శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది. విష్ణువుకు ఇష్టమైన మాసం మార్గశిరం, శివునకు కార్తీకం, అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమినాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్ధాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. శని ధర్మదర్శి. న్యాయం, సత్యం, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను, పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే. మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి, నియమ నిష్ఠులు పాటించి నట్లయితే శని అనుగ్రహం పొందవచ్చు. అంతేగాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహంచాలి. పుష్యమాసం తొలి అర్థభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం. అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాల తోనూ, ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం. పుష్య బహుళ ఏకాదశిని విమలైకా దశి, సఫలైకాదశి, షట్తిలైకాదశి, కల్యాణౖకాదశి అని పిలుస్తారు. సున్నిపిండితో ఒంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచినీటి లోనూ నువ్వులు కలుపుకొని తాగడం, ఒక రాగి లేదా కంచు పాత్రలో నువ్వులు పోసి తిలదానం ఈ ఏకాదశి రోజు చేస్తారు. పితృ దేవతలకి పితృతర్పణాలు, ఆబ్దికాదులు ఉంటే వారి పేరుతో అన్న దానాలు పేదవారికి చేస్తే విశేషించి పుణ్యఫలంతో పాటు పితృ దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఏకాదశి రోజున దాన్యం తినకూడదు అంటారు కదా మరి నువ్వులు ఎలా తినడం అని అనుమానం వస్తుంది. నువ్వులు దేవుడికి నివేదన చేసి, అందరికి నువ్వుల ప్రసాదం పెట్టి ఏకాదశి వ్రతం కళ్ళకి అద్దుకుని పక్కన పెట్టి ద్వాదశి రోజున పారణ తరువాత దానిని తినాలి.
పుష్యమాసములో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్య కాంతి అద్భుతమగు యోగచైతన్యమును ప్రసాదింపగలదు. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రము. చెప్పలేనంత కాంతిని దర్శనము చేయించే మాసము పుష్యమాసము. ఉత్తరాయణ పుణ్యకాలములో సూర్యుడు దక్షిణము నుండి ఉత్తరదిశగా పయనము సాగిస్తాడు. అనగా ఊర్ద్వ ముఖముగా ప్రయాణము. మనలోని ప్రాణశక్తి బలమును కూర్చుకొను సమయము. సూర్య కిరణములయందు ఒక ప్రత్యేకమైన హరణ్మయమైన కాంతి ఉండును. ఇది మన బుద్ధిని ప్రచోదనము గావించును. మనస్సును అంటిపెట్టు కున్న స్వభావము నందలి అశుభములను ఆ కాంతి హరింపగలదు. బుద్ధిబలము, ప్రాణబలము పుష్టిగా లభించే మాసము పుష్యమాసము.
షట్‌తిల ఏకాదశి:
దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు తిలలతొ (నువ్వులు) ఆరు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు గురువరేణ్యులు ప్రవచిస్తున్నారు.
పితృదేవతలకు ఆ రోజు అత్యంత ప్రీతికరం. ఆ రోజున వారికి అర్పణాలు వదలడం ఆచారంగా వస్తున్నది. ఆరు కార్యాలు ఏమిటంటే..
1) నువ్వులతో స్నానం (తిలాస్నానం),
2) స్నానానంతరం నువ్వులముద్ద చేసి ఆ చూర్ణాన్ని శరీరానికి పట్టించడం
3) ఇంటిలో తిల హోమం నిర్వహించడం
4) పితృ దేవతలకు తిల ఉదకం సమర్పించడం
5) నువ్వులు కాని, నువ్వుల నూనె కాని ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వడం
6) చివరగా తిలాన్నం భుజించడం. (బియ్యం వుడికె సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం)
ఆ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేసినవారికి పితృ దేవతలు, శ్రీ మహా విష్ణువు సంతసించి దీవెనలు అందజేస్తారు. ఆ కర్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట. తిలా ఏకాదశిని యధావిధిగా పాటిస్తే ఆ పరంధాముడు సంతసించి దైహిక సంబంధమైన సర్వసుఖాలు సహా ఆ తరువాత ఊర్ధ్వ, అధో లోకాల్లో కూడ ఉత్కృష్ఠ స్థానం అనుగ్రహిస్తూ దీవిస్తాడని విశ్వాశం. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయం, భగవంతుడు అంశాలపై సంపూర్ణ విశ్వాసం ఉన్న వారు మరి ఉద్యుక్తులై భగవదాశీస్సులు పొందండి.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)