Categories
Vipra Foundation

సఫల ఏకాదశి

“ఏకాదశి వ్రతం నామ సర్వకామఫలప్రదం | కర్తవ్యం సర్వదా విప్రైర్ విష్ణుప్రీణవ కారణం ||”

సఫల ఏకాదశి మార్గశిర కృష్ణపక్షంలో వస్తుంది. ఈ ఏకాదశి మాహాత్మ్యము శ్రీకృష్ణధర్మరాజుల సంవాదరూపంలో బ్రహ్మాండపురాణమునందు వర్ణించబడింది.

“కృష్ణా! మార్గశిర కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని ఏ విధంగా పాటించాలి. దయచేసి దీనిని నాకు వివరముగా చెప్పవలసినది” అని ధర్మరాజు అడిగాడు.

ఈ ప్రశ్నకు దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు : “భరతవంశశ్రేష్ఠుడా! సర్పములలో శేషుడు ఉత్తముడైనట్లు, పక్షులలో గరుడుడు శ్రేష్ఠుడు అయినట్లు, యజ్ఞములలో అశ్వమేదయజ్ఞము శ్రేష్ఠమైనట్లు, నదులలో గంగానది ఉత్తమమైనట్లు, నరులలో బ్రాహ్మణుడు శ్రేష్ఠమైనట్లు, వ్రతములలో కెల్లా ఏకాదశి వ్రతము సర్వోత్కృష్టమైనది. రాజోత్తమా! ఏకాదశి వ్రతపాలనము చేసేవాడు నాకు ఎంతో ప్రియమైనవాడు, ఐదువేల సంవత్సరముల తపస్సు వలన కలిగే పుణ్యరాశి కేవలము ఏకాదశి వ్రతపాలన వలన సిద్ధిస్తుంది.”

మహిష్కృతుడనే సుప్రసిద్ధుడైన రాజు చంపవతిపురాన్ని పాలించేవాడు. ఆ రాజుకు నలుగురు పుత్రులు. వారిలో జ్యేష్ఠుడైన లుంపకుడు పరమపాపి. బ్రాహ్మణులను, వైష్ణవులను, దేవతలను సదా నిందించే స్వభావము కలిగిన లుంసకుడు జూదము, వ్యభిచారము పట్ల ఆసక్తుడై యుండేవాడు. అందువలన రాజు అతనిని దేశబహిష్కరణజేసాడు. అప్పుడు లుంపకుడు అడవిలో నివసిస్తూ రాత్రివేళలలో తన తండ్రి రాజ్యంలోని ప్రజల ధనమును కొల్లగొట్టేవాడు. ఆ విధంగా అతడు ధనమును కొల్లగొట్టినప్పటికినీ రాజుతనయుడని భావించి జనులు అతనిని విడిచిపెట్టేవారు. లుంపకుడు పచ్చిమాంసము తింటూ జీవనాన్ని గడపసాగారు.

అతడు ఉన్నట్టి అడవిలో ఒక అశ్వత్థ వృక్షం ఉన్నది. ఆది దేవతల వలె పూజనీయమైనది. లుంపకుడు ఆ చెట్టు క్రింద కొంతకాలము జీవించాడు. అతడు ఆ విధంగా జీవించే సమయంలో కాకతాళీయంగా మార్గశిర కృష్ణపక్ష ఏకాదశి వచ్చింది. అలసట, దుర్బలత కారణంగా అతడు ఏకాదశికి ముందురోజు స్పృహ తప్పినవాడై ఏకాదశి రోజు మధ్యాహ్నవేళకు తిరిగి స్పృహమ పొందాడు. ఆకలిపీడితుడై అతడు ఎంతగా బలహీనుడయ్యాడంటే ఆ రోజు అతడు జంతువులను చంపే అవకాశమే కలుగలేదు. అందువలన అతడు కొన్ని పండ్లను ఏరుకొని విష్ణువుకు సమర్పించాడు. ఇంతలో సూర్యాస్తమయము అయింది. అనుకోకుండా ఆ రాత్రి అతడు జాగరణ చేసాడు.

ఉపవాసము, జాగరణ ఫలంగా అతడు సఫల ఏకాదశి వ్రతపాలనము చేసినట్లు అయింది. సాధకుడు చేసే ఈ ప్రతిపాలనను మధుసూదనుడు చక్కగా స్వీకరిస్తాడు. ఈ ఏకాదశి వ్రతపాలన ఫలంగా లుంపకునికి ఐశ్వర్యయుతమైన రాజ్యం సంప్రాప్తించింది. మర్నాడు ప్రొద్దున ఒక దివ్యమైన ఆశ్వము అతని ముందు నిలబడింది. ఆ సమయంలో ఒక అశరీరవాణి ” రాకుమారా! మధుసూదనుని కృప వలన, సఫల ఏకాదశి ప్రభావము వలన నీకిపుడు రాజ్యం లభింపనున్నది. నీవు దానిని ఎటువంటి కష్టాలు లేకుండ పాలించగలుగుతావు. కాబట్టి నీవు నీ తండ్రి చెంతకు వెళ్ళి. అనంతముగా రాజ్యాన్ని అనుభవించు” అని పలికింది. ఆ ఆదేశం ప్రకారం లుంపకుడు తండ్రి చెంతకు వెళ్ళి రాజ్యభారాన్ని స్వీకరించాడు. తదనంతరము అతడు ఉత్తమమైన భార్యను పొంది పుత్రవంతుడయ్యాడు. ఈ ప్రకారము అతడు ఆనందంగా రాజ్యపాలనము చేసాడు.

సఫల ఏకాదశి పాలనము ద్వారా మనిషి ప్రస్తుత జన్మలో యశస్సును బడసి, తదుపరి జన్మలో ముక్తిని పొందుతాడు. ఈ ఏకాదశి వ్రతపాలనము చేసేవారు దన్యులు. ఈ ఏకాదశ పాలనము వలన అశ్వమేధ యజ్ఞఫలము లభిస్తుంది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

మత్స్య ద్వాదశి

మత్స్య ద్వాదశి విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ ఆచారం విష్ణువు యొక్క మొదటి అవతారానికి మత్స్య లేదా చేపగా అంకితం చేయబడింది. వీరు సత్య యుగంలో భూమిపైకి వచ్చారు. మార్గశిర్ష మాసం శుక్ల పక్ష పన్నెండవ రోజున మత్స్య ద్వాదశి జరుపుకుంటారు. మార్గశిర్ష ద్వాదశి నాడు మత్స్య ద్వాదశి, అపరా ద్వాదశి, రాజ్య ద్వాదశి, సునామ ద్వాదశి, తారక ద్వాదశి, అఖండ ద్వాదశి వ్రతాలు, దశావతార వత్రం, సాధ్య వ్రతం, శుభ ద్వాదశి వ్రతాలు ఆచరిస్తారని చతుర్దర్గ చింతామణి ద్వారా తెలుస్తుంది.

హిందూ పురాణం ప్రకారం, ‘మత్స్య అవతారం’ అనేది ‘మహాప్రలయం’ సమయంలో కనిపించిన ఒక కొమ్ము గల చేప. విష్ణు దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న ‘నాగళపురం వేద నారాయణ స్వామి ఆలయం’ విష్ణువు మత్స్య అవతారానికి అంకితం చేసిన ఏకైక ఆలయం. భూలోకంలో 3 కోట్ల తీర్థాలున్నాయి, అవన్నీ మార్గశుద్ధ ద్వాదశి అరుణోదయ వేళ తిరుపతి కొండమీదపై స్వామి పుష్క రణిలో ప్రవేశిస్తాయని పురాణాల్లో ఉంది. అందుకే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పుష్కరిణికి ఈనాడు తీర్థదినంగా పూజిస్తారు.

మత్స్య ద్వాదాశి యొక్క ప్రాముఖ్యత :-

ద్వాదశి రోజు విష్ణువు యొక్క మత్స్య అవతారాన్ని ఆరాధించడం మత్స్య ద్వాదశి ని చేయడం భక్తుడికి మోక్షం లభిస్తుంది. మత్స్య భగవంతుడిని ఆరాధించడంలో అనుసరించాల్సిన ఆచారాలు, సంప్రదాయాలు మరియు ఆచారాల గురించి మత గ్రంథాలలో ప్రస్తావించబడలేదు.

మత్స్య అవతారం :-

సత్య యుగంలో, విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ఒక రాజు తీవ్రమైన తపస్సు చేశారు. ఒక రోజు అతను కృతమల నదిలో ఉన్నప్పుడు అతని ముడుచుకున్న చేతుల్లో ఒక చిన్న చేప కనిపించింది. అతను చిన్న చేపను తిరిగి నీటిలో వదిలి పెట్టబోయాడు, కాని పెద్ద చేపలకు భయపడుతున్నందున చేప అలా చేయవద్దని కోరింది. రాజు దానిని ఒక చిన్న కూజాలో ఉంచి అతనితో తీసుకువెళ్ళాడు. చేప కూజాకు చాలా పెద్దదిగా పెరిగింది. రాజు చేపను ఒక చెరువులో పెట్టాడు. ఆ చేప మళ్ళీ చెరువు, నదులు, సముద్రానికి చాలా పెద్దదిగా మారింది. రాజు గారి అభ్యర్థన మేరకు ఆ చేప దాని వాస్తవ రూపాన్ని వెల్లడించింది. విష్ణువు రాజు యందు ప్రత్యక్షమై ఏడు రోజుల్లో గొప్ప వరద ప్రపంచాన్ని నాశనం చేస్తుందని చెప్పాడు. అతను అతి పెద్దదైన పడవను నిర్మించాలని మరియు అన్ని రకాల విత్తనాలతో పాటు అన్ని జీవులను తీసుకురావాలని రాజుకు సలహా ఇచ్చాడు. తన కొమ్ముకు కట్టడానికి సర్పం వాసుకిని తాడుగా ఉపయోగించాలని ఆదేశించాడు. పడవను జాగ్రత్తగా చూసుకునే ఒక కొమ్ము చేప మత్స్య అదృశ్యమయ్యాడు. ఇంతలో, ముని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాడు. ఒక విధిలేని రోజున, భూమిపై వర్షం కురిసింది, మరియు ఒక కొమ్ము గల చేప తిరిగి కనిపించింది. రాజు సర్పాన్ని మత్స్య కొమ్ముకు కట్టాడు. మత్స్య వారిని హిమవన్ పర్వతానికి తీసుకువెళ్ళాడు. మత్స్య భగవంతుడు వేదాలు, పురాణాలు, సంహితలు మరియు శాశ్వతమైన సత్యాల జ్ఞానాన్ని రాజుకు వెల్లడించాడు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

గోవత్స ద్వాదశి – కార్తీక మాసం

        మన సనాతన భారతీయ సంస్కృతి అనేక ఆచార సాంప్రదాయాలకు నిలయం. ఇలాంటి ఆచార సంప్రదాయాలలో అనేక పండుగలు, వ్రతాలు, యజ్ఞయాగాదులు ఆచరించటం అనాదిగా భారతీయ సంస్కృతి. ఇలాంటి సంస్కృతీ సంప్రదాయాల్లో మాసాలకు కూడా ప్రత్యేకత ఉంది. హిందూ సంస్కృతిలో ప్రతిమాసానికి విశిష్టత ఉంది. ఇందులో కార్తీక మాసం మహా మహిమాన్వితమైనది. ఈ మాసం శివ, వైష్ణవ, శక్తి ఆరాధనకే కాక గో ఆరాధనకు చాలా ముఖ్యమైనది. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి ముందు ఉండే అష్టమిని గోపాష్టమని, పౌర్ణమి తరువాత వచ్చే ద్వాదశిని గోవత్సద్వాదశి అని మన ఋషూలు గోమాతకు సంబంధించి ఈ తిధుల్ని విశేషంగా చెప్పారు.

       గోపాష్టమి రోజున గోవుకు పూజ చేసి దానికి ధాన్యం లేదా పండ్లను తినిపించడం వల్ల విశేషమైన పుణ్యం వచ్చి చేసిన పాపాలు అన్నీ పోతాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. గోవత్స ద్వాదశి రోజున దూడతో కూడిన ఆవుకు పూజ చేసి గోవు యొక్క పృష్ఠ భాగంలో తోకను నమస్కరించి దానికి చివరకు ధాన్యం పెట్టకపోయినా, రెండు పండ్లు తినిపించినా ఆ సంవత్సరంలో పొందవలసిన ప్రయోజనములన్నీ పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి.

       గోవును తల్లిగా భావించడం మన హిందూ సంస్కృతి. గోవులను పూజించడం మన ఆచారం. గోమాత మన సంప్రదాయంలో విడదీయరాని సంబంధం కలిగి ఉంది. గోవు లేకపోతే మన సంస్కృతిలో లోపం ఉన్నట్లే. ఎందుచేతనంటే శివుని వాహనం నంది గోసంతతికి చెందినదే. నందిలేని శివాలయం, గోక్షీరం లేని శివాభిషేకం ఏ లోకంలో ఉండదు. కామధేనువు, నందినీ ధేనువు, సురభి మొదలైన గోమాతలను మన పూర్వీకులు పోషించి రక్షించి పూజించినట్లు మన పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మానవుడు పుట్టింది మొదలు చనిపోయే వరకు అనేక సంస్కార క్రియల్లో గోవు వినియోగం ఎంత ఉందో లోకంలో మనం చూస్తూనే ఉన్నాం.

       గోవు పరదేవతా స్వరూపము. అనగా సకల దేవతలు గోరూప ధారి గాగ అని ‘సాధు గోమాత భరత భూశ్వాస కోశ’ అని గోమాతలో సకల దేవీదేవతలు నివాసముంటారని, గోవు భారత భూమికే శ్వాసకోశము వంటిది. గోవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అంత మంది దేవతలు గోవులో ఉంటారన్నది శాస్త్ర వచనం.

‘‘గావః విశ్వస్య మాతరః గవా మాంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ’’

       ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిది. గోవు నందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది. అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం. క్షీర సాగరమధన సమయంలో నంది, శుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని భవిష్యపురాణం తెలియజేస్తుంది. వీటినే కామధేనువులు అంటారు.

       గో శబ్దానికి ఆవు, ఎద్దు, సూర్యుడు, యజ్ఞం, వాక్కు, దిక్కు, భూమి, స్వర్గం, ఉదకం, వెంట్రుక, గుఱ్ఱం, బాణం, వజ్రం, నేత్రం, ముని, పగ్గం, అల్లెత్రాడు అని ఎన్నో అర్థాలు చెప్పవచ్చు. ‘‘ధేనునా మస్మి కామధుక్‌’’ అని గీతలో శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు. గోవు లక్ష్మీ స్వరూపం దీనికి ఒక పురాణ గాధ ఉంది. దేవతలందరూ వచ్చి గోవుతో తల్లీ మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికి భాగం ఇవ్వడం జరిగింది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

శ్రీ సత్య సాయిబాబా జయంతి

జననం : నవంబరు 23, 1926, మరణం : ఏప్రిల్ 24, 2011

       అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో 1926 నవంబరు 23న సత్యనారాయణ రాజు (సత్యసాయిబాబా) జన్మించారు. తనకుతానే బాబా అని ప్రకటించుకుని ప్రపంచ ఆధ్యాత్మికవేత్తగా సత్యసాయిబాబా ఎదిగారు. ఈ క్రమంలో అనేక ఒడిదుడుకులు, విమర్శలను, ఆరోపణలను సైతం సత్యసాయిబాబా ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మికవేత్తగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు భక్తులున్నారు.

బాల్యం గడించింది ఇలా…

       అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఈశ్వరమ్మ, పెద్దవంకమరాజు రత్నం దంపతులకు 1926 నవంబరు 23న సత్యనారాయణరాజు జన్మించారు. చిన్నప్పటి నుంచి పెద్దసోదరుడు శేషమరాజు వద్దనే ఉంటూ వచ్చారు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో సత్యనారాయణరాజు విద్యాభ్యాసం కూడా ఒక్కొక్క చోటు జరుగుతూ వచ్చింది. పుట్టపర్తి సమీపంలో ఉన్న బుక్కపట్నంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అనంతరం ఉరవకొండలో ప్రాథమికోన్నత విద్య అభ్యసించారు. ఈ క్రమంలోనే 14 ఏళ్ల తరుణంలో ఒక రోజు సత్యనారాయణ రాజుకు తేలు కుట్టింది. అప్పటి నుంచి ఆయన మానసిక పరివర్తనలో మార్పు వచ్చింది. ఏదేదో మాట్లాడుతుండే వాడు. దీంతో ఆయన సోదరుడు శేషమరాజు ఆయన్ను తన స్వగ్రామమైన పుట్టపర్తికి పంపించారు. కొద్దిరోజులు తరువాత తాను దేవుడినని, తన పేరు ఇక నుంచి సత్యసాయిబాబా అని 1940లో ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి సత్యనారయణ రాజు కాస్త సత్యసాయిబాబాగా పిలువబడుతూ వచ్చారు. అనంతరం ఆయన దక్షిణ, ఉత్తర భారతదేశ ప్రాంతాల్లో యాత్రలు చేపట్టారు. తిరిగొచ్చాక కొన్ని మహిమలు చూపడంతో భక్తులు ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. ఆయన్ను చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు వచ్చేవారు. 1944లో ఆయనకు మొట్టమొదటిసారిగా పుట్టపర్తిలో మందిరాన్ని నిర్మించారు. దీన్ని ప్రస్తుతం మందిరంగా పిలుస్తున్నారు. 1948లో ప్రశాంతి నిలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి క్రమక్రమంగా బాబా గురించి దేశవ్యాప్తంగా తెలియడంతో భక్తులు వేల సంఖ్యలో వచ్చేవారు. 1968లో మొట్టమొదటిసారి విదేశీ పర్యటన చేపట్టారు. క్రమక్రమంగా అక్కడి నుంచి కూడా విదేశీ భక్తులు పుట్టపర్తికి రావడం పెరిగింది.

విమర్శలు, ఆరోపణలు…

       సత్యనారాయణ రాజు నుంచి సత్యసాయిబాబాగా ఎదిగే క్రమంలో ఆయనపై అనేక విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో సైతం అనేక వ్యతిరేక కథనాలు వచ్చాయి. అన్నింటికంటే ఎక్కువగా విమర్శలకు గురిచేసింది 1993 జూన్‌ 6న ఆశ్రమంలో జరిగిన ఆరు హత్యలు. బాబా నిద్రించే గదిలోనే ఇద్దరు యువకులు తుపాకీతో కాల్చి హత్య గురికావడం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను బయటపెట్టేందుకు ప్రయత్నించినందునే వారిని కాల్చి చంపారని అప్పట్లో విమర్శలు గుప్పుమన్నాయి. ఇకపోతే నోటిలో నుంచి శివలింగం తీయడం, గాలిలో విబూది తీయడం వంటివన్నీ మహిమలు కాదని, మ్యాజిక్‌ మాత్రమేనని ప్రముఖ హేతువాది ప్రేమానంద్‌ పేర్కొన్నారు. చంద్రుడు తన ప్రతిరూపం కనిపిస్తుందని అంతకు ముందు ఏడాది ప్రకటించి కనబడకపోవడం కూడా విమర్శలకు దారితీసింది. ఈ ఆరోపణలేవీ ఆయన్ను పెద్దగా అడ్డుకోలేకపోయాయి. 2004లో బిబిసి అంతర్జాతీయ మీడియా ఛానల్‌ ‘ది సీక్రెట్‌ స్వామి’ అనే పేరుతో ఒక కథనాన్ని వెలువరిచింది. వీటన్నింటినీ సత్యసాయిబాబా భక్తులు తిప్పికొట్టగలిగారు.

ప్రపంచ వ్యాప్తంగా సేవా సమితులు…

       సత్యసాయి సేవా సమితులు ప్రపంచ వ్యాప్తంగానున్నాయి. 126 దేశాల్లోని 1200 చోట్ల సత్యసాయి సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారానే సత్యసాయి బాబా ట్రస్టు కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలే కాకుండా పుట్టపర్తిలోని ట్రస్టు కార్యకలాపాలన్నీ సేవాసమితి ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. భద్రత మొదలుకుని అన్నీ కూడా సమితి సభ్యుల కనుసన్నల్లోనే నడుస్తాయి. ట్రస్టు లోపలి భాగంలో పోలీసులకు సైతం ప్రవేశం ఉండదు.

సేవా కార్యక్రమాలు…

        సత్యసాయి బాబా ఏర్పాటు చేసిన ‘సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు’ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్య, వైద్యం అందులో ప్రధానమైనవి. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని స్థాపించి పేదలకు ఉచితంగా వైద్యసేవలందిస్తున్నారు. వీటితోపాటు పలు జిల్లాలకు తాగునీటి వసతిని ఏర్పాటు చేశారు. అనంతపురం, మహబూబ్‌నగర్, మెదక్‌ జిల్లాల్లో తాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. చెన్నై నగరానికి తాగునీటి ప్రాజెక్టును చేపట్టారు. ఒరిస్సాలో 2008లో వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ చర్యలను చేపట్టారు.

సాయిబాబా బోధనలు ఈ క్రింది నాలుగు ముఖ్య విషయాల ద్వారా అవగతం చేసుకోవచ్చునని అంటారు:

  • ఒకటే కులం – మానవత
  • ఒకటే మతం – ప్రేమ
  • ఒకే భాష –హృదయం
  • ఒకే దేవుడు – అంతటా ఉన్నవాడు.

        హజరత్‌ మహమ్మద్‌ 1400 సంవత్సరాల కిందట భగవంతుని దివ్య వాణిని ‘ఖుర్‌ ఆన్‌ ‘ రూపంలో పొందుపరిచాడు. ఇందులోని రెండు పదాలు సలాత్‌ , జకాత్‌ .అంటే ప్రార్థన , దానధర్మాలు .వీటిని ఆచరించే సమాజానికి ఇస్లాం అని పేరుపెట్టారు. ఇస్లాం అంటే శరణు , శాంతి అని అర్థం. ఎవరు భగవంతునికి శరణాగతులై నిరంతర శాంతితో జీవించడానికి పూనుకుంటారో ఆ సమాజమే ‘ఇస్లాం’.(ఈనాడు25.4.2011)

భారత దేశంలో వివిధ వార్తా పత్రికలు సాయిబాబా ఉపదేశాలను తరచు ప్రచురిస్తుంటాయి.

 బాబా 2011మార్ఛి 28న శ్వాసకోశ, మూత్రపిండాల మరియు ఛాతీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చబడ్డారు  దాదాపు నెల రోజులు అయినా ఆయన ఆరోగ్యం నిలకడగా లేదు, సత్యసాయి బాబా ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 7:40 కి తుది శ్వాస విడిఛారు. బాబా పార్థివ దేహానికి వేద మంత్రోచ్ఛరణల మధ్య ఏప్రిల్ 27 వ తేదీన బుధవారం ఉదయం మహా సమాధి జరిగింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాలు లోనే అన్ని కార్యక్రమాలూ శాస్త్రోక్తంగా జరిగాయి. గురుపౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని జులై 15 నుంచి సత్యసాయి బాబా మహాసమాధి దర్శనం

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కాళోజీ నారాయణరావు వర్ధంతి

       మానవులు పుడతారు … చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు … వీరిని “మృతంజీవులు” అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -, కాళోజీ నారాయణరావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ….

         తెలంగాణ తొలిపొద్దు కాళోజీ!-‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం, బిజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించిన కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్న డ, ఇంగ్లిష్ భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడ’వ  పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి. బిజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది.

          ప్రాథమిక విద్యానంతరం హైదరాబాద్ పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజ్‌లోనూ, హనుమకొండలోని కాలేజియేట్ హైస్కూల్‌లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. 1939లో హైదరాబాద్‌లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించారు. నిజామాంధ్ర మహా సభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌తో కాళోజీ అనుబంధం విడదీయరానిది.

         మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామ్‌కిషన్‌రావు, పీవీ నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ సామాన్యుడే నా దేవుడని ప్రకటించిన కాళోజీ 2002 నవంబర్ 13న తుదిశ్వాస విడిచారు.

 అనితర సాధ్యం కాళోజీ మార్గం

       ‘ఒక ప్రధానిగా ఎన్నో ఒడిదొడుకుల్ని సునాయసంగా ఎదుర్కొన్నాను. ఎన్ని సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాను. ప్రపంచాధినేతలను చూసి కూడా కించిత్తు జంకలేదు. ఆ భగవంతునికి కూడా భయపడను కానీ కాళోజీ నారాయణరావు చూస్తే వణికిపోతాను’ అని పి.వి.నర్సింహారావు కాళోజీ సంస్మరణ సభలో అన్న మాటలు ఆయనను ప్రేమించే అందరికీ వర్తిస్తాయి. కాళోజీ పై ఉన్న గౌరవం, ప్రేమ ఎప్పటికీ చెరిగిపోనిది. నాకు కాళోజీ అంటే ఒక్కసారిగా భయం, భక్తి ఆవహిస్తాయి. తరగతి గదికి వెళ్లే ఉపాధ్యాయుడు ఈ రోజు పిల్లల నుంచి తానేమి నేర్చుకుంటానని భావిస్తారు. కాళోజీ నిరంతర అన్వేషి. కాళోజీ సాహిత్య మేధోమథనం, కాళోజీ తెలుగు సమాజ జీవనచిత్రం. మొత్తంగా ఆయన తెలంగాణ సమాజముఖచిత్రం. కాళోజీ పౌరహక్కుల ఉద్యమ పోరుకేక. కాళోజీ అన్యాయంపై తిరగబడ్డ గుండె ధైర్యం. అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న కాళోజీ నారాయణరావు అవార్డును ఆయన 10వ వర్ధంతి సందర్భంగా నాకివ్వటం నాకెంతో గర్వకారణంగా ఉంది.

         ఇప్పటి వరకు నా జీవితంలో పొందిన అనేక పురస్కారాల కంటే కాళోజీ అవార్డు అందుకోవటం అన్నింటికన్నా ఉన్నతమైనదిగా భావిస్తాను. ఇప్పటి వరకు నా జీవితంలో అనేక సన్మానాలు పొందాను. కానీ కాళోజీ అవార్డు పురస్కారం నా జీవితానికి కొనసాగింపుగా చేస్తున్న సన్మానంగా భావిస్తాను. కాళోజీ మిత్రుల పేరుతో కాళోజీ ఫౌండేషన్ వారు ప్రకటించిన అవార్డును అందుకోవటం కంటే ఆనందం నాకింకొటిలేదు. ఎవస్టు శిఖరాన్ని ఎన్నిసార్లైనా అధిరోహించి రావచ్చును కానీ కాళోజీ స్థాయికి ఎదగటం మాత్రం కనాకష్టం. అందువల్ల ఈ అవార్డు తీసుకోవటం వల్ల కాళోజీ కావటానికి శాయశక్తులా కృషి చేయటమే చేయగలను. ఎందుకంటే కాళోజీ కావటం ఎవరికీ సాధ్యంకాదు కాబట్టి ఆ మార్గం లో కొన్ని అడుగులు వేసి నడిచేందుకు ప్రయత్నించటమే మనముందున్న కర్తవ్యం. నేను శాసనమండలిలో కాళోజీ నారాయణరావు ప్రాతిధ్యం వహించిన ఉపాధ్యాయ నియోజకవర్గం సీటులో ఆరేళ్ల్లు కూర్చున్నాను. నేను అనేకసార్లు శాసనమండలిలో సభ్యులందరికీ గర్వంగా చెప్పాను. నేను చుక్కా రామయ్యనే కానీ కాళోజీ వారసుణ్ణి అని చెప్పాను. ఆ వారసత్వంతోనే తెలంగాణకు జరిగిన అన్యాయాల్ని గొంతెత్తి చెప్పగలిగాను. ఆ ధైర్యం, స్ఫూర్తి కాళోజీ అందించాడు.

         తెలంగాణకు జరిగిన అన్యాయాల్ని శాసనమండలిలో ధైర్యంగా బయటపెట్టగలిగినవాడు కాళోజీ నారాయణరావు. తెలంగాణలో ఉన్న ఫ్యూడల్ వ్యవస్థను కూల్చడానికి మహత్తర సాయుధ పోరాటమే జరిగింది. ఆంధ్ర మహాసభ చైతన్య దివిటీలను అందించింది. ఈ ఫ్యూడల్ వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలించటానికి ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులు ‘విశాలాంధ్ర’ సునాయాసన మార్గంగా భావించారు. విశాలాంధ్ర వస్తే ఫ్యూడల్ వ్యవస్థ పోతుందన్న భావనతో వాళ్లు ఒప్పుకున్నారు. మొత్తం ఆలోచనాపరులు అలాగే ఆలోచించారు. విశాలాంధ్ర వస్తే ఏం జరుగుతుందని ఆశించారు. అందుకు భిన్నంగా వాతావరణం మారింది. తెలంగాణలో పాతదొరలు పోయి ఆధునిక దొరలు ఆవిర్భవించారు. అందువల్లనే తెలంగాణ ఆగ్రహించింది. 1956 నుంచి మూడేళ్లలోనే మారిన పరిస్థితులు చూసిన ప్రజలు 1969 ఉద్యమ అగ్గి అయి భగ్గున మండారు. సమస్త తెలంగాణ ప్రజానీకం విశాలాంధ్ర జెండా వదిలిపెట్టి తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఎత్తుకుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయటం వల్లనే దీర్ఘయావూతగా రాష్ట్ర సాధన ఉద్యమం కొనసాగుతూ వచ్చింది.

         తెలంగాణ నేల నుంచి పెండ్యాల రాఘవరావులాంటి ఉన్నతులు ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు. భీమిడ్డి నర్సింహాడ్డి, మగ్ధూం, రావి నారాయణడ్డి, ఆరుట్ల రాంచంవూదాడ్డి, నర్రా రాఘవడ్డి, ఉప్పల మనుసూరులాంటి వాళ్లు శాసనసభ్యులుగా వచ్చారు. ఎమ్మెల్యేగా పనిచేసి కూడా చెప్పులు కుట్టుకుంటూ సాధారణ జీవితం గడుపుతూ చరివూతలో ఉన్నతస్థానాలను అలంకరించిన ఉప్పల మనుసూరులాంటి మహానీయులు, ధర్మభిక్షం లాంటి ప్రజల మనుషులు పార్లమెంటు, శాసనసభ్యులుగా ఎంపికవుతూ వచ్చారు. ప్రజల హృదయాలను ఆవిష్కరించిన జననేతలే ఇక్కడ ప్రజావూపతినిధులుగా ఎన్నికవుతూ వచ్చారు తప్ప ఈ నేల నుంచి వ్యాపారవేత్తలను పార్లమెంటుకు పంపలేదు. ఈరోజు రాష్ట్రంలో ఎంపీలను చూస్తుం కార్పొరేట్ రంగం నుంచి వస్తున్నారు.

         ప్రజల హృదయాలలో ఉండగలిగినవారు చెప్పిన మాటకే సమాజమంతా కట్టుబడి ఉంటుంది. అందువల్లే కాళోజీ ఏ నినాదంతో పోరాడారో అదే నినాదంతో ఈ రోజు తెలంగాణ సమాజం కదిలివస్తుంది. ప్రజావూపతినిధి అంటే ప్రజల మనోభావాలను చెప్పగలగాలి. అన్యాయాలను ప్రతిఘటించినవాడు కాళోజీ. ప్రాంతాలకు అతీతంగా పోరాడగలిగిన ఉన్నతుడు కాళోజీ. మానవ హక్కుల కోసం గొంతు పెకిలించి పౌరహక్కుల నినాదమయ్యాడు. జన కవిత్వాన్ని పండించినవాడు. నిరంతరం ప్రజాఉద్యమాల్లో పాలు పంచుకున్నవాడు. అధికారాన్ని ధిక్కరించినవాడు. గొప్ప దేశభక్తడు అయిన మా అన్న రామేశ్వపూరావు భుజాల మీద పెరిగానని అందువల్లనే తాను అదృష్టవంతుణ్ణయ్యానని కాళోజీ చెప్పుకునేవాడు. కాళోజీకి కుటుంబ సంపదను, సామాజిక ఆలోచనల భావజాలాల్ని అందించిన అభ్యుదయ భావాల వనం రామేశ్వపూరావు.

         ఇద్దరు అన్నదమ్ములు కాళోజీ రామేశ్వరావును, కాళోజీ నారాయణరావులను విడిగా చూడలేం. కాళోజీ ప్రతిష్ఠలో రామేశ్వరరావు కృషి ఉంది. నాకు చదువు చెప్పించిన న్యాయవాది తాండ్ర వెంకవూటామ నర్సయ్యకు కాళోజీ సోదరులు ఆప్తులు. ఆయన దగ్గరే కాళోజీ ప్రాక్టీసు చేశారు. తమతో విభేదించే వారిని కూడా అక్కన చేర్చుకునే మనస్తత్త్వం తెలంగాణ ప్రజలకుంది. నాందేడ్‌కు చెందిన బి.టి. దేశ్‌పాండేను, ఆంధ్ర ప్రాంతానికి చెందిన రామకృష్ణారావును చెన్నూరు ఎమ్మెల్యేగా తెలంగాణ నేల ఆలింగనం చేసుకుంది. తెలంగాణ ప్రాంతం వారికి ప్రాంతీయ భేదాలు లేవు. ఇక్కడ ఇతర ప్రాంతాలవాళ్లు ఎంపీ లు, ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణవాళ్లను ఎవరినైనా ప్రజావూపతినిధులుగా ఎన్నుకున్నారా? తెలంగాణ ప్రజలకు ప్రాంతీయతత్త్వం ఉందని కొందరు చేస్తున్న ఆరోపణలు దుర్మార్గమైనవి. ఇది తెలంగాణపై మార్కెట్ సమాజం చేస్తున్న కుట్రలుగా భావించాలి. ప్రాంతీయతత్త్వంలేని విశ్వనరులు తెలంగాణ ప్రజలు.

 ప్రపంచ తెలుగు మహాసభలను ఎందుకు బహిష్కరించాలంటే?

         తెలంగాణే తెలుగు భాషను బతికించింది. తెలంగాణ ప్రజలు తెలుగు భాషను, తెలుగు సంస్కృతి రెండువందల సంవత్సరాలు తమ గుండెల్లో పెట్టుకుని కాపాడా రు. తెలుగుభాషంటే ప్రేమ, గౌరవం తెలంగాణ గుండె నిండా ఉంది. తెలుగుకు ప్రాచీన భాషా హోదా కోసం తెలుగునేలంతా తిరిగితే ఆనవాళ్ల ఎక్కడా దొరకలేదు. కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో శాతవాహనుల కాలం నాటి ఆనవాళ్ల లభించటమే తెలుగుకు ప్రాచీన భాషాహోదా లభించడానికి కారణభూతమయ్యాయి. తల్లి శిశువును కాపాడినట్లు తెలుగు భాషను తెలంగాణ రక్షించింది. ఎన్నో దశలలో మనమంతా ఒక్క సూత్రానికి కట్టుబడ్డ తెలంగాణ ప్రజల్ని గేలిచేశారు. మా భాష ను, మా సంస్కృతి హేళన చేస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి. తిరగబడి తీరుతారు. అసలు ప్రాంతీయ విద్వేషాలను ఎవరు రెచ్చగొట్టారు? తెలుగు భాషను సంరక్షించి పోషించిన తెలంగాణను ద్వేషిస్తే, పలచనచేసి చూస్తే తెలంగాణ అస్తిత్వ ఉద్య మం పొడుస్తున్న పొద్దుగా పొడవదా మరి.

         ఒక ప్రాంతం తెలంగాణ సంస్కృతి గేలిచేస్తుంటే ఇక్కడ మాత్రం దివాకర్ల వెంకటావధ శతజయంతి సభలు, గురజాడ అప్పారావు శత జయంతి సభలు జరుపుకున్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు క్షోభిస్తుంటే, వేయిమంది దాకా ఆత్మబలిదానాలు చేసుకుని తమ ప్రాణాల్ని చెట్లకు వేలాడదీసి నినదిస్తుంటే రాష్ట్ర ప్రభు త్వం ప్రపంచ తెలుగు మహాసభలు ఎలా జరుపుతుంది? ప్రపంచ తెలుగు మహాసభల్ని అందుకే బహిష్కరిస్తున్నాం. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ మహాసభల్ని తెలంగాణ సమాజం బహిష్కరిస్తుంది. అధికారానికి లొంగిపోకుండా ధిక్కరించి నిలవమని చెప్పిన కాళోజీ స్ఫూర్తిగా ఈ తెలుగు మహాసభలను బహిష్కరిస్తున్నాం.

         ప్రపంచ మహాసభల పేరున తెలంగాణ ప్రజల గుండె గాయాలను మాన్పలేరు. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు తెలంగాణలో జరుగుతున్న ఆత్మబలిదానాల గురిం చి ఆందోళన చెందుతుంటే ఈ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు జరపటంలో అర్థం ఏమిటి? కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో తెలుగు భాష కోసం అక్కడి ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయి. మరి మన తెలుగుగడ్డ మీద వీళ్లు చేసింది. ఏమి టి? మన ప్రభుత్వం తెలుగు భాషను మార్కెట్ చేసింది. ఇపుడు ఈ తెలుగు మహాసభలను రాజకీయం చేస్తున్నారు. మనదంతా ఒకటే భాష అని భాషా కత్తిని ఉపయోగించి తెలంగాణ ఉద్యమాన్ని అణచటం కోసం తిరుపతిలో ప్రపంచ మహాసభలు జరుపుతారా? తెలుగు భాషాభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు. అధికారం చేస్తు న్న కుట్రలకు వ్యతిరేకం. హైదరాబాద్‌లో జీవవైవిధ్య సదస్సు పోలీసుల రక్షణలో చేయవలసిన గతి ఎందుకు ఏర్పడింది? చివరకు సదస్సు శాంతిభవూదతల సమస్యగా మారింది. హైదరాబాద్ నగరం మిలటరీతో నింపి జీవవైవిధ్య సదస్సు జరుపుకుంటారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. జీవవైవిధ్య సదస్సులాగే పోలీసుల రక్షణలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకోండి.

         ప్రపంచ మహాసభలలో చేసే సన్మానాలను తెలంగాణ ప్రజలు, కవులు, రచయితలు, కళాకారులు తిరస్కరించి తీరుతారు. కాళోజీ పురస్కారాన్ని అందుకోవటం పద్మశ్రీ పురస్కారాలకంటే ఉన్నతమైనది. ఈ కాళోజీ పురస్కారం అందుకొంటున్న ఈ తరుణంలోనే ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించేందుకు సిద్ధపడుతున్నాను. ప్రజల కోసం పనిచేసే మహత్తర ఉద్యమాల్లో మునుందు ముందుకు సాగటానికి ఓ కాళోజీ నువ్వు నాలోకి పరకాయ ప్రవేశం చేయమని వేడుకుంటున్నాను. నేను చాలా చిన్నవాణ్ణి. నాలో శక్తిని నింపమని కాళోజీని ప్రార్థిస్తున్నాను. కాళోజీ అవార్డు అందుకోవటం ద్వారా నేను ధైర్యాన్ని నింపుకుంటున్నాను.

 మళ్లీ నేనెందుకు కౌన్సిల్‌కు పోనంటే?

        శాసనమండలి అరణ్యరోదనగా మారింది. నేను ఎంపికైన ఆరేళ్ల నుంచి శాసనమండలిలో అజ్ఞాతవాసం చేసినట్లుంది. శాసనమండలి నుంచి ఇప్పుడు స్వేచ్ఛగా సమాజ కౌన్సిల్ ముందుకు వస్తున్నాను. కౌన్సిల్‌లో చైర్మన్ చక్రపాణి గంటకొట్టగానే కూర్చునేవాణ్ణి. ఆంధ్రమహాసభ నేర్పిన పాఠం, తెలంగాణ సాయుధ పోరాటం ఇచ్చిన శిక్షణ, జీవితాంతం క్రమశిక్షణ గల ఉపాధ్యాయునిగా జీవించటం వలన కౌన్సిల్‌లో చైర్మన్ బెల్‌కొట్టగానే వెంటనే కూర్చునేవాణ్ణి. నా మాటను, నా తెలంగా ణ ఉద్యమ మాటను శాసనమండలి వినేందుకు ఎందుకు ఒప్పుకుంటుంది చెప్పండి. అందుకే నేను ఆ డిసెంబర్ 9 తేదీనే అమెరికా నుంచి నా రాజీనామాను చైర్మన్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపాను. ఒక్కసారి రాజీనామా చేశానని ప్రకటించినవాణ్ణి తిరిగి మళ్ళీ పోటీకి దిగుతానా? తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తిరిగి రాజకీయ పునరుజ్జీవిగా ప్రజల ముందుకు వస్తాను. అప్పటి దాకా శాసనమండలి వైపు చూడను. అట్లాని ప్రేక్షకుడిలా కూర్చోను. పాలకుర్తి సోమనాథుడు, బమ్మెర పోతనలు నడయాడిన పాలకుర్తి, గూడూరు నుంచి వచ్చిన వాడిగా, ఐలమ్మ సాక్షిగా, దొడ్డి కొమరయ్య చిందించిన రక్తతర్పణ సాక్షిగా దీర్ఘకాల తెలంగాణ పోరాట గాయాల గుండె ఘోషల సంతకంగా ప్రజల పక్షం వహించి నిలబడతాను.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం ఎనిమిదో అధ్యాయం : హరినామస్మరణం

       వశిష్టుడు చెప్పిన దంతా విన్న జనకుడు ఇలా అడుగుతున్నాడు… ”మహానుభావా! మీరు చెప్పిన ధర్మాలన్నింటినీ శ్రద్ధగా వింటున్నాను. అందులో ధర్మం చాలా సూక్షంగా, పుణ్యం సులభంగా కనిపిస్తోంది. నదీస్నానం, దీపదానం, ఫలదానం, అన్నదానం, వస్త్రదానం వంటి విషయాలను గురించి చెప్పారు. ఇలాంటి స్వల్ప ధర్మాలతో మోక్షం లభిస్తుండగా… వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేసినగానీ పాపాలు పోవని మీలాంటి ముని శ్రేష్టులే చెబుతున్నారు. మరి మీరు ఇది సూక్ష్మంలో మోక్షంగా చెబుతుండం నాకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దుర్మార్గులు, వర్ణ సంకరులైనవారు రౌరవాది నరకాలకు పోకుండా తేలిగ్గా మోక్షాన్ని పొందుతున్నారు. ఇదంతా వజ్రపు కొండను గోటితో పెకిలించడం వంటిదే కాదా? దీని మర్మమేమిటి? నాకు సవివరంగా చెప్పండి” అని ప్రార్థించాడు.

       అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి . ‘జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే, నేను వేద వేదంగములను కూడా పఠించాను. వాటిల్లోనూ సూక్ష్మ మార్గాలున్నాయి. అవి సాత్విక, రాజస, తామసాలు అని పిలిచే మూడు రకాల ధర్మాలున్నాయి. సాత్వికమంటే… దేశ కాల పాత్రలు మూడు సమాన సమయంలో సత్వ గుణం జనించి ఫలితాన్ని పరమేశ్వరుడికి అర్పిస్తాం. మనోవాక్కాయ కర్మలతో ఒనర్చే ధర్మం అధర్మంపై ఆదిక్యత పొందుతుంది. ఉదాహరణకు తామ్రవర్ణ నది సముద్రంలో కలిసిన తావులో స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి ధగధగ మెరిసి, ముత్యమయ్యే విధంగా సాత్వికత వహించి, సాత్విక ధర్మం ఆచరిస్తూ గంగ,యమున, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలు పుణ్యకాలాల్లో దేవాలయాల్లో వేదాలను పఠించి, సదాచారుడై, కటుంబీకుడైన బ్రాహ్మణుడికి ఎంత స్వల్ప దానం చేసినా… లేక ఆ నదీ తీరంలో ఉన్న దేవాలయంలో జపతపాదులను చేయుట విశేష ఫలితాలనిస్తుంది. ఇక రాజస ధర్మం అంటే ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులతో చేసే ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతుకమై కష్టసుఖాలను కలిగిస్తుంది. తామస ధర్మమనగా… శాస్త్రోక్త విధులను విడిచి, దేశకాల పాత్రలు సమకూడని సమయంలో డాంబిక చరణార్థం చేసేది. ఆ ధర్మం ఫలాన్ని ఇవ్వదు. దేశకాల పాత్రము సమ కూడిన పుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నా నారాయుణుని నామము, తెలిసి గాని, తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు’ అని ఇలా చెప్పసాగారు.

ఆజా మీళుని కథ

       పూర్వ కాలంలో కన్యాకుబ్జం అనే నగరంలో నాలుగు వేదాలు చదివిన బ్రాహ్మడు ఒకడుండేవాడు. అతని పేరు సత్య వ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశి అయిన భార్య ఉంది. ఆ దంపతులు అన్యోన్యత, ప్రేమ కలిగి అపూర్వ దంపతులు అనే పేరు తెచ్చుకున్నారు. వారికి చాలాకాలానికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు. వారు ఆ పిల్లాడిని గారాబంగా పెంచి, అజామిళుకుడని పేరు పెట్టారు. అతను గారాబంగా పెరగడం వల్ల పెద్దలను నిర్లక్ష్యం చేస్తూ దుష్ట సహవాసాలు చేయసాగాడు. విద్యను అభ్యసించక, బ్రాహ్మణ ధర్మాలను పాటించక సంచరిచేవాడు. అలా కొంతకాలం తర్వాత యవ్వనవంతుడై కామాంధుడయ్యాడు. మంచిచెడ్డలు మరిచి, యజ్ఞోపవీతం తెంచి, మద్యంసేవించడం, ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి, నిరంతరం ఆమెతోనే కామ క్రీడల్లో తేలియాడుచుండేవాడు. ఇంటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె ఇంట్లోనే భోజనం చేస్తూ ఉండేవాడు. అతి గారాబం వల్ల ఈ దుష్పరిణామాలు ఎదురయ్యాయి. చిన్నపిల్లల్ని చిన్నతనం నుంచి అదుపాజ్ఞల్లో పెట్టకపోవడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. అజామీళుడు కులభ్రష్టుడు అయ్యాడు.

        కుల బహిష్కరణతో అతను మరింత కిరాతకుడిగా మారాడు. వేట వల్ల పక్షులను, జంతువులను చంపుతూ అదే వృత్తిలో జీవించసాగాడు. ఒక రోజున అజామీలుడు, అతని ప్రేయసి అడవిలో వేటాడుతూ తేనె పట్టు తీసేందుకు ఆమె చెట్టుపైకెక్కి ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందింది. అజామీళుడు ఆమెపైపడి కాసేపు ఏడ్చి, ఆ తర్వాత అడవిలోనే దహనం చేసి, ఇంటికి తిరిగి వెళ్లాడు. అప్పటికే ఆ ఎరుకల మహిళకు ఒక కుమార్తె ఉండడంతో, అజామీళుడు ఆమెను పెంచసాగాడు. ఆమెకాస్తా యుక్తవయసుకు వచ్చేసరికి అజామీళుడు కామంతో కళ్లు మూసుకుపోయి, ఆమెను చేపట్టాడు. ఆమెతో కామక్రీడల్లో తేలియాడుచుండేవాడు. వీరికి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఆ ఇద్దరూ పురిటిలోనే చనిపోయారు. ఆ తర్వాత ఆమె మరలా గర్భందాల్చి ఓ కుమారుడిని కన్నది. వారిద్దరూ ఆ బాలుడికి నారాయణ అని పేరు పెట్టి పిలవసాగారు. ఒక్క క్షణమైనా ఆ బాలుడిని విడవకుండా, ఎక్కడకు వెళ్లినా… తన వెంట తీసుకెల్తూ… నారాయణా అని ప్రేమతో సాకుచుండిరి. ఇలా కొంతకాలం గడిచాక అజామీళుడి శరీరం పటుత్వం కోల్పోయింది. రోగస్తుడయ్యాడు. మంచం పట్టి కాటికి కాలుచాచాడు. ఒకరోజు భయంకరాకారాలతో, పాశాయుధాలతో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి అజామీళుడు భయపడి కుమారుడిపై ఉన్న వాత్సల్యంతో ప్రాణాలు విడువలేక… నారాయణా… నారాయణా… అని పిలుస్తూ ప్రాణాలు విడిచాడు. అజామీళుడి నోట నారాయణ శబ్దం రాగానే యమభటులు గడగడా వణికారు. అదే వేళకు దివ్య మంగళకారులు, శంకచక్ర గధాధరులూ అయిన శ్రీమహావిష్ణువు దూతలు విమానంలో అక్కడకు వచ్చి, ”ఓ యమ భటులారా! వీడు మావాడు. మేం వైకుంఠౄనికి తీసుకెళ్లడానికి వచ్చాం “ అని చెప్పి, అజామీళుడిని విమానమెక్కించి తీసుకుపోయారు. యమదూతలు వారితో ” అయ్యా… వీడు పరమ దుర్మార్గుడు. వీడు నరకానికి వెళ్లడమే తగినది” అని చెప్పగా… విష్ణుదూతలు అతను చనిపోవడానికి ముందు నారాయణ పదాన్ని ఉచ్చరించాన్ని ఊటంకించి, ఆ పాపాలన్నీ ఆ నామ జపంతో తొలగిపోయాయని, అతను ఇప్పుడు పునీతుడని చెప్పుకొచ్చారు. “సంకీర్తనారాయణ శబ్దమాత్రం విముక్త్య దు:ఖా సుఖినోభవంతు” అన్నట్లు అజామీళుడు విష్ణుసాన్నిధ్యాన్ని పొందాడని వశిష్టుడు జనకమహారాజుకు వివరించారు.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి ఎనిమిదో అధ్యాయం, ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

దాశరథి కృష్ణమాచార్యులు గారి వర్ధంతి

(22-07-1925 :: 05-11-1987)

       నిజాం నిరుంకుశత్వంపైన నిప్పులు చెరిగిన ధీశాలి… నాతెలంగాణ కోటిరతనాలవీణ అంటూ చాటి చెప్పిన దార్శనికుడు.. నిర్బంధాలకు వెరువకుండా నిలబడి పోరాడిన దాశరది కష్ణమాచార్యులు ఓరుగల్లు బిడ్డ. మానుకోట ఒడిలో.. చిన్నగూడురు బడిలో ఎదిగిన పోరుబిడ్డ. ఆ మహనీయుడు నాటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా పనిచేశారు.

వరంగల్ జిల్లా మరిపెడ మండలంలోని చిన్నగూడురు గ్రామంలో వెంకటాచార్యులు, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఇద్ధరు అబ్బాయిలు జన్మించారు. ఆ ఇద్దరు అబ్బాయిలు దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు. వీరిలో పెద్దవాడయిన కృష్ణమాచార్యులు 1925 జూలై 22న జన్మించారు. ఈయన పద్య కవితలో దిట్ట కాగా, చిన్నవాడయిన రంగాచార్యులు వచన కవితలో ఖండాంతర ఖ్యాతిని సంపాదించారు. దాశరథి కృష్ణమాచార్యుల ప్రాథమిక విద్యాబ్యాసం అంతా చిన్నగూడురులోని పాఠశాలలోనే జరిగింది. హైస్కూల్ విద్యను ఖమ్మం జిల్లా గార్లలో పూర్తి చేసారు. మొదటి నుంచి పోరాట స్వభావం ఉన్న దాశరథి నాటి నిజాం రాక్షసపాలనను ససేమీరా సహించలేక పోయారు. నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా జంకుతున్న కాలంలో ‘ఓ..నిజాం పిశాచమా.. కానరాడు నినుబోలిన రాజు మాకెన్నడేని.. తీగలను తెంచి అగ్నిలో దింపినావు..నా తెంలంగాణా కోటి రతనాలవీణ’ అంటూ గర్జించిన కలం వీరుడు దాశరధి. అంతటితో ఆగకుండా.. ‘ఎముకలు నుసి చేసి పొలాలు దున్ని… భోషాణములన్ నింపిన రైతులదే తెలంగా ణా..ముసలి నక్కకు రాచరికంబు దక్కునే ?!..’ అంటూ ఆగ్రహంతో ప్రశ్నించిన ధీరుడు దాశరథి. మా నిజాంరాజు జన్మ.. జన్మాల బూజు… అని గళమెత్తి గర్జిస్తే దాశరథిని గొలుసులతో బంధించి వరంగల్ వీదుల్లో ఈడ్చుకుని వెళ్లారు. వరంగల్ సెంట్రల్ జైల్లో కఠిన కారాగార శిక్ష విధించారు. కారాగారం దాశరది కలంలోని వేడిని.. వాడిని ఆపలేకపోయింది. చెరసాలలోనే ఉంటూ 1949లో ‘అగ్నిదార’ కురిపించారు. 1950లో ‘రుద్రవీణ’ మోగించారు. అనంతర కాలంలో పునర్నవం, అమృతాబిషేకం, కవితాపుష్పకం, మహాంధ్రోదయం, మహాబోధి, గాలీబ్‌గీతాలు, దాశరథి శతకం, నవమి, తిమిరంతోసమరం, ఆలోచనలోచనాలు వంటి అనేక ప్రముఖ రచనలు ఆయన కలం నుంచి జాలువారాయి. సినిమా రంగంలోనూ తన కలం వాడిని చూపిన దాశరథి వాగ్దానం, ఇద్దరు మిత్రులు, బలిపీఠం, పూజ వంటి చిత్రాలకు సాహిత్యాన్ని అందించారు.

వరించిన అవార్డులు

       తన జీవితకాలంలో మహాకవి దాశరథి అనేక సత్కారాలు అందుకున్నారు. 1949లో మహాకవి బిరుదంతో ప్రారంభం అయిన ప్రస్తానంలో ‘కవిసింహ’ , ‘అభ్యుదయకవి చకవర్తి’, ‘యువకవి చకవర్తి’వంటి బిరుదులు ఆయనను వరించి వచ్చాయి. 1967లో ‘కవితాపుష్యకం’  సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు, 1972లో ప్రధానమంత్రి ఇందిరాగాంది చేతుల మీదుగా తామ్రపత్రం అందుకున్నారు. ‘తిమిరంతో సమరం సంపుటికి’ 1974లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాపపూర్ణ బిరుదు ఇచ్చి గౌరవించింది. 1976లో ఆగ్రా విశ్వ విద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ గౌరవ పట్టాను అందజేసింది. 1977 ఆగస్టు15వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దాశరధిని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఆస్థానకవిగా నియమించారు. 1978లో అమెరికాగ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంస్థ దాశరథిని ఆంధ్రకవితాసారథి బిరుదంతో సత్కరించింది. 1981లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డిలిట్ పట్టాతో సన్మానించింది.

చిన గూడూరులో విగ్రహావిష్కరణ

       తెలంగాణాసాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో.. మానుకోటలో ఓ కార్యకమంలో ప్రసంగించడానికి వచ్చిన కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ దాశరథి వంటి గొప్పవ్యక్తికి ట్యాంక్‌బండ్ పైన విగ్రహం లేదన్న బాధకన్నా…అంతటి గొప్ప వ్యక్తి పుట్టిన చిన్నగూడురులో కూడా కనీసం ఓ చిన్న విగ్రహం లేదంటూ కంటతడిపెట్టడం పలువురిని కదిలించింది. చిన్నగూడూరుకు చెందిన విద్యాధికులు, యువకులు ఆమాటలకు విపరీతంగా స్పందించారు. ఊరంతా ఉమ్మడిగా కదిలి దాశరది నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని తమ ఊరి గొప్పతనాన్ని వెలుగెత్తి చాటుకున్నారు. విగ్రహ ఏర్పాటుకు స్పూర్తినిచ్చిన దేశపతి శ్రీనివాస్, ప్రజాకళాకారుడు గద్దర్, ప్రజాకవి జయరాజ్‌ల చేతులమీదుగా 2008 నవంబర్ 30న విగ్రహావిష్కరణ జరిగింది. దాశరథి గుర్తుగా గ్రామంలో ఆయన పేరిట గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసారు. అటువంటి మహనీయులను స్మరించుకోవడం చారిత్రక అవసరం.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

రమా ఏకాదశి

      శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన పర్వదినంగా ఏకాదశి కనిపిస్తుంది. శ్రీమహా విష్ణువు అనుగ్రహాన్ని అనతికాలంలో కలిగించడం ఏకాదశి వ్రత ఫలితంగా చెప్పబడుతోంది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత వుంది. ప్రతి ఏకాదశి ఆ స్వామి పాదాల చెంత స్థానం కల్పించేదే .. ఆయన అనుగ్రహాన్ని అందించేదే. అలాంటి ఏకాదశులలో ఆశ్వయుజ బహుళ ఏకాదశి ఒకటిగా చెప్పబడుతోంది. దీనినే ‘రమా ఏకాదశి’ అని అంటారు.

       లోక కల్యాణం కోసం ఆయన వివిధ అవతారాలను ధరించాడు. తన భక్తులు ఆపదల్లో వున్న సమయాల్లో తనని తాను మరిచి పరిగెత్తుకు వచ్చిన సందర్భాలు పురాణాల్లో కనిపిస్తూ వుంటాయి. అలాంటి శ్రీమన్నారాయణుడిని అనునిత్యం పూజించాలి … అనుక్షణం ఆరాధించాలి. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆ స్వామిని సేవించడం వలన లభించే పుణ్యఫలాలు మరింత విశేషంగా ఉంటాయని చెప్పబడుతోంది.

      ముఖ్యంగా ‘ఏకాదశి వ్రతం’ ఆచరించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది. అలా ఆశ్వయుజ బహుళ ఏకాదశి రోజున కూడా వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి … శ్రీమహావిష్ణువును అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించవలసి వుంటుంది. విష్ణు సహస్ర నామం చదువుతూ జాగరణ చేయవలసి వుంటుంది.

      శ్రీ మన్నారాయణుడిని పూజించిన అనంతరం సాలగ్రామం … పెసరపిండితో చేసిన లడ్డూలు … బెల్లం దానంగా ఇవ్వాలని చెప్పబడుతోంది. ఈ విధంగా రమా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన అనేకమైన దోషాలు నివారించబడతాయి … అనంతమైన పుణ్యఫలితాలు కలుగుతాయి. అందుకు నిదర్శనంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన అనేకమంది కథలు ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తూ ఉంటాయి.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కొమురం భీమ్ వర్ధంతి (ఆశ్వీయుజ శుద్ద పౌర్ణమి)

      కొమురం భీమ్ గిగిజన  గోండు తెగకు చెందిన వీరుడు. గిరిజనోద్యమ నాయకుడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన  పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించి వీరమరణం పొందాడు. ఇతను కొమురం చిన్నూమ్ సోంబాయి దంపతులకు 1900 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకా లోని సంకేపల్లి గ్రామం లో జన్మించాడు. ఈ మహావీరుడు తెలంగాణ కావడం, ప్రతి తెలంగాణీయుడు గర్వించే విషయం. భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది.స్వాతంత్య్రానికి పూర్వం 1935లో రాష్ట్రంలో నైజాం ప్రభుత్వం నిరంకుశత్వ పాశవిక పాలనలో అడవి తల్లిని నమ్ముకుని, నీతినిజాయితీతో జీవిస్తున్న అమాయ కులైన గిరిజనులపై అటవీ, రెవెన్యూ శాఖల దౌర్జన్యంతో పాటు దోపిడిదారులు దోచుకుంటుండగా, ఆ నాటి అక్రమాలను ఎదిరించి గిరిజను లను చైతన్య పరిచి నైజాం పాలనను ఎదిరించి పోరాడిన వీరుడు కొమురంభీం. అన్ని వర్గాల చేత అణగదొక్కబడుతూ, దోపిడీ, దౌర్జన్యాలకు గురవు తున్న సాటి గిరిజనులకు భూమి, భుక్తి, విముక్తి కోసం పాలకులతో పోరాడి, పోరాట స్ఫూర్తిని ముందు తరాల వారికి అందించి మహా మనిషిగా నిలిచిన గిరిజనుల ఆరాధ్య దైవం కొమురంభీం. సాటి గిరిజనుల కోసం పాలకులతో పోరాటం చేసిన ఆదివాసి తెగల గిరిజనులలో భీం ఆధ్యునిగా పేర్కొనవచ్చు. అటవీ భూములను నైజాం ప్రభుత్వం భూస్వాములకు పట్టాలు చేస్తున్న క్రమంలో చేతికి వచ్చిన పంటను తన్నుకుపోతున్న గిరిజనేతర సిద్దిక్‌లను హతమార్చిన కొమురంభీం అక్కడి నుంచి పారిపోయారు. బల్లార్ష, చాందాలలో కూలి పని చేసుకుంటూనే చదవడం, రాయడం నేర్చుకుంటూ రాజకీయాలు ముఖ్యంగా గిరిజనుల తిరుగుబాటు గురించి బాబిజరి కేంద్రంగా 12 గ్రామాలను పొందుపరిచి గిరిజనులపై దౌర్జన్యాలను ఎదుర్కొంటూ వచ్చాడు. అటు అటవీ శాఖ దౌర్జన్యాలకు తోడు అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చెల్లించకుండా దోపిడీలు కొనసాగి స్తున్న దోపిడీ వ్యాపారులపై కొమురంభీం నిప్పులు కురిపించారు. ఈ దశలో పోరాటం ఒక్కడి వల్ల కాదని గిరిజనులందరిని సంఘటిత పరిచి వారికి జరుగుతున్న అన్యాయాలను, మోసాలను వివరించారు. గోండులను సమీకరించి భూమి పోరాటాలను గురించి ఎప్పటికప్పుడు బోధించసాగారు. ఆయన అవిరామంగా చేసిన కృషి, ప్రయత్నాలు ఫలించాయి. గిరిజనులందరు వాస్తవాలు తెలుసుకుని కొమురంభీం నాయకత్వాన్ని బలపరిచారు. భీం నాయకత్వంలో గిరిజనులు అప్పటి ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ను కలిసి తమకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ఒక నివేదిక సమర్పించారు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు.

    “జల్‌ జంగల్‌ జమీన్‌” పేరుతో గిరిజన హక్కుల కోసం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసాడు. అయినా నిజాం ప్రభుత్వం గిరిజనుల సమస్యలు పరిష్కరించక పోగా చర్చల పేరుతో కొము రం భీంను వేధింపులకు గురి చేసింది. చివరికి జోడేఘాట్‌ కేంద్రంగా చేసుకుని గోండుల హక్కుల సాధన కోసం ఉద్యమం మరింత తీవ్రం చేశారు కొమురంభీం. అక్కడికి చేరుకునే పోలీసు, అటవీ శాఖ అధికారులను బంధించి సవాల్‌ విసిరారు. ఈ దశలో జోడేఘాట్‌కు వెళ్లడానికి ప్రభుత్వాధి కారులు భయపడటంతో పరిస్థితి క్షీణిస్తోందని ప్రభుత్వం పలు విధాలుగా ఆలోచించి ఉద్యమ నాయకుడు కొమురంభీంను వదిలించు కోవాలని కుట్ర పన్నింది. కుట్రలో భాగంగానే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దింపింది. జోడేఘాట్‌ నుంచి పోలీసు బలగాలను తిప్పి కొట్టడానికి కొమురంభీం వీరోచితంగా పోరాడారు.

ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు మరియు జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 సెప్టెంబర్ 1 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. అది గిరిజనులు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ద పౌర్ణమి కావడంతో అప్పటి నుండి ఆశ్వీజ మాస పౌర్ణమి నాడు జోడే ఘాట్‌లో గిరిజనులు భీం సంస్మరణ సభలను వర్ధంతిని జరుపుకొంటూ వస్తున్నారు.హక్కుల సాధన కోసం కొమురంభీం గిరిజనులకు పోరాటం నేర్పించి తాను తనువు చాలించారు. ప్రభుత్వ యంత్రాంగం జోడేఘాట్‌లో భీం వర్ధంతికి హాజరువుతూ గిరిజనుల సమస్య లను పరిష్కరించడం జరుగుతోంది. ఒక దశలో అప్పటి పీపుల్స్‌వార్‌ దళాల ఆధ్వర్యంలో భీం వర్ధంతి నిర్వహించడం జరిగింది. భీం నేర్పించిన పోరాటాలతోనే నేడు జిల్లాలో ఆదిమ గిరిజనులు తమ హక్కుల కోసం నడుం బిగించి పోరాటాలు సాగిస్తున్నారు.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

పాశాంకుశ (పాపాంకుశ) ఏకాదశి

                పాశం అంటే యమపాశం, యముడిచేతిలోని చావుతాడు. దాంతోనే…పాపుల్ని నరకానికి లాక్కెళ్లేది. ఈరోజున కనుక ఉపవాసం చేస్తే, ఆ వ్రతఫలం…అంకుశంలా యమ పాశాన్ని అడ్డుకుంటుందట! సమవర్తి అయిన యముడు కూడా ఏకాదశి వ్రతం చేసినవారి పట్ల కరుణ చూపుతాడట. తరువాత వచ్చే పున్నమి కూడా శ్రేష్ఠమైందే! ఈరోజు ‘కోజాగరీ వ్రతం’ చేస్తారు. కోజాగర్‌…మేలుకున్నదెవరు? – అని ఈ మాటకు అర్థం. అంటే, ఎవరెవరు జాగరణ చేశారో వాకబు చేసి మరీ లక్ష్మీదేవి కటాక్షిస్తుంది! నాటి రాత్రి పాచికలాడటం సంప్రదాయం. పండగల్లోని పరమార్థాన్ని తెలుసుకోగలిగితే…అదే వేయి వికాస గ్రంథాలకు సమానం. ఒక వ్రతం ఉపవాసం ద్వారా జిహ్వచాపల్యాన్ని ఓడించమని సూచిస్తుంది. మరో వ్రతం జాగరణ ద్వారా నిద్ర అనే బలహీనతను అధిగమించమని హెచ్చరిస్తుంది. పాచికలు ఆడమంటే, వ్యసనానికి బలైపోయి ఆస్తుల్ని తెగనమ్ముకోమని ప్రోత్సహించడం కాదు. పాండవులు జూదమాడి ఎన్ని కష్టాల్ని కొనితెచ్చుకున్నారో, ఆ ఒక్క దురలవాటు కారణంగా ధర్మరాజు అంతటివాడి వ్యక్తిత్వానికి ఎన్నెన్ని మరకలు

పడ్డాయో గుర్తుచేసుకోడానికి ఈ సమయం, చక్కని సందర్భం.

ఆశ్వీయుజమాసం శుక్లపక్షంలో వచ్చే పాశాంకుశ ఏకాదశి మాహాత్మ్యము శ్రీకృష్ణధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మ వైవర్త పురాణమునందు వర్ణించబడింది. ఆశ్వీయుజ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు, దాని వివరాలు తెలుపుమని ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగినపుడు ఆ దేవదేవుడు ఈ విధంగా పలికాడు.

ఓ రాజశ్రేష్ఠా! ఆ ఏకాదశి పేరు పాశాంకుశ ఏకాదశి. మనిషి యొక్క సమస్తమగు పాపములను నశింపజేసే ఆ ఏకాదశి మాహాత్మ్యాన్ని వివరిస్తాను విను. కొందరు దీనిని పాపాంకుశ ఏకాదశి అని కూడ పిలుస్తారు. ఆ రోజు ముఖ్యంగా పద్మనాభుని అర్చించాలి. ఆ ఏకాదశి జీవునికి స్వర్గసుఖాలను, మోక్షాన్ని, వాంఛితఫలాలను ఒసగుతుంది. విష్ణు నామోచ్చారణము చేత మనిషి ధరిత్రి పైన సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యాన్ని పొందగలుగుతాడు. బద్ధజీవుడు మోహవశముచే నానారకాలైన పాపకర్మలను చేయక పతితజీవులను ఉద్ధరించే శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించి వాటికి నమస్కరించినచో నరకమున పడకుండును.”

శివుని విమర్శించే వైష్ణవులు, విష్ణువును విమర్శించే శైవులు నిస్సందేహముగా నరకములో కూలుతారు. శతాశ్వమేధ యజ్ఞఫలము కాని, శత రాజసూయ యజ్ఞఫలము కాని ఈ ఏకాదశి పాలన వలన సంప్రాప్తించే పుణ్యానికి ఒక వంతు పోలవు. ఈ ఏకాదశిని పాటించడము వలన కలిగే పుణ్యానికి సమానమైన పుణ్యము ఈ జగత్తులో లేనేలేదు. కనుక పద్మనాభునికి పరమప్రియమైన ఈ ఏకాదశి యంతటి పవిత్రమైన దినము వేరొకటి లేదు.”

రాజా! ఏకాదశి నియమపాలనలో విఫలుడైనవాని దేహములో పాపాలు నివాసము చేస్తాయి. ఈ ప్రత్యేకమైన ఏకాదశిని పాటించేవాడు స్వర్గసౌఖ్యాలను, మోక్షాన్ని, రోగవిముక్తిని, సుందరమైన పత్నిని, ధనధాన్యాదులను పొందుతాడు. ఈ ఏకాదశిని పాటించి రాత్రి మొత్తము మేల్కొనియుండువాడు సులభంగా విష్ణులోకానికి చేరుకుంటాడు.”

ఓ రాజోత్తమా! ఈ ఏకాదశిని పాలనము చేయడము ద్వారా మనిషి తన తల్లి వైపు పది తరాలను, తండ్రి వైపు పది తరాలను, భార్య వైపు పది తరాలను ఉద్ధరించగలుగుతాడు. బాల్యము నందు గాని, యౌవనము నందు గాని, వృద్ధాప్యమునందు గాని ఈ ఏకాదశిని పాటించినవాడు. సంసారక్లేశములను అనుభవింపడు. ఈ పాశాంకుశ లేదా పాపాంకుశ ఏకాదశిని నిష్టగా పాటించేవాడు సమస్త పాపవిముక్తుడై జీవితాంతమున విష్ణుపదాన్ని చేరుకుంటాడు. బంగారమును, నువ్వులను, భూమిని, గోవులను, ధాన్యమును, జలమును, గొడుగును, పాదరక్షలను దానమిచ్చినవాడు యమసదనానికి వెళ్ళవలసిన పని ఉండదు. పుణ్యాచరణము లేకుండ ఆ రోజును గడిపివేసేవాడు శ్వాసించుచున్నప్పటికిని మృతుడే అనబడతాడు. అతని శ్వాసక్రియ కొలిమి తిత్తులతో పోల్చబడుతుంది.”

రాజా! ఇతరుల లాభము కొరకు చెఱువులను, బావులను త్రవ్వించేవాడు, నేలను గృహాలను దానమిచ్చేవాడు. యజ్ఞయాగాది కర్మలను చేసేవాడు యముని దండనకు గురికాడు. పుణ్యఫలము వలననే మానవులు దీర్ఘకాలము జీవిస్తారు, రోగదూరులౌతారు. సారాంశమేమంటే ఈ ఏకాదశి పాలనము వలన కలిగే ప్రత్యక్షఫలము దేవదేవుని భక్తియుత సేవ; కాగా భౌతికలాభములు పరోక్ష ఫలములై యున్నవి.”.

(ముఖ్యసూచన : ఏకాదశిరోజు బ్రహ్మహత్యాపాతకము లేదా గోహత్యాపాతకము వంటి ఘోరమైన పాపాలు ఐదురకాలైన ధాన్యాలను ఆశ్రయిస్తాయి. కనుక చరమలాభాన్ని పొందగోరే శ్రద్ధావంతులు ఆ రోజు వాటిని భుజించరాదు. 1) బియ్యము, బియ్యము నుండి తయారైనట్టి పిండి, అటుకులు, పేలాలు వంటివి, 2) గోధుమపిండి, మైదాపిండి, రవ్వ 3) బార్లీ వంటివి, 4) పెసరపప్పు, కందిపప్పు వంటి పప్పుదినుసులు, బఠానీలు వంటివి, 5) ఆవాలు, నువ్వులు, వాటి నుండి తీసే నూనె అనేవే ఆ ఐదురకాల నిషిద్ధధాన్యాలు. వీటిని తింటే ఏకాదశి వ్రతభంగము జరిగినట్లు అవుతుంది. పాలుపండ్లతో ఉపవాసము చేయడము శ్రేష్ఠము, ద్వాదశిరోజున ధాన్యముతో వండిన ప్రసాదముతో పారణచేయడం ద్వారా ఏకాదశి వ్రతము పూర్తవుతుంది.)

           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)