Categories
Vipra Foundation

దుర్గామాత ఆరవ స్వరూపం ‘కాత్యాయని’ (లక్ష్మి)

 శ్లో|| చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।  కాత్యాతనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ॥

దుర్గామాత ఆరవ స్వరూపం ‘కాత్యాయని’. పూర్వం ‘కత’ అనే పేరుగల ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు ‘కాత్య’  మహర్షి. ఈ కాత్యగోత్రజుడే విశ్వవిఖ్యాతుడైన ‘కాత్యాయన’  మహర్షి. ఇతడు ‘పరాంబా’  దేవిని ఉపాసిస్తూ, ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరించాడు. భగవతీదేవి లేదా దుర్గాదేవి పుత్రికగా తన ఇంట జన్మించాలని అతని కోరిక. భగవతీ మాత ఆయన ప్రార్థనను అంగీకరిస్తుంది. కొంతకాలం తరువాత ‘మహిషాసురుడు’  అనే రాక్షసుని అత్యాచారాలతో భూలోకం పెచ్చరిల్లిపోతుంది. ఈ మహిషాసురుని సంహరించడానికై బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశలతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్ట మొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజిస్తారు. అందువలన ఈమె ‘కాత్యాయని’  అని ప్రసిద్ధికెక్కింది.

ఈమె ‘కాత్యాయన’  మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని మరి ఒక కథ. ఈమె అమాంత భాద్రపద బహుళ చతుర్దశినాడు జన్మించింది (ఉత్తర భారత పౌర్ణిమాంత పంచాంగ సంప్రదాయమును బట్టి ఇది ఆశ్వీయుజ శుద్ధ చతుర్దశి). ఈమె ఆశ్వీయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించింది.

కాత్యాయనీదేవి అమోఘఫలదాయిని. కృష్ణుడిని పతిగా పొందటానికి గోకులంలో గోపికలందరూ యమునానదీ తీరాన ఈమెనే పూజించారని భాగవతం చెబుతుంది. ఈమె గోకులానికి అధిష్ఠాత్రిగా వెలిసినది. ఈమె స్వరూపము దివ్యమూ, భవ్యమూ. ఈమె శరీరకాంతి బంగారు వన్నెతో తళతళ మెరుస్తూ ఉంటుంది. ఈమె నాలుగు భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈమె కుడిచేతులలో ఒకటి అభయముద్రనూ, మరొకటి వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈమె ఒక ఎడమ చేతిలో ఖడ్గమూ, మరొక ఎడమ చేతిలో పద్మమూ శోభిల్లుతూ ఉంటాయి. సింహవాహన.

దుర్గా నవ రాత్రులలో ఆరవరోజున కాత్యాయనీ స్వరూపం పూజింపబడుతుంది. ఆ దినాన సాధకుడి మనస్సు ఆజ్ఞా చక్రంలో స్థిరమవుతుంది. యోగసాధనలో ఈ ఆజ్ఞా చక్రం యొక్క స్థానం ప్రముఖమైనది. ఈ చక్రంపై స్థిర మనస్సుగల సాధకుడు తన సర్వస్వమును కాత్యాయనీ దేవి చరణాలలో సమర్పిస్తాడు. పరిపూర్ణంగా ఆత్మసమర్పణము చేసిన భక్తుడికి సహజంగానే కాత్యాయనీ మాత దర్శనం లభిస్తుంది. ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మ, అర్థ, కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థముల ఫలములు లభిస్తాయి. అతడు ఈ లోకంలో అలౌకిక తేజస్సులను, ప్రభావములను పొందగలడు. రోగములు, శోకములు, సంతాపములు, భయము మొదలైనవి అతడినుండి సర్వదా దూరమవుతాయి. జన్మజన్మాంతరాల పాపాలు నశించటానికి ఈ దేవి ఉపాసనకంటె సులభమైనా, సరళమైన మార్గం మరొకటి లేదు. ఈమెను ఆరాధించేవారు నిరంతరం ఈమె సాన్నిధ్యం నుండీ, పిమ్మట పరమపదప్రాప్తికీ అర్హులవుతారు. కాబట్టి మనము అన్ని విధాలా ఈ తల్లిని శరణుజొచ్చి, ఈమె పూజలందూ, ఉపాసనయందూ తత్పరులము కావాలి.

తెలుపు రంగు, నైవేద్యం : రవ్వ కేసరి

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

సరస్వతీ పూజ

     నరుడు నారాయణుడుగా ఎదగడానికి, మానవుడు మాధవుడుగా మారడానికి మహాసరస్వతీ ఉపాసన ఒక్కటే మార్గం. అందుకే ఈ శరన్నవరాత్రులల్లో సప్తమి మూలా నక్షత్రం రోజున ఆరాధింపబడే ‘దుర్గ ‘ యొక్క మహాకాళీ, మహా లక్ష్మీ, మహా సరస్వతీ రూపాల్లో మహా సరస్వతీ రూపాన్ని ‘శారద’  గా భావించి ఆరాధిస్తాం.

మూలానక్షత్రం ధనూరాశిలో ఉంటుంది. ఆ రాశికి అధిపతి గురుడు. గురుడు విద్యాకారకుడు, ధన కుటుంబకారకుడు. మూలానక్షత్రానికి అధిపతి కేతువు. కేతువు ఊర్థ్వముఖుడు. సంఖ్యామాన శాస్త్రం ప్రకారం, ఏడు అంకె కేతువుకు చిహ్నం. నవరాత్రి ఉత్సవములలో ప్రధానమైనది- సప్తమి తిథిపూజ, ఆ సరస్వతీ దేవిని గూర్చి బ్రహ్మవైవర్త పురాణం రాధదేవి నాలుక కొననుంచి శే్వతవస్త్ధ్రారిణి, పుస్తకాన్ని, వీణను చేతిన పట్టుకొని, సర్వాలంకార భూషితయై ఉద్భవించిన దేవియే మహాసరస్వతీ దేవి అంది. ఆ తల్లినే శారద.

       తెల్లని హంసవాహనంలో పద్మాసనస్థితయై, శే్వతాంబరధారియై, వీణాపాణియై అలరారే ఈ తల్లి పుస్తక, అభయ, స్ఫటికమాల ధరించిన చతుర్భుజ. విద్యామణి. మనిషిలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతి. ఆ పరమేశ్వరి బుద్ధి ప్రదాత, సర్వసిద్ధి దాత కనుక ప్రతివారు జ్ఞాన విద్యా బుద్ధులకై ‘‘వందే తాం పరమేశ్వరీం భగవతీం, బుద్ధి ప్రదాం శారదామ్” అంటూ ప్రార్థిస్తారు. ఈ తల్లి అనుగ్రహం ఉంటే చాలు సర్వవిద్యలూ కరతలామలకం అవుతాయ కనుక ‘అ’ కారాది ‘క్ష’ కారాంత వర్ణములతో వచ్చే గద్య పద్య వచన రూపాలల్లో ఏ దేవత కొలువైవుందో ఆ దేవతనే సరస్వతి అని ఆదిశంకరాచార్యులూ స్తుతించారు. యాజ్ఞవల్క్యుడు, వశిష్ఠుడు వాణీస్తోత్రం, వశిష్ఠ స్తోత్రాల్లో ఈ తల్లి ని ఏవిధంగా పూజించాలో వివరించారు.

            సరస్వతీ దేవియే శారదయై సర్వవిద్యలనూ ఎలా ప్రసాదించి మానవులను ఎలా పవిత్రులను చేస్తుందో అదేవిధంగా అన్నపూర్ణయై అన్నంపెడుతుంది. ఈతల్లే జ్ఞానం చేత భవసాగరాన్ని దాటిస్తుంది. సకలబుద్ధులను ప్రకాశింపచేసే దేవతే సరస్వతి అని యజుర్వేదం కూడా చెప్తోంది.

 సరస్వతీ దేవిని పూజించిన వారికి ధన ధాన్యాలనుప్రసాదిస్తుంది కనుక ఈ తల్లిని వాజే భిర్వాజినీవతీ ధీనా మవిత్య్రవతు అని ఋగ్వేదం అంటోంది.

         ఈ సరస్వతీరూపంలో ఉన్న తల్లిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించాలి. కాని, సర్వదేవతారాధనకు మల్లే ఈ తల్లిని ఉద్వాసన చేయనక్కర ల్లేదు. ఆ తల్లి సర్వవేళలా సర్వావవస్థలయందూ మనదగ్గరే ఉండాలని ప్రతివారు కోరుకుంటారు. ఈ తల్లి చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నీల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మహాసరస్వతి అనే ఏడు రూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో ప్రస్తావించారు. త్రిశక్తుల్లో ఒకటైన మహాసరస్వతిదేవి శుంభ నిశుంభులనే రాక్షసుల్ని వధించింది. దీనికి నిదర్శనంగా అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం చేస్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజున చేసే సరస్వతి అలంకారం విశేష ప్రాధాన్యతను సంతరించు కొంటుంది. ప్రతిరోజూ ‘‘వాగ్దేవి వసుధా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా అంటూ సరస్వతి దేవి అని పూజిస్తే సర్వకార్యాలు అనుకూలం అవుతాయ.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

దుర్గామాత యొక్క ఐదవ స్వరూపము ‘స్కందమాత’( లలిత )

శ్లో||  సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా । శుభదాఽస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥

దుర్గామాత యొక్క ఐదవ స్వరూపము ‘స్కందమాత’ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. స్కందుడనగా కుమారస్వామి. ఆయనకు ‘కార్తికేయుడు’ అనే మరొక పేరు. ప్రసిద్ధమైన దేవాసుర సంగ్రామంలో ఈయన దేవతల సేనలకు అధిపతిగా ఉన్నాడు. పురాణాలు ఈయనను శక్తిధరుడని పేర్కొని, ఈయన మహిమలను వర్ణించాయి. ఈతడు నెమలి వాహనుడు. స్కందభగవానుడి తల్లి అయినందున దుర్గాదేవి ఐదవ స్వరూపానికి ‘స్కందమాత’ అనే పేరు ప్రసిద్ధమైనది. నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజున ఈ స్వరూపంలో దుర్గాదేవి ఆరాధించబడుతుంది.

ఈ రోజు సాధకుని మనస్సు విశుద్ధచక్రంలో స్థిరమవుతుంది. ఈమె మూర్తిలో బాలస్కందుడు ఈమె ఒడిలో కూర్చొని ఉంటాడు. స్కందమాత ‘చతుర్భుజ’. తన ఒడిలో చేరి ఉన్న స్కందుడిని తన కుడిచేతితో పట్టుకొని దర్శనమిస్తుంది. మరొక కుడి చేతిని పైకెత్తి పద్మమును ధరించి ఉంటుంది. ఎడమవైపున ఒక హస్తం అభయముద్రలో ఉంటుంది. మరొక కరములో కమలమును కలిగి ఉంటుంది. ఈమె శ్వేతవర్ణ శోభిత. ఈ దేవి కమలాసనంపై విరాజిల్లుతుంటుంది. కనుక ‘పద్మాసన’ గా ప్రసిద్ధికెక్కినది. సింహవాహన.

నవరాత్రి ఉత్సవాలలో ఐదవనాటి పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. దాని మహా మాహాత్మ్యం గురించి శాస్త్రాలు వేనోళ్ళ శ్లాఘించాయి. విశుద్ధచక్రంలో స్థిరమైన మనస్సుగల ఉపాసకునికి లౌకిక ధోరణులు, చిత్తవృత్తులూ అంతరిస్తాయి. అతడు విశుద్ధ చైతన్య స్వరూప మార్గంలో పురోగమిస్తాడు. అతని మనస్సు సమస్తమైన లౌకిక సాంసారిక మాయా బంధములనుండి విముక్తిని పొంది, పిదప పద్మాసనంలో ఆసీనయైన స్కందమాత స్వరూపంలో పూర్తిగా కలిసిపోతుంది. ఈ సమయంలో సాధకుడు పూర్తిగా సావధానుడై ఉపాసనలో ముందుకు సాగాలి. అతడు తన ధ్యానవృత్తులలో ఏకాగ్రతను కలిగి ఉండి సాధనలో పురోగమించాలి.

స్కందమాతను ఉపాసించటంవల్ల భక్తుల కోరికలన్నీ నేరవేరుతాయి. ఈ మృత్యులోకంలోనే వారు పరమశాంతిని, సుఖాలనూ అనుభవిస్తారు. వారికొరకై మోక్షద్వారము నిరంతరము తెరచుకొని వుంటుంది. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునికీ చెందుతాయి. ఈ దేవిని ఆరాధించటంలో ఉన్న వైశిష్ట్యము ఇదే! కనుక భక్తులు స్కందమాతను ఆరాధించటంపై ప్రత్యేక ధ్యాసను కలిగి ఉండాలి. ఈ దేవి సూర్యమండల అధిష్ఠాత్రి అవటంవల్ల ఈమెను ఉపాసించేవారు దివ్యతేజస్సుతో, స్వచ్ఛకాంతులతో విరాజిల్లుతుంటారు. ఒక అలౌకిక ప్రభా మండలం అదృశ్యరూపంలో సర్వదా వారి చుట్టూ పరివ్యాప్తమై ఉంటుంది. ఈ ప్రభామండలం అనుక్షణమూ వారి యోగక్షేమాలను వహిస్తుంటుంది.

కాబట్టి మనము ఏకాగ్రతో పవిత్రమైన మనస్సులతో స్కందమాతను శరణుజొచ్చుటకు ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ ఘోర భవసాగరముల దుఃఖమునుండి విముక్తులమై మోక్షమును సులభంగా పొందటానికి ఇంతకుమించిన ఉపాయము మరొకటి లేదు.

కనకంబరం రంగు, నైవేద్యం : పెరుగు అన్నం

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

ఉపాంగ లలితావ్రతం (లలితా పంచమి)

       ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజున ‘ఉపాంగ లలితావ్రతం’ఆచరిస్తారు. ఈ రోజున అమ్మవారిని భజనను చేస్తూ, జాగరణ చేస్తారు. ఈ వ్రతం ఎక్కువగా మహారాష్ట్ర ప్రాంతంలో ఆచరణలో ఉంది. ఈ వ్రతాన్ని చేయడంవల్ల అమ్మవారి కటాక్షం లభించి సకల శుభాలు కలుగుతాయి.

       ‘త్రిపురత్రయం’ లో రెండవ శక్తి స్వరూపిణి ఈ తల్లి. అందుకే శరన్నవరాత్రులలో వచ్చే పంచమిని ‘లలిత పంచమి’ అని కూడా అంటారు. చెరకుగడ, విల్లు, పాశము, అంకుశము ధరించి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కుడి ఎడమలు సేవలు అందిస్తుండగా శ్రీ లలితా పరాభట్టారిక భక్తుల ఇక్కట్లు తొలగించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కన్యలు మంచి భర్త కొరకు, ముత్తైదువులు దీర్ఘ సుమంగళి గా అఖండ సౌభాగ్యం కొరకు ఈ నవరాత్రులలో అయిదవ రోజు ‘ఉపాంగ లలితా వ్రతం’ ఆచరిస్తారు.

       అమ్మవారిని శ్రీ లలితా దేవి అలంకారం లో సహస్రనామ, అష్టోత్తర నామాలతో కుంకుమ పూజలు చేసి, ముత్తైదువలకు తాంబూలాలు ఇచ్చుకుంటారు. ముత్తైదువులను పిలిచి, సువాసినీ పూజలు చేస్తారు. కైలాస గౌరీ నోము కాని గ్రామ కుంకుమ నోముకాని నోచుకున్న వారు చాలా మంది ఈ రోజు ఉద్యాపన చేసుకుంటారు. కొంతమంది తమ గృహాల్లోనే సామూహిక లక్ష కుంకుమార్చనలు ఏర్పాటు చేసుకుంటారు. బొమ్మల కొలువులు పెట్టుకున్న వారు పేరంటాలు చేసుకుంటారు. శ్రీ లలితా దేవి తనని కొలిచిన భక్తుల దారిద్ర దుఃఖాలు నశింపచేస్తుంది. కుంకుమ పూజలు సలిపేవారికి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. పంచమి నాడు శ్రీ లలితాదేవి దేదీప్యమైన మూర్తిని మనస్సులో ప్రతిష్టించుకుని, ‘ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేనమః’ అని వీలైనన్ని సార్లు జపించుకుంటే అమ్మ మాతృమూర్తి యై చల్లగా చూస్తుంది.

ఈనాడు ధరించవలసిన వర్ణం: తెలుపు

ఈనాటి నివేదనలు: పులిహోర, పెసర బూరెలు

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

దుర్గామాత యొక్క నాలుగవ స్వరూప నామము ‘కూష్మాండ’( కామాక్షి )

శ్లో||  సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।  దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥

దుర్గామాత నాలుగవ స్వరూప నామము ‘కూష్మాండ’. దరహాసముతో అంటే అవలీలగా బ్రహ్మాండమును సృజించుతుంది కాబట్టి ఈ దేవి ‘కూష్మాండ’ అనే పేరుతో విఖ్యాతి చెందింది.

ఈ జగత్తు సృష్టి జరుగక ముందు అంతటా గాఢాంధకారమే అలముకొని ఉండేది. అప్పుడు ఈ దేవి తన దరహాసమాత్రంతో ఈ బ్రహ్మాండాలను సృజించింది. కాబట్టి ఈ స్వరూపమే ఈ సృష్టికి ఆదిశక్తి. ఈ సృష్టిరచనకు పూర్వము బ్రహ్మాండమునకు అస్తిత్వమే లేదు.

ఈమె సూర్యమండలాంతర్వర్తిని. సూర్యమండలంలో నివసింపగల శక్తిసామర్థ్యములు ఈమెకే గలవు. ఈమె శరీరకాంతిచ్ఛటలు సూర్యకిరణ ప్రభలలాగా దేదీవ్యమానముగా వెలుగొందుతూ ఉంటాయి. ఈమె తేజస్సు నిరుపమానము. దానికి అదే సాటి. ఇతర దేవతాస్వరూపాలేవీ ఈమె తేజః ప్రభావములతో తులతూగలేవు. ఈమె తేజోమండల ప్రభావమే దశదిశలూ వెలుగొందుతూ ఉంటుంది. బ్రహ్మాండములోని అన్ని వస్తువులలో, ప్రాణులలో ఉన్న తేజస్సు కూష్మాండ ఛాయయే.

ఈ స్వరూపము ఎనిమిది భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. అందువల్లనే ఈమె ‘అష్టభుజాదేవి’ అనే పేరుతో కూడా వాసిగాంచింది. ఈమె ఏడు చేతులలో వరుసగా కండలమూ, ధనుస్సూ, బాణమూ, కమలమూ, అమృతకలశమూ, చక్ర గదలు తేజరిల్లుతూ ఉంటాయి. ఎనిమిదవ చేతిలో సర్వ సిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాల ఉంటుంది. సింహవాహన. సంస్కృతంలో ‘కూష్మాండము’  అంటే గుమ్మడికాయ. కూష్మాండబలి ఈమెకు అత్యంత ప్రీతికరము. ఇందువల్ల కూడా ఈమెను ‘కూష్మాండ’ అని పిలుస్తారు.

నవరాత్రి ఉత్సవాలలో నాల్గవరోజు కూష్మాండాదేవీ స్వరూపమే దుర్గామాత భక్తుల పూజలను అందుకొంటుంది. ఈనాడు సాధకుని మనస్సు అనాహత చక్రంలో స్థిరమవుతుంది. కాబట్టి ఈ రోజు ఉపాసకుడు పవిత్రమైన, నిశ్చలమైన మనస్సుతో కూష్మాండాదేవి స్వరూపాన్నే ధ్యానిస్తూ పూజలు చేయాలి. భక్తులు ఈ స్వరూపాన్ని చక్కగా ఉపాసించడంవల్ల పరితృప్తయై ఈమె వారి రోగాలనూ, శోకాలనూ రూపుమాపుతుంది. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములూ, ఆరోగ్యభాగ్యములు వృద్ధి చెందుతాయి. సేవకుల కొద్దిపాటి భక్తికే ఈ దేవి ప్రసన్నురాలవుతుంది. మానవుడు నిర్మల హృదయంతో ఈమెను శరణుజొచ్చిన వెంటనే అతి సులభముగా పరమ పదము ప్రాప్తిస్తుంది.

శాస్త్రాలలో, పురాణాలలో పేర్కొనబడిన రీతిలో విధివిధానమును అనుసరించి మనము దుర్గాదేవిని ఉపాసిస్తూ అనవరతము భక్తి మార్గంలో అగ్రేసరులమై ఉండాలి. ఈ తల్లి భక్తిసేవా మార్గంలో కొద్దిపాటిగానైనా పురోగమించగలిగిన సాధకునికి ఆమె కృపానుభవము అవశ్యము కలిగి తీరుతుంది. దాని ఫలితంగా దుఃఖరూప సంసారమంతా భక్తునికి సుఖదాయకమూ, సుగమమూ అవుతుంది. మనిషి సహజంగా భవసాగరాన్ని తరించడనికి ఈ తల్లియొక్క ఉపాసన అతి సులభమైన, శ్రేయస్కరమైన మార్గం. మనిషి ఆదివ్యాధులనుండీ సర్వదా విముక్తుడవటానికీ, సుఖసమృద్ధిని పొందటానికీ, ఉన్నతిని పొందటానికీ కూష్మాండా దేవిని ఉపాసించటమనేది రాజమార్గం వంటిది. కాబట్టి లౌకిక, పారలౌకిక ఉన్నతిని కాంక్షించేవారు ఈ దేవీస్వరూపంయొక్క ఉపాసనలో సర్వదా తత్పరులై ఉండాలి.

ఆకాషం రంగు, నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలు

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

దుర్గామాత యొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’( అన్నపూర్ణ )

శ్లో|| పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా । ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥

దుర్గామాత యొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’. నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజున ఈమె విగ్రహానికే పూజాపురస్కారాలు జరుగుతాయి. ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కల్యాణ కారకము. ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘాంటాకృతిలో ఉండటంవల్ల ఈమెకు ‘చంద్రఘంట’  అనే పేరు స్థిరపడింది. ఈమె శరీరకాంతి బంగారువన్నెలో మిలమిలలాడుతుటుంది. తన పది చేతులలో – ఖడ్గము మొదలయిన శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉంటుంది. సర్వదా సమరసన్నాహయై యుద్ధముద్రలో ఉండే దివ్య మంగళ స్వరూపం. ఈమె గంటనుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు.

నవరాత్రి దుర్గాపూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటాదేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు. దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది. అలాగే వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ అనుభూతికొరకు, సాధకుడు సావధానుడై ఉండాలి.

ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము. ఈమె నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు. ఈమె ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.

ఈ దేవీ స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చుటంలో అను క్షణమూ సన్నద్ధురాలై ఉండునదే; అయినప్పటికీ భక్తులకూ, ఉపాసకులకూ ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగానూ, ప్రశాంతముగానూ కనబడుతూ ఉంటుంది. ఈమెను ఆరాధించడంవల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతోపాటు సౌమ్యతా, వినమ్రతలు పెంపొందుతుంటాయి. వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ, సద్గుణములు వృద్ధిచెందుతుంటాయి. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్యమాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు. ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాలనుండి దివ్యమూ, ప్రకాశవంతమూ అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది. ఈ దివ్య ప్రక్రియ సామాన్యులదృష్టికి గోచరించదు. కానీ ఉత్తమ సాధకులూ, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి, అనుభూతిని పొందగలరు.

మనము త్రికరణశుద్ధిగా విధ్యుక్తకర్మలను ఆచరిస్తూ, పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘాంటాదేవిని శరణుజొచ్చి, ఆమెను ఉపాసించడానికీ, ఆరాధించడానికీ తత్పరులమై ఉండాలి. అలాంటి ఉపాసన ప్రభావము వల్ల, మనము సమస్త సాంసారిక కష్టములనుండి విముక్తులమై, సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరమూ ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది.

లేత రంగు,  నైవేద్యం : కొబ్బరి అన్నము

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

దుర్గామాత యొక్క రెండవ స్వరూపము ‘బ్రహ్మచారిణి’ ( గాయత్రి )

శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ ।  దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥

దుర్గామాత యొక్క నవశక్తులలో రెండవది ‘బ్రహ్మచారిణి’ స్వరూపము. ఈ సందర్భంలో ‘బ్రహ్మ’ అనగా తపస్సు. ‘బ్రహ్మచారిణి’ అనగా తపమాచరించునది. ‘వేదస్తత్త్వం తపోబ్రహ్మ’ – ‘బ్రహ్మ’  యనగా వేదము, తత్త్వము, తపస్సు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరమూ, భవ్యము. ఈ దేవి కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్నీ ధరించి ఉంటుంది.

హిమవంతుని కూతురైన పార్వతియే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి నారదుడి ఉపదేశాన్ని అనుసరించి ఘోరతపము ఆచరిస్తుంది. ఈ కఠిన తపశ్చర్య కారణానే ఈమెకు ‘తపశ్చారిణి’ అనగా ‘బ్రహ్మచారిణీ’ అనే పేరు స్థిరపడింది. తపశ్చర్యకాలములో ఈమె కేవలము ఫల, కంద మూలములను మాత్రమే ఆరగిస్తూ లెక్కలేనన్ని సంవత్సరాలు గడుపుతుంది. కేవలము పచ్చికాయగూరలనే తింటూ మరికొన్ని సంవత్సరాలూ, కఠినోపవాసములతో ఎలాంటి ఆచ్ఛాదనమూ లేకుండా ఎండలలో ఎండుతూ, వానలలో తడుస్తూ కొంత కాలంపాటూ తపస్సును ఆచరిస్తుంది. ఇలాంటి కఠినతరమైన తపస్సును ఆచరించిన తరువాత, మరింకెన్నో సంవత్సరాలపాటు నేలపై రాలిన ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలూ ఆరాధిస్తుంది. మెల్లిగా ఎండుటాకులనుకూడా తినటం మానివేసి ‘అపర్ణ’యై చాలాకాలంపాటు ఆహారమూ, నీళ్ళు కూడా ముట్టకుండా ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది.

ఇలా చాలాకాలంపాటు కఠినమైన తపస్సును కొనసాగించటం కారణాన, బ్రహ్మచారిణిదేవి శరీరము పూర్తిగా కృశించి పోతుంది. ఈవిడ స్థితిని చూసి తల్లియైన మేనాదేవి ఎంతగానో దుఃఖిస్తుంది. ఈమెను ఈ కఠిన తపస్సునుండి మరలించడానికి తల్లి ‘ఉ మా’  – ‘బిడ్డా! వలదు, వలదు’  అని పలికినందున, బ్రహ్మచారిణిదేవి పేరు ‘ఉమా’ అని ప్రసిద్ధి కెక్కింది.

బ్రహ్మచారిణీదేవి చేసిన ఘోరతపస్సు కారణాన, ముల్లోకాలలో హాహాకారాలు చెలరేగుతాయి. దేవతలూ, ఋషులూ, సిద్ధులూ, మునులూ మొదలైనవారందరూ ఈవిడ తపస్సు కనీవినీ యెరుగనటువంటి పుణ్యకార్యమని పలుకుతూ ఈవిడను కొనియాడతారు. చివరికి పితామహుడైన బ్రహ్మదేవుడు, అశరీరవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరంలో ఇలా పలుకుతారు “దేవీ! ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకునూ ఎవ్వర్రునూ ఆచరింపలేదు. ఇది నీకే సాధ్యమైనది. అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్ర శ్లాఘించబడుచున్నది. నీ మనోవాంఛ సంపూర్ణముగా నెరవేరును. చంద్రమౌళియైన పరమేశ్వరుడు అవశ్యముగా నీకు పతియగును. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలుము. త్వరలోనే నీ తండ్రి నిన్ను ఇంటికి తీసికొనిపోవుటకై వచ్చును.“

దుర్గామాతయొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకూ, సిద్ధులకూ అనంతఫలప్రదము. ఈమెను ఉపాసించటంవల్ల మానవులలో తపస్సూ, త్యాగమూ, వైరాగ్యమూ, సదాచారమూ, సంయమమూ వృద్ధి చెందుతాయి. జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా దేవి అనుగ్రహముతో వారి మనస్సులు కర్తవ్యమార్గం నుండి మరలవు. లోకమాత అయిన బ్రహ్మచారిణీదేవి కృపవలన ఉపాసకులకు సర్వత్ర సిద్ధీ, విజయాలూ ప్రాప్తిస్తాయి. దుర్గానవరాత్రి పూజలలో రెండవరోజున ఈమె స్వరూపము ఉపాసించబడుతుంది. ఈ రోజు సాధకుని మనస్సు స్వాధిష్ఠాన చక్రములో స్థిరమవుతుంది. ఈ చక్రంలో స్థిరమైన మనస్సుగల యోగి, ఈమెకృపకు పాత్రుడగుతాడు. అతనికి ఈమె యెడల భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి.

పసుపు రంగు, నైవేద్యం : పులిహోర

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

ఆశ్వయుజ మాసం ప్రాముఖ్యత

     హిందువులకు ముఖ్యమైన మాసాలలో ఆశ్వయుజ మాసం ఒకటైనది. శరన్నవరాత్రులతో మొదలయ్యే ఈ మాసం లో తొమ్మిది రాత్రులు అమ్మవారి ని పూజించితే సంవత్సరమంతా పూజించిన ఫలితం కలుగుతుంది కనుక ఈ విధానాన్ని మహర్షులు గ్రహించారు. నక్షత్రాలలో మొదటిది అశ్వని ఈ నక్షత్రం లో పూర్ణిమ వచ్చే నెల ఆశ్వయుజం. అపార దైవిక శక్తి సమీకరణకు, మానవుల బలహీనతలైన కామం, క్రోధం, మొహం వంటి మనోవికారాల నియంత్రణకు నవరాత్రి పర్వదినాలు ఉపయోగపడతాయి. ఖగోళీఅంశలు, జ్యోతిష్య శాస్త్రం, భౌగోళిక పరిస్థితులను అనుసరించి శరన్నవరాత్రులు మహా పర్వదినాలుగా పరిగణింపబడ్డాయి. శక్తి ఉపాసన ద్వారా ఆశక్తను వీడి జీవనం సాగించాలని తెలియ చెప్పే మహాపర్వదినాలే శరన్నవరాత్రులు. వసంతఋతువు శరదృతువు యమద్రష్టల వంటివి.  రోగ పీడలు వ్యాపించే ఋతువులు, జననాశనం అధికం గా ఉంటుంది. అందుకే ఈ రెండు ఋతువులలో అమ్మవారి ఆరాధన ఉంటుంది.  ఈ సమయాలల్లో సూర్యభగవానుడు కర్కాటక లేదా మకరరేఖ వైపునకు తన దిశను మార్చుకొని పరివర్తనం చెంది, భూమధ్య నుండి  తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు, తద్వారా ప్రకృతిలో అనేక మార్పులు ఋతువుల రూపం లో వ్యక్తమవుతాయి. ఆశ్వయుజ మాసం లో ప్రకృతి నిస్తేజంగా నిద్రాణ స్థితి లో ఉండటం వల్ల ఆరోగ్య, ప్రాణ హాని కలిగించే అనేక దుష్ట శక్తులు విజృమ్బిస్తుంటాయి. ప్రకృతిలోని మార్పులకు అనుగుణం గా మానవ శరీరం మనసు ప్రభావితమవుతాయి. అందువల్ల నవరాత్రులలో సాత్వికాహారం తీసుకొవాలి. ఉపవాసం ఉండాలి. భగవంతుని సమక్షం లో పూజాపత్రాది రూపకం గా సమయాన్ని గడుపుతూ మనసు నిర్మలం గా ఉంచుకోవడం వల్ల శారీరిక, మానసిక వికారాలు దరిచేరవు. శరీరం వ్యాది గ్రస్తం కాదు.

      శరన్నవరాత్రులు మహా లయం (భాద్రపద అమావాస్య) తరువాత ఆరంభమవుతాయి. ఈ తొమ్మిది రోజులు అన్ని విజయాలను ప్రసాదించాలని హిందువులంతా అమ్మవారిని వివిధ రూపాలలో పూజిస్తారు.

     ఒకవేళ తొమ్మిది రోజులు నిత్య పూజ చేయలేని వారు కనీసం సప్తమి, అష్టమి, నవమి మూడు రోజుల్లోనైనా పూజ చేయాలి. అసలు విజయ దశమి  అంటే దీనిని సంధ్యాకాలం తర్వాత చుక్కలు పొడవడం చుసిన తర్వాత సర్వ కార్యక్రమాలు సిద్దిమ్పచేయునదిగా అభివర్ణిస్తారు. విజయదశమి రోజున ఎటైన వేరే ప్రదేశానికి ప్రయాణం చేయడం ఆనవాయితీ. దీనినే “సీమోల్లంఘనం” అంటారు. ఒక వేళ పండుగ రోజు ఎవరైనా ప్రయాణం చేయడం సాధ్యం కాకపొతే కనీసం వారికి సంబంధించిన ఏవైనా వస్తువులను పక్కింట్లోనో, ఎదిరింట్లోనో అయినా పెట్టాలని పండితులు చెప్తారు. ఈ విధం గా చేయడం ద్వారా వారు ఆ రోజు ప్రయాణం చేసినట్లుగా పరిగణింపబడుతుందంటారు.

      ఆశ్వయుజ కృష్ణచతుర్దశి, అమావాస్య ఎవరైతే లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తూ తమ ఇళ్ళలో దీపాలతో పండుగ జరుపుకొంటారో వారికి లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడు ఉంటుంది. దీపావళి నాడు లక్ష్మీ తిల తైలం లో ఉంటుందనీ, తలంటి స్నానం చేయడం లక్ష్మీప్రదమని ఈనాటి స్నానం గంగా స్నానం తో సమానమని శాస్త్ర వచనం, లక్ష్మీ దేవి ప్రతి ఇంటికి తిరిగి శుభ్రం గా ఉన్న ఇంట్లో తన కళను నిక్షిప్తం చేస్తుందని, భక్తి శ్రద్దలతో పూజించి ఎవరైతే దీపాలతో స్వాగతించి దారి చూపి ఆహ్వానిస్తారో వారి పై ప్రసన్నురాలై సంపదలను  అనుగ్రహిస్తుంది  అని భక్తుల విశ్వాసం. దీపాలు సమృద్దిగా వెలిగే ఇంట లక్ష్మీ ప్రవేశిస్తుంది. అజ్ఞానందకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని విస్తరింపజేసే పండుగగా దీపావళి ని హిందూ సంస్కృతి భావిస్తుంది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

‘శరన్నవరాత్రులు’

      శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.

             నవదుర్గలు :

ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి

తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్||

పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ

సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం

నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||

1 శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి): దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే మొదటి అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మిం చింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి. ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.

శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

2. బ్రహ్మచారిణి ( గాయత్రి )  : దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.

శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

3. చంద్రఘంట ( అన్నపూర్ణ )  : అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.

శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

4. కూష్మాండ ( కామాక్షి ): అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.

శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||

5. స్కందమాత ( లలిత ): అయిదో అవతారం స్కందమాత స్కంధుడు అనగా కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమే ఇది.

శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||

6. కాత్యాయని (లక్ష్మి): దుర్గామాత ఆరో అవతారం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తనకు పార్వతీమాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.

శ్లో||చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||

7. కాళరాత్రి ( సరస్వతి ): దుర్గామాత ఏడో అవతారం కాళరాత్రి. ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.

శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |

వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||

8. మహాగౌరి ( దుర్గ ) : అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.

శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||

9. సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి ): దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.

శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి| సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||   

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ (బాలా త్రిపుర సుందరి)

శ్లో||  వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ । వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥

     దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు ‘శైలపుత్రి’ అనే నామము ఏర్పడినది. వృషభవాహననారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.

      పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక – దాక్షాయని. అ జన్మలో ఈమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరిస్తాడు. దేవతలు తమతమ యజ్ఞభాగములను స్వీకరించటానికై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు. కానీ పరమశివుని మాత్రము ఆ యజ్ఞానికి పిలువడు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును సంకల్పించిన విషయం ఆమెకు తెలుస్తుంది. ఆ యజ్ఞాన్ని వీక్షించటానికై ఆమె మసస్సు ఉబలాటపడుతుంది. అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియజేస్తుంది. బాగా ఆలోచించి పరమేశ్వరుడు “కారణము ఏమోగానీ, దక్షుడు మనపై కినుకుబూనినాడు. అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించినాడు. యజ్ఞభాగములనుగూడ వారికి సమర్పించుచున్నాడు. కానీ ఉద్దేశ్యపూర్వకముగానే మనలను పిలువలేదు. కనీసము సమాచారమునైననూ తెలుపలేదు. ఇట్టి పరిస్థితిలో నీవు అచటికి వెళ్ళుట ఏ విధముగను మంచిదిగాదు”  అని హితవు బోధించారు. శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు. ఈ యజ్ఞమిషతోనైనా అక్కడికి వెళ్ళి తన తల్లినీ, తోబుట్టువులనూ చూడవచ్చునన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికై ఆమె పట్టుబడుతుంది. ఆమె పట్టుదలను చూసి, చివరకు శంకరుడు అనుమతిస్తారు.

      సతీదేవి తన తండ్రియింటికి చేరినప్పుడు అక్కడివారెవ్వరూ ఆమెతో మాట్లాడరు, ఆదరించరు. అందరూ ముఖాలను పక్కకు తిప్పుకొంటారు. తల్లి మాత్రము ఆమెను ప్రేమతో కౌగిలించుకొంటుంది. తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యం, పరిహాసమూ నిండి ఉంటాయి. తనవారి ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందుతుంది. అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణభావమే ఉండటం ఆమె గమనిస్తుంది. తండ్రియైన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు. ఇదంతా అనుభవించిన పిమ్మట, సతీదేవి హృదయము క్షోభతో, గ్లానితో, క్రోధముతో ఉడికిపోతుంది. ‘పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికివచ్చి పెద్ద పొరబాటే చేసితిని అని ఆమె భావిస్తుంది.

      తన పతియైన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేక పోతుంది. వెంటనే ఆమె తన రూపమును అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మము గావిస్తుంది. భరింపలేని ఈ దారుణదుఃఖకరమైన సంఘటనను గురించి విని, పరమశివుడు మిక్కిలి క్రోధితుడవుతాడు. ఆయన తన ప్రమథగణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని పూర్తిగా ద్వంసం చేయిస్తారు.

      సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి, మరుజన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది. అప్పుడామె ‘శైలపుత్రి’ గా ప్రసిద్ధికెక్కుతుంది. పార్వతి, హైమవతి  అన్నవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి, ఆమె హైమవతీ రూపంలో దేవతల గర్వాన్ని ఆణచివేస్తుంది.

       ‘శైలపుత్రి’  అవతారములో ఆమె పరమేశ్వరుణ్ణే  పరిణయమాడుతుంది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి ‘అర్ధాంగి’ అవుతుంది. నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’  యొక్క మహిమలూ, శక్తులూ అనంతములు. నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికై పూజలూ, ఉపవాసాలూ జరుపబడుతాయి. మొదటి రోజున యోగులు ఉపాసనద్వారా తమ మనస్సులను మూలాధారచక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి. 

నీలం రంగు, నైవేద్యం : కట్టు పొంగలి

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)