Categories
Vipra Foundation

కళ్యాణ రాముని అవతార కథ

    తత శ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ, నక్షత్రే  దితి దైవత్యే స్వోచ్ఛ సంస్థేషు పంచసు

    శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. శ్రీ రామ నవమి పండుగను స్వామి జన్మదినంగాను, సీతా మాతతో కళ్యాణ మహోత్సవంగాను జరుపుకుంటారు. భగవంతుడు ధరించిన మానవ అవతారములలో యీ శ్రీరామచంద్రమూర్తి అవతారము సంపూర్ణ మానవావతారమని రామాయణ కావ్యము తెల్పుతున్నది. శ్రీరామునిగా మానవావతారమెత్తిన భగవంతుడు మానవుడు ఎలా వుండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏఏ ధర్మాలను పాటించాలి అనే విషయాలను తను ఆచరించి మానవులకు చూపి, ఆదర్శమూర్తి అయి, ఇప్పటికిని అనగా త్రేతాయుగములో అవతరించి, ద్వాపరము అయి కలియుగము నడుస్తున్న ఈ నాటికి కూడా దేవునిగా కొనియాడబడుతూ శ్రీ రామ నవమి అను పేరున నవరాత్రములు, కళ్యాణ మహోత్సవములు జరిపించుకొనుచున్నాడు.

   ( ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు. )

     భగవంతుడు తన భక్తుల కోర్కెలను తీర్చుటకును, దుష్టుల సంహరించుటకును, సజ్జనుల కష్టముల నుండి కడతేర్చుటకును ఆయా సందర్భాను సారముగ అవతారముల నెత్తును. భారత ఇతి హాసముల ద్వారా పురాణముల ద్వారా కావ్యముల ద్వారా మనకు భగవంతుని అవతారముల గురించి తెలియుచున్నది.

పూర్వము వాల్మీకి యను మహర్షి శ్రీ మద్రామాయణము అను మహా కావ్యము వ్రాసెను. భారతీయులకు వాల్మీకి మొదటి కావ్యరచయిత; శ్రీ మద్రామాయణమే మొదటి కావ్యము . ఈ కావ్యము నుండి భగవంతుని దశావతారములు లోని రామావతారము గురించి మనకు తెలియుచున్నది.

జన్మ వృత్తాంతం : – త్రేతా యుగమున రావణాసురుడు యను రాక్షసుడు భూలోకమున లంకాధీశుడై పరమశివుడు, బ్రహ్మలగురించి తపస్సు చేసి వారిచే అనుగ్రహింపబడిన వర గర్వితుడై ఎవ్వరిని లెక్క చేయక దేవతలను, ఋషులను, హరి (విష్టువు) భక్తులను వేధించుచుండెను. అప్పుడు వారందరు హరిని ప్రార్ధించి తమ కష్టములను మొర పెట్టుకొనగా, ఆ మహా విష్ణువు రామునిగా అవతరించి రావణుని కడతేర్చెద నని వారికి చెప్పి, వారిని శాంతపరచి పంపెను.

భూలోకమున అయోధ్యా నగర చక్రవర్తి దశరధుడు పుత్రుల కొరకై పుత్ర కామేష్టి యను యఙ్ఞమును చేయుచుండెను. ఆ యఙ్ఞమునకు సంతసించిన దేవతలు అగ్ని దేవుని ద్వారా దశరధునికి పాయసము ను పంపిరి. ఆ పాయసమును దశరధుడు తన మువ్వురు భార్యలకు అనగా కౌసల్య, సుమిత్ర,కైకేయి లకు పంచెను. కొన్నాళ్లకు యీ మువ్వురు భార్యలు గర్భవతులై నలుగురు మగబిడ్డలను ప్రసవించారు. ఆ మహా విష్ణువే తన ఆది శేషువు, శంఖ చక్రములు, గదలతో సహా యీ నలుగురు పుత్రులుగా అవతిరించెను. రావణ సంహారము కొరకు అవతరించిన ఆనలుగురు పుత్రులే శ్రీరామ చంద్రమూర్తి, లక్ష్మణుడు, భరతుడు       మరియు శతృఘ్నుడు.

చైత్ర మాసమున, శుద్ధ నవమీ తిధినాడు, పునర్వసు నక్షత్రమున ఐదు గ్రహములు ఉచ్ఛంలో నుండగ కర్కాటక లగ్నమున గురుడు చంద్రునితో కలసి వుండగా, జగన్నాధుడు, సర్వలోకారాధ్యుడు , సర్వ లక్షణ సంయుతుడును అగు ఆ మహా విష్ణువు కౌసల్యాదేవి గర్భమున శ్రీరామ చంద్రమూర్తిగా జనియించెను. శ్రీరాముడు పూర్ణ మానవుడుగా జీవించెను.

రామ నవమి : –   శ్రీ రాముని జననమైన నవమి తిధి నాడే ఆయన వివాహము సీతా మహాదేవి తో అయినదట. అట్లే రాజ్య పట్టాభిషేకము కూడ నవమి నాడేనట. అందుకనే శ్రీరామ నవమి అని చైత్ర శుద్ధ నవమి నాడే మనము పండుగ జరుపుకుంటాము.

విది విదానం : – ఆ రోజు మానవులందరూ తల స్నానము చేసి శుభ్రమైన లేక క్రొత్త బట్టలను ధరించి సీతారాముల పూజించి, కళ్యాణ మహోత్సవను జరిపించి, వసంత ఋతువు – ఎండాకాలము అగుటవలన పానకము, వడపప్పు ఆరగింపు చేసి ప్రసాదము పంచుదురు. దశమి నాడు పట్టాభిషేక ఘట్టము జరుపుదురు. కొందరు చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు రామనవరాత్రోత్సవము జరుపుదురు. ఈ తొమ్మిది దినములందు రామాయణ పారాయణము, రాత్రులందు రామకధా కాలక్షేపము జరుపుదురు.

       శ్రీ రామనవమి నుండి రామకోటి వ్రాయుట నారంభించి, మరుసటి శ్రీ రామనవమికి ఆ వ్రతము ముగించు ఆచారము కూడ కలదు. శ్రీ రామ నామము లక్ష, కోటి వ్రాసిన ఒక్కోక్క అక్షరమే మహా పాతకములను నశింపజేయునని శంకరుడు పార్వతికి చెప్పునట్లు భవిష్య ఉత్తర పురాణమున ఉమామహేశ్వర సంవాదమున వివరింపబడినది.

దేవుడైనను, మానవ రూపమున నున్న కారణమున ఆ శ్రీ సీతారాముడు, మానవుడు తన దుఃఖ ములలో , కష్ట నష్టములలో ఏ విధంగా స్పందించునో ఆ విధముగనే ప్రవర్తించి చూపుటయే గాకపితృవాక్య పరిపాలనము, సత్యసంధత, భ్రాతృప్రీతి, స్నేహ బంధము, ఏక పత్నీ వ్రతము, ఒకే మాట – ఒకే బాణము , మొదలగు కష్టతరమైన ధర్మాలను ఆచరించి చూపి తన శీల సంపదతో మానవ జాతికే కనువిప్పు కలిగించెను.

      అందుకనే “శ్రీ సీతారాముల గుడి లేని గ్రామముండదు… శ్రీ రామ అని మొట్ట మొదట వ్రాయక, యే వ్రాతయూ వ్రాయబడదు” అను నానుడి వచ్చినది. ఆ విధంగా శ్రీ రామ నవమి మానవాళికి పర్వదినమైనది.

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

లక్ష్మీ పంచమి ప్రత్యేకత (చైత్రశుద్ధ పంచమి)

       ఆర్ధికపరమైన బలం ఆనందాన్నిస్తుంది … అవసరాలు తీర్చుకోగలం, ఆపదల నుంచి గట్టెక్కగలం అనే ధైర్యాన్నిస్తుంది. ఈ కారణంగానే అందరూ కూడా సంపదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంపదలను పెంచుకోవడానికి ఎంతగానో కష్టపడుతుంటారు. అయితే ఈ విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. లక్ష్మీదేవి చల్లనిచూపు సోకితే సిరిసంపదలతో తులతూగడానికి ఎంతో సమయం పట్టదు.

       అలాంటి లక్ష్మీదేవిని ‘చైత్రశుద్ధ పంచమి’ రోజున పూజించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజామందిరాన్ని వివిధ రకాల పూలమాలికలతో అలంకరించాలి. లక్ష్మీదేవి ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం జరపాలి. దమనములతో అమ్మవారిని అర్చిస్తూ, ఆమెకి ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

       ఈ విధమైన నియమనిష్ఠలతో పూజించడం వలన దారిద్ర్యం నశించి సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఇదే రోజున నాగదేవతను కూడా ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నాగప్రతిమకు పూజాభిషేకాలు నిర్వహించి పాలను నైవేద్యంగా సమర్పించాలి.

       సాధారణంగా కొందరిని నాగదోషాలు వెంటాడుతూ ఉంటాయి. ఫలితంగా ప్రతి విషయంలోనూ ఎన్నో ఉబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందుకు కారణం నాగదోషం అనే విషయం కూడా చాలామందికి తెలియదు. నానారకాల సమస్యలతో సతమతమైపోతున్న వాళ్లు ఈ రోజున నాగదేవతను పూజించడం వలన నాగదోషాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

  ఉగాది ప్రాముఖ్యం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు.

 శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ.”ఉగాది”, మరియు “యుగాది” అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. “ఉగ” అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి ‘ఆది’ ‘ఉగాది’.అంటే సృష్టి ఆరంభమైనదినమే “ఉగాది”. ‘యుగము’ అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.

తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:” – చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది ‘ఉగాది’గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.

ఉగాది రోజు :-

తైలాభ్యంగం సంకల్పాదవు నూతన వత్సర నామకీర్త నాద్యారంభం…

ప్రతిగృహం ధ్వజారోహణం, నింబపత్రాశనం వత్సరాది ఫలశ్రవణం…

    తైలాభ్యంగనం

    నూతన సంవత్సరాది స్తోత్రం

    నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)

    ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)

    పంచాంగ శ్రవణం

మున్నగు ‘పంచకృత్య నిర్వహణ‘ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.

సంప్రదాయాలు : ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనుపిస్తున్నాయి. ఉగాదిరోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం. మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’  గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ, ముఖ్యమయిన పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం.

ఉగాది పచ్చడి : ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్ధం. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో “నింబ కుసుమ భక్షణం” మరియు “అశోకకళికా ప్రాశనం ” అని వ్యవహరించే వారు.

త్వామష్ఠ శోక నరాభీష్టమధుమాస సముద్భవనిబామి శోక సంతప్తాంమమ శోకం సదా కురు” ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది. ఆ రకంగా తమ జీవితాలు అన్ని అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు.

పంచాంగ శ్రవణం : ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. పంచాంగ శ్రవణం వళ్ళ రానున్న మంచి చెడులను సమభావంతో స్వీకరించ గలరని, పంచాంగ శ్రవణం వినడం మంచిది అని మన పెద్దలు చెప్పటం జరిగింది. మనకు తెలుగు సంవత్సరాలు ‘ప్రభవ’ తో మొదలుపెట్టి ‘అక్షయ’ నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చుస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి ‘షష్టిపూర్తి’ ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు. ఈ పండగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.

కవి సమ్మేళనం : ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా “కవి సమ్మేళనం” నిర్వహిస్తారు. కొత్త, పాత కవులు నవభావన, పాత ఓరవళ్ళు కలిపి కొత్త పద్యాలు, కవితలు తయారు చేసి చదువుతారు. సామాజిక జీవనం, రాజకీయం, వాణిజ్యం ఇలా అన్నివిషయాలను గూర్చి ప్రస్తావిస్తారు, కవులు తమకవితలలో. ఈ విధంగా నానా రుచి సమ్మేళనంగా జరుగుతుంది ఉగాది కవి సమ్మేళనం.

ఊరగాయల కాలం : మామిడికాయలు దండిగా రావడంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించు కోవడానికి వీలుగా మామిళ్ళను, ఇతర కాయలను ఎండబెట్టి, ఊరవేస్తారు. తెలుగు వారిళ్ళలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది “ఆవకాయ”. “ఇలా వివిధ విశేషాలకు నాంది యుగాది – తెలుగువారి ఉగాది”

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)  

షడ్రుచుల సమ్మేళనం ‘ఉగాది పచ్చడి’

ప్రాముఖ్యత : –   ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది . “ఉగాది పచ్చడి” ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్ధం. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో “నింబ కుసుమ భక్షణం” మరియు “అశోకకళికా ప్రాశనం ” అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు’వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీకగా:-

బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం ఉప్పు – జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు – పులుపు – కొత్త సవాళ్లు మిరపపొడి – కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు ప్రొద్దునే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. “త్వామష్ఠ శోక నరాభీష్టమధుమాస సముద్భవనిబామి శోక సంతప్తాంమమ శోకం సదా కురు” ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది. ఆ రకంగా తమ జీవితాలు అన్ని అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)       

Categories
Vipra Foundation

తాళ్ళపాక అన్నమాచార్య వర్ధంతి

       తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 – ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.

       అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాధురంధరుడుగా ప్రసిద్ధికెక్కినవాడు. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. మధురంగా పాడుతుంది. ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాథ. కొండలయ్య తాను ధరించే “బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని” వారికందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య.

       లక్కమాంబ గర్భవతి అయింది. వైశాఖమాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నత దశలో వుండగా నారాయణసూరి, లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైనది, మగశిశువు ఉదయించాడు. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. నారాయణసూరి ఆ శిశువునకు ఆగమోక్తంగా జాతకర్మ చేశాడు.

       “అన్నం బ్రహ్మేతి వ్యజనాత్” అనే శ్రుతి ప్రకారం నారాయణసూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశాడు. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయగురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్ళపాక సాహిత్యంలోను, శాసనాల్లోను కనిపిస్తాయి.

అన్నమయ్య బాల్యం

“హరి నందకాంశజుం డగుట డెందమున

పరమ సుగ్యాన సంపద పొదలంగ………”

       అన్నమయ్య బొసి నవ్వులు వొలకబోస్తూ నలుగురినీ మురిపించేవాడు. మాటి మాటికి వెంకటప్పకు జోతలు పెట్టేవాడు. వెంకన్న పేరు చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు. వేంకటపతికి మొక్కుమని చెబితేనే మొక్కేవాడు. వేంకటపతిమీద జోలపాడనిదే నిద్రపోడు. లక్కమాంబ భక్తిగీతాలు పాడుతుంటే పరవశించి పోయేవాడు. నారాయణసూరి కావ్యాలలో అర్ధాలు వివరిస్తూవుంటే తానూ ఊ కొట్టేవాడు. ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వేంకటపతి మీది ధ్యానంతో ప్రొద్దులు గడిపేవాడు. అన్నమయ్యకు అయిదు సంవత్సరాలు వయస్సులో నారాయణసూరి ఆర్యుల సమ్మతి ప్రకారం ఉపనయనం చెయించాడు.

తిరుమల పయనం

       ఒకనాడు (8వ ఏట) ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుచుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయెను. అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది. అప్పుడు పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు.

తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు.

సంసారం, సంకీర్తనం

       అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు. ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు. అప్పటినుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు.

రాజాశ్రయం

       విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీకృష్ణదేవరాయలుకు తాత), టంగుటూరు కేంద్రంగా ఆ సీమ (“పొత్తపినాడు”) పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి “మూరురాయర గండ” అనే బిరుదుండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో హరిదాసకూటాలలో ప్రసిద్ధమయ్యింది.

అంత్య కాలం

       రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. “మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే” అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు “సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే” అన్నాడట.

95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.

ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. “పదకవితా పితామహుడు”, “సంకీరత్నాచార్యుడు”, “పంచమాగమ సార్వభౌముడు”, “ద్రవిడాగమ సార్వభౌముడు” – ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.

దొరికిన పెన్నిధి

1922లో, 14,000 అన్నమయ్య కీర్తనలు, ఇతర రచనలు లిఖించిన 2,500 రాగిరేకులు తిరుమల సంకీర్తనా భాండాగారం (తరువాత పెట్టిన పేరు)లో లభించాయి. ఇది తిరుమల హుండీకి ఎదురుగా ఉన్న ఒక రాతి ఫలకాల గది.

ప్రాజెక్టులు, సంస్మరణా కార్యక్రమాలు అన్నమయ్య యొక్క విస్తృత పద సంపదను ఉపయోగించుకొని ప్రజలలో వేంకటేశ్వరుని మధురభక్తిని మరియు శరణాగతిని ప్రోత్సహించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు స్థాపించబడింది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

పాప విమోచన ఏకాదశి

       పాల్గుణ బహుళ ఏకాదశిని “పాప విమోచన ఏకాదశి” లేక “సౌమ్య ఏకాదశి” అని అంటారు. పూర్వం కుబేరుని పుష్పవాటికలో అప్సరసలు విహరించసాగారు. ఎంతో సుందరమైన ఆ పుష్పవాటికలో దేవతలతో పాటు మునీశ్వరులు కూడా తపస్సు చేస్తు ఉంటారు. ఆ పుష్పవనానికి చైత్ర,వైశాఖమాసాలలో ఇంద్రుడు తన పరివారంతో వస్తూ ఉంటాడు. ఆ వనంలో మేధావి అనే పేరు గల ఓ మునీస్వరుడు కూడా తపస్సు చేస్తూ ఉండేవాడు.

       ఇంద్రుని పరిజనంతో పాటు వచ్చిన వారిలో మంజుఘోష అనే అప్సరస, మేధావి ముని తపాస్సుకు భగ్నం చెయ్యాలని చూస్తూ ఉండేది. ఒకరోజు ఆమే పట్ల మోహావేశుడైన మేధావి,తపస్సును వదిలి ఆమేతో గడుపుతూండగా, ఒక రోజు మంజుఘోష తన లోకానికి వెళ్ళేందుకు అనుమతిని ఇవ్వమని అడిగింది. ఆమే అలా అడిగినప్పుడు అల్లా అతను వద్దు అని అంటూ ఉండేవాడు. అలాగ 57 సంవత్సరాలు 9 నెలలు 3 రోజులు గడిచాయి. చివరకు ఆమే తనతో గడిపిన కాలాన్ని లెక్కవేసుకొమని చెప్పగా, లెక్కలు వేసుకున్న మేధావి ఇన్ని సంవత్సరలు వ్యర్ధం అయిపొయాయని చింతించి, కోపావేసంలో ఆ అప్సరసను శపించాడు. మేధావి శాపానికి మంజుఘోష శాపవిమోచనాన్ని అభ్యర్దించింది. పాపవిమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఫలితం ఉంటుందని చెప్పిన మేధావి, తన తండ్రి సలహాను అనుసరించి,తను కూడా ఆ వ్రతాన్ని ఆచరించి తగిన ఫలితం పొందాడు.

       ఈ రోజున పొద్దున్నే సూర్యొదయానికి ముందు లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానము ఆచరించి, ఆ రోజు ఉపవసం ఉండి, ఎదైన ఆలయం దర్సించుకుని, విష్ణు సహస్రనామ పారయణం పఠనం అనంతమైన ఫలితం కలిగిస్తుంది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి

జననం – 19.02.1627 (వైశాఖ, శుక్ల పక్ష తదియ).   మరణం – 04.04.1680 (చైత్ర పౌర్ణమి).

   శివాజీ క్రీ.శ. ఫిబ్రవరి 19, 1627వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో శహాజీ, జిజాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. జిజాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై (పార్వతి) పేరు శివాజీకు పెట్టింది. మరాఠాయోధుడు ఛత్రపతి శివాజీ మొగల్ చక్రవర్తులకు దక్కన్ సుల్తాన్లకు మధ్య ఏర్పడిన శక్తివంతమైన సామ్రాజ్యం మహారాష్ర్ట సామ్రాజ్యం. ఈ సామ్రాజ్య స్థాపకుడిగా శివాజీని చెప్పుకోవచ్చు. శివాజీ తండ్రి షాహాజీ, ఇతడు సుల్తానుల దగ్గర సైన్యాధికారి. తల్లి జిజియాబాయి. ఈ దంపతులకు 1630, ఫిబ్రవరి 19న జున్నార్ సమీపంలోని శివనెరీ కోటలో శివాజీ జన్మించాడు. జిజియాబాయి తాను పూజించే దేవత శివై (పార్వతి)పేరు శివాజీకి పెట్టింది.జిజియాబాయి కొడుకుకి చిన్ననాటి నుంచి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలను ఉగ్గుపట్టింది. తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా వ్యూహాలు పన్నాడు. 17 ఏళ్ల వయస్సులో శివాజీ మొట్టమొదటిగా యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. శివాజీ బీజాపూర్ సుల్తాన్ నుంచి పురంధర్. రాయఘడ్, సింహఘడ్ వంటి అనేక కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత శివాజీ 1664లో సూరజ్ను ముట్టడించాడు. కానీ 1665లో ఔరంగజేబు పంపిన జైసింగ్ పూనాపై దాడి చేసి పురంధర్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. దీనితో శివాజీ పురంధర్ సంధి కుదుర్చుకున్నాడు. శివాజీ అధీనంలో ఉన్న 35 కోటల్లో 23 కోటలను మొఘలు వశం చేశాడు. తర్వాత నాలుగు ఏళ్లకే వాటిని స్వాధీనం చేసుకున్నాడు. క్రీ.శ1674లో శివాజీ పట్టాభిషేకం చేసుకున్నాడు. శివాజీ పాలన సుదీర్ 12:27 PM కాషాయవర్ణ సింహాల సమూహం –  శివాజీ పాలన సుదీర్ఘ కాలం యుద్ధాలతో సాగినా ఎప్పుడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో పట్టుబడిన ఖైదీలు, పిల్లలు, స్ర్తీలకు సహాయం చేశాడు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాడు. ఒకసారి సైనిక అధికారి చిన్నముస్లిం రాజును ఓడించి ఆయన కోడల్ని శివాజీ ముందు బందీగా ప్రవేశపెట్టాడు. అప్పుడు శివాజీ ‘‘నా తల్లి నీ అంత అందమైనది అయితే నేను ఇంకా అందంగా పుట్టేవాడిని” అని, ఆమెను తల్లిగా గౌరవించి కానుకలు పంపించాడు. శివాజీ భవానిదేవి భక్తుడు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు.

   కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లిములు. ఎందరో ముస్లిములు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ ఆలీ ఆయుధాల విభాగానికి , ఇబ్రహీం ఖాన్ నావికాదళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు.శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్ ఖాన్, సిద్ధిక్ అనే ఇద్దరు ముస్లింలు!శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, అగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తి మదానీ మెహ్తర్ కూడా ముస్లిమే! అలాంటి మచ్చలేని వ్యక్తిత్వం శివాజీది..

శివాజీ మహారాజ్ కీ జై.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

హోలి పండుగ – వసంతోత్సవం

     కామదహనం తరువాత అంటే మన్మధుడు బూడిదపాలు అయిన తరువాత రతీ దేవీ పరమ శివున్ని తన భర్తని బతికించమని వేడుకొనగా ఆ పరమ శివుడు దయతో మన్మధుడిని తిరిగి బ్రతికిస్తాడు. మన్మధునికి మరో పేరే మదనుడు. అందుకే ఇది మదనోత్సవం, మధూత్సవం అన్న పేర్లతో కూడా పిలువబడుతోంది.

కాముని పున్నమి.. కామదహనం. వసంతోత్సవం. ఫల్గుణోత్సవం. డోలికోత్సవం.. హోలికాపౌర్ణమి. మదనోత్సవం. మధూత్సవం.. ఇలా ఎన్ని పేర్లున్నా చివరికి అందరి నోళ్లలోనూ నానే పేరు మాత్రం ‘హోలి’. ఫాల్గుణమాసంలో ‘శుక్ల పూర్ణిమ’ నే హోలి పండుగగా జరుపుకుంటాం.

      దేవతలందరూ వసంతోత్సవం జరుపు కుంటారు అదే హోళీ పండుగ. ఈరోజే బ్రహ్మసావర్ణి మన్వాది కూడా. అంటే బ్రహ్మ సావర్ణి దేవీ ఉపాసనతో మనువుగా వరం పొందిన గొప్ప రోజు.

కామదహనం వసంతోత్సవం

        ఒకానొక సమయములో కైలాసములో శివుడు, సతీ దేవీ ఉండగా దేవతలందరు కలిసి అటుగా ప్రయాణము అవుతున్న దృశ్యం వారికి కనిపించింది. వీరంతా ఎక్కడకు వెళుతున్నారని వాకబు చేయగా వారంతా దక్షయజ్ఞానికి వెళుతున్నట్లు తెలుస్తుంది. సతీ దేవీ ఆశ్చర్యపడి, తన తండ్రి గారు ఆ విషయం తమకు ఎందుకు తెలుపలేదా అని అనుకున్న సమయంలో, పరమ శివుడు దక్షుడు తమను కించపరుస్తున్నాడని, తమను ఆహ్వానించలేదని చెపుతాడు, అయినా సతీ దేవీ అక్కడకు వెళ్లి అవమానం భరించలేక ఆత్మాహుతీ అవ్వటం మనకు తెలిసిన విషయమే. అంతేకాక శివుడు సతీ దేవీ ఆత్మాహుతి వార్త విని రుద్రుడై, కాలభైరవుణ్ణి సృష్టించటం, అతడు యజ్ఞాన్ని సర్వనాశనం చెయ్యటం జరిగింది. ఆ తరువాత శివుడు సతీదేవీ వియోగంతో కృంగి ఘోరతపస్సులోకి వెళ్ళటం జరిగింది. శివ జాడలేదని గ్రహించిన రాక్షసులకు ఒక పండుగగా మారి వారు చేసే దుశ్చర్యలకు ఎదురులేకపోయింది. దేవతలకు విషమ పరిస్థితులు ఎదురయ్యాయి, వారికి ఏమిచెయ్యాలో పాలుపోని స్థితిలో అందరు ఆలోచించి, విరాగి అయిన శివుణ్ణి తపస్సు నుంచీ తప్పించి, వారి దృష్టిని మరల్చాలని ఆశించి, దానికి ఒక్క మన్మదుడే దిక్కని తోచి మన్మధుడిని ప్రేరేపించి, శివుడి మీద మన్మధబాణాలేసి వారి దృష్టిని మార్చాలని కోరారు. దేవతలంతా ఆ విధంగా కోరగా, మన్మధుడు ఇక వారి మాట వినక తప్పలేదు. అదే తడవుగా మన్మధుడు శివునిపైకి బాణాలు వెయ్యటం జరిగింది. తీవ్ర తపస్సులో వున్నా శివుడి తపస్సుకి భంగం కలిగింది. అతిరుద్రుడై కళ్ళు తెరచి చూశాడు, మన్మధుడు వరుసగా బాణాలు విసురుతున్నాడు. శువుడికి విపరీతమైన కోపం కలిగింది, క్షణాల్లో ఏం జరిగిందో ఉహించేలోగా శివుడి కోపాగ్నికి మన్మధుడు బూడిదవ్వడం జరిగిపోయింది. అంటే తన కోపాగ్నికి కామ స్వరూపుడైన మన్మధుడిని బూడిద చెయ్యడం జరిగింది. ఆనాడే కామదహనం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. మాగః శుక్ల త్రయోదశినాడు జరిగినదీ కామదహనం అనగా మన్మధ దహనం. మానవ జీవితానికి కోరికలే మొదటి శత్రువులు. కోరికలను కలిగించు కాముడే మన్మధుడు. శివునిచే జరిగిన ఈ కామదహనం అంటే తన కోపాగ్నికి కామ స్వరూపుడైన మన్మధుడిని బూడిద చెయ్యడం జరిగింది. ఆనాడే కామదహనం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ కామదహనం ఓ పర్వదినంగా జరుపుకోవడం అనాదిగా ఆచారంగా మారింది. కామదహనం జరిగిన తరువాత మన్మధుని భార్య అయిన రాతీదేవీ వచ్చి విషయం తెలుసుకొని తన భర్త భాస్మంగా మారడం చూచి దిగ్భ్రాంతి చెంది తన భర్త కోసం శోకించటం మొదలుపెట్టింది. దేవతలందరినీ పిలిచి మీరేనా నా భర్తను శివునిపైకి పంపారు. ఇప్పుడు ఇలా అయ్యింది. అంటూ భాధపడింది. దేవతలందరూ రతీదేవిని తీసుకొని శివుని దగ్గర చేరి ప్రార్ధించి తిరిగి మన్మధుని బతికించారు. మన్మధునికి శరీరం లేకపోయినా ఆయన చెయ్యవలసిన బాధ్యతలు అంటే దేవతలలు మానవులకు కోరికలు ప్రేరేపించడం జరుగుతుందని భార్య రాతీదేవికి మాత్రం శరీరంతోనీ కనిపిస్తాడని శివుడు వరం ఇచ్చాడు. అలా కాముడైన మన్మధుడు తిరిగి బ్రతికినందుకు వసంతోత్సవం ఆనందంతో చేసుకున్నారని అదే హోలీ అనీ, అదే వసంతోత్సవం అని అంటాము. ఆనాడు రతీమన్మధులను పూజిస్తే కుటుంబానికి సౌభాగ్యం ఆనందం కలుగుతుందని నమ్మకం.

 మరొక కథ

     హోలికను గురించి మరో కథ ప్రచారంలో వుంది. కృతయుగంలో రఘునాదుడనే సూర్యవంశపు మహారాజు వుండేవాడు. ఎంతో జనరంజకంగా రాజ్యపాలన చేస్తూ వుండగా కొందరు ప్రజలు వచ్చి హోలిక అను రాక్షసి వచ్చి తమ పిల్లలను బాధిస్తోందని మొరపెట్టుకున్నారు. ఆ సమయములో అక్కడే వున్న నారద మహర్షి రఘునాధ మహారాజా హోలిక అను రాక్షసిని ప్రతి సంవత్సరం ఫాల్గుణ పూర్ణిమ రోజు పూజించాలి. అలా పూజించిన వారి పిల్లలను ఆ రాక్షసి ఏమీ చెయ్యదు . కనుక రాజ్యంలో అందరిని వచ్చే ఫాల్గుణ పూర్ణిమ నాడు హోలికను పూజించమని ఆదేశించండి, అన్ని బాధలు తొలగిపోతాయి అన్నాడు. రాజ్యములోని ప్రజలందరూ ఫాల్గుణ పూర్ణిమ రాత్రి కాలమందు బిడ్డలను ఇంటిలోనే ఉంచి హోలికకు పూజలు చెయ్యాలని మహారాజు ఆదేశించాడు. పగటిపూట పూజ చేసిన వారికి దుఃఖములు కలుగుతాయి. కనుక హోలికకు రాత్రే పూజలు చేయాలి. అలా ఈ హోళీ ….. హోలిక పూజ వాడుకలోకి వచ్చిందని తెలుస్తోంది. ఈ హోలిక హిరణ్య కశిపుని చెల్లెల్ని, ప్రహ్లాదుని అగ్నిలో తోయించినప్పుడు ప్రహ్లాదునితోపాటు ఈ హోలిక కూడా అగ్నిలో ప్రవేశించి మారి భస్మం అయ్యిందని అందువల్ల పిల్లల రక్షణ కొరకు ఆమెను పూజించడం ఆచారంగా మారిందని పెద్దలు చెప్తారు.

హోలికి సంబంధించిన మరొక ప్రస్తావన

శ్లో   :     సరోడోలాగతం దృష్ట్వా గోవిందం పురుషోత్తమం

            ఫాల్గుణ్యాం సంయతో భూత్వా గోవిందస్యపురం ప్రజేత్. ||

     పరమాత్ముడైన శ్రీ కృష్ణుడు ఈ రోజే ఉయలలలో ప్రవేశించాడని ఈ ఫాల్గుణ పూర్ణిమనాడు ఉయలలోని కృష్ణుని పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.

       హోళీ అనే పదం డోల అనే పదానికి ప్రతీకమని అలా హోలి పండుగగా ప్రసిద్దమైనదనీ మరి కొందరు అంటారు. ఏదేమైనా కామదహనం తరువాత జరిగే ఈ హోళీ వసంతోత్సవం ఇంత ప్రాచుర్యాన్ని సంతరించుకొని జాతి సమక్యైతను దారి తీసే విధంగా అందరిని ఆనందిమ్పచేస్తోంది. కాబట్టి తప్పక ఆచరింప తగిన పండుగ, ఇది జాతి, మత, స్త్రీ, పురుషుల వయో భేదం లకుండా కలిసిపోయి ఆనందంగా జరుపుకునే పర్వదినం.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

అమలక ఏకాదశి

       ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని పురాణగాథలు చదివినా సరిపోదు. ఈ ఏకాదశిని ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకుని మోక్షం పొందిన ఎందరో పుణ్యపురుషులు ఉన్నారు మన పురాణాలలో. ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతతని ఇవ్వటమే కాదు  శారీరికంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పదిహేను రోజులకొకసారి ఒక రోజు మొత్తం ఏమి తినకుండా ఉండటం వల్ల కడుపుకి విశ్రాంతి లభించి, ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.

       మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత. ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే (శుక్ల పక్ష) ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు. దీనినే “ధాత్ర ఏకాదశి” అనీ  అంటారు. ఈ రోజు  ఉసిరి చెట్టు కి విశేష పూజలు చేస్తారు. విష్ణు మూర్తి ఈ రోజు ఉసిరి చెట్టులో కొలువుతీరి ఉంటాడని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాదు లక్ష్మి దేవి, కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసముంటారని  ప్రతీతి. రాధా కృష్ణులు కూడా హోలికి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీలలాడుతూ ఉంటారని మన పురాణగాథలు చెపుతున్నాయి.

       ఈ ఏకాదశికి సంబంధించిన కథని చూసినట్లయితే చిత్రసేనుడు అనే రాజు, ఆ రాజ్యంలోని ప్రజలు క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవారట. ఒకసారి వేట కోసం అడవికి వెళ్ళిన చిత్రసేన మహారాజు దారి తప్పి రాక్షసుల చేతుల్లో చిక్కుకుంటాడు. వాళ్ళు అతనిని బంధించి తమ స్థావరానికి తీసుకొని వెళ్తారు. స్పృహతప్పి పడిపోయిన చిత్రసేనుడి దేహం లో నుండి ఒక కాంతి పుంజం బయటకి వచ్చి ఆ రాక్షసులని హతమారుస్తుంది. కొద్ది సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ పది ఉన్న రాక్షసులని చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతం వల్ల నువ్వు సురక్షితంగా రక్షించబడ్డావు అని  ఆకాశవాణి పలుకుతుంది. ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలందరూ చిత్రసేనుడికి జైజైలు కొట్టి అప్పటినుంచి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ  ఒకే ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని చేయటం ప్రారంభించారు.

       ఈ ఏకాదశి రోజున భక్తీ శ్రద్ధలతో ఉసిరిచెట్టుని పూజించిన వారికి సకల సంపదలు కలిగి, దేహాన్ని విడిచాకా మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. అవకాశం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటకాలు తిన్నా, ఉసిరిని దక్షిణతో కలిపి బ్రాహ్మణులకు దానం ఇచ్చిన విశేష ఫలితాలు లభిస్తాయట. మనం కూడా ఆ నారాయణుడి కృపకి పాత్రులం అవుదాము.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

పుత్రగణపతి వ్రతం

       ఫాల్గుణ శుద్ధ చవితినాడు పుత్రగణపతి వ్రతం. వినాయక చవితి విధానంలోనే చేసే వ్రతం ఇది. గణపతిని పుత్రసంతానం కోసం పూజిస్తూ ఆచరించే వ్రతం ఇది. కేతువు అనుగ్రహానికి వినాయక చవతి, సంకష్టహర చతుర్థి, పుత్రగణపతి వ్రతాలు చేస్తే ఫలింత వుంటుందని సిద్ధాంతాలు చెపుతున్నాయి.

       గణపతి శబ్ద బ్రహ్మస్వరూపము . అంటే ఓంకారానికి ప్రతీక . మంత్రాలన్నింటికీ ముందు ఓంకారము ఎలా ఉంటుందో అలా అన్ని శుభకార్యాలకు ప్రారంభంలో గణేశపూజ విధిగా ఉంటుంది . గణేశుడు ఆది , అంతం లేని ఆనందమూర్తి , సకల సంపత్తులనిచ్చే సిద్ధిదేవత . ఓంకారనాదం ఉద్భవించి , ఆ నాదం క్రమక్రమం గా గజానరూపం గా వెలుగొందింది . గణపతిని ఓంకారస్వరూపునిగా ” గణపత్యధర్వశీర్షం ” కూడా పేర్కొన్నది . దేవతాగణాలకు ఆదిపురుషుడై , అధిపుడై ఉద్భవించడం వల్లనే ఈయనకు గణనాధుడని , గణేశుడని , గణపతి అని పేర్లు వచ్చాయి . ఆకృతిని బట్టి కొన్నిపేర్లు , ఆధిపత్యాన్ని అనుసరించి కొన్ని పేర్లు గణపతికి కలిగినప్పటికీ ప్రధానము గా ఈ దైవం గణాలకు నాయకుడు .

       ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను … పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.

       పూర్వం మహారాజులు … చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్లంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్లు భావించేవాళ్లు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్లు పుత్ర సంతానం కోసం ఆరాటపడే వాళ్లు. ఇందుకోసం వాళ్లు ‘ఫాల్గుణ శుద్ధ చవితి’ రోజున ‘పుత్ర గణపతి’ వ్రతాన్ని ఆచరించే వాళ్లు.

       అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు ప్రస్తావిస్తున్నాయి.

       ఇక రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయినా … రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా ‘పుత్రగణపతి వ్రతం’ మాత్రం నాటి నుంచి నేటి వరకూ ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి, పరిశుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో కలశస్థాపన చేసి … శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్రగణపతి వ్రత కథను చదువుకుని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.

       ఇంచుమించు వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తమకి పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకితభావంతో చెప్పుకోవాలి. బుద్ధిమంతుడు … జ్ఞానవంతుడు … ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి. ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతికాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు.

       ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి. మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకితభావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతికాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

పొట్టి శ్రీరాములు జయంతి

జననం : మార్చి 16, 1901 అణ్ణాపిళ్ళె, జార్జిటౌను, మద్రాసు

మరణం : 1952 డిసెంబరు 15 మద్రాసు

       పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పడమటిపాలెం గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత “గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే”లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు.

       1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోవడం జరిగింది. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.

స్వాతంత్ర్యోద్యమంలో పాత్ర

       పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. 1985లో ప్రచురింప బడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ (Committee for History of Andhra Movement) అధ్యయనంలో పొట్టి శ్రీరాములు – మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి ఇలా వ్రాయబడింది. – “సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధత లు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లోను, ఆంధ్రలో కృష్ణా జిల్లాలోని కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కొమరవోలులో యెర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. 1943-44ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.

ఆంధ్ర రాష్ట్రసాధన దీక్ష

       మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేసాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోటానికి వీల్లేదని మరునాడే వెళ్ళిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు. అయితే కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ సూచించారు. రాజమండ్రి కూడా మంచిదేనన్నారు. విజయవాడ కమ్యూనిస్టుల కంచు కోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వొప్పుకోలేదు. నెల్లూరు,చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తా వాళ్ళను మేము నమ్మం,రాజధాని రాయలసీమలోనే పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని నీలం సంజీవరెడ్డి తదితరులు ఎదురుతిరిగారు. గత్యంతరంలేక కర్నూలు రాజధానిగా 1953 నవంబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు.

మరణం

       డిసెంబర్ 15 శ్రీరాములు ఆత్మార్పణ రోజు!! ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. కళ్లు తెరిచారు. అంతలోనే మూతలు పడపోయేవి. చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు. 54 పౌనుల (24.5 కేజీలు) బరువు తగ్గారు. నాడి కదలిక, శ్వాసతీరుల్లో మార్పు వచ్చింది. 16 గంటలపాటు మూత్రం స్తంభించింది. నోటిమాట కష్టమైంది. అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్లేవారు. సందర్శకులను నిలిపివేశారు. సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణమరాజు, ఆయన సతీమణులతో మాట్లాడలేకపోయినా… చిరునవ్వుతో స్వాగతం పలికారు. అప్పటి నుంచి క్రమంగా శరీరం చల్లబడిపోయింది. రాత్రి  11.23 గంటలకు పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకొన్నాడు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)