(ఆగష్టు 2, 1876 – జూలై 4, 1963)
“మూడు రంగులు….” భారత స్వాతంత్ర్య సంగ్రామానికి ఊహించని ఉత్సాహాన్ని అందించాయి.
అవే మూడు రంగులు ఒక అర్ధరాత్రి రెప రెప లాడుతుంటే…అది చూసి ఈ దేశం మురిసిపోయింది.
ఆ మూడు రంగులని చూడగానే ప్రతి భారతీయుడి మనసు సంతృప్తి, కీర్తితో ఉప్పొంగి పోతుంది.
ఆ మూడు రంగులే మన బలం… మన ఐకమత్యం… మన కీర్తి…మన గౌరవం…
ఆ మూడు రంగులే 130 కోట్ల భారతీయుల హృదయాలను “ఇండియా” అనే ఎమోషన్ తో మైమర్చేలా చేస్తున్నాయి.
దేశ సరిహద్దులో రక్షణగా ఉండే ప్రతి సైనికుడికి ఆ మూడు రంగులే తోడు, ధైర్యం… ఆ మూడు రంగులు తన పార్థివ దేహం పైన కప్పబడిన, అదే ఈ జన్మకి దక్కిన విశిష్టమైన గౌరవంగా భావిస్తారు ఆ సైనికులు. అది ఆ మూడు రంగులు మనకిచ్చే గర్వం,గౌరవం. “ఈ పతాకం సామాన్యమైంది కాదు…సామ్రాజ్యవాద సూచకం కాదు… ఏ దేశాన్ని ఆక్రమించే విధానాన్ని సూచించే కేతనం అసలే కాదు. ఇది మన స్వాతంత్ర్య చిహ్నం.” భారత రాజ్యాంగ సభలో జాతీయ పతాకాన్ని ప్రవేశపెడుతూ జవహర్ లాల్ నెహ్రూ అన్నమాటలివి. స్వాతంత్ర్య భారత సమర స్ఫూర్తికి పర్యాయపదంగా మారిన “త్రివర్ణ పతాక సృష్టికర్త, బహుభాషావేత్త, స్వాతంత్ర యోధుడు, వ్యవసాయ శాస్త్రవేత్త మరియు జియాలజిస్ట్” గా మన దేశానికి సేవలందించిన పింగళి వెంకయ్య గారి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
ఈయన ఆగస్ట్ 02, 1878 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న భట్లపెనుమర్రు గ్రామములో హనుమంతురాయుడు, వెంకతరత్నమ్మ దంపతులకు జన్మించారు. ఈయన 19 సంవత్సరముల వయసులో బొంబాయిలో సైనిక శిక్షణ పొంది దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలొనే మహాత్మ గాంధీ గారిని కలిసారు. అప్పుడు గాంధీ గారితో వెంకయ్య గారికి ఏర్పడిన సాన్నిహిత్యం ఆర్దశతాబ్ధం పాటు నిలిచింది.
యుద్ధం నుండి తిరిగి వచ్చిన తర్వాత వెంకయ్య గారు 1906 నుండి 1922 వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నారు. మద్రాసులో ప్లేగు ఇన్స్పెక్టర్ గా శిక్షణ తీసుకున్నారు. కొంతకాలం బళ్లారిలో ప్లేగు ఇన్స్పెక్టర్ గా పని చేశారు. అది విసుగు అనిపించి, ఇన్స్పెక్టర్ గా మానేసి శ్రీలంకలోని కొలంబో వెళ్లి పొలిటికల్ ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తయిన తర్వాత రైల్వే గార్డ్ గా కొంతకాలం పనిచేశారు. అది కూడా మనసుకు అంతగా నచ్చలేదు. దాంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్ లోని డి.ఏ.వి కళాశాలలో చేరి, సంస్కృతం, ఉర్దూ, జపనీస్ భాషలో ప్రావీణ్యం పొందారు. ఈయన ప్రొఫెసర్ గొట్టే ఆధ్వర్యంలో జాపనీస్ చరిత్ర అభ్యసించారు. అలా జపాన్ భాషలో అనర్గళంగా మాట్లాడగలిగే వెంకయ్య గారిని “జపాన్ వెంకయ్య” గా సంబోధించేవారు కొందరూ.
రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్య గారికి వ్యవసాయం పట్ల చాలా మక్కువ ఉండేది. అదే మక్కువతో వ్యవసాయ శాస్త్రంలో కూడా అధ్యయనం చేశారు. ముక్త్యాల రాజా నాయని రంగారావు బహదూర్ గారు వెంకయ్య గారితో వ్యవసాయ పరిశోధనశాల స్థాపించేలా ప్రోత్సహించారు. ఆ సందర్భంలోనే ఈయన అమెరికా నుండి పత్తి విత్తనాలను తెప్పించి పండించారు. అలాగే ఆయన “వ్యవసాయ శాస్త్రం” అనే గ్రంథాన్ని ప్రచురించారు. ఈయనకి లండన్‌లోని రాయల్ అగ్రికల్చర్ సొసైటీలో సభ్యత్వం లభించింది.
ఆ తర్వాత వెంకయ్య గారు బందరులోనే ఒక జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పని చేశారు. వ్యవసాయ శాస్త్రం, చరిత్ర, వ్యాయామం, గుర్రపు స్వారీ మరియు సైనిక శిక్షణ కూడా విద్యార్థులకు బోధించేవారు. యువతరంలో జాతీయ భావాలను రగిలించేందుకు చైనాలో జాతీయ విప్లవాన్ని సాగించిన ‘సన్ యెట్ సెన్’ జీవిత చరిత్ర రచించి సంచలనం సృష్టించి లండన్ టైమ్స్ పత్రికచే ప్రశంసలందుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏ సమావేశానికైనా “బ్రిటీష్ యూనియన్ జాక్ జెండా” ఎగురవేయబడుతుంటే వెంకయ్య గారికి అది నచ్చలేదు. మనకు ఒక జాతీయ పతాకం లేనందువల్లనే కదా ఈ అవమానం అనే బాధతో జాతీయ పతాకం రూపొందించడం పై దృష్టి సారించారు.
1916 లో “భారతదేశానికొక జాతీయ జెండా” (ఏ నేష్నల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా) అనే పుస్తకాన్ని ఆంగ్లంలో ప్రచురించారు. ఈ గ్రంధానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్ర మంత్రి సర్ బి.ఎన్.శర్మ ఉత్తేజకరమైన పీఠిక రాసారు. ఈ పుస్తకం కాంగ్రెస్ పెద్దల దృష్టికి రావడంతో వెంకయ్య గారిని కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా ఆహ్వానించారు. అ సంవత్సరం లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య రూపొందించిన జాతీయ జెండానే ఎగురవేసారు. అయితే 1919లో జలంధర్‌కి చెందిన లాలా హన్స్‌రాజ్ ఆ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా, గాంధీ 1921లో బెజవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో వెంకయ్యను పిలిచి, కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిసి మధ్య రాట్నం ఉండేలా జెండా చిత్రించమని కోరాడు. గాంధీ సూచన ప్రకారం వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించాడు. అలా రూపొందించబడిన జెండాలో కాషాయం హిందువులను, ఆకుపచ్చ ముస్లింలను సూచిస్తుంది, అలాగే ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఆశయంలో తెలుపును కూడా అందులో చేర్చారు. ఏప్రిల్ 13, 1936 ప్రచురితమైన ‘యంగ్ ఇండియా’ పత్రికలో గాంధీజీ పింగళి వెంకయ్యగారిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
1921లో పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ పతాకం 22.7.1947 న భారత రాజ్యాంగ సభ జాతీయ పతాకాన్ని ఆమోదించింది. నెహ్రూ గారి సూచన మేరకు త్రివర్ణ పతాకం లో రాట్నం స్థానంలో అశోకచక్రం చేర్చబడింది. ఆ తరువాత వెంకయ్య గారు క్రమంగా రాజకీయాల నుండి దూరంగా ఉన్నారు. తర్వాత మద్రాసు వెళ్లి ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు చేసి డిప్లమా పట్టా తీసుకున్నారు. ఆ తరువాత నెల్లూరు వచ్చి, మైకా ఖనిజం గురించి పరిశోధన కొనసాగించారు. అటు తర్వాత వెంకయ్య గారు అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ మొదలగు ప్రదేశాలలో ఖనిజ నిల్వల మీద పరిశోధన కొనసాగించారు. అంతవరకూ శాస్త్రీయంగా వజ్రాలు బొగ్గు నుంచి ఉత్పన్నం అవుతాయని అందరూ భావించేవారు. కానీ వెంకయ్య గారు మొదటిసారిగా వజ్రపు తల్లి రాయిని కనుగొని ఈ ప్రపంచానికి తెలియజేశారు. ఆవిష్కరణ మీద ఒక ఆంగ్ల పుస్తకం కూడా రచించారు. దాంతో ప్రజలు వెంకయ్య గారిని వజ్రాల వెంకయ్య అని కూడా సంబోధించేవారు. 1955 లో ఆయన కనుక్కున్న వజ్రపు తల్లి రాయిని చూసిన జియాలాజికల్ సర్వే అధికారులు ఈయనను సలహాదారుగా నియమించుకున్నారు.
మనదేశంలో స్వాతంత్ర్య అనంతరం స్వాతంత్ర్య సమరయోధులకు పింఛన్లు మంజూరయ్యాయి. కానీ వెంకయ్య గారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. దానివల్ల వెంకయ్య గారి జీవితంలో తన చివరి రోజులు చాలా దుర్భరంగా గడిచాయి. వృధ్యాప్యంలో ఆర్ధిక బాధలు ఈయనను చుట్టుముట్టాయి, దక్షిణాఫ్రికాలో మిలటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగరిలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఆయన గుడిసె వేసుకుని గడపసాగారు. ఆయన ఏనాడూ ఏ పదవిని ఆశించలేదు, కానీ ఆయన నిస్వార్థ సేవను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం. మన జాతికొక కేతనని నిర్మించాడు ఆయన. ఇతర దేశాలలో జాతీయ పతాక నిర్మాతలను ఆ ప్రభుత్వాలు ఎంతగానో గౌరవనిస్థాయి. వారికి కావాల్సిన వసతులని ప్రభుత్వాలే సమకూరుస్తాయి. కానీ మన ప్రభుత్వం వెంకయ్య గారిని గుర్తించకపోవడం శోచనీయం, జాతీయపతాకాన్ని గురించి ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాలలో మన పతాక నిర్మాత ఒక తెలుగువాడు అని రాసేవారు, కానీ వెంకయ్య పేరుని ఏనాడు సూచించకపోవడం విచారకరం.
వెంకయ్య గారి చివరి రోజుల్లో విజయవాడలో కొంతమంది ప్రముఖులు ఆయనకి ఆర్థిక సహాయం చేయాలనుకున్నారు. కానీ ఆర్థికంగా సహాయం చేస్తామంటే అంగీకరించని అభిమానవంతులు అని తెలిసిన ప్రముఖులు పింగళి వెంకయ్యను సన్మానించాలని అనుకున్నారు. కష్టం మీద ఆయనను ఒప్పించి 1963 సంక్రాంతి నాడు సన్మానం చేసి కొంత నగదు అందజేశారు. అతను ఆ సన్మాన సమయంలో కూడా జాతీయ జెండా గురించే ఇలా మాట్లాడారు “తాను మరణించినపుడు తన భౌతిక కాయాన్ని త్రివర్ణ పతాకం తో కప్పండి. స్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి అదే నా చివరి కోరిక”. ఆ సన్మానం జరిగిన తర్వాత ఆయన 6 నెలలు మాత్రమే జీవించారు.1963 జూలై 4న ఆయన తుదిశ్వాస విడిచారు.
ఇంతటి విశిష్ట సేవలు అందించిన వెంకయ్య గారికి కనీస గుర్తింపు కూడా ఇవ్వలేకపోయాయి ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు. స్వాతంత్రానంతరం ఆయన చనిపోయే వరకు వచ్చిన ప్రభుత్వాలన్నీ ఆయనను విస్మరించడం బాధ కలిగించే విషయం. 1947 తర్వాత 1963 సంవత్సరం వరకు ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవాలు జరిగాయి. కానీ ఒక్కసారి కూడా పింగళి వెంకయ్య జాతీయ పతాక రూపశిల్పి అని ప్రభుత్వాలు సన్మానించిన దాఖలాలు లేవు. జాతీయ పతాకం ఎగిరే అంత కాలం స్మరించుకోదగిన ధన్యజీవి వెంకయ్య గారు నిరాడంబరమైన, నిస్వార్ధమైన జీవితం గడిపిన మహామినిషి పింగళి వెంకయ్య గారు.
ఆయనను ప్రజలు మర్చిపోతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి ఆయన దర్శన భాగ్యం ప్రజలకు లభింపచేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింగళి వెంకయ్య గారికి మన దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు కూడా చేసింది.
మీకు ఇండియా అనగానే మొదట ఏం గుర్తొస్తుంది… భారత జెండానే… కదా…. అలాంటి గుర్తింపు మనకిచ్చిన మహర్షికి మనం ఏమివ్వగలం. ఆ మహాత్ముడు ఇచ్చిన పతాకాన్ని ప్రపంచ నలుమూలల రెపరెపలాడించడం తప్ప. ఆయన వర్ధంతి సందర్భంగా మన జాతీయ పతాక సృష్టికర్తను ఒక సారి మనసారా స్మృతింద్దాం.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)