Categories
Vipra Foundation

అక్షయ తృతీయ

       వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. ఇంకా “అక్షయ తృతీయ” నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు.

       మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం..ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పారు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమం, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. (పుణ్య కార్యాచరణం వల్ల వచ్చే ఫలితం అక్షయమైనప్పుడు పాపకార్యాచరణం వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుందిగా… ). ఈ నాడు, తృతీయా తిథి బ్రహ్మగారితో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈ నాటి ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్య కర్మమాచరించినా కూడా తత్సంబంధఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి అర్చించి, తరవాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్ఛిష్ఠంగా, బ్రాహ్మణోఛ్ఛిష్ఠంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు.

       ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరవాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమునముక్తిని పొందగలడు. (అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము, అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యమునుండి కావచ్చు, యవల నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారముని అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు) శ్రీ నారద పురాణం కూడా, ఈ నాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెప్తోంది.

       ఈనాడు దానం ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే, ఇక గంగా తీరంలో ఈనాడు దానాది ఫలములు నారదమహర్షి ఇలా చెప్పారు. అక్షయ తృతీయ నాడు గంగా తీరంలో నియమంతో ఘ్రుత ధేను దానం చేసినవాని ఫలితం ఇంతింత కాదు, సహస్రాదిత్య సంకాశుడై సర్వకామ సమన్వితుడై బంగారము, రత్నములతో కూడి చిత్ర హంసలతోకూడిన విమానములో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు, కల్పకోటి సహస్రముల కాలము బ్రహ్మ లోకమున విరాజిల్లును. తరవాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుడతాడు. అంతమున బ్రహ్మ జ్ఙానియై ముక్తిని పొందుతాడు. అలాగే యధావిధిగా గోదానము చేసినవాడు గోలోమ సంఖ్యలు ఎన్నిఉన్నాయో అన్ని సంవత్సరములు స్వర్గలోకములో విరాజిల్ల తరవాత భూమిమీద పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి అంతమున ముక్తిని పొందుతాడు. గంగా నది ఒడ్డున వేదవిదుడైన బ్రాహ్మణునకు కపిల గోదానము చేసినచో నరకములోనున్న తన పితరులందరూ స్వర్గాన్ని చేరెదరు. అక్కడే భూమిని దానం చేస్తే, ఎంత భూమిని దానం చేసాడో అంతభూమిలోని రేణువుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ విష్ణు శివలోకములలో నివసించి భూమిమీద పుట్టి సప్త ద్వీపాదిపతి అగును. అతడు నిద్రించినచో భేరీ శంఖాది నినాదములచే మేల్కొలపబడును. సర్వ ధర్మ పరాయణుడైసర్వ సౌఖ్యములను పొంది నరకవాసంలో ఉన్న పితరులనందరినీ స్వర్గమున చేర్చి స్వర్కమున నున్న పితరులనందరినీ మోక్షమున చేర్చి స్వయముగా జ్ఙానియై అవిద్యను జ్ఙాన ఖడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యముని పొంది పరబ్రహ్మమును పొందెదడు. ఇటువంటి పుణ్య ఫలములెన్నో చెప్పబడినవి. ఈ తిథినాడు పదహారు మాస మితమగు (పదహారు మినప గుండ్ల ఎత్తు) స్వర్ణమును విప్రునకు దానమిచ్చిన, వాని ఫలము అక్షయము వాడు అన్ని లోకములందు పూజ్యుడై

విరాజమానుడగును.

       దీనివల్ల తెలిసేదేమంటే బంగారం కొంటే అక్షయం కాదు, ఈ రోజు చేసే ధర్మకార్యాలు, ఉపాసనలు, దానాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి అని.తెలియని వారికి ఇది తెలియ చెప్పండి. ఈ నాడు డబ్బులు లేకున్నా అప్పు చేసిబంగారం యొక్క డిమాండు పెంచి తద్వారా ధర పెంచి, దేశ ఆర్థిక పరిస్థులను,వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను ఇన్ఫ్లేషన్ పేర ఇబ్బంది పాలు చేయకండి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

పరశురామ జయంతి

       శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల్లో పరశురామ అవతారానికి ఎంతో విశిష్టత వుంది. మదగ్ని, రేణుకాదేవి ల చివరి కొడుకు పరశురాముడు, మదగ్ని చాలా కోపం గలవాడు.  మునికుమారుడిలా ఆశ్రమ ధర్మాలను నిర్వహిస్తూనే క్షత్రియుడిలా అసమానమైన పౌరుష పరాక్రమాలను ప్రదర్శించాడు.శ్రీ మహావిష్ణువు పరశురామునిగా అవతరించిన వైశాఖ శుద్ధ తదియను పరశురామ జయంతిగా పిలుస్తారు.పరశురాముడు విష్ణుమూర్తి దశావతారములలో ఆరవది.

తల్లిదండ్రుల పట్ల పరశురాముడు అపారమైన ప్రేమానురాగాలను కలిగివుండేవాడు. మదగ్ని భార్య రేణుక తనపతి భక్తితో రోజు నదికి వెళ్ళి తనే స్వయంగా మట్టి కుండచేసి ఇంటికి నీళ్ళుతెచ్చేది. ఒకరోజు రేణుకాదేవి చిత్రరధుడనే రాజును చూసింది. ఆరోజు ఆమె నీళ్ళుతేవటానికి కుండ తయారు చేసినా కుండ తయారుకాలేదు. నీళ్ళు తేలేకపోయింది. ఏమి జరిగింది అని దివ్యదృష్టితోచూడగా రేణుక చిత్రరధుని చూడటంవల్లే పాత్రతయారుకాలేదని గ్రహించి తనపుతృలును పిలిచి తల్లిని నరకమన్నాడు. వారందరు తమవల్లకాదన్నారు. అప్పుడు చివరి కొడుకు పరశురాముడు సరే అని తల్లి తల నరకమని తండ్రి ఆవేశంతో ఆదేశించినప్పుడు, క్షణమైనా ఆలస్యం చేయక ఆ పని చేసి పితృవాక్య పరిపాలకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆదేశించిన వెంటనే ఆచరణలో పెట్టిన పరశురాముడిని, ఏదైనా వరం కోరుకోమని జమదగ్ని మహర్షి అడిగితే తన తల్లిని బతికించమని కోరాడు.

        ఒకసారి వేటకి వచ్చిన కార్తవీర్యార్జునుడు, జమదగ్ని మహర్షి ఆశ్రమాన్ని కూడా దర్శిస్తాడు. అక్కడ గల కామదేనువును చూసి, దానిని తనకి ఇవ్వవలసినదిగా కోరతాడు. తన నుంచి దానాన్ని గ్రహించే అర్హత అతనికి లేదని చెబుతాడు మహర్శి. దాంతో జమదగ్ని మహర్షిని హతమార్చిన కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువును తీసుకుని తన రాజ్యానికి బయలుదేరుతాడు. జమదగ్ని మరణించడంతో ఆ బాధతో తల్లడిల్లిపోతూ రేణుకాదేవి 21 మార్లు పరశురాముడిని పిలుస్తుంది. జరిగిన ఘోరం గురించి తెలుసుకుని తన తల్లి తనని ఎన్ని మార్లు పిలిచిందో అన్ని మార్లు క్షత్రియులపై దండెత్తి వారిని హతమార్చుతానని పరశురాముడు ప్రతిజ్ఞ చేస్తాడు.క్షత్రియ జాతినంతటిని సమూలంగా నాశనం చేశాడు.

       ఆ తరువాత జమదగ్నిని  భ్రుగుమహర్షి బతికించినప్పటికీ, ప్రతిజ్ఞ చేసిన ప్రకారం పరశురాముడు క్షత్రియ సంహారం చేస్తాడు. ఆ పాపాన్ని ప్రక్షాళ చేసుకోవడం కోసం అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠిస్తాడు. అలాంటి పరశురాముడిని అయన జయంతి సందర్భంగా ఆరాధించినట్టయితే, ఎవరికి సంబంధించిన రంగాల్లో వారు విజయాన్ని సాధిస్తారు. తలపెట్టిన కార్యాలు జయప్రదమవుతాయి.   

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

వైశాఖ మాసం ప్రాముఖ్యత

       సాధారణంగా నీటికి గల శక్తులు పరమ పావనమైనవి. స్నానం, పానం జలానికి ఉపయోగాలు. కల్మషాలను కడిగేది, దాహాన్ని తీర్చేది నీరు. స్నాన, ఆచమనాలనే మార్గాల్లో జలశక్తి మానవులకు మేలు చేస్తుందని వేదవాక్కు.

      సాధారణ స్నానం దేహాల్ని శుద్ధిచేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని, స్థిరత్వాన్ని కలిగిస్తుందంటారు. అందుకే స్నానం నిత్యవిధి అని విజ్ఞులు చెబుతారు. జపహోమాది కర్మలకు, పితృ దైవ కార్యాలకు శారీరక స్నానం చేతనే అధికారం కలుగుతుంది. వివిధ కార్యక్రమాలకు చేసే స్నానాలను నిత్యస్నానం, నైమిత్తికస్నానం, కామ్యస్నానం, క్రియాంశస్నానం, అభ్యంగనస్నానం, క్రియాస్నానం అని ఆరు విధాలుగా చెబుతారు.

      వైశాఖ, కార్తీక, మాఘ మాసాల్లో ప్రత్యేక ఫలితాలను ఆశిస్తూ ఆచరించే స్నానాలు, యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాల్ని ‘కామ్యస్నానాలు’గా వ్యవహరిస్తారు.

      పొద్దున్నే నిద్రను వదిలి స్నానాదులుచేసి రావిచెట్టుకు నీరు పోసి ప్రదక్షిణలు చేసి మాధవుని తులసీదళాలతో పూజించడం అనేది ఈ వైశాఖమాసానికి ఉన్న ప్రత్యేకత. మాసాల్లో వైశాఖం మహావిష్ణువుకు ప్రీతికరమైనదని చెబుతారు. తృతీయనాడు కృతయుగం ఆరంభమైందని, కనుక ఈ కృతయుగాదినే అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుతారని అంటారు. ఈ అక్షయ తృతీయ గురించి భవిషోత్తర పురాణం చెప్తోంది. సౌభాగ్యాన్ని వృద్ధి చేసే ఈ అక్షయ తృతీయనాడు బదరీ నారాయణుని దర్శించితే సకల పాపాలు నశిస్తాయని అంటారు. అక్షయ తృతీయనాడు లక్ష్మీదేవిని పూజించే ఆచారం కూడా కొన్నిచోట్ల కనిపిస్తుంది. ఈ రోజు మొదలుకొని అన్నీ పర్వదినాలే. ఈ శుక్ల తదియనాడు సింహాచలేశుడు తన భక్తులకు నిజరూప దర్శనాన్ని కలుగచేస్తాడు. తదియనాడు ఆ సింహాచల వరాహ నృసింహుని చందనోత్సవాన్ని జరుపుతారు. లోకాలన్నీ కూడా చందనమంత చల్లగా ఉండాలనీ కోరుకొని ఈ చందనోత్సవంలో జనులందరూ పాల్గొంటారు. ఈ శుద్ధ తదియనాడు శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముడు కూడా రోహిణీ దేవికి జన్మించిన కారణాన బలరామ జయంతిని జరుపుకొంటారు. పంచమినాడు అద్వైతాన్ని లోకంలో అక్షయంగా నిలిపిన ఆదిశంకరాచార్యుని జయంతి. ఆ ఆదిశంకరుడు చిన్ననాడే దరిద్రనారాయణులను చూసి కరుణాసముద్రుడై లక్ష్మీదేవిని స్తోత్రం చేసి వారిళ్ల్లను సౌభాగ్యాలకు నెలవు చేసాడు. ఆ లక్ష్మీ స్తోత్రమే కనకధారస్తోత్రంగా ఈనాటికీ విరాజిల్లుతోంది. ఆ తర్వాత బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పిన రామానుజాచార్యుడు షష్ఠినాడు జన్మించిన కారణంగా రామానుజ జయంతిగా విశేషపూజలు చేస్తారు. తిరుక్కోటి యార్నంబి దగ్గర మోక్షపాప్త్రి కోసం తీసుకొన్న రహస్య మంత్ర రాజాన్ని లోకులందరినీ పిలిచి రామానుజుడు ఆనందంగా చెప్పేశాడు. రహస్యమైన దాన్ని బహిరంగ పరిచాడనే గురాగ్రహాన్ని కూడా లోకులకోసం భరించడానికి సంసిద్ధమైన రామానుజాచార్యుని గొప్పతనం తెలుసుకొని ఆ మార్గంలో నడవాల్సిన అవసరం నేటి మానవులకు ఎంతైనా ఉంది అని జ్ఞప్తి చేయడానికే ఈ రామానుజాచార్య జయంతి జరుపుతారంటారు. తన పినతండ్రులు కపిల ముని కోపావేశానికి కాలి బూడిద అవ్వడం చూసి సహించలేని భగీరథుడు ఎన్నో ప్రయత్నాలు చేసి తపస్సులు చేసి కైలాసనాథుడిని మెప్పించి ఆకాశగంగను భువిపైకి తీసుకొని వచ్చాడు. ఈ గంగోత్పత్తి కూడా వైశాఖమాస సప్తమినాడే జరిగింది. ఈ గంగోత్పత్తిని పురస్కరించుకొని గంగాస్తుతిని చేసినవారికి పతితపావన గంగ సకలపాపపు రాశిని హరిస్తుందని పండితులు చెప్తారు. ఈ మాసంలో వచ్చే ఏకాదశే మోహినే్యకాదశి అని అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించినవారికి మహావిష్ణువు అక్షయంగా సంపదలు ఇస్తాడని, వారు ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణ్ధుమ ప్రవేశం కలుగుతుందని పురాణ ప్రవచనం. తండ్రి మాటలను జవదాటకుండా పితృవాక్య పరిపాలకునిగా పేరుతెచ్చుకొన్న జమదగ్ని పుత్రుడు ఈ భూమిని ఏలే రాజుల దాష్టీకాన్ని చూడలేక పరశువును పట్టుకొని 21సార్లు రాజులపై దండయాత్ర చేసాడు. అటువంటి పరశురాముడు దశరథ తనయుడు శివచాపాన్ని విరచాడన్న వార్త విని ఆ రాముని బలమేమిటో తెలుసుకొందామని వచ్చి రామునికి తన అస్త్రాలన్నింటినీ సంతోషంతో ధారపోసి మహేంద్రగిరికి తరలిపోయాడు. ఆ జమదగ్ని రేణుకల పుత్రుడైన పరశురామజయంతిని పరశురామ ద్వాదశిగా జరుపుతారు. తన భక్తుని కోరిక మేరకు సర్వాన్ని ఆక్రమించిన మహావిష్ణువు నృసింహుడై స్థంభంనుంచి ఆవిర్భవించి లోకకంటకుడైన హిరణ్యకశపుడిని సంహారం చేసి లోకాలన్నింటిని కాపాడినరోజు శుద్ధ చతుర్థశిగా భావించి నృసింహ జయంతిని చేస్తారు. ఇంకా బుద్ధ జయంతి, కూర్మజయంతి, నారద జయంతి ఇలా ఎందరో మహానుభావుల జయంతులు జరిపే ఈ వైశాఖం నుంచి మనం కూడా లోకకల్యాణకారకమైన పనులు చేయాలనే భావనను ఏర్పరుచుకోవాలి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

వరూథినీ ఏకాదశి

“ఏకాదశివ్రతం నామ సర్వకామఫలప్రదం | కర్తవ్యం సర్వదా ఏప్రైర్ విష్ణు ప్రణన కారణం ||”

చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే వరూధినీ ఏకాదశి మహిమ శ్రీకృష్ణధర్మరాజ సంవాదముగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది.

ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణభగవానునితో పలుకుతూ “వాసుదేవా! నీకు నమస్సులు. చైత్రమాసం. కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి, దాని వామప్రభావ మహిమలను గురించి నాకు వివరించవలసినది” అని అన్నాడు.

దానికి ప్రత్యుత్తరమిస్తూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు “రాజా! ఆ ఏకాదశి పేరు వరూథనీ ఏకాదశి, అది ఇహపరాలలో మనిషికి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ ఏకాదశి వ్రతపాలనము ద్వారా మనిషి నిరంతర సుఖాన్ని పొందుతాడు. తన పాపం నశించగా అతడు అత్యంత సౌభాగ్యవంతుడౌతాడు. ఆ వ్రతపాలనచే అభాగ్యురాలైన సతి భాగ్యవంతురాలౌతుంది. పురుషుడు. ఇహపరాలలో సుఖసమృద్ధులు పొందుతాడు. వారు జన్మమృత్యువుల వలయం నుండి బయటపడతారు, సమస్త పాపం నశించగా వారు భగవద్భక్తిని పొందుతారు. మాంధాత ఆ ఏకాదశి. వ్రతపాలన ద్వారానే ముక్తుడయ్యాడు. ధుంధుమారుని వంటి ఎందరో రాజులు ఆ వ్రతపాలన ద్వారా మోక్షాన్ని పొందారు. వరూథినీ ఏకాదశి వ్రతపాలన మాత్రముననే మనిషి పదివేల సంవత్సరాల తపోఫలాన్ని పొందగలుగుతాడు. కురుక్షేత్రములో సూర్యగ్రహణ సమయమున నలభై కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కేవలము ఆ వరూధినీ ఏకాదశ వ్రతపాలనము ద్వారా మనిషి సాధించగలుగుతాడు.”

“ఓ రాజోత్తమా! అశ్వదానము కన్నను గజదానము శ్రేష్ఠమైనది. భూదానము గదానము కన్నను. శ్రేష్ఠమైనది; తిలాదానము భూదానము కన్నను శ్రేష్ఠము. సువర్ణదానము తిలాదానము కన్నను, అన్నదానము సువర్ణదానము కన్నను శ్రేష్ఠములైనవి. నిజానికి అన్నదానము కంటే శ్రేష్ఠమైన దానము ఇంకొకటి లేనేలేదు. ఓ రాజశ్రేష్టుడా! అన్నదానముచే మనిషి పితృదేవతలను, దేవతలను, సకలజీవులను సంతృప్తిపరుపగలుగుతాడు. కన్యాదానము అన్నదానముతో సమానమని పండితులు చెబుతారు. అన్నదానము గోదానముతో సమానమని సాక్షాత్తుగా భగవంతుడే పోల్చి చెప్పాడు. అంతేగాక దానములు అన్నింటిలోను ఇతరులకు జ్ఞానదానము చేయుట అత్యున్నతమైన దానము.”

“వరూథినీ ఏకాదశి వ్రతపాలనముచే మనిషి సమస్త దాన ఫలితాన్ని పొందగలుగుతాడు. కుమార్తెను అమ్మి జీవికను సంపాదించే వ్యక్తి నిక్కముగా ఘోరపాపాన్ని మూటగట్టుకొనినవాడై విలయానంతరము వరకు నరకములో మ్రగ్గుతాడు. కనుక ఎవ్వడును కుమార్తెను తాకట్టు పెట్టరాదు. ఓ రాజరాజా! లోభముచే ఎవడేని కుమార్తెను అమ్ముకుంటే మరుసటి జన్మలో పిల్లి అవుతాడు. కాని ఎవడైతే శక్త్యనుసారము కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరునికి దానమిస్తాడో అతని పుణ్యపరిపాకాన్ని యమరాజు యొక్క ప్రధాన కార్యదర్శియైన చిత్రగుప్తుడైనా గణించలేడు. ఆ ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు కంచుపాత్రలో భుజించరాదు, మాంసభక్షణము చేయరాదు, ఎఱ్ఱపప్పును, శనగపప్పును, పాలకూరను, తేనె, ఇతరులు వండిన దానిని, ఒకమారు కంటే ఎక్కువ గాని తినరాదు; ఏకాదశికి ముందురోజు నుండే మైథనక్రియలో పాల్గొనరాదు. జూదము, నిద్ర, తాంబూల సేవనము, పళ్ళను తోముకొనుట, ఇతరులను నిందించుట, పాపితో మాట్లాడుట, క్రోధి యగుట, ఏకాదశి రోజు అబద్ధము చెప్పుట వంటివి ఎంతమాత్రము చేయరాదు. ఏకాదశి మర్నాడు కూడ మనిషి కంచుపాత్రలో భుజించరాదు; మాంసభక్షణము, ఎఱ్ఱపప్పు వంటివి తినరాదు; తేనెను త్రాగరాదు. అసత్య భాషణము, వ్యాయామము, కష్టించి పనిచేయడము, రెండు పూటల భోజనము, మైథున సంభోగము, గుండు గీసికొనుట లేదా గడ్డము చేసికొనుట, శరీరానికి తైలమర్దనము, ఇతరులు వండినదానిని తినడము చేయరాదు. ఏకాదశి వ్రతభంగానికి దారితీసే ఈ నిషేధాలను జాగరూకతతో పాటించాలి. వీటితోపాటు ఇతర నిషేధాలను ఈ మూడు రోజులే కాకుండ ఎప్పటికీ పాటించాలి. ఈ నియమనిబంధనల ననుసరించి వరూథినీ ఏకాదశి వ్రతాన్ని పాటించే వ్యక్తి సమస్త పాపదూరుడై పరమగతిని పొందుతాడు. ఆ ఏకాదశి రోజున మేల్కొని ఉండి జనార్దనుని (శ్రీకృష్ణుని) సేవించేవాడు సమస్త పాపదూరుడై జీవిత చరమలక్ష్యాన్ని సాధిస్తాడు. ఆ ఏకాదశి మహిమను వినేవాడు, చదివేవాడు వేయిగోవుల దానఫలితాన్ని నిక్కముగా పొందుతాడు; పాపముక్తుడై అతడు విష్ణుపదాన్ని చేరుకుంటాడు.”

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

రవీంద్రనాధ ఠాగూర్ జయంతి

(మే 7, 1861 – ఆగస్టు 7, 1941)

       ఆంగ్లేతర సాహిత్య రచనలతో అత్యంత  ప్రతిష్ఠాకరమైన నోబెల్ పురస్కారాన్ని అందుకున్న ప్రతిభాశాలి విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్. ఈయన రచించిన ‘గీతాంజలి’ తదితర బెంగాలీ రచనలు సమాజాన్ని ఉత్తేజరపరిచాయి. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటాయి. ఠాగూర్ రచనలు సర్వ మానవ సౌభ్రాతృత్వ భావనకు ప్రాణం పోశాయి. వీటిని రవీంద్రుడే స్వయంగా ఆంగ్లానువాదం చేయడం మరో విశేషం.

  ఈ అనువాదాల ద్వారా నోబెల్ కమిటీ

       ఈ రచనల సారాంశాన్ని గ్రహించింది. అతడిని 1913లో నోబెల్ బహుమానానికి అర్హుడిగా ప్రకటించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ కోల్‌కతా మహానగరంలోని బ్రాహ్మణ జమిందారీ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి దేవేంద్రనాథ ఠాగూరు, తల్లి శారదాదేవి. ఈ దంపతుల 13వ సంతానం రవీంద్రుడు. ఇతడే కడపటివాడు. ‘ఠాగూర్’ అంటే ‘గౌరవప్రదమైన అయ్యా’ అని అర్థం. రవీంద్రుని తల్లి శారదాదేవి అతడి చిన్నతనంలోనే మరణించారు. దాంతో ఆయన నౌకర్ల చేతిలో పెరిగాడు. రవీంద్రుడి జ్యేష్ట సోదరుడైన ద్విజేంద్రనాథ ఠాగూరు సమాజంలో గౌరవం పొందిన కవి, తత్వవేత్త. మరొక సోదరుడు సత్యేంద్రనాథ్ బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఐసీఎస్ పదవి పొందిన తొలి భారతీయ అధికారి. మరొక సోదరుడు జ్యోతీంద్రనాథ నాటక ప్రయోక్త, సంగీతకారుడు. అందువల్ల జోరాశాంకో జమీందారీ బంగళా ఎప్పుడూ నాటకాలతో, పాశ్చాత్య, బెంగాలీ సంగీత సభలతో, సాహిత్య గోష్ఠులతో కళకళలాడుతూ ఉండేది. రవీంద్రుని సోదరి స్వర్ణకుమారి రచయిత్రి. రవీంద్రుడు ఏ పాఠశాలకు పోకుండానే ఇంటివద్దే విద్యాభ్యాసం చేశాడు. 8 సంవత్సరాల వయసులోనే రవీంద్రుడు పద్యాలు రాయటం ప్రారంభించాడు. ఆయన రాసిన మొట్టమొదటి పద్య సంపుటి ‘భాను సింహ’, అయితే దానిని బెంగాలీ పండితులు ఆమోదించలేదు.

  శాంతినికేతన్‌కు పయనం!

       రవీంద్రునికి 11 సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది. ఆ తరువాత రవీంద్రుడు తన సోదరులతో కలిసి తండ్రి స్థాపించిన శాంతినికేతన్ ఎస్టేట్‌కు వెళ్లాడు. ఆ సమయంలోనే ఆయన హిమాలయాలలోని డల్హౌసీ, పర్వత ప్రాంతాలను దర్శించాడు. ఆ ప్రాంతాలు, శాంతినికేతన్, రవీంద్రుని మనస్సును ఆకట్టుకున్నాయి. రవీంద్రుడు సోదరులతో అక్కడే కొన్ని నెలల పాటు గడిపాడు. ఆ సమయంలోనే ఎందరో ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్రలు, ఆయన తండ్రి జీవిత చరిత్ర, బెంజమిన్ ఫ్రాంక్లిన్ (రచయిత) జీవిత చరిత్ర, ఎడ్వర్ట్ గిబ్బన్ రాసిన రోమన్ సామ్రాజ్య తిరోగతి, పతనం, కాళిదాసు కవిత్వం మొదలైన రచనలను ఆకళింపు చేసుకున్నారు. తాను స్వయంగా రాయడం ప్రారంభించారు.

 న్యాయశాస్త్రం చదివించాలని!

       రవీంద్రుడిని బారిస్టర్‌ని చేయాలనేది తండ్రి దేవేంద్రనాథ్ కోరిక. 1878 సంవత్సరంలో రవీంద్రుణ్ని ఇంగ్లండుకి పంపించారు. ఇంగ్లండులో న్యాయ శాస్త్ర కళాశాలలో చేరినప్పటికీ ఆయన బారిష్టర్ కాలేదు. ఆ చదువు మధ్యలోనే మాని, షేక్‌స్పియర్ రచనలు ‘రెలిజియో మెడిసి’, ‘కొరియొలోనస్’, ‘ఆంటోనీ క్లియోపాత్రా’ మొదలైనవన్నీ ఆకళింపు చేసుకున్నారు. చక్కని ఆంగ్ల భాషలో మాట్లాడటం, రాయటం నేర్చుకున్నారు. ఐరిష్, స్కాటిష్ జానపద గేయాలను నేర్చుకుని, 1880లో స్వదేశం చేరుకున్నారు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను యూరప్ దేశాల సంస్కృతులతో మేళవించి, రెండింటిలోని మంచిని తాను నమ్మిన సిద్ధాంతాలకు అన్వయించాడు.

  వివాహం!

      రవీంద్రుని వివాహం 1883వ సంవత్సరంలో భవతారిణి శాఖకు చెందిన మృణాళినీదేవితో జరిగింది. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. 1890లో జమీ వ్యవహారాల బాధ్యత ఆయన మీద పడింది. ‘షి లై ద హా’ అనే అతిపెద్ద జమీందారీ ఎస్టేట్ (ఈ ప్రాంతం ప్రస్తుత బంగ్లాదేశ్‌లో ఉంది) నిర్వహణలోని లోపాలను సవరించారాయన. వ్యవసాయ భూములను రైతులకు స్వాధీనం చేసి, వారి నుంచి నామ మాత్రపు శిస్తులు వసూలు చేసేవారు. జమీందారీ వ్యవహారాలు చూసుకుంటూనే రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్‌కు మకాం మార్చుకున్నారు. శాంతినికేతన్‌లో ఉన్నప్పుడు రవీంద్రుని పిల్లలిద్దరు, ఆయన భార్య మృణాళిని మరణించారు. దానితో రవీంద్రుడు విరాగిగా మారిపోయారు. 1905వ సంవత్సరంలో రవీంద్రుని తండ్రి దేవేంద్రనాథ్ మరణించడంతో రవీంద్రునికి జమీందారీ జీవితంపై ఆసక్తి నశించింది. రచనావ్యాసంగంలో మునిగిపోయి, ఆందులోనే సాంత్వన పొందారు. రచనలపై నెలకు వచ్చే రెండు వేల రూపాయల రాయల్టీతో సామన్యమైన జీవితం గడపటం ప్రారంభించాడు.

       ఠాగూర్ తన రచనలలో చాలా వాటికి స్వయంగా ఆంగ్లానువాదాలు చేశారు. నోబెల్ బహుమతి అందుకున్న తర్వాత బ్రిటన్ మహారాణి ఠాగూర్‌కు ‘నైట్’ బిరుదు ప్రదానం చేశారు. అయితే రవీంద్రుని దేశభక్తి ఆ బిరుదుని త్యజించేలా చేసింది. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో బ్రిటిష్ సైన్యం భారతీయులను హతమార్చిన సంఘటన ఆయనను తీవ్రంగా కలచివేసింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.

  విశ్వకవి పై జాతిపిత ప్రభావం!

       మహాత్మాగాంధీతో పరిచయం ఏర్పడిన తర్వాత రవీంద్రుడు తనదైన శైలిలో స్వాతంత్య్ర పోరాటం ప్రారంభించారు.  కుల వివక్షను తొలగించటానికి బెంగాల్‌లో శ్రీకారం చుట్టి, దక్షిణాదిన గురువాయూరు దేవాలయంలో దళితులకు ప్రవేశం కల్పించి, అంటరానితనాన్ని నిర్మూలించటానికి ఎన్నో మార్గాలు సూచించారు. పల్లెల పునర్ నిర్మాణం కోసం వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త ఎల్మ్‌హర్‌స్ట్‌తో కలిసి బెంగాల్‌లో ‘శ్రీ నికేతన్ సంక్షేమ సంస్థ’ను స్థాపించి, పల్లె ప్రజలలో మనోవికాసం తేవటానికి కృషి చేశారు. 1930 దశాబ్దంలో కుల నిర్మూలన ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. దానికి సంబంధించిన ఎన్నో నవలలు, నాటకాలు రాశారు.

  భారతీయ ఔన్నత్యాన్ని చాటుతూ…

       రవీంద్రనాథ్ ఠాగూర్ అనేక దేశాలు సందర్శించి ‘విశ్వంలోని మానవులంతా ఒక్కటే’ అనే సందేశాన్ని అందించారు. తాను నమ్మిన బ్రహ్మ సమాజ సిద్ధాంతాల ద్వారా మతాలకు అతీతమైన పరబ్రహ్మమొక్కటే అందరికీ దైవం అని ప్రచారం చేసి ‘విశ్వకవి’, ‘గురుదేవ్’ బిరుదులను శాశ్వతం చేసుకున్నారు. ప్రపంచ పర్యటనలో 35కు పైగా దేశాలలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. విశ్వకవి రవీంద్రుడి జీవితం ఒక విజ్ఞాన సర్వస్వం. ఎవరు ఏ దృష్టితో శోధించినా దానికి సంబంధించిన విషయం, వివరణ లభించక మానదు.

  జనగణమన… అధినాయక..!

       గీతాంజలి,  గోరా, ఘరే బైరే మొదలైన రచనలన్నీ సహజత్వం ఉట్టిపడుతూ సామాన్యులకు అర్థమయ్యేటట్లు వాడుకభాషలో, సరళమైన శబ్దాలతో ఉంటాయి. దేశభక్తిని, విశ్వమానవ సౌభ్రాతృత్వం చాటేటట్లు రాసిన రెండు గీతాలను భారతదేశం (జనగణమన), బంగ్లాదేశ్ (అమార సోనార్ బంగ్ల) జాతీయగీతాలుగా ఎంపిక చేసుకున్నాయి. ఠాగూర్ గీత రచయిత మాత్రమే కాదు… నాటక రచయిత, నాటక కర్త, వక్త, వ్యాఖ్యాత కూడ.

  రవీంద్రుని రచనలు:

       గీతాలు: మానసి (1890); సోనార్ తరి (1890); గీతాంజలి (1910); గీతిమాల్య (1914); తోటమాలి (1913)  (వీటిని స్వయంగా ఆంగ్లంలోకి స్వేచ్ఛానువాదం చేశారు).

       నాటకాలు, కథలు: రాజా (1910); డాక్ ఘర్ (1912); అచలాయతన్ (1912) ; ముక్తధార (1922); రక్తక రవి (1926)

 ‘గోరా’(1910); ఘరే బైరే (1916); యోగా యోగాలు (1929) ; బికారిణి (1929) ,

 నృత్యరూపకాలు: పాత్రపుత్( 1936),  శేషసప్తక్ (1935), శ్యామ (1939), చండాలిక (1939)

        రవీంద్రుడు ఆరోగ్యం క్షీణించిన తర్వాత ‘చార్ అధ్యాయ్ (1934), విశ్వ పరిచయ్ (1937), తీన్‌సంగి, గల్పశిల్ప (1941)’ మొదలైన రచనలు చేశారు. 1941లో రవీంద్రుడు చనిపోయే ముందురోజు అప్పటి ఎలక్షన్ కమిషనర్ అయిన ఏకే సేన్ అనే మిత్రుణ్ని పిలిచి, తన తుది సందేశాన్ని చెప్పారు. ‘నా జన్మ మధ్యలోనే అంతరిస్తోంది. ఈ సమయంలో నా స్నేహితుల వెచ్చని స్పర్శ, ఈ పుడమితల్లి శాశ్వత ప్రేమ, మానవులందరి ఆశీస్సులను నాతో తీసుకుని వెళ్తున్నాను. నేను ఈ ప్రపంచానికి ఇవ్వవలసినదంతా ఇచ్చాను. ఈ రోజు నేను ఖాళీ సంచితో ఉన్నాను. మీరంతా కొంత ప్రేమ, క్షమాపణలు ఇస్తే ఈ ప్రపంచం లేని చోటకి శాశ్వతానందంతో వెళ్తాను’ అని రాయించారు ఠాగూర్. ప్రపంచ ప్రజలందరినీ ఉత్తేజపరిచే సందేశాన్నిచ్చిన విశ్వకవి 1941వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన శరీర త్యాగం చేశారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

మే డే ,May Day, International Labour day, ప్రపంచ కార్మికుల దినోత్సవం

       మే దినోత్సవం లేదా మే డే (May Day) ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. పబ్లిక్ శెలవుదినం. చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవం తో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గర్హిస్తాయి.

       కొన్ని పురాణగాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు అవుతాయి. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమaయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి (రెస్టు), ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్‌ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు. యాంత్రికయుగం రాకముందు మనిషి గంటలకొద్దీ పనిచేసేవాడు. అదొక బానిస బతుకు. మనిషి తన విజ్ఞాన పరిశోధనల మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏవిధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందువల్లనే పనిగంటల పోరాటం వచ్చింది. కానీ మనలాంటి దేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌లో 1862లో సమ్మెచేశారు. అప్పటివరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్‌ పత్రికల్లో పాలకవర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్‌ చేశారు. కాగా, అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు.

        1923లో మొదటిసారి మన దేశంలో ‘మే డే’ను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి ‘మే డే’ను పాటించడం జరుగుతుంది. కానీ అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్‌, లిబరలైజేషన్‌, గ్లోబలైజేషన్‌ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు.ముఖ్యంగా, ఐ.టి.రంగంలో ఎంతోమంది ఆడపిల్లలు, యువకులు పనిచేస్తున్నారు. ఈనాడు మార్కెట్‌ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం వుంటే అక్కడ కంపెనీలు పెడుతున్నారు. అమెరికాలో వున్న కంపెనీలు అక్కడ ప్రజాచైతన్యం ఉన్నది కాబట్టి కార్మిక చట్టాలు అమలుకానటువంటి ఇండియాలో కంపెనీలు పెడుతూ వాళ్ళచే 10,12 గంటలు పనిచేయిస్తున్నారు. మాదాపూర్‌లోని హైటెక్‌ సిటీలో విద్యావంతులైన యువత ఈనాడు శ్రమ దోపిడీకి బలవుతున్నది. రాత్రుళ్లు ఆడపిల్లలను భద్రతలేకుండా ఇళ్ళకు పంపించడం మూలంగా నేరాల సంఖ్య కూడా పెరుగుతున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ వున్నంతవరకు శ్రమదోపిడీ, ఎక్కువ పనిచేయించుకోవడం సర్వసాధారణం. కార్మిక చట్టాలను ఐ.టి. రంగంలో కూడా అమలుకై పోరాటం ఈనాడు అత్యంత అవసరం. కార్మిక చట్టాలు అమలు చేయబోమని పాలకవర్గాలు బహుళజాతి కంపెనీలకు హామీలిస్తూ దేశంలోకి స్వాగతిస్తున్నాయి. అసంఘటితరంగంలో అయితే సరేసరి. ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్టు, పార్ట్‌టైం ఉద్యోగుల పేరుతో ప్రవేశపెట్టిన ఔట్‌ – సోర్సింగ్‌లోను కార్మిక చట్టాల నియమాలు అమలులో లేవు.

       ఉదాహరణకు : ఇంటర్మీడియట్‌ వ్యవస్థలో రెగ్యులర్‌ ఉద్యోగుల కన్నా కాంట్రాక్టు ఉద్యోగులే అధికమైనారు. అంతేకాకుండా ప్రభుత్వరంగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయింది. అందుకు నిదర్శనమే పై ఉదాహరణ.నిరుద్యోగాన్ని, బలహీనతలను ఆసరా చేసుకొని వాళ్ళచే 10,12 గంటలు పనిచేయిస్తున్నారు. ఇది విద్యా, వైద్య రంగాల్లో ప్రయివేటీకరణ పెరిగిన కొద్దీ సర్వీసు భద్రత తక్కువవుతుంది కాబట్టి శ్రమదోపిడీ కూడా పెరుగుతుంది. వెనుకటికి స్కూళ్ళు 10 నుండి 14గంటల వరకు పనిచేసేవి. పిల్లవాణ్ణి ఆరు గంటల కంటే ఎక్కువ చదివించకూడదని విద్యావేత్తలు, పరిశోధకులు చెబుతున్నా, సెమీ రెసిడెన్షియల్‌, రెసిడెన్షియల్‌ పేర పాఠశాలలు సర్వసాధారణమైపోయాయి. ఆ టీచర్స్‌ నోరు మెదపకుండా 12 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచీకరణ వలన వంద సంవత్సరాల క్రితం సాధించిన కనీస డిమాండ్లు కూడా ఈనాడు అమలుకు నోచుకోవడంలేదు.1886లో ఆరంభమైన ఈ ఉద్యమం వందేళ్ళ పండగ జరుపుకుంది. ప్రపంచంలో ఎనిమిది గంటల పనికోసం చేసిన పోరాటం పెట్టుబడిదారీ వర్గం పతనానికి ఆరంభమవుతుందనుకున్నాం. కానీ మళ్ళీ మార్కెట్‌ శక్తులు పాత పరిస్థితులకు ప్రాణప్రతిష్ట చేస్తున్నాయి. ఆనాటి కార్మికవర్గ చైతన్యం మరోసారి వెల్లివిరుస్తుందని, ఈ మే డే నాడు కొత్త స్ఫూర్తిని రగిలిస్తుందని ఆశిద్దాం. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారులు, బహుళజాతి కంపెనీలు, మొదలైన పీడక వర్గాలు శ్రామిక దోపిడీకి, కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంఘటితమవుతున్న ఈ తరుణంలోనే ప్రపంచ కార్మికవర్గం ఆ శక్తులను ప్రతిఘటించేందుకు ద్విగుణీకృత ఉత్సాహంతో పోరాడాలి. ప్రపంచ శాంతిని అసలు ఈ భూగోళాన్నే కాపాడుకోవాల్సిన అవసరం కూడా వుంది. అందుకు కార్మిక శ్రేణులు ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం కూడా ఇదే. ఆ రకంగా ఈ మేడే మనకు కొత్త స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం!

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

అనంగ త్రయోదశి

       భారతీయ సంస్కృతీ సంప్రదాయాలెంతో విశిష్టమైనవి. ప్రపంచ దేశాలకే ఆదర్శమైనవి. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రముఖ స్థానం ఉంది. భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి హాయిగా జీవించేందుకు ఎన్నోవ్రతాలు, నోములు, పూజలున్నాయి. ఇవి అనాదిగా ఆచరింపబడుతూ దాంపత్య జీవనాన్ని పటిష్ఠంగానూ, సుఖ మయంగా గడపేందుకు ఎంతో దోహదపడుతున్నాయి.

        చైత్రమాసంలో వచ్చే అనంగత్రయోదశి రోజు శివుణ్ని పూజిస్తే సంవత్సరంలో ప్రతి రోజూ శివుడిని పూజించిన ఫలం లబిస్తుందని శాస్త్ర వచనం. అదేవిధంగా ఈ రోజు మన్మధుని పూజిస్తే భార్యభర్తల మధ్య అన్యోన్యత వృద్ధి చెందుతుంది.

        భార్యభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసి, దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతమే- ‘అనంగత్రయోదశీ వ్రతం’. ఈ వ్రతాన్ని చైత్రమాసంలో శుక్ల పక్ష త్రయోదశీ నాడు ఆచరించాలి.

        అనంగుడు అంటే ‘మన్మధుడు’ అని అర్థం. మన్మధుడు బ్రహ్మచేత, శివుని చేత అనంగు నిగా (అదృశ్యునిగా) చేయబడినట్లు పురాణ కథలు మనకు చెబుతున్నాయి.

       మన్మథుని వాహనం చిలుక. అరవిందాది పుష్పాలు అతని బాణాలు. అతడు ప్రేమాధి దేవత. మంచిరూపం కలవాడు.

        తారకాసురుడనే రాక్షసుడు వరగర్వంతో సకలలోకాల్ని కష్టాలపాలు చేయసాగాడు. దీనితో వాణ్నలా చంపాలని దేవతలంతా రకరకాల ఆలోచనలుచేసి, చివరకు బ్రహ్మదేవుడి సలహా తీసుకుంటారు.

       అందుకు శివుడి కుమారుడే తారకాసురుణ్ని అంతమొందిస్తాడని సమాధానమిస్తాడు బ్రహ్మ. అప్పటికి శివుడు తపస్సులో ఉండటంతో, శివుడు తపస్సు మాని పార్వతీ దేవిని వివాహం చేసుకునేలా బాధ్యతను ఇంద్రుడు మన్మధుడికి అప్పగించాడు.

      దీంతో మన్మథుడు తన బాణాన్ని శివుడిపై ప్రయోగించాడు. శివుడి మనస్సు చలించింది. తన మనస్సుకు చలింప చేసింది ఎవరు? అని శివుడు మూడవ కన్ను తెరవడంతో మన్మథుడు భస్మమై ‘అనంగుడయ్యాడు’. ఈ విషయం తెలిసి రతీదేవి విలపించి, శివుడిని ప్రార్థించింది. దీంతో శివుడు మన్మథుడిని బ్రతికించి కేవలం రతీదేవికి మాత్రమే కనిపించేటట్లు వరం ప్రసాదించాడు.

     ఆ విధంగా వరం ప్రసాదించిన దినమే ‘అనంగ’త్రయోదశి. గంగాసరయూ నదీ సంగమ ప్రాంతం ఒకప్పుడు అంగదేశంగా మన్మథుడి పేర ప్రసిద్ధిగాంచింది. ఈరోజూ పరమేశ్వరునితో పాటు రతీమన్మథులను పూజిస్తే అన్యోన్యమైన దాంపత్యసిద్ధి కలుగుతుందని ధర్మసింధు కూడా స్పష్టీకరిస్తోంది.

అనంగ గాయత్రి జపం:  కామదేవాయ విద్మహే| పుష్పబాణాయ ధీమహి| తన్నో అనంగ ప్రచోదయాత్‌||

అనే అనంగ గాయత్రీని స్మరించుకుంటూ రతీమన్మథులను పూజించాలి. భారతీయులు గృహస్థాశ్రమానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అది మిగతా బ్రహ్మచర్యాది ఆశ్రమాలకు ఆధారశిల. అందుకే దాంపత్య అన్యోన్యతను పెంచేందుకు అనంగవ్రతాది పూజలను ఏర్పరచారు. కామదేవుడన్నా, అనంగుడన్నా, పుష్పబాణుడన్నా ఇవన్నీ మన్మథునికి పేర్లే. అయితే, కామ మరింత ప్రకోపించకుండా కామారి అయిన మహాదేవుణ్ని కూడా పూజించాలి. సకల ఐశ్వర్య, ఆనంద ప్రధాన సర్వేశ్వరుడే కదా!

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

మహావీర్ జయంతి

       అహింసను ప్రభోధించిన జైన మత ప్రచారకుడు, వర్ధమాన మహావీరుడి జయంతి ని ప్రతిసంవత్సరము చైత్ర మాసంలో ఘనముగా జరుపుకుంటారు. బీహార్ లో వైశాలి కి సమీపములో కుండ గ్రామము లో క్రీ.పూ. 599 లో క్షత్రియ కుటుంబములో సిద్దార్ధ మహారాజుకు, రాణి త్రిష లకు జన్మించిన మహావీరుడికి తల్లి దండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు. అల్లారుముద్దుగా పెరిగిన మహావీరుడు తల్లి దండ్రులు 28 వ ఏట మరణించారు, యశోధరను వివాహమాడి, ఓ కుమార్తెకు జన్మనిచ్చిన తరువాత 36 వ ఏట సన్యాసాన్ని స్వీకరించిన వర్ధమానుడు. 12 ఏళ్ళ పాటు తపస్సు చేసి మహావీరుడు గా జైనమత ప్రచారకుడయ్యాడు. అప్పటి కే జైన మతానికి 23 మంది తీర్ధంకరులుగా ఉన్నప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ మతానికి సంబంధించిన వివరాలు వెలుగు చూశాయి. 32ఏళ్ళ పాటు అహింసా ధర్మము తో మాట ప్రచారం జరిపిన మహావీరుడు 72 వ ఏట మరణించారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

శ్రీ సత్య సాయిబాబా పుణ్యతిథి

జననం : నవంబరు 23, 1926          మరణం : ఏప్రిల్ 24, 2011

       అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో 1926 నవంబరు 23న సత్యనారాయణ రాజు (సత్యసాయిబాబా) జన్మించారు. తనకుతానే బాబా అని ప్రకటించుకుని ప్రపంచ ఆధ్యాత్మికవేత్తగా సత్యసాయిబాబా ఎదిగారు. ఈ క్రమంలో అనేక ఒడిదుడుకులు, విమర్శలను, ఆరోపణలను సైతం సత్యసాయిబాబా ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మికవేత్తగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు భక్తులున్నారు.

బాల్యం గడించింది ఇలా…

        అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఈశ్వరమ్మ, పెద్దవంకమరాజు రత్నం దంపతులకు 1926 నవంబరు 23న సత్యనారాయణరాజు జన్మించారు. చిన్నప్పటి నుంచి పెద్దసోదరుడు శేషమరాజు వద్దనే ఉంటూ వచ్చారు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో సత్యనారాయణరాజు విద్యాభ్యాసం కూడా ఒక్కొక్క చోటు జరుగుతూ వచ్చింది. పుట్టపర్తి సమీపంలో ఉన్న బుక్కపట్నంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అనంతరం ఉరవకొండలో ప్రాథమికోన్నత విద్య అభ్యసించారు. ఈ క్రమంలోనే 14 ఏళ్ల తరుణంలో ఒక రోజు సత్యనారాయణ రాజుకు తేలు కుట్టింది. అప్పటి నుంచి ఆయన మానసిక పరివర్తనలో మార్పు వచ్చింది. ఏదేదో మాట్లాడుతుండే వాడు. దీంతో ఆయన సోదరుడు శేషమరాజు ఆయన్ను తన స్వగ్రామమైన పుట్టపర్తికి పంపించారు. కొద్దిరోజులు తరువాత తాను దేవుడినని, తన పేరు ఇక నుంచి సత్యసాయిబాబా అని 1940లో ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి సత్యనారయణ రాజు కాస్త సత్యసాయిబాబాగా పిలువబడుతూ వచ్చారు. అనంతరం ఆయన దక్షిణ, ఉత్తర భారతదేశ ప్రాంతాల్లో యాత్రలు చేపట్టారు. తిరిగొచ్చాక కొన్ని మహిమలు చూపడంతో భక్తులు ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. ఆయన్ను చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు వచ్చేవారు. 1944లో ఆయనకు మొట్టమొదటిసారిగా పుట్టపర్తిలో మందిరాన్ని నిర్మించారు. దీన్ని ప్రస్తుతం మందిరంగా పిలుస్తున్నారు. 1948లో ప్రశాంతి నిలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి క్రమక్రమంగా బాబా గురించి దేశవ్యాప్తంగా తెలియడంతో భక్తులు వేల సంఖ్యలో వచ్చేవారు. 1968లో మొట్టమొదటిసారి విదేశీ పర్యటన చేపట్టారు. క్రమక్రమంగా అక్కడి నుంచి కూడా విదేశీ భక్తులు పుట్టపర్తికి రావడం పెరిగింది.

విమర్శలు, ఆరోపణలు…

        సత్యనారాయణ రాజు నుంచి సత్యసాయిబాబాగా ఎదిగే క్రమంలో ఆయనపై అనేక విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో సైతం అనేక వ్యతిరేక కథనాలు వచ్చాయి. అన్నింటికంటే ఎక్కువగా విమర్శలకు గురిచేసింది 1993 జూన్‌ 6న ఆశ్రమంలో జరిగిన ఆరు హత్యలు. బాబా నిద్రించే గదిలోనే ఇద్దరు యువకులు తుపాకీతో కాల్చి హత్య గురికావడం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను బయటపెట్టేందుకు ప్రయత్నించినందునే వారిని కాల్చి చంపారని అప్పట్లో విమర్శలు గుప్పుమన్నాయి. ఇకపోతే నోటిలో నుంచి శివలింగం తీయడం, గాలిలో విబూది తీయడం వంటివన్నీ మహిమలు కాదని, మ్యాజిక్‌ మాత్రమేనని ప్రముఖ హేతువాది ప్రేమానంద్‌ పేర్కొన్నారు. చంద్రుడు తన ప్రతిరూపం కనిపిస్తుందని అంతకు ముందు ఏడాది ప్రకటించి కనబడకపోవడం కూడా విమర్శలకు దారితీసింది. ఈ ఆరోపణలేవీ ఆయన్ను పెద్దగా అడ్డుకోలేకపోయాయి. 2004లో బిబిసి అంతర్జాతీయ మీడియా ఛానల్‌ ‘ది సీక్రెట్‌ స్వామి’ అనే పేరుతో ఒక కథనాన్ని వెలువరిచింది. వీటన్నింటినీ సత్యసాయిబాబా భక్తులు తిప్పికొట్టగలిగారు.

ప్రపంచ వ్యాప్తంగా సేవా సమితులు…

       సత్యసాయి సేవా సమితులు ప్రపంచ వ్యాప్తంగానున్నాయి. 126 దేశాల్లోని 1200 చోట్ల సత్యసాయి సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారానే సత్యసాయి బాబా ట్రస్టు కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలే కాకుండా పుట్టపర్తిలోని ట్రస్టు కార్యకలాపాలన్నీ సేవాసమితి ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. భద్రత మొదలుకుని అన్నీ కూడా సమితి సభ్యుల కనుసన్నల్లోనే నడుస్తాయి. ట్రస్టు లోపలి భాగంలో పోలీసులకు సైతం ప్రవేశం ఉండదు.

సేవా కార్యక్రమాలు…

       సత్యసాయి బాబా ఏర్పాటు చేసిన ‘సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు’ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్య, వైద్యం అందులో ప్రధానమైనవి. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని స్థాపించి పేదలకు ఉచితంగా వైద్యసేవలందిస్తున్నారు. వీటితోపాటు పలు జిల్లాలకు తాగునీటి వసతిని ఏర్పాటు చేశారు. అనంతపురం, మహబూబ్‌నగర్, మెదక్‌ జిల్లాల్లో తాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. చెన్నై నగరానికి తాగునీటి ప్రాజెక్టును చేపట్టారు. ఒరిస్సాలో 2008లో వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ చర్యలను చేపట్టారు.

సాయిబాబా బోధనలు క్రింది నాలుగు ముఖ్య విషయాల ద్వారా అవగతం చేసుకోవచ్చునని అంటారు:

  • ఒకటే కులం – మానవత
  • ఒకటే మతం – ప్రేమ
  • ఒకే భాష –హృదయం
  • ఒకే దేవుడు – అంతటా ఉన్నవాడు.

       హజరత్‌ మహమ్మద్‌ 1400 సంవత్సరాల కిందట భగవంతుని దివ్య వాణిని ‘ఖుర్‌ ఆన్‌’ రూపంలో పొందుపరిచాడు. ఇందులోని రెండు పదాలు సలాత్‌ , జకాత్‌ .అంటే ప్రార్థన , దానధర్మాలు .వీటిని ఆచరించే సమాజానికి ఇస్లాం అని పేరుపెట్టారు. ఇస్లాం అంటే శరణు , శాంతి అని అర్థం. ఎవరు భగవంతునికి శరణాగతులై నిరంతర శాంతితో జీవించడానికి పూనుకుంటారో ఆ సమాజమే ‘ఇస్లాం’. (ఈనాడు25.4.2011)

భారత దేశంలో వివిధ వార్తా పత్రికలు సాయిబాబా ఉపదేశాలను తరచు ప్రచురిస్తుంటాయి.

        బాబా 2011మార్ఛి 28న శ్వాసకోశ, మూత్రపిండాల మరియు ఛాతీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చబడ్డారు  దాదాపు నెల రోజులు అయినా ఆయన ఆరోగ్యం నిలకడగా లేదు, సత్యసాయి బాబా ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 7:40 కి తుది శ్వాస విడిఛారు. బాబా పార్థివ దేహానికి వేద మంత్రోచ్ఛరణల మధ్య ఏప్రిల్ 27 వ తేదీన బుధవారం ఉదయం మహా సమాధి జరిగింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాలు లోనే అన్ని కార్యక్రమాలూ శాస్త్రోక్తంగా జరిగాయి. గురుపౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని జులై 15 నుంచి సత్యసాయి బాబా మహాసమాధి దర్శనం ప్రారంభింఛారు.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

దమన-కామదా ఏకాదశి

       స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదలుగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరమే అయినా … దేవాలయమే అయినా వాళ్లు తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్ధిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్లు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు .. వ్రతాలు జరుపుతుంటారు. అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా ‘కామదా ఏకాదశి వ్రతం’ కనిపిస్తుంది.

       చైత్ర శుద్ధ ఏకాదశి రోజునే ‘కామదా ఏకాదశి’ అని … ‘దమన ఏకాదశి’ అని పిలుస్తుంటారు. ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి .. లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాసం … జాగరణ అనే నియమ నిబంధలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.

       కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతోంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. ఓ గంధర్వుడు శాపం కారణంగా తన భార్యకు దూరమై, రాక్షసుడి రూపంలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తన భర్తను ఆ స్థితి నుంచి బయటపడేయడం కోసం ఆ గంధర్వ స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది.

       వ్రత ఫలితం వలన ఆ గంధర్వుడుకి శాప విమోచనం కలిగి తన భార్యను చేరుకుంటాడు. భార్యా భర్తలు ఎలాంటి పరిస్థితుల్లోను విడిపోకుండా చూసే శక్తి ఈ వ్రతానికి ఉంది. అందుకే చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్త్రీలు పెద్ద సంఖ్యలో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణుల ఆశీస్సులను పొందుతూ ఉంటారు. ఈరోజునే శ్రీకృష్ణునిని ఆందోళికోత్సవము జరుపుతారు. ఉయ్యాలలోని కృష్ణుని దర్శించినంత మాత్రమున కలికాలపు దోషాలు పాతాయి. కృష్ణ ప్రతిమగల ఉయ్యాలను ఊచితే, వేయి అపరాధాలైనా క్షమింపబడతాయి, కోటి జన్మల పాపాలు తొలగడమే కాక అంతమునందు విష్ణు సాయుజ్యము లభించగలదు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)