Categories
Vipra Foundation

ఇందిర ఏకాదశి

“ఏకాదశి వ్రతం నామ సర్వకామఫలప్రదం | కర్తవ్యం సర్వదా విప్రైర్ విష్ణు ప్రీణనకారణం ॥”

       ఇందిర ఏకాదశి మహిమ శ్రీకృష్ణధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మ వైవర్త పురాణంలో వర్ణించబడింది.

ఒకసారి ధర్మరాజు దేవదేవునితో “ఓ కృష్ణా! మధుసూదనా! భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి పాలనకు ఉన్నట్టి నియమనిబంధనలు ఏమిటి? ఆ వ్రతపాలన వలన కలిగే లాభమేమిటి?” అని ప్రశ్నించాడు.

ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు: “ఈ ఏకాదశి పేరు. ఇందిర ఏకాదశి. దీనిని పాటించడము ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు. అంతే కాకుండ అతని సమస్త పాపాలు నశిస్తాయి.”  

“రాజా! సత్యయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు. తన శత్రువులను అణచడంలో నేర్పరియైన ఆ రాజు మాహిష్మతీ పురాన్ని చక్కగా పాలించేవాడు. పుత్రపౌత్రులతో గూడి అతడు ఎంతో సుఖంగా జీవించాడు. అతడు సర్వదా విష్ణుభక్తిరతుడై ఉండేవాడు. ఆధ్యాత్మికజ్ఞానంలో నిరంతర లగ్నమై యుండెడి భక్తుడైన కారణంగా ఆ రాజు ముక్తినొసగెడి గోవిందుని నామస్మరణలోనే తన కాలాన్ని గడిపేవాడు.”

“ఒకనాడు ఆ రాజు తన రాజ్యసింహాసనంపై కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు. నారదమునిని చూడగానే ఆ రాజు లేచి నిలబడి, చేతులు జోడ్చి వినమ్రంగా వందనము కావించాడు. తరువాత షోడశోపచార పూజ కావించి మునిని సుఖాసీనుని కావింపజేసాడు. అపుడు నారదుడు ఇంద్రసేనునితో “రాజా! నీ రాజ్యంలో అందరూ సుఖసమృద్ధులతో ఉన్నారా? నీ మనస్సు ధర్మపాలనలో లగ్నమై ఉన్నదా? నీవు విష్ణుభక్తిలో నెలకొని ఉన్నావా?” అని ప్రశ్నించాడు.”

దానికి ప్రత్యుత్తరంగా ఇంద్రసేనుడు నారదునితో “ఓ మునివర్యా! మీ దయ వలన అంతా బాగానే ఉన్నది, మంగళమయంగానే ఉన్నది. నేడు మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది, నాకు యజ్ఞఫలం లభించింది. ఓ దేవర్షీ! మీ రాకకు కారణమేమిటో చెప్పవలసినది” అని అన్నాడు.

రాజు మాటలను వినిన తరువాత నారదుడు అతనితో ఇలా అన్నాడు: ఓ రాజశార్దూలమా! నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటనను చెబుతాను విను. ఓ రాజేంద్రా! నేనొకసారి బ్రహ్మలోకం నుండి యమరాజు యొక్క లోకానికి వెళ్ళాను. యమరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించాడు. నేను కూడ అతనిని స్తుతించాను. అక్కడ యమలోకంలో మహాపుణ్యభాగుడైన నీ తండ్రిని నేను చూసాను. వ్రతోల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడకు వెళ్ళవలసివచ్చింది. రాజా! అతడు ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెలపమని అర్థించాడు. అతడు నాతో ఇలా అన్నాడు – “మాహిష్మతీ పురాధీశుడైన ఇంద్రసేనుడు నా పుత్రుడు. పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వలన నేనిపుడు యమసదనంలో ఉన్నాను. కనుక నా పుత్రుడు ఇందిర ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి. అపుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలను.”

“కనుక ఓ రాజా! నీ తండ్రిని ఆధ్యాత్మికలోకానికి పంపడానికై నీవు ఇందిర ఏకాదశి వ్రతాన్ని చేపట్టు” అని నారదుడు తాను తెచ్చిన సందేశాన్ని చెప్పాడు. అపుడు ఇంద్రసేనుడు ఇందిర ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతిని గురించి తెలుపుమని నారదుని అర్థించాడు.

ప్రతవిధానాన్ని శ్రీనారదుడు ఇలా వివరించాడు “ఏకాదశి ముందు రోజు మనుజుడు తెల్లవారుఝామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ రోజు అతడు ఒక్క పూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి. మర్నాడు ఏకాదశిరోజు మళ్ళీ తెల్లవారు ఝామునే మేల్కొని దంతధావనము, హస్తముఖప్రక్షాళనము చేసికొని చక్కగా స్నానం చేయాలి. తరువాత ఎటువంటి భౌతికభోగంలో పాల్గొననని వ్రతనియమం చేపట్టి రోజంతా ఉపవసించాలి. ఓ పద్మనేత్రుడా! నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను” అని పలికి భగవంతుని స్తుతించాలి.

“తరువాత మధ్యాహ్నవేళ సాలగ్రామశిల ఎదురుగా విధిపూర్వకముగా పితృతర్పణాలు చేయాలి. తదనంతరము బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తి పరచాలి. పితృతర్పణ కార్యంలో మిగిలిన పదార్థాలను గోవులకు పెట్టాలి. ఆ రోజు అతడు చందన పుష్ప ధూపదీప నైవేద్యాలతో హృషీకేశుని అర్చించాలి. శ్రీకృష్ణుని నామరూపగుణ లీలాదుల శ్రవణకీర్తనలతో, స్మరణముతో అతడు ఆ రాత్రి జాగరణ చేయాలి. మర్నాడు అతడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. తదనంతరము అతడు సోదరులు, పుత్రపాత్రులు, బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రతపారణము చేస్తూ భోజనం చేయాలి. రాజా! ఈ విధంగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణులోకానికి వెళతాడు.”

నారదుడు ఈ విధంగా ఉపదేశించి అంతర్హితుడయ్యాడు. తరువాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారమే సంతానము, బంధువులు, మిత్రులతో గూడి నిష్టగా ఇందిర ఏకాదశిని పాటించాడు. ఆ వ్రతమహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. ఇంద్రసేనుని తండ్రి గరుడవాహనారూఢుడై విష్ణుపదాన్ని చేరుకున్నాడు. తరువాత రాజర్షియైన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలనము చేసి, చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. ఇందిర ఏకాదశి మహిమే ఇటువంటిది. ఈ ఇందిర ఏకాదశి మహిమను చదివేవాడు, వినేవాడు సమస్త పాపముక్తుడై చివరకు విష్ణుపదాన్ని చేరుకుంటాడు.

– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

బొడ్డెమ్మ పండగ

తెలంగాణకే పరిమితమైన రెండు పండుగలు ‘బతుకమ్మ’, ‘బొడ్డెమ్మ’. ఈ రెండింటిలో బతుకమ్మ పెద్దల పండుగైతే, బొడ్డెమ్మ పిల్లల పండుగ. మనం ప్రకృతి పురుషులను స్త్రీ శక్తి సమాహారంగా భావిస్తూ, శక్తి స్వరూపిణిని ఎన్నో విధాలుగా పూజిస్తాం. త్రికోణం, త్రిభుజం శక్తి రూపంగా కొలిచే విధానం ‘బొడ్డెమ్మ’లో కనిపిస్తుంది. బతుకమ్మపండుగకు సరిగ్గా తొమ్మిది రోజుల ముందు అంటే భాద్రపద బహుళ  అమావాస్య (మహాలయ) ముందు ప్రారంబమై ఈ తొమ్మిది రోజులు బొడ్డెమ్మను పూజించి, ఆడి పాడి తొమ్మిదవ రోజున అంటే మహాలయ అమావాస్య రోజున నిమజ్జనం చేస్తరు. మహాలయ అమావాస్య నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు బతుకమ్మను జరుపుకుంటరు. ‘బొడ్డెమ్మ’ అనే పేరుకు ‘బొట్టె’, బొడిప’, పొట్టి అనే పర్యాయ పదాలు ఉన్నాయి. ‘బొడ్డ’ అనే పదానికి ‘అత్తిచెట్టు’ అనే మరో అర్థం కూడా ఉంది. దీన్నే మేడిచెట్టు, ఉదంబర చెట్టు అనీ పిలుస్తారు. సాధారణంగా సంతానం కల్గాలని, వివాహం కుదరాలని ఉదంబరాన్ని పూజిస్తుంటారు. ఆపరంగా ప్రకృతిని కూర్చి ఈ ఉదంబర/మేడి పూజనే ‘బొడ్డపూజ’గా మారి ప్రచారం పొందిందని అనుకోవచ్చు.

బొడ్డెమ్మ ఆటపాటలను ‘గర్భో’ నృత్యంతో పోల్చవచ్చు. ‘గర్భో’ అంటే ‘గొబ్బి’ అని ఒక అభివూపాయం. గొబ్బిరీతిలో బొడ్డెమ్మ కూడా కన్నెపిల్లలు, పిల్లలతో పూజలందుకుంటుంది. అంతేకాదు, గిరిజనులు నిర్వహించే పండగలలో ‘కన్నెపిల్లలు, బాలికలు ఎంతో సంబురంగా తమ పెళ్లి ఘనంగా, మంచిగా జరగాలని కొలిచే పండగ ‘థీజ్ పండగ’. ఈ పండగను కూడా తొమ్మిది రోజులు (ఇంచుమించు) కన్నెలు నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజులు సాయంకాలం ఆడి పాడుతుంటారు. థీజ్ పండగకు బొడ్డెమ్మ, బతుకమ్మ పండగలకు కూడా పోలిక ఉందని చెప్పవచ్చు.

బొడ్డెమ్మ ఆటల్లో, పాటల్లో మన సంస్కృతి స్పష్టమవుతుంది. కన్నెపిల్లలు చక్కగా ముస్తాబై ఎంతో ఉత్సాహంగా ఒకచోట చేరడం వల్ల మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు అర్థమవుతాయి. పెద్దవారు పూజించిన రీతిలో వారు కూడా గౌరీపూజ చేసి తమకు మంచి జరగాలని వేడుకుంటారు. మంచి భర్త రావాలని కూడా మొక్కుకుంటారు. జట్టుగా మసలుకోవడం నేర్చుకుంటారు. పెద్దవారి నుండి తాము నేర్చుకున్న పాటలను లయబద్ధంగా పాడుకుంటారు. ఈ ఆట పాటలను ఒకరి నుండి ఒకరు అంది పుచ్చుకుంటారు. ఈ పాటలు జానపదుల, పల్లెవూపజల జీవన విధానాలను, ఆచార వ్యవహారాలను, సంస్కృతిని, పురాణకథలను, నిత్య జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలను కళ్లకు గట్టినట్లుగా చూపిస్తాయి. వింటూ ఉంటే ఈ పాటలన్నీ చిన్ననాడు తాము పాడినవే అన్నట్టుగా అనిపిస్తాయి.

బొడ్డెమ్మను తయారు చేసుకునే విధానాన్ని బట్టి నాలుగు రకాలుగా చెప్పుకుంటారు.

1. పీట బొడ్డెమ్మ 2. గుంట బొడ్డెమ్మ 3. పందిరి బొడ్డెమ్మ 4. బాయి బొడ్డెమ్మ

1. పీట బొడ్డెమ్మ :- పీట బొడ్డెమ్మను చెక్కపీటపై పుట్టమన్నుతో చేస్తరు. పీట మీద పుట్టమన్నుతో ఐదు దొంతరులుగా గుండ్రంగా పేర్చి ఒకటి త్రిభుజాకారంతో గోపురంగా వేస్తారు పైన కలశాన్ని పెట్టడం ‘పీట బొడ్డెమ్మ’  ప్రత్యేకత.. చెక్కపీటపై నాలుగువైపుల నాలుగు మట్టి ముద్దలను పెట్టి, వాటిని బొడ్డెమ్మ బిడ్డలని పిలుస్తారు. ఈ త్రికోణ శిఖరంపై కొన్ని చోట్ల వెంపలి చెట్టును పూజిస్తారు. మరికొన్ని చోట్ల బియ్యంతో నింపిన కలశం చెంబును దానిపై శిఖరభాగాన ఉంచి కొత్త రవికె బట్ట, అందులో రెండు తమలపాకులు, వాటిలో ‘పసుపు గౌరమ్మ’ను ఉంచుతారు. పీటను ముగ్గులతో అలంకరిస్తారు. గౌరమ్మను పూలు, పసుపు కుంకుమలతో కలశాన్ని, బొడ్డెమ్మను రంగురంగుల పూలతో కొలుస్తారు. ఈ విధంగా చేసిన బొడ్డెమ్మ చుట్టు తిరుగుతూ సాయంకాలం వేళ ఆట ఆడి దేవుని ముందు పెడతారు. చివరిరోజు పీట మీద నుండి బొడ్డెమ్మను తొలగించి నీటిలో నిమజ్జనం చేస్తరు.

2. గుంట బొడ్డెమ్మ :- గుంటల రూపంలో ఉండే బొడ్డెమ్మను ‘గుంట బొడ్డెమ్మ’ అంటరు. మనిషి అడుగు పడని చోట ఒక గుంటను తవ్వి, దాని చుట్టూరా ఐదు చిన్న గుంతలను తవ్వుతరు. ఈ గుంతలన్నింటినీ పూలతో అలంకరిస్తరు. ప్రతి మధ్య గుంటలోని పూలను తీయకుండా చిన్న గుంటల్లోని పూలను మాత్రం తీసి ఒక పాత్రలో పెట్టి నీటిలో వేస్తరు. దీనినే ‘అంపుట’  అంటరు.

3.పందిరి బొడ్డెమ్మ :- పుట్టమన్నుతో బొడ్డెమ్మను చేస్తరు. ఇంటి ముందు చిన్న పందిరి వేసి దాన్ని సీతాఫలం ఆకులతో కప్పుతరు. ఆ పందిరి క్రింద పేడతో అలికి ముగ్గులు వేస్తరు. పందిరి మధ్య నుండి ఒక సీతాఫలాన్ని, ఒక మొక్కజొన్న కంకిని దారాలతో కట్టి కిందికి వేలాడదీస్తరు. వాటి కింద ముగ్గుల మధ్య బొడ్డెమ్మను అలంకరించి పెడతరు. కొన్ని పూలు చల్లి పసుపు గౌరమ్మను బొడ్డెమ్మ పక్కన అమర్చుతరు. ఆ విధంగా పందిరి కింద నిల్పడం వల్ల దీన్ని ‘పందిరి బొడ్డెమ్మ’ అని పిలుస్తరు. ఈ పందిరి బొడ్డెమ్మను పూజించి, ఆడి పాడి తొమ్మిదవ రోజున నిమజ్జనం చేస్తరు.

4. బాయి బొడ్డెమ్మ :- బావిలాగా గొయ్యి తయారు చేసే బొడ్డెమ్మను ‘బాయి బొడ్డెమ్మ’ అని అంటరు. బావిలాగా ఒక చిన్న గొయ్యిని తవ్వి మట్టిని తీసి, అదే మట్టితో ముద్దలు చేస్తరు. నాలుగు ముద్దల చొప్పున బావికి నాలుగు వైపుల పెడతరు. ఆ బావి మధ్య ఒక వెంపలి చెట్టు నాటుతరు. చుట్టూ ఉన్న గద్దెలపై పువ్వులు వేసి పూజిస్తరు. చివరిరోజు ఈ పూలన్నింటినీ నీటిలో నిమజ్జనం చేస్తరు.

 బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో

నీ బిడ్డ నీలగౌరు ఉయ్యాలో నిచ్చమల్లె చెట్టెసె ఉయ్యాలో

చెట్టుకు చెంబెడు ఉయ్యాలో నీళ్లయినా పోసె ఉయ్యాలో

కాయలు పిందెలు ఉయ్యాలో గనమై ఎగిసె ఉయ్యాలో

ఒక్కేసి పూవేసి చందమామ ఒక్క ఝాము ఆయె చందమామ

ఒక్క ఝాము ఆయె చందమామ శివపూజ వేళాయె చందమామ

శివపూజ వేళాయె చందమామ శివుడింక రాడాయె చందమామ

రెండేసి పూలేసి చందమామ రెండు ఝాములాయె చందమామ

రెండు ఝాములాయె చందమామ శివపూజ వేళాయె చందమామ

శివపూజ వేళాయె చందమామ శివుడింక రాడాయె చందమామ

-తెలంగాణ ప్రాంతంలో ఈ పాటను తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు.

-బొడ్డెమ్మ బిడ్డ నీలగౌరు మల్లె చెట్టును నాటిందట. దానికి కాయలు పిందెలు కాసాయట. ఈ పాటను ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రీతుల్లో పాడుతుంటారు. శివుని భార్యయైన గౌరమ్మను తమ ఆడ బిడ్డగా భావిస్తూ, ఆమె శివుని సన్నిధికి చేరినట్లుగా పాడుకుంటారు.

తమకు వివాహం కావాలని గౌరిని ప్రార్థించినట్లు కింది పాటలో చూడవచ్చు:

మాలుమర్తి మేడ మీద చందమామ వెండియ్య వెనగరలు చందమామ

వెండియ్య వెనగరలకు చందమామ ఇత్తడియ్య చేరెలు చందమామ

ఇత్తడియ్య చేరెలకు చందమామ రాగియ్య కవడలు చందమామ

– అంటూ సాగే ఈ పాటలో తమకు వివాహం కావాలని గౌరిని ప్రార్థించినట్లు పాడుకుంటారు.

ఇలా ఆటపాటలతో సాగిన బొడ్డెమ్మ పండగ తొమ్మిదవ రోజున బొడ్డెమ్మను నిమజ్జనం చేయడంతో ముగుస్తుంది. గౌరమ్మకు ప్రతీకగా భావిస్తూ బొడ్డెమ్మను సాగనంపుతూ జోల పాడటం విశేషం.

నిద్రపో బొడ్డెమ్మా –నివూదపోవమ్మా

నిద్రకు నూరేండ్లు – నీకు వెయ్యేండ్లు

పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యేండ్లు,

నినుగన్న తల్లికి నిండు నూరేండ్లు

నిద్రపో బొడ్డెమ్మా –నివూదపోవమ్మా

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కాళోజీ నారాయణరావు జయంతి (తెలంగాణ భాషా దినోత్సవం)

మానవులు పుడతారు … చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు … వీరిని “మృతంజీవులు” అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ -, కాళోజీ నారాయణరావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ….

తెలంగాణ తొలిపొద్దు కాళోజీ!-‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యా యం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం, బిజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించిన కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్న డ, ఇంగ్లిష్ భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారు. రాజ కీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి. బిజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది.

ప్రాథమిక విద్యానంతరం హైదరాబాద్ పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజ్లోనూ, హనుమకొండలోని కాలేజియేట్ హైస్కూల్లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. 1939లో హైదరాబాద్లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించారు. నిజామాంధ్ర మహా సభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్తో కాళోజీ అనుబంధం విడదీయరానిది.

మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామ్కిషన్రావు, పీవీ నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ సామాన్యుడే నా దేవుడని ప్రకటించిన కాళోజీ 2002 నవంబర్ 13న తుదిశ్వాస విడిచారు

అనితర సాధ్యం కాళోజీ మార్గం – పి.వి.నర్సింహారావు

‘ఒక ప్రధానిగా ఎన్నో ఒడిదొడుకుల్ని సునాయసంగా ఎదుర్కొన్నాను. ఎన్ని సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాను. ప్రపంచాధినేతలను చూసి కూడా కించిత్తు జంకలేదు. ఆ భగవంతునికి కూడా భయపడను కానీ కాళోజీ నారాయణరావు చూస్తే వణికిపోతాను’ అని పి.వి.నర్సింహారావు కాళోజీ సంస్మరణ సభలో అన్న మాటలు ఆయనను ప్రేమించే అందరికీ వర్తిస్తాయి.

తెలంగాణకు జరిగిన అన్యాయాల్ని శాసనమండలిలో ధైర్యంగా బయటపెట్టగలిగినవాడు కాళోజీ నారాయణరావు. తెలంగాణలో ఉన్న ఫ్యూడల్ వ్యవస్థను కూల్చడానికి మహత్తర సాయుధ పోరాటమే జరిగింది. ఆంధ్ర మహాసభ చైతన్య దివిటీలను అందించింది. ఈ ఫ్యూడల్ వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలించటానికి ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులు ‘విశాలాంధ్ర’సునాయాసన మార్గంగా భావించారు. విశాలాంధ్ర వస్తే ఫ్యూడల్ వ్యవస్థ పోతుందన్న భావనతో వాళ్లు ఒప్పుకున్నారు. మొత్తం ఆలోచనాపరులు అలాగే ఆలోచించారు. విశాలాంధ్ర వస్తే ఏం జరుగుతుందని ఆశించారు. అందుకు భిన్నంగా వాతావరణం మారింది. తెలంగాణలో పాతదొరలు పోయి ఆధునిక దొరలు ఆవిర్భవించారు. అందువల్లనే తెలంగాణ ఆగ్రహించింది. 1956 నుంచి మూడేళ్లలోనే మారిన పరిస్థితులు చూసిన ప్రజలు 1969 ఉద్యమ అగ్గి అయి భగ్గున మండారు. సమస్త తెలంగాణ ప్రజానీకం విశాలాంధ్ర జెండా వదిలిపెట్టి తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఎత్తుకుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయటం వల్లనే దీర్ఘయావూతగా రాష్ట్ర సాధన ఉద్యమం కొనసాగుతూ వచ్చింది.

తెలంగాణ నేల నుంచి పెండ్యాల రాఘవరావులాంటి ఉన్నతులు ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు. భీమిడ్డి నర్సింహాడ్డి, మగ్ధూం, రావి నారాయణడ్డి, ఆరుట్ల రాంచంవూదాడ్డి, నర్రా రాఘవడ్డి, ఉప్పల మనుసూరులాంటి వాళ్లు శాసనసభ్యులుగా వచ్చారు. ఎమ్మెల్యేగా పనిచేసి కూడా చెప్పులు కుట్టుకుంటూ సాధారణ జీవితం గడుపుతూ చరివూతలో ఉన్నతస్థానాలను అలంకరించిన ఉప్పల మనుసూరులాంటి మహానీయులు, ధర్మభిక్షం లాంటి ప్రజల మనుషులు పార్లమెంటు, శాసనసభ్యులుగా ఎంపికవుతూ వచ్చారు. ప్రజల హృదయాలను ఆవిష్కరించిన జననేతలే ఇక్కడ ప్రజావూపతినిధులుగా ఎన్నికవుతూ వచ్చారు.

ఇద్దరు అన్నదమ్ములు కాళోజీ రామేశ్వరావును, కాళోజీ నారాయణరావులను విడిగా చూడలేం. కాళోజీ ప్రతిష్ఠలో రామేశ్వరరావు కృషి ఉంది. న్యాయవాది తాండ్ర వెంకవూటామ దగ్గర కాళోజీ ప్రాక్టీసు చేశారు. తమతో విభేదించే వారిని కూడా అక్కన చేర్చుకునే మనస్తత్త్వం తెలంగాణ ప్రజలకుంది. నాందేడ్కు చెందిన బి.టి. దేశ్పాండేను, ఆంధ్ర ప్రాంతానికి చెందిన రామకృష్ణారావును చెన్నూరు ఎమ్మెల్యేగా తెలంగాణ నేల ఆలింగనం చేసుకుంది. తెలంగాణ ప్రాంతం వారికి ప్రాంతీయ భేదాలు లేవు. ఇక్కడ ఇతర ప్రాంతాలవాళ్లు ఎంపీ లు, ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణవాళ్లను ఎవరినైనా ప్రజావూపతినిధులుగా ఎన్నుకున్నారా? తెలంగాణ ప్రజలకు ప్రాంతీయతత్త్వం ఉందని కొందరు చేస్తున్న ఆరోపణలు దుర్మార్గమైనవి. ఇది తెలంగాణపై మార్కెట్ సమాజం చేస్తున్న కుట్రలుగా భావించాలి. ప్రాంతీయతత్త్వంలేని విశ్వనరులు తెలంగాణ ప్రజలు.

  • వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)