బోధించేవారు. యువతరంలో జాతీయ భావాలను రగిలించేందుకు చైనాలో జాతీయ విప్లవాన్ని సాగించిన ‘సన్ యెట్ సెన్’ జీవిత చరిత్ర రచించి సంచలనం సృష్టించి లండన్ టైమ్స్ పత్రికచే ప్రశంసలందుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఏ సమావేశానికైనా “బ్రిటీష్ యూనియన్ జాక్ జెండా” ఎగురవేయబడుతుంటే వెంకయ్య గారికి అది నచ్చలేదు. మనకు ఒక జాతీయ పతాకం లేనందువల్లనే కదా ఈ అవమానం  అనే బాధతో జాతీయ పతాకం రూపొందించడం పై దృష్టి సారించారు.

1916 లో ”భారతదేశానికొక జాతీయ జెండా” (ఏ నేష్నల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా) అనే పుస్తకాన్ని ఆంగ్లంలో ప్రచురించారు. ఈ గ్రంధానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్ర మంత్రి సర్ బి.ఎన్.శర్మ ఉత్తేజకరమైన పీఠిక రాసారు. ఈ పుస్తకం కాంగ్రెస్ పెద్దల దృష్టికి రావడంతో వెంకయ్య గారిని కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా ఆహ్వానించారు. అ సంవత్సరం లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య రూపొందించిన జాతీయ జెండానే ఎగురవేసారు. అయితే 1919లో జలంధర్‌కి చెందిన లాలా హన్స్‌రాజ్ ఆ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా, గాంధీ 1921లో బెజవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో వెంకయ్యను పిలిచి, కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిసి మధ్య రాట్నం ఉండేలా జెండా చిత్రించమని కోరాడు. గాంధీ సూచన ప్రకారం వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించాడు. అలా రూపొందించబడిన జెండాలో కాషాయం హిందువులను, ఆకుపచ్చ ముస్లింలను సూచిస్తుంది, అలాగే ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఆశయంలో తెలుపును కూడా అందులో చేర్చారు. ఏప్రిల్‌ 13, 1936  ప్రచురితమైన ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో గాంధీజీ పింగళి వెంకయ్యగారిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

1921లో పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ పతాకం 22.7.1947 న భారత రాజ్యాంగ సభ జాతీయ పతాకాన్ని ఆమోదించింది. నెహ్రూ గారి సూచన మేరకు  త్రివర్ణ పతాకం లో రాట్నం స్థానంలో అశోకచక్రం చేర్చబడింది. ఆ తరువాత వెంకయ్య గారు క్రమంగా రాజకీయాల నుండి దూరంగా ఉన్నారు. తర్వాత మద్రాసు వెళ్లి ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు చేసి డిప్లమా పట్టా తీసుకున్నారు. ఆ తరువాత నెల్లూరు వచ్చి, మైకా ఖనిజం గురించి పరిశోధన కొనసాగించారు. అటు తర్వాత వెంకయ్య గారు అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ మొదలగు ప్రదేశాలలో ఖనిజ నిల్వల మీద పరిశోధన కొనసాగించారు. అంతవరకూ శాస్త్రీయంగా వజ్రాలు  బొగ్గు నుంచి ఉత్పన్నం అవుతాయని అందరూ భావించేవారు.  కానీ వెంకయ్య గారు  మొదటిసారిగా  వజ్రపు తల్లి రాయిని కనుగొని  ఈ ప్రపంచానికి తెలియజేశారు. ఆవిష్కరణ మీద ఒక ఆంగ్ల పుస్తకం కూడా రచించారు.  దాంతో ప్రజలు వెంకయ్య గారిని వజ్రాల వెంకయ్య అని కూడా సంబోధించేవారు. 1955 లో ఆయన  కనుక్కున్న వజ్రపు తల్లి రాయిని చూసిన జియాలాజికల్ సర్వే అధికారులు ఈయనను సలహాదారుగా  నియమించుకున్నారు.

మనదేశంలో స్వాతంత్ర్య అనంతరం స్వాతంత్ర్య సమరయోధులకు పింఛన్లు మంజూరయ్యాయి. కానీ వెంకయ్య గారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. దానివల్ల వెంకయ్య గారి జీవితంలో తన చివరి రోజులు చాలా దుర్భరంగా గడిచాయి. వృధ్యాప్యంలో ఆర్ధిక బాధలు ఈయనను చుట్టుముట్టాయి, దక్షిణాఫ్రికాలో మిలటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగరిలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఆయన గుడిసె వేసుకుని గడపసాగారు. ఆయన ఏనాడూ ఏ పదవిని ఆశించలేదు, కానీ ఆయన నిస్వార్థ సేవను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం. మన జాతికొక కేతనని నిర్మించాడు ఆయన. ఇతర దేశాలలో జాతీయ పతాక నిర్మాతలను ఆ ప్రభుత్వాలు ఎంతగానో గౌరవనిస్థాయి. వారికి కావాల్సిన వసతులని ప్రభుత్వాలే సమకూరుస్తాయి. కానీ మన ప్రభుత్వం వెంకయ్య గారిని గుర్తించకపోవడం శోచనీయం, జాతీయపతాకాన్ని గురించి ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాలలో మన పతాక నిర్మాత ఒక తెలుగువాడు అని రాసేవారు,  కానీ వెంకయ్య పేరుని  ఏనాడు సూచించకపోవడం విచారకరం.

వెంకయ్య గారి చివరి రోజుల్లో విజయవాడలో కొంతమంది  ప్రముఖులు  ఆయనకి ఆర్థిక సహాయం చేయాలనుకున్నారు. కానీ ఆర్థికంగా  సహాయం చేస్తామంటే అంగీకరించని అభిమానవంతులు అని తెలిసిన ప్రముఖులు పింగళి వెంకయ్యను సన్మానించాలని అనుకున్నారు. కష్టం మీద ఆయనను ఒప్పించి 1963 సంక్రాంతి నాడు సన్మానం చేసి కొంత నగదు అందజేశారు.  అతను ఆ  సన్మాన సమయంలో కూడా జాతీయ జెండా  గురించే ఇలా మాట్లాడారు “తాను మరణించినపుడు తన భౌతిక కాయాన్ని  త్రివర్ణ పతాకం తో కప్పండి. స్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి అదే నా చివరి కోరిక”. ఆ సన్మానం జరిగిన తర్వాత ఆయన 6 నెలలు మాత్రమే జీవించారు.1963 జూలై 4న ఆయన తుదిశ్వాస విడిచారు.

ఇంతటి విశిష్ట సేవలు అందించిన  వెంకయ్య  గారికి కనీస గుర్తింపు కూడా ఇవ్వలేకపోయాయి ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు. స్వాతంత్రానంతరం ఆయన చనిపోయే వరకు వచ్చిన ప్రభుత్వాలన్నీ ఆయనను విస్మరించడం బాధ కలిగించే విషయం. 1947 తర్వాత 1963 సంవత్సరం వరకు ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవాలు జరిగాయి. కానీ ఒక్కసారి కూడా పింగళి వెంకయ్య జాతీయ పతాక రూపశిల్పి అని ప్రభుత్వాలు సన్మానించిన దాఖలాలు లేవు. జాతీయ పతాకం ఎగిరే అంత కాలం స్మరించుకోదగిన ధన్యజీవి వెంకయ్య గారు నిరాడంబరమైన, నిస్వార్ధమైన జీవితం గడిపిన మహామినిషి పింగళి వెంకయ్య గారు.

ఆయనను ప్రజలు మర్చిపోతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి ఆయన దర్శన భాగ్యం ప్రజలకు లభింపచేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింగళి వెంకయ్య గారికి మన దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు కూడా చేసింది.

మీకు ఇండియా అనగానే  మొదట  ఏం గుర్తొస్తుంది… భారత జెండానే… కదా…. అలాంటి గుర్తింపు మనకిచ్చిన మహర్షికి మనం ఏమివ్వగలం. ఆ మహాత్ముడు ఇచ్చిన పతాకాన్ని ప్రపంచ నలుమూలల రెపరెపలాడించడం తప్ప. ఆయన జన్మదినం సందర్భంగా మన జాతీయ పతాక సృష్టికర్తను ఒక సారి మనసారా స్మృతింద్దాం.

    –          వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

లోకమాన్య బాల గంగాధర్ తిలక్ వర్ధంతి

(23 జూలై 1856 – 1 ఆగష్టు 1920 )

స్వరాజ్యం నా జన్మహక్కు – తిలక్ జాతీయ హిందూవాదం – తిలక్ కు వేదమే!

స్వరాజ్యం నా జన్మ హక్కు – దాన్ని సాధించి తీరుతాను అని శపధం పూని ఆ లక్ష్యాన్ని సాధించుకునే దిశలో ముందుకు సాగిన మహనీయుల్లో, బాల గంగాధర్ తిలక్ ని ప్రప్రధమంగా స్మరించి తీరాలి. ఈయన లోకమాన్య తిలక్ గా కూడ ప్రసిద్ధిచెందారు. భారతీయ జాతీయవాది, సామాజికవాది, స్వాతంత్ర్య సమరయోధులు అయిన తిలక్ భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రజాదరణ పొందిన మొట్టమొదటి అధినేతల్లో ఒకరు అని చెప్పాలి. అందుకే ఆయణ్ణి ఆ రోజుల్లో భారతదేశపు ఆందోళన స్థితిని ప్రకటించిన వర్గానికి పితామహుడని, సంపూర్ణస్వరాజ్యోద్యామనికి ప్రప్రధమ నాయకుడనీ చెప్పితీరాలి. అంతే కాకుండా హిందూ జాతీయవాదానికి కూడ విత్తనాల్ని నాటిన అధినేత అనే చెప్పాలి. తిలక్ భారతదేశచరిత్రావగాహన లో నిష్ణాతుడు, సంస్కౄతపండితుడు, గణిత, ఖగోళశాస్త్రాల్లోను, హిందూత్వంలోను, ఘటికుడు. ఆధునిక భారతీయ విద్యావిధానానికి ఆద్యుడు మహారాష్ట్రలోని రత్నగిరి దగ్గరగానున్న ‘చిఖలీ గ్రామంలో 1856, జూలై, 23 న మధ్యతరగతి ‘చిత్పవణ్ సంప్రదాయ బ్రాహ్మణ మరాటి కుటుంబంలో జన్మించారు. బాల్యం నుంచి తిలక్ ది వేదాంతధోరణే. భారతదేశంలో, ఆధునికభావాలతో కాలేజీ విద్యను అభ్యసించిన మొదటితరం యువకవర్గపు ప్రతినిధిగా తిలక్ ను భావించాలి. పట్టభద్రచదువు తర్వాత, పూణేలోని ప్రైవేట్ పాఠశాలలోను, తర్వాత ఫెర్గూసన్ కాలేజీలో లెఖ్ఖల మాష్టారు ఉద్యోగం చేయడం, తర్వాత పత్రికా విలేఖరి గా ఉద్యోగం చేశాడు. ఆ రోజుల్లో పాశ్చాత్య విద్యావిధానం భారతీయ సంస్కౄతికి, విద్యార్ధులకు అవమానకరంగాను, అగౌరవంగాను, ఉన్నందున బాహాటంగా నిరసన ప్రకటించిన ధైర్యశాలి. అంతేకాక, భారతీయ యువతకు విద్యలో విలువలను పెంచే ఉద్ద్యేశ్యంతో డక్కన్ విద్యాసంస్థను స్థాపించాడు. సంపూర్ణస్వరాజ్యం కోసం రాజకీయ పోరాటానికి నాంది మరాఠీ భాషలో దినపత్రిక కేసరి (సింహం) స్థాపించడం, స్వల్పకాలంలో బహుళాదరణ చెందడం జరిగింది. వాక్కు స్వాతంత్ర్యం పై గల అణచివేతవిధానంపై నిరసన వ్యక్తం చేయడం, ప్రత్యేకంగా 1905 లో బెంగాలీ విభజనద్వారా తగ్గుతున్న భారతీయతకు, ప్రజకు, సంస్కౄతిపట్ల చూపుతున్న నిర్లక్ష్యవైఖరిపై యుద్ధాన్ని ప్రకటిస్తూ, భారతానికి స్వరాజ్యాన్ని అందించాలని బ్రిటిషుప్రభుత్వాన్ని నిలదీశాడు. హిందూత్వం పై తిలక్ స్వతంత్ర ఆలోచనావిధానాలు భారతీయ జాతీయ కాంగ్రేసు లో తిలక్ 1890 ల్లో చేరినా, ఆధునిక స్వేచ్చావాదవర్గంతో సంపూర్ణ స్వరాజ్య సాధన కోసం జరిపిన ఆలోచనావిధానాలపై అసమ్మతీయతను ప్రకటించాడు. 1891 లో ఆడపిల్లల పెళ్ళివయసుని 10 నుంచి 12 పెంచడంపై, విదేశీవిధానాన్ని అమలుచేయడంపట్ల, కాంగ్రేసు తదితర ఉదారవర్గం సమర్ధించడం, దీనికి భారతీయసంస్కౄతిలో కల్పించుకోవడం, వ్యక్తంచేసిన నిరసనతో, తిలక్ ను ఒక వితండ హిందూవివాదిగా గుర్తించడం జరిగింది. ఏమైనా, 1857 సిపాయిలకలహం తర్వాత, భారతదేశంపట్ల బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన మొదటి విప్లవాత్మక మార్పు అనిమాత్రం చెప్పాలి. హిందూమతసంస్కౄతిలో జోక్యం చేసుకున్నట్లు తిలక్ భావించడం జరిగింది. బొంబే లో ప్లేగు వ్యాధి తెచ్చిన ముప్పు బొంబాయిలో 1897 లో తాండవించిన ప్లేగు వ్యాధి, పూనాకు పాకుతుందని ఆందోళనతో ప్రభుత్వం తీసుకున్న నివారణ ప్రయత్నాలు శౄతిమించడం – వ్యాధి సోకని ప్రాంతాల్లోని కుటుంబాల్ని చెదరకొట్టడం, అనవసరంగా ఆవాసాల్ని మార్చడం, తరలింపుల్లో ప్రజల ఆస్తుల్ని దోచుకోవడం పట్ల పెరిగిన నిర్లిప్తత, పట్టించుకోని ప్రభుత్వ పరిపాలన పై దుమారాన్ని ప్రకటిస్తూ, కేసరి పత్రికలో వివాదాస్పదమైన వ్యాసాల్ని ప్రచురించడం, శత్రువుని సంహరించడంలో భగవద్గీతలోని భావాల్ని ఉదాహరించడం ద్వారా, ఎవరినీ తప్పుపట్టకూడదని చెప్పడం, ఆ మర్నాడు 27 జూన్ న పూనా సహాయక కలెక్టర్, బౄందాన్ని సంహరించడం జరిగింది. ఈ ఘటనకు, తిలక్ ప్రచారం ఉసికొల్పిందన్న నేరానికి, 18 నెల్ల జైలు శిక్షను అనుభవించాడు. విడుదల తర్వాత, జాతీయనాయకుడిగా తిలక్ కు కొత్తగా గుర్తింపు, ‘స్వరాజ్యం నా జన్మహక్కు – దాన్ని సాధించి తీరుతానూ అన్న నినాదం ఈ సందర్భంగా అవతరించింది. ఈ నినాదమే, తిలక్ పేరుతోపాటు, అవిభాజ్యంగా వస్తూనేవుంది. గోఖలే తో వాదోపవాదం మరింతగా ఆధునిక భావాలున్న గోపాల కౄష్ణ గోఖలే తో తిలకు కు విబేధాలు రావడం, దీనికి ఆనాటి జాతీయ నాయకులు, బిపిన్ చంద్ర పాల్ (బెంగాల్), లాలా లజపతి రాయ్ (పంజాబ్) ల్ నుంచి సమర్ధన రావడంతో, ఈ త్రివేణీభావకూటమిని, ‘లాల్-బాల్-పాళ్ అని పిలిచెడివారు. 1907 సూరత్ కాంగ్రేసు సమావేశం, గరం దళ్ (విప్లవకారులు – త్రివేణీకూటమి), నరం దళ్ (ఆధునికకారులు గా విడిపోవడం జరిగింది. ఈ విభజనకు తిలక్, గోఖలేలు, ఆందోళనతో, జాతీయోద్యమానికి విఘాతమని భావించారు. కాని, ఫిరోజ్ షా మెహతా సన్నిహితుడైన హెచ్.ఎ.వైద్య, ఈ కూటమి కాంగ్రేస్ శరీరంలో ఒక అంగవిహీనమని, దీనికి శస్త్రచికిత్సే శరణ్యమని చెప్పాడు. 1908 ఏప్రిల్ 30 న జరిగిన ముజఫరుపూర్ లో జిల్లాజడ్జిపై బాంబుని యిద్దరు బెంగాలీయువకులు విసరడం, ప్రమాదవశాత్తు, మహిళాప్రయాణికులు మరణించడం, పోలీసుల సోదాలపై కలకత్తాలో వినాశసామగ్రి దొరకడం జరగ్గా, ఈ పూర్తి కధనాన్ని తిలక్ తన కేసరి పత్రికలో సమర్ధించడం, సంపూర్ణ స్వరాజ్యాన్ని కోరడం పై, ప్రభుత్వం తిరిగి తిలక్ ను కష్టడీలోకి తీసుకుంది. అప్పటి యువనాయకుడు మహమ్మదు అలి జిన్నాని ప్రాతినిధ్యం వహించాలని తిలక్ కోరాడు. కాని, బ్రిటిష్ ప్రభుత్వం తిలక్ కు బర్మాలో ఆరేళ్ళు, 1914 వరకు జైల్లో పెట్టింది. జైలునుంచి విడుదల తర్వాత, తిలక్ 1916 లో తిరిగి కాంగ్రేసు లో జాతీయవాదులతో చేరడం, అఖిలభారత హోం రూల్ ఉద్యమంలో 1918 వరకూ అనిబెసెంట్, జిన్నాలకు సహాయం చేశాడు. సర్వ మత, జాతులకి స్వరాజ్యంలో సమభాగస్వామ్యం మరాఠా రాజకీయ సిద్దాంత ప్రచారక ప్రవక్తగా ప్రారంభం కావించిన తిలక్, విభజన తదుపరి బెంగాల్ జాతీయ నాయకుల సాన్నిహిత్యంతో, ప్రముఖ జాతీయనాయకుడిగా ఉన్నత శిఖరాల్ని అధిరోహించాడు. మరాఠా రాజకీయపాలన తరహాలో భారతీయస్వరాజ్యపరిపాలన కొనసాగుతుందా అన్న ప్రశ్నకి, 16-17 శతాబ్దాలకాలం లో నడచినా, తర్వాత మరాఠా తరహా 20 శ. లో సరితూగదని, నిజమైన ఫెడరల్ వ్యవస్థతో సంపూర్ణభారతస్వరాజ్య పరిపాలనలో, అన్ని మతాలకి, వర్గాలకి సమప్రాధాన్యత, భాగస్వామ్యం వహిస్తాయని, ఇటువంటి కూటమే భారతదేశాన్ని స్వరాజ్యంతో పరిరక్షించడం జరుగుతుందని తిలక్ నిస్సందేహంగా వివరించాడు. కర్మయోగసహిత జ్ౙానయోగం పై సమర్ధన ప్రాధమికంగా తిలక్ అద్వైత సిద్దాంతవాది అయినా, కేవలం జ్ఞానమే మానవునికి విముక్తినిస్తుంది అన్న ప్రాచీనాద్వైతవాదాన్ని త్రోసిరాజని, కర్మయోగసిద్దాంతం తో కూడిన జ్ఞానయోగం ఫలితాల్నిస్తుందని, రెండూ ఉభయతారకంగా ఆచరణకు రావాలని వక్కాణించాడు. తిలక్ ప్రతిపాదించిన సాంఘికసంస్కరణల్లో, ముఖ్యంగా – వివాహానికి కనీసవయసు, తాగుడుపై పూర్తి నిషేధంతోపాటు సరుకు దొరకకూడని పరిస్థితిని కల్పించాలన్న పట్టుదల, విద్యావిధానం, భారతీయ రాజకీయ ప్రస్థానం లో సూచించిన మార్పులు చాలా ప్రభావప్రేరణలు కలిగించాయి. హింది జాతీయభాషగా తొలి ప్రతిపాదనలు భారతీయ జాతీయ కాంగ్రేసు లో ప్రధమ నాయకుడిగా, దేవనాగరి లిపిలో వ్రాయబడే హిందీ భాషను ఏకైక జాతీయభాషగా ప్రతిపాదిస్తూ, మొట్టమొదటి నాయకుడు తిలక్ అని చాలామందికి తెలియని విషయం. ఈ వాదననే, తర్వాత మహాత్మాగాంధి సమర్ధించాడు. అయితే, తిలక్ ఆంగ్లభాషను మాత్రం భారతీయుల మేధస్సుల్లోంచి పూర్తిగా చెరపివేయాలన్న ప్రతిపాదనకు మాత్రం ఆచరణకు సాధ్యం కాలేదు. భారతీయపరిపాలన, సాంఘికజీవన విధానాల్లో, సమాచార, భావ ప్రకటన విధానాల్లో, జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో, ఆంగ్లం తిరుగులేని భాషామాధ్యమంగా తనదైన స్థానాన్ని పొందుతూనేవుంది. వసుధైకకుటుంబం భావనకు ఆంగ్లభాషామాధ్యమం అనివార్యం అన్న భావన అనేక దేశాలు ప్రపంచంలో గుర్తించాయి అన్నది నగ్నసత్యం. కాని, హిందీతో సహా భారతీయ భాషల వాడుకవిధానాలు మాత్రం తిలక్ ప్రతిపాదనల తర్వాత ఒక ఊపు, రూపు దిద్దుకున్నాయన్న విషయం కూడ నగ్నసత్యమే. సార్వజనిక, సామూహిక గణపతి పూజలు – తిలక్ భావవాహినీప్రభావమే!!! తొలుత అవిఘ్నమస్తు అని, తొండమునేకదంతమును తోరపుబొజ్జయున్ అని, శుక్లాంబరధం … ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ హైందవేతిహాసస్ఫూర్తితో భారతీయులు వారివారి పూజామందిరాల్లో ప్రతినిత్యం సుప్రభాతవేళల్లో జరుపుకునే నిత్య ఆధ్యాత్మిక తొలిప్రార్ధనలకు, ఒక సామూహికమైన, సామాజికమైన, సార్వజనికతను ప్రసాదించిన ప్రప్రధమ ప్రతిభామూర్తి, నిస్సందేహంగా, బాల గంగాధర తిలక్ మహాశయుడే. మూడురోజుల ముచ్చట నుంచి, అయిదురోజులు, గణపతి నవరాత్రులు, మాసాంతంగానూ పూజోత్సవాల్ని సామాజికంగా, సామూహికంగా, భాద్రపద శుక్ల (గణేశ) చతుర్దశిగా ప్రారంభించేవి, అనంత చతుర్దశి (ఆగష్టు/సెప్టెంబరు నెలల్లో) ఒక అనివార్య సమావేశాలకి సదవకాశాన్నిచ్చింది. ముఖ్యంగా, నాయకులకు ప్రజలతో సంభాషణలు చేసుకోవడానికి వేదికలుగా మారాయి. శుభప్రారంభంగా, గ్వాలియర్ లో సర్దార్ ఖస్గివాలే ప్రోత్సాహంతో నిర్వహించిన పూజోత్సవాలు, సర్వోపయోగమని గ్రహించి, ఈ నూతనభావాల్ని 26 సెప్టెంబర్ 1893 లో తన కేసరి పత్రికలో సవివరంగా ప్రచురించడం జరిగింది. ఈ ఫక్కీలో, విదేశీ వస్తువుల్ని, సేవల్ని, బహిష్కరించమని చేసిన ప్రకటనలకు, పిలుపులకు, సద్స్ఫూర్తినివ్వడమే కాక, దేశీయత, దేశభక్తి, భారతీయప్రజల్లో నరనరాల్లో దూసుకుపోవడం అనూహ్య పరిణామం, పరిమాణం అని చెప్పాలి. పిదపకాలం లో తిలక్ గాంధీ నిర్వహించిన అహింస, పౌరసహాయనిరాకరణ విధానాలపై, తిలక్ నుంచి విమర్శలు వచ్చేవి. ఒకానొక కాలంలో, తిలక్ ను అతివాదకునిగా భావించబడినా, తిలక్ చర్యల్లో కొంత మెరుగుతనం కనిపించేవి. ఉభయవర్గాల మధ్య సహౄద్భావ వాతావరణంలో సంభాషణలు భారతస్వరాజ్యానికి మరింత ప్రభావితమాధ్యమాలవుతాయని తిలక్ భావించాడు. అంతేకాక, భారతీయ చరిత్ర, సంస్కౄతి, హిందూతత్వం అంశాలపై తిలక్ ప్రచురించిన రచనలు మాత్రం ఒక నూతన సంప్రదాయాన్ని, సదాచారాన్ని, భారతీయుల్లో, భారతీయ నాగరికతకు, ప్రపంచంలో గర్వించదగ్గ దేశంగా భారతీయతావిధానాలకు దోహదమయ్యాయి. వీటిమూలంగానే, గాంధీకి ఆధ్యాత్మిక, రాజకీయ గురువుగా తిలకు ను అనేకులు సమంజసంగానే భావించారు. అయితే, జాతిపిత మాత్రం, తన రాజకీయ గురువుగా, తిలక్ సమకాలీకుడైన, గోపాలకౄష్ణ గోఖలే ను, ప్రకటించారు. దీనికి విరుద్ధంగా, తిలక్ 1920 లో మరణించినప్పుడు, బోంబే లోని దహనవాటికలో, 2 లక్షలకు పైగా ప్రజాసమూహంతో నున్న గాంధి, తిలక్ కు ఘననివాళిని అర్పిస్తూ, తిలక్ ను నవభారతనిర్మాత గా గాంధి ప్రకటించడం గమనించదగ్గ విషయం. బాలగంగాధర్ తిలక్ ని మాత్రం నేటికీ నవభారత నిర్మాత గానే కాకుండా, హిందూ జాతీయతానాయకునిగా భారతావని పరిగణిస్తూనేవుంది అన్నది సత్యం. హిందూరాజకీయవాదపు అంశంగా, భారతీయ విప్లవసంస్కర్తగా వినాయక్ దామోదర్ సావార్కర్ కు ఏకైక ఆదర్శమూర్తిగా తిలక్ ని మాత్రం చెప్పుకోవాలి. తిలక్ మరపురాని సాహిత్యం బాల గంగాధరుని ప్రతిభాతిలకానికి నిదర్శనంగా, 1903 లో, ‘ఆర్కిటిక్ హోం యిన్ ది వేదాశ్ అన్న ఆంగ్లభాషారచనను ఆలోచనాత్మకంగా వ్రాయడం, ఆర్కిటిక్స్ లో వేదాల్నే రచించినట్లుగాను, ఆర్యులు దక్షిణానికి తర్వాతకాలంలో తీసుకువచ్చారని ఆయన వాదంగా తిలక్ చెప్పడం కూడ జరిగింది. ప్రముఖంగా, కర్మయోగం పై విశ్లేషణగా, భగవద్గీతను గీతారహస్యం గా, వేదోపనిషత్తులసారంగా వ్రాయడం, ఆ బౄహద్గ్రంధం నేటికీ హిందువులకు నిత్యపారాయణగ్రంధంగా ఆదరణీయంగానే భావించబడుతోంది. తిలక్ యితర రచనలను చెప్పాలంటే, హిందూ జీవనం-నైతికత-మతపరంపర, వేదసంహిత-వేదాంగజ్యోతిషాలు, యం.డి.విద్వాన్స్ సంపాదకీయంలో లోకమాన్య తిలక్ లేఖలు, రవీంద్రకుమార్ సంపాదకీయంలో గంగాధరుని పత్రరచనలు, తిలక్ పై వచ్చిన ఆరోపణల సారాంశ రచనలు ప్రముఖ ప్రభావాల్ని, ఉత్తేజితకరమైన ఆలోచనావిధానాల్ని రేకెత్తించాయన్నది నిజం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఆగష్టు 1, 1920 న తన అంతిమ శ్వాసను విడిచారు. బాలగంగాధరుడి పాత్ర, ప్రభావం, ప్రేరణ, భారతీయతకు పునాది, హిందూవాదానికి వేదసంహితసమానమని నిర్ద్వందంగా భావించవచ్చు అన్న భావన, సత్యం, శివం, సుందరం. పవిత్రభావనలు అన్ని దిశలనుంచి అవతరించాలన్నది తిలక్ విషయంలో ౠజువర్తనమయింది.

లోకమాన్య బాలగంగాధర తిలక్ మహనీయుడి వర్ధంతి సందర్భంగా సహస్ర నమోవాకాలని సమర్పిస్తోంది.

    –          వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

లష్కర్‌ బోనాలు – సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయినీ మహంకాళీ జాతర

       ఏడో నిజాం కాలం నుండి సికింద్రాబాద్‌ మహంకాళీ అమ్మవారి దేవాలయంలో బోనాలపండుగ ఘనంగా జరిగేది. ముస్లింలు కూడా పాల్గొనే ఈ పండుగ మత సామరస్యానికి ప్రతీక! ఇప్పటికి నగరంలో చిన్నా పెద్దా దేవాలయాలు కలిపి మూడు నాలుగు వందల దేవాలయాలలో ఈ బోనాల జాతరలో కొన్ని లక్షల మంది పాల్గొంటారు.

       లాల్‌దర్వాజా సింహవాహినీ శ్రీమహంకాళీ దేవాలయానికి ఒక ప్రత్యేకత వుంది. ఈ సింహవాహిసీ శ్రీమహంకాళీ దేవాలయానికి వందేళ్ల పైగా చరిత్ర వుందంటారు. ఈ అమ్మవారు మహామహిమాన్వితగా భక్తులు కొలుస్తారు. ఇక్కడ జరిగే బోనాల జాతరను తిలకించడానికి తెలంగాణా జిల్లాల నుండే కాక ఇతర ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు తరలివస్తారు.

       తలుగు వారి సంస్కృతి వైభవానికి బోనాల పండుగ ఒక విజయకేతనం. ఇది తెలంగాణా ప్రత్యేకతను చాటే విశిష్ట పండుగ. పండుగైనా ఏదో ఒక సందర్భానికి ప్రతీకగా నిలిచిపోయి వుంటుంది. అలాగే ఈ బోనాల పండుగ కూడా ఋతువులు మారే ఈ ఆషాడమాసంలో వర్షాలు ప్రారంభ మవుతాయి. వాతావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా వ్యాధులు సంక్రమించేకాలం. ప్రాచీనకాలంలో ఈ ఋతువులో కలరా, ప్లేగు వ్యాధులు ఎక్కువగా వ్యాపిం చేవి. ఇప్పుడంత వైద్య సౌకర్యాలు లేని ఆ రోజులలో దేవతలను కొలిచేవారు.1813 సం||లో నగరంలో వేలాది మంది ప్లేగు వ్యాధి బారిన పడ్డప్పుడు మహంకాళీ దేవిని వేడుకోవటంతో వ్యాధి తగ్గు ముఖం పట్టిందని ఆనాటి ప్రజలు నమ్మారు. అప్పటి నుండి నగరంలో ఈ బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తు న్నారు.

       ఏడో నిజాం కాలం నుండి సికింద్రాబాద్‌ మహంకాళీ అమ్మవారి దేవాలయంలో బోనాలపండుగ ఘనంగా జరిగేది. ఈ పండుగలో ముస్లింలు కూడా పాల్గొనేవారని చెపుతున్నారు. ఇది మత సామరస్యానికి ప్రతీకనే కదా! ఇప్పటికి నగరంలో చిన్నా పెద్దా దేవాలయాలు కలిపి మూడు నాలుగు వందల దేవాలయాలలో ఈ బోనాల జాతర జరుగుతుంది.కొన్ని లక్షల మంది భక్తితో దీనిలో పాల్గొంటారు.జంట నగరాల నుండే కాకుండా పరిసర ప్రాంతాల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చి మహంకాళీ బోనాల జాతరలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు.

       ఈ పండుగ జాతర మొదట గోల్కొండ కోటలో మొదలవుతుంది. ఈ మహోత్సవం గోల్కొండ కోటలోని జగదాంబికా ఆలయంలో ప్రారంభమై నెల రోజుల పాటు సాగుతుంది. గోల్కొండ కోటలో మాతా జగదాంబికా ఆలయంలో అబుల్‌ హసన్‌ తానీషా కాలంలో ప్రధానమంత్రి సైనికాధి కారులుగా వున్న అక్కన్న మాదన్నల కాలంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్లు చెపుతారు. నిజాం కాలంలో కూడా ఇక్కడ ప్రతి ఏటా బోనాల ఉత్సవాలు జరిగేవి.

       ఆషాడ మాసం మొదటి గురువారం గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. నెల రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు నగరంలోని వివిధ దేవాలయాలలో జరిగి చివరకు మళ్లి  గోల్కొండ కోటలో ముగుస్తాయి.

       ఆషాడ మాసం రెండో ఆదివారం సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళీ (లష్కర్‌ బోనాలు) ఆలయంలోను, మూడవ ఆదివారం లాల్‌దర్వాజా సింహవాహినీ మహంకాళీ అమ్మవారి ఆలయం లోను జరుగుతాయి. వీటితోపాటు జంటనగరంలోని అన్ని దేవాలయాల లోను బోనాల సమర్పణ పూజలు జరుగుతాయి.

       హరిబౌలీలోని అక్కన్నమాదన్న, శాలిబంబలోని ముత్యాలమ్మ, గౌలిపురాలోని కోట మైసమ్మ, సుల్తాన్‌ షాహి నల్ల పోచమ్మ, ఉప్పుగూడ మహంకాళి, అలియాబాద్‌ దర్బార్‌ మైసమ్మ, మిర్‌ఆలం మండి మాతామహంకాళి, కార్వాన్‌ దర్బార్‌ మైసమ్మ, మేకల మండి నల్ల పోచమ్మ ఇలా అనేక దేవాలయాలలో ఈ బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది. నిజం చెప్పాలంటే ప్రతి చిన్న బస్తీలోనూ కూడా ఈ బోనాల పండుగ ఎంతో వేడుకగా జరుగుతుంది. అక్కన్న మాదన్న దేవాలయంలో మహంకాళీ అమ్మవారిని వీధులలో ఊరేగిస్తారు.లాల్‌దర్వాజా సింహవాహినీ శ్రీమహంకాళీ దేవాలయానికి ఒక ప్రత్యేకత వుంది. ఈ సింహవాహిసీ శ్రీమహంకాళీ దేవాలయానికి వందేళ్ల పైగా చరిత్ర వుందంటారు. ఈ అమ్మవారు మహామహిమా న్వితగా భక్తులు కొలుస్తారు. ఇక్కడ జరిగే బోనాల జాతరను తిలకించ డానికి తెలంగాణా జిల్లాల నుండే కాక ఇతర ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు తరలివస్తారని అంటారు. నిజాం ప్రభువులు నగర రక్షణ కోసం నగరం చుట్టూ పటిష్టమైన కుడ్యాన్ని నిర్మించారు. నగరానికి రాకపోకలకు వీలుగా అక్కడక్కడ దర్వాజాలు, కిటికీలు ఏర్పాటు చేసి అక్కడ శక్తి స్వరూపుణి అయిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అలాంటి దర్వాజాలలో లాల్‌దర్వాజా ఒకటి. ఇక్కడి దర్వాజాకు స్థానికులు పండగలకు ఎర్రని జాజు రంగు వేయడంతో లాల్‌దర్వాజా అనే పేరు వచ్చిందని అంటారు. లాల్‌దర్వాజా దగ్గర కూడా అమ్మవారి విగ్రహం వుండేది. అమ్మవారికి నిజాం నవాబు పూజలు చేసాడని అంటారు. 1908 సం||లో మూసీనదికి వరదలు వచ్చి నగరం అతలా కుతలం అయినప్పుడు అప్పటి నిజాం నవాబు మీర్‌ మహబూబ్‌ ఆలీఖాన్‌ అయోమయంతో పడ్డారు. అప్పటి ప్రధాని మహారాజా కిషన్‌ ప్రసాద్‌ సలహాకోరారు. ఆయనకు కూడా ఏం చెప్పాలో తోచక సంకట స్థితిని ఎదుర్కొన్నారు. వెంటనే ఒక ఆలోచన వచ్చింది. అమ్మవారికి ఆగ్రహం కలిగితే ఇలాంటి ప్రళయం సంభవిస్తుందని, ఆమెను శాంతిప జేయడానికి పూజలు చేయాలని నిజాం ప్రభువుకు సూచించారు. మహారాజా కిషన్‌ ప్రసాద్‌ సలహా మేరకు నిజాం నవాబు బంగారు చాటలో లాల్‌దర్వాజా మహంకాళీ అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, ముత్యాలు, పట్టు వస్త్రాలతో అమ్మ వారికి పూజ చేసారు.

అనంతరం ఈ ప్రాంతంలో స్థానికులు ఆలయాన్ని పునరుద్ధరించి 1968 సం||లో కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీ శంకచార్యులవారిచే విగ్రహ ప్రతిష్ఠ చేయించారు. మొదట్లో ఇక్కడ కూడా బోనాల పండుగ సందర్భంగా జంతు బలులనిచ్చేవారు. అయితే 1953 నుండి జీవరక్షక ప్రచారమండలి సహకారంతో జంతుబలుల స్థానంలో గుమ్మడి కాయలను బలి ఇస్తున్నారు.ఈ బోనాల పండుగ సందర్భంగా మహంకాళీ దేవాలయంలో అమ్మ వారిని పురవీధుల్లో ఊరేగిస్తారు.

       మొదటి రోజు పలహారం బండిని ఊరేగిస్తారు. రెండో రోజు రంగం ఉంటుంది. శివసత్తులూగే మహిళ భవిష్యద్వాణి వినిపిస్తుంది. బోనాల పండుగ సందర్భంగా జరిగే యాత్రలో పురుషులు పాల్గొంటారు. నృత్యాలు చేస్తారు. కన్నుల పండు గగా జరిగే ఈ బోనాల పండుగ జాతర చూసి తీరవలసిందే.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)  

Categories
Vipra Foundation

గురు పౌర్ణమి

గురుర్ర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః  గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

       అనాది కాలంనించీ “ఆషాడ శుద్ధ పౌర్ణమిని” “గురుపౌర్ణమి” అంటారు. మరియు దీనినే “వ్యాసపౌర్ణమి” గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహాత్సవాలు నిర్వహిస్తూ ఉంటరు. ఆ రోజు ముని శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిధి కావున ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలొనే అది ఒక అపూర్వమైన ఆధ్యత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతుంది. అసలు ఈ ఆసాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత ఏమిటో …? ముందు తెలుసుకుందాం. దీనికి ఒక చక్కని ప్రాచీన గాధకలదు. పూర్వం “వారణాశి” లో కదుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట! ఆత్రేయసగోత్రము గల ఆ బ్రహ్మణుని యొక్క పేరు ‘వేదనిధీ. వాని యొక్క భార్య వేదవతీ. ఇరు ఇరువురు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించుచుండేవారు. వారు సంతానము భాగ్యము కరకై ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా; వారికి మాత్రం సంతానము కలుగలేదు. ఇలా ఉండగా; ఒకనాదు ‘వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వార్త తెలుసుకుంటాడు. ఎలా అయినాసరే! వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజూ వేయికళ్ళతో వెతక నారంభిస్తాదు, ఒకరోజునదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్సిస్తాడు. వెనువెంటనే “వేదనిధి” వాని పాదాలను ఆశ్రయిస్తాడు.దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసరికొడతాడు. అయినా సరే! పట్టిన పాదాలను మాత్రము విడువకుండా “మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని” నేను గ్రహించాను. అందుచేతనే, మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాదు. ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూత్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాంగా చేరదీసీ, నాయొక్క రహస్యం మాత్రము ఎవరికి తెలియకూడదు. ఇంతకీ నీకు ఏమికావాలొ కోరుకో అంటాడు. మహానుభావా! రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక! అనిబదులు చేప్తాడు. అందులకు ఆ మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.

       అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న ‘వేదనిధి’ తన భార్యామణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని! ఆ దంపతులులతో వారిని పూజిస్తారు. అనంతరం వారి దేవతార్చనకు ‘సాలగ్రామమూ, ‘తులసీ దళాలు, పూలు మున్నగు పూజాద్రవ్యాలు సిద్ధం చేస్తారు. వారి పూజా అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వవంటకాలను సిద్ధపరచి శ్రద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. వారి అతిథ్యాని ఎంటో సంతుష్టులైన ఆ ముని శ్రేష్ఠుడు. ఓ పుణ్య దంపతులారా1 మీకు ఎమి వరకావాలో కోరుకోండి. నోమూలూ లేవు. చేయని వ్రతాలు లేవు అయినా! సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు! అని బదులు పలుకుతారు. ఓ అదర్శ దంపతులారా! అందులకు మీరు చింతించవలసిన పనిలేదు. త్వరలోమే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతికలిగి, మీరు చక్కని సుఖజీవనముతో జీవితంలో ఎన్నో సుఖభోగాలాను అనుభవిస్తూ; అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలరు, అని అశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాసభగవానునితో ప్రభూ! తిరిగి తమదర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది? అని ‘వేదనిధీ ప్రశ్నిస్తాడు. అందులకు వ్యాస మహర్షి అంటారు…..!….!….!

శృణు విప్రతవేచ్చా చేత్ దర్శనార్థం తదాత్వయా

పూఅజనీయో విశేషేణ, కథావాచయితా స్వయం”

       అని అంటే, ఓ భూసురోత్తమా! నన్ను మరల మరల దర్శించుచు ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించుచున్నాను. అందువలకు నన్ను మీరు ఎలాదర్శించగలరో చేప్తాను, వినండి. ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా సరే! మన వేద వేదాంగముల యొక్క రహస్యాలను, ఇతిహాసములయొక్క గూడార్థాలు ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో! అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైనా ఆతన్ని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణికులందరిలోను నేను ఎల్లప్పుడూ ఉంటాను. అని! ఆ శ్లోకభావము.

       అంతియేకాదు ఎవరైనాసరే! గతకల్పాలలో జరిగిన చరిత్ర; విస్వం యొక్క పూర్వవృత్తాంతం; పూరాణగాథలు మున్నగునవి విప్పి చెప్పాలంటే! వార్మి వ్యాస భగవానుని అనుగ్రహము లేనిదే చేప్పలేరు. కావున అట్టి పౌరాణికుణ్ణి ఎంచి ఆషాఢ శుద్దపాద్యమి”నాడు వార్కి “గురుపూజ” చేసి పూజించవలెనని చెప్పారు. నాటినుండి నేటివరకు ఆచారము కొనసాగుచునే ఉన్నద అని మనము గమనిస్తున్నాము గదా!’-మరి. అది విన్న ‘వేదనిధీ మరోమారు వ్యాసభవానుని ప్రశిస్తాడు. మహాత్మాతమను ఏయే రోజుల్లో ఎవిధంగా పూజించాలి? సవిస్తరంగా చెప్పవలసింది అంటాడు.

మమ జన్మదినే సమ్యక్ పూజనీయః ప్రయత్నతః

ఆషాధ శుక్ల పక్సేతు పూర్ణిమాయాం గురౌతథా

పూజనీయే విశేషణ వస్త్రాభరణ ధేనుభిః

దక్షిణాభిః మత్స్యరూప ప్రపూజయేత్

ఏపం కృతే త్వయా విప్రః మత్స్య రూపస్య దర్శనం

భవిష్యతి నసందేహొమ యైవోక్తం ద్విజోత్తమ.”

       ఓ బ్రహ్మణోత్తమా! నేను జన్మించిన ఆషాధశుద్ధ పౌర్ణమినాడు ఈ గురుపూజను ఆరోజు శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రోజు కనుకాగురువారమూ అయిన ఎడలాది మరింతగా స్రేష్ఠమైనది. వస్త్ర, అభరణ గోదానములతో అర్ఘ్య పాదాలతోటి నా రూపాన్ని పూజించువార్కినా స్వరూప సాక్షాత్కారం వార్కి లభిస్తుంది; అని సాక్షాత్తు వ్యాస పౌర్ణమి, నేటికినీ, సర్వులకు అత్యంత పుణ్య ప్రదముగా చెప్పబడుచున్నది. ఈ గాథ పూర్వము నారదుడు వైశంపాయనుడికి “ఈ గురు పౌర్నమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ “స్వధర్మసింధూ” అనే గ్రంధములోను వివంగా చెప్పబడి యున్నది. దీనిని బట్టి వ్యాసులవారి యొక్క జన్మ ఆషాఢ శుద్ధపాడ్యమి అని విదితమవుచున్నది.

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే

నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః

        అట్టి పరమ పవిత్రమైన “గురుపౌర్ణమి” పుణ్యదినం మనంతా విశేషంగా జరుపుకుని ముందు తరాలవార్కి మార్గదర్శకుల మౌతూ, పునీతులౌదాము.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి

(23 జూలై 1856 – 1 ఆగష్టు 1920 )

స్వరాజ్యం నా జన్మహక్కు – తిలక్ జాతీయ హిందూవాదం – తిలక్ కు వేదమే!

స్వరాజ్యం నా జన్మ హక్కు – దాన్ని సాధించి తీరుతాను అని శపధం పూని ఆ లక్ష్యాన్ని సాధించుకునే దిశలో ముందుకు సాగిన మహనీయుల్లో, బాల గంగాధర్ తిలక్ ని ప్రప్రధమంగా స్మరించి తీరాలి. ఈయన లోకమాన్య తిలక్ గా కూడ ప్రసిద్ధిచెందారు. భారతీయ జాతీయవాది, సామాజికవాది, స్వాతంత్ర్య సమరయోధులు అయిన తిలక్ భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రజాదరణ పొందిన మొట్టమొదటి అధినేతల్లో ఒకరు అని చెప్పాలి. అందుకే ఆయణ్ణి ఆ రోజుల్లో భారతదేశపు ఆందోళన స్థితిని ప్రకటించిన వర్గానికి పితామహుడని, సంపూర్ణస్వరాజ్యోద్యామనికి ప్రప్రధమ నాయకుడనీ చెప్పితీరాలి. అంతే కాకుండా హిందూ జాతీయవాదానికి కూడ విత్తనాల్ని నాటిన అధినేత అనే చెప్పాలి. తిలక్ భారతదేశచరిత్రావగాహన లో నిష్ణాతుడు, సంస్కౄతపండితుడు, గణిత, ఖగోళశాస్త్రాల్లోను, హిందూత్వంలోను, ఘటికుడు. ఆధునిక భారతీయ విద్యావిధానానికి ఆద్యుడు మహారాష్ట్రలోని రత్నగిరి దగ్గరగానున్న ‘చిఖలీ గ్రామంలో 1856, జూలై, 23 న మధ్యతరగతి ‘చిత్పవణ్ సంప్రదాయ బ్రాహ్మణ మరాటి కుటుంబంలో జన్మించారు. బాల్యం నుంచి తిలక్ ది వేదాంతధోరణే. భారతదేశంలో, ఆధునికభావాలతో కాలేజీ విద్యను అభ్యసించిన మొదటితరం యువకవర్గపు ప్రతినిధిగా తిలక్ ను భావించాలి. పట్టభద్రచదువు తర్వాత, పూణేలోని ప్రైవేట్ పాఠశాలలోను, తర్వాత ఫెర్గూసన్ కాలేజీలో లెఖ్ఖల మాష్టారు ఉద్యోగం చేయడం, తర్వాత పత్రికా విలేఖరి గా ఉద్యోగం చేశాడు. ఆ రోజుల్లో పాశ్చాత్య విద్యావిధానం భారతీయ సంస్కౄతికి, విద్యార్ధులకు అవమానకరంగాను, అగౌరవంగాను, ఉన్నందున బాహాటంగా నిరసన ప్రకటించిన ధైర్యశాలి. అంతేకాక, భారతీయ యువతకు విద్యలో విలువలను పెంచే ఉద్ద్యేశ్యంతో డక్కన్ విద్యాసంస్థను స్థాపించాడు. సంపూర్ణస్వరాజ్యం కోసం రాజకీయ పోరాటానికి నాంది మరాఠీ భాషలో దినపత్రిక కేసరి (సింహం) స్థాపించడం, స్వల్పకాలంలో బహుళాదరణ చెందడం జరిగింది. వాక్కు స్వాతంత్ర్యం పై గల అణచివేతవిధానంపై నిరసన వ్యక్తం చేయడం, ప్రత్యేకంగా 1905 లో బెంగాలీ విభజనద్వారా తగ్గుతున్న భారతీయతకు, ప్రజకు, సంస్కౄతిపట్ల చూపుతున్న నిర్లక్ష్యవైఖరిపై యుద్ధాన్ని ప్రకటిస్తూ, భారతానికి స్వరాజ్యాన్ని అందించాలని బ్రిటిషుప్రభుత్వాన్ని నిలదీశాడు. హిందూత్వం పై తిలక్ స్వతంత్ర ఆలోచనావిధానాలు భారతీయ జాతీయ కాంగ్రేసు లో తిలక్ 1890 ల్లో చేరినా, ఆధునిక స్వేచ్చావాదవర్గంతో సంపూర్ణ స్వరాజ్య సాధన కోసం జరిపిన ఆలోచనావిధానాలపై అసమ్మతీయతను ప్రకటించాడు. 1891 లో ఆడపిల్లల పెళ్ళివయసుని 10 నుంచి 12 పెంచడంపై, విదేశీవిధానాన్ని అమలుచేయడంపట్ల, కాంగ్రేసు తదితర ఉదారవర్గం సమర్ధించడం, దీనికి భారతీయసంస్కౄతిలో కల్పించుకోవడం, వ్యక్తంచేసిన నిరసనతో, తిలక్ ను ఒక వితండ హిందూవివాదిగా గుర్తించడం జరిగింది. ఏమైనా, 1857 సిపాయిలకలహం తర్వాత, భారతదేశంపట్ల బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన మొదటి విప్లవాత్మక మార్పు అనిమాత్రం చెప్పాలి. హిందూమతసంస్కౄతిలో జోక్యం చేసుకున్నట్లు తిలక్ భావించడం జరిగింది. బొంబే లో ప్లేగు వ్యాధి తెచ్చిన ముప్పు బొంబాయిలో 1897 లో తాండవించిన ప్లేగు వ్యాధి, పూనాకు పాకుతుందని ఆందోళనతో ప్రభుత్వం తీసుకున్న నివారణ ప్రయత్నాలు శౄతిమించడం – వ్యాధి సోకని ప్రాంతాల్లోని కుటుంబాల్ని చెదరకొట్టడం, అనవసరంగా ఆవాసాల్ని మార్చడం, తరలింపుల్లో ప్రజల ఆస్తుల్ని దోచుకోవడం పట్ల పెరిగిన నిర్లిప్తత, పట్టించుకోని ప్రభుత్వ పరిపాలన పై దుమారాన్ని ప్రకటిస్తూ, కేసరి పత్రికలో వివాదాస్పదమైన వ్యాసాల్ని ప్రచురించడం, శత్రువుని సంహరించడంలో భగవద్గీతలోని భావాల్ని ఉదాహరించడం ద్వారా, ఎవరినీ తప్పుపట్టకూడదని చెప్పడం, ఆ మర్నాడు 27 జూన్ న పూనా సహాయక కలెక్టర్, బౄందాన్ని సంహరించడం జరిగింది. ఈ ఘటనకు, తిలక్ ప్రచారం ఉసికొల్పిందన్న నేరానికి, 18 నెల్ల జైలు శిక్షను అనుభవించాడు. విడుదల తర్వాత, జాతీయనాయకుడిగా తిలక్ కు కొత్తగా గుర్తింపు, ‘స్వరాజ్యం నా జన్మహక్కు – దాన్ని సాధించి తీరుతానూ అన్న నినాదం ఈ సందర్భంగా అవతరించింది. ఈ నినాదమే, తిలక్ పేరుతోపాటు, అవిభాజ్యంగా వస్తూనేవుంది. గోఖలే తో వాదోపవాదం మరింతగా ఆధునిక భావాలున్న గోపాల కౄష్ణ గోఖలే తో తిలకు కు విబేధాలు రావడం, దీనికి ఆనాటి జాతీయ నాయకులు, బిపిన్ చంద్ర పాల్ (బెంగాల్), లాలా లజపతి రాయ్ (పంజాబ్) ల్ నుంచి సమర్ధన రావడంతో, ఈ త్రివేణీభావకూటమిని, ‘లాల్-బాల్-పాళ్ అని పిలిచెడివారు. 1907 సూరత్ కాంగ్రేసు సమావేశం, గరం దళ్ (విప్లవకారులు – త్రివేణీకూటమి), నరం దళ్ (ఆధునికకారులు గా విడిపోవడం జరిగింది. ఈ విభజనకు తిలక్, గోఖలేలు, ఆందోళనతో, జాతీయోద్యమానికి విఘాతమని భావించారు. కాని, ఫిరోజ్ షా మెహతా సన్నిహితుడైన హెచ్.ఎ.వైద్య, ఈ కూటమి కాంగ్రేస్ శరీరంలో ఒక అంగవిహీనమని, దీనికి శస్త్రచికిత్సే శరణ్యమని చెప్పాడు. 1908 ఏప్రిల్ 30 న జరిగిన ముజఫరుపూర్ లో జిల్లాజడ్జిపై బాంబుని యిద్దరు బెంగాలీయువకులు విసరడం, ప్రమాదవశాత్తు, మహిళాప్రయాణికులు మరణించడం, పోలీసుల సోదాలపై కలకత్తాలో వినాశసామగ్రి దొరకడం జరగ్గా, ఈ పూర్తి కధనాన్ని తిలక్ తన కేసరి పత్రికలో సమర్ధించడం, సంపూర్ణ స్వరాజ్యాన్ని కోరడం పై, ప్రభుత్వం తిరిగి తిలక్ ను కష్టడీలోకి తీసుకుంది. అప్పటి యువనాయకుడు మహమ్మదు అలి జిన్నాని ప్రాతినిధ్యం వహించాలని తిలక్ కోరాడు. కాని, బ్రిటిష్ ప్రభుత్వం తిలక్ కు బర్మాలో ఆరేళ్ళు, 1914 వరకు జైల్లో పెట్టింది. జైలునుంచి విడుదల తర్వాత, తిలక్ 1916 లో తిరిగి కాంగ్రేసు లో జాతీయవాదులతో చేరడం, అఖిలభారత హోం రూల్ ఉద్యమంలో 1918 వరకూ అనిబెసెంట్, జిన్నాలకు సహాయం చేశాడు. సర్వ మత, జాతులకి స్వరాజ్యంలో సమభాగస్వామ్యం మరాఠా రాజకీయ సిద్దాంత ప్రచారక ప్రవక్తగా ప్రారంభం కావించిన తిలక్, విభజన తదుపరి బెంగాల్ జాతీయ నాయకుల సాన్నిహిత్యంతో, ప్రముఖ జాతీయనాయకుడిగా ఉన్నత శిఖరాల్ని అధిరోహించాడు. మరాఠా రాజకీయపాలన తరహాలో భారతీయస్వరాజ్యపరిపాలన కొనసాగుతుందా అన్న ప్రశ్నకి, 16-17 శతాబ్దాలకాలం లో నడచినా, తర్వాత మరాఠా తరహా 20 శ. లో సరితూగదని, నిజమైన ఫెడరల్ వ్యవస్థతో సంపూర్ణభారతస్వరాజ్య పరిపాలనలో, అన్ని మతాలకి, వర్గాలకి సమప్రాధాన్యత, భాగస్వామ్యం వహిస్తాయని, ఇటువంటి కూటమే భారతదేశాన్ని స్వరాజ్యంతో పరిరక్షించడం జరుగుతుందని తిలక్ నిస్సందేహంగా వివరించాడు. కర్మయోగసహిత జ్ౙానయోగం పై సమర్ధన ప్రాధమికంగా తిలక్ అద్వైత సిద్దాంతవాది అయినా, కేవలం జ్ఞానమే మానవునికి విముక్తినిస్తుంది అన్న ప్రాచీనాద్వైతవాదాన్ని త్రోసిరాజని, కర్మయోగసిద్దాంతం తో కూడిన జ్ఞానయోగం ఫలితాల్నిస్తుందని, రెండూ ఉభయతారకంగా ఆచరణకు రావాలని వక్కాణించాడు. తిలక్ ప్రతిపాదించిన సాంఘికసంస్కరణల్లో, ముఖ్యంగా – వివాహానికి కనీసవయసు, తాగుడుపై పూర్తి నిషేధంతోపాటు సరుకు దొరకకూడని పరిస్థితిని కల్పించాలన్న పట్టుదల, విద్యావిధానం, భారతీయ రాజకీయ ప్రస్థానం లో సూచించిన మార్పులు చాలా ప్రభావప్రేరణలు కలిగించాయి. హింది జాతీయభాషగా తొలి ప్రతిపాదనలు భారతీయ జాతీయ కాంగ్రేసు లో ప్రధమ నాయకుడిగా, దేవనాగరి లిపిలో వ్రాయబడే హిందీ భాషను ఏకైక జాతీయభాషగా ప్రతిపాదిస్తూ, మొట్టమొదటి నాయకుడు తిలక్ అని చాలామందికి తెలియని విషయం. ఈ వాదననే, తర్వాత మహాత్మాగాంధి సమర్ధించాడు. అయితే, తిలక్ ఆంగ్లభాషను మాత్రం భారతీయుల మేధస్సుల్లోంచి పూర్తిగా చెరపివేయాలన్న ప్రతిపాదనకు మాత్రం ఆచరణకు సాధ్యం కాలేదు. భారతీయపరిపాలన, సాంఘికజీవన విధానాల్లో, సమాచార, భావ ప్రకటన విధానాల్లో, జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో, ఆంగ్లం తిరుగులేని భాషామాధ్యమంగా తనదైన స్థానాన్ని పొందుతూనేవుంది. వసుధైకకుటుంబం భావనకు ఆంగ్లభాషామాధ్యమం అనివార్యం అన్న భావన అనేక దేశాలు ప్రపంచంలో గుర్తించాయి అన్నది నగ్నసత్యం. కాని, హిందీతో సహా భారతీయ భాషల వాడుకవిధానాలు మాత్రం తిలక్ ప్రతిపాదనల తర్వాత ఒక ఊపు, రూపు దిద్దుకున్నాయన్న విషయం కూడ నగ్నసత్యమే. సార్వజనిక, సామూహిక గణపతి పూజలు – తిలక్ భావవాహినీప్రభావమే!!! తొలుత అవిఘ్నమస్తు అని, తొండమునేకదంతమును తోరపుబొజ్జయున్ అని, శుక్లాంబరధం … ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ హైందవేతిహాసస్ఫూర్తితో భారతీయులు వారివారి పూజామందిరాల్లో ప్రతినిత్యం సుప్రభాతవేళల్లో జరుపుకునే నిత్య ఆధ్యాత్మిక తొలిప్రార్ధనలకు, ఒక సామూహికమైన, సామాజికమైన, సార్వజనికతను ప్రసాదించిన ప్రప్రధమ ప్రతిభామూర్తి, నిస్సందేహంగా, బాల గంగాధర తిలక్ మహాశయుడే. మూడురోజుల ముచ్చట నుంచి, అయిదురోజులు, గణపతి నవరాత్రులు, మాసాంతంగానూ పూజోత్సవాల్ని సామాజికంగా, సామూహికంగా, భాద్రపద శుక్ల (గణేశ) చతుర్దశిగా ప్రారంభించేవి, అనంత చతుర్దశి (ఆగష్టు/సెప్టెంబరు నెలల్లో) ఒక అనివార్య సమావేశాలకి సదవకాశాన్నిచ్చింది. ముఖ్యంగా, నాయకులకు ప్రజలతో సంభాషణలు చేసుకోవడానికి వేదికలుగా మారాయి. శుభప్రారంభంగా, గ్వాలియర్ లో సర్దార్ ఖస్గివాలే ప్రోత్సాహంతో నిర్వహించిన పూజోత్సవాలు, సర్వోపయోగమని గ్రహించి, ఈ నూతనభావాల్ని 26 సెప్టెంబర్ 1893 లో తన కేసరి పత్రికలో సవివరంగా ప్రచురించడం జరిగింది. ఈ ఫక్కీలో, విదేశీ వస్తువుల్ని, సేవల్ని, బహిష్కరించమని చేసిన ప్రకటనలకు, పిలుపులకు, సద్స్ఫూర్తినివ్వడమే కాక, దేశీయత, దేశభక్తి, భారతీయప్రజల్లో నరనరాల్లో దూసుకుపోవడం అనూహ్య పరిణామం, పరిమాణం అని చెప్పాలి. పిదపకాలం లో తిలక్ గాంధీ నిర్వహించిన అహింస, పౌరసహాయనిరాకరణ విధానాలపై, తిలక్ నుంచి విమర్శలు వచ్చేవి. ఒకానొక కాలంలో, తిలక్ ను అతివాదకునిగా భావించబడినా, తిలక్ చర్యల్లో కొంత మెరుగుతనం కనిపించేవి. ఉభయవర్గాల మధ్య సహౄద్భావ వాతావరణంలో సంభాషణలు భారతస్వరాజ్యానికి మరింత ప్రభావితమాధ్యమాలవుతాయని తిలక్ భావించాడు. అంతేకాక, భారతీయ చరిత్ర, సంస్కౄతి, హిందూతత్వం అంశాలపై తిలక్ ప్రచురించిన రచనలు మాత్రం ఒక నూతన సంప్రదాయాన్ని, సదాచారాన్ని, భారతీయుల్లో, భారతీయ నాగరికతకు, ప్రపంచంలో గర్వించదగ్గ దేశంగా భారతీయతావిధానాలకు దోహదమయ్యాయి. వీటిమూలంగానే, గాంధీకి ఆధ్యాత్మిక, రాజకీయ గురువుగా తిలకు ను అనేకులు సమంజసంగానే భావించారు. అయితే, జాతిపిత మాత్రం, తన రాజకీయ గురువుగా, తిలక్ సమకాలీకుడైన, గోపాలకౄష్ణ గోఖలే ను, ప్రకటించారు. దీనికి విరుద్ధంగా, తిలక్ 1920 లో మరణించినప్పుడు, బోంబే లోని దహనవాటికలో, 2 లక్షలకు పైగా ప్రజాసమూహంతో నున్న గాంధి, తిలక్ కు ఘననివాళిని అర్పిస్తూ, తిలక్ ను నవభారతనిర్మాత గా గాంధి ప్రకటించడం గమనించదగ్గ విషయం. బాలగంగాధర్ తిలక్ ని మాత్రం నేటికీ నవభారత నిర్మాత గానే కాకుండా, హిందూ జాతీయతానాయకునిగా భారతావని పరిగణిస్తూనేవుంది అన్నది సత్యం. హిందూరాజకీయవాదపు అంశంగా, భారతీయ విప్లవసంస్కర్తగా వినాయక్ దామోదర్ సావార్కర్ కు ఏకైక ఆదర్శమూర్తిగా తిలక్ ని మాత్రం చెప్పుకోవాలి. తిలక్ మరపురాని సాహిత్యం బాల గంగాధరుని ప్రతిభాతిలకానికి నిదర్శనంగా, 1903 లో, ‘ఆర్కిటిక్ హోం యిన్ ది వేదాశ్ అన్న ఆంగ్లభాషారచనను ఆలోచనాత్మకంగా వ్రాయడం, ఆర్కిటిక్స్ లో వేదాల్నే రచించినట్లుగాను, ఆర్యులు దక్షిణానికి తర్వాతకాలంలో తీసుకువచ్చారని ఆయన వాదంగా తిలక్ చెప్పడం కూడ జరిగింది. ప్రముఖంగా, కర్మయోగం పై విశ్లేషణగా, భగవద్గీతను గీతారహస్యం గా, వేదోపనిషత్తులసారంగా వ్రాయడం, ఆ బౄహద్గ్రంధం నేటికీ హిందువులకు నిత్యపారాయణగ్రంధంగా ఆదరణీయంగానే భావించబడుతోంది. తిలక్ యితర రచనలను చెప్పాలంటే, హిందూ జీవనం-నైతికత-మతపరంపర, వేదసంహిత-వేదాంగజ్యోతిషాలు, యం.డి.విద్వాన్స్ సంపాదకీయంలో లోకమాన్య తిలక్ లేఖలు, రవీంద్రకుమార్ సంపాదకీయంలో గంగాధరుని పత్రరచనలు, తిలక్ పై వచ్చిన ఆరోపణల సారాంశ రచనలు ప్రముఖ ప్రభావాల్ని, ఉత్తేజితకరమైన ఆలోచనావిధానాల్ని రేకెత్తించాయన్నది నిజం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఆగష్టు 1, 1920 న తన అంతిమ శ్వాసను విడిచారు. బాలగంగాధరుడి పాత్ర, ప్రభావం, ప్రేరణ, భారతీయతకు పునాది, హిందూవాదానికి వేదసంహితసమానమని నిర్ద్వందంగా భావించవచ్చు అన్న భావన, సత్యం, శివం, సుందరం. పవిత్రభావనలు అన్ని దిశలనుంచి అవతరించాలన్నది తిలక్ విషయంలో ౠజువర్తనమయింది.

లోకమాన్య బాలగంగాధర తిలక్ మహనీయుడి జయంతి సందర్భంగా సహస్ర నమోవాకాలని సమర్పిస్తోంది.

    –          వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

చంద్ర శేఖర్ ఆజాద్ జయంతి

(23 జూలై 1906  —  27 పిబ్రవరి 1931)

       చంద్ర శేఖర్ ఆజాద్ అసలు పేరు చంద్రశేఖర్ సీతారాం తివారీ. ఆయన జూలై 23, 1906 బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తరప్రదేశ్ లో జన్మించారు.మన దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ప్రముఖుడుగా పేరెన్నికగన్నాడు.

       బాల్యము : మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పండిత్ సీతారాం తివారికి, అగరాణీదేవికి చంద్రశేఖర అజాద్ జన్మించారు. తమ కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుణ్ణి చేయడానికి కాసి లో చదివించాలను పట్టుదల వుండేది. కాని ఆ పిల్లవాడికి చదువు పూర్తిగా అబ్బలేదు. చదువుకోడానికి తల్లి తండ్రులు చేసిన ఒత్తిడిని భరించ లేక తన పదమూడవ ఏట ఇల్లొదిలి ముంబయి పారి పోయాడు. ముంబయిలో ఒక మురికి వాడలో నివసించాడు. బ్రతకడానికి కూలి పని చేశాడు. అనేక కష్టాలు పడ్డాడు. అయినా ఇంటికి వెళ్ళాలనిపించ లేదు. ఇంతటి కష్టాల కన్నా సంస్కృతం చదవడమే మేలనిపించింది. రెండేళ్ళ ఆ మురికి వాడలో నికృష్టమైన జీవనం తర్వాత 1921 లో వారణాసికి వెళ్ళిపోయి అకడ సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు.

       అదే సమయంలో భారత స్వాతంత్రం కొరకు మహాత్మ గాంధీ చేస్తున్న సహాయ నిరాకరణోద్యమంతో దేశం యావత్తు అట్టుడికినట్టున్నది. అప్పుడే చంద్ర శేఖర్ తాను కూడ భారత స్వాతంత్రం కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించు కున్నాడు. అప్పుడతని వయస్సు పదిహేనేళ్ళు మాత్రమె. ఉత్సాహంగా తాను చదువుతున సంస్కృత పాఠశాలముందె ధర్నా చేశాడు. పోలీసులు వచ్చి పట్టుకెళ్ళి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయ మూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రశేఖర్ తల తిక్క సమాదానాలు చెప్పాడు. నీపేరేంటని అడిగితే ఆజాద్ అని, తండ్రి పేరడిగితే స్వాతంత్రం అని, మీ ఇల్లెక్కడ అని అడిగితే జైలు అని తల తిక్క సమాదానాలు చెప్పాడు. న్యాయమూర్తి అతనికి 15 రోజులు జైలు శిక్ష విధించాడు.

       ఇతని సమాదానాలకు న్యాయమూర్తి ఏమనుకున్నాడో ఏమోగాని తాను విధించిన 15 రోజుల జైలు శిక్షను రద్దు చేసి 15 కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు. అతని ఒంటి మీద పడిన ప్రతి కొరడా దెబ్బ అతనికి తాను చేయవలసిన పనికి కర్తవ్వ బోధ చేసింది. ఆ విధంగా చంద్రశేఖర్ …. చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు.

       విప్లవము ఉద్యమాలు : తన స్నేహితుడైన రాంప్రసాద్ బిస్మిల్ మాటలతో ఆజాద్ లో విప్లవ భీజాలు బలంగా నాటుకున్నాయి. మిత్రుడైన బిస్మిల్, అఘ్నూల్ల ఖాన్ , రోషన్ సింగ్ లు ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికి కుట్ర పన్నుతున్నారని తెలిసి అందులో భాగస్వామి అయ్యాడు. 1924 ఆగస్టు 9 వ తారీఖున ఈ విప్లవకారులంతా కలిసి ఆకోరి అనే వూరు వద్ద ప్రభుత్వ ధనం వున్న రైలును ఆపి దోపిడి చేశారు. కొంత కాలానికి ఆ విప్లవ కారులంతా పోలీసుల చేతికి చిక్కారు ఒక్క చంద్రశేఖర్ ఆజాద్ తప్ప. చంద్ర శేఖర్ అజ్ఞాత వాసంలోకి వెళ్ళి పోయాడు.

       రహస్య జీవనంలో భాగంగా ఆజాద్ ఉత్తరప్రదేశ్ లోని ఓర్చా అరణ్యం లో సతార్ నది ఒడ్డున వున్న ఆంజనేయ స్వామి వారి ఆలయం ప్రక్కన ఓ కుటీరము నిర్మించుకుని మరిశంకర బ్రహ్మచారీ అనే సాధువు గా మారాడు. ఆ తర్వాత ప్రభుత్వం పై తాము చేసిన అన్ని కుట్రలకు ప్రణాలికలకు ఆ కుటీరమే స్థావరం అయింది. కానీ రైలు దోపిడి కేసులో పోలీసులు చంద్రశేఖర్ కొరకు గాలిస్తూనే ఉన్నారు.

       చంద్రశేఖర్ ఆజాద్ 1928 సెప్టెంబర్ లో భగత్ సింగ్, సుఖ్ దేవ్ మొదలగు వారితో కలిసి హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. వీరందరూ కలిసి లాలా లజపతి రాయ్ మరణానికి కారకుడైన స్కాట్ అనే బ్రిటిష్ పోలీసు అధికారిని చంపాలనుకున్నారు. ఆ కుట్రలో భాగంగా పొరబాటున తాము గురిపెట్టిన వ్వక్తి స్కాట్ అనుకొను సాండర్స్ అనే పోలీసు ను కాల్చారు. కాల్పుల తర్వాత పారిపోతున్న భగత్ సింగ్, రాజ్ గురు లను చనన్ సింగ్ అనే పోలీసు వారిని వెంబడించి పట్టుకో గలిగాడు. ఆ ముగ్గురు పెనుగులాడుతున్న సమయంలో చంద్ర శేఖర్ ఆజాద్ కు తమ మిత్రులను కాపాడుకోడానికి చనన్ సింగ్ ను కాల్చక తప్పలేదు.

       తమ రహస్యజీవనంలో భాగంలో ఝాన్సీ పట్టణంలో సహ విప్లవ కారులతో కలిసి ఒక ఇంట్లో వున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి ఝాన్సీ పట్టణానంతా గాలిస్తున్నారు. అలా నగరాన్నంతా గాలించి చివరికి ఆజాద్ ఒక గదిలో వుంటాడన్న పూర్తి నమ్మకంతో ఆ గది చుట్టు పోలీసులను మొహరించి ఒక ఉదుటున తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేసించారు. కాని ఖాలీగా వున్న ఆ గది వారిని వెక్కిరించింది. ఇది జరిగింది 1929 మే నెల 2వ తారీఖున.

       పార్లమెంటు పై దాడి కేసు : ఈలోపు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు పార్లమెంటు పై దాడి చేయడము, వారిని పోలీసులు పట్టుకోవడము, న్యాయస్థానంలో వారి ఉరి శిక్ష పడడము జరిగి పోయాయి. ఈ సంఘటనతో ఆజాద్ ఎంతొ కలత చెందాడు. వారిని విడిపించడానికి ఎంతకైనా తెగించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా 1931 పిబ్రవరి 27 తెల్లవారుజామున జవహర్ లాల్ నెహ్రూని కలిసి విప్లవ వీరులైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లను విడిపించేందుకు సహకరించాలని వేడుకున్నాడు ఆజాద్. కాని నెహ్రూ అజాద్ కు ఏ సమాదానము చెప్పలేదు.

       దాంతో కలత చెందిన ఆజాద్ అలహాబాద్ వచ్చి ఆల్ఫ్రెడ్ పారుకులొ తమ ఇతర విప్లవ మిత్రులత భగత్ సింగ తదితరులను ఎలా విడిపించాలో చర్చలు జరుపుతున్నాడు. ఆ చర్చల్లో పాల్గొన్న వారిలో రహస్య పోలీసులున్నారని అనుమానమొచ్చింది ఆజాద్ కి. వెంటనే తన రివ్వార్ కి పని చెప్పాడు. ముగ్గురు పోలీసులు అతని తూటాలకు బలైపోయారు. ఇంతలో మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు అజాద్ ని వెంబడిస్తూనె వున్నారు.

        ఆజాద్ వారిని తన రివ్వాల్వర్తో నిలవరిస్తూనే వున్నాడు.తన తుపాకీలో ఇంకో తూటానె మిగిలి వున్నది. అది మరొకని ప్రాణం మాత్రమే తీయ గలదు. ఆ తర్వాత తాను పట్టుబడటం ఖాయం అని తెలిసిపోయింది. చీ బ్రిటిష్ వారికి తాను పట్టుబడటమఅంతే మరో క్షణం ఆలోసించ లేదు ఆజాద్ పోలీసుల వైపు గురిపెట్టబడిన తన తుపాకి తన తలవైపు మళ్ళింది. అంత 25 ఏండ్ల యువకుడు చంద్రశేఖర ఆజాద్ అమరుడయ్యాడు.. ఇది జరిగిన రోజుకి సరిగ్గా 25 రోజుల తర్వాత భగత్ సింగ్ ను ఉరి తీశారు.

    –          వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

దాశరథి కృష్ణమాచార్యులు గారి వర్ధంతి

(22-07-1925 :: 05-11-1987)

       నిజాం నిరుంకుశత్వంపైన నిప్పులు చెరిగిన ధీశాలి… నాతెలంగాణ కోటిరతనాలవీణ అంటూ చాటి చెప్పిన దార్శనికుడు.. నిర్బంధాలకు వెరువకుండా నిలబడి పోరాడిన దాశరది కృష్ణమాచార్యులు ఓరుగల్లు బిడ్డ. మానుకోట ఒడిలో.. చిన్నగూడురు బడిలో ఎదిగిన పోరుబిడ్డ. ఆ మహనీయుడు నాటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా పనిచేశారు.

వరంగల్ జిల్లా మరిపెడ మండలంలోని చిన్నగూడురు గ్రామంలో వెంకటాచార్యులు, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఇద్ధరు అబ్బాయిలు జన్మించారు. ఆ ఇద్దరు అబ్బాయిలు దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు. వీరిలో పెద్దవాడయిన కృష్ణమాచార్యులు 1925 జూలై 22న జన్మించారు. ఈయన పద్య కవితలో దిట్ట కాగా, చిన్నవాడయిన రంగాచార్యులు వచన కవితలో ఖండాంతర ఖ్యాతిని సంపాదించారు. దాశరథి కృష్ణమాచార్యుల ప్రాథమిక విద్యాబ్యాసం అంతా చిన్నగూడురులోని పాఠశాలలోనే జరిగింది. హైస్కూల్ విద్యను ఖమ్మం జిల్లా గార్లలో పూర్తి చేసారు. మొదటి నుంచి పోరాట స్వభావం ఉన్న దాశరథి నాటి నిజాం రాక్షసపాలనను ససేమీరా సహించలేక పోయారు. నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా జంకుతున్న కాలంలో ‘ఓ..నిజాం పిశాచమా.. కానరాడు నినుబోలిన రాజు మాకెన్నడేని.. తీగలను తెంచి అగ్నిలో దింపినావు..నా తెంలంగాణా కోటి రతనాలవీణ’ అంటూ గర్జించిన కలం వీరుడు దాశరధి. అంతటితో ఆగకుండా.. ‘ఎముకలు నుసి చేసి పొలాలు దున్ని… భోషాణములన్ నింపిన రైతులదే తెలంగా ణా..ముసలి నక్కకు రాచరికంబు దక్కునే ?!..’ అంటూ ఆగ్రహంతో ప్రశ్నించిన ధీరుడు దాశరథి. మా నిజాంరాజు జన్మ.. జన్మాల బూజు… అని గళమెత్తి గర్జిస్తే దాశరథిని గొలుసులతో బంధించి వరంగల్ వీదుల్లో ఈడ్చుకుని వెళ్లారు. వరంగల్ సెంట్రల్ జైల్లో కఠిన కారాగార శిక్ష విధించారు. కారాగారం దాశరథి కలంలోని వేడిని.. వాడిని ఆపలేకపోయింది. చెరసాలలోనే ఉంటూ 1949లో ‘అగ్నిదార’ కురిపించారు. 1950లో ‘రుద్రవీణ’ మోగించారు. అనంతర కాలంలో పునర్నవం, అమృతాబిషేకం, కవితాపుష్పకం, మహాంధ్రోదయం, మహాబోధి, గాలీబ్‌గీతాలు, దాశరథి శతకం, నవమి, తిమిరంతోసమరం, ఆలోచనలోచనాలు వంటి అనేక ప్రముఖ రచనలు ఆయన కలం నుంచి జాలువారాయి. సినిమా రంగంలోనూ తన కలం వాడిని చూపిన దాశరథి వాగ్దానం, ఇద్దరు మిత్రులు, బలిపీఠం, పూజ వంటి చిత్రాలకు సాహిత్యాన్ని అందించారు.

వరించిన అవార్డులు

       తన జీవితకాలంలో మహాకవి దాశరథి అనేక సత్కారాలు అందుకున్నారు. 1949లో మహాకవి బిరుదంతో ప్రారంభం అయిన ప్రస్తానంలో ‘కవిసింహ’ , ‘అభ్యుదయకవి చకవర్తి’, ‘యువకవి చకవర్తి’వంటి బిరుదులు ఆయనను వరించి వచ్చాయి. 1967లో ‘కవితాపుష్యకం’  సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు, 1972లో ప్రధానమంత్రి ఇందిరాగాంది చేతుల మీదుగా తామ్రపత్రం అందుకున్నారు. ‘తిమిరంతో సమరం సంపుటికి’ 1974లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాపపూర్ణ బిరుదు ఇచ్చి గౌరవించింది. 1976లో ఆగ్రా విశ్వ విద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ గౌరవ పట్టాను అందజేసింది. 1977 ఆగస్టు15వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దాశరధిని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఆస్థానకవిగా నియమించారు. 1978లో అమెరికాగ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంస్థ దాశరథిని ఆంధ్రకవితాసారథి బిరుదంతో సత్కరించింది. 1981లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డిలిట్ పట్టాతో సన్మానించింది.

చిన గూడూరులో విగ్రహావిష్కరణ

       తెలంగాణాసాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో.. మానుకోటలో ఓ కార్యకమంలో ప్రసంగించడానికి వచ్చిన కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ దాశరథి వంటి గొప్పవ్యక్తికి ట్యాంక్‌బండ్ పైన విగ్రహం లేదన్న బాధకన్నా…అంతటి గొప్ప వ్యక్తి పుట్టిన చిన్నగూడురులో కూడా కనీసం ఓ చిన్న విగ్రహం లేదంటూ కంటతడిపెట్టడం పలువురిని కదిలించింది. చిన్నగూడూరుకు చెందిన విద్యాధికులు, యువకులు ఆమాటలకు విపరీతంగా స్పందించారు. ఊరంతా ఉమ్మడిగా కదిలి దాశరది నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని తమ ఊరి గొప్పతనాన్ని వెలుగెత్తి చాటుకున్నారు. విగ్రహ ఏర్పాటుకు స్పూర్తినిచ్చిన దేశపతి శ్రీనివాస్, ప్రజాకళాకారుడు గద్దర్, ప్రజాకవి జయరాజ్‌ల చేతులమీదుగా 2008 నవంబర్ 30న విగ్రహావిష్కరణ జరిగింది. దాశరథి గుర్తుగా గ్రామంలో ఆయన పేరిట గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసారు. అటువంటి మహనీయులను స్మరించుకోవడం చారిత్రక అవసరం.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)