శ్లో|| సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా । శుభదాఽస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥
దుర్గామాత యొక్క ఐదవ స్వరూపము ‘స్కందమాత’ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. స్కందుడనగా కుమారస్వామి. ఆయనకు ‘కార్తికేయుడు’ అనే మరొక పేరు. ప్రసిద్ధమైన దేవాసుర సంగ్రామంలో ఈయన దేవతల సేనలకు అధిపతిగా ఉన్నాడు. పురాణాలు ఈయనను శక్తిధరుడని పేర్కొని, ఈయన మహిమలను వర్ణించాయి. ఈతడు నెమలి వాహనుడు. స్కందభగవానుడి తల్లి అయినందున దుర్గాదేవి ఐదవ స్వరూపానికి ‘స్కందమాత’ అనే పేరు ప్రసిద్ధమైనది. నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజున ఈ స్వరూపంలో దుర్గాదేవి ఆరాధించబడుతుంది.
ఈ రోజు సాధకుని మనస్సు విశుద్ధచక్రంలో స్థిరమవుతుంది. ఈమె మూర్తిలో బాలస్కందుడు ఈమె ఒడిలో కూర్చొని ఉంటాడు. స్కందమాత ‘చతుర్భుజ’. తన ఒడిలో చేరి ఉన్న స్కందుడిని తన కుడిచేతితో పట్టుకొని దర్శనమిస్తుంది. మరొక కుడి చేతిని పైకెత్తి పద్మమును ధరించి ఉంటుంది. ఎడమవైపున ఒక హస్తం అభయముద్రలో ఉంటుంది. మరొక కరములో కమలమును కలిగి ఉంటుంది. ఈమె శ్వేతవర్ణ శోభిత. ఈ దేవి కమలాసనంపై విరాజిల్లుతుంటుంది. కనుక ‘పద్మాసన’ గా ప్రసిద్ధికెక్కినది. సింహవాహన.
నవరాత్రి ఉత్సవాలలో ఐదవనాటి పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. దాని మహా మాహాత్మ్యం గురించి శాస్త్రాలు వేనోళ్ళ శ్లాఘించాయి. విశుద్ధచక్రంలో స్థిరమైన మనస్సుగల ఉపాసకునికి లౌకిక ధోరణులు, చిత్తవృత్తులూ అంతరిస్తాయి. అతడు విశుద్ధ చైతన్య స్వరూప మార్గంలో పురోగమిస్తాడు. అతని మనస్సు సమస్తమైన లౌకిక సాంసారిక మాయా బంధములనుండి విముక్తిని పొంది, పిదప పద్మాసనంలో ఆసీనయైన స్కందమాత స్వరూపంలో పూర్తిగా కలిసిపోతుంది. ఈ సమయంలో సాధకుడు పూర్తిగా సావధానుడై ఉపాసనలో ముందుకు సాగాలి. అతడు తన ధ్యానవృత్తులలో ఏకాగ్రతను కలిగి ఉండి సాధనలో పురోగమించాలి.
స్కందమాతను ఉపాసించటంవల్ల భక్తుల కోరికలన్నీ నేరవేరుతాయి. ఈ మృత్యులోకంలోనే వారు పరమశాంతిని, సుఖాలనూ అనుభవిస్తారు. వారికొరకై మోక్షద్వారము నిరంతరము తెరచుకొని వుంటుంది. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునికీ చెందుతాయి. ఈ దేవిని ఆరాధించటంలో ఉన్న వైశిష్ట్యము ఇదే! కనుక భక్తులు స్కందమాతను ఆరాధించటంపై ప్రత్యేక ధ్యాసను కలిగి ఉండాలి. ఈ దేవి సూర్యమండల అధిష్ఠాత్రి అవటంవల్ల ఈమెను ఉపాసించేవారు దివ్యతేజస్సుతో, స్వచ్ఛకాంతులతో విరాజిల్లుతుంటారు. ఒక అలౌకిక ప్రభా మండలం అదృశ్యరూపంలో సర్వదా వారి చుట్టూ పరివ్యాప్తమై ఉంటుంది. ఈ ప్రభామండలం అనుక్షణమూ వారి యోగక్షేమాలను వహిస్తుంటుంది.
కాబట్టి మనము ఏకాగ్రతో పవిత్రమైన మనస్సులతో స్కందమాతను శరణుజొచ్చుటకు ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ ఘోర భవసాగరముల దుఃఖమునుండి విముక్తులమై మోక్షమును సులభంగా పొందటానికి ఇంతకుమించిన ఉపాయము మరొకటి లేదు.
కనకంబరం రంగు, నైవేద్యం : పెరుగు అన్నం
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)