ప్రతీ సంవత్సరం ఆత్మీయుజ బహుళ తదియనాడు ఈ చంద్రోదయ ‘‘ఉమావ్రతం – అట్లతద్ది” ని స్త్రీలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. సాధారణంగా కొన్ని వ్రతాలు పెళ్లయిన స్త్రీలు మాత్రమే పెట్టాల్సి వుంటుంది. అయతే ఈ వ్రతం మాత్రం వయస్సుతో ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా… చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు అందరు కలిసి చేసుకుంటారు.
తమ జీవితంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా, తమ పిల్లాపాపలతో జీవితాంతం సుఖసంతోషాలతో గడపాలని స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
ఈ వ్రతంలో చిన్నపిల్లలు కూడా పాల్గొంటారు కాబట్టి.. వివాహం అయిన స్త్రీలు ఆ పిల్లలను చూసి తమ చిన్నతనంలో గడిపిన మధురజ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా చిన్నచిన్న పల్లెలప్రాంతాలలో ఈ వ్రతాన్ని ఎంతో ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించుకుంటారు.
పల్లెటూర్లలో ఈ పండుగను ‘‘గోరింటాకు పండుగ” లేదా ‘‘ఊయల పండుగ” గా వ్యవహరించుకుంటారు.
పండుగ విశేషాలు :
ఇక పండుగకు ముందురోజు భోగి అని అంటారు. ఈ భోగిరోజు రాత్రి చిన్నపిల్లలనుంచి పెద్దవారివరకు ప్రతిఒక్కరు తమ చేతులకు, పాదాలకు గోరిటాకు పెట్టుకుంటారు. ఇలా పెట్టుకున్న తరువాత ఎవరి చేతులు అయితే బాగా ఎర్రగా పండుతాయో వారు చాలా అదృష్టవంతులని, వారి కోరికలు నెరవేరుతాయని స్త్రీలు విశ్వసిస్తారు. ఈ పండుగరోజు స్త్రీలు తమ ఇంటిపెరిటిలో ఊయలను కట్టుకుంటారు.
ఇక మరుసటిరోజయిన ఆశ్వీయుజ బహుళ తదియనాడు (అట్లతద్ది) తెల్లవారుజామునే లేచి, తమ రోజువారి కార్యక్రమాలను ముగించుకుని, పెరుగన్నాన్ని భుజించుకుంటారు. తరువాత అందరి ఇళ్లల్లో వున్నవారిని లేపి, ఆటలు ఆడుకుంటూ.. పాటలు పాడుకుంటూ.. ఊయల ఊగుటలో వెళ్లి సంతోషంగా తమ సమయాన్ని గడిపి, ఇతరులకు కూడా కనువిందు చేస్తారు.
అట్లతద్ది రోజు మొత్తం స్త్రీలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించుకుని చంద్రోదయం అయ్యేంతవరకు ఉపవాసం వుంటారు. చంద్రోదయం కాగానే తలంటుస్నానాలు చేసుకుని, అట్లు వేసుకుని నివేదనకు సిద్ధం అవుతారు. అనంతరం షాడశోపచారములతో ఉమాశంకరులను పూజించుకుంటారు.
ఈ విధంగా ఈ వ్రతాన్ని నిర్వహించుకోవడం వల్ల పెళ్లికాని అమ్మాయిలకు సమర్థవంతమైన భర్త లభిస్తాడని, పెళ్లయిన వివాహితులకు సుఖసంతోషాలతో కూడిన జీవితం వరిస్తుందని ప్రతిఒక్కరు ఎంతో ప్రగాఢంగా నమ్ముతారు.
కథ :
పూర్వం ఒక మహారాజు కావేరి అనే కూతురు ఎంతో అందంగా వుండేది. ఆమె తన తల్లి ద్వారా వ్రతమహత్యం గురించి తెలుసుకుని, తన రాజ్యంలో వున్న స్నేహితురాళ్లయిన మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురితో కలిసి ఈ ‘‘చంద్రోదయ ఉమావ్రతాన్ని’’ ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంది.
అయితే కొన్నిరోజుల తర్వాత కావేరి స్నేహితులందరికీ వివాహ వయస్సు రాగానే వారందరూ సమన్వయవంతులైన భర్తలతో పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ ఈమెకు మాత్రం పెళ్లిగాని, ఎటువంటి సంబంధాలు కాని వచ్చేవి కావు.
అప్పుడు మహారాజు తన కూతురుకి పెళ్లిజరగడం లేదన్న ఆవేదనతో ఆమె పెళ్లికి కావలసిన అన్ని కార్యక్రమాలను సిద్ధం చేసి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి కేవలం వృద్ధులు, కురూపులు మాత్రమే ముందుకు రాగలిగారు.
తన తండ్రి చేస్తున్న ప్రయత్నాలు అన్ని విఫలం అవుతున్నాయన్న బాధతో.. కావేరి రాజ్యాన్ని వదిలేసి సమీపంలోవున్న అరణ్యానికి చేరుకుని, ఘోరతపస్సు చేయసాగింది.
ఒకరోజు పార్వతీపరమేశ్వరులు లోకకళ్యాణం కోసం సంచారం చేస్తుండగా… ఘోరతపస్సు చేస్తున్న కావేరి అనుగ్రహం కలిగి ఆమె ముందు ప్రత్యక్షమవుతారు.
అప్పుడు వారు ‘‘ఓ కన్యాకుమారీ! ఎందుకు నువ్వు ఇంత ఘోర తపస్సును ఆచరిస్తున్నావు? నీకు ఏం వరం కావాలో కోరుకో” అని కావేరికి ఒక వరాన్ని ప్రసాదిస్తారు.
కావేరి.. ‘‘ఓ పార్వతీపరమేశ్వరులారా! నేను నా తల్లి ద్వారా తెలుసుకున్న ‘‘చంద్రోదయ ఉమావ్రతం” (అట్లతద్ది వ్రతం)ను.. నా స్నేహితులతో కలిసి ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరించాను. అయితే వారందరి కోర్కెలమేరకు వారు మంచి భర్తలతో వివాహం చేసుకుని వెళ్లిపోయారు. నా పెళ్లికోసం నా తండ్రిగారు చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం అవ్వడమే గాక… కురూపులు, వృద్ధులు అయినవారు మాత్రమే దొరుకుతున్నారు. ఇందులో నా దోషమేంటి’’ అని దు:ఖంతో తన ఆవేదనను వ్యక్తపరిచింది.
అప్పుడు వారు… ‘‘ఓ సౌభాగ్యవతి! ఇందులో నీ దోషం ఏమీ లేదు. నువ్వు ఆ వ్రతాన్ని నోచుకున్న తరువాత ఉపవాస దీక్షను సహించలేక… సొమ్మసిల్లి పడిపోయావు. ఈ విషయాన్ని నీ తల్లి ద్వారా తెలుసుకున్న నీ సోదరులు.. ఇంద్రజాల విద్యను ప్రదర్శించి.. అద్దం ద్వారా నీకు చంద్రుడిని చూపించారు. దాంతో నువ్వు ఉపవాస దీక్షను విరమించావు. ఆ విధంగా నీ వ్రతం భంగిమం కావడం వల్లే నీకు ఇలా జరుగుతోంది. నీ సోదరులు కూడా నీ మీద ప్రేమతో ఇలా చేశారు. అయినా ఇందులో బాధపడాల్సిన విషయం ఏమీలేదు. రేపువచ్చే ఆశ్వీయుజ బహుళ తదియనాడు విధివిధానంగా ఈ వ్రతాన్ని ఆచరించు. నీకు తప్పకుండా మంచి భర్త లభిస్తాడు” అని చెప్పి అక్కడి నుంచి అదృశ్యమవుతారు.
ఆ తరువాత రాకుమార్తె అయిన కావేరి.. ఎంతో భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించి… ఎంతో అందమైన, నవయవ్వన రాకుమారుడిని పొందతుంది. నిత్యం ఉమాశంకరులను పూజిస్తూ.. సుఖసంతోషాలతో జీవితాన్ని గడపసాగింది.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)