Categories
Vipra Foundation

తాళ్ళపాక అన్నమాచార్య జయంతి

       తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 – ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.

       అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాధురంధరుడుగా ప్రసిద్ధికెక్కినవాడు. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. మధురంగా పాడుతుంది. ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాథ. కొండలయ్య తాను ధరించే “బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని” వారికందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య.

       లక్కమాంబ గర్భవతి అయింది. వైశాఖమాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నత దశలో వుండగా నారాయణసూరి, లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైనది, మగశిశువు ఉదయించాడు. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. నారాయణసూరి ఆ శిశువునకు ఆగమోక్తంగా జాతకర్మ చేశాడు.

       “అన్నం బ్రహ్మేతి వ్యజనాత్” అనే శ్రుతి ప్రకారం నారాయణసూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశాడు. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయగురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్ళపాక సాహిత్యంలోను, శాసనాల్లోను కనిపిస్తాయి.

అన్నమయ్య బాల్యం

“హరి నందకాంశజుం డగుట డెందమున

పరమ సుగ్యాన సంపద పొదలంగ………”

       అన్నమయ్య బొసి నవ్వులు వొలకబోస్తూ నలుగురినీ మురిపించేవాడు. మాటి మాటికి వెంకటప్పకు జోతలు పెట్టేవాడు. వెంకన్న పేరు చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు. వేంకటపతికి మొక్కుమని చెబితేనే మొక్కేవాడు. వేంకటపతిమీద జోలపాడనిదే నిద్రపోడు. లక్కమాంబ భక్తిగీతాలు పాడుతుంటే పరవశించి పోయేవాడు. నారాయణసూరి కావ్యాలలో అర్ధాలు వివరిస్తూవుంటే తానూ ఊ కొట్టేవాడు. ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వేంకటపతి మీది ధ్యానంతో ప్రొద్దులు గడిపేవాడు. అన్నమయ్యకు అయిదు సంవత్సరాలు వయస్సులో నారాయణసూరి ఆర్యుల సమ్మతి ప్రకారం ఉపనయనం చెయించాడు.

తిరుమల పయనం

       ఒకనాడు (8వ ఏట) ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుచుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయెను. అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది. అప్పుడు పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు.

తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు.

సంసారం, సంకీర్తనం

       అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు. ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు. అప్పటినుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు.

రాజాశ్రయం

       విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీకృష్ణదేవరాయలుకు తాత), టంగుటూరు కేంద్రంగా ఆ సీమ (“పొత్తపినాడు”) పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి “మూరురాయర గండ” అనే బిరుదుండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో హరిదాసకూటాలలో ప్రసిద్ధమయ్యింది.

అంత్య కాలం

       రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. “మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే” అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు “సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే” అన్నాడట.

95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.

ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. “పదకవితా పితామహుడు”, “సంకీరత్నాచార్యుడు”, “పంచమాగమ సార్వభౌముడు”, “ద్రవిడాగమ సార్వభౌముడు” – ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.

దొరికిన పెన్నిధి

1922లో, 14,000 అన్నమయ్య కీర్తనలు, ఇతర రచనలు లిఖించిన 2,500 రాగిరేకులు తిరుమల సంకీర్తనా భాండాగారం (తరువాత పెట్టిన పేరు)లో లభించాయి. ఇది తిరుమల హుండీకి ఎదురుగా ఉన్న ఒక రాతి ఫలకాల గది.

ప్రాజెక్టులు, సంస్మరణా కార్యక్రమాలు అన్నమయ్య యొక్క విస్తృత పద సంపదను ఉపయోగించుకొని ప్రజలలో వేంకటేశ్వరుని మధురభక్తిని మరియు శరణాగతిని ప్రోత్సహించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు స్థాపించబడింది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

బుద్ధ పూర్ణిమ

బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి

సంఘం శరణం గచ్చామి పున: పున: శరణం గచ్చామి

       వైశాఖమాస పూర్ణిమ బుద్ధ పూర్ణిమ. బౌద్ధ మతాన్ని నెలకొల్పిన బుద్ధ భగవానుడి పుట్టినరోజు. వైశాఖ పూర్ణిమ బౌద్ధులకు పెద్ద పండుగ. బౌద్ధమత సిద్ధాంతం ప్రకారం దేన్నీ ఇష్టంగా లేదా అయిష్టంగా తీసుకోకూడదు కనుక బౌద్ధులు ఈ బుద్ధ పూర్ణిమ సెలెబ్రేషన్స్ చాలా శాంతంగా వేడుక చేసుకుంటారు. ఈ రోజున బౌద్ధులు, వారి అనుచరులు సూర్యోదయానికి ముందే మందిరాల్లో సమావేశమౌతారు.

       గౌతముడు అనారోగ్యం, వృద్ధాప్యం, మృత్యువు లాంటి దుఃఖాలను చూసి చలించిపోయాడు. కష్టాలకు కారణం ఏమిటో అన్వేషిస్తూ కుటుంబాన్ని వదిలి వెళ్లాడు. దేశాటన చేస్తూ, ఎంతో శోధించిన మీదట, చివరికి గయలో, బోధివృక్షం కింద ”కోరికలే దుఃఖానికి మూల కారణం” అని బోధపడింది. తాను కనుగొన్న నగ్నసత్యాన్ని ప్రచారం చేశాడు బుద్ధుడు.

‘మనకు కష్టం కలుగుతోంది, దుఃఖిస్తున్నాము అంటే అందుకు ఏదో ఒక కోరికే కారణం. కనుక కోరికలను జయించమని ప్రబోధించాడు. లోకంలో ఏదీ శాస్వతం కాదు, ప్రతిదీ మార్పు చెందుతుంది, చివరికి నశించిపోతుంది. మార్పు సహజం కనుక దాన్ని ఆమోదించాలి. మంచి, చెడు దేనికీ ప్రతిస్పందించవద్దు ‘ – బుద్ధుని ఈ బోధనలు ఉన్నతమైనవి, ఉత్కృష్టమైనవి.

       బుద్ధ పూర్ణిమ సెలెబ్రేషన్స్ లో బుద్ధుని గౌరవార్థం బౌద్ధ పతాకాన్ని ఎగరేస్తారు. బౌద్ధస్తూపాన్ని ప్రార్థిస్తారు. బుద్ధుని బోధనలను స్మరించుకుంటారు. ”ధర్మో రక్షతి రక్షితః” అన్నారు కదా! ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనల్ని రక్షిస్తుంది. బౌద్ధం ఈ ధర్మసూత్రాన్ని నొక్కి వక్కాణిస్తుంది. సత్యం, ధర్మం గురించిన కధలు గుర్తుచేసుకుంటారు. బౌద్ధమతస్తులు పూవులు, దీపాలు, అగరొత్తులు గురువుగారికి సమర్పించుకుంటారు. అందమైన పూవులు కొంతసేపటికి వాడిపోతాయి. కాంతులొలికే దీపం, మధురమైన అగరొత్తులు కాసేపటికి ఆవిరైపోతాయి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని చెప్పడానికి ప్రతీకలుగా గురువుగారికి వీటిని ఇస్తారు.

       వైశాఖ పూర్ణిమనాడు మాంసాహారం బొత్తిగా తినరు. ఈరోజున ఏ జీవికీ హాని తలపెట్టరు. పశువులు, పక్షులు మొదలు పురుగులతో సహా దేన్నీ చంపరు. పైగా వాటికి స్వేచ్ఛ ప్రసాదిస్తారు. పంజరాల్లో ఉన్న వందలాది పక్షులను వదిలేస్తారు. శ్రీలంకలో బౌద్ధ పూర్ణిమ రోజున మద్యం ఎక్కడా విక్రయించరు. లిక్కర్ షాపులు పూర్తిగా మూసేస్తారు.

కొన్ని దేవాలయాల్లో బాల బుద్ధుని బొమ్మను ప్రదర్శిస్తారు. ఒక పాత్రలో నీళ్ళు పోసి, దాన్నిండా పూలు వేసి, వచ్చిన భక్తులను అందులో నీళ్ళు పోసేందుకు అనుమతిస్తారు. అలా నీరు పోయడంవల్ల చేసిన పాపాలు నశిస్తాయని, దేవుని కరుణాకటాక్షాలు లభిస్తాయని నమ్ముతారు.

       బుద్ధుని అనుచరులు మనదేశంలోనే కాదు, శ్రీలంక, బర్మా, థాయిలాండ్, టిబెట్, చైనా, కొరియా, వియత్నాం, మంగోలియా, భూటాన్, కాంబోడియా, నేపాల్, జపాన్ – ఇలా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నారు. బుద్ధ పూర్ణిమ రోజున రాగల్గినవారు బోధగయకు రాగా, తక్కినవారు ఉన్నచోటే ఉత్సవం చేసుకుంటారు. బోధగయలో జరిగే బుద్ధ పూర్ణిమ ఉత్సవాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో యాత్రికులు వస్తారు. బోధగయ తర్వాత, బౌద్ధమతానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సారనాథ్ లో బుద్ధ పూర్ణిమ సెలెబ్రేషన్స్ వైభవోపేతంగా జరుగుతాయి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

శ్రీ నృసింహ జయంతి

సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభీ కరుణానిధేమామ్|

ప్రహ్లాద భేద పరిహార పరవతార లక్ష్నీనృసింహ మమదేహి కరావలంబమ్||

సంసార కూప మతిఘోర మగాధమూలం సప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య|

దీనస్యదేవ కృపాయ శరణాగతస్య లక్షీనృసింహ మమదేహి కరావలంబమ్||

       అని తొలుత అలా! శ్రీ నృసింహస్వామివారిని ప్రార్థించి ఆ స్వామి వారి ఆవిర్భావమునకు గల కారణాలు ఏమిటో? ఒక్కసారి మననంచేసుకుందాం! ఈ భూమిపై ‘మానవుడు’ అవతరించిన నాటినుండి తనమనుగడకు ఆనందం కలిగించేవాటిని, తమకు మేలును చేకూర్చే ప్రకృతి సంపదకు “దేవతా స్వరూపాలు కల్పించి” వాటిని పూజిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాము. అలా మానవుడు ఈ సృష్టిలోని చరాచరములను అన్నింటిని పూజ్య భావముతో చూడటం ఒక విశేషం! అంతేకాదు మన భారతీయ సంస్కృతిలో చెట్టు, పుట్ట, రాయి, రప్ప, కొండ, కొన, నది, పర్వతాలు ఇలా ప్రకృతిలోని సంపదలన్నింటినీ పదిలపరుచుకునేందుకు తగు చర్యలు తీసుకుంటూ ఉండటం మరోవిశేషం. అందువల్లనే మన భారతదేశము కర్మభూమిగా పేరుగాంచినది. అట్టి భారతీయుల ప్రబలమైన విశ్వాసము నకు ప్రామాణికమైనది ఈ నృసింహ స్వామి ఆవిర్భావచరిత్ర.  

            పూర్వం వైకుంఠపురికి ద్వారపాలకులైన ‘జయ విజయు’లూ సంరక్షించుచూ ఉండు సమయాన  ఒక్కసారి సనక, సనందన, సనత్కుమార సనత్సజాతులైన బ్రహ్మమానసపుత్రులు వైకుంఠవాసుని దర్శనార్థమై వస్తారు. వారు వచ్చినది శ్రీమహావిష్ణువు ఏకాంత సమయం అగుటవల్ల, శ్రీహరి దర్శనానికి వారిని అనుమతించక అడ్డగిస్తారు. దానితో ఆగ్రహించిన ఆ తపోధనులు వారి ఇరువురును శ్రీ మహా విష్ణువునకు విరోధులై మూడు జన్మలపాటు రాక్షసులుగా జన్మించండి అని శపిస్తారు. అలా శాపగ్రస్తులైన వారు ఇరువురు మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యాకశిపులుగా రెండవ జన్మలో రావణ, కుంభకఋణులుగా మూదవ జన్మలో శిశుపాల, దంతవక్త్రులుగా జన్మిస్తారు. అలా మొదటి జన్మలో దితి, కశ్యపు దంపతులకు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మించి ఘోరమైన తపస్సులుచేసి, ఆ వరగర్వంతో లోకకంటకులైనారు. దానితో దుష్టశిక్షా, శిష్టరక్షణార్థం ఆ అసురుల వరాలకు అనుగుణమైన ఎన్నో అవతారాలు ఎత్తుతూ వాటిలో వరాహావతార రూపంలో హిరణ్యక్షుని ఆటలు కట్టించి హిరణ్యాక్షుని సంహరిస్తాడు శ్రీమహావిష్ణువు.

       తన సోదర సంహారముపై మిక్కిలి ఆగ్రహించిన ‘హిరణ్యకశిపుడు’ బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సుచేసి దానవ పరిజ్ఞానముతో వివిధ రీతుల మరణము లేకుండ వరాలుపొంది. తనకు ఇక ఏవిధముగాను మరణమే లేదు అను వరగర్వముతో ఎన్నో అకృత్యాలు చేస్తూ విర్రవీగిపోతూ ఉంటాడు. అట్టి దానవ శ్రేష్ఠునకు నలుగురి కుమారులలో పెద్దకుమారుడైన “ప్రహ్లాదుడు” విష్ణుభక్తుడై తండ్రి అగ్రహానికి గురైనా, హరి నామస్మరణ వీడదు. దానితో వానిని గురుకులాల్లో వేసి బుద్ధిని మార్చుటకు ప్రయత్నిస్తాడు. అక్కడ గురుకులాల్లో కూడా తోటి బాలురకు “హరినామ మాధుర్యాన్ని” పంచిపెడుతూ వారిచే కూడా హరికీర్తనలు పాడించేవాడు. చివరకు హరినామస్మరణ వీడమని సామ, దాన, భేద, దండోపాయాలతో ప్రయత్నిస్తారు. అందువల్ల కూడా ఏ ప్రయోజనము పొందలేకపోతాడు. చివరకు పుత్రవాత్సల్యమనేది లేకుండా “ప్రహ్లాదుని” సంహరించుటకు వివిధ మార్గాలు అవలంబిస్తాడు. ప్రహ్లాదునిపై  ఆగ్రహించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో నిన్ను అనుక్షణము కాపాడుచున్న ఆ శ్రీహరి ఏక్కడరా? ఈ స్తంభమునందు చూపగలవా? అని ప్రశ్నిస్తాడు. అందుకు ప్రహ్లాదుడు తండ్రీ! సర్వాంతర్యామి అయినా శ్రీహరి “ఇందుగలడందులేడను సందేహములేదు” ఎందెందు వెదకిన అందందే కలడు అని జవాబు ఇస్తాడు. అయితే ఈ స్తంభమునందు చూపగలవా? అని ఆగ్రహంతో తనచేతిలో ఉన్న గదతో ఒక్క ఉదుటన స్థంబాన్ని గట్టిగా కొడతాడు.

       అంత శ్రీహరి ‘హిరణ్యకసిపుడు’ తన దానవ పరిజ్ఞానుతో’ బ్రహ్మా వలన పొందిన వరాలు ఎమిటో? వాటిలోని లోపాలు క్షణకాలం అలోచించి, అంటే గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశమునందుగాని, దిక్కులలోగాని, రాత్రిగాని , పగలుగాని, చీకటిగాని, వెలుతురుగాని, నీటిజంతువులు, క్రూరమైన అడవిజంతువులవల్లగాని, సర్పాలవల్లగాని, దేవతలవల్లగాని, మనుషులవల్లగాని, అస్త్రశస్త్రాలవల్లగాని, ఇంటగాని, బయటగాని, చావులేకుండా పొందిన వరాలకు అనుగుణమైన రూపుదాల్చి హిరణ్యకశిపుడు మోడిన స్తంభమునుండి బయటకు వచ్చి సంహరిస్తాడు.

            తన అవతారాలలో ‘నాలుగవ అవతారం’ “శాశ్వత అవతారం” అంటే! నిర్యాణము పొందిన రాముడు, కృష్ణుడువంటి అవతారముల వలెకాకుండా! సద్యోజాతుడై అంటే అప్పటి కప్పుడు అవతరించినవాడు మిగిలిన అవతారములలోవలే తల్లి దండ్రులతో నిమిత్తములేకుండా! స్వచ్చందంగా ఆవిర్భవించిన అవతారమే ఈ “నృసింహ అవతారము” శాశ్వతమైనదిగా చెప్పబడినది. అలా ఈ శ్రీ నృసింహస్వామివారు వైశాఖ శుక్లపక్షములో పూర్ణిమకు ముందువచ్చే ‘చతుర్దశి నాడు ఆవిర్భవించారు. ఆపుణ్యదినమునే మనం శ్రీనృసింహ జయంతి గా జరుపుకుంటూ ఉంటాము. ఇది కృతయుగంలో వచ్చిన పరిశుద్ధావతారం.

వైశాఖ శుక్ల పక్షేతు చతుర్థశ్యాం సమాచరేత్ ,

మజ్జన్మ సంభవం వ్రతం పాపప్రణాశనం

       అని సాక్షాత్తు శ్రీహరి స్వయంగా ప్రహ్లాదునితో చెప్పినట్లు నృసింహపురాణం లో చెప్పబడినది. ఆవిధంగా ప్రహ్లాదుని విశ్వాసమైన (సర్వాంతర్యామి) అనిపలుకులకు ప్రామాణికంగా హిరణ్యకశివుడు మోదిన స్తంభము ఫెళఫెళమని విరగిపడుచుండగా భూనభోంతరాలన్ని దద్దరిల్లేలా సింహగర్జనతో ప్రళగర్జన చేస్తూ! ఉగ్రనరసింహ రూపంతో ఆవిర్భవిస్తాడు. అట్టి స్వామి ఆకారంచూస్తే సింహంతల, మానవశరీరం. సగం మృగత్వం, సగం నరత్వం. ఇంకా ఆమూర్తిలో క్రౌర్యం, కరుణ, ఉగ్రత్వం, ప్రసన్నత ఆవిధంగా పరస్పర విరుద్ధమైన గుణాలతో కూడియున్న అవతారమూర్తిలా ఉన్నారు ఆ నృసింహస్వామి. అలా ఆవిర్భవించిన ఆ స్వామి “హిరణ్యకశివుదు” పొందిన వరాలను చేదించకలిగే రూపాన్ని మరియు అట్టి వాతావరణాన్ని అంటే అటురాత్రి ఇటుపగలు కాని సంధ్యా సమయాల్లో, ఇటు భూమి అటు ఆకాశముకాని ప్రదేశము “గడపపైన” మృగ నరలక్షణాలతో గూడి, ఒక్క ఉదుటన హిరణ్యకశివుని మెడపట్టి తన తొడలపై పరుండబెట్టి జీవము నిర్జీవముకాని గోళ్ళతో హిరణ్యకశిపుని ఉదరమును చీల్చిచండాడి సంహరించినాడు.

       అనంతరము ఆ ఉగ్రనరసింహమూర్తిని దేవతలు ఎవ్వరు శాంతింప చేయలేక, దేవతలందరు ప్రహ్లాదుని ఆ స్వామిని శాంతింప చేయమని కోరతారు. అలా ప్రహ్లాదుని ప్రార్థనతో శాంతించిన ఆ స్వామి శ్రీ మహాలక్ష్మీ సమేతుడై భక్తులకు ప్రత్యక్షమౌతాడు. అట్టి స్వామి నిర్యాణములేని అవతారమూర్తిగా, పిలిస్తే పలికేదైవంలా భక్తుల పాలిట కల్పతరువుగా కొనియాబడచూ పూజించబడుచున్నారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన

       మానవుడు మహోన్నతుడు కాకపోయినా ఫరావాలేదు. నీచ సంస్కృతికి వారసుడు కారాదు. సమాజం చల్లగా సాగిపోవడాని ఇక సామాన్యుడు ఎప్పుడూ అవాంతరం కాదు. అవాంతరమల్లా నీచులవలన ఆపాదిస్తుంది. కావాలని అటు రాజకీయుల నుండి ఇటు సామాన్యుల వరకు అంటూనే వుంటారు. కాని ఆ మార్గాన్ని అవలంబించేదెందరు? అందుకు బాటలు వేసేదెవరు? ఆ వేసిన బాటలు బీటలు కారకుండా కాపాడెదెవరు? ఇవే ఆనాడూ, ఈనాడూ, ఆనాడైనా మనముండు ఉండే ప్రశ్నలు. వీటికి సరైన జవాబు, పరిస్కారం లభించిన నాడు అది నిజంగా పర్వదినమే.

       సమాజం సుఖశాంతులతో వర్ధిల్లుతుందంటే సామాన్యునికి ఎలాంటి కష్టనష్టాలు వాటిల్లుటలేదని, వారిని ప్రగతి పధంలో నడిపించే కర్తలెవరో ఉన్నారని తెలుసుకోవచ్చును. అలాగే సామాన్యుని జీవితం దుర్భరమవుతుందంటే, దుష్టబుద్దులు పెచ్చరిల్లారని, వారిదే పైచేయ్యిగా ఉన్నదని చెప్పకనే అర్థమయ్యే విషయం. ఓ విపత్కర పరిస్థితి ఏర్పడితే దానిని సరిచేసి సమతుల్యంగా నడిపించే వారు కావాలా! రావాలి! అలా అలనాడు శ్రీరామచంద్రుడు,ఆ తర్వాత కృష్ణపరమాత్మ మొదలుగా గలవారు వచ్చారు. సరిచేశారు కోంతకాలం గడిచింది. మళ్లీ పూర్వపు అరాచకం (పద్ధతిలో మార్పే తప్ప) ప్రబలింది. మరో అవతారం రావలసి వచ్చింది. రానే వచ్చారు. శ్రీ వీరబ్రహ్మేంద్రులు. వారి చరిత్ర అందరికీ తెలిసిందే. వారు ఈ సమాజం ఎలా ఉండాలని బోధించారు! ఈ విషయాన్నే సమీక్సించుకుందాం.

       ప్రతివారూ తనకు హితులు కావాలని కోరుకుంటారు. హితులంటే తనకు మేలు చేసేవారని. అలాగే తాను మరొకరికి హితుడు కావాలి! అంటే ఇతరులకు ఉపకారం చేయగలగాలి. అలాంటి భావాలు సన్నగిల్లినపుడే అసలు సమస్య ఉత్పన్నమవుతుంది.ఏ తత్ పరిష్కారానికై మరొకరు రావలసి వస్తున్నది. జనుడు కోరలున్న సర్పమ్ము కారాదు – తోడేలవుట మంచి త్రోవ కాదు” (42) అన్నారు స్వామి. అనడమే కాదు హెచ్చరించారు కూడాను. అలా ఆనాటి పాలకులు మత మౌఢ్యంతో వ్యవహరిస్తుంటే వారి వద్దకు వెళ్ళి సంస్కరించారు. ‘మతము మత్తుగూర్చు మార్గమ్ముకారాదు. హితముగూర్పవలము వెల్లరకునూ” (964) అని చెబుతూ పాలకులు ప్రజలను కన్నబిడ్డాల్లాగా పాలించాలే కాని పిడించరాదన్నారు. మేము పండితులమని వీగుతూ కులాలపేరుతో సమాజాలను చీల్చేవారినీ విడిచిపెట్టలేదు. ‘పసిడి పలుకులెల్ల పాండిత్యము వచ్చు – కాని మానవుండు కడతేరడద్దాన” (18) అని వెలుగెత్తిచాటాడు. అందుకు ప్రతీకగా హరిజన్మ కక్కయ్యకు బ్రహ్మోపదేశం చేశాడు. “కులమనేటి తెగులు కొంపలు గూల్చును” (76) అని కుటిలత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించడన్నారు. స్వామి అన్ని కులాల వారికి బ్రహ్మ విద్యను మహమ్మదీయుడైన సిద్ధునికి బ్రహ్మత్వాన్ని ప్రసాదించి మతసామరస్వానికి బాటలు వేశాడు. “గురువులు శిష్యులెల్ల పరిపాలనాపరుల్” (695) అంటూపాలకులు పాలితులు ఆధ్యాత్మిక సమాజం దివ్యంగా భవ్యంగా సాగుతుందని బోదించారు స్వామి. “ప్రేమలేని చదువు ప్రతే భూషణమాయే” (149) అంటూ నేటి విద్యా వ్యాపార విధానాలును ఎండగట్టాడు స్వామి. కష్టజీవులపైన కరుణ చూపలేనివాడు బ్రహ్మాన్నెరుగలేడని చేప్పాడు.

       అంటే నేను వేదాంతిని. జ్ఞానిని అని తనను తాను తాను అధికంగా ఊహించుకుంటూ కష్టజీవులను ఆదుకోలేనివారు పొందు పరమార్థం పొందలేరని, పరహితం కోరడంలోనే అసలైన పరమార్ధం ఉన్నదని వివరించారు. కార్యక్రమములను మెండుగా చేయమని స్వామి హితవు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అందరూ కలిసి మెలిసి జీవించే సమాజం కావాలని చెప్పారు. అనగా వాటికి సమాజంలో అలజడి, అకృత్యాలు పెచ్చుపెరగరాదని, నిగ్రహంతో సమన్వయ బుద్ధితో వ్యవహిరించాలని స్వామి హితవు చెప్పాడు. కులమైనా మతమైనా రాజకీయమైనా మరే ఇతర కారనమైనా మానవాళి జీవనవిధానంలోనికి నింపరాదు. వాటి పాటికి అవిసాగిపోవాలేకాని వికృత రూపం దాల్చరాదు. అలా దాల్చటం జరిగితే ఏ కొందరో స్వార్థ, సంకుచిత స్వభావుల పనే తప్ప వేరొకటి కాదని అలాంటి వ్యక్తిత్వాన్ని వదులుకోలేరు. భావికాలంలో అత్యధికదుష్పలితాలను అందుకోవలసినవస్తుందని చెప్పారు.

       అందరూ కలిసిమెలిసి జీవించండి. ఆనందంగా ముందుకుసాగండి అన్నారు స్వామి. ఆయన ఆధాత్మిక జీవనవిధానం చక్కగా దోహదం చేస్తుంది. అది వ్యక్తిస్వర్ధాన్ని పక్కకుపెట్టి త్యాగాన్ని వృద్దిచేస్తుంది. తద్వారా పరహితం కోరగలరు. స్వహితం కొంత పక్కన పెట్టగలరు. సాధనతో ముందుకుసాగితే ఇంకా వివేకవంతులై నవ్య సమాజానికి బాటలు వేయగలరని ఉద్బోధించారు స్వామి. కనుక స్వామిచెప్పిన మార్గాన్ని అవలంబించి సమాజహితులమై శ్రేయో మార్గాన్ని అవలంబిస్తు; కావున అందరూ వైశాఖశుద్ధ దశమి బ్రహ్మంగారి ఆరాధన జరుపుకొనవలెను. వీలయినవారు బ్రహ్మంగారి మఠం (కందిమల్లయ్యపల్లి) దర్శించగలరు. అంతేగాక ఆర్థిక స్తోమత లేనివారు తమ తమ గృహములలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అష్టోత్తరపూజ చేసి నివేదన జేయగలరు. బ్రహ్మంగారి కళ్యాణము (కందిమల్లయ్యపల్లి) బ్రహ్మంగారి మఠము నండు మహాశివరాత్రిపర్వదినమున అత్యంత వైభవోపేతంగా జరుగును. కావున తప్పక దర్శించగలరు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

మోహినీ ఏకాదశి

       సమస్త లోకాలలోని సాధు జనులకు ఎవరి వలన ఎలాంటి ఇబ్బంది కలగకుండా శ్రీమహావిష్ణువు చూస్తుంటాడు. బలహీనులపై బలవంతుల దాడి జరగకుండా, మంచివారిపై దుర్మార్గులు విరుచుకుపడకుండా ఆయన జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాడు. ధర్మాన్ని అతిక్రమించడానికి … సాధుజనులను హింసించడానికి ఎవరు ప్రయత్నించినా సాక్షాత్తు ఆయనే రంగంలోకి దిగుతుంటాడు.

       అసురలను అంతం చేయడానికి నరసింహ స్వామిగా … శ్రీ రాముడిగా … శ్రీకృష్ణుడిగా అవతరించిన శ్రీమహావిష్ణువు, ఆ అసురుల దృష్టి మరల్చడానికి మోహినీ అనే సుందరాంగిగా అవతారాన్ని ధరించాడు. ఈ నేపథ్యంలోనే ‘మోహినీ ఏకాదశి’ విశిష్టతను సంతరించుకుంది. వైశాఖ శుద్ధ ఏకాదశిని ‘మోహినీ ఏకాదశి’ అని అంటారు.

        దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం పుట్టింది. అమృతాన్ని చేజిక్కించుకోవడానికి దేవతలతో దానవులు పోటీపడ్డారు. దానవులకు అమృతం దక్కితే సమస్త లోకాలు ప్రమాదంలో పడతాయని గ్రహించిన విష్ణుమూర్తి, మోహినీ రూపాన్ని ధరించాడు. తన సౌందర్యంతో దానవుల మతులు పోగొట్టి, అమృతం దేవతలకి మాత్రమే దక్కేలా చేశాడు.

       ధర్మబద్ధంగా నడచుకునే దేవతలకు అండగా నిలవడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు వైశాఖ శుద్ధ ఏకాదశిన మోహినీ అవతారాన్ని ధరించాడు. ఈ సందర్భంగానే ఈ ఏకాదశికి ‘మోహినీ ఏకాదశి’ అనే పేరు వచ్చింది. ఈ రోజున మోహినీ అవతారంలో వున్న విష్ణు మూర్తిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

       సుఖ సంతోషాలతో సాగిపోతున్న జీవితంలో ఒక్కసారిగా ఒడిదుడుకులు ఎదురైనప్పుడు, సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు ‘మోహినీ ఏకాదశి’ రోజున విష్ణుమూర్తిని పూజించాలని చెబుతుంటారు. ఈ విధంగా చేయడం వలన కష్టాలు మబ్బు తెప్పల్లా ఎలా తెలిపోతాయనేది ఈ వ్రత సంబంధమైన కథల్లో కనిపిస్తుంది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

సీతా జయంతి

       సీతాదేవి పూర్వ జన్మలో వేదవతి. ఈమె తండ్రి ‘కుశధ్వజుడు, తల్లి మాలావతి’. సీత జన్మించినప్పుడు వేద ఘోష విన్పించడం వల్ల “వేదవతి” అని పేరు పెట్టేరు. తండ్రి వేదవతిని విష్ణుమూర్తికి ఇచ్చి వవాహం చేయాలని భావిస్తాడు. వేదవతి కుడా నిరంతరం విష్ణు మూర్తిని ధ్యానిస్తూ ఉండేది. అయితే ఒక రాక్షసుడు ఈమెను కోహిస్తాడు. వేదవతి ని ఇవ్వడానికి కుశధ్వజుడు అంగీకరించడు. అప్పుడా రాక్షసుడు కుశాధ్వజుదుని చంపేస్తాడు. మాలావతి కుడా దుక్కం తో మరణిస్తుంది. తల్లి దండ్రులను పోగొట్టికున్న వేదవతి అడవికే వెళ్లి విశ్నుముర్తికోసం కటోర తపస్సు ప్రారంభిస్తుంది. లంకాధీశుడైన రావణుడు అడవిలో ఉన్న వేదవతిని చూసి మోహించి పెళ్ళాడమని కోరుతాడు. వేదవతి … తానూ విష్ణుమూర్తిని తప్ప ఎవరినీ వివాహము చేసుకోనని చెప్తుంది. అయినా కామముతో రావణాసురుడు వేదవతి పై చేయివేస్తాడు. పరపురుషుడు తాకినా దేహం తో జీవించడం ఇష్టంలేని వేదవతి యోగాగ్ని ని సృష్టించుకొని అందులో దగ్దమైపోతుంది. రావణుని వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. కొంతకాలానికి లంకా నగరం లో ఒక కమలం లో ఈమె జన్మిస్తుంది. ముందుగా రావణుడే చూస్తాడు… ఈమె జన్మ అతనికి అరిస్టమని జ్యోతిష్కులు చెప్పగా రావణుడు ఆ పాపను ఒక బంగారుపెట్టేలో పెట్టి సముద్రం లో విడిచిపెడతాడు. ఆపెట్టే కొంతకాలానికి మిధిలా నగర ప్రాంతానికి చేరుకొని అక్కడ భూమిలో నాగాతిచాలులో జనకమహరాజుకు దొరుకుతుంది.

జననం : మిధిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము చేయుచూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో లభించినందున ఆమెకు సీత అని నామకరణము చేసి జనకమహారాజు, ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకొన్నారు. కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు. గర్భమున జన్మించలేదు గనుక అయోనిజ అని అంటారు.

ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉన్న జనక్ పూర్ అప్పటి మిధిలా నగరమని చెబుతారు.

పరిణయం : రామ లక్ష్మణులు విశ్వామిత్రుని యాగ రక్షణా కార్యాన్ని జయప్రదంగా ముగించారు. తన శిష్యులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు మిధిలా నగరం వచ్చాడు. అప్పుడు జనకుడు యజ్ఞం చేస్తున్నాడు. అతిధులను ఆహ్వానించి జనకుడు వారికోరికపై తనవద్దనున్న శివధనుస్సును వారికి చూపాడు. వేరెవ్వరూ ఎక్కుపెట్టలేకపోయిన ఆ ధనుస్సును శ్రీరాముడు అవలీలగా ఎక్కుపెట్టి, విరిచేశాడు.

       తన కుమార్తె ‘వీర్యశుల్క’ అని ప్రకటించిన జనకుని కోరిక నెరవేరింది. సీతారాముల వివాహం నిశ్చయమైనది. వారితోబాటే లక్ష్మణునకు ఊర్మిళతోను, భరతునకు మాండవితోను, శత్రుఘ్నునకు శృతకీర్తితోను వివాహం నిశ్చయమైనది. జనకుడు సర్వాభరణ భూషితురాలైన సీతను తీసుకొని వచ్చి “కౌసల్యానంద వర్ధనా! రామా! ఇదిగో నా కూతురు సీత. ఈమె నీకు సహధర్మచారిణి. ఈమెనంగీకరించి పాణి గ్రహణం చెయ్యి. పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడూ నీడలాగ అనుసరిస్తుంది” అని చెప్పాడు. సీతారాముల, వారి సహజన్ముల కళ్యాణం వైభవంగా, లోక కళ్యాణంగా జరిగింది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ జయంతి

ఓం కుసుమ పుత్రీచ విద్మహే  కన్యకుమారి ధీమహి తన్నో వాసవీ ప్రచోదయాత్‌

ఉపోద్ఘాతం- చరిత్ర

       స్త్రీలోని ఆత్మీయతకు, అనురాగానికి, సౌమ్యానికి, త్యాగగుణానికి, పవిత్రతకు నిలువెత్తు నిదర్శనం ‘వాసవీ కన్యకా పరమేశ్వరి’. సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృత గ్రంధ ఆధారంగా వాసవి కన్యకాంబ శ్రీపాద శ్రీ వల్లభుల సహోదరి. 10వ, 11వ శతాబ్ధానికి చెందిన కుసుమశ్రేష్ఠి-కుసుమాంబ (కౌసుంబి) దంపతుల గారాల బిడ్డ, పుణ్యాల పంట వాసవాంబ. కుసుమ శ్రేష్ఠి వేంగి దేశంలోని ‘వసాల్‌’ ప్రాంతాన్ని పాలించేవాడు. కుసుమ శ్రేష్ఠిని ఆ రోజులలో అంతా పెద్ద శ్రేష్ఠి (ఈ శ్రేష్ఠి పదం కాల క్రమేణా శెట్టి గా రూపాంతరం చెందింది) అని పిలిచే వారు. ప్రజలంతా ఎంతగానో గౌరవించేవారు. ‘వసాల్‌’ దేశంలో పుట్టింది కనుక ఆమె ‘వాసవి’ అయింది. కన్యారాశిలో పుట్టింది కనుక ‘కన్యక’  అయింది. వాసవి అమ్మను పూజించే వారిని శ్రేష్ఠులు అంటారు. ఈ పదమే వ్యవహారంలో శెట్టి అయింది. ఈ శ్రేష్ఠులు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉండి గోవును పూజించేవారు. గోదావరిని స్థానికులు గోమతి అని పిలుస్తారు అదేవిధంగా గోమాతను కుడా ‘గోమతి అని స్థానికంగా వ్యవహరిస్తారు’. ఈ పేరే ‘గోమ్టి’ గా మారింది. గోవును పూజించే గోమతి తీర వాసులు కనుక వీరిని ‘గోమట్లు’ అని పిలిచేవారు. ఈ పేరే వ్యవహారంలో ‘కోమట్లు’ గా మారింది.

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి చరితామృతం

       శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి గోమతీ లేదా ఆర్యవైశ్య కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జననం నకు ముందు గోమాతను పూజించుట వల్ల వీరికి గోమతి అను పేరు వచ్చింది. శ్రీ పాద శ్రీ వల్లభుడు గో ప్రియుడు. బహుశా ఈ కారణం వల్లే ఆర్యవైశ్య కులస్తులంటే వారికి అబిమానం మెండు. అయితే మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన వైస్రాయి 1921 మరియు 1931 మధ్య కాలంలో ఒక కమీషన్ వేసారు. దాని ప్రకారం ప్రతి కులానికి తమ పేర్లలో కోరిన మార్పులు రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది. దానిని అనుసరించి అందరూ గోమతీ కులస్తులు గల వైశ్య అసోసియేషన్ (1905 లో స్థాపించబడినది) వారు తమ పేరును ‘గోమతీ’ నుండి “ఆర్యవైశ్య” గా మార్చుకున్నారు.

ఆర్య అంటే గొప్ప వంశస్థుడు, గౌరవింపతగినవాడు అని అర్ధం. క్రీ.శ. 10, 11వ శతాబ్ధాల తరువాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్యుల కులదేవత గా ఏర్పడ్డారు.

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జననం

        వేంగి దేశాన్ని ఏలే కుసుమశ్రేష్టి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు (విమలాదిత్య మహారాజు) అనే చక్రవర్తి ఆధీనంలో ఉండేది. క్రీ.శ. 10, 11వ శతాబ్ధాలలో కుసుమశ్రేష్టి సుమారు 18 పరగణాలను జ్యేష్టశైలం/బృహత్శిలానగరం (పెనుగొండ) ను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు. కుసుమశ్రేష్టి, ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. నగరేశ్వరస్వామి (శివుడు) ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహం అయిన చాల సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు. రాజ్యానికి వారసులు లేరని వారు చింతిచేవారు. ఎన్ని ప్రార్ధనలు చేసినా, నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అపుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా, వారికి దశరధుడు చేసిన పుత్ర కామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు. అంతట ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి, దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. భక్తి,శ్రధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం.

       వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి, శుక్రవారం ఉత్తర నక్షత్రం, కన్య రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ ఇచ్చింది. వారిలో ఒకరు ఆడ పిల్ల, మరొకరు మగ పిల్లవాడు. అబ్బాయికి విరుపాక్షుడు అని అమ్మాయికి వాసవాంబిక అని నామకరణం చేసారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజుకు కావల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళలలోను ఆరితేరి, సంగీతం మరియు తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది.

భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాదు. గుర్రపు స్వారి, విలువిద్య, కత్తిసాము మొదలైన యుద్ధవిద్యలను నేర్చుకున్నాడు. వాసవి అన్నికళలను,తర్క శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయి గా పేరు తెచ్చుకుంది.

సహోదర వివాహక్షణాలు…

       విరూపాక్షుడు యుక్త వయసుకి రాగానే ఆలేరుకి చెందిన అరిధిశ్రేష్టి కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు. వివాహానికి విచ్చేసిన అతిధులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు. అంతలో విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొండకి విచ్చేయగా కుశుమశ్రేష్టి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదిక పై సన్మానాన్ని జరిపాడు. అదే రోజు ఆదిపరాశక్తి పూజకు మంగళ వాద్యాలతో వెళ్లుచున్న వాసవిని విష్ణువర్ధనుడు చూసి మోహించి వివాహమాడదలచాడు. కుసుమశ్రేష్ఠికి వర్తమానం పంపాడు. అప్పుడు కుసుమశ్రేష్ఠి వాసవి దివ్య బాలికయని కావున వివాహం సమ్మతం కాదని తెలుపగా ఒక నెల రోజుల వ్యవది నిచ్చి వివాహానికి సమ్మతించనిచో సైన్యంతో యుద్ధం చేసి వాసవిని తీసుకొని పోతానన్నాడు. విష్ణువర్ధుని కోరిక కుశమశ్రేష్టికి శరాఘాతం అయింది. ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు, అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురి కంటే చాల పెద్దవాడు, వారి కులాలలో అంతరం ఉంది. విష్ణువర్ధనుడు క్షత్రియుడు. ఇవి తల్చుకుని ఆయన చాల ఒత్తిడికి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోను, స్నేహితులతోను చర్చించగా, అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు. వాసవి తను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది.

అనంతర పరిణామాలు…

       కుశుమశ్రేష్టి ఈ విషయాన్ని విష్ణువర్ధునుడికి వర్తమానాన్ని పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన విష్ణువర్ధనుడు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవి ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ, దాన, భేద, దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కుశుమశ్రేష్టి భాస్కరాచుర్యుల సమక్షంలో 18 నగరాలకి చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచాయి. 102 గోత్రాలకు చెందిన ముఖ్యులు పిరికివారు ప్రతి రోజు మరణిస్తారు, పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది, కాబట్టి పోరాటమే సరైనది అని అభిప్రాయ పడగా, మిగిలిన 612 గోత్రాల వారు మాత్రం విష్ణువర్ధునుడితో పెళ్ళి చేస్తేనే అందరికి మంచిది అని అభిప్రాయ పడ్డారు.

       భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ మాటలు కుశుమశ్రేష్టికి మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పని చేసాయి. తన పక్షంలో కేవలం కొంత మంది మాత్రమే ఉన్నప్పటికి, తన కూతురిని విష్ణువర్ధునుడికి ఇచ్చి ఎట్టి పరిస్థితులలోను పెళ్ళి చేయరాదని నిశ్చయానికి వచ్చాడు. ఈ సంఘటనతో వైశ్యుల మధ్య ఐకమత్యం దెబ్బతింది. విష్ణువర్ధనుడు దెబ్బతిన్న పాములా పగపట్టి, తన శత్రువులను తుదముట్టించడానికి, తన సమస్త సేనలను కూడదీసుకుని సంసిద్ధం అయ్యాడు. ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండలో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వైశ్యులు కుశుమశ్రేష్టికి అండగా నిలిచారు. నాటి సమావేశం లో మొదటిసారిగా వాసవాంబిక తన ప్రతిస్పందనను సభాపూర్వకంగా తెలియజేసెను.

వాసవి దేవి ప్రతిస్పందన

       వాసవి సభలోకి ప్రవేశించి, అందరిని ఉద్దేశించి ఈ విధంగా అంది- ”నేను వివా హానికి నిరాకరించినట్లయితే విష్ణువర్ధనుడు సైన్యంతో వచ్చి యుద్ధం చేస్తాడు . యుద్ధం వల్ల ఎంతోమంది సైన్యం నశిస్తారు. అపార జననష్టం, ధననష్టం జరుగుతుంది. ఎంతోమంది పునిస్త్రిలు వైధవ్యంతో బాధ పడతారు. తన వల్ల ఇంత రక్తపాతం జరుగకూడదు.ఒక అమ్మాయి కోసం మనం అంతా రక్తం ఎందుకు చిందించాలి? మన స్వార్ధం కోసం సైనికుల జీవితాలని ఎందుకు అర్పించాలి? యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం. దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం. అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం . దృడ సంకల్పం, పట్టుదల ఉన్న వారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరు”. వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించడి నడవడానికి నిర్ణయించుకున్నారు.

అమర దీపం అసాధారణ త్యాగం… ఆత్మార్పణ

       వాసవి సూచనలను అనుసరించి, ఒకానొక మాఘ శుద్ధ పాడ్యమి రోజు గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజబటులు 103 అగ్ని గుండాలను ఏర్పాటు చేసారు. నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది. అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్పూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేసారు. వారు వాసవీ కన్యకాంబని దేవుని అంశగా అనుమానించి, తమకి నిజ రూపాన్ని చూపమని కోరారు. దానికి ఆమె ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతరాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిల్పేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధునుడిని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్య లోకాలని చేరుకుంటాను అని చెప్పింది. కుశుమశ్రేష్టి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరిని కూడా ఆత్మ బలి దానానికి పురి కొల్పాను అని అంది. ఆమె అక్కడ చేరిన వారందరికీ దేశభక్తి, నిజాయితి, సమాజ సేవ, సహనం మొదలగు వాటి గురించి వివరించింది. ఆమె నోటి నుండి పై పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో, తిరిగి వాసవాంబిక రూపంలో ప్రత్యక్షం అయింది. వెంటనే వాసవాంబిక తనకు ఏర్పాటు చేయబడిన అగ్నిగుండంలో దూకి ఆత్మార్పణ కావించుకొనెను.అప్పుడు 102 గోత్రాలకు చెందిన వారు కుడా తమ ఇష్ట దైవాలను తల్చుకుని అగ్నిగుండంలో దూకారు.

విష్ణువర్ధునుడి మరణం

       విష్ణువర్ధునుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికి తన సేనతో పెనుగొండ పొలిమేరాల్లో ప్రవేశించాడు. అప్పుడు వేగులు అప్పటి వరకు జరిగిందంతా విష్ణువర్ధునుడికి చెప్పారు. ఆ వార్త విన్నవిష్ణువర్ధనుడు రక్తం కక్కుకుని, తలపగిలి అక్కడికక్కడే మరణించాడు. వాసవి చేసిన ఆత్మత్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది. విష్ణువర్ధునుడి చర్యలను ఖండించి, ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు ఆమె అనుచరులను కొనియాడారు.

అహింసే ముగింపు

       ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణ పొలిమేరలకు చేరుకుని విలపించాడు. ఆ తర్వాత విరూపాక్షుడు వచ్చి అతన్ని ఈ విధంగా ఓదార్చాడు-“సోదరా, గతం నేర్పిన అనుభవాలు పాటంగా భవిష్యత్తును నిర్మించుకుందాం. మహా రక్తపాతం జరగకుండా వాసవాంబిక మన అందరిని రక్షించింది. ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలని ఇచ్చింది.” ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ, గయ వంటి అనేక పుణ్య క్షేత్రాలను దర్శించాడు. పెనుగొండ పుణ్య క్షేత్రంగా చేయడానికి అక్కడ 101 గోత్రాలకి గుర్తుగా 101 శివలింగాలని ప్రతిష్టించాడు. రాజరాజ నరేంద్రుడు వాసవాంబిక గౌరవార్ధం ఒక విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అప్పటి నుండి వైశ్యులందరూ వాసవీ కన్యకా పరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేయడం మొదలెట్టారు. వాసవీ కన్యకా పరమేశ్వ జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు, మత విశ్వాసాన్ని నిలిపినందుకు, స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపింపచేసినందుకు గాను ఆమె ఎప్పటికి అజరామరం అయింది. ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా,శాంతికి చిహ్నంగా ఎప్పటికి నిలిచిపోతుంది.

శ్రీపాద శ్రీ వల్లభుడు – వాసవాంబిక

       సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం ప్రకారం ఆర్య మహాదేవి యొక్క తేజో కిరణమే శ్రీ వాసవీ కన్యక. అనసూయ మాత “అగ్నియోగం” వల్ల జన్మించిన కవలపిల్లలే శ్రీపాద శ్రీ వల్లభులు మరియు శ్రీ వాసవీ కన్యక. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి శ్రీపాద శ్రీ వల్లభుల సహొదరి. ఆమె ముఖ వర్చస్సు సాక్షాత్తు శ్రీపాద శ్రీ వల్లభుల వారిని పోలిఉండును . శ్రావణ శుద్ధ పౌర్ణమి (రాఖీ పౌర్ణమి) రోజు శ్రీపాద శ్రీ వల్లభులు ఎక్కడున్నా బృహత్సిలానగరం దీనికే జ్యేష్టశైలం అనికుడా పేరు (పెనుగొండ) నకు వచ్చెదరు . ఆ రోజు వాసవీ కన్యకాంబ శ్రీపాద శ్రీ వల్లభుల వారికి రక్షా బంధనం కట్టుపుణ్య దినము. ఆరోజు ఎవరైతే పిఠాపురం నందు శ్రీ పాదుల వారి సన్నిధానం లో ఉంటారో వారికి చిత్రగుప్తుడు మహాపుణ్యమును లిఖించును. శ్రీ వాసవీ కన్యకాంబ నామస్మరణ ఎక్కడ చేయబడుచుండునో అక్కడ గుప్త రూపం లో శ్రీపాద శ్రీ వల్లభులు నివసించును.  !! ఓం శ్రీ వాసవాంబాయైనమః !!

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి

(1872 ఆగష్టు 23 —- 1957 మే 20)

     శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు 1872 ఆగష్టు 23వ తేదీన అప్పటి గుంటూరు జిల్లా, ఒంగోలు తాలూకాలోని కనుపర్తి గ్రామంలో (ఇప్పుడు ప్రకాశం జిల్లా) జన్మించాడు. తండ్రి శ్రీ గోపాలకృష్ణయ్య, తల్లి శ్రీమతి సుబ్బమ్మ. ఆ దంపతులకు ఆరుగురు సంతానం. వారిలో ప్రకాశం మూడవవాడు. చిన్నతనమంతా వల్లూరు లోనూ, నాయుడుపేట లోనూ గడిపిన ప్రకాశం చిన్నతనం నుంచి ఎంతో నిజాయితీగా, ధైర్యంగా ఉండేవాడు.

     ఒకసారి స్కూల్లో సూర్యనారాయణ అనే విద్యార్ధి తిరస్కారంగా మాట్లాడి ప్రకాశాన్ని కొట్టాడు. ఆ కోపం పట్టలేక అతనిని ఇంగ్లీషు పుస్తకం తీసుకొని సువర్ణముఖి ఒడ్డుదాకా పారిపోయి అక్కడ ముక్కలు ముక్కలుగా చింపివేశాడు. ఆ విషయం హెడ్మాష్టారు గారికి తెలిసి ప్రకాశంను డిస్మిస్ చేశాడు. అప్పుడు ఆ బాల ప్రకాశం కలెక్టరు వద్దకు వెళ్ళి ధైర్యంగా ఉన్నదున్నట్లు చెప్పాడు. సూర్యనారాయణ తనకన్నా పెద్దవాడు కాబట్టి పగతీర్చుకోవటానికీ పని చేశానని నిజాయితీగా ఒప్పుకున్నాడు. నిర్భయంగా ఉన్నదున్నట్లు చెప్పినందుకు ఆ డిప్యూటీ కలెక్టరు సంతోషించి ప్రకాశంను తిరిగి స్కూలులో చేర్చుకోవాలని ఆదేశించారు.

      ప్రకాశంకి పన్నెండు సంవత్సరాలు వచ్చే సరికి తండ్రి మరణించాడు. అసలే పేద కుటుంబం. దానికి తోడు ఇంటికి పెద్ద మరణించటంతో వారి కుటుంబానికి పెద్ద దెబ్బే తగిలింది. కొన్నాళ్ళు మేనమామ గారింట్లో ఉండి, తరువాత కుటుంబం ఒంగోలుకి తరలిపోయింది. అక్కడ ప్రకాశం తల్లి చిన్న హొటలు ప్రారంభించి కుటుంబాన్ని పోషించింది. పూటకూళ్ళమ్మలంటే చులకనగా ఆ రోజుల్లో భావించినా నలుగురికి భోజనం పెట్టి జీవించడమే గౌరవ ప్రధమని ఆ తల్లి సాహసంతో బందువులు, స్నేహితులు నివ్వెరపోయేలా చేసింది. ఏ పని చేయాలన్నా ఎదుటి వారేమనుకుంటారోనని భయపడక తన అంతరాత్మ అంగీకరిస్తే ఆ పని పూర్తి చేయాలనే అలవాటు ఆమె నుంచి ప్రకాశం పుణికిచ్చుపుకున్నాడు.

      ఒంగోలు మిషన్ స్కూలులో ఉపాధ్యాయులు శ్రీహనుమంత రావుగారు ప్రకాశంను ఎంతో అభిమానిస్తూండేవారు. అతనిలోని ధైర్యం నిజాయితీ ఆయనను ఆకట్టుకున్నాయి. ఆయన, అతని చదువు విషయంలో ఎంతో శ్రద్ద చూపి, అతనికి ఆర్ధికంగా కూడా సహాయం చేస్తుండేవారు. తన “నా జీవిత యాత్ర” పుస్తకంలో హనుమంతరావుగారి గురించి ప్రస్తావిస్తూ “ఆయన నా జీవితానికి మార్గదర్శకుడు, నా అభివృద్దికి మూల కారకుడు అని కృతజ్ఞతా పూర్వకంగా విశ్వసిస్తాను” అని రాశారు ప్రకాశం.

      హనుమంతరావు గారి ప్రోత్సాహంతో బాగా చదువుకుంటూ, తెలిసిన వాళ్ళ ఇళ్ళలో వారాలు చేస్తూ చదువు పూర్తి చేసి, ప్లీడరు వృత్తి చేపట్టాడు. అనతి కాలంలోనే మంచి పేరు ప్రతిష్టలు గడించి, తరువాత ఇంగ్లాండ్ వెళ్ళి బారిష్టరు పరీక్ష పాసయి, న్యాయవాది వృత్తిలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ముఖ్యంగా పేదవారి విషయంలో ఎంతో సహాయం చేస్తూ వారి నుంచి ఎటువంటి ఫీజును తీసుకునేవాడు కాదు.

       భారతదేశంలో తెల్లవారికి వ్యతిరేకంగా 1915లో దివ్యఙ్ఞాన సమాజం స్థాపకురాలు అనిబిసెంటు ఒక ఉద్యమం ప్రారంభించారు. భారతీయులు స్వయం పరిపాలనా అధికారం పొందాలని “హొం రూలు లీగు” ను స్థాపించిన దేశ భక్తులకు పిలుపునిచ్చింది. ఆ సమయంలో ప్రకాశం గారు లక్షలు గడిస్తున్న తన వృత్తికి తిలోదకాలు ఇచ్చి ధైర్యంగా, ఆ ఉద్యమంలో చేరి ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడిని తీసుకురాగలిగారు.

      స్వాతంత్ర్యం సమరంలో నిర్వహించిన ప్రతి ఉధ్యమాలలోనూ ప్రకాశం గారు ముఖ్య పాత్ర వహించి, మహత్మాగాంధీ వంటి పెద్దల మెప్పు పొందారు. “స్వరాజ్య” పత్రికను స్థాపించి ఎంతో ధైర్యంగా నిరంకుశ చర్యలను నిర్భయంగా వెల్లడించి, తన అచంచలమైన దేశభక్తిని చాటుకున్నారు. టంగుటూరి ప్రకాశం గారి రాజకీయ జీవితం 1906 నుండి ప్రారంభమయింది. బిపిన్ చంద్రపాల్ మద్రాసు సందర్శించినపుడు జరిగిన బహిరంగ సమావేశంలో ప్రకాశం అధ్యక్షత వహించారు. 1907 లో సూరత్ లో జరిగిన భారత జాతీయ కాంగ్రేస్ సమావేశంలో ప్రకాశం మొదటిసారిగా హజరైనారు. తరువాత రాజమండ్రి పురపాలక సంఘాద్యక్షునిగాను, మద్రాసులో మంత్రిగానూ, ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. జాతీయోద్యమంలో పాల్గొని చాలా పర్యాయాలు అరెష్టు చేయబడ్డారు. వీరిని “ఆంధ్రకేసరి” అని పిలిచారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దానికి ముఖ్యమంత్రి అయినారు.

      ఆయనను ఆంధ్రకేశరిగా ప్రజలు అంగీకరించడానికి అత్యంత ముఖ్యమైన సంఘటన ఒకటి వుంది. 1927లో తెల్లదొరలు సైమను నాయకత్వంలో కొందరిని భారతదేశం పంపారు. వారి వలన దేశానికి ఎటువంటి సహాయం ఉండదని మన నాయకులు అభిప్రాయపడి ఆ సైమన్ కమీషన్ ను బహిష్కరించాలని నిత్ణయించారు. ఆ కమీషను మద్రాసు వచ్చినప్పుడు, దేశభక్తులు శాంతియుతంగా పికెటింగ్ చేయటం ఆరంభించారు. అది చూసి రెచ్చిపోయిన పోలీసులు వారిపైన తుపాకి కాల్పులు మొదలుపెట్టారు. ఆ సమయంలో ప్రకాశం గుంపులోంచి ముందుకు వచ్చి తన చొక్కా చింపి ఎదురు చాతిని పోలీసులకు చూపి “ఇదిగో నేను సిద్దంగా ఉన్నాను కాల్చండి” అన్నాడు. ఆ సంఘటన అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. పోలీసులు వెనకకు తగ్గారు. మన రాష్ట్ర అభివృద్దికి అనితర సాధ్యమైన సహాయాన్ని అందించిన ఆ మహామనిషి 1957 సంవత్సరము మే 20 వ తేదీన స్వర్గస్థులయారు.

 –          వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

హిందూమతోద్ధారకుడు… ఆదిశంకరుడు

       సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడే ఈ ఆచార్యుడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788-820 మధ్యకాలంలో శంకరుడు జీవించాడని ఒక అంచనా, శంకరుడు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం.

       బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం శంకరుడి ముఖ్య కర్తవ్యం, అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరుడు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశాడు. తరువాత శంకరుని అనుసరించినవారికీ, శంకరునితో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంధాలుగా ఉపయుక్తమయ్యాయి. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం – అనే నాలుగు మఠాలను స్థాపించాడు. అవి శంకరుని సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.

       వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచగలిగారు.

ఆదిశంకరుని జీవితగాధ…

       శంకరుని జీవితానికి సంబంధించిన వివిధ గాధలు, నమ్మకాలు ‘శంకర విజయం’  అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి చరిత్రలలో కొన్ని – శంకరుని జీవిత గాధలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి.

మాధవీయ శంకర విజయం – 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచన.

చిద్విలాస శంకర విజయం – 15 – 17 శతాబ్దుల మధ్యకాలంలో చిద్విలాసుని రచన.

కేరళీయ శంకర విజయం – 17వ శతాబ్దికి చెందిన రచన.

జననం…

       సదాశివుడే ఆదిశంకరుని రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురువులకు కేరళ లోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడి లో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్‌ కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురువులు త్రిచూర్‌ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్ధించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరునికి అదేవిధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది.

శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి  నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితి లో ఉండగా జన్మించారు. ఆదిశంకరుని జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో జన్మించారు.

బాల్యం…

       శంకరుని బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది.

       దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేస్తుంది. ఒకరోజు శంకరుని తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.

సన్యాస స్వీకారం…

       సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరుడు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినవుతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరుడు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది.

       సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరాడు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.

       గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారతయాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, ప్రాతఃకాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.

శంకరుని అసమాన ప్రతిభ…

       ఒకరోజు శంకరుడు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరునికి చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరుడు మాత్రమేనని ప్రశింసించాడు.

       వేదవ్యాసుడు నిష్ర్కమించ బోవడం చూసి, శంకరుడు ‘‘నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ” మని వ్యాసుని కోరుతాడు. అప్పుడు వ్యాసుడు ‘‘లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది.

       నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు అయుష్షు లభించుగాక” అని దీవిస్తాడు.

       మానవులందరిని భక్తి, జ్ఞాన, కర్మల ద్వారా అద్వైత మార్గాభిముఖులుగా త్రిప్పి, మోక్షమార్గాన్ని చూపిన జగద్గురువులు శ్రీ శంకరభగవత్పాదులు. అటువంటి పుణ్యమూర్తి జన్మదినమున మన మంతా విశేషంగా జరుపుకుని పునీతులౌదాము.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

శ్రీ రామానుజాచార్య జీవిత చరిత్ర

       రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 – 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల లో ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన యతి.

జన్మ స్థలం, నక్షత్రం మరియు ఇతర వివరాలు :-

    ఆయన క్రీస్తు శకం 1017 సంవత్సరంలో శ్రీపెరంబుదూరుగా ఇప్పుడు పేరున్న భూతపురిలో జన్మించారు. శ్రీపెరంబుదూరు చెన్నై పట్టణానికి సుమారు పాతిక కిలో విూటర్ల దూరంలో ఉంది. కలియుగం 4118 సంవత్సరం, శాలివాహన శకం ప్రకారం 930 సంవత్సరం అవుతుంది. ఆయన జనన కాలానికి, కుటుంబానికీ సంబంధించిన ఇతర వివరాలు : పింగళ నామ సంవత్సరం, వైశాఖ మాసం, శుక్లపక్షం పంచమి తిథి, బృహస్పతి వారం, ఆర్ద్రా నక్షత్రం, కర్కాటక లగ్నం. ఆయన తల్లి కాంతమతి, తండ్రి కేశవా చార్యులు. హరీత గోత్రం. ఆపస్తంబ సూత్ర యజుశ్శాఖా ధ్యాయులు. తండ్రి వద్దా, కాంచీపురంలోని యాదవ ప్రకాశకుల వద్దా ఆయన విద్యాభ్యాసం జరిగింది. విద్యాభ్యాస కాలంలోనే ఆయనలోని విశిష్టాద్వైత సిద్ధాంత విశ్వాసాలు వికాసం పొందాయి. గురువు తోనే భేదించి తన విశిష్టాద్వైత వాదాన్ని నెగ్గించుకొన్న ప్రతిభాశాలి. ఆయనకు ముందు నుంచే విశిష్టాద్వైతం ఉంది. దానిని బహుళ వ్యాప్తిలోకి తీసుకొని రావడం రామానుజుల ఘనత. విద్యాభ్యాస కాలానికి విశిష్టాద్వైతం ఒక సిద్ధాంతంగా ఆయన విశ్వాసాలను తీర్చిదిద్దలేదు. ఆయనకు సహజంగా ఏర్పడిన విశ్వాసాలు అప్పటికే స్థిరపడి ఉన్న విశిష్టాద్వైతానికి అనుగుణంగా ఉన్నాయని, అప్పటికి విశిష్టాద్వైతంలో ఉన్నతుడుగా ఉన్న యామునాచార్యుడు రామానుజుడిని విశిష్టాద్వైత మత ప్రవర్తకుడుగా ప్రోత్సహించాడని అంటారు. రామానుజుడు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవాడైనప్పటికీ, కొన్ని సంప్రదాయాలను ఆయన పాటించలేదు. ఉదాహరణకు పదునెనిమిది సార్లు తిప్పించుకొని ఎట్టకేలకు తిరుమంత్రాన్ని ఉపదేశించిన గోష్ఠీపూర్ణులనే తిరుక్కోట్టియార్‌ నంబి ఆదేశాన్ని కాదని ఒక విష్ణ్వాలయం గోపురం నుంచి తిరుమంత్రాన్ని అందరికీ వినపడేలా ప్రకటించారు. తిరుక్కోట్టి యార్‌ నంబి యామునాచార్యుల శిష్యులలో ఒకరు. పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని ఎవరికి పడితే వారికి ఉపదేశించ వద్దనీ, విన్నంత మాత్రాన్నే ముక్తి కలుగుతుందనీ నంబి చెపితే ‘‘నేనొక్కడినీ దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తే నేమి, అందరికీ ముక్తి కలుగుతుంది గదా!’’ అనే ఉదార భావనతో ఆయన గుడి గోపరం ఎక్కి తిరు మంత్రాన్ని అందరికీ అందించారు.

      రామానుజులు బ్రహ్మ సూత్రాల శ్రీభాష్యం, వేదాంత సారం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం మొదలైన గ్రంథాలను రచించారు. దేశ వ్యాప్తంగా విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేయడానికి పలువురు సింహా సనాధిపులను, జియ్యంగార్లను, పరమై కాంతులను నియమించారు. చాత్తాద వైష్ణవులూ, అమ్మం గార్లూ కైంకర్యం చేసే సంప్రదాయాలను ఏర్పరిచారు. అస్పృశ్యత లాంటి దురా చారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టారు. తన జీవితం ద్వితీయార్ధం శ్రీరంగంలో గడిపిన రామానుజులు నూట ఇరవై సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళలోనే మాఘ శుద్ధ దశమి శనివారం నాడు దేహ త్యాగం చేశారు. ఆయన జీవితానంతరం విశిష్టాద్వైతం ‘‘ద్రావిడ, సంస్కృతాల ప్రాబల్యాన్ని బట్టి తెంగలై, వడగలై అని రెండు శాఖలు ఏర్పడ్డాయి” అని తిరుమల రామచంద్ర ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రచురించిన ‘‘భార్గవ పురాణం”  గ్రంథానికి పరిష్కర్తగా రచించిన ‘‘ఆళ్వారాచార్యుల చరిత్ర తత్త్వం” వ్యాసంలో వ్రాశారు. (‘‘విశిష్టాద్వైతం” వివరణలో మరికొన్ని సైద్ధాంతిక విశేషాలు.)

నామకరణం :-

శిశువు యొక్క జనన మాసం, మరియు రాశి దశరథ పుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జన్మ మాస రాశులతో సరితూగటం వల్ల, శిశువు మామ అయిన పెరియ తిరుమల నంబి (శ్రీశైలపూర్ణుడు), ఆ శిశువు ఆదిశేషు ని అవతారమని భావించి, “ఇళయ పెరుమాళ్” అనే నామధేయాన్ని నిర్ధారిస్తాడు. శిశువు శరీరంపైన ఉన్న కొన్ని పవిత్రమైన గుర్తులను గమనించిన పెరియ తిరుమల నంబికి, నమ్మాళ్వార్ తన ‘తిరువోయ్‌మోళ్ళి’ అను గ్రంథంలో పేర్కొన్న శ్రీవైష్ణవ సాంప్రదాయాభివృధ్ధికి పాటుపడగల గొప్ప సన్యాసి, గురువు, ఈ శిశువేనన్న నమ్మకం కుదిరింది.

ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన(సాధించిన) ముఖ్య ఉద్దేశ్యాలు :-

    మొదటిది, ప్రబలంగా కొనసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.

    రెండవది, ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతం లోని లొసుగులను సరిదిద్ది, విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.

    ప్రస్థాన త్రయాన్ని సాధారణ జనానికి అందించడం.

తన జీవితం ద్వారా ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు ఇవి :-

    ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో, మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.

    దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.

    మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది ఒప్పో, తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనిలేదు.

    ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగే మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.

    వైష్ణవ సాంప్రదాయాలకు సంకేతమైన, పంచ సంస్కార కర్మ, నాలాయిర దివ్య ప్రబంధ బోధన, శరణాగతి తో కూడిన మత ప్రతిపాదన మరియు ప్రచారం, అనే ఈ మూడు కర్తవ్యాలను విధి తప్పక నిర్వర్తించటం.

    వేదాంతానికి మూలస్తంభాలవంటి వేదాంత సూత్రాల కు సరిక్రొత్త వ్యాఖ్యానం వ్రాయటం.

    భాగవత, విష్ణుపురాణాల ను రచించిన వేదవ్యాస, పరాశర మునుల అంశలతో జన్మించిన ఇద్దరు శిశువులను గుర్తించి, వారికా నామధేయాలను ప్రసాదించి, వ్యాస, పరాశరులకు నివాళులు అర్పించటం.

ఈయన తన గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని శ్రీరంగం లోని రాజగోపురం పైకి ఎక్కి, అందరికీ ఉపదేశిస్తాడు. గురువు ‘నీవు నరకానికి వెడతావేమో’ నని అంటే అందరూ స్వర్గానికి వెడతారని బదులిస్తాడు.

తిరుమల ఆలయ వ్యవస్థల ఏర్పాటు :-

       తిరుమలలోని మూలవిరాట్టు(ధ్రువబేరం) విష్ణుమూర్తి విగ్రహం కాదని, శక్తి విగ్రహమో, శివ ప్రతిమో, సుబ్రహ్మణ్యమూర్తో కావచ్చని వివాదం చెలరేగింది. తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు వద్దకు శైవులు ఈ వివాదాన్ని తీసుకువెళ్ళి వాదించి తిరుమలలో జరుగుతున్న వైష్ణవ పూజలు ఆపుచేయించి శైవారాధనలకు అవకాశం ఇమ్మని కోరారు. పలువురు వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవరాజు కొలువుకు వెళ్ళి వాదించారు. శాక్తేయులతో, శైవులతో జరిగిన వాదనలో పలు పౌరాణిక ఆధారాలను, శాస్త్ర విధానాలను సాక్ష్యాలుగా చూపించారు. శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరారనీ, రామానుజులు వేంకటేశ్వరుని విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు, శైవాయుధాలు, శక్తి ఆయుధాలు పెట్టి ఏ దైవానివైతే ఆ ఆయుధాలే స్వీకరించు అని ప్రార్థించి తలుపులు మూశారని ప్రతీతి. రాత్రి అత్యంత కట్టుదిట్టాల నడుమ గడవగా తెల్లవారి తలుపులు తెరిస్తే ధ్రువబేరానికి శంఖ చక్రాలు ఆయుధాలుగా కనిపించాయంటారు. మొత్తానికి తిరుమలలోని మూలవిరాట్టు శ్రీనివాసుడేనని వాదన ద్వారా నిర్ధారించడంతో తిరుమలపై వైష్ణవ ఆరాధనలకు యాదవరాజు అంగీకరించారు.

       అనంతర కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. తర్వాతి కాలంలో ఏకాంగి వ్యవస్థ జియ్యర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడడంలోనూ రామానుజుల పాత్ర కీలకం. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది రామానుజులే. ఆ ఆలయం చుట్టూ ఆలయపూజారులకు అగ్రహారమిచ్చి, వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజును పేరిట రామానుజపురంగా రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది. రామానుజాచార్యులు తాను స్వయంగా పాంచరాత్ర ఆగమాన్ని పాటించే వ్యక్తి అయినా తిరుమలలో పరంపరాగతంగా వస్తున్న వైఖానస ఆగమాన్ని కొనసాగించారు. ఐతే అప్పటికి ఉన్న వైదికాచారాలతోపాటుగా ద్రవిడవేదాలను, పాంచరాత్రాగమ ఆచారాలను కొన్నింటిని తిరుమల అర్చనా విధానంలో చేర్చారు. తిరుమలలోని పలు కీలకమైన వ్యవస్థల ఏర్పాటులో, మూర్తి స్వరూపనిర్ధారణలో, ఆగమ పద్ధతుల్లో తిరుమల-తిరుపతిపైన రామానుజాచార్యునిది చెరగని ముద్ర.

!! శ్రీమతే రామానుజాయ నమః   !!  శ్రీమతే నారాయణాయ నమః !!

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)