Categories
Vipra Foundation

భోగి పండుగ

      దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు – భోగిమంటలు. భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు.

       సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే ముందురోజు భోగి పండుగగా ప్రసిద్ధి. ఈ భోగి పండుగనాడు పాత వస్తువులను, పాతచీపుర్లను, ఎండిపోయన కొబ్బరి మట్టలను, తాటాకులను పోగుచేసి తెల్లవారు ఝామున వేసే మంటలనే భోగిమంటలు అంటారు. ఇలా చేయడం వల్ల శని దూరమవుతుందని అంటారు.

       ధనుర్మాసారంభంనుంచి గోదాదేవితో పాటు పాండురంగడి పూజ, కాత్యాయనీ వత్రం చేసిన భక్తులందరూ శ్రీ పాండురంగనికి గోదాదేవికి కల్యాణం ఈ రోజున జరుపుతారు.ప్రతినెలా సంక్రాంతి వచ్చినా మకర సంక్రాంతికి ప్రాముఖ్యం ఏర్పడి సంక్రాంతి పండుగ జరుపుకోవడం అనుచానంగా వస్తున్న ఆచారం.

        ఈ సంక్రాంతి వేళలో శ్రీమద్భగవద్గీత పఠనం, గంగాస్నానం, త్రికాల గాయత్రి సంధ్యావందనం, గోవిందనామ స్మరణం వంటి నాలుగు విధులను ఆచరిస్తే పునర్జన్మ వుండదని శాస్త్ర వచనం – ఉత్తరాయణంలో మరణిస్తే ఉత్తమగతి కలుగుతుందని అంటారు. కురుక్షేత్ర సంగ్రామంలో దక్షిణాయనంలో నేలకొరిగిన భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి వుండి స్వచ్ఛంద మరణాన్ని కోరుకున్నాడు. సంక్రాంతి నాడు దేవతలకూ, పితృ దేవతలకూ ఏఏ పదార్థాలను దానం చేస్తామో అవి అత్యధికంగా జన్మజన్మలకి లభిస్తాయని అంటారు.

       సంక్రాంతి రైతులకు పంట వచ్చే కాలం. ఈ రోజున ఇంటికి సున్నాలు వేసుకొని, గుమ్మాలకు మామిడితోరణాలు, బంతి మాలలు అలంకరించి పౌష్యలక్ష్మికి స్వాగతం పలుకుతారు. కనె్నపిల్లలందరూ వాకిళ్లను అందమైన ముగ్గులతో అలంకరిస్తారు. ఆవుపేడతో గొబ్బెమ్మలను తయారు చేసి పసుపుకుంకుమలతో వాటిని అర్చిస్తారు. తంగేడు పూలు, గుమ్మడి పూలతో గొబ్బెమ్మలను అలంకరించి ‘గొబ్బియలో,’ ‘గొబ్బియలో’ అంటూ గొబ్బిపాటలు పాడుతారు.

తెలతెలవారుతుండగానే హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల మేళాలు, పగటివేషగాళ్లు ఇలాంటి జానపద కళాకారులు ఇంటింటికి తిరిగి వారి కళను ప్రచారం చేసుకొంటారు. ఆ కళాకారులను రైతులు, గృహస్థులు గౌరవించి వారు పండించుకొన్న ధాన్యాదులను, కొత్తబట్టలు ఇచ్చి వారిని సంతోషపరుస్తారు. పిల్లలు గాలిపటాలను ఎగురవేస్తారు. పక్షుల కోసం వరికంకులను వాకిళ్లకు కట్టి వాటికి విందుచేస్తారు. ఈ భోగిపండుగ మూడవ నాడు కనుమను జరుపుతూ పశువులను అలంకరించి, పొంగళ్లను పెట్టి పశుపూజను చేస్తారు. ఇలా సంక్రాంతి మూడురోజులు జరుపుకుంటూ తమ జీవితాలలో నూతన కాంతి తెస్తుందని ఆబాలగోపాలం సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తారు.

         శుచి శుభ్రతలను పాటించమనే ఈ భోగిపండుగ శాస్తర్రీత్యా కూడా ఆరోగ్యాన్నిస్తుందంటారు. మూగజీవాలను కూడా కాపాడమనే ఈ భోగి మానసిక శాంతిని కలుగచేస్తుందంటారు కొందరు. జప తప ధ్యానాది ఆధ్యాత్మిక సాధనలు, పురాణ పఠనాదులు, దానధర్మాలు, మొదలైన సత్కర్మల ద్వారా విముక్తి లభింపచేసే శక్తి ఈ పండుగకు ఉందని పెద్దలంటారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

స్వామీ వివేకానంద జయంతి

(జనవరి 12, 1863 – జూలై 4, 1902)   

         స్వామీ వివేకానంద‘‘ఒక వ్యక్తి తనను తాను ఎలా భావిస్తాడో అదే అవుతాడు. తాను బలహీనుడినని భావిస్తే బలహీనుడే అవుతాడు, బలవంతుడిని అని భావిస్తే బలవంతుడే అవుతాడు, కార్యసాధన యత్నంలో ఎదురయ్యే ఆటంకాలను, పొరపాట్లను లక్ష్యపెట్టకూడదు. ఓటమిని లెక్క చేయకూడదు. తిరోగమనాలనూ సహించాలి. లక్ష్యసాధన కోసం వెయ్యి ప్రయత్నాలైనా చేయాల్సిందే. అప్పటికీ ఫలించకపోతే మరో ప్రయత్నానికి సిద్ధం కావాలి”

    “నీ శక్తే నీ జీవితం… నీ బలహీనతే నీ మరణం…”

         ఇటువంటి ఎన్నో అమూల్యమైన జీవిత సత్యాలను ప్రపంచానికి చాటిచెప్పిన మహామనిషి స్వామీ వివేకానంద. ఆయన 1863 జనవరి 12న జన్మించారు. మహా గురువు రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన వివేకానందుని పూర్వ నామం నరేంద్ర నాధుడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రసంగాలు చేసి వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములను సమాజానికి అందించారు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే చిరకాలంగా నిలిచిపోయే మహోన్నత ఆధ్యాత్మిక నాయకుడు. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.

        తన భావాలను సమాజానికి పంచి మేల్కొలిపిన మహానుభావుడు. తన ప్రసంగాలతో భారతదేశాన్ని జాగృతము చేశారు. అంతేకాదు విదేశాలలో సైతం తన ఉపన్యాసములతో జీవిత పరమార్థాన్ని బోధించాడు. హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు. ఆయన వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి వివేకానందుడే.

  తన గురువు రామకృష్ణుడు నేర్పిన ‘జీవుడే దేవుడు’ అనేది వివేకానందుని మంత్రముగా మారింది. ‘దరిద్ర నారాయణ సేవ’ ఆ భగవంతునికి చేసే సేవతో సమానమన్నారు. విశ్వమంతా బ్రహ్మం నిండి ఉందనీ, హెచ్చు తగ్గులు లేవనీ చాటారు. అందరు తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వాన్ని చాటిచెప్పారు.

        ఇలా హిందూ ధర్మాన్ని దశదిశలా వ్యాపింపచేసిన వివేకానందుడు… విదేశాలలో పర్యటనలు ముగించుకుని మన దేశానికి తిరిగి వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ 39 ఏళ్ళ వయసులోనే పరమపదించారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని “జాతీయ యువజన దినోత్సవం” గా ప్రకటించింది.

  • వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)
Categories
Vipra Foundation

లాల్‌బహాదుర్‌శాస్ర్తి వర్ధంతి

భారతదేశ ప్రగతికి రైతే ప్రధానం. కర్షకుడు సంతోషంగా ఉన్న రోజున మన దేశం అభివృద్ధి చెందిన దేశమని చెప్పవచ్చు. చలి, ఎండ, వానకు ఎరువక కుటుంబాన్ని వదిలి సరిహద్దులో ఉన్న సైన్యం ప్రశాంతంగా ఉన్న నాడు దేశ రక్షణకు ఇబ్బందిలేదు. అందుకే జై జవాన్‌.. జై కిసాన్‌ అని నేను అంటున్నాను.. అన్నాడు మన దేశ రెండవ ప్రధాని లాల్‌బహదుర్‌ శాస్ర్తి.(ఈయన కంటే ముంద గుల్జారీలాల్‌ నందా ప్రధానిగా చేసినా అది తాత్కాలిక బాధ్యతలు మాత్రమే.. కాబట్టి అధికారికంగా రెండవ ప్రధాని శాస్ర్తిగారే..)

లాల్‌ బహదుర్‌ శాస్ర్తి

ప్రధానమంత్రి పదవిలో…

జూన్‌ 9, 1964 – జనవరి 11, 1966

విదేశీ వ్యవహారాల మంత్రిగా…

9 జూన్‌, 1964 – 18 జులై, 1964

హోం మంత్రిగా…

4 ఏప్రిల్‌ 1961- 29 ఆగస్టు 1963

జననం : 2 అక్టోబరు 1904

ప్రాంతం : మొగల్‌సారాయ్‌, ఉత్తరప్రదేశ్‌

మరణం : 11 జనవరి 1966 (వయసు 61)

ప్రాంతం : తాష్కెంట్‌, ఉజ్బెకిస్తాన్‌

వృత్తి : రాజకీయాలు

రాజకీయ పార్టీ : భారత జాతీయ కాంగ్రెస్‌

భార్య : లలితా దేవి

లాల్‌ బహాదుర్‌ శాస్ర్తి భారత దేశ రెండవ శాశ్వత ప్ర ధానమంత్రి, దేశ స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి. దేశ ప్రజలతోనే కాదు ఇతర దేశాధినేతలతో నూ పొట్టివాడైనా గట్టివాడు అనిపించుకున్నాడు. ఉత్తరప్ర దేశ్‌ రాష్ట్రంలోని మొగల్‌ సరాయ్‌లో లాల్‌ బహదూర్‌ 1904 అక్టోబర్‌ 2న శారదా ప్రసాద్‌, రామ్‌దులారీ దేవీలకు జ న్మించాడు. తండ్రి శారదాప్రసాద్‌ రాయ్‌ ఒక నిరుపేద. బతకలేక బడిపంతులు అని అనుకుంటున్న ఆ రోజుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కు టుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత జన్మించిన లాల్‌ బహదూర్‌ను చూసుకొని ఆ త ల్లిదండ్రులెంతో మురిసిపోయారు. బ్రిటీషు దాస్యశృంఖా లలో మగ్గిపోతున్న భారతదేశాన్ని స్వంతంత్రంగా చేయా లని అప్పటికే కృషి చేస్తున్న మహాత్మాగాంధీ జన్మదినమైన అక్టోబరు 2న, తమకు కుమారుడు కలగటం, ఆ దంపతు లకు మరీ ఆనందం కలుగచేసింది. నిరాడంబరతకు తో డు ఎంతో అభిమానవంతుడైన లాల్‌ బహదూర్‌ స్కూలుకు వెళ్ళటానికి ప్రతి రోజు గంగానదిని దాటి వెళ్ళవలసి ఉండే ది. నది దాటించే పడవ వాడికి ప్రతి రోజు కొంత పైకం యివ్వాలి.

అది స్వల్పమే అయినా లాల్‌ బహదూర్‌ దగ్గర అప్పుడప్పుడు ఉండేదికాదు. పడవ మనిషిని అడిగితే ఊ రికే నది దాటించగలడు. అయినా అభిమానవంతుడైన లాల్‌బహదూర్‌ అలా ప్రాధేయపడటం ఇష్టంలేక తన బట్టలను విప్పి, వాటిలో పుస్తకాలను చుట్టి మూటలా కట్టి, తన వీపునకు తగిలించుకుని, ప్రాణాలను సైతం తెగించి అవతలి ఒడ్డుకు ఈదుకుని వెళ్ళేవాడు. దురదృష్టవశా త్తు ఏడాదిన్నరకే లాల్‌ బహదూర్‌ తండ్రి మరణించ డంతో, ఆ కుటుంబం దిక్కులేని నావలా నిరాధా రమైంది. ఆ కుటుంబాన్ని లాల్‌ బహదూర్‌ తాత ఆదుకుని వారికి ఆశ్రయం కలిగించాడు. తాత గారింట భయభక్తులతో పెరిగిన లాల్‌ బహ దూర్‌ తన పాఠశాలలో ఎంతో నిరాడంబరం గా ఉంటూ ఉపాధ్యాయుల ప్రేమాభిమానా లను చూరగొన్నాడు. తోటి విద్యార్థులు త నకు తండ్రి లేడని గేలిచేస్తూ హేళన చేస్తు న్నప్పటికీ ఆ దు:ఖాన్ని దిగమింగి, ఉపా ధ్యాయులకు ఫిర్యాదు చేయక, వారితో పాటు ఆడుతూ, పాడుతుండేవాడు.

స్వాతంత్య్రోద్యమం..

1921లో గాంధీ ప్రారంభించిన సహా య నిరాకరణోద్యమంలో పాల్గొనడా నికి కాశీలోని జాతీయవాద కాశీ విద్యా పీఠంలో చదవడం ప్రారంభించాడు. 1926లో శాస్ర్తి అనే పట్టభద్రుడయ్యా డు. స్వాంతంత్య్రోద్యమ పోరాటకా లంలో తొమ్మిది సంవత్సరాలు జైలు లోనే గడిపాడు. సత్యాగ్రహ ఉద్య మం తర్వాత 1940 నుండి 1946 వరకు ఈయన జైళ్లోనే ఉన్నాడు.

రాజకీయ జీవితం : స్వాతంత్య్రం త ర్వాత, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ మంత్రివర్గంలో గృహ మంత్రిగా పని చేశాడు. 1951లో లోక్‌సభ ప్రధాన కార్యద ర్శిగా నియమితుడయ్యాడు. ఆ తరువాత కేంద్ర రైల్వే శాఖా మంత్రిగా పనిచేశాడు. తమిళనాడులోని అరి యళూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతి క బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశా డు. తర్వాత కేంద్ర మంత్రి వర్గంలో చేరి తొలుత ర వాణా శాఖ మంత్రిగా, గృహ మంత్రిగా, హోంశాఖా మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశాడు.

ప్రధానమంత్రిగా.. : 1964లో అప్పటి ప్రధాని నెహ్రూ మరణం తరువాత అతని స్థానాన్ని పూరించడానికి, లాల్‌ బహదూర్‌ శాస్ర్తీ, మొరార్జీదేశాయ్‌ సిద్ధంగా ఉండగా, అప్ప టి కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంటు కామరాజ్‌ సోషలిస్టు భావా లున్న లాల్‌ బహదూర్‌ శాస్ర్తీకి మద్దతుపలికాడు. శాస్ర్తి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభాన్ని తాత్కాలికంగా పరిష్కరించడానికై విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేశాడు. దీర్ఘకాలిక పరిష్కారానికి దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్‌ రెవల్యూషన్‌) బాటలు పరిచాడు. 1965 ఆగష్టులో పాకిస్తాన్‌ తన సేనలను ప్రయోగించి జమ్మూకా శ్మీర్‌లోని కచ్‌ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. జమ్మూ కాశ్మీర్‌ లో ప్రజలు ఉద్యమించి, భారతదేశం నుంచి విడిపోతార ని ఆశించింది. అటువంటి ఉద్యమం పుట్టలేదు. పాకిస్తాన్‌ ఆక్రమణ గురించి తెలుసుకున్న శాస్ర్తి త్రివిధ దళాలకు ని యంత్రణ రేఖను దాటి లాహోర్‌ను ఆక్రమించుకోవడానికి ఆదేశాలు ఇచ్చి ధీర పటిమను ప్రదర్శించారు.

మరణంపై

వీడని మిస్టరీ…

తాష్కెంట్‌లో ఉన్న సమయంలో శాస్ర్తిగారు మరణించారు. చనిపోవడానికి కొద్ది సేపటి ముందు తన వ్యక్తిగత సహాయకుడు చేసిన వంట కాకుండా.. ఆయన భారత రాయబారి టిఎన్‌ కౌల్‌ వంట మనిషి జాన్‌ మహమ్మద్‌ చేసిన వంట తిన్నారు. ఆ తర్వాత ఆయన శరీరం నీలంగా మారడం, సహజ మరణమేనని ఓ పత్రంపై సంతకం చేయమన్నా వ్యక్తిగత సహాయకులు నిరాకరించడం అనుమానాలకు తావిచ్చింది. చివరకు లలితా శాస్ర్తి 1970లో తన భర్త మరణంపై విచారణకు డిమాండ్‌ కూడా చేశారు.

  • వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)
Categories
Vipra Foundation

శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి (దత్త జయంతి)

       దత్తాత్రేయని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందునా దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది.ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.

       అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదు:ఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి సుమతి అనే పతివ్రత వలన సూర్యోదయం ఆగిపోగా, ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది. ఆ వ్రత ఫలితంగా మార్గశిర పౌర్ణమి రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు. ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి.

       అతని సతీమణి అనఘాదేవి. అఘము అనగా పాపము అనఘ అనగా పాపము లేనిది పాపము మూడు విధాలు మనసు తో, బుద్దితో, ఇంద్రియములతో, మూడు విధాల పాపములు పోగట్టునది అనఘ.

       దత్తుని రూపంలో అంతరార్థం: : శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే •   మూడు శిరస్సులు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.

నాలుగు కుక్కలు: నాలుగు వేదములు ఇవి. దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు.

ఆవు: మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.

మాల: అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.

త్రిశూలము : ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.

చక్రము: అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.

డమరు: సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.

కమండలము:సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును.

దత్త తత్వం:

దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !

తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి సంశయః !!

       దత్తాత్రేయుని భక్తితో స్మరిమ్చినవారికి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని “దత్త హృదయం” లో చెప్పబడింది. దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా “అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు, ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకం.శ్రీభాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో భగవంతుని 21 అవతారములలో ఆరవ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడింది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

హనుమద్వ్రతం

       భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం. మార్గశిర త్రయోదశినాడు హనుమంతుని పూజించి, హనుమంతుని ఆయనశక్తిస్వరూపమగు సువర్చలాదేవిని పంపానది ని కలశాలలోకి ఆవాహనచేసి పూజించి, హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తిచేసుకుంటారు. పదమూడు ముళ్లతోరాన్ని ధరిస్తారు. ఈవిధంగా పదమూడుసంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సమ్పూర్ణ అనుగ్రహం ఆ సాధకులకు కలుగుతుంది అని శాస్త్రవచనం. కాగా కార్తీకం మొదటినుంచి హనుమత్ వ్రతం దాకా, అలాగే వైశాఖంలో వచ్చే హనుమజ్జయంతికి నలభైరోజులు పూర్తయ్యే విధంగా హనుమద్దీక్షలు స్వీకరిస్తుంటారు. ముఖ్యంగా ఏకాగ్రత, మానసికబలం, శక్తిసామర్ధ్యాలను పెంచే ఈ హనుమత్ ద్దీక్షలను యువకులు ఎక్కువగా స్వీకరిస్తుంటారు.

ఒకప్పుడు శౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు. అప్పుడు ఆయన కధ చెప్పాడు. వ్యాస మహర్షి ఒక సారి ద్వైత వనం లో వున్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మ రాజు సోదరులు, భార్య ద్రౌపది తో సహా ఎదురు వెళ్లి స్వాగతం చెప్పి లోపలి ఆహ్వానించి అర్ఘ్య పాద్యాలు  లిచ్చి భక్తీ శ్రద్ధలతో సేవించాడు. వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు. అందరు  భక్తీ శ్రద్ధలతో చేయ వలసిన వ్రతం వుందని దాన్ని వివరించాడు. అది కార్య సిద్ధిని కలిగిస్తుందనీ ,వెంటనే ఫలితం లభిస్తుందనీ చెప్పాడు. అదే శ్రీ హనుమద్ వ్రతం. దుష్ట గ్రహాల్ని వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు, శ్రేయస్సు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు. పూర్వం ఈ వ్రతాన్ని శ్రీ కృష్ణుడు ద్రౌపదికి బోధించి, దగ్గర వుండి  వ్రతం చేయించాడని దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు. అయితె ఒక సారి అర్జునుడు ద్రౌపది చేతికి వున్న హనుమత్ తోరణాన్ని చూసి దాని వివరం అడిగాడు. ఆమె అన్నీ వివరం గా చెప్పింది. అతడికి గర్వం కలగటం తో కోతిని గూర్చిన వ్రతం ఏమిటని ఈసడి౦చాడు. తన జెండా పై కట్టబడ్డ వాడు, వానరుడు అయిన హనుమకు వ్రతం చేయతమేమితని దుర్భాష లాడాడు. ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీ కృష్ణుడు చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పింది. అయినా అర్జునుని కోపం తగ్గ లేదు. ఆమె చేతి కున్న తోరాన్ని బలవంతంగా లాగి పారవేశాడు. అప్పటినుంచి పాండవులకు కష్టాలు ప్రారంభామైనాయనీ ఈ అరణ్య, అజ్ఞాత వాసాలు దాని ఫలితమే నని వ్యాసుడు ధర్మ రాజుకు చెప్పాడు .పద మూడు ముడులు గల హనుమత్ తోరణాన్ని తీసి వేయటం వల్లే పదమూడు ఏళ్ళ అరణ్య, అజ్ఞాత వాసం అని వివరించాడు. కనుక వెంటనే హనుమద్వ్రతం చేయమని హితవు చెప్పాడు.

               ధర్మ రాజుకు సందేహం కలిగింది. పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు. దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కధ చెప్పాడు. పూర్వం శ్రీ రాముడు సీతను వెదుకుతూ, తమ్ముడు లక్ష్మణునితో ఋష్య మూక పర్వతం చేరాడు. సుగ్రీవ, హనుమలతో సఖ్యం చేశాడు అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతం అంతా చెబుతూ, దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు. బ్రహ్మాది దేవతలు హనుమతో  “హనుమా ! నువ్వు హనుమద్వ్రతానికి నాయకుడిగా ఉంటావు, నిన్ను ఎవరు భక్తీ శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు  బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు త్వరలో సీతా దర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యా పతివి అవుతావు అని విన్నవించాడు హనుమ. అప్పుడు ఆకాశవాణి  “హనుమ చెప్పినదంతా సత్యమైనదే” అని పలికింది వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరాడు. మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేయాలని హనుమ చెప్పాడు. పంపా నదీ తీరం లో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు. పదమూడు ముళ్ళ తోరం ను పూజించి కట్టుకొన్నాడు. తరు వాత కధ అందరికి తెలిసిందే. కనుక సందేహం లేకుండా ధర్మ రాజాదులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు. వ్యాస మహర్షి మాటలకు సంత్రుప్తులై ధర్మ రాజు బార్య సోదర్లతో వ్రతాన్ని విధి విధానంగా చేసి అంతా తోరణాలు భక్తీ శ్రద్ధలతో కట్టుకొన్నారు. తరువాత కురుక్షేత్ర యుద్ధం లో కౌరవులని సర్వ నాశనం చేసి రాజ్యాన్ని పాండవులు పొందిన విషయం మనకు తెలుసు. అని సూతుడు మహర్షులకు హనుమద్ వ్రత వైభవాన్ని పలితాన్ని తెలియ జేశాడు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

గీతాజయంతి

        గీతా ఒక శాస్త్రం. ఒక గ్రంధం, ఒక ఐతిహ్యం, ఒక పరమ పథసోపానం, సాక్షాత్‌ భగవంతుడు మనకు అందించిన జీవన్ముక్తికి మార్గదర్శి. మానవ మనుగడకు దిక్సూచి. అందుకే ఇది పవిత్ర గ్రంధం అయింది. ద్వాపర యుగం నాడు మనకి సంప్రాప్తించి ఆచంద్రతారార్కం మనల్ని నడిపే జీవిత నౌక. భగవద్గీత కూడా ఆ పరమాత్మునిలా ఏ రూపంలో చూసినా, ఆ రూపంలో గోచరమవుతుంది. సమస్త జీవన మీమాంసలకీ నిత్య నూతన సమాధానం అందించే మహత్తర గ్రంధం శ్రీమద్భగవద్గీత.

గీకారం త్యాగరూపం స్యాత్ తకారమ్ తత్వబోధకమ్

గీతా వాక్య మిదమ్ తత్వం జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:

       గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. “గీ” అను అక్షరము త్యాగమును బోధించుచున్నది. “త” అను అక్షరము తత్వమును అనగా ఆత్మస్వరూపమును ఉపదేశించుచున్నది. గీత యను రెండుశబ్దముల కర్ధము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు.

       త్యాగశబ్దమునకు నిష్కామ యోగమగు కర్మ ఫలత్యాగమనియు లేక సర్వసంగపరిత్యాగమనియు అర్థము కలదు . అలాగుననే తత్వబోధనము కాత్మ సాక్షాత్కారమనియు,బంధమునుండి విముక్తి గల్గుటయనియు నర్థము కలదు . ఈ పరమ రహస్యమునే గీతాశాస్త్రముపదేశించుచున్నది .

       శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో రెండు రకాలైన గానాలను చేశాడు. మొదటిది వేణుగానం. శ్రీకృష్ణుని వేణుగాన్ని పశువులు పక్షులు, గోప, గోపికా జనాలు విని ఆనందించి, ఆ మధురామృతంలో వారి జీవితాలను తరింపజేసుకున్నారు. రెండో గానం గీతాగానం, ఇది యుగ యుగాలకి, దేశ కాలాతీతమైన, శాశ్వతమైన, సనాతనమైన, నిత్యనూతన మైన, సమస్త వేదాంత సారం. ఇది యావత్‌ ప్రపంచానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతుంది. భగవద్గీతలో దైవ ప్రకౄఎతి నిర్మా ణం. తద్వారా అస్తవ్రిద్యను స్పష్టంగా నిర్దేశించి నప్ప టికీ సూచనా ప్రాయంగా వదలి దీని కొరకు కర్మ, జ్ఞాన, భక్తి యోగాల సమన్వయమే మార్గమని చెప్పాడు.

       భారత యుద్ధ సమయంలో అర్జునుడు బంధువర్గాన్ని సంహరించడానికి సంశయించాడు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు అతనికి తత్తో్వపదేశం చేశాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. ఈ ఉపదేశం, యుద్ధ ప్రారంభ దినం నాటి ఉదయం జరిగింది.

కార్తీక బహుళ అమావాస్యను భగవద్గీత పుట్టిన రోజుగా జరుపుతారు. గీతా జయంతిని ఈమాసములోనే జరపవలసి వుంటుంది. ఉత్తరాదిన కొన్ని ప్రాంతాల్లో మార్గశిరశుద్ధ ఏకాదశిని గీతాజయంతి జరుపుతున్నట్లు కనిపిస్తుంది. మార్గశిర శుద్ధ త్రయోదశి నుండి పుష్యశుద్ధ పాడ్యమి వరకు గల పద్ధెనిమిది రోజులు భారత యుద్ధం జరిగిందనీ, శుద్ధ త్రయోదశికి రెండు రోజుల ముందుగా, మార్గశిర శుద్ధ ఏకాదశినాడు భగవద్గీత చెప్పబడిందనీ అందుచేత ఆ రోజు గీతాజయంతి జరపడం సమంజసమని అంటున్నారు. భారతాన్ని బట్టి మాఘ శుద్ధాష్టమి భీష్ముని నిర్వాణ రోజు. భీష్ముడు అంపశయ్య మీద యాభై ఎనిమిది రోజులు ఉన్నట్లు భారతంలో స్పష్టంగా చెప్పబడింది. భీష్ముడు యుద్ధం చేసింది పదిరోజులు. భీష్ముడు మరణించిన మాఘ శుద్ధాష్టమి నుండి మొత్తం అరవై ఎనిమిది రోజులు రెండు మాసాల ఎనిమిది రోజులు. వెనక్కు లెక్కిస్తే భారతయుద్ధం ప్రారంభ దినం తేలుతుంది. ఈ గణనం ప్రకారం భారత యుద్ధం ప్రారంభ దినం కార్తీక బహుళ అమావాస్య అవుతుంది.

        కార్తీకమాసంలో రేవతీ నక్షత్రంనాడు శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి పయనమై వెళ్లినట్లు భారతంలో ఉంది. కార్తీక పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం అవుతుంది. కృత్తికా నక్షత్రానికి మూడో పూర్వ నక్షత్రం రేవతి. రేవతీ నక్షత్రం నాడు అంటే, శుద్ధ త్రయోదశి నాడు అవుతుంది. రాయబారిగా వెళ్లిన శ్రీకృష్ణుడు హస్తినాపురంలో కొద్ది రోజులు ఉన్నాడు. వస్తూ కర్ణుడితో మాట్లాడాడు. ఆ సంభాషణలో శ్రీకృష్ణుడు కర్ణుడితో జ్యేష్ఠా నక్షత్రంతో కూడిన అమావాస్యనాడు యుద్ధం ఆరంభమవుతుందని చెప్పాడు. కాగా కార్తీక బహుళ అమావాస్యే భారత యుద్ధం ప్రారంభ దినమని నిర్ధారించి చెప్పవచ్చు.భారత యుద్ధ సమయంలో అర్జునుడు బంధువర్గాన్ని సంహరించడానికి సంశయించాడు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు అతనికి తత్తో్వపదేశం చేశాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. ఈ ఉపదేశం, యుద్ధ ప్రారంభ దినం నాటి ఉదయం జరిగింది.జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా మానవజాతికి అర్జున స్థితిలో వున్న వారికి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించాడు.

మం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మన్యయమ్‌

వివస్వాన్‌ మనవే ప్రాహ మను రిక్ష్వాక వేబ్రవీత్‌

       శ్రీభగవానుడు వినాశనం లేని ఈ యోగాన్ని పూర్వం సూర్యుడికి ఉపదేశించాడు. సూర్యుడు మనువుకూ, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు.

ఏవం పరమ్పరాప్రాప్త మిమం రాజర్షయో విదు:

సకాలేనేహ మహ తాయోగో నష్ట: పరన్తప భ.గీ.4-2

       అర్జునా! ఇలా సాంప్రదాయపరంగా వచ్చిన కర్మయోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. అయితే అది ఈ లోకంలో క్రమేపీ కాల గర్భంలో కలిసి పోయింది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

మోక్షదా ఏకాదశి

       సృష్టి ఆరంభంలో మధుకైటభులనే రాక్షసులకు మోక్షమీయదలచి ఈ ఏకాదశినాడు ఉత్తర ద్వారము నుండి తిరిగి వైకుంఠమును ప్రసాదించినట్లు పురాణగాధ. ఉత్తర ద్వారము అంటే తరించే మార్గము కనుక ఈ ఉత్తర ద్వారము నుండి మోక్షమును ప్రసాదించుట చేత ఈ ఏకాదశిని ‘మోక్షదా ఏకాదశి’ అని కూడా వ్యవహరిస్తారు.

       మార్గశుద్ధ ఏకాదశిని ‘మోక్షదైకాదశి’ అని అంటారు. పూర్వం వైఖానసుడనే రాజునకు తన తండ్రి నరకంలో ఉండి యమయతనలు పడుతూన్నట్లు కలవచ్చింది. అందుకు అతను మార్గశిరశుద్ధ ఏకాదశినాడు ఉపవాసం ఉండి నియమాలతో వ్రతం చేశాడు. ఆ వ్రత ఫలితంగా అతని తండ్రి స్వర్గలోకానికి చేరాడు. తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనికి ‘మోక్షదైకాదశి’ అని పేరు వచ్చింది. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి జనన మరణ రహితమైన మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెబుతారు.

       తల్లిదండ్రులు గతించిన కుమారులు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణ్వాలయానికి వెళ్లి విష్ణువును దర్శనం చేసుకుంటే, పితృదేవతలు విష్ణుసాయుజ్యం పొందుతారని చెబుతారు. ఈ రోజే భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేసిన రోజు. అందువల్ల గీతా జయంతిగా ప్రసిద్ధి.

       భారత యుద్ధ సమయంలో అర్జునుడు బంధువర్గాన్ని సంహరించడానికి సంశయించాడు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు అతనికి తత్తో్వపదేశం చేశాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. ఈ ఉపదేశం, యుద్ధ ప్రారంభ దినం నాటి ఉదయం జరిగింది.

     కార్తీక బహుళ అమావాస్యను భగవద్గీత పుట్టిన రోజుగా జరుపుతారు. గీతా జయంతిని ఈమాసములోనే జరపవలసి వుంటుంది. ఉత్తరాదిన కొన్ని ప్రాంతాల్లో మార్గశిరశుద్ధ ఏకాదశిని గీతాజయంతి జరుపుతున్నట్లు కనిపిస్తుంది. మార్గశిర శుద్ధ త్రయోదశి నుండి పుష్యశుద్ధ పాడ్యమి వరకు గల పద్ధెనిమిది రోజులు భారత యుద్ధం జరిగిందనీ, శుద్ధ త్రయోదశికి రెండు రోజుల ముందుగా, మార్గశిర శుద్ధ ఏకాదశినాడు భగవద్గీత చెప్పబడిందనీ అందుచేత ఆ రోజు గీతాజయంతి జరపడం సమంజసమని అంటున్నారు.

       పూర్వము దక్షిణ భారతదేశంలోని పాండ్య దేశపు రాజైన వల్లభరాయని ఆస్థానములో ‘పరతత్వ నిర్ణయం చేసి’ మహా భక్తునిగా గజారోహణ సమ్మానాన్ని పొందుతున్న పెరియాళ్వారు (విష్ణుచిత్తుల) వారి వైభవాన్ని చూడటానికి శ్రీ భూనీళా సమేతుడై గరుడ వాహనముపై శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయిన పవిత్రదినము కూడా ఇదే. ఆ జగన్నాధుని కీర్తిస్తూ శ్రీ పెరియాళ్వారులు ‘పల్లాండు’ ఆలపించిన పవిత్ర దినము కూడా ఇదే. ఇట్టి పరమపవిత్రమైన వైకుంఠ ఏకాదశినాడు శ్రీమన్నారాయణమూర్తిని ఎవరైతే సేవిస్తారో వారు పునర్జన్మ లేనివారై దుర్లభమైన పరమపదాన్ని పొందుతారని శ్రీపాంచరాత్ర ఆగమశాస్తమ్రు బోధిస్తోంది.

       ఇంతటి మహిమాన్వితమైన శ్రీ వైకుంఠ (ముక్కోటి) ఏకాదశినాడు భద్రాద్రి దివ్య క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా జరిగే ‘ఉత్తర ద్వార దర్శన’ మహోత్సవంలో సీతా లక్ష్మణ సమేతుడైన, గరుడవాహనరూఢుడైన రామనారాయణమూర్తియైన శ్రీ భద్రాద్రి వైకుంఠ రాముని దర్శించి, సేవించిన వారు సకల పాప విముక్తులై సర్వ శ్రేయస్సులను పొందుతారు.

శ్లో॥ ఉత్తర ద్వార మాసీనం ఖగస్థం రఘునాయకమ్

యః పశ్యతి సభద్రాద్రౌ యాతివై పరమాంగతిమ్

‘భద్రాద్రి నిలయం రామం నత్వా పాపైః ప్రముచ్యతే’

        భద్రాద్రి నిలయుడైన శ్రీరాముని సేవించిన వారు సకల పాప విముకులై తరలించగలరని బ్రహ్మ పురాణము పేర్కొన్నది. పురణాంతర్గతంగా పేర్కొన్న సప్త జీవ నదులలో మూడవదైన పరమపవిత్రమైన గోదావరి నదిలో స్నానమాచరించి శ్రీ స్వామిని సేవించుకున్న వారికి సకల సంపదలు సంప్రాప్తిస్తాయి.

       అన్ని వ్రతాలలోకెల్ల శ్రీ వైష్ణవ సాంప్రదాయములలో ప్రధానమైన వ్రతములు రెండు. వాటిలో ఒకటి ధనుర్మాస వ్రతము కాగా. రెండవది ద్వాదశీ వ్రతము. ప్రతి జీవికి ఏదో ఒక పరమార్థము ఉంటూనే ఉంటుంది. ఆ జీవి పూర్వ జన్మల పాపపుణ్యముల ననుసరించి ప్రస్తుత జన్మములయందు పండితుడిగానూ, రాజుగానూ, యోగిగానూ, భోగిగానో జన్మించి మళ్లీ ప్రస్తుత జన్మలోని పుణ్య పాప కర్మలను బట్టి వచ్చే జన్మములో పండితుడిగానో, రాజుగానో తరాజుగానో పుట్టుతుంటాడు.

       ప్రతి జీవి పుట్టుట, గిట్టుట సహజము. అనివార్యమైన ఈ కర్మను ఎవరూ తప్పించుకొనలేరు. అట్లు తప్పించుకొనవలెనన్న, శాశ్వతమైన ఆనందము పొందవలెనన్న భగవదనుగ్రహము కావాలి. అట్టి భగవదనుగ్రహము చేతనే శాశ్వతమైన బ్రహ్మలోకమునకేగి నిత్యాన్నందమును అనుభవించుచుండును. అక్కడ జరామరణ బాధలు లేక నిత్య సంతుష్టాంతరంగుడై విరాజిల్లుచుండును. అట్టి స్థానమునే బ్రహ్మలోకము అని, కైవల్యమని, పరమపదమని చెప్పుచుందురు.

       పురుషార్థములు నాలుగు, ధర్మము, అర్థము, కామము, మోక్షము. మూడవ పురుషార్థమైన కామమును పొందవలెనన్న రెండవ పురుషార్థమైన అర్థము అత్యవసరము. నాల్గవ పురుషార్థమైన మోక్షమును పొందవలెనన్న ఒకటవ పురుషార్థము ఆవశ్య ఆచరణీయము.

       నేటి రోజులలో ఆద్యంతములైన ధర్మ మోక్షములతో పని లేదు. మధ్యమైన అర్థకామములతోనే ప్రపంచము సాగిపోతున్నది. ఎంతదూరము సాగినా, ఎంతకాలము గడిచిన దీనికి అంతం… అనంతమైన, అఖండమైన అద్వితీయమైన పురుషార్థ శ్రేష్టమైన మోక్షమును పొందినప్పుడే. అంత వరకు ఏ జీవికి శాంతి వుండదు. శాశ్వత సౌఖ్యము ఉండదు. అట్టి స్థితిని పొందడానికి ధర్మమును ఆచరించాలి. అట్టి ధర్మములు ఏవనగా, అగ్నిష్టోమ, అతిరాత్ర, అప్తోర్యామ, వాజపేయ, సాంతపన, అశ్వమేధ, రాజసూయాది యాగములే. కాని యిట్టి యాగములను చేయడానికి సర్వులకు సౌలభ్యము కాని, ఆర్థిక స్థోమత కాని వుండదు. మరివాటి ఫలితములను పొందడానికి సులువైన మార్గములు ఏమనగా వ్రతములు, పూజలు, పునస్కారములు, ఉపవాసములు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

పాములపర్తి వెంకట నరసింహారావు వర్ధంతి

జననం : 28 జూన్ 1921, లక్నేపల్లి, వరంగల్ జిల్లా (తెలంగాణ, అప్పటి హైదరాబాదు సంస్థానం)

మరణం : డిసెంబరు 23, 2004 (వయసు 83), న్యూఢిల్లీ,

        భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు, పాములపర్తి వేంకట నరసింహారావు 1921, జూన్ 28న జన్మించాడు. పి.వి.నరసింహారావు, పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. అపర చాణక్యుడిగా పేరుపొందిన వాడు. భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం.

రాష్ట్ర రాజకీయాల్లో పీవీ

        1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు.

        ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాదు లో కంటే, ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు.తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నాడు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. నిజానికి భూసంస్కరణల విషయంలో పీవీకి సమకాలీన రాజకీయ నాయకులతో ఉన్న విభేధాల కారణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసివచ్చిందని కొందరి వాదన.

కేంద్ర రాజకీయాల్లో పీవీ

        తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. మొదటిసారిగా లోక్‌సభ కు హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యాడు. రెండోసారి మళ్ళీ హనుమకొండ నుండే లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి ఎనిమిదో లోక్‌సభకు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్ళీ రాంటెక్ నుండే తొమ్మిదో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి 1991 లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్‌సభలో అడుగుపెట్టాడు. 1980 – 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను వివిధ సమయాల్లో నిర్వహించాడు.

ప్రధానమంత్రిగా పీవీ

       ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టాడు. సాటి తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని నంద్యాల పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలలో ఎన్.టి.రామారావు ఆయనపై తెలుగు దేశం అభ్యర్ధిని పోటీలో పెట్టలేదు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెసు పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకు ఉన్న అపార అనుభవం ఆయనకు ఈ క్లిష్టసమయంలో తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు ఆయన అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి కూడా. ప్రధానిగా ఉండగా మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పుకు నాంది పలికింది. మరొకవైపు బాబ్రీ మసీదు కూలగొట్టడం కూడా ఆయన హయాంలోనే జరిగింది. చూసీ చూడనట్లు పోనిచ్చాడనే నెపం ఆయనపై ఉన్నది. పి.వి. పెయ్యనాకుడు విధానాన్ని అనుసరించి సమస్యలు తేల్చకుండా నాన్చి, రాజకీయాలలో జిడ్డు వ్యవహారాలు నడిపాడని పేరున్నది. సమస్యలు వాటంతటవే సద్దుకుపోతుండేవి.

పీవీ విజయాలు

      పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేసాడు. తన ఆర్థికమంత్రి, మన్మోహన్ సింగ్ కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చాడు. ఆ సంస్కరణల పర్యవసానమే, ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.

పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే

కాశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే.

       ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాను ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా,ఇరానులతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని.

       1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. ఆయన కాలంలోనే బాంబు తయారయింది. ఈ విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించాడు.

పీవీ విశిష్టత

       బహుభాషా పండితుడు, పీవీ. తెలుగుతో సహా, 17 భాషలలో ధారాళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఆయనది. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో ను అబ్బురపరచాడు.

పీవీ నరసింహారావు చాలా నిరాడంబరుడు. తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచిన నిజాయతీపరుడు. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి ఎప్పుడూ అంగీకరించేవారు కాదు. అలాంటి వ్యక్తి చివరిదశలో కోర్టుల చుట్టూ తిరగడానికి ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది. ఆయనకాగతి పట్టడానికి కారణం ఉత్తరాది లాబీ. కానీ ఎన్ని కష్టాలొచ్చినా తుదివరకూ నిండుకుండలానే ఉన్నారాయన.

2004 డిసెంబర్ 23 పి.వి.నరసింహారావు కన్నుమూసాడు.

తెలంగాణ రాష్ట్రంలో పివి జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడం అభినందనీయం. 2004 పి.వి.స్వర్గ ప్రాప్తి పొందిన తరువాత నాటి కార్పోరేషన్ మేయర్ డా.రాజేశ్వరరావు అద్యక్షతన జరిగిన పాలక మండలి KU KZP వంద ఫీట్ల రోడ్ కు పి.వి.మార్గం గా నామకరణం చేస్తూ తీర్మానించటం జరిగింది. అయినా ఇంత వరకు బోర్డు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం అధికారింగా వర్ధంతి కార్యక్రమం ప్రకటించక పోవడంవల్ల అధికారులు ఏ కార్యక్రమాలు తీసుకోని పరిస్థితి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కాలభైరవాష్టమి

       మార్గశిర మాసంలోని శుక్లపక్ష అష్టమి- ‘‘కాలభైరవాష్టమి”. పరమ శివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించిన రోజే ‘కాలభైరవాష్టమి’. లయకారుడైన పరమశివుడివల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడుగా కొలువుదీరిన దేవడు – కాలభైరవుడు. శ్రీకాలభైరవుడు ఆవిర్భవించిన ‘‘కాలభైరవాష్టమి” పర్వదినమును జరుపుకుని కాలభైరవుడిని పూజించాలని శాస్తవ్రచనం.

        కాలభైరవస్వామి ఆవిర్భవానికి సంబంధించి ‘‘శివపురాణం”లో ఆసక్తికరమైన పురాణగాధ వుంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు శివుడివద్దకు వెళ్ళి – ‘‘నేనే సృష్టికర్తను… పరబ్రహ్మ స్వరూపుడను… నేను చెప్పినట్లుగానే మీరందరూ నడుచుకోవాలి” అని పలికాడు. శివుడు అందుకు వ్యతిరేకించాడు. దీనితో ఇద్దరి మధ్య వాదం ప్రారంభమై చాలాసేపు వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బ్రహ్మదేవుడు మధ్యన వున్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నతకాయముతో… మూడు నేత్రాలతో త్రిశూలము, గద, ఢమరుకము వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే – శ్రీకాలభైరవుడు.

ఈ విధంగా శివుడి హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు. శివుడి ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యనవున్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది. అనంతరం శ్రీకాలభైరవుడు లయకారుడైన శివుడి ముందు నిలబడగా- ‘‘నీవు బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించడంవల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయమని సలహాయిచ్చాడు. బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు –

        “కాలభైరవా! నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మ దేవుడి గర్వమును అణుచుటకు జనించినవాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు… కాశీ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది” అని సలహాయిచ్చాడు.

       దీనితో- కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా, బ్రహ్మకపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే – నేటి కాశీ క్షేత్రంలోని ‘‘కపాల మోక్షతీర్థం”. తర్వాత కాశీక్షేత్రంలో శ్రీకాలభైరవుడు కొలువుదీరి క్షేత్రపాలకుడుగా పూజలందుకుంటూ వున్నాడు. కాలభైరవుడిని కాశీలో ముందుగా దర్శించే ఆచారంతోపాటూ… కాశీకి వెళ్ళి వచ్చినవారు ‘‘కాశీ సంతర్పణం” కంటే ముందుగా కాలభైరవ సంతర్పణ చేయడం శ్రీ కాలభైరవస్వామి వారి మహత్మ్యానికి నిదర్శనం.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

సద్గురు కందుకూరి శివానందమూర్తి గారి జయంతి

  (21-12-1928 —-10-06-2015)

శివానందమూర్తి జీవిత విశేషాలు

      కందుకూరి శివానంద మూర్తి మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. భారతదేశం లోనూ, విదేశాల్లోనూ ఆయనకు ఎంతో మంది శిష్యులు, అభిమానులు ఉన్నారు. సంప్రదాయం, సంస్కృతి అంశాల మీద ఎన్నో పుస్తకాలు రచించారు.

ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 1928, డిశంబర్ 21న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సర్వమంగళ, వీరబసవరాజులు శివభక్తులు, దాదాపు 200 శివాలయాలను నిర్మించారు. చిన్నతనం నుండి శివానందమూర్తి ఆధ్యాత్మిక విషయాల పట్ల, ముఖ్యంగా యోగశాస్త్రం పట్ల ఎంతో ఆసక్తి కనబర్చేవారు. 1949 లో సైన్సు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సభ ఆర్డినేట్ సర్వీస్ లో చేరారు. పోలీసు డిపార్టుమెంటులో హన్మకొండలో పని చేస్తున్నప్పుడు కూడా ఆర్తులకు, పేదవారిక సేవచేయడం పట్ల, హిందు ధర్మ బోధన పట్ల ఎక్కువ సమయం వెచ్చించే వారు. ఆఫీసరుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి సేవాకార్యక్రమాల పట్ల, సాంస్కృతిక సేవ పట్ల దృష్టి సారించారు.

       సమున్నతమైన భారతదేశం, సనాతన ధర్మంల వేళ్లూనుకున్న ప్రాచీన సంస్కృతి పట్ల ఆయనకు అమితప్రేమ. సన్యాసులతో సహా అందరూ ప్రజాసంక్షేమానికి ట్రస్టీలుగా, సంరక్షకలుగా తమ వంతు కర్తవ్యం నిర్వర్తించాలని తన ప్రసంగాల్లో తరుచూ చెబుతుంటారు. హిందు ధర్మం, దాని చరిత్ర, సంగీత సాహిత్యాలు, నాట్యనాటకాల విషయాల్లో ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం.

       రాజకీయ, సాంస్కృతిక ఆధ్యాత్మిక చరిత్ర మీద ఆయన రాసిన వ్యాసాలు ఒక తెలుగు డైలీలో ప్రచురితమై తరువాత భారతీయత పేరిట రెండు సంపుటాలుగా ముద్రితమయ్యాయి. కఠోపనిషత్ మీద ఆయన రాసిన కఠయోగ అన్న పుస్తకం బహథా ప్రశంసలు అందుకని, కంచి పీఠం పరమాచార్య, శృంగేరీ శంకరాచార్యుల మన్ననలను చూరగొంది. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన డేవిడ్ ఫ్రాలీ “అద్వైతం, జ్ఞానం, యోగం, దాని అంతర్వాహినుల గురించి తెలిసిన విశిష్ఠమైన వ్యక్తి శివానంద మూర్తి” అన్నారు. హిందూ వివాహ వ్యవస్థ (2006), మహర్షుల చరిత్ర (2007), గౌతమబుద్ధ (2008) ఆయన ఇతర రచనల్లో ముఖ్యమైనవి. సరైన జీవన విధానం పట్ల సామాన్యుడికి స్ఫూర్తినిస్తూ ఆంధ్రభూమిలో ఆయన రాసిన 450 పైగా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పురాణాలు, కావ్యాలు, సాహిత్య గ్రంథాల నుంచి ఆంధ్రదేశ చరిత్రను క్రోడీకరించి మనకథ పేరిట గ్రంథస్తం చేశారు. ఇది హైదరాబాదు దూరదర్శన్ లో 13 భాగాలుగా ప్రసారమైంది.

       భారతీయ కళలను కాపాడుకోవాలనే తపనతో విశాఖపట్నం, భీమిలిలో ఏర్పాటు చేసిన ఆనందవనం ద్వారా ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించారు. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టుకు ఆయన ప్రధాన ధర్మకర్త. భారతీయ సంప్రదాయ సంగీతాన్ని, నాట్యాన్ని ప్రోత్సహించేందుకు శివానంద కల్చరల్ ట్రస్ట్, ఆంధ్రా మ్యూజిక్ అకాడెమీలను నెలకొల్పి తెలుగు రాష్ట్రాలు సహా ఎన్నో ప్రాంతాలలో సాంస్కృతిక, కళారంగాలకు విశిష్ట సేవలందించారు. రికార్డింగుల కోసం ఆనందవనం ఆశ్రమంలో అత్యాధునికమైన రికార్డింగ్ హాల్ ను నిర్మించారు. ఇక్క డ వర్క్ షాపులను నిర్వహిస్తుంటారు. లలిత కళలు, సాంకేతికం, విజ్ఞానం, వైద్యం, జర్నలిజం, మానవశాస్త్రాలు, ఇతర రంగాల్లో కృషి చేసిన వారిని ఈ ట్రస్టు ఒక వేదిక మీదకు తీసుకుని వచ్చిన సన్మానిస్తూ ఉంటారు. ప్రతి ఏటా హైదరాబాదులో ఈ అకాడెమీ సంగీతోత్సవాలను నిర్వహిస్తుంది.

        చెన్నైలోని శ్రీరాజలక్ష్మి ఫౌండేషన్ ఆయనను 2000 లో రాజలక్ష్మి ఆవార్డుతో, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సన్మానించాయి.

        శివానందమూర్తి గారు చిన్నప్పటి నుండే ఆయనలో ఆధ్యాత్మిక లక్షణాలు కలిగి ఉండేవారని ఆయన గురించి బాగా తెలిసినవారు చెపుతుంటారు. అత్యంత నిరాడంబరంగా ఉండే ఆయన ప్రచారార్భాటాలకి దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక భోధనలు చేసేవారు. ఆయన ప్రవచనాలు ప్రధానంగా సనాతన ధర్మం మీదనే సాగుతుంటాయి. సనాతన ధర్మాన్ని చిత్త శుద్దితో పాటిస్తే భారతదేశానికి పునర్వైభవం సిద్ధిస్తుందని చెబుతుంటారు. సనాతన ధర్మాచారం వల్ల విలువలు ఏర్పడి ఆత్మగౌరవం ఇనుమడిస్తుందని అంటారు.

       సద్గురు శివానందమూర్తి గారు 10-06-2015 బుధవారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా మూలుగురోడ్డులో గల గురుకుల ధామ్ లో 2.30 గంటలప్పుడు ఆయన కన్నుమూశారు. 87 ఏళ్ల వయసు గల ఆయన గత కొంతకాలంగా వృద్దాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శివానందమూర్తి గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయన కుమారుడికి ఫోన్ చేసి సద్గురు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎండల ధాటికి ఆయన అస్వస్థులయ్యారు. అప్పటి నుండి ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. చివరికి 10-06-2015, బుధవారం రోజు తెల్లవారుజామున ఆయన కైలాసప్రాప్తి చెందారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)