“శ్రీ లక్ష్మీవల్లభారంభాం విఖనోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం”
శ్రావణ పౌర్ణమిరోజున జంధ్యాల పండగ, రాఖీ పౌర్ణమి జరుపుకుంటున్నాము. ఇదేరోజు “వైఖానస జయంతి” కూడా జరుపుకుంటాము. వైఖానసులకు పరమ పవిత్రమైన రోజు ఇది. తిరుమలలో జరిగేనిత్యపూజలు, సేవలు, ఉత్సవాలు, దేవాలయ నిర్మాణం దగ్గరనుంచి, విగ్రహం తయారీ, ప్రతిష్ట, అర్చన మొదలైన విధివిధానాలన్నీ వైఖానస ఆగమ శాస్త్రాన్ని అనుసరించి జరుగుతాయి. ఈ శాస్త్రాన్ని అందించిన వాడు శ్రీ విఖనస మహర్షి. వైఖాన మహర్షిజన్మ దినమే వైఖానస జయంతి. వైఖానసులు ఒక తపస్సంపన్నుల సమూహం. వీరిప్రస్తావన మొదటిసారిగా నుధర్మశాస్త్రం లో వస్తుంది. మనువు మనిషియొక్క వర్ణాశ్రమంలోని ఆఖరి రెండు చరమాంకాలయిన వానప్రస్థం ఇంకా సన్యాసాశ్రమం గురించి చెబుతూ వైఖానస నిబంధనను తెలుపుతాడు. తద్వారా వైఖానస సముదాయం ఆ కాలానికే ఉందని తెలుస్తోంది. నారాయణీయంలో కూడా వీరిప్రస్తావన వస్తుంది. ఎనిమిదవ శతాబ్దం నాటి ఆలయ శిలాశాసనాల ద్వారా వైఖానసులు పూజారులని తెలుస్తోంది. వైఖానసులు పూజారులే కాక దేవాలయంలో ధర్మకర్తల బాధ్యతలు కూడా నిర్వహించేవారు. గుడికి సంబంధించిన ఆస్తులకు జవాబుదారీగా ఉండేవారు. శ్రీవైష్ణవుల రాకతో వైఖానసుల ప్రాభవం కొంత తగ్గినప్పటికీ…రామానుజులు దేవాలయ పూజారి వ్యవస్థను రూపుమాపు చేసినా… వైఖానసుల అవసరం తగ్గలేదు. ఈనాడు ప్రముఖ వైష్ణవ దేవాలయాలన్నిటిలోనూ ప్రధానార్చకులుగా వైఖానసులే ఉంటారు. ఒకానొక కథనం ప్రకారం భగవంతుని ఆదేశం మేరకు వైఖానసులంతా తిరుమల ఆలయం చేరతారు. ఆలయంలో పూజలను రామానుజుల ఆధ్వర్యంలో శ్రీవైష్ణవులు కొనసాగిస్తూ ఉంటారు. అంతలోనేఅందరు వైఖానసులు ఎవరో గుర్తు తెలియని విధంగా నరికివేయబడతారు. అదిచోళరాజు చేయించినదా లేక రామానుజులు చేయించిన చర్యనా అన్నది ఇప్పటివరకూ ఎవరికీ తెలీదు. ఆ విధంగా ఒక్క వైఖానస పురుషుడు కూడా మిగలకుండా పోవడంతో రామానుజులు వేంకటేశ్వర స్వామిని సమీపించి పూజాపునస్కారాల విషయమైచర్చిస్తూ, శ్రీవైష్ణవుల ఆధ్వర్యంలో పూజలు జరగాలని స్వామి వారిని కోరతాడు. కానీ స్వామివారు ఒక వైఖానస బాలకుడి విషయం తెలిపి అతనికి ఉపనయనం చేయించి అతని చేతనేపూజలు జరిపించాలని కోరతాడు. రామానుజులు ఈ విషయమై విముఖంగా ఉంటాడు. పాంచరాత్రాగమంలోనే పూజలు జరగాలన్నది ఆయన ఆశయం. ఈ బాలుణ్ణి కూడా హతమార్చాలని పన్నాగం జరుగుతుంది. స్వామి పుష్కరిణిలో మునిగితేలగానే ఆ బాలుడు వటువుగా మారిపోతాడు. స్వామివారివైభవం తెలుసుకున్న రామానుజులు తిరుమల పూజలను తిరిగి వైఖానసులకే అప్పగిస్తాడు. అప్పటినుండి తిరుమల ఆలయం మొదలు చాలా ఆలయాల్లో ఇప్పటికీ వైఖానస- శ్రీవైష్ణవ వైరం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటుంది. నేటికీ కొన్ని ఆలయాలలో ప్రధానార్చకత్వంపై చాలా వివాదాలున్నాయి. రామానుజుల వారు వైఖానసాన్ని పక్కన బెట్టి శ్రీవైష్ణవాన్ని ముందుకు తేవాలని యత్నించినా శ్రీరంగంలోని రామానుజుల పార్థివ శరీరమూర్తి అని చెప్పబడే తాన్ ఆన తిరుమేణికి పూజ చేసేది వైఖానసులే అన్నదిగమనించదగ్గ విశేషం.
ఈ శాఖకు మూలపురుషుడైన వైఖాన మహర్షి విష్ణుమూర్తి అంశతో నాలుగు భుజములు, శంఖు చక్రాలతో నైమిశారణ్యంలో అవతరించారు. అలా ఆవిర్భవించిన విఖనసునితో శ్రీ మహావిష్ణువు…
శ్లోకం : మయా నియుక్తో విఖనా మదారాధన కృద్భవ – మామారాధ్య మునిశ్రేష్ఠశ్రేష్ఠ ముల్లోకేనివసిష్యసి –
సూత్రమ్ కురు మహాభాగా త్వనామ్నా యాజుషీ శ్రుతౌ – వైఖానస మిదం ప్రోక్తం లోకేఖ్యాతిం గమిష్యతి ॥
అనగా (ఓ విఖనస బ్రహ్మ నాయొక్క విగ్రహారాధనకు నా చేసృష్టించ బడిన నువ్వు. నా విగ్రహారాధన కొరకు ఒక సూత్రమును యజుర్వేదానుసారంగా రచించు అదినీ పేరు మీద లోకంలో ఖ్యాతి గడిస్తుంది) అప్పుడు విఖనస మహర్షి “ఓ స్వామి నీ యొక్క ఆరాధనకు మరియు శాస్త్ర రచనకు నాకు అనువైన ఒక ప్రదేశం సూచించమని ప్రార్ధిస్తాడు. అప్పుడు మహా విష్ణువు తన చక్రాయుధాన్ని వదిలి ఇదిఈ ప్రదేశమును సూచించునొ అదియేనీకు నివాస యోగమని శెల్లవిస్తాడు. ఆ చక్రాయుధము అన్ని లోకములు తిరిగిచివరకు భూ లోకమున ఒక సుందర ప్రదేశం తాకిఅదృశ్యమౌతుంది. చక్రము క్ర యొక్క “నిమి” (ఇరుసు) తగిలిన ప్రదేశము కనుక దానిని “నైమిశారణ్యం “అన్నారు, అది మహర్షులకు పుట్టినిల్లు. మనం ఏ పురాణం విన్నా.. ఈ పవిత్రమైన నైమిశారణ్యం ప్రస్తావన లేకుండా వుండదు. కొంతకాలం తపస్సు చేసిన పిమ్మట విఖనసుడు విష్ణువుయొక్క ఆదేశానుసారం శాస్త్ర రచనకు ఉపక్రమించాడు. యజుశాఖకు అనుసంధానంగా వేద ప్రమాణ పూరితంగ వేదాంగాలలో ఒకటైన “కల్పసూత్రం” రచించాడు. ఈ కల్పసూత్రమందు శ్రౌత, దైవిక శారీరక కర్మల గురించి వివరంగా తెలుపబడింది. ఇదియే “వైఖానసాగమానికి మూల గ్రంధం. దీని యందు చెప్పబడిన “గృహదేవతార్చన”ని ప్రమాణంగా తీసుకొని భృగు, మరీచి, అత్రి, కశ్యపులు, ఆలయ నిర్మాణము నుండిమొదలు నిత్య నైమితిక ,కామ్య ఉత్సవాల వరకు చేయ వలసిన దైవిక కర్మల గురించి అనేక గ్రంధాలు రచించారు. వీరేకాక బోధయనాది మహర్షులు కూడా ఈ కల్పసుత్రానేప్రమాణంగా చేసుకొని వారియొక్క శాస్త్రాని రచించారు. ఈ ఆగమం గురించి పురాణాలలో వేదాలలో గొప్పగా చెప్పబడింది. శ్రౌతంలో చెప్పిన యగాలను ఇప్పటికిపలువురు ఈ శాస్త్రానుసారంగానే ఆచరిస్తున్నారు. అందరూ అందుకే వైఖానసాన్నిఅంత గొప్పగా కీర్తిస్తున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదేశం మేరకు ఆయనని పూజించేందుకు విఖనస మహర్షితిరుమలకు చేరుకుంటాడు. అక్కడేఆయనకి ‘రంగదాసుడు’ అనేభక్తుడితో పరిచయం ఏర్పడుతుంది. రంగదాసుడి భక్తిశ్రద్ధశ్రద్ధలు … వినయ విధేయతలు చూసి మహర్షి ఎంతగానో సంతోషిస్తాడు. స్వామివారి సేవకు తగిన భక్తుడు లభించాడని ఆనందంతో పొంగిపోతాడు. ఇక రంగదాసుడు కూడా స్వామివారి సేవకుగాను తనకి సరైన మార్గం చూపించే వ్యక్తి దొరికినందుకు ఆనందిస్తాడు. స్వామివారికి మహర్షి నిత్యపూజలు నిర్వహిస్తూ ఉండగా, అందుకు అవసరమైన పూజా ద్రవ్యాలను రంగదాసు సమకూరుస్తూ ఉండేవాడు. ఒకరోజున పూజా ద్రవ్యాల కోసం వెళ్లిన రంగదాసుడు, స్వామి పుష్కరిణిలో గంధర్వ దంపతులు జలకాలడుతూ ఉండటాన్ని చూస్తూ అక్కడే నిలబడిపోతాడు. పూజకివేళ మించిపోయిన తరువాత ఆ విషయం గుర్తుకు వచ్చి తిరిగివస్తాడు. స్వామివారిపాదాలపైపడితన వలన జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడు. అయినా ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకున్న స్వామివారు ఆగ్రహించకుండా అనుగ్రహిస్తాడు.
ఈ జన్మను చాలించి మరుజన్మలో తన భక్తుడిగా తన ఆలయ నిర్మాణ బాధ్యతను చేపట్టవలసిందిగా ఆదేశిస్తాడు. అందుకు రంగదాసుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆ తరువాత ‘తొండమానుడు’గా జన్మించి స్వామివారికి మహాభక్తుడై ఆయనకి ఆలయాన్ని నిర్మించి సంతోషంగా సమర్పిస్తాడు.
“ఏ నఖాః తేవైఖానసాః ఏ వాలాః తేవాలఖిల్యాః ” అన్న వేద వాక్యాను సారంగా ఎవరైతేఅనఖా: అనగా పాపరహితులో వారేవైఖానసులు అని అర్ధం. శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానేవైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించేవారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను మరియు వైఖానస కల్పసూత్రాన్ని పాటించేబ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషినుండివచ్చింది కాబట్టి వైఖానసం అయింది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తర మీమాంసను నమ్మకుండా, కేవలం పూజాపునస్కారాల పైనే వైఖానసం నడుస్తుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమయిన వైఖానస భగవత్ శాస్త్రమే తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం.
“శ్రీ లక్ష్మీవల్లభారంభాం విఖనోముని మధ్యమాం – అస్మదాచార్య పర్యంతాం వందేగురు పరంపరాం” అన్న వైఖానస మహర్షిప్రార్ధనా శ్లోకం పఠించి..ఘనమైన అంజలి ఘటిద్దాం .
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)