వ్రతాల మాసం చైత్రం : సంప్రదాయబద్ధంగా మనకున్న పన్నెండు మాసాల్లో తొలి మాసం చైత్రమాసం. వసంత రుతువు ఆగమనంతో ప్రకృతి సౌందర్యం ఈ మాసంలో అలరారుతుంటుంది. పలువురు దేవతలకు సంబంధించిన వ్రతాలు, పూజలతో ప్రజలలో భక్తి భావం పరిఢవిల్లుతూ ఉంటుంది. దశావతారాలలోని వరాహ, రామ, మత్సా్యవతారాల జయంతులు ఈ మాసంలోనే వస్తాయి. అన్నిటినీ మించి చైత్రం తొలి రోజు శుద్ధ పాడ్యమినాడు ఉగాది పర్వదినాన్ని జరుపుకొంటారు అంతా. చైత్రసోయగానికి చిహ్నంగా కనిపించే పరిమళభరితమైన దమన పత్రాలతో నెలలోని మొదటి పదిహేను రోజులు అనేక మంది దేవతలకు పూజలు చేయటం ఓ ఆచారంగా ఉంది. తొలి రోజు సృష్టికర్త, చతుర్ముఖుడు అయిన బ్రహ్మకు దమన పత్రాలతో పూజ చేస్తారు. మరునాడు విదియనాడు ఉమ శివ అగ్నులకు, తదియనాడు గౌరీ శంకరులకు, చతుర్దినాడు గణపతికి, పంచమినాడు నాగులకు, షష్ఠి నాడు కుమారస్వామికి, సప్తమినాడు సూర్యుడికి దమన పత్రాలతో పూజ చేస్తారు. అష్టమినాడు మాతృ దేవతలకు, నవమినాడు మహిషాసుర మర్దనికి, దశమినాడు ధర్మరాజుకు, ఏకాదశినాడు మునులకు, ద్వాదశినాడు మహావిష్ణువుకు, త్రయోదశినాడు కామదేవుడికి, చతుర్దశినాడు శంకరుడికి, పూర్ణిమనాడు శనికి, ఇంద్రుడికి దమన పత్రాలతో పూజలు చేయాలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇలా చెయ్యటం సర్వశుభప్రదం అని పెద్దలు వివరిస్తున్నారు. చైత్రశుద్ధ విదియనాడు నేత్ర ద్వితీయ, ప్రకృతి పురుష ద్వితీయ వ్రతాలు చేస్తారు. ఉమ, శివ, అగ్నులకు పూజ జరుగుతుంది. మరి కొంతమంది అరుంధతి వ్రతం చేస్తారు. చైత్ర శుద్ధ తదియనాడు శివడోలోత్సవం, సౌభాగ్య వ్రతం జరుపుతారు. చవితినాడు గణేశపూజ, పంచమినాడు శాలిహోత్రహయ పంచమి నిర్వహిస్తుంటారు. గుర్రాలకు పూజ చేయటం పంచమినాటి విశిష్టత. శ్రీవ్రతం పేరున ఇదే రోజు లక్ష్మీనారాయణులను పూజిస్తారు. శ్రీరామ రాజ్యోత్సవం జరుపుతారు. దీంతో పాటు పంచమూర్తి వ్రతం, సంవత్సర వ్రతం, పంచమహభూత వ్రతం, నాగపూజ తదితరాలు చెయ్యటం ఉంది. షష్ఠినాడు కుమార షష్ఠి వ్రతం చేస్తుంటారు. శుద్ధ సప్తమి తిథి నాడు సూర్యసంబంధమైన వ్రతాలు జరపటం కనిపిస్తుంది. అష్టమినాడు అశోకాష్టమి, అశోక రుద్రపూజ, భవానీ అష్టమి జరుపుతారు. శుద్ధ నవమికి మరింత విశిష్టత ఉంది. ఇదే రోజు శ్రీరామ నవమి పర్వదినం జరుగుతుంది. దశమినాడు ధర్మరాజ దశమి, శాలివాహన జయంతి చెయ్యడం ఉంది. చైత్ర శుద్ధ ఏకాదశినాడు ఏకాదశీవ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఈ రోజునే కామదైకాదశిని జరపటం కనిపిస్తుంది. ప్రత్యేకంగా స్త్రీలు తమ కోర్కెలను సిద్ధింపచేసుకోవటానికి ఈ వ్రతాన్ని చేస్తుంటారు. శుద్ధ ద్వాదశినాడు వాసుదేవార్చన, లక్ష్మీనారాయణ పూజ జరుగుతాయి. త్రయోదశినాడు అనంగత్రయోదశీ వ్రతం లేక మదన త్రయోదశీ వ్రతం జరుపుతారు. శుద్ధ చతుర్దశినాడు శైవచతుర్దశి కర్దమ క్రీడలాంటివి జరుగుతాయి. చైత్ర పూర్ణిమనాడు మహాచైత్ర వ్రతం జరుపుతారు. దీంతోపాటు చిత్రగుప్త వ్రతం లాంటివి ఉంటాయి. ఇప్పటికి మాసంలో సగభాగం అయిపోయినట్టవుతుంది. చైత్ర బహుళ పాడ్యమి నాడు జ్ఞానావాప్తి వ్రతం, పాతాళ వ్రతం ఉంటాయి. ఆ తర్వాత బహుళ పంచమి నాడు మత్స్య జయంతి, ఏకాదశినాడు వరూధిని ఏకాదశి, త్రమోదశినాడు వరాహ జయంతి జరుపుతుంటారు. చైత్ర బహుళ చతుర్దశినాడు గంగానది స్నానం చేయటం వల్ల పాపాలు నశిస్తాయి. బహుళ అమావాస్యనాడు పరశురాముడి పూజలు చేస్తుంటారు. ఇలా పలు వ్రతగ్రంథాలు చైత్ర మాసంలో వచ్చే పుణ్యప్రదాలైన అనేక వ్రతాల గురించి వివరించి చెబుతున్నాయి.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)