Categories
Vipra Foundation

శ్రీ కృష్ణదేవ రాయలు జయంతి

        శ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుడు గా మరియు కన్నడ రాజ్య రమారమణ గా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి “అప్పాజీ” (తండ్రిగారు) అని పిలిచేవాడు.రాయలు, తుళువ నరస నాయకుని రెండవ భార్య అయిన నాగలాంబ (తెలుగు ఆడపడుచు) కుమారుడు.ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలు నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు. రాయలు తల్లి నాగలాంబ గండికోట ను పాలించిన పెమ్మసాని నాయకులు ఆడపడచు. 240 కోట్ల వార్షికాదాయము కలదు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.

సాహిత్య పోషణ :

        కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, మదాలసాచరితము, సత్యవధూపరిణయము, సకలకథాసారసంగ్రహము, జ్ఞానచింతామణి, రసమంజరి తదితర గ్రంథములు, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు రేడ నేను తెలుగొకొండ ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.

భక్తునిగా :

        కృష్ణదేవ రాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవుడు. కానీ పరమతసహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించినాడు. అంతేకాక ధూర్జటి, నంది తిమ్మన వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు.అనేక దాన ధర్మాలు చేసినాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి, అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు.

నిర్మాణాలు :

        ఈయన చెన్నకేశవస్వామి వారి దేవాలయం కట్టించాడు.

కుటుంబము :

        కృష్ణదేవ రాయలుకు తిరుమల దేవి, చిన్నాదేవి ఇద్దరు భార్యలని లోక విదితము. కానీ, ఆముక్తమాల్యద ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ మరియు కమల). కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు. పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనిజ్ వ్రాశాడు. ప్రతాపరుద్ర గజపతి ని ఓడించి, ఆయన కూతురైన తుక్కా దేవి ని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రకాధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా వ్యవహరించారు.చాగంటి శేషయ్య, కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించాడు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు. కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమలాదేవి పట్టపురాణి అయిఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయంఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామ రాయలకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524 లో మరణించినాడు. ఈ విషయంపై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసు ను అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు, అచ్యుత రాయలు ను వారసునిగా చేసాడు.

కులము :

        శ్రీ కృష్ణదేవ రాయలు ఏ కులానికి చెందిన వాడన్న విషయంపై ఇతర కులాలవారి మధ్య అనేక వాదోపవాదాలున్నాయి. ఈయన కాపు, బలిజ, గొల్ల, బోయ కులాలకి చెందిన వాడని ఆయా కులాల వారు చెప్పుకుంటారు. ఇతని తండ్రియైన తుళువ నరస నాయకుడు చంద్ర వంశపు క్షత్రియుడుఅని పలు కవులు వ్రాసిన పద్యములు నిరూపించుచున్నవి. ఇప్పటికీ వీరి మూలాలు దక్షిణ భారతదేశమంతటా ఉన్నాయి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)