Categories
Vipra Foundation

బుద్ధ జయంతి

గౌతమ బుద్ధుడు (బుద్ధ జయంతి శుభాకాంక్షలు)

       సిద్ధార్థ గౌతముడు (సంస్కృతం:सिद्धार्थ गौतमः (సిద్ధార్థ గౌతమః); పాళి: సిద్దాత్త గోతమ) నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు మరియు బౌద్ధ ధర్మానికి మూల కారకులు. బౌద్ధులందరిచే మహా బుద్ధుడిగా కీర్తింపబడేవాడు. బుద్ధుని జనన మరణాల కాలం స్పష్టంగా తెలియరావడం లేదు: 20వ శతాబ్దపు చారిత్రకకారులు క్రీ.పూ 563 నుండి 483 మధ్యలో జననం అని, 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు. మిగతా లెఖ్ఖలను ఇంకా అత్యధికుల ఆమోదించలేదు.

       బుద్ధుని జననం :సిద్ధార్ధుడు కపిలవస్తు దేశానికీ చెందిన లుంబిని పట్టణంలో జన్మించాడు. భౌగొళికంగా ఈ ప్రాంతం ప్రస్తుత నేపాల్ దేశంలో ఉంది. కానీ చారిత్రకంగా ఈ ప్రాంతం ప్రాచీన భారతదేశంలోకి వస్తుంది. గౌతమ అనునది సిద్ధార్ధుని ఇంటి పేరు కాదు సిద్ధార్ధుని పెంచిన తల్లి గౌతమి. అందుకు గాను అతనికి ఆ పేరు వచ్చింది. తండ్రి శుద్దోధనుడు, తల్లిమహామాయ (మాయాదేవి, కోళియన్ దేశపు రాకుమారి). సిద్దార్డుడు గర్భమందున్నప్పుడు, మాయాదేవి, ఒక ఆరు దంతముల ఏనుగు తన గర్భములోకి కుడి వైపు నుండి ప్రవేశించినట్లుగా ఒక స్వప్నమందు దర్శించినది. అది జరిగిన పది చంద్ర మాసముల తర్వాత సిద్ధార్డుడు జన్మించెను. శాక్యవంశాచారము ప్రకారం, గర్భావతిగానున్న మాయాదేవి, ప్రసవానికి తన తండ్రిగారింటికి బయలుదేరింది. కానీ మార్గమధ్యంలో, లుంబిని అనే ప్రాంతంలో ఒక సాలవృక్షం క్రింద ఒక మగ బిడ్డను ప్రసవించినది.

        అనేక ఆధారాలను బట్టి, ప్రసవ సమయంలోగాని లేదా మగబిడ్డ జన్మించిన కొద్ది రోజుల తర్వాత గానీ మాయాదేవి మరణించినదని తెలుస్తుంది. అలా పుట్టిన బిడ్డకి సిద్ధర్దుడనే నామకరణం చేశారు. సిద్ధార్దుడనగా అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్ధం. సిద్దార్దుడు జన్మించిన ఐదవ దినము నాడు, అతనికి నామకరణం చేసి, అతని భవిష్యత్తుని చెప్పమని, ఎనిమిది మంది జ్యోతిష్కులని శుద్దోధనుడు ఆహ్వానించెను. వారిలో కౌండిన్యుడనే పండితుడు, సిద్దార్దుడు భవిష్యత్తులో, బుద్ధుడవుతాడని జ్యోస్యం చెప్పెను. అప్పటి చరిత్ర, ఆచారాలను బట్టి చూస్తే, శుద్దోధనుడు, సూర్య వంశపు రాజైన ఇక్ష్వాకుని వారసుడని తెలియుచున్నది. కానీ కొందరు చరిత్ర కారుల ప్రకారం శుద్దోధనుడు ఒక ఆటవిక తెగ నాయకుడు.

       బాల్య జీవితము మరియు వివాహము : సిద్ధార్దుడు బాల్యం నుంచి రాకుమరుడిగా విలాసవంతమైన జీవితం గడిపాడు. శుద్దోధనుడు, సిద్ధార్దుని గొప్ప చక్రవర్తిని చేయాలనే ధ్యేయంతో అతడికి ఎలాంటి తాత్విక విషయాలు గాని, సామాన్య ప్రజల కష్టసుఖాలు గాని తెలియకుండా పెంచాడు. సిద్ధార్దుడు తన పినతల్లి అయిన మహా ప్రజాపతి పెంపకంలో పెరిగాడు.

       సిద్దార్డునకు 16 ఏండ్ల ప్రాయము వచ్చేసరికి యశోధరతో వివాహమయ్యింది. వీరికి రాహులుడనే కుమారుడు పుట్టాడు. ఈ విధంగా సిద్దార్డు 29 ఏళ్ల వరకు రాజభోగాలను అనుభవించాడు. మహారాజు శుద్దోధనుడు, తన కుమారునకు కావలసిన రాజభోగాలనన్నింటినీ సమకూర్చినప్పటికీ, సిద్ధార్దుడు ప్రాపంచిక సుఖాలను అనుభవించడం జీవిత పరమ లక్ష్యం కాదని భావిస్తూ ఉండేవాడు.

       రాజ భోగాలనుంచి నిష్క్రమణ మరియు సన్యాసి జీవితం : సిద్దార్డునకు ఐహిక ప్రపంచపు కష్ట్టసుఖాలు తెలియకూడదని శుద్దోధనుడు ఎంత ప్రయత్నించినా, తన 29వ ఏట, ఒక రోజు సిద్ధర్డుడు, ఒక ముసలి వ్యక్తిని, ఒక రోగ పిడితుడ్ని, ఒక కుళ్ళిపోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూశాడు. అప్పుడు తన రధ సారధి ఛన్న(చెన్నుడు) ద్వారా, ప్రతి మానవుడూ ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలిసి తీవ్రంగా కలత చెంది, ముసలితనాన్నీ, రోగాన్నీ, మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితం గడప నిశ్చయించాడు.

        అప్పుడు సిద్ధార్దుడు పరివ్రాజక జీవితం గడపడానికి, తన రధ సారధి ఛన్న సహాయంతో, ఒకనాడు రాజభవనం నుంచి కంతక అనే గుర్రంపై తప్పించుకున్నాడు. ఈ విధంగా ఒక బోధిసత్వుని నిష్క్రమణ అతని భటులకు తెలియకుండా ఉండడానికి, అతని గుర్రపు డెక్కల చప్పుడు దేవతలచే అపబడిందని చెప్తారు. దీనినే ఒక గొప్ప నిష్క్రమణ(మహాభినిష్క్రమణ) (ది గ్రేట్ డిపార్చర్) అని అంటారు.

        సిద్ధార్దుడు తన సన్యాసి జీవితాన్ని రాజగహ(మగధ సామ్రాజ్యంలో ఒక పట్టణం)లో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. కానీ బింబిసార మహారాజ సేవకులు, సిద్దార్డుని గుర్తించడంతో, బింబిసారుడు, సిద్ధార్దుని అన్వేషణకు కారణం తెలుసుకుని, అతనికి తన సింహాసనాన్ని (మహారాజ పదవిని) బహుకరించాడు. కాని సిద్ధర్డుడు ఆ బహుమానాన్ని తిరస్కరిస్తూ, తన జ్ఞాన సముపార్జన పూర్తయ్యాక మొదటగా మగధ సామ్రాజ్యానికే విచ్చేస్తానని మాటిచ్చాడు.

        తర్వాత సిద్ధార్దుడు, రాజగహను విడిచిపెట్టి, ఇద్దరు సన్యాసుల వద్ద శిష్యరికం చేశాడు. అలరకలమ అనే సన్యాసి, తన బోధనలలో సిద్ధార్దుని ప్రావీణ్యున్ని చేసి, తన వారసుడిగా ఉండమని కోరాడు. కాని అ బోధనలవల్ల సిద్ధార్దుని జ్ఞానతృష్ణ తీరకపోవడంతో అ కోరికను నిరాకరించాడు. తర్వాత సిద్ధార్దుడు ఉదకరామపుత్త అనే యోగి శిష్యరికంలో యోగశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. కాని ఇది కూడా సిద్ధార్దుని జ్ఞానతృష్ణని తీర్చకపోవడంతో వారసత్వం పుచ్చుకోమన్న ఆ యోగి కోరికను కూడా నిరాకరించాడు.

       తర్వాత సిద్ధార్దుడు కౌండిన్యుడనే యోగి వద్ద మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి శిష్యరికం చేశాడు. ఆ శిష్యబృందమంతా, జ్ఞాన సముపార్జన కొరకు, బాహ్య శరీర అవసరాలను (ఆహారంతో సహా) పూర్తిగా త్యజించి సాధన చేశేవారు. ఈ విధంగా సిద్ధార్దుడు రోజుకు ఒక పత్రాన్ని గాని, ఒక గింజను గాని ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని పూర్తిగా క్షీణింప చేసుకున్నాడు. చివరికి ఒకనాడు, సిద్ధార్దుడు, నదిలో స్నానమాచరిస్తుండగా నీరసంతో పడిపోయాడు. అప్పుడు సిద్ధార్దుడు తను ఎంచుకున్న మార్గం సరియైనది కాదని తెలుసుకున్నాడు.

       జ్ఞానోదయం : తర్వాత సిద్ధార్దుడు ధ్యానం, అనాపనసతి(ఉశ్చ్వాస, నిశ్వాసలు) ద్వారా మధ్యయ మార్గాన్ని కనిపెట్టాడు (ఐహిక సుఖాలను, కోరికలను త్యజించడం). ఈ సమయంలో సుజాత అనే పల్లె పడుచు తెచ్చే కొద్ది అన్నాన్ని, పాలను ఆహారంగా తీసుకునేవాడు. తర్వాత సిద్ధార్దుడు, బుద్ధ గయలో ఒక బోధి వృక్షం నీడలో పరమ సత్యం తెలుసుకొనుటకు భగవత్ ధ్యానం చేశాడు. కాని కౌండిన్యుడు మరియు అతని ఇతర శిష్యులు, సిద్ధార్దుడు జ్ఞాన సముపార్జన సాధనను విరమించినట్లుగా, క్రమశిక్షణా రహితుడుగా భావించారు. చివరకు, తన 35వ ఏట, 49 రోజుల ధ్యానం తర్వాత, సిద్ధార్దునకు జ్ఞానోదయమయ్యింది. కొందరి అభిప్రాయం ప్రకారం, సిద్ధార్దునకు బాధ్రపద మాసంలో జ్ఞానోదయమయ్యిందని, ఇంకొందరి అభిప్రాయం ప్రకారం, సిద్ధార్దునకు ఫాల్గుణ మాసంలో జ్ఞానోదయమయ్యిందని చెప్తారు. అప్పటి నుండి, గౌతమ సిద్ధార్దుడు, గౌతమ బుద్ధునిగా మారాడు. బౌద్ధ మతంలో ఇతనిని శాక్యముని బుద్దుదని భావిస్తారు.

       జ్ఞానోదయమయ్యాక, గౌతమ బుద్ధుడు, మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు. వీటిని 4 పరమ సత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణమందురు. అప్పుడు గౌతమ బుద్ధుడు, ప్రతి బుద్ధునకు ఉండవలసిన 9 లక్షణాలను ప్రతిపాదించాడు.

       ఆయాచన సూక్తిలో ఉన్నా కొన్ని గాధల ప్రకారం, జ్ఞానోదయమయ్యాక, గౌతమ బుద్ధుడు, తను తెలుసుకున్న ధర్మాన్ని సామాన్య ప్రజలకు బోధించాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు. దీనికి కారణం, దురాశ, అసూయ, ద్వేషాలతో నిండిన మానవుడు, తను తెలుసుకున్న ధర్మాన్ని అర్ధం చేసుకోలేదని బుద్ధుడు భావించాడు. కానీ భ్రహ్మ సహంపతి విన్నపంతో, గౌతమ బుద్ధుడు, బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు.

       దేశ పర్యటన మరియు బౌద్ధ మత ప్రచారం : మిగిలిన 45 సంవత్సరాల జీవితంలో గౌతమ బుద్ధుడు గంగా నదీ పరివాహక ప్రాంతాలైన ఉత్తర ప్రదేశ్, బీహార్ మరియు దక్షిణనేపాల్ ప్రాంతాలలో పర్యటించి విభిన్న సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు తన సిద్ధాంతాలను బోధించాడు. ఈ ప్రజలలో గొప్పతత్వ వేత్తలను మొదలుకొని, వీధులను శుభ్రం చేసే అంటరానివారు, అంగుళీమాల లాంటి హంతకులు, అళవక వంటి నర మాంసభక్షకులు ఉండేవారు. బౌద్ధ మతంలో అన్ని జాతులు తెగలకు చెందిన ప్రజలు మారడానికి వీలుండడం మరియు కుల, వర్గ విభజనలేకపోవడంతో బౌద్ధ మత సంఘంలోకి వేల కొద్దీ ప్రజలు రావడం మొదలు పెట్టారు. దీని వల్ల గౌతమ బుద్ధుడు ఇతర మతస్తుల నుండిబెదిరింపులు, హత్యా యత్నాలు ఎదుర్కొన్నాడు.

       బౌద్ధ మత సంఘం భిక్షువులతోనూ, సన్యాసులతోనూ, భారతదేశంలో ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ధర్మ ప్రచారం గావిస్తూ, ఒక్క వర్షా కాలం తప్ప, మిగతా సంవత్సరమంతా ప్రయాణించేది. వర్షాకాలంలో వచ్చే వరదలవల్ల అన్ని మతాలకు చెందినసన్యాసులు ఆ కాలంలో తమ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేశేవారు. ఈ సమయంలో బౌద్ధ మత సంఘం ఒక ఆశ్రమాన్నిఏర్పాటు చేసుకుని అక్కడ నివసించేది. చుట్టుపక్కల ప్రాంతాలనుండి ప్రజలంతా ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చేవారు. దీనినేవస్సాన అని అంటారు.

       మొదటి వస్సాన బౌద్ధ మత సంఘం ఏర్పడిన మొదటి సంవత్సరం వారణాసిలో ఏర్పాటు చేశారు. తర్వాత బుద్ధుడు గతంలోబింబిసారునకిచ్చిన మాట ప్రకారం మగధ సామ్రాజ్య రాజధాని అయిన రాజగహను సందర్శించాడు. అప్పుడు బింబిసారుడురాజగహకు సమీపంలో వేలువన వెదురు ఉద్యానవనంలో బౌద్ధ మత సంఘానికి ఒక ఆశ్రమాన్ని కట్టించాడు. గౌతమ బుద్ధుడు, తనశిష్యులతో కలిసి ఇక్కడ కొంత కాలం బస చేశాడు.

       బుద్ధునికి జ్ఞానోదయమయిన విషయం తెలుసుకుని, శుద్దోధనుడు, బుద్ధుని, కపిలవస్తు రమ్మని రాజదూతలచే ఆహ్వానం పంపాడు. 9 మంది దూతలు వెళ్ళగా ఎవ్వరూ రాజాహ్వానమును బుద్ధునికి విన్నవించకుండా బౌద్ధ సంఘంలో చేరి సన్యాసులుగామారిపోయారు. కానీ బుద్ధుని బాల్య స్నేహితుడు కులుదాయి మాత్రం రాజాహ్వానాన్ని బుద్ధునికి విన్నవించి బౌద్ధ సంఘంలో చేరాడు. అప్పుడు బుద్ధుడు రాజాహ్వానాన్ని మన్నించి, జ్ఞానోదయమయిన 2 సంవత్సరాల తర్వాత కపిలవస్తుకు కాలినడకనప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ధర్మబోధ చేస్తూ 2 మాసాలలో కపిలవస్తుకు చేరుకున్నాడు. బుద్ధుడు కపిలవస్తుకుచేరుకున్నాక, రాజ భవనంలో బౌద్ధ సంఘానికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చెయ్యబడింది. కానీ బౌద్ధ సంఘానికి ఎలాంటిఆహ్వానం రాకపోవడంతో వారంతా బుద్ధునితో కలిసి భిక్షాటనకు బయలుదేరారు. ఇది విన్న శుద్దోధనుడు బుద్ధునితో, “మనదిమహామస్సాట రాజవంశము. మన వంశంలో ఏ ఒక్క వీరుడు కుడా భిక్షాటన చెయ్యలేదు” అని అన్నాడు. దానికి బుద్ధుడు, “భిక్షాటనమీ రాజవంశాచారము కాదు. అది బుద్ధ వంశాచారము. ఇంతకు ముందు వేల కొద్దీ బుద్దులు భిక్షాటన చేశేవారు” అని చెప్పాడు.

        తర్వాత శుద్దోధనుడు మరల బౌద్ధ సంఘాన్ని రాజ భవనానికి భోజనం కొరకు ఆహ్వానించ్చాడు. భోజనం తర్వాత ధర్మముపైజరిగిన చర్చలో, శుద్ద్దోధనుడు బౌద్ధ సంఘంలో చేరి శొతపన్నునిగా మారాడు. ఈ సమయంలో చాలా మంది రాజకుటుంబీకులుబౌద్ధ సంఘంలో చేరారు. బుద్ధుని సోదరులైన ఆనందుడు, అనిరుద్ధుడు, నందుడు మొదలగు వారంతా బౌద్ధ సంఘములో చేరిసన్యాసులుగా మారారు. సిద్ధార్ధుని కుమారుడైన రాహులుడు కూడా బౌద్ధ మత సంఘములో చేరాడు. అప్పటికి అతని వయస్సు 7సంవత్సరములు మాత్రమే. దేవదత్తుడనే వ్యక్తి (వరుసకు బుద్ధుని సోదరుడు) మొదట బౌద్ధ భిక్షువుగా మారినా, తర్వాత బుద్ధునిశత్రువుగా మారి, బుద్ధుని చంపాలని చాలాసార్లు ప్రయత్నించాడు.

       బుద్ధుని శిష్యులలో సరిపుత్త, మహా మొగ్గల్లన, మహా కశ్యప, ఆనంద, అనిరుద్ద మొదలగు ఐదుమంది ముఖ్యులు. వీరితో పాటూఉపాలి, సుభోతి, రాహుల, మహా కక్కన మరియు పున్న అనే ఐదుగురు సంగీత విద్వాంసులు ఉండేవారు.

        బుద్ధుడు ఐదవ వస్సనలో వేశాలికి దగ్గరలో ఉన్న మహావానలో బస చేశాడు. అప్పుడు బుద్ధుని తండ్రి శుద్దోధనుడు మరణశయ్యపైఉండడంతో, బుద్ధుడు అతని దగ్గరికి వెళ్లి ధర్మాన్ని బోధించడంతో, శుద్దోధనుడు మరణానికి ముందు బౌద్ధ సన్యాసిగా మారాడు. శుద్దోధనుని మరణం మరియి అంత్యక్రియలు సన్యాసినిల సంఘం ఏర్పడడానికి కారణమయ్యింది. బౌద్ధ గ్రంధాల ప్రకారం, బుద్ధుడుమొదట స్త్రీలను సన్యాసినిలుగా తీసుకోవడానికి నిరాకరించాడు. బుద్ధుని పిన తల్లి అయిన మహా పజాపతి, బుద్ధుని బౌద్ధ సన్యాసదీక్షను ప్రసాదించమని అడుగగా బుద్ధుడు నిరాకరించి, కపిలవస్తుని విడిచి పెట్టి, రాజగహకు ప్రయాణమయ్యాడు. కాని మహాపజాపతి నిరాశ చెందక, కొందరు శాక్య మరియు కొళియ వంశాలకు చెందిన స్త్రీలతో ఒక చిన్న గుంపుగా బయలుదేరి, బౌద్ధబిక్షువులను అనుసరిస్తూ రాజగహకు చేరుకుంది. తర్వాత కొంత కాలానికి, అంటే బౌద్ధ సంఘం ఏర్పడిన ఐదు సంవత్సరాల తర్వాతఆనందుని మధ్యవర్తిత్వంతో, స్త్రీలకు కూడా జ్ఞాన సముపార్జనకు సమాన శక్తి ఉందని బుద్ధుడు గ్రహించి, వారికి కూడా బౌద్ధ సంఘంలోస్థానం కల్పించాడు. కానీ బుద్ధుడు, బౌద్ధ సంఘానికున్న నియమాలతో పాటు, వినయమనే కొత్త నియమాన్ని, స్త్రీలకు ప్రత్యేకంగాజతపర్చాడు. తర్వాత సిద్ధార్దుని భార్య యశోధర కూడా బౌద్ధ సన్యాసినిగా మారింది.

       తర్వాత కొంతకాలానికి, దేవదత్తుడు, బుద్ధుని కించపరచడం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో, దేవదత్తుడు, తను బౌద్ధసంఘానికి నాయకత్వం వహిస్తానని బుద్ధుని కోరాడు. కానీ బుద్ధుడు నిరాకరించాడు. అప్పుడు దేవదత్తుడు మరియు బింబిసారునికుమారుడైన అజాతసత్రు కలసి, బుద్ధుని, బింబిసారుని హత్య చేసి, తద్వారా వారి పదవులు తీసుకోవాలని పధకం వేశారు. దేవదత్తుడు మూడు సార్లు బుద్ధుని హత్య చేయాలని ప్రయత్నించాడు. మొదటి సారి కొందరు విలువిద్యా నిపుణులను బుద్ధుని హత్యచేయడానికి నియమించాడు. వారంతా బుద్ధుని కలిసి అతని శిష్యులుగా మారిపోయారు. రెండవ సారి దేవదత్తుడు కొండపైనుండి ఒకపెద్ద బండరాయిని బుద్ధుని పైకి దొర్లించాడు. అది వేరొక బండ రాయిని ఢీకొట్టి చిన్న చిన్న ముక్కలుగా పగిలి బుద్ధుని పాదాలనుమాత్రం తాకింది. మూడవ సారి ఒక ఏనుగుకు సారాయిని పట్టించి బుద్ధుని మీదకు వదిలాడు. కాని ఆ ప్రయత్నం కూడావిఫలమయ్యింది. ఈ ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో, దేవదత్తుడు, బౌద్ద సంఘంలో స్త్రీలకు మాత్రమె కేటాయించిన వినయమనేనియమంపై కొత్తగా ఆంక్షలను విధించి, బౌద్ధ సంఘంలో కలతలు రేపాలని చూశాడు. కాని బుద్ధుడు ఆ ఆంక్షలను నిరాకరించడంతోదేవదత్తుడు సంఘ నియమాలను ఉల్లంఘించి, బుద్ధుని నియమ నిష్ఠలను విమర్శించడం మొదలు పెట్టాడు. ఈ రకంగా దేవదత్తుడు, మొదట కొందరు బౌద్ధ భిక్షువులను బౌద్ధ సంఘం నుంచి విడదీసినా, సారిపుత్త, మహా మొగ్గల్లనలు వారికి బౌద్ధ ధర్మాన్ని విశదీకరించిచెప్పి, తిరిగి వారిని బౌద్ధ సంఘంలోకి చేర్చారు. తర్వాత బుద్ధుడు తన 55వ ఏట ఆనందుని, బౌద్ధ సంఘానికి ముఖ్య కార్యదర్శిగాచేశాడు.

        బుద్ధుని నిర్యాణం : మహా పరనిభాన సూక్తం ప్రకారం, గౌతమ బుద్ధుడు, తన 80వ ఏట తాను కొద్ది రోజులలో మహా నిర్యాణమొందుతాననిప్రకటించాడు. తర్వాత, బుద్ధుడు కుంద అనే కుమ్మరి సమర్పించిన ఆహారాన్ని (పంది మాంసమని కొందరంటారు) భుజించాడు. అదితిన్న తర్వాత బుద్ధుడు చాలా అస్వస్థతకు గురయ్యాడు. అప్పుడు బుద్ధుడు తన ముఖ్య అనుచరుడయిన ఆనందుని పిలిచి, తనఅస్వస్థతకు కారణం, కుంద ఇచ్చిన ఆహరం కాదని, తనకు ఆఖరి భోజనాన్ని సమర్పించిన కుంద చాలా గొప్పవాడని చెప్పి, కుందని ఒప్పించమని పంపాడు.

        కానీ మహాయాన విమల కీర్తి సూక్తం ప్రకారం, గౌతమ బుద్ధుడు, సంసార సాగరంలో కొట్టు మిట్టాడుతున్న ప్రజలకు నిర్యాణంగురించి తెలియజేయడానికి, కావాలనే నిర్యాణమొందాడని ఒక వాదన ఉన్నది.

        తర్వాత బుద్ధుడు తన శిష్యులైన బౌద్ధ భిక్షువులనందరిని పిలిచి వారికి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోమని అడిగాడు. కానీఎవ్వరు,ఏ సందేహాలను వెలిబుచ్చలేదు. అప్పుడు బుద్ధుడు మహా నిర్యాణమొందాడు. బుద్ధుని ఆఖరి మాటలు, “All composite things Pass away. Strive for your own liberation with diligence ”. బుద్ధుని శరీరానికి అంత్యక్రియలు జరిపిన తర్వాత, అతని అస్థికలు వివిధ బౌద్ధ స్థూపాలలో భద్రపరిచారు. వీటిలో కొన్ని ఇప్పటికిభద్రంగా ఉన్నాయంటారు (శ్రీలంకలో ఉన్న దలద మారిగావలో బుద్ధుని కుడివైపునుండే పన్ను ఇప్పటికి భద్రపరచబడి ఉంది. దీనినేటెంపుల్ ఆఫ్ టూత్ అంటారు). శ్రీలంకలో పాళీ భాషలో ఉన్న దీపవంశ మరియు మహావంశ శాసనాలను బట్టి, అశోకుని పట్టాభిషేకం బుద్ధుడు నిర్యాణమొందిన218 సంవత్సరాల తర్వాత జరిగింది. కానీ చైనాలో ఉన్న ఒక మహాయాన శాసనాన్ని బట్టి, అశోకుని పట్టాభిషేకం బుద్ధుడునిర్యాణమొందిన 116 సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ రెండు ఆధారాలను బట్టి, బుద్ధుడు క్రీ.పూ.486లో (ధేరవాద శాసనం) గానీ లేదా క్రీ.పూ.383లో (మహాయాన శాసనం) నిర్యాణమొందాడు. కానీ ధేరవాద దేశాలలో బుద్ధుడు క్రీ.పూ.544 లేదా 543లోనిర్యాణమొందాడని భావిస్తారు. దీనికి కారణం అశోకుని కాలం ప్రస్తుత అంచనాల కన్నా 60 సంవత్సరాల ముందని వీరుభావించడమే.

       బుద్ధుడు నిర్యాణ సమయంలో తన శిష్యులను, ఏ నాయకున్నీ అనుసరించవద్దని, తన సిద్ధాంతాలను, ధర్మాన్ని మాత్రమేఅనుసరించమని చెప్పాడు. కానీ మహా మొగ్గల్లన మరియు సారిపుత్తలు అప్పటికే నిర్యాణమొందటంతో బౌద్ధ సంఘం, మహాకశ్యపుని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.

       బోధనలు : ప్రధాన వ్యాసం: బౌద్ధ మతము

       ఆయన యధాతథంగా బోధించినవి దొరుకుట కొంత కష్టమే అయినా, వాటి మూలాలను తెలుసుకోవడం అసంభవమైన పని కాదు. వివిధ బౌద్ధ భిక్షువులు, శాఖల మధ్య కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నా, మూల సిద్ధాంతాలు, భిక్షువుల నియమావళి పట్ల అంగీకారం ఉన్నది. మచ్చుకు కొన్ని బోధనలు:

    నాలుగు ఆర్య సూత్రాలు.

    అష్టాంగమార్గం.

    అనిచ్చ (సంస్కృతం: అనిత్య): అన్ని వస్తువులు అనిత్యం

    అనత్త (సంస్కృతం: అనాత్మ): నేను అని నిరంతరం కలిగే భావన ఒక “భ్రమ”

    దుక్క (సంస్కృతం: దు:ఖం): అజ్ఞానము కారణముగా అన్ని జీవులు దు:ఖానికి గురి అవుతున్నాయి.

       భాష : బుద్ధుడు పండితుల భాషైన సంస్కృతాన్ని కాక సాధారణ ప్రజలు భాషించే పాళీ భాషలో మాట్లాడేవాడని అధికుల భావన, ఆయన మాటలను త్రిపీఠికలో యథాతథంగా గ్రంథస్తం చేసారు కూడా. కొంత మంది మగథ ప్రాకృతి అని, మరికొందరు పరిశోధకులు నాటి ఈశాన్య భారతంలోని మరో భాషను మాట్లాడాడని అభిప్రాయపడుతున్నారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

జ్యేష్ట మాసం ప్రాముఖ్యత

       శ్రావణమాసం తరువాత మహిళలు చేసే అనేక వ్రతాలను స్వంతం చేసుకున్న విశిష్టమైన మాసం ‘జ్యేష్టమాసం’. చాంద్రమానం ప్రకారం మూడవ నెల జ్యేష్టమాసం. ఈ మాసంలో వచ్చే పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్టా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడంవల్ల ఈ మాసానికి జ్యేష్టమాసం అనే పేరు వచ్చింది.ఈ మాసంలో గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. ఎన్నో శుభాలను ప్రసాదించే పుణ్యప్రదమైన ఈ మాసంలో కొన్ని నియమాలను విధులను పాటించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలను పొందవచ్చు.

       వైశాఖ మాసం శ్రీమహావిష్ణువుకు, కార్తీకమాసం పరమశివుడికి ఏ విధంగా ప్రియమైనవో అట్లే జ్యేష్టమాసం త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ నెలలోఈ నెలలో బ్రహ్మదేవుడిని పూజించడంవల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతే కాకుండా, ఈ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులను బ్రాహ్మణులకు దానం ఇవ్వడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయి. నీటి కడవనుగానీ, నీటితో నింపిన బిందెనుగానీ ఈ నెలలో వచ్చే పూర్ణిమరోజు లేదా నెలలోని శుక్లపక్షంలో ఏ రోజు అయినా లేదంటే శుక్లపక్ష ఏకాదశినాడుగానీ దానంగా ఇవ్వవలెను.అంతే కాకుండా దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడంవల్ల త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది.

        జ్యేష్టమాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలుకుని దశమి వరకు అంటే మొదటి పదిరోజులు కొన్ని నియమాలను పాటించడం వల్ల దశ పాపాలు నాశనం అవుతాయని చెప్పబడుతోంది.ఈ పదిరోజులు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానమాచరించి గంగానదిని పూజించవలెను. అలా వీలు కానివారు ఇంటియందే గంగానదిని స్మరిస్తూ స్నానం ఆచరించవలెను.

మహిళలకు మేలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించే వ్రతాలు ఎన్నో జ్యేష్టమాసంలో ఉన్నాయి.

రంభా వ్రతము : దీనినే ‘రంభా తృతీయ ‘ అని కూడా పేరు. దీనిని జ్యేష్ట శుద్ధ తదియనాడు ఆచరించవలెను. ఈ వ్రతం పెళ్ళికానివారు అంటే కన్నెపిల్లలు ఆచరించడంవల్ల మంచి భర్త లభిస్తాడని చెప్పబడింది.

వట సావిత్రీ వ్రతం : జ్యేష్ట శుద్ధ పూర్ణిమనాడు దీనిని ఆచరించవలెను వటవృక్షం దేవతా వృక్షం. తెల్లవారు జామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజాద్రవ్యాలు తీసుకొని వటవృక్షం (మర్రిచెట్టు) దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తర్వాత మర్రిచెట్టుకు దారం చుట్టుతూ ‘నమో వైవస్వతాయ ‘ అనే మంత్రంను పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయవలెను.

జ్యేష్ట శుద్ధ దశమి : దీనిని దశపాపహర దశమి అని కూడా అంటారు.దశమినాడు చేస్తారు. పాపాలు పోగొట్టే దశమి కనుక దీనికి దశపాపహర దశమి అని పేరు వచ్చింది.

జ్యేష్ట శుద్ధ పూర్ణిమ : దీనిని ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు.ఈ దినం రైతులు నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు, ఎద్దులు, భూమిని పూజించి భూమిని దున్నడం ప్రారంభిస్తారు. దీనికే ఏరువాక అని పేరు. ఈ దినం భూదేవిని పూజించడం మంచిది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

శని మహాత్ముని జయంతి

       నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర,  కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడు.

               నవగ్రహాలలో శనిదేవునికి ప్రత్యేక స్థానం…సాధారణంగా నవగ్రహాలలో ఎవరన్నా భయపడేది శనికి. శని అంటేనే గజగజలాడతారు. కానీ ఆయనను ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలిస్తే.. దుష్ప్రభావాలనుండి తప్పించుకొనుటయే కాక.. మంచి జరిగే అవకాశాలు ఎక్కువ.. అందుకే రేపటి రోజున చేయవలసిన కొన్ని పూజలు… శ్లోకములు.. ఇతర వివరములు మీకోసం..

శనీశ్వరుడి జననం (వైశాఖ బహుళ అమావాస్య)

శని దేవుని కథ ఏమిటి? వృత్తాంతమును ఇక్కడ వివరిస్తున్నాము::

నవగ్రహాలకు రారాజు, సకల జీవులకు ప్రత్యక్షదైవం సూర్యుడుభగవాను. ఆయన సతీమణి సంజ్ఞాదేవి. వారికిరువురు సంతానం. యముడు, యమునా… వారే యమధర్మరాజు, యమునా నది. సూర్యుని వేడికి తాళలేని సంజ్ఞాదేవి తన నీడ నుంచి తనలాంటి స్ర్తీని పుట్టించి ఆమెకు ఛాయ అని పేరు పెట్టి తన బదులుగా తన భర్త దగ్గర వుండమని కొంతకాలం పుట్టింటికి వెళ్ళి అక్క డ తండ్రైన విశ్వకర్మకు తను చేసిన పని చెప్పి రహస్యంగా ఒకచోట సూర్యుని గురించి తపస్సు చేయసాగెను. అయితే ఆమె నీడ నుంచి వచ్చిన ఛాయకి శని, తపతి అను పిల్లలు పుట్టటం వలన ఆమె యమధర్మరాజుని, యమునను చిన్నచూపు చూడటం మొదలుపెట్టాడు. తన ప్రేమాను రాగాన్ని అంతా తన పిల్లలపై చూపించసాగెను. ఆటలాడుకొను సమయంలో యముడు, శని మధ్య అభిప్రాయబేధాలొచ్చి యముడు శని కాలు విరిచాడు. దానికి ఛాయదేవి కోపించి యముని శపించింది. యమునని నది కమ్మని శపించగా, యముడు కూడా తపతిని తిరిగి నది కమ్మని శపించాడు. అంతలో అక్కడికి వచ్చిన గ్రహరాజు సూర్యుడు విషయాన్ని అంతా దివ్యదృషితో గ్రహించి వారికి కలిగిన శాపములకు చింతించి యమున కృష్ణ సాన్నిధ్యమున పవిత్రత పొందగలదని, లోకానికి ఉపకారిగా వుండమని ఎవరైనా నీ నదిని స్పర్శించినా, స్నానం చేసినా వారికి సర్వపాపాలు హరిస్తాయని చెప్పాడు. అలాగే యమునికి కూడా శాంతి వాక్యాలతో ఓదార్చాడు. యముడిని యమలోకానికి, పట్టాభిషేకము చేయించాడు. ఆకాశంలో ఛాయను కాలుతో తన్నబోయిన యమధర్మరాజుని ఆమె ఆగ్రహంతో నీ కాలు మంటలలో కాలుతుంది అని శపించగా, ఆ కాలు మంటల్లో పడకుండా మంటపై యుం డును అని, రెండో కాలు ఎల్లవేళలా నీటిలో వుండునని, ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఆ కాలు భగ్గున మండి పోతుందని, నా వరం వల్ల నీ కాలు నీటిలో వుంటే రెండో కాలికి ఎలాంటి ప్రమాదం అని తండ్రి చెప్పెను. అందుకే యమునికి సమవర్తి అనే పేరుంది. (ధర్మాధర్మాలను, నీళ్లు, నిప్పును ఒకేలా చూస్తాడు కనుక). శనిని నవగ్రహాలలో ఒకనిగా చేసి జ్యేష్ఠాదేవికిచ్చి వివాహం జరిపించెను.అయితే త్రిమూర్తులు శనికి కొన్ని అధిపత్యాలు ఇచ్చారు. ఆయువుకి అధిపతిగా, జనులపై ఆతని ప్రభావం వుండేట్లుగా అన్న మాట. శివుడు అయితే శని, యముని ఒకటిగా చేసెను. అంటే యముడే శని, శనియే యముడులాగా!

శని మహత్యం

       శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .

       బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి.

శనీశ్వర జపం-శనీశ్వరుడి జప మంత్రాలు

“నీలాంజన సమాభాసం,  రవి పుత్రం యమాగ్రజం

ఛాయా మార్తాండ సంభూతం, తమ్ నమామి శనైశ్చరం”

|| ఓం శం శనయేనమ:||

|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||

|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||

శని గాయత్రీ మంత్రం:

ఓం కాకథ్వజాయ విద్మహే

ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.

|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||

బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన “నవగ్రహ పీడహర స్తోత్రం”:

||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: ||

||ఓం శం శనైస్కర్యయే నమః||

||ఓం శం శనైశ్వరాయ నమః||

||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః ||

||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:||

ఓం నమో శనైశ్వరా పాహిమాం,

ఓం నమో మందగమనా పాహిమాం,

ఓం నమో సూర్య పుత్రా పాహిమాం,

ఓం నమో చాయాసుతా పాహిమాం,

ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం,

ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం,

ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

సద్గురు కందుకూరి శివానందమూర్తి గారి పుణ్యతిథి

  (21-12-1928 —-10-06-2015)

       శివానందమూర్తి గారి జీవిత విశేషాలు : కందుకూరి శివానంద మూర్తి మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. భారతదేశం లోనూ, విదేశాల్లోనూ ఆయనకు ఎంతో మంది శిష్యులు, అభిమానులు ఉన్నారు. సంప్రదాయం, సంస్కృతి అంశాల మీద ఎన్నో పుస్తకాలు రచించారు.

       ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 1928, డిశంబర్ 21న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సర్వమంగళ, వీరబసవరాజులు శివభక్తులు, దాదాపు 200 శివాలయాలను నిర్మించారు. చిన్నతనం నుండి శివానందమూర్తి ఆధ్యాత్మిక విషయాల పట్ల, ముఖ్యంగా యోగశాస్త్రం పట్ల ఎంతో ఆసక్తి కనబర్చేవారు. 1949 లో సైన్సు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సభ ఆర్డినేట్ సర్వీస్ లో చేరారు. పోలీసు డిపార్టుమెంటులో హన్మకొండలో పని చేస్తున్నప్పుడు కూడా ఆర్తులకు, పేదవారిక సేవచేయడం పట్ల, హిందు ధర్మ బోధన పట్ల ఎక్కువ సమయం వెచ్చించే వారు. ఆఫీసరుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి సేవాకార్యక్రమాల పట్ల, సాంస్కృతిక సేవ పట్ల దృష్టి సారించారు.

     సమున్నతమైన భారతదేశం, సనాతన ధర్మంల వేళ్లూనుకున్న ప్రాచీన సంస్కృతి పట్ల ఆయనకు అమితప్రేమ. సన్యాసులతో సహా అందరూ ప్రజాసంక్షేమానికి ట్రస్టీలుగా, సంరక్షకలుగా తమ వంతు కర్తవ్యం నిర్వర్తించాలని తన ప్రసంగాల్లో తరుచూ చెబుతుంటారు. హిందు ధర్మం, దాని చరిత్ర, సంగీత సాహిత్యాలు, నాట్యనాటకాల విషయాల్లో ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం.

     రాజకీయ, సాంస్కృతిక ఆధ్యాత్మిక చరిత్ర మీద ఆయన రాసిన వ్యాసాలు ఒక తెలుగు డైలీలో ప్రచురితమై తరువాత భారతీయత పేరిట రెండు సంపుటాలుగా ముద్రితమయ్యాయి. కఠోపనిషత్ మీద ఆయన రాసిన కఠయోగ అన్న పుస్తకం బహథా ప్రశంసలు అందుకని, కంచి పీఠం పరమాచార్య, శృంగేరీ శంకరాచార్యుల మన్ననలను చూరగొంది. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన డేవిడ్ ఫ్రాలీ “అద్వైతం, జ్ఞానం, యోగం, దాని అంతర్వాహినుల గురించి తెలిసిన విశిష్ఠమైన వ్యక్తి శివానంద మూర్తి” అన్నారు. హిందూ వివాహ వ్యవస్థ (2006), మహర్షుల చరిత్ర (2007), గౌతమబుద్ధ (2008) ఆయన ఇతర రచనల్లో ముఖ్యమైనవి. సరైన జీవన విధానం పట్ల సామాన్యుడికి స్ఫూర్తినిస్తూ ఆంధ్రభూమిలో ఆయన రాసిన 450 పైగా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పురాణాలు, కావ్యాలు, సాహిత్య గ్రంథాల నుంచి ఆంధ్రదేశ చరిత్రను క్రోడీకరించి మనకథ పేరిట గ్రంథస్తం చేశారు. ఇది హైదరాబాదు దూరదర్శన్ లో 13 భాగాలుగా ప్రసారమైంది.

     భారతీయ కళలను కాపాడుకోవాలనే తపనతో విశాఖపట్నం, భీమిలిలో ఏర్పాటు చేసిన ఆనందవనం ద్వారా ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించారు. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టుకు ఆయన ప్రధాన ధర్మకర్త. భారతీయ సంప్రదాయ సంగీతాన్ని, నాట్యాన్ని ప్రోత్సహించేందుకు శివానంద కల్చరల్ ట్రస్ట్, ఆంధ్రా మ్యూజిక్ అకాడెమీలను నెలకొల్పి తెలుగు రాష్ట్రాలు సహా ఎన్నో ప్రాంతాలలో సాంస్కృతిక, కళారంగాలకు విశిష్ట సేవలందించారు. రికార్డింగుల కోసం ఆనందవనం ఆశ్రమంలో అత్యాధునికమైన రికార్డింగ్ హాల్ ను నిర్మించారు. ఇక్క డ వర్క్ షాపులను నిర్వహిస్తుంటారు. లలిత కళలు, సాంకేతికం, విజ్ఞానం, వైద్యం, జర్నలిజం, మానవశాస్త్రాలు, ఇతర రంగాల్లో కృషి చేసిన వారిని ఈ ట్రస్టు ఒక వేదిక మీదకు తీసుకుని వచ్చిన సన్మానిస్తూ ఉంటారు. ప్రతి ఏటా హైదరాబాదులో ఈ అకాడెమీ సంగీతోత్సవాలను నిర్వహిస్తుంది.

   చెన్నైలోని శ్రీరాజలక్ష్మి ఫౌండేషన్ ఆయనను 2000 లో రాజలక్ష్మి ఆవార్డుతో, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సన్మానించాయి.

    శివానందమూర్తి గారు చిన్నప్పటి నుండే ఆయనలో ఆధ్యాత్మిక లక్షణాలు కలిగి ఉండేవారని ఆయన గురించి బాగా తెలిసినవారు చెపుతుంటారు. అత్యంత నిరాడంబరంగా ఉండే ఆయన ప్రచారార్భాటాలకి దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక భోధనలు చేసేవారు. ఆయన ప్రవచనాలు ప్రధానంగా సనాతన ధర్మం మీదనే సాగుతుంటాయి. సనాతన ధర్మాన్ని చిత్త శుద్దితో పాటిస్తే భారతదేశానికి పునర్వైభవం సిద్ధిస్తుందని చెబుతుంటారు. సనాతన ధర్మాచారం వల్ల విలువలు ఏర్పడి ఆత్మగౌరవం ఇనుమడిస్తుందని అంటారు.

     సద్గురు శివానందమూర్తి గారు 10-06-2015 బుధవారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా మూలుగురోడ్డులో గల గురుకుల ధామ్ లో 2.30 గంటలప్పుడు ఆయన కన్నుమూశారు. 87 ఏళ్ల వయసు గల ఆయన గత కొంతకాలంగా వృద్దాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శివానందమూర్తి గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయన కుమారుడికి ఫోన్ చేసి సద్గురు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎండల ధాటికి ఆయన అస్వస్థులయ్యారు. అప్పటి నుండి ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. చివరికి 10-06-2015, బుధవారం రోజు తెల్లవారుజామున ఆయన కైలాసప్రాప్తి చెందారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)    

Categories
Vipra Foundation

దాశరథి రంగాచార్యులు గారి వర్ధంతి

(ఆగస్టు 24, 1928 – జూన్ 8, 2015)

       దాశరథి రంగాచార్యులు విఖ్యాత రచయిత, ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు.

జీవిత విశేషాలు : దాశరథి రంగాచార్యులు 1928, ఆగస్టు 24 న ఖమ్మం జిల్లా లోని చిట్టి గూడూరు లో జన్మించారు. ఆయన అన్న ప్రముఖ కవి, సాయుధపొరాట యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధపోరాట కాలంలో ఉపాధ్యాయునిగా, గ్రంథపాలకునిగా పనిచేశారు. సాయుధపోరాటం ముగిసాకా సికిందరాబాద్ పురపాలక కార్పోరేషన్లో 32 ఏళ్ళు పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు.

ఉద్యమ రంగం : నైజాం రాజ్యంలో నిజాం పాలన కాలంలో జన్మించిన దాశరథి రంగాచార్య ఎదుగుతూండగా ఆంధ్రమహాసభ, ఆర్య సమాజాలు వేర్వేరుగా నిజాం పాలనలోని లోపాలను ఎదుర్కొంటున్న తీరుకు ఆకర్షితులయ్యారు. తండ్రి సనాతనవాది ఐనా అన్నగారు ప్రఖ్యాత కవి, అభ్యుదయవాది కృష్ణమాచార్యుల సాంగత్యంలో అభ్యుదయ భావాలను, విప్లవ భావాలను అలవర్చుకున్నారు. అసమానతలకు, అణచివేతకు నిలయంగా మారిన నాటి నైజాం సమాజాన్ని గమనించి పెరిగిన రంగాచార్యులు 1945ల్లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు.

       తండ్రి కుటుంబ కలహాల్లో భాగంగా తల్లినీ, తమనూ వదిలివేయడంతో అన్నతో పాటుగా ఉంటున్న రంగాచార్యులకు ఆపై సాయుధ పోరాటంలో కృష్ణమాచార్యులను అరెస్టు చేయడంతో కౌమార ప్రాయం ముగిసేలోపే కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. కుటుంబ బాధ్యతల కారణంగా గ్రంథపాలకునిగా, ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే ఆనాటి సమాజంలో అసమానతల గురించి ప్రజలను చైతన్యపరిచారు. ఆ క్రమంలో రంగాచార్యుల కుటుంబంపై నైజాం ప్రభుత్వ అనుకూలురు, భాగస్వాములు దాడిచేసినా వెనుదీయలేదు. పోరాటం కీలకదశకు చేరుకున్న కాలానికి ఆయన కాంగ్రెస్ దళంలో చేరి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రంగాచార్యులు తుపాకీ బుల్లెట్టు దెబ్బ తప్పించుకుని ప్రాణాపాయాన్ని కూడా ఎదుర్కొన్నారు.

సాహిత్య రంగం : తెలంగాణా సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన బానిస పద్ధతులను దాశరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం నవలల్లో చిత్రీకరించారు. చిల్లర దేవుళ్లు నవలలో సాయుధపోరాటం ముందు స్థితిగతులు, మోదుగుపూలు నవలలో తెలంగాణ సాయుధ పోరాటకాలం నాటి పరిస్థితులు, అనంతర పరిస్థితులు “జనపదం”లో అక్షరీకరించారు.

       వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి, గంగు వంటి నవలల ద్వారా నాటి జీవన చిత్రణ చేయాలనే ప్రయత్నం ప్రారంభించారు. ఆ నవలల ప్రణాళిక పూర్తి కాకుండానే ఆళ్వారు స్వామి మరణించారు. సాయుధపోరాట యోధులుగా, సాహిత్యవేత్తలుగా ఆళ్వారుస్వామికీ, రంగాచార్యులకూ సాన్నిహిత్యం ఉండేది. పోరాటానికి పూర్వం, పోరాట కాలం, పోరాటం అనంతరం అనే విభజనతో నవలలు రాసి పోరాటాన్ని నవలలుగా రాసి అక్షరీకరించాలనీ, అది పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సాహిత్యవేత్తలపై ఉన్న సామాజిక బాధ్యత అనే అభిప్రాయాలను వారిద్దరూ పంచుకున్నవారే కావడంతో ఆళ్వారుస్వామి మరణానంతరం ఆ బాధ్యతను రంగాచార్యులు స్వీకరించారు. ఆ నవలా పరంపరలో తొలి నవలగా 1942వరకూ ఉన్న స్థితిగతులు “చిల్లర దేవుళ్లు”లో కనిపిస్తాయి.

       నాణానికి మరోవైపు చూస్తే తెలంగాణ పోరాటం ముగిసిన దశాబ్దికి కొందరు నిజాం రాజును మహనీయునిగా, ఆ నిజాం రాజ్యస్థితిగతులను ఆదర్శరాజ్యానికి నమూనాగా పలు రాజకీయ కారణాల నేపథ్యంలో కీర్తించారనీ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకుని, ప్రాణాన్ని లెక్కచేయక నిజాంను ఎదిరించిన తమకు ఆనాటి దుర్భర స్థితిగతుల్ని ఇలా అభివర్ణిస్తూంటే ఆవేశం వచ్చేదని రంగాచార్య ఒక సందర్భంలో పేర్కొన్నారు. నిజాం రాజ్యంలో బానిసల్లా జీవించిన ప్రజల స్థితిగతులను, మానప్రాణాలను దొరలు కబళించిన తీరును ఆ నేపథ్యంలో ప్రపంచమే ఆశ్చర్యపోయేలా సాగిన తెలంగాణా సాయుధపోరాటం, పోరాటానంతర స్థితిగతులు వంటివి భావితరాలకై అక్షరరూపంగా భద్రపరచదలిచిన ఆళ్వారుస్వామి ప్రణాళికను స్వీకరించినట్టు రచయిత తెలిపారు.

       తొలుత కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమైన రంగాచార్యులు తదనంతర కాలంలో ఆధ్యాత్మిక భావాలను అలవరుచుకున్నారు. ఈ నేపథ్యంలో రంగాచార్యులు శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతాలను సరళంగా తెలుగులో రచించారు. పాత్రికేయులు ఎ.బి.కె.ప్రసాద్ ప్రోద్బలంతో ఆత్మకథ “జీవన యానం” రచించారు. అనంతర కాలంలో తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించారు. వేదాలకు ప్రవేశికగా వేదాలు మానవజాతి అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపాయో, నేటి యాంత్రిక నాగరికతకు వేదసాహిత్యంలో ఎటువంటి సమాధానలు ఉన్నాయో వివరిస్తూ “వేదం-జీవన నాదం” రచించారు.

ఇవే కాక ఇతర నవలలు, వ్యాసాలు, పుస్తకాలు కలిపి ఎన్నో పుటల సాహిత్యాన్ని సృష్టించారు.

విశిష్టత, ప్రాచుర్యం : దాశరథి రంగాచార్యులు రాసిన “చిల్లర దేవుళ్లు” నవల సినిమాగా తీశారు. టి.మధుసూదనరావు దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. పలు భాషలలోకి అనువాదమైంది. రేడియో నాటకంగా ప్రసారమై బహుళప్రాచుర్యం పొందింది.

       దాశరథి రంగాచార్యులు విశిష్టమైన సాహిత్యాన్ని సృష్టించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలంగాణ పోరాట క్రమానికి నవలల రూపం కల్పించడం, తెలంగాణ ప్రాంత చారిత్రిక, సామాజిక, రాజకీయ పరిణామాలకు ప్రతిబింబంగా రచించిన ఆత్మకథ “జీవనయానం” వంటివి సాహిత్యంపై చెరగని ముద్ర వేశాయి. వేదం లిపిబద్ధం కారాదనే నిబంధనలు ఉండగా ఏకంగా తెలుగులోకి అనువదించడం వంటి విప్లవాత్మకమైన పనులు చేపట్టారు. తెలుగులోకి వేదాలను అనువదించిన వ్యక్తిగా ఆయన సాహిత్యచరిత్రలో స్థానం సంపాదించుకున్నారు.

పురస్కారాలు, సత్కారాలు : దాశరథి రంగాచార్యుల “చిల్లర దేవుళ్లు” నవలకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందారు. వేదాలను అనువదించి, మహాభారతాన్ని సులభవచనంగా రచించినందు వల్ల రంగాచార్యులను అభినవ వ్యాసుడు బిరుదు ప్రదానం చేశారు. 21-1-1994న ఖమ్మంలో సాహితీ హారతి ఆధ్వర్యంలో వెండి కిరీటాన్ని పెట్టి రంగాచార్యులు దంపతులకు సత్కరించారు. వేదానువాదం, ఇతర విశిష్ట గ్రంథాల రచన సమయంలో దాశరథి రంగాచార్యులకు విశేషమైన సత్కారాలు, సన్మానాలు జరిగాయి.

మరణం : డాక్టర్ దాశరథి రంగాచార్య (86)గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై సోమాజిగుడాలోని యశోదా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న దాశరథి (86) 2015, జూన్ 8 సోమవారం ఉదయం కన్నుమూశారు.

రచనలు : రంగాచార్యులు నవలలు, ఆత్మకథ, వ్యాసాలు, జీవిత చరిత్రలు, సంప్రదాయ సాహిత్యం తదితర సాహితీప్రక్రియల్లో ఎన్నో రచనలు చేశారు.

నవలలు:-

మోదుగుపూలు

చిల్లర దేవుళ్ళు

జనపథం

రానున్నది ఏది నిజం?

అమృతంగమయ

జీవనయానం

అనువాదాలు

నాలుగు వేదాల అనువాదం

ఉమ్రావ్ జాన్

జీవిత చరిత్ర రచన

శ్రీమద్రామానుజాచార్యులు

బుద్ధుని కత

శ్రీమద్రామాయణం

శ్రీ మహాభారతం

వేదం-జీవన నాదం

శతాబ్ది

        తెలుగు సాహితీరంగానికి ఎనలేని సేవచేసిన శ్రీ దాశరథి రంగాచార్యగారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం..

       మహాయోధుడు, సాహితీవేత్త, తెలంగాణా సాయుధ పోరాట యోధుడికి, బ్రాహ్మణ సేవా సమితి నివాళులు సమర్పిస్తోంది.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

హనుమజ్జయంతి శుభాకాంక్షలు

యత్ర యత్ర రఘునాథకీర్తనం – తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్

భాష్పవారి పరిపూర్ణలోచనం – మారుతిం నమత రాక్షశాంతకామ్

       “యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును”

       శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మదినం వైశాఖ బహుళ దశమి రోజున (కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజున) జరుపుకుంటారు. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు.

       మన భారతదేశములో పల్లెలు, పట్టణాలు అని భేదము లేకుండా ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని శిలా విగ్రహరూపంతో కూడిన ఆలయమో లేకుండా ఉండవు అనుటలో అతిశయోక్తిలేదేమో! అటువంటి శ్రీహనుమంతుని జన్మవృత్తాంత విశేషాలు ఏమిటో సమీక్షగా తెలుసుకుందాం! వీటిలోను అనేక విభిన్న గాధలు కానవసన్నాయి.

        ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షస మూకకు, దుర్మార్గుల పాలిట యమునిగా తాను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని చెబుతారు. సుగ్రీవుని దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సమీపిస్తున్నప్పుడు తొలిసారిగా వారికంట పడ్డాడు హనుమంతుడు. మరుక్షణంలో శ్రీరాముని హృదయం చూరగొన్నాడు. ఆ స్థితి ఆయన రామచంద్రుని కోరి పొందిన వరం. నిరంతరం రామనామ సంకీర్తనా తత్పరుడు మారుతి. అందుకే రామభక్తులలో ఆయనకొక్కనికే పూజార్హత లభించింది.

       ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన “పుంజికస్థల ” అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు “వానరస్త్రీ” గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు “హనుమంతునికి” జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము.

        ఆ శాపకారణంగా “పుంజికస్థల” భూలోకమందు వానరకన్యగా జన్మించి “కేసరి” అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన “శ్రీ ఆంజనేయస్వామి” వారికి జన్మ ఇచ్చింది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా! దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏక సంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా! నీవు “సుగ్రీవుని” వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగాకోరెను.అందువల్ల హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగెను.

        ఇక రామాయణ గాధలో సీతాన్వేషణ సమయమందు “శ్రీ ఆంజనేయస్వామి” వారి పాత్ర అత్యంత ప్రశంసనీయమైనది. నిరంతరము శ్రీరామపాదారవిందములు కొలుస్తూ “శ్రీరామనామజప” మాధుర్యాన్ని గ్రోలుతూ స్వామిభక్తి పరాయణుడై నవ్యవ్యాకరణ పండితుడుగా, నీతిశాస్త్ర, తత్వశాస్త్ర, వాస్తుశాస్త్ర కోవిదుడుగా, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా బుద్ధి పరాక్రమాలు చూపుతూ శ్రీరామ పాదసేవతో “సానపట్టిన వజ్రము” వలె వెలుగొందసాగెను. ఈతనిని పవనపుత్ర, కేసరి, వాయునందన, వజ్రకాయ, మారుతి అను పలు నామాలతో కీర్తిస్తూ ఉంటారు.

        కారణజన్ముడైన శ్రీ హనుమంతుడు అంతటి శక్తియుక్తులు కలవాడు కాబట్టి, సీతాన్వేషణలో సఫలీకృతుడై రామ-రావణ యుద్ధసమయములో మూర్ఛపోయిన లక్ష్మణుని బ్రతికించుటకు సంజీవని తెచ్చుటవంటి పలుకార్యక్రమములతో హనుమంతుని యొక్క ఆదర్శవంతమైన స్వామిభక్తి, త్యాగనిరతి, ధైర్య సాహసోపేత కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకుని శ్రీరామునిచే “ఆలింగనభాగ్యము” అందుకున్న భాగ్యశీలి అయినాడు. అంతటి మహత్ భాగ్యము మరి ఎవరికి దక్కుతుందో చెప్పండి. “హనుమజ్జయంతి” నాడు శ్రీ స్వామివారికి అష్టోత్తరంతో విశేషపూజలు, శ్రీరామ భజనలు, సుందరకాండ, హనుమాన్ చాలీసా, వంటి పారాయణలు గావించాలి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

“””” తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు “””

          బంధు మిత్రులకు, హితులకు, శ్రేయోభిలాషులకు “తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు”.

    –    వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

నందమూరి తారక రామారావు జయంతి

(1923 మే 28 – 1996 జనవరి 18)

      తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేసారు. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు.

బాల్యము, విద్యాభ్యాసము

     నందమూరి తారక రామారావు 1923, మే 28 వ తేదీన, సాయంత్రం 4:32కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది.

కుటుంబం

      1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకంను పెళ్ళి చేసుకున్నాడు.

తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలొ ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా; గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.

చలనచిత్ర జీవితం

     రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్నికారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్తవయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేసాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు.

     రామారావు 1947లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం ఆయన మద్రాసు సర్వీసు కమీషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు.

     ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే ఆయనను మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే ఆయన తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. అంచేత ఆయన మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది. 1949లో వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించాడు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు షావుకారు కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశాడు. థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవాడు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ (తరువాతి కాలంలో నిర్మాత అయ్యాడు) కూడా ఉండేవాడు.

రాజకీయ ప్రవేశం

     1978లో ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన కాంగ్రేసు పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో శాసనసభ్యులచేత నామకార్థం ఎన్నిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలయింది.

     1981లో ఊటీలో సర్దార్‌ పాపారాయుడు చిత్రం షూటింగు విరామసమయంలో ఒక విలేఖరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా? ఆని అడిగాడు. దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగుప్రజల సేవకోసం కేటాయిస్తాను అని చెప్పాడు. ఆయన చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం.

     అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసాడు. 1982 మార్చి 21 న హైదరాబాదు వచ్చినప్పుడు అభిమానులు ఆయనకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 సాయంత్రము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పాడు. ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించాడు. పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు. దానిపై నుండే ఆయన తన ప్రసంగాలు చేసేవాడు. దానిని ఆయన “చైతన్యరథం” అని అన్నాడు. ఆ రథంపై “తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!” అనే నినాదం రాయించాడు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్యరథమే స్ఫూర్తి.

రాజకీయ ఉత్థాన పతనాలు

     1983 శాసనసభ ఎన్నికల్లో ఆయన సాధించిన అపూర్వ విజయం ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం. అధికారం చేపట్టిన తరువాత, అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ తగ్గింపు వీటిలో ప్రధానమైనది. ఈ నిర్ణయాల కారణంగా చాలా వేగంగా ప్రజాభిమానం కోల్పోసాగాడు. 1984 ఆగష్టు 16 న నాదెండ్ల భాస్కరరావు, అప్పటి గవర్నరు రాంలాల్, ప్రధానమంత్రి ఇందిరా గాంధీల లోపాయికారీ సహకారంతో రామారావును అధికారం నుండి తొలగించి, తాను దొడ్డిదారిన గద్దెనెక్కడంతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్ళాడు. జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు ఆయనకు ఎంతో సహాయం చేసాయి. ఫలితంగా సెప్టెంబర్ 16 న రామారావును తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్టించడం కేంద్రప్రభుత్వానికి తప్పింది కాదు. నెలరోజుల్లోనే, ఆయన ప్రభ తిరిగి శిఖరాగ్రానికి చేరిన సందర్భమిది.

     1985-89 మధ్య కాలంలో తన ఏకస్వామ్యపాలన వలన ఎన్టీఆర్ ఎంతో అప్రదిష్ట పాలయ్యాడు. పార్టీలోను, ప్రభుత్వంలోను అన్నీ తానే అయి నడిపించాడు. ప్రజల్లో నిరసన భావం కలగడానికి ఇది ప్రధాన కారణమైంది. 1989లో ఎన్నికలకు కొద్ది నెలల ముందు మొత్తం మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరచి కొత్త మంత్రుల్ని తీసుకున్నాడు. ఈ కాలంలో జరిగిన కొన్ని కులఘర్షణలు కూడా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసాయి. 1989 ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెసు తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించి తిరిగి అధికారానికి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినా భారత దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రేసుకు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ విజయం సాధించాడు. 1991 లో నంద్యాల లోక్‌సభ ఉప ఎన్నికలలో కాంగ్రెసు తరపున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు నిలబడగా, ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవరినీ పోటీగా నిలబెట్టలేదు.

     1994లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మధ్య నిషేధం, వంటి హామీలతో, మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారంపడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచాడు. అయితే ఆయన రెండవ భార్య లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగజేసుకోవటం వలన ఆయన చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చింది. పార్టీలో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు. పార్టీలో ముదిరిన సంక్షోభానికి పరాకాష్టగా ఆయన అల్లుడు, ఆనాటి మంత్రీ అయిన నారా చంద్రబాబునాయుడు తిరుగుబాటు చేసాడు. అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. అనతికాలంలోనే, 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించాడు. ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

నారద జయంతి – పాత్రికేయు దినోత్సవ శుభాకాంక్షలు

నిరంతరం త్రిలోక సంచారం చేస్తూ ధర్మ రక్షణ, లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సమాచారాన్ని, విజ్ఞానాన్ని ఆయా ప్రాంత విశేషాలను అందరికి తెలుపుతూ, ఏమైనా సమస్యలుంటే వాటిని గుర్తించి ఎవరి ద్వార పరిష్కరించవచ్చో వాళ్ళ దృష్టికి తీసుకొనివెళ్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపిన దేవర్షి నారదుడి లాగే సమాజ హితం కోసం నేటి పాత్రికేయులు వృత్తి నిబద్ధతతో, ఆత్మవిశ్వా సంతో కృషి చేస్తుంటారు. అందుకే నారద జయంతిని పాత్రికేయుల దినోత్సవంగా  జరుపుకోవడం మన ఆనవాయితీ. అందరికీ నారద జయంతి శుభాకాంక్షలు మరియు పాత్రికేయులందరికీ పాత్రికేయు దినోత్సవ శుభాకాంక్షలు.

నారద – నారం దదాతి ఇతి నారదః – జ్ఞానాన్ని ప్రసాదించే వాడు నారదుడు అని అర్థం. బ్రహ్మ మానస పుత్రుడైన నారద మునీంద్రుడు నిరంతరం నారాయణ నామ స్మరణ చేస్తూ, ముల్లోకాలలో సంచరిస్తారంటారు. వివిధ లోకాలలో జరిగే విశేషాలన్నింటినీ మూడులోకాల వాసులతో పంచుకునేట్లుగా పురాణాల్లో నారదుని పాత్ర చిత్రీకరణ జరిగింది, అయితే నారద ముని చెప్పే సంగతుల వల్ల ఏదో సమస్యలు తలెత్తుతున్నట్లు తొలుత కనిపించినప్నటికీ అవన్నీ లోక కళ్యాణ కారకాలే.

నారదుని పూర్వ జన్మ వృత్తాంతం :- మహాభాగవతం మొదటి స్కంధంలో వారదుడు తన గాథను స్వయంగా వేద వ్యాసునికి తెలిపాడు. తాను పూర్వ జన్మ పుణ్య కారణంగా హరికథా గానం చేస్తూ ముల్లోకాలలో సంచరింపగలుగుతున్నానని చెప్పాడు. పూర్వ కల్పంలో నారదుడు వేదవిదులైన వారింట పని చేసే ఒక దాసికి కుమారుడు. ఒకమారు అతడు చాతుర్మాస్య వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు. వారు సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం ఉపదేశించారు. వారి దయవలన ఆ బాలుడు వాసుదేవుని అమేయ మాయాభావాన్ని తెలుసుకొన్నాడు. ప్రణవంతో కలిపి వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ మూర్తులను స్మరించి నమస్కరించినట్లయితే సమ్యగ్దర్శనుడౌతాని గ్రహించాడు. అతని తల్లి ఒకనాడు పాము కాటువల్ల మరణించింది. అప్పుడు నారదుడు అన్ని బంధములనుండి విముక్తుడై అడవికి పోయి భగవత్స్వరూపాన్ని ధ్యానించ సాగాడు. ఏకాగ్ర ధ్యాన సమయంలో అతని మనస్సులో భగవత్స్వరూపం గోచరించింది. కాని మరుక్షణమే అంతర్ధానమైంది. చింతాక్రాంతుడై నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి దివ్యవాణి ఇలా ఆదేశమిచ్చింది – ఈ జన్మలో నీవు నన్ను పొందలలేవు. కాని నా దర్శనం వల్ల నీ సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరింది. ఈ శరీరం త్యజించిన పిమ్మట నా పార్షదుడవై నన్ను పొంద గలవు. – నారదుడు సంతుష్టుడై నిరంతరం హరి నామ జపం చేస్తూ కాలం గడిపి, అంతిమ సమయం ఆసన్నమైనపుడు తన దేహాన్ని త్యజించాడు.

అనంతరం ప్రళయ కాలం సమీపించగా ఒక సముద్రంలా ఉన్న ఆ జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మ శ్వాసలో ప్రవేశీంచి ఆయనలో లీనమయ్యాడు. వేయి యుగాల కాలం తరువాత బ్రహ్మ లేచి లోకాలను సృష్టించడం ఆరంభించినపుడు బ్రహ్మ ప్రాణములనుండి మరీచి మొదలైన మునులతోబాటు నారదుడు కూడా జన్మించాడు. కనుకనే నారదుని బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు. అలా నారదుడు అఖండ దీక్షాపరుడై విష్ణువు అనుగ్రహం వలన నిరాటంకంగా సంచరించగలుగుతుంటాడు. తాను స్మరించగానే నారాయణుని రూపం అతని మనసులో సాక్షాత్కరిస్తుంది. ఇలా తన కథ చెప్పి హరికథా గానంతో నిండి వున్న భాగవతాన్ని రచించమని నారదుడు వేద వ్యాసునికి ఉపదేశించాడు.

మహాభారతంలో వర్ణన : – మహా భారతం సభాపర్వంలో నారదుని గురించి ఇలా చెప్పబడింది – ఇతడు వేదోపనిషత్తులను, పురాణాలను బాగా తెలిసినవాడు. దేవతలచే పూజితుడు. కల్పాతీత విశేషాలనెఱిగినవాడు. న్యాయ ధర్మ తత్వజ్ఞుడు. శిక్షా కల్ప వ్యాకరణాలు తెలిసినవారిలో శ్రేష్టుడు. పరస్పర విరుద్ధములైన వివిధ విధి వాక్యాలను సమన్వయపరచగల నీతిజ్ఞుడు. గొప్ప వక్త, మేధావి. జ్ఞాని, కవి, మంచి చెడులను వేరు వేరుగా గుర్తించుటలో నిపుణుడు. ప్రమాణముల ద్వారా వస్తు తత్వమును నిర్ణయించుటలో శక్తిశాలి. న్యాయవాక్యముల గుణదోషముల నెఱిగినవాడు. బృహస్పతి వంటి విద్వాంసుల సందేహములు కూడా తీర్చగల ప్రతిభాశాలి. ధర్మార్ధకామమోక్షముల యధార్ధ తత్వమునెరిగినవాడు. సమస్త బ్రహ్మాండములయందును, ముల్లోకములయందును జరుగు సంఘటనలను తన యోగబలముచే దర్శింపగలడు. సాంఖ్యయోగ విభాగములు తెలిసినవాడు. దేవ దానవులకు వైరాగ్యమును ఉపదేశించుటలో చతురుడు. సంధి విగ్రహ తత్వములు తెలిసినవాడు. కర్వ్య, అకర్తవ్య విభాగము చేయగల దక్షుడు. రాజనీతికి సంబంధించిన ఆరు గుణములలో కుశలుడు. సకల శాస్త్ర ప్రవీణుడు. యుద్ధ విద్యా నిపుణుడు. సంగీత విశారదుడు. భగవద్భక్తుడు. విద్యాగుణనిధి. సదాచారములకు ఆధారమైనవాడు. లోక హితకారి. సర్వత్ర సంచరింపగలవాడు.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

జవాహర్ లాల్ నెహ్రూ వర్ధంతి

(నవంబర్ 14, 1889 – మే 27, 1964)

         పండిట్ జవహర్లాల్ నెహ్రూ 14 నవంబర్ 1889న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించారు. ఆయన తొలి విద్యాభ్యాసం ఇంటి దగ్గర ప్రైవేటు ఉపాధ్యాయుల వద్దే నడిచింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం 15 ఏళ్ల వయసులో నెహ్రూ ఇంగ్లండ్కు వెళ్లారు. కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో ప్రకృతిశాస్త్రాలను చదివారు. అనంతరం ఇన్నర్టెంపుల్ అనే పేరున్న ప్రఖ్యాత న్యాయ విద్యాసంస్థలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. విద్యార్థిగా ఉన్న ఈ దశలోనే నెహ్రూ.. విదేశీ పాలనలో మగ్గుతున్న వివిధ దేశాల జాతీయ పోరాటాలను అధ్యయనం చేశారు. నాడు ఐర్లాండ్లో జరుగుతున్న షిన్ ఫెయిన్ ఉద్యమాన్ని ఆసక్తితో గమనించారు. ఈ అనుభవంతో 1912లో స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ఆయన స్వాతంత్రోద్యమంలోకి చేరారు.

       1912లో బీహార్లోని బంకీపూర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ప్రతినిధిగా నెహ్రూ హాజరయ్యారు. అనంతరం 1916లో మహాత్మాగాంధీని తొలిసారిగా కలిశారు. ఆ తొలి సమావేశంలోనే గాంధీజీ ప్రభావం ఆయనపై అమితంగా పడింది. హోంరూల్ లీగ్ అలహాబాద్ శాఖకు నెహ్రూ 1919లో కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1920లో ఆయన ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో మొట్టమొదటిసారిగా రైతుల ర్యాలీని నిర్వహించారు. అనంతరం ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమం సందర్భంగా 1920-22 మధ్య కాలంలో నెహ్రూ రెండుసార్లు జైలుకు వెళ్లారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నెహ్రూ 1923 సెప్టెంబర్లో ఎన్నికయ్యారు. 1926లో ఇటలీ, స్విట్జర్లాండ్, ఇంగ్లండ్, బెల్జియం, జర్మనీ, రష్యా దేశాలలో పర్యటించారు. బెల్జియంలో జరిగిన ” అణ‌గారిన‌ జాతుల మహాసభలకు” భారత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా హాజరయ్యారు. అదే ఏడాది మద్రాస్లో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో.. దేశస్వాతంత్ర్య సాధనకు పోరాడే సంకల్పాన్ని కాంగ్రెస్ తీసుకోవటంలో నెహ్రూ కీలకపాత్ర పోషించారు. 1927లో రష్యాలోని మాస్కోలో జరిగిన సోషలిస్టు విప్లవం 10వ వార్షికోత్సవాలకు హాజరయ్యారు. 1928లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లక్నోలో ఒక ప్రదర్శన నిర్వహిస్తూ బ్రిటీష్ పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తిన్నారు. 29 ఆగస్టు 1928న జరిగిన అఖిలపక్ష కాంగ్రెస్కు నెహ్రూ హాజరయ్యారు. భారత రాజ్యాంగ సంస్కరణలపై తన తండ్రి మోతీలాల్నెహ్రూ రూపొందించిన నివేదికపై ఇతర నేతలతో కలిసి నెహ్రూ సంతకం చేశారు. అదే ఏడాది ”భారత స్వాతంత్ర్య లీగ్ ” అనే సంస్థను స్థాపించి దాని ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్తో సంబంధాలను పూర్తిగా తెంచేసుకోవాలని ఈ సంస్థ డిమాండ్ చేసింది.

1929లో లాహోర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో నెహ్రూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే తీర్మానాన్ని ఈ మహాసభల్లోనే ఆమోదించారు. 1930-35 మధ్యకాలంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంతోపాటు ఇతర అనేక నిరసన కార్యక్రమాల సందర్భంగా నెహ్రూ పలుమార్లు అరెస్టై జైలుకెళ్లారు. 14 ఫిబ్రవరి 1935న అల్మోరా జైలులో తన జీవితచరిత్ర పుస్తక రచనను నెహ్రూ ముగించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత.. స్విట్జర్లాండ్లో అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి వెళ్లారు. అక్కడి నుంచి 1936 ఫిబ్రవరి-మార్చిలో లండన్కు వెళ్లారు. 1938లో అంతర్యుద్ధం మధ్యన ఉన్న స్పెయిన్లో పర్యటించారు. రెండో ప్రపంచయుద్ధం మొదలుకావటానికి కొంతకాలం ముందు చైనాకు కూడా వెళ్లి వచ్చారు.

        రెండో ప్రపంచయుద్ధంలో భారతదేశాన్ని బలవంతంగా పాల్గొనేలా చేయటాన్ని నిరసిస్తూ 31 అక్టోబర్ 1940న నెహ్రూ వ్యక్తిగత సత్యాగ్రహం చేశారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇతర నేతలతో కలిసి 1941 డిసెంబరులో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో నెహ్రూ చారిత్రక ”క్విట్ ఇండియా” తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1942 ఆగస్టు 8న ఆయనను మరోసారి అరెస్టు చేసి అహ్మద్నగర్ కోట జైలుకు తరలించారు. ఇదే ఆయన జీవితంలో అత్యంత సుదీర్ఘకాలపు, ఆఖరి నిర్బంధం. మొత్తంగా నెహ్రూ తొమ్మిదిసార్లు జైలుకు వెళ్లారు. 1945 జనవరిలో ఆయన విడుదలయ్యారు. ”ఇండియన్ నేషనల్ ఆర్మీ”కి చెందిన అధికారులు, సైనికులపై బ్రిటీష్ ప్రభుత్వం మోపిన కుట్ర అభియోగాలను ఎదుర్కోవటానికి నెహ్రూ న్యాయవాదులను సమన్వయపరిచారు. 1946 మార్చిలో ఆగ్నేయాసియాలో పర్యటించారు. 1946 జులై 6న కాంగ్రెస్కు అధ్యక్షునిగా నాలుగోసారి ఎన్నికయ్యారు. 1951 నుంచి 1954 వరకూ మరో మూడు ప‌ర్యాయాలు ఆయ‌న తిరిగి ఈ ప‌ద‌విని చేప‌ట్టారు.

       చైనా భారత యుద్ధం ప్రారంభించిన కొద్ది రోజులలోనే చైనా సైన్యం ఈశాన్య భారత దేశంలోనిఅస్సాం వరకు చొచ్చుకు రావడం భారత సైన్య బలహీనతను బహిర్గత పరచింది.భద్రతపై అయన ప్రభుత్వ నిర్లక్ష్యానికి తీవ్ర విమర్శలు ఎదుర్కొని,రక్షణ మంత్రి అయిన కృష్ణ మీనన్ను తొలగించి, యు.ఎస్. సైనికసహాయం అర్దించవలసి వచ్చింది. క్రమంగా నెహ్రూ ఆరోగ్యం మందగించ సాగింది, కోలుకోవడానికి అయన 1963 లో కొన్ని నెలలు కాశ్మీర్లో గడపవలసి వచ్చింది. కొంతమంది చరిత్ర కారులు ఈ ఆకస్మిక ఇబ్బందికి కారణం చైనా దండయాత్ర వలన అయన పొందిన అవమానం మరియు విశ్వాస ఘాతుకంగా భావిస్తారు కాశ్మీర్ నుండి తిరిగి వచ్చిన తరువాత నెహ్రూ గుండెపోటుతో బాధపడి తరువాత మరణించారు. 27 మే 1964 వేకువ సమయంలో ఆయన మరణించారు. హిందూమత కర్మల ననుసరించి యమునా నది ఒడ్డున గలశాంతివన్లో నెహ్రూ అంత్య క్రియలు జరుపబడ్డాయి.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)