Categories
Vipra Foundation

తిరువరంగం హయగ్రీవాచారి వర్థంతి

(1916 నవంబర్ 25 —1991 డిసెంబర్ 05)

       నిజాం వ్యతిరేక పోరాటం లో ప్రముఖ పాత్ర ఆయనది. స్వాతంత్రోద్యమంలో వరంగల్ నుంచి ఎదిగిన తొలితరం కాంగ్రెస్ నాయకుల్లో ఆయనొకరు. రాజకీయ సామాజిక రంగాల్లో ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఆయన తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడిగా గుర్తింపుపొందారు. నిజాం నిరంకుశ పరిపాలనకు వ్య తిరేకంగా స్వామి రామానందతీర్థ నాయకత్వంలో పోరాటం సాగించిన కొద్దిమంది నాయకులలో ఆయన ఒకరు. ఆయనే తిరువరంగం హయగ్రీవాచారి. వరంగల్ పురపాలక సంఘం ప్రథమ చైర్మన్‌గా, మంత్రిగా పనిచేస్తూ విభిన్న వర్గాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ పలు నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనను ప్రత్యేక పాత్ర పోషించారని ఆయన అభిమానులు, కాంగ్రెస్ నాయకులు హయగ్రీవాచారి చేసిన సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు.

బాల్యం విద్యాభాస్యం..

      హయగ్రీవాచారి 1916 నవంబర్ 25న ధర్మసాగర్ గ్రామంలో జన్మించారు. తిరునగరి శ్రీనివాసాచార్యులు-ఆండాళమ్మ ఆయన తల్లిదండ్రులు. మూడొ తరగతి వరకు ధర్మసాగర్‌లోని వీదిబడిలో చదివారు. కాంతంరాజు, రావుల నరసింహరెడ్డి వద్ద పెద్దబాలశిక్ష చదివారు. ఆ తరువాత వారి కుటుం బం హన్మకొండ పట్టణంలో స్థిరపడింది. ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థానంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఉన్నత పాఠశా ల ఉండేది. ఉన్నత పాఠశాలల్లో చదివే రోజుల్లోనే హయగ్రీవాచారిపై జాతీయోద్యమ ప్రభావం అందరిలాగే పడింది. 1932లో నిర్వహించిన కాకతీయ ఉత్సవాలు ఆనాటి యువకులను ఉత్సాహపరిచాయి. ఎంతోమందిలో ఉత్తేజాన్ని నిం పాయి. ఆ ఉత్సవాల నిర్వహణలో పర్సా రంగారావు, ఉద య రాజుశేషగిరిరావు, ఆవంచ వెంకట్రావు, మాదిరాజు రా మకోటేశ్వరరావు, కాళోజీ రామేశ్వర్‌రావులతోపాటు విద్యార్థి సేవాదళ హయగ్రీవాచారి పనిచేశారు. 1935లో హయగ్రీవాచారి మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులై ఇంటర్‌లో చేరారు. హైదరాబాద్ వెళ్లి బీఏలో చేరి మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత ఆయ న పూర్తి జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు.

వరంగల్‌కు అయ్యగారు ముద్ర

     హయగ్రీవాచారిని అందరూ అయ్యగారు అని ముద్దుగా పిలుచుకునేవారు. ఆయన చేపట్టిన అనేక పదవుల ద్వారా అందివచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. వరంగల్ పట్టణానికి పోచంపాడు నీళ్లు తీసుకువచ్చి వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలలో మంచినీటి కొరత తీర్చటంలో హయగ్రీవాచారి ఎంతోకృషి చేశారని ఆయనకు పేరుం ది. సహకార ఉద్యమ వ్యాప్తిలోనూ, బలహీన వర్గాల పురోగతిలోనూ అయ్యగారి అసాధారణమైందని ఆయన అభిమాను లు గుర్తుచేసుకుంటున్నారు. వరంగల్ జిల్లా బోర్డు వైస్ చైర్మన్‌గా హయగ్రీవాచారి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కృషిచేశారని ఆనాటి కాంగ్రెస్ నాయులు పేర్కొంటున్నారు. 1950-52లో వరంగల్ జిల్లా పారిశ్రామిక సలహా మండలి సభ్యులుగా జిల్లా లో పరిశ్రమల స్థాపనకు కృషి చేశారు. రాష్ట్రస్థాయిలో, అఖిలభారత స్థాయిలో వివిధ అంశాలపై మహాసభలు నిర్వహించడంలో ఆయన పాత్ర కృషి చెప్పుకోదగింది. హైదరాబాద్ హిందీ ప్రచార స భ అధ్యక్షుడిగా, హిందీ ప్రతిస్ఠాన్ వ్యవస్థాపకులుగా హిందీ భాషకు ఆయన చేసిన సేవ ఎంతో గొప్పది.

వరంగల్ పురపాలక సంఘం తొలి అధ్యక్షుడిగా..

      వరంగల్ పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడానికి హయగ్రీవాచా రి ఎంతో శ్రమించారు. ఆయన కృషి ఫ లితంగానే వరంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. వయోజన ఓటింగ్ పద్ధతిపై ఎన్నికైన వరంగల్ పురపాలక సంఘ తొలి అధ్యక్షుడిగా హయగ్రీవాచారి ఎన్నికయ్యారు. స్వాతంత్య్రానంతరం ఆయన చేపట్టిన తొలిపదవి ఇదే..

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. నలుగురి సీఎంల వద్ద మంత్రిగా..

     హయగ్రీవాచారి అవిభాజ్య వరంగల్‌జిల్లా నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, నలుగురు సీఎంల మంత్రివర్గంలో సభ్యుడిగా పనిచేశారు. 1972 నుంచి ఆయన మంత్రిగా పనిచేశారు. పీవీ నర్సింహారావు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, టీ.అంజయ్య, భువనం వెంకట్రామ్‌రెడ్డిగా పనిచేశారు. ఆయన నిర్వహించిన పదవులను సమర్థవంతంగా చేశారనే పేరును సంపాదించుకున్నారు. పంచాయతీరాజ్, సాంకేతిక విద్య మొదలైన శాఖలను ఆయన నిర్వహించిన కాలంలో ఆయా శాఖల నుంచి జిల్లా వాటాను తెచ్చుకోగలిగారని ఆయనకు పేరుంది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం 19వ అధ్యాయం : చాతుర్మాస్య వ్రత ప్రభావం

       నైమిశారణ్యంలో మునులంతా కలిసి చిదానందుని స్తోత్రం చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగి ”ఓ దీనబాంధవా! వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రాలుగా ఉన్నవాడివని, సర్వాంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వతా పూజలందుకునే వాడివని, సర్వాంతర్యామివని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుతున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణకోటికి ఆధారభూతడవైన ఓ నందనందనా… మా స్వాగతం స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమాలు, మా నివాస స్థలాలు అన్నీ పవిత్రాలయ్యాయి. ఓ దయామయా! మేం ఈ సంసార బంధం నుంచి బయటపడలేకున్నాం. మమ్మల్ని ఉద్దరింపుము. మానవుడెన్ని పురాణాలు చదివినా… ఎన్ని శాస్త్రాలను విన్నా… నీ దివ్య దర్శనం దొరకజాలదు. నీ భక్తులకు మాత్రమే నీవు కనిపిస్తావు. ఓ గజేంద్ర రక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! నన్ను కాపాడుము” అని మైమరచి స్తోత్రము చేయడగా… శ్రీహరి చిరునవ్వుతో…. ”జ్ఞానసిద్ధా! నీ స్తోత్ర వచనానికి నేనెంతో సంతోషించాను. నీకు ఇష్టమైన ఒక వరం కోరుకో” అని పలికెను. అంతట జ్ఞాన సిద్ధుడు ”ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరం నుంచి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగలా కొట్టుకుంటున్నాను. కాబట్టి నీ పాదపద్మాలపై ధ్యానముండేట్లు అనుగ్రహించు. మరేదీ నాకు అవసరం లేదు” అని వేడుకొన్నాడు. అంతట శ్రీమన్నారాయణుడు ”ఓ జ్ఞాన సిద్ధుడా! నీ కోరిక ప్రకారం వరమిస్తున్నాను. అదేకాకుండా, మరో వరం కోరుకో… ఇస్తాను. ఈ లోకంలో అనేకమంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యాలుచేస్తున్నారు. అలాంటివారి పాపాలు పోవడానికి ఒక వ్రతం కల్పిస్తున్నాను. ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించొచ్చు. సావధానుడవై ఆలకించు…. నేను ఆషాఢ శుద్ధ దశిమిరోజున లక్ష్మీసమేతంగా పాలసముద్రంలో శేషశయ్యపై పవళిస్తాను. తిరిగి కార్తీకమాసం శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు అమిత ఇష్టమైనవి. చాతుర్మాస్యాల్లో ఎలాంటి వ్రతాలు చేయనివారు నరక కూపాలలో పడతారు. ఇతరులతో కూడా ఈ వ్రతాన్ని ఆచరింపజేయాలి. దీని మహత్యాన్ని తెలుసుకో. వ్రతం చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకాలు కలుగుతాయి. ఇక చాతుర్మాస్య వ్రతం చేసేవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమంగా ఆషాఢ శుద్ధ దశిమి మొదలు శాఖములు (కూరలు), శ్రావణ శుద్ధ దశిమి మొదలు పప్పుదినుసులు విసర్జించాలి. నాయందు భక్తిగలవారిని పరీక్షించడానికి నేను ఇలా ద్రవ్యాల నిషేధాన్ని విధించాను. ఆ కాలంలో నేను ఆయా ద్రవ్యజాల్లో శయనిస్తాను. నీను ఇప్పుడు నన్ను స్తుతించిన తీరున త్రిసంధ్యల్లో భక్తిశ్రద్ధలతో పఠించేవారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు” అని శ్రీమన్నారాయణుడు తెలిపాడు. అనంతరం ఆయన మహాలక్ష్మితో కలిసి పాలసముద్రానికి వెళ్లి, శేషపాన్పుపై పవళించాడు.

       తిరిగి వశిష్టుడు జనకమహారాజుతో ఇలా అంటున్నాడు… ”ఓ రాజా! ఈ విధంగా విష్ణుమూర్తి, జ్ఞాన సిద్ధుడు, మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యాన్ని ఉపదేశించాడు. ఈ వృత్తాంతాన్ని ఆంగీరసుడు ధనలోభునికి తెలియజేశాడు. నేను నీకు వివరించాను. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి స్త్రీపురుష బేధం లేదు. అన్ని జాతుల వారు ఈ వ్రతాన్ని ఆచరించొచ్చు. శ్రీమన్నారాయణుడి ఉపదేశం ప్రకారం మునిపుంగవులంతా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి, ధన్యులయ్యారు. అనంతరం వైకుంఠ ప్రాప్తిని పొందారు” అని వశిష్టులు చెప్పారు.

ఇట్లు స్కాంద పురాణాంతర్గతంలో వశిష్టుడు బోధించిన కార్తీకమహత్యం పందొమ్మిదో అధ్యాయం సమాప్తం

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం 18వ అధ్యాయం : సత్కర్మనుష్టాన ఫల ప్రభావం

        ధనలోభుడు తిరిగి ఆంగీరసులవారితో ఇలా అడుగుతున్నాడు…. ”ఓ మునిచంద్రా! మీ దర్శనం వల్ల నేనను ధన్యుడనయ్యాను. మీరు నాకున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు. తత్ఫలితంగా నాకు జ్ఞానోపదేశమైంది. జ్ఞానోదయం కలిగింది. ఈ రోజు నుంచి నేను మీకు శిశ్యుడను. తండ్రి-గురువు-అన్న-దైవం అన్నీ మీరే. నా పూర్వ పుణ్య ఫలితాల వల్లే నేను మిమ్మల్ని కలిశాను. మీవంటి పుణ్యమూర్తుల సాంగథ్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొందాను. లేకుంటే… అడవిలో ఒక చెట్టులా ఉండాల్సిందే కదా? అసలు మీ దర్శన భాగ్యం కలగడమేమిటి? కార్తీక మాసం కావడమేమిటి? చెట్టుగా ఉన్న నేను విష్ణువు ఆలయాన్ని ప్రవేశించడమేమిటి? నాకు సద్గతి కలగడమేమిటి? ఇవన్నీ దైవికమైన ఘటనలే. కాబట్టి, ఇకపై మీతోనే మీ శిష్యకోటిలో ఒక పరమాణువుగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి, నన్ను శిష్యుడిగా స్వీకరించండి. మానవులు చేయాల్సిన సత్కర్మలను, అనుసరించాల్సిన విధానాలు, వాటి ఫలితాలను విషదీకరించండి” అని కోరాడు.

        దానికి అంగీరసులవారు ఇలా చెబుతున్నారు… ”ఓ ధనలోభా! నీవు అడిగిన ప్రశ్నలన్నీ చాలా మంచివే. అందరికీ ఉపయోగపడతాయి. నీ అనుమానాలను నివృత్తి చేస్తాను. శ్రద్ధగా విను” అని ఇలా చెప్పసాగెను…

        “ప్రతి మనిషి శరీరమే సుస్థిరమని అనుకుంటాడు. అలా భావిస్తూ జ్ఞానశూన్యుడవుతున్నాడు. ఈ భేదం శరీరానికే కానీ, ఆత్మకు లేదు. అలాంటి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చేయాలి. సకల శాస్త్రాలు ఇవే ఘోషిస్తున్నాయి. సత్కర్మనాచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరార్పితం చేయాలి. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. మానవుడేజాతివాడు? ఎలాంటి కర్మలు ఆచరించాలి? అనే అంశాలను తెలుసుకోవాలి. వాటిని ఆచరించాలి. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక, సత్కర్మలనాచరించినా, అవి వ్యర్థమవుతాయి. అలాగే కార్తీకమాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తుండగా… వైశాక మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తుండగా… మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా… అంటే మొత్తానికి ఈ మూడు మాసాల్లో తప్పక నదీ స్నానాలు, ప్రాత:కాల స్నానాలు ఆచరించాలి. అతుల స్నానాలాచరించాలి. దేవార్చన చేసినట్లయితే తప్పక వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్య, చంద్ర గ్రహణ సమయాల్లో, ఇతర పుణ్యదినాల్లో ప్రాత:కాలంలోనే స్నానం చేసి, సంధ్యావందనం చేసుకుని, సూర్యుడికి నమస్కరించాలి. అలా ఆచరించని వాడు కర్మబ్రష్టుడవుతాడు. కార్తీకమాసంలో అరుణోదయస్నానం ఆచరించిన వారికి చతుర్విద పురుషార్థాలు సిద్ధిస్తాయి. కార్తీకమాసంతో సమానమైన నెలగానీ, వేదాలతో సరితూగే శాస్త్రంగానీ, గంగాగోదావరులకు సమాన తీర్థాలుగానీ, బ్రాహ్మణులకు సమానమైన జాతిగాని, భార్యతో సరితూగే సుఖమూ, ధర్మంతో సమానమైన మిత్రుడూ, శ్రీహరితో సమానమైన దేవుడూ లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కార్తీకమాసంలో విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించినవారు కోటియాగాల ఫలితాన్ని పొందుతారు” అని వివరించెను.

       దీనికి ధనలోభుడు తిరిగి ఇలా ప్రశ్నఇస్తున్నాడు…. ”ఓ మునిశ్రేష్టా…! చాతుర్మాస్య వ్రతమనగానేమిటి? ఎవరు దాన్ని ఆచరించాలి? ఇదివరకెవరైనా ఆ వ్రతాన్ని ఆచరించారా? ఆ వ్రత ఫలితమేమిటి? దాని విధానమేమిటి? నాకు సవివరంగా తెలపగలరు…” అని కోరాడు.

       ధనలోభుడి ప్రార్థనను మన్నించిన అంగీరసుడు ఇలా చెబుతున్నాడు…. ”ఓయీ…! చాతుర్మాస్య వ్రతమనగా మహా విష్ణువు, మహాలక్ష్మీదేవితో ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషపాన్పుపై శయనించి, కార్తీక శుద్ధ ఏకాదశిరోజున నిద్రలేస్తారు. ఆ నాలుగు నెలలను చాతుర్మాస్యమంటారు. అనగా… ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ నాలుగు నెలలు విష్ణుదేవుడి ప్రీతికోసం స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినట్లయితే పుణ్యఫలితాలు కలుగుతాయి. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను. ఆ సంగతిని నీకు చెబుతున్నాను.

       తొలుత కృతయుగంలో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలు, వేదాలతో సేవించబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీసమేతుడై సింహాసనంపై కూర్చుని ఉండగా… ఆ సమయంలో నారద మహర్షి వచ్చి, కోటిసూర్యప్రకాశవంతుడైన శ్రీమన్నారాయణుడికి నమస్కరించి, ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు. అంత శ్రీహరి నారదుడిని చూసి… ఏమి తెలియనివాడిలా మందహాసంతో ‘నారదా క్షేమమేనా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలే లేవు. మహామునుల సత్కర్మానుష్టానాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా? ప్రపంచంలో అరిష్టములేమీ లేవుకదా?’ అని కుశల ప్రశ్నలు వేసెను. అంత నారదుడు శ్రీహరికి, ఆదిలక్ష్మికి నమస్కరించి ‘ఓ దేవా… ఈ జగత్తులో నీవు ఎరగని విషయాలే లేవు. అయినా… నన్ను అడుగుతున్నారు. ఈ ప్రపంచంలో కొందరు మనుషులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. వారు ఎలా విముక్తులవుతారో తెలియదు. కొందరు తినరాని పదార్థాలు తింటున్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ, అవి పూర్తికాకుండానే మధ్యలోనే మానేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సాహితులుగా, పరనిందా పరాయణులుగా జీవిస్తున్నారు. అలాంటి వారిని సత్కృపత రక్షింపుము’ అని ప్రార్థించెను.

       జగన్నాటక సూత్రధారుడైన శ్రీహరి కలవరం చెంది, లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షుఉలున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహణ రూపంలో ఒంటరిగా తిరుగుతుండెను. ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు, పుణ్యశ్రవణాలు తిరుగుచుండెను. ఆ విధంగా తిరుగుతున్న భగవంతుడిని గాంచిన కొందరు, అతను ముసలిరూపంలో ఉండడంతో ఎగతాళి చేయుచుండిరి. కొందరు ‘ఈ ముసలివానితో మనకేమి పని’ అని ఊరకుండిరి. గర్విష్టులై మరికొందరు శ్రీహరిని కన్నెత్తి చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి, ‘వీరిని ఎలా తరింపజేయాలి?’ అని ఆలోచిస్తూ… తన నిజరూపంలోకి వచ్చాడు. శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలా ధరించి, లక్ష్మీదేవితోను, భక్తులతోనూ, మునిజన ప్రీతికరమైన నైమిశారణ్యానికి వెళ్లాడు. ఆ వనంలో తపస్సు చేసుకుంఉటున్న ముని పుంగవులను స్వయంగా ఆశ్రమంలో కలిశారు. వారంతా శ్రీమన్నారయణుడిని దర్శించి, భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లారు. అంజలి ఘటించి, ఆది దైవమైన ఆ లక్ష్మీనారాయణుడిని ఇలా స్తుతించారు…

శ్లో|| శాంత కారం! భజగా శయనం ! పద్మ నాభం! సురేశం!

విశ్వా కారం! గగన సదృశం ! మేఘవర్ణం శుభాంగం!

లక్ష్మి కాంతం ! కమల నయనం! యోగి హృద్ద్యాన గమ్యం!

వందే విష్ణు! భవ భయ హారం! సర్వ లోకైక నాథం||

శ్లో|| లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీ రంగ దామేశ్వరీం

దాసి భూత సమస్త దేవా వనితాం లోకైక దీపంకురాం

శ్రీమన్మంద కటాక్ష లబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరం

త్వాం త్రైలోక్య కుటుంబినిం శర సిజాం వందే ముకుంద ప్రియం||

ఇట్లు స్కాంద పురాణాం తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి అష్టా దశాధ్యాయం – పద్దెనిమిదో రోజు పారాయణం సమాప్తం.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం 17వ అధ్యాయం : ధనలోభికి తత్వోపదేశం

        అప్పుడు ఆంగీరసుడు మునులతో ఇలా అంటున్నాడు…. ”ఓ మహా మునులారా! ఓ ధనలోభి! మీకు కలిగిన సంశయాలకు సమాధానమిస్తాను. సావధానంగా వినండి” అంటూ ఇలా చెప్పసాగారు.

       “కర్మల వల్ల ఆత్మ దేహదారణ సంభవిస్తున్నది. కాబట్టి, శారీరోత్పత్తి కర్మకారణంగా జరుగుతోందనే విషయాన్ని గుర్తించాలి. శరీరధారణం వల్ల ఆత్మ కర్మను చేస్తుంది. కర్మ చేయడానికి శరీరమే కారణమవుతోన్నది. స్థూల, సూక్ష్మ శరీర సంబంధాల వల్ల ఆత్మకు కర్మ సంబంధాలు కలుగుతాయని తొలుత పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దాన్ని మీకు చెబుతున్నాను. ఆత్మ అనగా… ఈ శరీరాన్ని అహంకారంగా ఆవహించి వ్యవహరించేది అని అర్థం” అని వివరించాడు.

       దీనికి ధనలోభుడు తిరిగి ఇలా అడుగుతున్నాడు… ”ఓ మునినీద్రా! మేం ఇప్పటి వరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాం. ఇంకా వివరంగా చెప్పండి. వ్యక్య్తార్థ జ్ఞానం, పదార్థ జ్ఞానం, అహం బ్రహ్మ అనే వ్యక్య్తార్థ్య జ్ఞానం గురించి తెలియజేయండి” అని కోరాడు.

        అప్పుడు అంగీరసుడు తిరిగి ఇలా చెబుతున్నాడు ”ఈ దేహం అంత్ణకరణ వృత్తికి సాక్షి. నేను-నాది అని చెప్పే జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాతంర్యామి అయిన పరమాత్మ న్ణ అనే శబ్దం. శరీరానికి ఆత్మలా షుటాదులు లేవు. సచ్చిదానంద స్వరూపం, బుద్ది, సాక్షి, జ్ఞానరూపి, శరీరేంద్రియాలను ప్రవర్తింపజేసి, వాటికంటే వేరుగా ఉంటూ… ఒకే రీతిలో ప్రకాశించేదే ఆత్మ. నేను అనేది శరీరేంద్రియానికి సంబంధించినది. ఇనుము అయస్కాంతాన్ని అంటిపెట్టుకుని ఎలా తిరుగుతుందో… ఆత్మకూడా శరీరాన్ని, శరీర ఇంద్రియాలను ఆశ్రయించి తిరుగుతుంది. అవి ఆత్మ వల్ల పనిచేస్తాయి. నిద్రలో శరీరేంద్రియాల సంబంధం ఉండదు. నిద్ర మేల్కొన్నతర్వాత నేను సుఖనిద్ర పొందాను అని భావిస్తారు. శరీర ఇంద్రియాలతో ప్రమేయం లేకుండా ఎదైతే సుఖాన్నిచ్చిందో అదే ఆత్మ. దీపాన్ని గాజుబుడ్డి ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా ఆత్మకూడా దేహ, ఇంద్రియాలను ప్రకాశింపజేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం. తత్వమసి మొదలైన వ్యాక్యాల్లో త్వం అనే పదం కించిత్ జ్ఞాత్వాదిశాశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. త్వం అంటే నీవు అని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ, పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మాలను వదిలివేయడగా సచ్చిదానంద రూపం ఒక్కటే నిలుస్తుంది. అదే ఆత్మ. దేహలక్షణాలు జన్మించుట, పెరుగుట, క్షీణించుట వంటివి ఆరు క్రమాలుంటాయి. అయితే ఆత్మకు అలాంటి లక్షణాలు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం ఉన్నది. వేదాల్లో దేనికి సర్వజ్ఞత్వం, ఉపదేశం, సంపూర్ణత్వం నిరూపించబడి ఉందో… అదే ఆత్మ. ఒక కుండను చూసి, అది మట్టితో చేసిందని ఎలా గుర్తిస్తామో… అలాగే ఒక దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి. జీవుల కర్మ ఫలాలను అనుభవించేవాడు పరమేశ్వరుడేనని, జీవులు ఆ కర్మలను ఫలాలని భావిస్తారని తెలుసుకోవాలి. అందువల్ల మానవుడు గుణసంపత్తు కలవాడై… గురుశుశ్రూష ఒనర్చి, సంసార సంబంధమైన ఆశలను విడిచి, విముక్తిని పొందాలి. మంచి పనులు తలచినంతనే చిత్తశుద్ధి, తద్వారా జ్ఞానం, భక్తి, వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందుతారు. అందువల్ల సత్కర్మానుష్టానం చేయాలి. మంచి పనులు చేస్తేగానీ ముక్తి లభించదు” అని అంగీరసుడు వివరించాడు.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి సప్తాదశాధ్యాయం – పదిహేడవ రోజు పారాయణ సమాప్తం

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం 16వ అధ్యాయం : స్తంభదీప ప్రశంస

       తిరిగి వశిష్టుడు జనకమహారాజుతో ఇలా చెబుతున్నాడు… ”ఓ మహారాజా! కార్తీక మాసం దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఆ నెలలో స్నాన, దాన, వ్రతాదులను చేయడం, సాలగ్రామ దానం చేయడం చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసంలో తనకు శక్తి ఉన్నా దానం చేయరో… అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుతారు. ఈ నెలరోజులు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుడతారు. ఆ విధంగా నెలలో ఏ ఒక్కరోజూ విడవకుండా తులసి కోటవద్దగానీ, భగవంతుని సన్నిధిలోగానీ దీపారాధన చేసినట్లయితే సమస్త పాపాలు నశిస్తాయి. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమిరోజు నదీస్నానమాచరించి, భగవంతుడి సన్నిధిలో ధూప దీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాలు, నారీకేళ ఫలాలు దానం చేసినట్లయితే… చిరకాలం నుంచి సంతానం లేనివారికి పుత్ర సంతానం కలుగుతుంది.

       సంతానం ఉన్నవారు ఇలా చేస్తే… వారికి సంతాన నష్టమనేది ఉండదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు. ఈ నెలలో ధ్వజస్తంభంలో ఆకాశ దీపం వెలిగించినవారు వైకుంఠంలో సకల భోగాలు అనుభవిస్తారు. కార్తీకమాసమంతా ఆకాశదీపంగానీ, స్తంభదీపంగానీ పెట్టి, నమస్కరించిన స్త్రీపురుషులకు సకలైశ్వర్యాలు కలిగి, వారి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆకాశదీపం పెట్టేవారు శాలిదాన్యంగానీ, నువ్వులుగానీ ప్రమిద అడుగున పోయాలి. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు, లేదా దీపం పెట్టేవారిని పరిహాసం చేసేవారు చుంచు జన్మ ఎత్తుతారు. ఇందుకు ఒక కథ ఉంది… చెబుతాను. సావధానంగా విను…” అని ఇలా చెప్పసాగాడు….

దీపస్తంభం.. విప్రుడగుట

       రుష్యాగ్రగణ్యుడైన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, దానికి దగ్గర్లో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించారు. నిత్యం పూజలు చేస్తూ ఉండేవారు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉండే మునులు కూడా అక్కడకు వచ్చి పూజాదికాలు నిర్వహించేవారు. ఒకరోజు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కినవారిని చూసి… ”ఓ సిద్ధులారా! కార్తీకమాసంలో హరిహరాదుల ప్రీతికోసం స్తంభదీపం పెట్టిన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా! రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికోసం ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి, దానిపై దీపం పెడదాం. అంతా కలిసి అడవికి వెళ్లి, నిడుపాటి స్తంభం తీసుకువద్దాం” అని కోరారు. అందుకు అంతా సంతసించి, పరమానందభరితులై అడవికి వెళ్లి, చిలువలు, వలువలు లేని ఓ చెట్టును మొదలు నుంచి నరికి, దాన్ని తీసుకొచ్చి, ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతారు. దానిపై శాలి ధాన్యముంది, ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి, అందులో వత్తిని వేసి, వెలిగించారు. ఆ తర్వాత వారంతా కూర్చుని పురాణ పఠనం చేయసాగారు. అంతలో “ఫళఫలా” మనే శబ్ధం వచ్చింది. వారు అటు చూడగా… వారు పాతిన స్తంభం పడిపోయి ముక్కలై కనిపించింది. దీపం కూడా ఆరిపోయి, చెల్లాచెదురుగా పడిపోయింది. ఆ దృశ్యం చూసినవారంతా ఆశ్చర్యంతో నిలబడిపోయారు. అంతలో ఆ స్తంభం నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. మునులంతా అతన్ని చూసి, ఆశ్చర్యంతో ”ఓయీ… నీవెవరవు? నీవీ స్తంభం నుంచి ఎలా వచ్చావు? నీ కథేంటి?” అని ప్రశ్నించారు.

       దానికి ఆ పురుషుడు మునులందరికీ నమస్కరించి, ”పుణ్యాత్ములారా! నేను కిందటి జన్మలో బ్రాహ్మణుడను. ఒక జమిందారుగా సకలైశ్వర్యాలతో తలతూగాను. నాపేరు ధన లోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండడం వల్ల మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలేక ప్రవర్తించాను. దుర్భుద్ధుల వల్ల వేదాలను చదవక, శ్రీహరిని పూజింపక, దానధర్మాలు చేయకుండా ఉంటిని. నేనను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలో ఎవరైనా విప్రులు వచ్చినా… వారితో నా కాళ్లను కడిగించి, ఆ నీటిని వారి తలపై వేసుకునేలా చేసి, నానా దుర్భాషలాడేవాడిని. నేను ఉన్నతాసనంపై కూర్చుని, అతిథులను నేలపై కూర్చోమని చెప్పేవాడిని. స్త్రీలను, పసిపిల్లలను హనీంగా చూసేవాడిని. జనాలంతా నా చేష్టలకు భయపడేవారు. నన్ను మందలించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. నేను చేసే పాపకార్యాలకు హద్దులేకపోయింది. ధర్మాలంటే ఏమిటో నాకు తెలియదు. ఇంత దుర్గార్గుడిగా, పాపిగా జీవితం గడిపి, అవసాన దశలో చనిపోయాను. ఆ తర్వాత ఘోర నరకాలు అనుభవించి, లక్ష జన్మలలో కుక్కగా, పదివేల జన్మలు కాకిగా, అయిదువేల జన్మలు తొండగా, అయిదు వేల జన్మలు పేడ పెరుగుగా, తర్వాత వృక్ష జన్మమెత్తి అరణ్యంలో కూడా ఉన్నాను. అయినా నేను చేసిన పాపాలను పోగొట్టుకోలేకపోయాను. ఇన్నాళ్లకు మీ దయవల్ల స్తంభంగా ఉన్న నేను నా రూపమెత్తి, జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీ మీకు తెలియజేశాను. నన్ను మన్నించండి” అని వేడుకొన్నాడు.

       ఆ మాటలు విన్న మునులంతా అమిత ఆశ్చర్యం పొందారు. ”ఆహా! కార్తీకమాసం మహిమ ఎంత గొప్పది? అంతేకాకుండా కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యంకాదు. కర్రలు, రాళ్లు, స్తంభాలు కూడా మన కళ్ల ఎదుట ముక్తిని పొందుతున్నాయి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశ దీపముంచిన వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది. అందువల్లే ఈ స్తంభానికి ముక్తికలిగింది” అని మునులు అనుకుంటుండగా… ఆ పురుషుడు మళ్లీ ఇలా మాట్లాడుతున్నాడు… ”ఓ మునులారా…! నాకు ముక్తి కలుగు మార్గమేమైనా ఉందా? ఈ జగంలో ఎల్లరకూ కర్మబంధం ఎలా కలుగుతుంది? అది ఎలా నశిస్తుంది? నా సంశయాన్ని తీర్చండి” అని ప్రార్థించారు. అంత అక్కడున్న మునులంతా… తమలో ఒకరగు అంగీరసమునితో ”స్వామీ…! మీరే అతని సంశయాన్ని తీర్చగల సమర్థులు. కాబట్టి వివరించండి” అని కోరిరి. అంతట ఆయన వారి సంశయాన్ని తీర్చేందుకు అంగీకారం తెలిపాడు.

ఇట్లు స్కాంధ పురాణాంతర్గతమై, వశిష్టులవారిచే చెప్పబడిన కార్తీకమహత్యమందలి పదహారో అధ్యాయం సమాప్తం

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యం

        కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ”త్రిపురి పూర్ణిమ”, ”దేవ దీపావళి” అని కూడా అంటారు. కార్తీక మాసం అంతా స్నాన, దాన, జప, ఉపవాసాలు చేస్తే మంచిదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అలా చేయడం కుదరనివారు ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో ఈ నాలుగింటిలో ఏదో ఒక దాన్ని ఆచరించినా సరిపోతుందనీ… అందుకు కూడా శక్తిలేనివారు పౌర్ణమినాడు శివాలయంలో దీపం వెలిగించినా పౌండరీక యజ్ఞంచేసినంత ఫలం లభిస్తుందనీ ప్రతీతి. అదే ‘కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యం’.

        పౌర్ణమి… ప్రతినెలా వస్తుంది. కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత. మరే పున్నమికీ ఉండదు. ఖగోళపరంగా చూస్తే… ఏడాది మొత్తమీదా జాబిలి ఆరోజు ఉన్నంత ప్రకాశంగా మరేరోజూ ఉండదు. అంతలా వెలిగిపోయే వెనె్నలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలూ జలాశయాలూ కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతుంటాయా రోజు.

        మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి.

కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

         రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు.

        కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి.

        కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. గురునానక్ జయంతి కూడా ఈరోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం 15వ అధ్యాయం : దీప ప్రజ్వలనం – ఎలుకకు పూర్వజన్మ స్మృతి

       తిరిగి జనక మహారాజుతో వశిష్టమహాముని ఇలా అంటున్నారు… ”ఓ జనకా! కార్తీక మహత్యాన్ని గురించి ఎంత చెప్పినా పూర్తికాదు. కానీ, ఇంకో ఇతిహాసం చెబుతాను. శ్రద్ధగా విను…” అని ఇలా చెప్పసాగెను.

       “ఈ నెలలో హరినామ సంకీర్తనలు చేయడం, వినడం, శివకేశవుల వద్ద దీపారాధన చేయడం, పురాణ పఠనం లేదా శ్రవణం, సాయం సమయాల్లో దేవతా దర్శనాలు విధిగా చేయాలి. అలా చేయనివారు కాలసూత్రమనే నరకంలో కొట్టుమిట్టాడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశిరోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. శ్రీమన్నారాయణును గంధపుష్పాలతో, అక్షితలతో పూజించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించినట్లయితే… విశేష ఫలం లభిస్తుంది. ఇలా నెలరోజులు క్రమం తప్పకుండా చేసిన వారు అంత్యమున దేవదుందుభులు మోగుతుండగా… వైకుంఠంలో విష్ణుసాన్నిధ్యం పొందగలరు. ఇలా నెలరోజులు పూజాదికాలు నిర్వర్తించలేనివారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణిమ రోజుల్లో నిష్టతో పూజ చేసి, ఆవునేతితో దీపం వెలిగించాలి. ఆవుపాలు పితికినంత సేపైనా దీపం వెలిగించిన వారికి తదుపరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది. ఇతరులు పెట్టిన దీపంలో నూనె వేసినా… అవసానదశలో ఉన్న దీపం వత్తిని పైకి జరిపి దీపాన్ని వృద్ధి చేసినా, కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించినా… వారి సమస్తపాపాలు హరిస్తాయి. దీనికి సంబంధించి ఒక కథ చెబుతాను విను…” అని ఇలా చెప్పసాగెను…

       సరస్వతి నదీ తీరంలో శిథిలమైన దేవాలయమొకటి ఉండేది. కర్మనిష్టుడైన దయార్థ్ర హృదయుడైన ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి, కార్తీకమాసమంతా అక్కడే గడిపి, పురాణ పఠనం చేయాలని తలంచాడు. ఆ పాడుబడ్డ దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి, నీళ్లతో కడిగి, బొట్టు పెట్టి, పక్కగ్రామాలకు వెళ్లి, ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులు చేసి, పన్నెండు దీపాలు పెట్టాడు. స్వామిని పూజిస్తూ… నిష్టతో పురాణాన్ని చదువుతుండెను. ఈ విధంగా కార్తీకమాసం ఆరంభం నుంచి చేయసాగాడు. ఒక రోజున ఓ ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించింది. నాలుగు మూలలు వెతికి, తినడానికి ఏమి దొరుకుతుందా? అని అక్కడ ఆరిపోయిన వత్తిని తినాలని నిర్ణయించుకుంది. అలా ఆ వత్తిని నోట కరుచుకుని తీసుకెళ్తుండగా… పక్కనే ఉన్న దీపానికి తగిలి, ఎలుక నోట్లో ఉన్న వత్తి కొసకు నిప్పు అంటుకుంది. అలా ఆరిపోయిన వత్తి వెలుగుతూ వచ్చింది. అది కార్తీకమాసం కావడం, శివాలయంలో ఆరిపోయిన వత్తిని ఎలుక వెలగించడం వల్ల దాని పాపాలు హరించుకుపోయి, పుణ్యం కలిగింది. వెంటనే దానికి మానవ రూపం సిద్ధించింది. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు కళ్లు తెరిచిచూడగా… పక్కనే ఒక మానవుడు నిలబడి ఉండడం గమనించాడు. ”ఓయీ…! నీవు ఎవరవు? ఎందుకు ఇలా నిలబడ్డావు?” అని ప్రశ్నించగా… అతను వినమ్రంగా… ”అయ్యా! నేను ఒక ఎలుకను. రాత్రి నేను తిండికోసం వెతుకుతుండగా ఈ ఆలయంలోకి వచ్చాను. ఇక్కడేమీ దొరక్కపోవడంతో నెయ్యివాసనలతో ఉన్న ఆరిపోయిన వత్తిని తినాలని దాన్ని నోటకరిచితీసుకువెళ్లసాగాను. పక్కనే ఉన్న దీపానికి తగిలింది. ఆ వత్తి వెలగడం వల్ల నా పాపాలు హరించుకుపోయాయనకుంటాను. అందుకే వెంటనే పూర్వజన్మమెత్తాను. కానీ… ఓ మహానుభావా! నేను ఎందుకీ మూషిక జన్మనెత్తానో, దానికి కారణమేమో తెలియదు. మీరు యోగిపుంగవుల్లా ఉన్నారు. దయచేసి, నాకు విశదీకరించండి” అని కోరాడు.

        అంతట ఆ యోగి ఆశ్చర్యంతో తన దివ్యదృష్టిచే సర్వం తెలుసుకుని ఇలా చెబుతున్నాడు… ”ఓయీ! నీవు కిందటి జన్మలో బ్రాహ్మణుడవు. నీ పేరు బహ్లికుడు. నీవు జైనమతానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ… ధనాశాపరుడవై దేవ పూజలు, నిత్యకర్మలను మరచావు. నీచుల సహవాసం చేశావు. నిషిద్ధాన్నం తిన్నావు. మంచివారు, యోగ్యులను నిందించావు. పరుల చెంత స్వార్థ చింతన కలిగిఉండడమే కాకుండా, ఆడపిల్లలను అమ్మే వృత్తిని చేపట్టి, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టావు. సమస్త తినుబండారాలను చౌకగా కొని వాటిని ఎక్కువ ధరలకు అమ్మావు. అలా అమ్మిన ధనాన్ని నీవు అనుభవించక… ఇతరులకు ఇవ్వక భూస్థాపితం చేసి, పిసినారివై జీవించావు. మరణించిన తర్వాత ఎలుక జన్మనెత్తి, వెనకటి జన్మ పాపాలను అనుభవించావు. భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవయ్యావు. దానివల్లే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి, నీవు నీగ్రామానికి వెళ్లి, నీ పెరట్లో పాతిన ధనాన్ని తవ్వితీసి, దాంతో దానధర్మాలు చేసి, భగవంతుడిని ప్రార్థిస్తూ మోక్షం పొందుము” అని నీతులు చెప్పి పంపాడు.

        చూశావా జనకమహారాజా! జీర్ణమైన ఓ వత్తిని తిరిగి వెలిగించినంతమాత్రాన ఒక మూషికం ఎంతటి ఫలితాన్ని పొందిందో?? ఇలా కార్తీకమాసంలో దీపం వెలిగించడం వల్ల, కనీసం కొండెక్కేందుకు సిద్ధంగా ఉన్న దీపంలో నూనెవేసి వృద్ధి చేసినా, జీర్ణమైన దీపాన్ని వెలిగించినా ఎలాంటి ఫలితాలు కలుగుతాయనడానికి ఈ వృత్తాంతం ఉదాహరణ…” అని వివరించాడు.

మ|| సదయా ఇంద్రియ ధేనువుల్ విషయ ఘాస గ్రాసలో లమ్ము లై

బ్రదు కుం బిడులు బట్టి నిన్మరిచి పోవంబోవ ప్రాయం పుప్రో

ద్ద దేడిందన్ పయిగమ్ము చికటిలలో నల్లాడవే సుంత నీ

మృదవౌ మోవిని పిల్ల గ్రోవి నీడలేని వేణు గోపాలకా||

స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య పంచ దశాధ్యాయ్ణ సమాప్త్ణ  15రోజు పారాయణం సమాప్తం

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

గురునానక్ జయంతి (1469–1539)

       గురు నానక్ దేవ్ (Guru Nanak) ఏప్రిల్ 15వ తారీఖు 1469లో పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్ లో జన్మించాడు. ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. ఇతను హిందూ మరియు ఇస్లామియా మత గ్రంథాలు చదివాడు కానీ ఇతను ఈ రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతమును స్థాపించాడు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతము. వీరు ఏక్ ఓంకార్ (ఏకైక దేవుడు)ని నమ్మతారు.

      పూర్తి వివరాలు : గొప్ప సంఘసంస్కర్తగా, మత గురువుగా ప్రసిద్ధిని పొందిన గురునానక్ 15వ శతాబ్దానికి చెందిన అతి విశిష్టమైన వ్యక్తి. ఇతడు పవిత్రతనూ, న్యాయాన్నీ, మంచితనం, భగవత్ ప్రేమలాంటి విషయాలను గురించి ప్రజలకు ఉపదేశం ఇచ్చాడు. లాహోర్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న నగరం)కు సమీపంలో ఉన్న తల్వండి రాయె భోయిలోని ఖత్రీల కుటుంబంలో గురునానక్ 1469 ఏప్రిల్ 15వ తారీఖున పౌర్ణమి రోజున జన్మించాడు. తృప్త, మెహతా కలు ఇతడి తల్లిదండ్రులు. ఇతడి తండ్రి ధనవంతుడైన ఒక గొప్ప జమీందారు వద్ద కొలువు చేశాడు. తన తల్లిదండ్రులకు గురునానక్ మూడవ సంతానం. ఇతడి జన్మస్థలమైన తల్పండిని ఈ రోజు మనం నన్‌కానా సాహిబ్ అనే పేరుతో పిలుస్తున్నారు. పసితనం నుండీ నానక్‌కు గురుభక్తి మెండుగా ఉండేది. అందరికీ ముక్తి మార్గం చూపేందుకు అతడు ఒక చోటు నుండీ మరొక చోటుకీ పోయేవాడు. అతడు సుదూర ప్రాంతాల వరకు టిబెట్, బెంగాల్, దక్కన్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, కందహార్, టర్కీ, బాగ్దాద్, మక్కా, మదీనాలను ప్రయాణం చేశాడు. అతడు భగవంతుడిని వాహేగురు అని పిలిచాడు. ప్రజలు తమను తాము అర్పించుకోవాలని ప్రజలకు అతడు సలహా ఇచ్చాడు. ఇతడు సిక్కుల మతాన్ని స్థాపించాడు. గొప్ప కవిగా, వేదాంతిగా, మానవతావాదిగా పేరును పొందాడు. ఇతడిని విశ్వకవి రవీంద్రనాధ్ టాగూర్ “మానవాళి గురుగు”గా అభివర్ణించాడు.

గురునానక్ అతి అమూల్యమైన కొన్ని ఉపదేశాలు :

* బయట కనబడే తీరు ముఖ్యం కాదు. బయటి రూపాన్ని చూసి మనిషి ప్రాశస్త్యాన్ని మనం అంచనా వేయలేము.

* భగవంతుడే అతి ముఖ్యమైన వాడు. దేవుడు ఒక్కడే అని అతడు ఉపదేశం చేశాడు.

* ఇతరుల సంపాదనపై ఆధారపడి జీవించకూడదు.

* దయ, సంతృప్తి, సహనం, సత్యం ఇవే ముఖ్యమైనవి.

* ఆకలితో అలమటించే వారికి అన్నం యిచ్చేవారినీ, గుడ్డల అవసరం ఉన్నవారికి గుడ్డలను ఇవ్వగల్గే వ్యక్తినే భగవంతుడు ప్రేమిస్తాడు.

* అందరూ గొప్ప పుట్టుక కలవారే.

* పేరాశను జయించిన వారిని భగవంతుడు ప్రేమిస్తాడు.

* అర్ధంలేని ఆచారాలు రూపరహితుడైన భగవంతుడిని అర్ధం చేసుకునే మార్గపు అవరోధాలు అవుతాయి.

* పవిత్రమైన హృదయంతో అతడిని ధ్యానించడం, అతడిని ప్రశంశించడం అన్నవే ముక్తి మార్గాలు.

సిక్కు గురువుల జాబితా :-

                 పేరు                           పుట్టిన తేదీ               గురువుగా స్వీకారం          స్వర్గస్థులైన తేదీ             వయస్సు

1              గురునానక్                 15 ఏప్రిల్ 1469         20 ఆగష్టు 1507               22 సెప్టెంబర్ 1539                69

2              గురు అంగద్            31 మార్చి 1504        7 సెప్టెంబర్ 1539            29 మార్చి 1552                  48

3              గురు అమర్ దాస్               5 మే 1479                  26 మార్చి 1552             1 సెప్టెంబర్ 1574                 95

4              గురు రామదాస్         24 సెప్టెంబర్ 1534       1 సెప్టెంబర్ 1574           1 సెప్టెంబర్ 1581                 46

5              గురు అర్జన్                 15 ఏప్రిల్ 1563           1 సెప్టెంబర్ 1581             30 మే 1606                      43

6              గురు హరగోవింద్       19 జూన్ 1595                25 మే 1606               28 ఫిబ్రవరి 1644                 48

7              గురు హరరాయ్         16 జనవరి 1630         3 మార్చి 1644               6 అక్టోబర్ 1661                   31

8              గురు హరక్రిష్ణ              7 జులై 1656                6 అక్టోబర్ 1661            30 మార్చి 1664                   7

9              గురు టెగ్ బహాదూర్    1 ఏప్రిల్ 1621               20 మార్చి 1665           11 నవంబర్ 1675               54

10           గురు గోవింద సింగ్       22 డిసెంబర్ 1666       11 నవంబర్ 1675        7 అక్టోబర్ 1708                   41

11           గురు గ్రంధ సాహిబ్       తెలియదు                   7 అక్టోబర్ 1708              తెలియదు                     తెలియదు

       “గురుగ్రంధసాహిబ్” సిక్కుల పవిత్ర గ్రంధం. పదిమంది సిక్కు గురువుల ఉపదేశాలూ, వారి సూక్తులూ ఇందులో సంగ్రహించబడి వున్నాయి. ఇందులో హిందూమతపు, మహమ్మదీయుల మతపు పండితుల, భక్తుల రచనలు చాలా ఉన్నాయి. ఈ మత గ్రంధమే సిక్కుమతానికి మార్గదర్శకత్వం వహిస్తుంది.సిక్కులు తమ మత స్థాపకుడి పటాన్నె ఆరాధిచడంగానీ ఏ ఇతర గురువుల పటాన్ని తమ మత గ్రంధం వద్ద పెట్టడం కానీ చేయరు. గురుగ్రంధ సాహెబ్‌ను గౌరవిస్తారు. “నేను దేవుడిని కాదు. నేను అతడి అవతారం కూడా కాదు. అతని సందేశాన్ని అందజేసే మత ప్రవక్తను మాత్రమే” అని గురునానక్ చెప్పాడు.

       నన్నాహాల్ సింగ్ రాసిన ఈ కవిత గురునానక్ సంపూర్ణ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది “పవిత్ర హృదయంతో అతడు పవిత్రతను ప్రబోధించాడు. ప్రేమావతారుడైన అతడు ప్రేమనౌ నేర్పాడు. వినయ సంపన్నుడైన అతడు విధేయతను నేర్పాడు. సదాచార సంపన్నుడైన అతడు దైవత్వాన్ని బోధించాడు. శాంతి దూత అయిన అతడు న్యాయాన్ని వాదించాడు. సమానత్వం, పైత్రతల సాకార రూపమైన అతడు భగవంతుడిపట్ల భక్తి, సదాచారం, గౌరవం ఉండాలని తెలియజేశాడు”.

       గురు నానక్ తన జీవిత చివరి సంవత్సరాల్లో ఉచిత ప్రసాదం లభించే కర్తార్ పూర్ లో జీవించారు. తన ఆహారాన్ని మత భేదం, కుల భేదం, ధన భేదం లేకుండా పంచుకునేవారు గురు నానక్. గురు నానక్ పొలాల్లో పనిచేసి జీవిక సాగించేవారు. కొత్త సిక్ఖు గురువుగా భాయ్ లెహ్నాను ప్రకటించాకా 22 సెప్టెంబర్ 1539లో 70వ ఏట మరణించారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం 14వ అధ్యాయం : ఆబోతుకు అచ్చువేసి వదులుట

        మళ్లీ వశిష్టమహాముని కార్తీక మాస మహత్యాలను గురించి తనకు తెలిసిన అన్ని విషయాలను జనకుడికి చెప్పాలనే కుతూహలంతో ఇలా చెబుతున్నారు… ”ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సవం చేయడం, శివలింగ సాలగ్రామాలను దానం చేయడం, ఉసిరికాయల్ని దక్షణతో దానం చేయడం మొదలగు పుణ్యకార్యాలు చేయడం వల్ల వెనకటి జన్మల్లో చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయి. అలా చేసేవారికి కోటి యాగాల ఫలితం దక్కుతుంది. వారి వంశానికి చెందిన పితృదేవతలు పైలోకాల నుంచి ఎవరు ఆబోతుకు అచ్చువేసి వదులుతారో? అని చూస్తుంటారు. ప్రతిసంవత్సరం కార్తీక మాసంలో శక్తికొలదీ దానం చేసి, నిష్టతో వ్రతమాచరించి, శివకేశవులకు ఆలయంలో దీపారాధన చేసి, పూజరోజున రాత్రంతా జాగారం ఉండి, మర్నాడు శక్తికొలదీ బ్రాహ్మణులు, సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహ, పర లోకాల్లో సర్వసుఖాలను పొందగలరు” అని వివరించారు.

       కార్తీకమాసంలో చేయాల్సిన పనులను చెప్పిన వశిష్టుడు మరికొన్ని నిత్యాచరణ విధులతోపాటు, చేయకూడనివేవో ఇలా చెబుతున్నాడు… ”ఓ రాజా! పరమ పవిత్రమైన ఈ నెలలో పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. నీరుల్లి తినకూడదు. తిలాదానం తగదు. శివార్చన, సంధ్యావందనం, విష్ణుపూజ చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారాల్లో సూర్యచంద్ర గ్రహణం రోజుల్లో భోజనం చేయరాదు. కార్తీక మాసంలో నెలరోజులూ రాత్రుళ్లు భోజనం చేయకూడదు. ఈ నెలలో విధవ వండింది తినకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం చేయాలి. ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి. ఈ నెలో ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయకూడదు. పురాణాలను విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడినీటితో స్నానం కల్తుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి, వేడినీటి స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యం ఉంది, ఎలాగైనా విడవకుండా కార్తీకమాస వ్రతం చేయాలనే కుతూహలం ఉన్నవారు మాత్రమే వేడినీటి స్నానం చేయొచ్చు. అలా చేసేవారు గంగా, గోదావరి, సరస్వతీ, యమునా నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానం చేయాలి. తనకు దగ్గరగా ఉన్న నదిలో ప్రాత్ణకాలంలో పూజ చేయాలి. నదులు అందుబాటులో లేని సమయంలో నూతిలోగానీ, చెరువులో గానీ స్నానం చేయవచ్చు. ఆ సమయంలో కింది శ్లోకాన్ని స్మరించుకోవాలి…

శ్లో|| గంగే యమునే చైవ గోదావరి సరస్వతి

నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిదింకురు||

       “కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథా కాలక్షేపంతో కాలం గడపాలి. సాయంకాలంలో సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తిచేసుకుని, శివుడిని కల్పోక్తంగా పూజించాలి” అని వివరించారు. అనంతరం కార్తీకమాస శివపూజాకల్పాన్ని గురించి వివరించారు.

కార్తీక మాస శివ పూజ కల్పము

1    ఓం శివాయ నమ్ణ ధ్యానం సమర్పయామి

2    ఓం పరమేశ్వరాయ నమ్ణ అవాహం సమర్పయామి

3    ఓం కైలసవాసయ నమ్ణ నవరత్న సంహాసనం సమర్పయామి

4    ఓం గౌరీ నాథాయ నమ్ణ పాద్యం సమర్పయామి

5    ఓం లోకేశ్వరాయ నమ్ణ అర్ఘ్యం సమర్పయామి

6    ఓం వృషభ వాహనాయ నమ్ణ స్నానం సమర్పయామి

7    ఓం దిగంబరాయ నమ్ణ వస్త్రం సమర్పయామి

8    ఓం జగన్నాథాయ నమ్ణ యజ్ఞో పవితం సమర్పయామి

9    ఓం కపాల ధారిణే నమ్ణ గంధం సమర్పయామి

10  ఓం సంపూర్ణ గుణాయ నమ్ణ పుష్పం సమర్పయామి

11   ఓం మహేశ్వరాయ నమ్ణ అక్షతాన్ సమర్పయామి

12   ఓం పార్వతీ నాథాయ నమ్ణ దుపం సమర్పయామి

13  ఓం తేజో రూపాయ నమ్ణ దీపం సమర్పయామి

14  ఓం లోక రక్షాయ నమ్ణ నైవైధ్యం సమర్పయామి

15  ఓం త్రిలోచనాయ నమ్ణ కర్పూర నీరాజనం సమర్పయామి

16  ఓం శంకరాయ నమ్ణ సవర్ణ మంత్ర పుష్పం సమర్పయని

17  ఓం భావయ నమ్ణ ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి

       ఈ ప్రకారం కార్తీకమాసమంతా పూజలు నిర్వహించాలి. శివసన్నిధిలో దీపారాధన చేయాలి. ఈ విధంగా శివపూజ చేసినవారు ధన్యులవుతారు. పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమర్థన చేసి, దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఇలా చేసినట్లయితే.. నూరు అశ్వమేథాలు, వేయి వాజపేయి యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో నెలరోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమాచరించనివారు వంద జన్మలు నానాయోనులయందు జన్మించి, ఆ తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలనెత్తుతారు. ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించేవారు పదిహేను జన్మల పూర్వజ్ఞానాన్ని పొందుతారు. వ్రతం చేసినా, పురాణం చదివినా, విన్నా అట్టివారు సకలైశ్వర్యాలను పొందుతారు. అంత్యమున మోక్షాన్ని పొందెదరు”.

ఇట్లు స్కాందపురాణాంతర్గతమందలి వశిష్టుడు బోధించిన కార్తీ మహత్యం… పద్నాలుగో అధ్యాయం సమాప్తం.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం 13వ అధ్యాయం : కన్యాదాన ఫలం, సువీరచరిత్రము

       తిరిగి వశిష్టుడు జనకుడితో ఇలా అంటున్నాడు ”ఓ మహారాజా! కార్తీకమాసంలో ఇంకా విధిగా చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటిని వివరిస్తాను విను… కార్తీకమాసంలో నదీస్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ముఖ్యం. ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చు అంతా భరించే శక్తిలేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాలు, సంభావనలతో తృప్తిపరిచినా ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఓ పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసినట్లయితే… ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి. ఎన్ని బావులు, చెరువులు తవ్వించినా… పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో కన్యాదానం చేసినట్లయితే… తను తరించడమే కాకుండా… తన పితృదేవతలను కూడా తరింపజేసినవారవుతారు. ఇందుకు ఒక వృత్తాంతముంది. చెబుతాను విను…” అని ఇలా చెప్పసాగాడు…

సువీర చరితం

       పూర్వం వంగ దేశంలో గొప్ప పరాక్రమ వంతుడు, శూరుడు అయిన ”సువిరు” డను ఒక రాజు ఉండేవాడు. అతనికి రుపవతి అయిన భార్య ఉంది. ఒకసారి అతను శత్రురాజులచే పరాజితుడయ్యాడు. దీంతో అతను భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి, ధన హీనుడై, నర్మదానదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని, కందమూలాలు భక్షిస్తూగడపసాగాడు. కొన్నాళ్లకు అతని భార్య ఒక బాలికను కన్నది. ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుచుండేవారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా… శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రోజురోజూ అభివృద్ధి కాసాగింది. అతిగారాబంతో పెరగసాగింది. అలా రోజులుగడుస్తుండగా… ఆ బాలిక యవ్వనవతియైంది. ఒక దినాన వానప్రస్తుడి కుమారుడు ఆ బాలికను చూసి, అందచందాలకు పరవశుడై, తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు. అందుకా రాజు ”ఓ మునిపుత్రా…! ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను. మా కష్టాలు తీరేందుకు కొంత ధనమిచ్చినట్లయితే… నా బిడ్డనిచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు. దాంతో ఆ మునిపుత్రుడు చేతిలో పైసా లేకున్నా… బాలికపై ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు. కుబేరుడిని మెప్పించి, ధన పాత్ర సంపాదించాడు. రాజు ఆ పాత్రను తీసుకుని, సంతోషించి, తన కుమార్తెను ముని కుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. నూతన దంతపతులిద్దరినీ అత్తవారింటికి పంపాడు.

        అలా మునికుమారుడు తన భార్యను వెంటబెట్టుకుని, తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, నమస్కరించి, జరిగిన సంగతిని చెప్పాడు. తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు. అయితే సువీరుడు మునికుమారుడిచ్చిన పాత్రను తీసుకుని, స్వేచ్ఛగా ఖర్చుచేస్తూ… భార్యతో సుఖంగా ఉండసాగాడు. కొంతకాలానికి అతనికి మరో బాలిక జన్మించింది. ఆమెకు కూడా యుక్తవయసు రాగానే, ఎవరికైనా ధనానికి అమ్మాలనే ఆశతో ఎదురుచూడసాగాడు.

        ఒక సాధువు తపతీ నదీ తీరం నుంచి నర్మదా నదీ తీరానికి స్నానార్థం వస్తుండగా… దారిలో ఉన్న సువీరుడిని కలుసుకున్నాడు… ”ఓయీ! నీవెవరు? నీ ముఖ వర్చస్సు చూస్తే రాజవంశంలో పుట్టినవాడిలా ఉన్నావు. ఈ అడవిలో ఏం చేస్తున్నావు? భార్యాపిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణమేమిటి?”అని ప్రశ్నించాడు. దానికి సువీరుడిలా చెబుతున్నాడు… ”ఓ మహానుభావా! నేను వంగదేశాన్ని పరిపాలించేవాడిని. నా పేరు సువీరుడు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడంతో భార్యాసమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమేది ఉండదు. పుత్రశోకం కంటే దు:ఖం ఉండదు. అలాగే భార్యావియోగం కంటే సంతాపం వేరొకటి లేదు. అందువల్ల రాజ్యభ్రష్టుడనైనా… ఈ కారడవిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బతుకుతున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకు ఇచ్చి, వాడి వద్ద కొంత దానం తీసుకున్నాను. దాంతో ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తున్నాను” అని చెప్పగా… ”ఓ రాజా! నీవు ఎంతటి దరిద్రుడవైనా… ధర్మ సూక్షం ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్య విక్రయం మహాపాతకం. కన్యను విక్రయించువాడు అసి పత్రవానమనే నరకాన్ని అనుభవిస్తాడు. ఆ ద్రవ్యాలతో చేసే వ్రతం ఫలించదు. కన్య విక్రయం చేసేవారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపిస్తారు. అలాగే కన్యను ధనమిచ్చి కొని, పెండ్లాడిన వారి గృహస్థధర్మాలు వ్యర్థమగుటయేకాకుండా, అతను మహా నరకం అనుభవిస్తాడు. కన్యను విక్రయించేవారికి ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి రాబోయే కార్తీక మాసంలో రెండో కుమార్తెకు శక్తికొలదీ బంగారు ఆభరణాలతో అలంకరించి, సదాచార సంపన్నుడికి, ధర్మబుద్ధిగలవాడికి కన్యాదానం చేయి. అట్లు చేసినట్లయితే గంగాస్నానం, అశ్వమేథయాగ ఫలాలను పొందుతావు. మొదటి కన్యను అమ్మిన పాప ఫలాన్ని తొలగించుకున్న వాడివవుతావు” అని రాజుకు హితోపదేశం చేశాడు.

       అందుకారాజు చిరునవ్వుతో… ”ఓ మునివర్యా! దేహసుఖం కంటే దానధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువా? తాను బతికుండగానే భార్యాబిడ్డలు, సిరిసంపదలతో సుఖంగా ఉండకుండా, చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాలను చేతులారా జార విడుచుకోమంటారా? ధనం, బంగారం కలవాడే ప్రస్తుతం లోకంలో రాణించగలడు. కానీ, ముక్కుమూసుకుని, నోరుమూసుకుని, బక్కచిక్కి శల్యమైనవాడిని లోకం గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్పసుఖాలు. కాబట్టి నా రెండో బిడ్డను నేనడిగతినంత ధనం ఇచ్చే వారికే ఇచ్చి పెండ్లిచేస్తాను. కానీ, కన్యాదానం మాత్రం చేయను” అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు ఆ సన్యాసి ఆశ్చర్యపడి, తన దారిన తాను వెళ్లిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు. వెంటనే యమ భటులు వచ్చి, అతన్ని తీసుకుపోయిరి. యమలోకంలో అసిపత్రవనం అనే నరకంలో పారేశారు. అక్కడ అనేక విధాలుగా బాధించారు. సువీరుడికి పూర్వికుడైన శ్రుతుకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పాలించి, ధర్మాత్ముడై మృతిచెంది, స్వర్గాన్ని పొందాడు. అయితే ఆయన వంశజుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల శ్రుతుకీర్తి కూడా స్వర్గం నుంచి నరకానికి వచ్చాడు. అంతట శ్రుతకీర్తి ”నేను ఒకరికి ఉపకారం చేశానే తప్ప అపకారమెన్నడూ చేయలేదు. దానధర్మాలు, యజ్ఞయాగాదులు చేశాను. అయినా.. నాకు ఈ దుర్గతి ఎలా?” అని నిండు కొలువులో యమధర్మ రాజును ప్రశ్నించాడు.

       వినయంగా ఇలా చెబుతున్నాడు… ”ప్రభూ… నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధిశాలివి. ప్రాణకోటిని తరతమ తారతమ్య బేధాలు లేకుండా సమానంగా చూస్తావు. నేనెన్నడూ పాపం చేయలేదు. అయితే నన్ను స్వర్గం నుంచి ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు? కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. దానికి యమధర్మరాజు శ్రుతకీర్తిని చూచి ”ఓయీ… నీవు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవే. నీవు ఎలాంటి దూరాచారం చేయలేదు. అయినా… నీ వంశీయుడైన సువీరుడు తన జేష్ఠ పుత్రికను అమ్ముకొన్నాడు. కన్యను అమ్ముకునే వారు, వారి పూర్వికులు ఎంతటి పుణ్యవంతులైనా… నరకాలను అనుభవించక తప్పదు. నీచజన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవే. అయితే నీకో మార్గం చెబుతాను. నీకు మానవ శరీరాన్ని ఇస్తాను. నీ వంశీయుడైన సువీరుడికి ఇంకో కుమార్తె ఉన్నది. ఆమె నర్మదానదీ తీరంలో తల్లివద్దే పెరుగుతున్నది. అక్కడకు పోయి, ఆ కన్యను వేద పండితుడు, శీలవంతుడికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయి. నీవు, మీవాళ్లు ఆ పుణ్యఫలంతో స్వర్గానికి వెళ్తారు” అని చెప్పాడు. ”పుత్రికాసంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానంచేసినా, విధిగా ఆంబోతుకు వివాహం చేసినా కన్యాదాన ఫలం వస్తుంది. కావున నీవు భూలోకానికి వెళ్లి నేను చెప్పినట్లు చేయి. ఆ కార్యం కారణంగా పితృగణమంతా తరిస్తారు” అని యముడు సెలవిచ్చెను.

       శ్రుతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకుని, నర్మదా నదీతీరంలో ఒక పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను, కుమార్తెను చూచి, సంతోషపడి, ఆమెతో అసలు విషయం చెప్పి, కార్తీక మాసంలో సువీరుడి కూతురిని కన్యాదానం చేశాడు. ఆ వెంటనే సువీరుడు, శ్రుతకీర్తి, వారి పూర్వీకులు పాపవిముక్తులై, స్వర్గలోకాన్ని చేరారు.

       “ఓ జనకమహారాజా! కార్తీకంలో కన్యాదానానికి అంతటి శక్తి ఉంది. అత్యంత పుణ్యఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కార్తీకమాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణుసాన్నిధ్యాన్ని పొందుతాడు” అని వివరించాడు.

ఇతి శ్రీ స్కాంధపురాణాంతర్గత, వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య: త్రయోదశాధ్యాయ సమాప్త: –పదమూడో రోజు పారాయణం సమాప్తం

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)