Categories
Vipra Foundation

జగ్జీవన్ రాం జయంతి

       జగ్జీవన్ రాం (ఏప్రిల్ 5, 1908 – జులై 6 1986) పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు మరియు సంఘ సంస్కర్త. బీహార్ లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా కూడా వ్యవహరించారు.

       బయొగ్రఫి పట్టుదల నిండిన ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ తన రాజకీయ జీవితాన్ని ఆదర్శప్రాయంగా కొనసాగించారు. విద్యావేత్తగా, మచ్చలేని నిస్వార్ధ నాయకునిగా, కరవు కోరల్లో చిక్కిన భారతావనిని వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవాన్ని సాకారం చేసి భారత ఆహార గిడ్డంగుల నేర్పరిచిన భారత దార్శనీకునిగా, బ్రిటిష్‌ కాలం నాటి రైల్వే వ్యవస్థను ఆధునికీకరించే దిశగా అడుగులు వేసిన రైల్వేమంత్రిగా, కయ్యానికి కాలుదువ్విన శత్రువును మట్టికరిపించి భారతదేశానికి విజయాన్ని అందించిన భారత సేనకు మంత్రిగా ధీరోదాత్తతను ప్రదర్శించి యావత్‌ భారత్‌ ప్రజానీకం గుండెల్లో నేటికీ సజీవంగా ఉన్నారు. దూరదృష్టితో దీర్ఘకాలిక ప్రణాళికారచనలో ఆయనకు సాటిరారన్న నాటి నాయకుల మాటలు అక్షర సత్యాలు. చివరికంటూ ఉప్పొంగే ఉత్సాహంతో పనిచేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ బీహార్‌ రాష్ట్రంలో షాబాద్‌ జిల్లాలోని చాందా గ్రామంలో శిబిరాం, బసంతీదేవి పుణ్యదంపతులకు 1908 ఏప్రిల్‌ 05న జన్మించారు. వీరిది దళిత కుటుంబం కావడంతో నాటి కుల సమాజపు అవమానాల్ని చవిచూశారు. నాటి అంటరాని తనమే జగ్జీవన్‌ రామ్‌ను సమతావాదిగా మార్చింది. నిరంతరం చైతన్యపూరిత ప్రసంగాలను వినడం, గాంధీజీ నాయకత్వంలో జరిగిన సంపూర్ణ స్వరాజ్య ఉద్యమాలన్ని నిశితంగా గమనించారు. విద్యార్థి దశ నుండే గాంధీజీ (మార్గానికి) అహింసా వాదానికి ఆకర్షితులై 1930లో జరిగిన సత్యాగ్రహోద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు. ఒకవైపు “కులం” అణిచివేతను అధిగమిస్తూనే భారత స్వాతంత్య్ర పోరాటంలో మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శించి నాటి జాతీయ నాయకుల్ని సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ వాడల నుండి ఆత్మవిశ్వాసమనే ఆయుధంతో “కులం” పొరల్ని ఛేదించుకుంటూ రాజకీయాలలో అంచలంచలుగా ఎదిగారు. 1935లో బ్రిటిష్‌ ప్రభుత్వం కల్పించిన పాలనాధికార అవకాశాన్ని, అందిపుచ్చుకొని 27 ఏళ్ల వయసులోనే బీహార్‌ శాసనమండలి సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించి శాసనమండలి సభ్యునిగా, కేంద్రంలో వ్యవసాయ శాఖామంత్రిగా ఆహార శాఖామంత్రిగా, కార్మిక శాఖామంత్రిగా, ఉపాధి పునరావాస మంత్రిగా, రవాణా మంత్రిగా, తంతితపాలా, రైల్వే శాఖా మంత్రిగా ఇంకా కేబినెట్‌ హోదాల్లో పలు పదవులు అలంకరించి ఆ పదవులకే వన్నెతెచ్చిన జగ్జీవన్‌ రామ్‌ అఖండ భారతదేశానికి తొలి దళిత ఉపప్రధానిగా నిజాయితీ, అంకితభావ సేవా తత్పరతలే కవచాలుగా చేసుకొని ఆదర్శప్రాయుడయ్యారు. అందుకే నాటి దేశనాయకులచే “”దేశభక్తుల తరానికి చెందిన మహనీయుడన్న”  బిరుదు పొందిన జగ్జీవన్‌ రామ్‌ది క్రమశిక్షణతో (కూడిన) మెలిగిన జీవితం. అర్దశతాబ్దం పైగా క్యాబినెట్‌ హోదాలో పలు పదవులు అలంకరించి మచ్చలేని నాయకుడుగా పేరొందిన ఆయన నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలి. బాధ్యతల్ని చిత్తశుద్ధితో, నిబద్ధతగా నిర్వర్తించడమే కాకుండా ప్రశంసార్హంగా మెలగడంలో జగ్జీవన్‌ రామ్‌ నేటి యువతకు ఆదర్శం అయ్యారు. ఇది నేటి యువతకు ఉత్తేజాన్నిస్తుంది. ఘనమైన స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహనీయుల సరసన చేరిన జగ్జీవన్‌ రామ్‌ దార్శనీకత నేటి పాలకులకు లేకపోవడం దురదృష్టకరం. ఆయన ఆదర్శాలను, నిస్వార్ధ రాజకీయ సేవను అమలు చేయడంలోప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఒక అడుగు ముందుకేయడమే జీవితాన్ని దేశ సేవకే అంకితం చేసి నవ భారత నిర్మాణానికి పునాదులు వేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆలోచనలు, ఆదర్శవంతమైన జీవితం చిరస్మరణీయమైనది. అతి పిన్న వయస్సులోనే నెహ్రూ తాత్కాలిక మంత్రివర్గంలో (1946) చేరి “బేబి మినిష్టర్‌” గా పిలవబడ్డ జగ్జీవన్‌ రాం అనతికాలంలోనే తన పరిపాలనా దక్షత, ప్రజలపట్ల ఎనలేని ప్రేమ, నిస్వార్ధ సేవతో అసమాన ప్రతిభ కనబరిచి ఎన్నో ఘన విజయాలు సాధించి తిరుగులేని దేశ నాయకునిగా గుర్తింపుపొందారు. అందుకే ఆయన జీవితం ఓ మహా కావ్యం. “”ఆలోచనల్లో దార్శనీకత, మాటల్లో సూటిదనం, నిర్ణయాల్లో పరిపక్వత, కష్టాల్లో మొక్కవోని ధైర్యం, చర్చల్లో మేధావితనం వంటి లక్షణాలే జగ్జీవన్‌రాంను విలక్షణ నాయకుణ్ణి చేశాయి. ప్రత్యర్ధులతో సైతం ఔరా అన్పించుకోగల్గిన రాజనీతజ్ఞత, తర్కం, విషయ పరిజ్ఞానం ఆయన సొంతం. చట్టసభలకు మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికైన బాబూ జగ్జీవన్‌రామ్‌ మౌనం కూడా ఒక్కోసారి ఎదుటివారిని ఆలోచింపచేసింది. అనర్గళ వాక్పటిమతో, అంబేద్కర్‌ సమకాలికుడుగా (16 సంవత్సరాల తేడాతో) దళిత హక్కుల పరిరక్షణలో భుజం కలిపి తనదైన కోణంలో దళితోద్దారకుడుగా పేరొందిన జగ్జీవన్‌రాం ఏనాడూ ఎవ్వరికీ తలవంచని వ్యక్తిత్వంతో చివరికంటా నిలిచాడు. ఇందిరాగాంధీకీ, కాంగ్రెస్‌కు విధేయుడైనప్పటికీ ఏనాడు తలవంచలేదు. తన పదునైన విమర్శలను ఇందిరాగాంధీపై సైతం ఎక్కుపెట్టిన జగ్జీవన్‌రామ్‌ ఆనాడే “ఆత్మగౌరవం” తో తిరుగులేని ధిక్కారాన్ని ప్రదర్శించారు. వ్యంగ్యంతో కూడిన చమత్కారం ఆయన ప్రసంగాలకు రత్నాలద్దినట్టుంటాయన్న నెహ్రూ మాటలు అక్షర సత్యం. దళితులు జనజీవన స్రవంతికి దూరం కావడానికి ఇష్టపడని జగ్జీవన్‌రామ్‌ సమానత్వం కోసం చివరికంటా పోరాడిన యోధుడుగా చరిత్రలో నిలిచిపోయారు. ప్రజలమధ్య, ప్రజల కొరకు సేవ చేసిన ఆయన “1986 జులై 6” న ప్రజలకు శాశ్వతంగా దూరమయ్యారు. ఇప్పుడు ఆయన లేకపోవచ్చు కానీ ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు సజీవంగానే ఉన్నాయి. జాతీయవాదిగా, అవిశ్రాంత కృషిసల్పిన దేశ నాయకునిగా మన గుండెల్లో పదిలంగా ఉన్నారన్నది సత్యం. 78 యేళ్ళ ఆయన జీవితంలో 52 ఏళ్ళ రాజకీయ జీవితం ఎంతో విశిష్టమైంది, విలువైంది నేటితరాలు ఆదర్శవంతమైనదని చెప్పవచ్చు.

              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

షడ్రుచుల సమ్మేళనం ‘ఉగాది పచ్చడి’

ప్రాముఖ్యత : –   ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది . “ఉగాది పచ్చడి” ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్ధం. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో “నింబ కుసుమ భక్షణం” మరియు “అశోకకళికా ప్రాశనం ” అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు’వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీకగా:-

బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం ఉప్పు – జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు – పులుపు – కొత్త సవాళ్లు మిరపపొడి – కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు ప్రొద్దునే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. “త్వామష్ఠ శోక నరాభీష్టమధుమాస సముద్భవనిబామి శోక సంతప్తాంమమ శోకం సదా కురు” ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది. ఆ రకంగా తమ జీవితాలు అన్ని అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)       

Categories
Vipra Foundation

శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

  ఉగాది ప్రాముఖ్యం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు.

 శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ.”ఉగాది”, మరియు “యుగాది” అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. “ఉగ” అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి ‘ఆది’ ‘ఉగాది’.అంటే సృష్టి ఆరంభమైనదినమే “ఉగాది”. ‘యుగము’ అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.

తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:” – చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది ‘ఉగాది’గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.

ఉగాది రోజు :-

తైలాభ్యంగం సంకల్పాదవు నూతన వత్సర నామకీర్త నాద్యారంభం…

ప్రతిగృహం ధ్వజారోహణం, నింబపత్రాశనం వత్సరాది ఫలశ్రవణం…

    తైలాభ్యంగనం

    నూతన సంవత్సరాది స్తోత్రం

    నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)

    ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)

    పంచాంగ శ్రవణం

మున్నగు ‘పంచకృత్య నిర్వహణ‘ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.

సంప్రదాయాలు : ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనుపిస్తున్నాయి. ఉగాదిరోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం. మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’  గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ, ముఖ్యమయిన పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం.

ఉగాది పచ్చడి : ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్ధం. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో “నింబ కుసుమ భక్షణం” మరియు “అశోకకళికా ప్రాశనం ” అని వ్యవహరించే వారు.

త్వామష్ఠ శోక నరాభీష్టమధుమాస సముద్భవనిబామి శోక సంతప్తాంమమ శోకం సదా కురు” ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది. ఆ రకంగా తమ జీవితాలు అన్ని అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు.

పంచాంగ శ్రవణం : ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. పంచాంగ శ్రవణం వళ్ళ రానున్న మంచి చెడులను సమభావంతో స్వీకరించ గలరని, పంచాంగ శ్రవణం వినడం మంచిది అని మన పెద్దలు చెప్పటం జరిగింది. మనకు తెలుగు సంవత్సరాలు ‘ప్రభవ’ తో మొదలుపెట్టి ‘అక్షయ’ నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చుస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి ‘షష్టిపూర్తి’ ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు. ఈ పండగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.

కవి సమ్మేళనం : ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా “కవి సమ్మేళనం” నిర్వహిస్తారు. కొత్త, పాత కవులు నవభావన, పాత ఓరవళ్ళు కలిపి కొత్త పద్యాలు, కవితలు తయారు చేసి చదువుతారు. సామాజిక జీవనం, రాజకీయం, వాణిజ్యం ఇలా అన్నివిషయాలను గూర్చి ప్రస్తావిస్తారు, కవులు తమకవితలలో. ఈ విధంగా నానా రుచి సమ్మేళనంగా జరుగుతుంది ఉగాది కవి సమ్మేళనం.

ఊరగాయల కాలం : మామిడికాయలు దండిగా రావడంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించు కోవడానికి వీలుగా మామిళ్ళను, ఇతర కాయలను ఎండబెట్టి, ఊరవేస్తారు. తెలుగు వారిళ్ళలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది “ఆవకాయ”. “ఇలా వివిధ విశేషాలకు నాంది యుగాది – తెలుగువారి ఉగాది”

              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)  

Categories
Vipra Foundation

చైత్ర మాసం

వ్రతాల మాసం చైత్రం : సంప్రదాయబద్ధంగా మనకున్న పన్నెండు మాసాల్లో తొలి మాసం చైత్రమాసం. వసంత రుతువు ఆగమనంతో ప్రకృతి సౌందర్యం ఈ మాసంలో అలరారుతుంటుంది. పలువురు దేవతలకు సంబంధించిన వ్రతాలు, పూజలతో ప్రజలలో భక్తి భావం పరిఢవిల్లుతూ ఉంటుంది. దశావతారాలలోని వరాహ, రామ, మత్సా్యవతారాల జయంతులు ఈ మాసంలోనే వస్తాయి. అన్నిటినీ మించి చైత్రం తొలి రోజు శుద్ధ పాడ్యమినాడు ఉగాది పర్వదినాన్ని జరుపుకొంటారు అంతా. చైత్రసోయగానికి చిహ్నంగా కనిపించే పరిమళభరితమైన దమన పత్రాలతో నెలలోని మొదటి పదిహేను రోజులు అనేక మంది దేవతలకు పూజలు చేయటం ఓ ఆచారంగా ఉంది. తొలి రోజు సృష్టికర్త, చతుర్ముఖుడు అయిన బ్రహ్మకు దమన పత్రాలతో పూజ చేస్తారు. మరునాడు విదియనాడు ఉమ శివ అగ్నులకు, తదియనాడు గౌరీ శంకరులకు, చతుర్దినాడు గణపతికి, పంచమినాడు నాగులకు, షష్ఠి నాడు కుమారస్వామికి, సప్తమినాడు సూర్యుడికి దమన పత్రాలతో పూజ చేస్తారు. అష్టమినాడు మాతృ దేవతలకు, నవమినాడు మహిషాసుర మర్దనికి, దశమినాడు ధర్మరాజుకు, ఏకాదశినాడు మునులకు, ద్వాదశినాడు మహావిష్ణువుకు, త్రయోదశినాడు కామదేవుడికి, చతుర్దశినాడు శంకరుడికి, పూర్ణిమనాడు శనికి, ఇంద్రుడికి దమన పత్రాలతో పూజలు చేయాలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇలా చెయ్యటం సర్వశుభప్రదం అని పెద్దలు వివరిస్తున్నారు. చైత్రశుద్ధ విదియనాడు నేత్ర ద్వితీయ, ప్రకృతి పురుష ద్వితీయ వ్రతాలు చేస్తారు. ఉమ, శివ, అగ్నులకు పూజ జరుగుతుంది. మరి కొంతమంది అరుంధతి వ్రతం చేస్తారు. చైత్ర శుద్ధ తదియనాడు శివడోలోత్సవం, సౌభాగ్య వ్రతం జరుపుతారు. చవితినాడు గణేశపూజ, పంచమినాడు శాలిహోత్రహయ పంచమి నిర్వహిస్తుంటారు. గుర్రాలకు పూజ చేయటం పంచమినాటి విశిష్టత. శ్రీవ్రతం పేరున ఇదే రోజు లక్ష్మీనారాయణులను పూజిస్తారు. శ్రీరామ రాజ్యోత్సవం జరుపుతారు. దీంతో పాటు పంచమూర్తి వ్రతం, సంవత్సర వ్రతం, పంచమహభూత వ్రతం, నాగపూజ తదితరాలు చెయ్యటం ఉంది. షష్ఠినాడు కుమార షష్ఠి వ్రతం చేస్తుంటారు. శుద్ధ సప్తమి తిథి నాడు సూర్యసంబంధమైన వ్రతాలు జరపటం కనిపిస్తుంది. అష్టమినాడు అశోకాష్టమి, అశోక రుద్రపూజ, భవానీ అష్టమి జరుపుతారు. శుద్ధ నవమికి మరింత విశిష్టత ఉంది. ఇదే రోజు శ్రీరామ నవమి పర్వదినం జరుగుతుంది. దశమినాడు ధర్మరాజ దశమి, శాలివాహన జయంతి చెయ్యడం ఉంది. చైత్ర శుద్ధ ఏకాదశినాడు ఏకాదశీవ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఈ రోజునే కామదైకాదశిని జరపటం కనిపిస్తుంది. ప్రత్యేకంగా స్త్రీలు తమ కోర్కెలను సిద్ధింపచేసుకోవటానికి ఈ వ్రతాన్ని చేస్తుంటారు. శుద్ధ ద్వాదశినాడు వాసుదేవార్చన, లక్ష్మీనారాయణ పూజ జరుగుతాయి. త్రయోదశినాడు అనంగత్రయోదశీ వ్రతం లేక మదన త్రయోదశీ వ్రతం జరుపుతారు. శుద్ధ చతుర్దశినాడు శైవచతుర్దశి కర్దమ క్రీడలాంటివి జరుగుతాయి. చైత్ర పూర్ణిమనాడు మహాచైత్ర వ్రతం జరుపుతారు. దీంతోపాటు చిత్రగుప్త వ్రతం లాంటివి ఉంటాయి. ఇప్పటికి మాసంలో సగభాగం అయిపోయినట్టవుతుంది. చైత్ర బహుళ పాడ్యమి నాడు జ్ఞానావాప్తి వ్రతం, పాతాళ వ్రతం ఉంటాయి. ఆ తర్వాత బహుళ పంచమి నాడు మత్స్య జయంతి, ఏకాదశినాడు వరూధిని ఏకాదశి, త్రమోదశినాడు వరాహ జయంతి జరుపుతుంటారు. చైత్ర బహుళ చతుర్దశినాడు గంగానది స్నానం చేయటం వల్ల పాపాలు నశిస్తాయి. బహుళ అమావాస్యనాడు పరశురాముడి పూజలు చేస్తుంటారు. ఇలా పలు వ్రతగ్రంథాలు చైత్ర మాసంలో వచ్చే పుణ్యప్రదాలైన అనేక వ్రతాల గురించి వివరించి చెబుతున్నాయి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

శ్రీ లక్ష్మీ జయంతి

లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కోరీతిలో ప్రకటితమయినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.

1. స్వాయంభువ మన్వంతరంలో – భృగువు, ఖ్యాతిల పుత్రికగా జననం.

2. సార్వోచిష మన్వంతరంలో – అగ్ని నుండి అవతరణ.

3. జౌత్తమ మన్వంతరంలో – జలరాశి నుండీ,

4. తామస మన్వంతరంలో – భూమి నుండీ,

5. రైవత మన్వంతరంలో – బిల్వవృక్షం నుండీ,

6. చాక్షుష మన్వంతరంలో – సహస్రదళ పద్మం నుండీ,

7. వైవస్వత మన్వంతరంలో కీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు తెలుస్తుంది.

ఇందులో మొదటి మన్వంతరముగా చెప్పుకుంటున్న స్వాయంభువ మన్వతరంలో –

       భృగుమహర్షి, ఖ్యాతిలకు పుత్రసంతానం ఉన్నప్పటికీ కుమార్తెలు కూడా కావాలనే కోరిక అమితంగా ఉండడంతో, భర్త అనుమతితో ఖ్యాతి పుత్రికను ప్రసాదించమని దేవీని ప్రార్ధిస్తూ తపస్సు చేయగా, ఆ తపస్సుకు మెచ్చిన జగన్మాత ప్రసాదించిన వరముచే భృగుమహర్షి దంపతులకు పుత్రికగా లక్ష్మీదేవి జన్మించెను.

       ఇది ఇలా ఉండగా, దక్షప్రజాపతి స్తన ప్రదేశం నుంచి ఉద్భవించినవాడు ధర్ముడు. ఈ ధర్ముడనే ప్రజాపతి భార్యల్లో ఒకరైన సాధ్య వలన నలుగురు పుత్రసంతానం కలగగా, ఆ సంతానంలో ఒకరు నారాయణుడు. నారాయణుడు తన సోదరులైన నరుడు, హరి, కృష్ణుడులతో కల్సి తపస్సు చేయుచుండగా, ఆ తపస్సును భంగం చేయడానికి అప్సరసలు రాగా, నారాయణుడు తన విశ్వరూపాన్ని చూపడంతో వారు (అప్సరసలు) వెళ్ళిపోయారు. ఇది విన్న భృగుమహర్షికుమార్తె లక్ష్మీదేవి నారాయణుడే తన భర్త కావాలని తపస్సు చేయగా, అది మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమై, ఆమె కోరిక ప్రకారం తన విశ్వరూపాన్ని చూపించి, వివాహానికి సిద్ధం కాగా, దేవేంద్రుడు మధ్యవర్తిగా, ధర్ముడు పురోహితుడిగా కళ్యాణం జరిపించినట్లుగా విష్ణుపురాణ కధనం. ఇదొక్కటే అమ్మవారు గర్భసంజాత ఘటన.

ఇక చివరిగా చెప్పుకుంటున్న వైవస్వత మన్వంతరంలో –

       పూర్వం ఒకసారి దుర్వాసమహాముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహుకరించగా, దేవేంద్రుడు ఆ మాలను తనవాహనమైన ఏనుగుకు వేయగా, ఆ ఏనుగు ఆ మాలను క్రిందపడవేసి కాళ్ళతో తొక్కి ముక్కలు చేయగా, ఇది చూసిన దుర్వాసుడు కోపోద్రిక్తుడై – ‘నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక’ అని శపించెను. శాపఫలితంగా స్వర్గలోక ఐశ్వర్యం నశించగా, రాక్షసులు దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకోగా, దేవేంద్రాదులు బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళి జరిగిన విషయాలు మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటబెట్టుకొని విష్ణువు వద్దకు వెళ్ళి వివరించగా, అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చని, అందునిమిత్తం క్షీరసాగరాన్ని మధించాలని విష్ణువు సలహా ఇవ్వగా, దేవతలకొక్కరికి క్షీరసాగరాన్ని మధించడం సాధ్యముకాదు కనుక రాక్షసుల సహాయాని తీసుకొని అందుకు సిద్ధమయ్యారు.

       క్షీరసాగరమధనం :- మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే మహాసర్పాన్ని త్రాడుగా చేసుకొని చిలుకుతుండగా, మందరగిరి పట్టుతప్పి మునిగిపోతున్న తరుణంలో శ్రీకూర్మమై తన మూపుపై పర్వతాన్ని నిలుపుకొని, ఇక క్షీరసాగరమధనం కొనసాగించమని ఆనతిచ్చిన ఆర్తత్రాణపరాయణుడు “శ్రీ మహావిష్ణువు”.

          క్షీరసాగర మధనం జరిగినప్పుడు – ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని లోకశ్రేయస్సుకై ‘శివుడు’ స్వీకరించి నీలకంఠుడు’ కాగా, లోకకల్యాణం కోసం, భర్తకు విషం మింగమన్న పార్వతీదేవి సర్వమంగళ’ గా ప్రసిద్ధి పొందారు. ఈ ఘటన మాఘబహుళ చతుర్దశినాటి రాత్రి జరిగింది. విషాన్ని హరించి, శివుడు లోకానికి మంగళం కల్గించినందున, ఈ దినం శివరాత్రి” అయింది.

       ఇదియే కాక, ఇదే రోజున శివలింగ ఆవిర్భావం జరిగినట్లు, అందుచే ఈ దినం శివరాత్రి పర్వదినం అయినట్లు లింగపురాణం ద్వారా తెలుస్తుంది.

            ఆ తర్వాత మరల కొనసాగిన సముద్రమధనంలో సురభి’ అనే కామదేనువు జనించగా ఋషులు యజ్ఞకర్మల నిమిత్తం దీనిని స్వీకరించారు. తర్వాత ఉఛ్వైశ్రవం’ అనే తెల్లని అశ్వం జనించగా దానిని బలి స్వీకరించాడు. ఆ పిమ్మట ఐరావతం, కల్పవృక్షం మొదలగునవి జనించగా ఇంద్రుడు వాటిని స్వీకరించాడు. అనంతరం క్షీరాబ్ధి నుంచి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. ఆ శుభదినం ఉత్తరపల్గునీ నక్షత్రంతో వున్న పాల్గుణ శుద్ధపూర్ణిమ. మనం జీవిస్తున్నకాలం వైవస్వతమన్వంతరం కనుక ఈ విధంగా క్షీరాబ్ధి నుండి ఆవిర్భవించిన ఈ దినమునే లక్ష్మీజయంతి” గా జరుపుకోవాలన్నది శాస్త్రవచనం.

       ప్రాదుర్భవమే కాదు… పరిణయం కూడా !

ఈ శుభదినం లక్ష్మీదేవి ప్రాదుర్భవంతో పాటు పరిణయం కూడా జరిగినదినం. లక్ష్మీదేవి ఆవిర్భవించగానే తనకి తగిన వరుడెవ్వడా అని అందర్నీ చూస్తూ, సకలసద్గుణవంతుడు, అచ్యుతుడు, ప్రేమైక హృదయుడు, ఆర్తత్రాణ పరాయణుడు విశ్వవ్యాపకుడు అయిన శ్రీ మహావిష్ణువును కాంచి, పుష్పమాలను విష్ణువు మెడలో వేసి, వరించింది ఆ శుభసమయమునే!

సాధురక్షకుండు షడ్వర్గ రహితుండు

నాదుడయ్యేనేసి నడప నోపు

నితడే భర్త! యనుచు నింతి సరోజాక్షు

బుష్పదామకమున బూజ సేసె !

       ‘వక్షో నివాస మకరోత్ పరమం విభూతే / యత్రస్థితైధయత సాధిపతీం స్త్రీలోకాన్’ … లక్ష్మీదేవి విష్ణువు వక్షస్థలాన్నే తన నివాసంగా చేసుకుంది.

       లక్ష్మి అనుగ్రహమంటే సిరిసంపదలే కాదు, ఆమె అనుగ్రహం ప్రధానంగా ఎనిమిదిరకాలుగా ఉంటుంది. అవి – ధనం, ధాన్యం, గృహం, సంతానం, సౌభాగ్యం, ధైర్యం, విజయం, మోక్షం!

శుచి శుభ్రతలను పాటిస్తూ, భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాదిస్తే ఆమె అనుగ్రహం పొందగలం. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతోనే సిరిసంపదలతో పాటు కీర్తి, మతి, ద్యుతి, పుష్టి, సమృద్ధి, తుష్టి, స్మృతి, బలం, మేధా, శ్రద్ధ, ఆరోగ్యం, జయం ఇత్యాదివి లభిస్తాయి.

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగాధామేశ్వరీం, దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురామ్, శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరం, త్వాం త్రైలోక కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్

అందరూ లక్ష్మీ కటాక్షమునకు పాత్రులవ్వాలని కోరుకుంటూ …

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

శ్రీ కృష్ణదేవ రాయలు జయంతి

        శ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుడు గా మరియు కన్నడ రాజ్య రమారమణ గా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి “అప్పాజీ” (తండ్రిగారు) అని పిలిచేవాడు.రాయలు, తుళువ నరస నాయకుని రెండవ భార్య అయిన నాగలాంబ (తెలుగు ఆడపడుచు) కుమారుడు.ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలు నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు. రాయలు తల్లి నాగలాంబ గండికోట ను పాలించిన పెమ్మసాని నాయకులు ఆడపడచు. 240 కోట్ల వార్షికాదాయము కలదు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.

సాహిత్య పోషణ :

        కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, మదాలసాచరితము, సత్యవధూపరిణయము, సకలకథాసారసంగ్రహము, జ్ఞానచింతామణి, రసమంజరి తదితర గ్రంథములు, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు రేడ నేను తెలుగొకొండ ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.

భక్తునిగా :

        కృష్ణదేవ రాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవుడు. కానీ పరమతసహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించినాడు. అంతేకాక ధూర్జటి, నంది తిమ్మన వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు.అనేక దాన ధర్మాలు చేసినాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి, అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు.

నిర్మాణాలు :

        ఈయన చెన్నకేశవస్వామి వారి దేవాలయం కట్టించాడు.

కుటుంబము :

        కృష్ణదేవ రాయలుకు తిరుమల దేవి, చిన్నాదేవి ఇద్దరు భార్యలని లోక విదితము. కానీ, ఆముక్తమాల్యద ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ మరియు కమల). కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు. పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనిజ్ వ్రాశాడు. ప్రతాపరుద్ర గజపతి ని ఓడించి, ఆయన కూతురైన తుక్కా దేవి ని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రకాధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా వ్యవహరించారు.చాగంటి శేషయ్య, కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించాడు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు. కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమలాదేవి పట్టపురాణి అయిఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయంఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామ రాయలకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524 లో మరణించినాడు. ఈ విషయంపై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసు ను అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు, అచ్యుత రాయలు ను వారసునిగా చేసాడు.

కులము :

        శ్రీ కృష్ణదేవ రాయలు ఏ కులానికి చెందిన వాడన్న విషయంపై ఇతర కులాలవారి మధ్య అనేక వాదోపవాదాలున్నాయి. ఈయన కాపు, బలిజ, గొల్ల, బోయ కులాలకి చెందిన వాడని ఆయా కులాల వారు చెప్పుకుంటారు. ఇతని తండ్రియైన తుళువ నరస నాయకుడు చంద్ర వంశపు క్షత్రియుడుఅని పలు కవులు వ్రాసిన పద్యములు నిరూపించుచున్నవి. ఇప్పటికీ వీరి మూలాలు దక్షిణ భారతదేశమంతటా ఉన్నాయి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

భీష్మాష్టమి

       రధ సప్తమి తరువాత వచ్చే రోజునే భీష్మ అష్టమి గా పిలుస్తారు ఎందుకంటే భీష్ముడు అంపశయ్య మీద ప్రాణ త్యాగం చేసిన రోజు ఇదే కనుక, ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ మనిషి గా పుట్టిన ప్రతి వారు నీటిని తర్పణ గా విడువమని చెప్పింది శాస్త్రం

తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే తర్పణ విడువడమే కర్తవ్యమ్

తర్పణ ఇచ్చేటప్పుడు ఇలా చదువుతూ ఇవ్వమని చెప్పింది శాస్త్రం

సంకల్పం: మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే ఆద్యబ్రహ్మణః శ్వేతవరాహ కల్పే వైవశ్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోః దక్షిణే పార్శ్వే స్వగృహే శకాబ్దే అస్మిన్ వర్తమానేన చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే ____ నామ సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ మాఘ మాసే శుక్ల పక్షే అష్టమ్యాం శుభతిథౌ వాసరస్తూ ____వాసర యుక్తాయాం అశ్విని నక్షత్ర యుక్త సాధ్య యోగ భద్ర కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం అష్టమి శుభ థితౌ!!

భీష్మాష్టమి తర్పనార్ఘ్యం అస్య కరిష్యే – అపపౌ స్పృశ్య

౧.   భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!

     ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!!

వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!

     అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే!!

.   వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!

     అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!!

అనేన భీశం అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!

భీష్ముడి విశిష్టత

        శ్రీ కృష్ణుని కొంతమంది భక్తులు అడిగారు. అందరూ మిమ్మల్నే తలచుకుంటున్నారు. మరి మీరు ఎవర్ని స్మరిస్తున్నారు నిరంతరం అని..ఆయ్నను చుసి అడిగిన ప్రశ్న కు శ్రీ కృష్ణుడు ఇచ్చిన సమాధానం ” తను ఒక పెద్ద ఆయ్నను తల్చుకుంటున్నాను అని…..” ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం తాండవించింది. అందరిచే అనునిత్యం స్మరించబడుతున్న ఆ పరమాత్మునిచే నిత్యం తలవబడుతున్న ఆ పుణ్యమూర్తి ఎవరు?

నేను ప్రస్తుతం స్మరిస్తున్నది నా భక్తుడు నామాన్ని…..భక్తుడే భీష్మపితామహుడు” అని కృష్ణ పరమాత్మ అసలు విషియాన్ని చెప్పాడు.

       అవును….భగవంతుడు భక్త పరాధీనుడు. భక్తుదేంతగా తన స్వామి కోసం పరితపిస్తూ ఉంటాడో..అంత కంటే ఎక్కువగా ఆ సర్వాంతర్యామి తన భక్తుని యొగక్షేమాల పట్ల శ్రద్ధ తీస్కుంటు ఉంటాడు. అందుకే భక్తి ఎక్కడో భగవంతుడు అక్కడే అని అన్నారు.

భీష్ముడి జన్మ రహస్యం :

       శంతనమహారాజు చంద్ర వంశానికి చెందినవాడు. హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు శంతనమహారాజు గంగా నది వైపు వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఓ అమ్మాయి కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది. ‘నన్ను పెళ్ళి చేసుకుంటావా?’అని అడిగాడు. అందుకా అమ్మాయి నవ్వుతూ’నేనెవరో తెలుసా?’ అంది. “నువ్వెవరివైనా సరే, నన్ను వివాహమాడు. నా రాజ్యం,నా డబ్బు,నా ప్రాణం,సర్వస్వం నీ కిచ్చేస్తాను ” అని మ్రతిమాలాడు.

అప్పుడు ఆ అమ్మాయి,”మహారాజా! మీ ఇష్టప్రకారమే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను.కాని కొన్ని షరతులు కోరుతాను. వాటికి మీరు ఒప్పుకోవాలి ” అంది.

ఆవేశంలో “అలాగే!” అని మాట యిచ్చాడు శంతనుడు.

వెంటనే ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు – గంగాదేవి.

      పెళ్ళి జరిగాకా గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. అందరూ పచ్చగా, పనసపండ్లలా వున్నారు. అయితే పుట్టిన ప్రతీ బిడ్డనూ అమె గంగానదిలో వదిలేసేది. ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం, మరో వంక దుఃఖం వచ్చేవి. కాని ఏమీ అనడానికి వేల్లేదు. ఆవిడ పెట్టిన షరతుల్లో ” నువ్వెవరు? ఎక్కడనుండి వచ్చావు? ఇలా ఎందుకు చేస్తున్నావు? ” అని అడగడానికి వేల్లేదు. అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు.

ఏడుగురు కొడుకులు పుట్టారు.ఏడుగురూ ఏటిపాలయ్యారు.

       చివరకు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలేయ బోతుంటే శంతనుడు సహించలేక ” నువ్వు తల్లివి కావు…ఎందుకింత పాపం చేస్తున్నావు? ” అని అడిగాడు.

       వెంటనే ఆమె “మహారాజా! మీరు మరిచిపోయినట్టున్నారు. నన్ను గురించీ నేను చేసే పనుల గురించీ ఎప్పుడూ ఏమీ అడగనని మాటయిచ్చి వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ వుండను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాణ్ణి నేను చంపను. నేనొవరో మీకు తెలీదు. మునులూ , మహర్షులు నిత్యం పూజించే గంగానదికి ఆధిదేవతను నేను.

” పూర్వం ఒకానొకప్పుడు అష్ట వసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకుని వశిష్ట మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్టులవారి పాడి ఆవు. అది చాలా అందంగా వుంది! అష్ట వసులు , వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒకామె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. ‘ఈ ఆవు వశిష్ట మహామునిది. మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావల్సి వస్తుంది. వద్దు’ అని చెప్పాడు భర్త.

       ఆవిడ ససేమీరా వినలేదు. తనకు నందిని కావల్సిందేనని భర్తను బలవంత పెట్టింది. చివరకు ఎలాగైతేనేం అతను ‘సరే’ అన్నాడు. ఎనిమిది మంది వసువులూ కలసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు.

       ” వశిష్టుడికీ సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో,’మీరంతా మానవులై పుట్టండి’ అని శపించాడు.

అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్టుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్ధించారు.

       కానీ వశిష్ట మహర్షి , ‘నా శాపానికి తిరుగులేదు పొండి!’ అన్నాడు. వసువులు ప్రాధేయ పడ్డారు.’ నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహా వైభవంతో చాలాకాలం జీవిస్తాడు. తక్కిన ఏడుగురూ భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాపవిముక్తులౌతారు. ఇంతకంటే నేను చేయగలిగిందేదీ లేదు!’ అని చెప్పాడు. పోని కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్ట వసువులు తిరిగి వెళ్ళిపోయారు.

       ” ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి, ‘గంగాభవానీ! నువ్వే మాకు తల్లివి కావాలి. మా కోసం నువ్వు భులోకానికి వెళ్ళు, అక్కడ ఓ పునీతుడ్ని వరించు. మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం. మాకు త్వరగా శాపవిమోచనం కలగాలి, మేం పుట్టిన వెంటనే గంగలో విడిచి పెట్టు తల్లీ!’ అని మొరపెట్టుకున్నారు.అందుకని నేను భులోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకన్నాను. అష్ట వసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను, అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది.

ఆ పిల్లవాడే దేవవ్రతుడు.

వశిష్ట మహాముని వద్ద వేద వేదంగాలు చదువుకున్నాడు.

శుక్రాచార్యుల వారి వద్ద శాస్రాలన్నీ నేర్చుకున్నాడు.

విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు.

ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు. ఆయన కౌరవ, పాండవ, వంశాలకు పితామహుడు.అటువంటి భీష్మున్ని తలుచుకుని తరిద్దాం.

              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

మెహర్ బాబా పున్యతిథి

          చూపులో కరుణ, మోములో చిద్విలాసం.. ఆయనే ‘మెహర్ బాబా’

        దాదాపు 44 ఏళ్లు అంటే.. జులై 10, 1925 నుంచి సమాధిని పొందే వరకు మౌనదీక్షలో గడిపారు ఆ బాబా.  కేవలం చేతి సైగలతోనే సంభాషించేవారు. ప్రజలతో బహిరంగ సమావేశాలు నిర్వహించి కుష్టువ్యాధిగ్రస్థులకు, పేదవాళ్ళకు, మానసిక వ్యాధులతో బాధ పడుతున్నఎందరికో సేవలు చేసిన భారతీయ ఆధ్యాత్మిక గురువు. ఆయనే మెహెర్ బాబా. ఆయన జన్మనామం మెర్వన్ షెరియార్ ఇరానీ.

         మెహర్ బాబా ఫిబ్రవరి 25, 1894లో మహారాష్ట్రలోని పూనాలో జన్మించారు. 19 సంవత్సరాల వయసులో మెహర్ బాబా ఆధ్యాత్మిక అన్వేషణను ప్రారంభించి,  1922 లో ఆయనే ఒక సాంప్రదాయాన్ని ప్రారంభించారు.  1940వ దశ్కమంతా బాబా సూఫీలో భాగమైన మాస్ట్స్ అనే ప్రత్యేక వర్గానికి చెందిన ఆధ్యాత్మిక సాధకులతో కలిసి జీవనాన్ని సాగించారు.

         బాబా జీవిత పరమార్థం గురించి, పునర్జన్మ గురించి, భ్రమతో కూడిన లోకంతీరు గురించి అనేక ఉపన్యాసాలను ఇచ్చి ప్రజలకు సరైన దిశానిర్దేశనాన్ని చూపించారు.  ఈ ప్రపంచం మిథ్య అనీ భగవంతుడొక్కడే సత్యమనీ, ప్రతి ఒక్కరు తమలోని పరమాత్మను తెలుసుకోవాలని భోదించారు. ఖచ్చితమైన గురువు ఎలా ఉంటాడో ఆయన విశదపరిచారు. ఎదుటివారి లోపాలను ఎత్తి చూపడం కన్నా మనని మనం సంస్కరించుకోవడంలోనే గొప్పతనముందని,  ఇతరులకు చెడు చెయ్యక పోవడమే మనం చేయగలిగే మంచి అని బోధించారు.  భౌతిక సుఖాలకోసమెంత తపించిపోతామో అంతకు రెట్టింపు తపన పరమాత్మవైపు పడగలిగితే తప్పకుండా భగవంతుని దర్శనం లభిస్తుందని అన్నారు. ఇటువంటి ఆయన బోధనలు డిస్కోర్సెస్,  గాడ్ స్పీక్స్ అనే పుస్తకాలలో పొందుపరచబడ్డాయి. బాబాజాన్ వల్ల దివ్యస్థితిని, ఉపాసనీ మహరాజ్ వల్ల లోకస్థితిని పొందిన ఆయన 1921 సంవత్సరం ఆఖరుకల్లా అవతార పురుషుడయ్యారు. మెహర్‌బాబాను ‘పర్వర్‌దిగార్’ గా షిరిడీ సాయిబాబా సంబోధించారు. ఆయన అవతారుడని తెలిపారు. 1922లో అవతారోద్యమం ప్రారంభించి, శిష్యులకు శిక్షణ ఇచ్చారు. హజరత్ బాబాజాన్ , ఉపాసనీ మహరాజ్ , షిరిడీ సాయిబాబా, నాగపూర్‌లోని తాజుద్దీన్‌బాబా, పూణే సమీపంలోని నారాయణ్ మహరాజ్ అనే ఐదుగురు సద్గురువులచే మెహర్ బాబా అవతారుడని పిలువబడ్డారు.

         ఆధ్యాత్మిక కారణాలచే 44 సంవత్సరాలు మౌనం వహించారు. ఈ మౌన వ్రతంలోనే 13 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. మౌనంలోనే ఆయన 1969 జనవరి31న మహా నిర్యాణం పొందారు. అప్పటి నుంచి ఏటా మహారాష్ట్రలోని అహ్మదాబాద్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహరాబాద్‌లో నిర్యాణం పొందిన రోజున బాబా అనుయాయులు కలుస్తారు. ప్రస్తుతం 72 దేశాలలో మెహర్‌బాబా కేంద్రాలు పనిచేస్తున్నాయి. బాబా బోధించిన సత్యం, ప్రేమలను అవి విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. ఈ రోజు ఆయన వర్థంతి సందర్భంగా ఆయన బోధనల్ని ఒకసారి మనసారా స్మరించుకుందాం.

  • వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)
Categories
Vipra Foundation

పుష్య బహుళ ఏకాదశి – షట్తిల ఏకాదశి వ్రతం

శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది. విష్ణువుకు ఇష్టమైన మాసం మార్గశిరం, శివునకు కార్తీకం, అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమినాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్ధాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. శని ధర్మదర్శి. న్యాయం, సత్యం, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను, పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే. మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి, నియమ నిష్ఠులు పాటించి నట్లయితే శని అనుగ్రహం పొందవచ్చు. అంతేగాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహంచాలి. పుష్యమాసం తొలి అర్థభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం. అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాల తోనూ, ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం. పుష్య బహుళ ఏకాదశిని విమలైకా దశి, సఫలైకాదశి, షట్తిలైకాదశి, కల్యాణౖకాదశి అని పిలుస్తారు. సున్నిపిండితో ఒంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచినీటి లోనూ నువ్వులు కలుపుకొని తాగడం, ఒక రాగి లేదా కంచు పాత్రలో నువ్వులు పోసి తిలదానం ఈ ఏకాదశి రోజు చేస్తారు. పితృ దేవతలకి పితృతర్పణాలు, ఆబ్దికాదులు ఉంటే వారి పేరుతో అన్న దానాలు పేదవారికి చేస్తే విశేషించి పుణ్యఫలంతో పాటు పితృ దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఏకాదశి రోజున దాన్యం తినకూడదు అంటారు కదా మరి నువ్వులు ఎలా తినడం అని అనుమానం వస్తుంది. నువ్వులు దేవుడికి నివేదన చేసి, అందరికి నువ్వుల ప్రసాదం పెట్టి ఏకాదశి వ్రతం  కళ్ళకి అద్దుకుని పక్కన పెట్టి ద్వాదశి రోజున పారణ తరువాత దానిని తినాలి.

పుష్యమాసములో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్య కాంతి అద్భుతమగు యోగచైతన్యమును ప్రసాదింపగలదు. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రము. చెప్పలేనంత కాంతిని దర్శనము చేయించే మాసము పుష్యమాసము. ఉత్తరాయణ పుణ్యకాలములో సూర్యుడు దక్షిణము నుండి ఉత్తరదిశగా పయనము సాగిస్తాడు. అనగా ఊర్ద్వ ముఖముగా ప్రయాణము. మనలోని ప్రాణశక్తి బలమును కూర్చుకొను సమయము. సూర్య కిరణములయందు ఒక ప్రత్యేకమైన హరణ్మయమైన కాంతి ఉండును. ఇది మన బుద్ధిని ప్రచోదనము గావించును. మనస్సును అంటిపెట్టు కున్న స్వభావము నందలి అశుభములను ఆ కాంతి హరింపగలదు. బుద్ధిబలము, ప్రాణబలము పుష్టిగా లభించే మాసము పుష్యమాసము.

షట్‌తిల ఏకాదశి:

 దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు తిలలతొ (నువ్వులు) ఆరు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు గురువరేణ్యులు ప్రవచిస్తున్నారు.

పితృదేవతలకు ఆ రోజు అత్యంత ప్రీతికరం. ఆ రోజున వారికి అర్పణాలు వదలడం ఆచారంగా వస్తున్నది. ఆరు కార్యాలు ఏమిటంటే..

1) నువ్వులతో స్నానం (తిలాస్నానం),

2) స్నానానంతరం నువ్వులముద్ద చేసి ఆ చూర్ణాన్ని శరీరానికి పట్టించడం

3) ఇంటిలో తిల హోమం నిర్వహించడం

4) పితృ దేవతలకు తిల ఉదకం సమర్పించడం

5) నువ్వులు కాని, నువ్వుల నూనె కాని ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వడం

6) చివరగా తిలాన్నం భుజించడం. (బియ్యం వుడికె సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం)

ఆ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేసినవారికి పితృ దేవతలు, శ్రీ మహా విష్ణువు సంతసించి దీవెనలు అందజేస్తారు. ఆ కర్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట. తిలా ఏకాదశిని యధావిధిగా పాటిస్తే ఆ పరంధాముడు సంతసించి దైహిక సంబంధమైన సర్వసుఖాలు సహా ఆ తరువాత ఊర్ధ్వ, అధో లోకాల్లో కూడ ఉత్కృష్ఠ స్థానం అనుగ్రహిస్తూ దీవిస్తాడని విశ్వాశం. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయం, భగవంతుడు అంశాలపై సంపూర్ణ విశ్వాసం ఉన్న వారు మరి ఉద్యుక్తులై భగవదాశీస్సులు పొందండి.  

              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కనుమ పండుగ

        కనుమ ను పశువుల పండుగ గా వ్యవహరిస్తారు.మూడవ రోజయిన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతే కాదు, వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని రెండవ రోజయిన మకర్‌సంక్రాంతి లేదా లోరీ ని మాత్రమే జరుపుకుంటారు.

పశువుల పండుగ :-

       సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండగను కనుమ పండగ అంటారు దీన్నె పశువులు పండగ అని కూడ అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు వెట్టి చాకిరి చేసిన మూగజేవాలైన పశువులకు ఈ రోజు పండుగే. తమిల్నాడు చిత్తూరు జిల్లా లలో ఈ రోజున “జల్లికట్టు” అని పశువులతో ప్రమాదకరమైన విన్యాసాలు చేయిస్తారు. ఇది అటు పశువులకు ఇటు మనుషులకు ప్రమాదకరం అయి నందున ప్రభుత్యం దీన్ని నిషేదించింది. వివిద ప్రాంతాల్లో ఈ పండగను వివిద పద్దతులతో జరుపు కుంటుండొచ్చు . ముక్యంగా ఛిత్తూరు జిల్లా , అందులో పాకాల మండలం లోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లొ ఈ పండగ జరుపుకొనుటలో ఒక ప్రత్యేకత వున్నది. అందుకే ఈ వ్యాసం. ఇంకొన్ని ప్రదేసాలలో కూ ఈ విధానం అమల్లొ వుండొచ్చు. ప్రత్యేకత ఏమిటంటే?

ఆ రోజు ఇంటి కొకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు, ఔషద మొక్కలు, సేకరిస్తారు .కొన్ని చెట్ల ఆకులు, కొన్ని చెట్ల బెరుడులు , కొన్ని, చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు, ఇలా చాల సేకారిస్తారు. కొన్ని నిర్ధుస్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి, అనగా, మద్ది మాను , నేరేడి మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు కాయ, ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా కత్తిరించి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచు తారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని ఉప్పు చెక్క అంటారు ఇది అత్యంత ఘాటైన మధుర మైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులొ ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆపశువు దాన్ని మీంగు తుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ల ఉప్పు చెక్కను తిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతటే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిస్తారు. ఏడాది కొకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. అది నిజమే కావచ్చు, ఎంచేతంటే అందులో వున్నవన్ని, ఔషదాలు, వన మూలికలే గదా.

        ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుక పోయి, స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి, ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను, పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి. మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు.

        సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునప్రతిస్టించి వూరులో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగిలి పెడ్తారు. పొంగిలి అంటే కొత్త కుండలో, కొత్తా బియ్యం,కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చి పోయే ఊరి వారు రోజుకొక కంపో, కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. ఈ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. దాన్ని “చిట్లా కుప్ప” అంటారు. చీకటి పడే సమయానికి పొంగిళ్లు తయారయి వూంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అనగా ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు, పూజానంతరం మొక్కున్న వారు, చాకిలి చేత కోళ్లను కోయించు కుంటారు. అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. అప్పటికి పశు కాపరు లందరూ ఊరి పశువు లన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్ద గా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి, తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి.. చెదర గొట్టతాడు. అవి బెదిరి చేలెంబడి పరుగులు తీస్తాయి, ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలొ వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు .ఆ తర్వాత అందరు అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ కోళ్లను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ల కెళతారు. ఈ సందార్బంగా పెద్ద మొక్కున్న వారు పొట్టేళ్లను కూడ బలి ఇస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని” పొలి” అంటారు. ఆ “పొలి” ని తోటోడు గాని, నీరు గట్టోడు గాని తీసుకొని పోయి అందరి పొలాల్లో ,చెరువుల్లో, బావుల్లో “పొలో…. పొలి” అని అరువ్తు చల్లుతాడు. అప్పడే కొత్త మొక్కులు కూడ మొక్కు కుంటారు. అంటే, తమ పశు మందలు అభివృద్ది చెందితే రాబోయే పండక్కి పొట్టేలును, కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు .అప్పటికప్పుడే ఒక పొట్టేలి పిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)