ప్రాముఖ్యత : – ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది . “ఉగాది పచ్చడి” ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్ధం. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో “నింబ కుసుమ భక్షణం” మరియు “అశోకకళికా ప్రాశనం ” అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు’వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీకగా:-
బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం ఉప్పు – జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు – పులుపు – కొత్త సవాళ్లు మిరపపొడి – కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు ప్రొద్దునే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. “త్వామష్ఠ శోక నరాభీష్టమధుమాస సముద్భవనిబామి శోక సంతప్తాంమమ శోకం సదా కురు” ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది. ఆ రకంగా తమ జీవితాలు అన్ని అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)