మన సనాతన భారతీయ సంస్కృతి అనేక ఆచార సాంప్రదాయాలకు నిలయం. ఇలాంటి ఆచార సంప్రదాయాలలో అనేక పండుగలు, వ్రతాలు, యజ్ఞయాగాదులు ఆచరించటం అనాదిగా భారతీయ సంస్కృతి. ఇలాంటి సంస్కృతీ సంప్రదాయాల్లో మాసాలకు కూడా ప్రత్యేకత ఉంది. హిందూ సంస్కృతిలో ప్రతిమాసానికి విశిష్టత ఉంది. ఇందులో కార్తీక మాసం మహా మహిమాన్వితమైనది. ఈ మాసం శివ, వైష్ణవ, శక్తి ఆరాధనకే కాక గో ఆరాధనకు చాలా ముఖ్యమైనది. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి ముందు ఉండే అష్టమిని గోపాష్టమని, పౌర్ణమి తరువాత వచ్చే ద్వాదశిని గోవత్సద్వాదశి అని మన ఋషూలు గోమాతకు సంబంధించి ఈ తిధుల్ని విశేషంగా చెప్పారు.
గోపాష్టమి రోజున గోవుకు పూజ చేసి దానికి ధాన్యం లేదా పండ్లను తినిపించడం వల్ల విశేషమైన పుణ్యం వచ్చి చేసిన పాపాలు అన్నీ పోతాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. గోవత్స ద్వాదశి రోజున దూడతో కూడిన ఆవుకు పూజ చేసి గోవు యొక్క పృష్ఠ భాగంలో తోకను నమస్కరించి దానికి చివరకు ధాన్యం పెట్టకపోయినా, రెండు పండ్లు తినిపించినా ఆ సంవత్సరంలో పొందవలసిన ప్రయోజనములన్నీ పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి.
గోవును తల్లిగా భావించడం మన హిందూ సంస్కృతి. గోవులను పూజించడం మన ఆచారం. గోమాత మన సంప్రదాయంలో విడదీయరాని సంబంధం కలిగి ఉంది. గోవు లేకపోతే మన సంస్కృతిలో లోపం ఉన్నట్లే. ఎందుచేతనంటే శివుని వాహనం నంది గోసంతతికి చెందినదే. నందిలేని శివాలయం, గోక్షీరం లేని శివాభిషేకం ఏ లోకంలో ఉండదు. కామధేనువు, నందినీ ధేనువు, సురభి మొదలైన గోమాతలను మన పూర్వీకులు పోషించి రక్షించి పూజించినట్లు మన పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మానవుడు పుట్టింది మొదలు చనిపోయే వరకు అనేక సంస్కార క్రియల్లో గోవు వినియోగం ఎంత ఉందో లోకంలో మనం చూస్తూనే ఉన్నాం.
గోవు పరదేవతా స్వరూపము. అనగా సకల దేవతలు గోరూప ధారి గాగ అని ‘సాధు గోమాత భరత భూశ్వాస కోశ’ అని గోమాతలో సకల దేవీదేవతలు నివాసముంటారని, గోవు భారత భూమికే శ్వాసకోశము వంటిది. గోవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అంత మంది దేవతలు గోవులో ఉంటారన్నది శాస్త్ర వచనం.
‘‘గావః విశ్వస్య మాతరః గవా మాంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ’’
ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిది. గోవు నందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది. అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం. క్షీర సాగరమధన సమయంలో నంది, శుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని భవిష్యపురాణం తెలియజేస్తుంది. వీటినే కామధేనువులు అంటారు.
గో శబ్దానికి ఆవు, ఎద్దు, సూర్యుడు, యజ్ఞం, వాక్కు, దిక్కు, భూమి, స్వర్గం, ఉదకం, వెంట్రుక, గుఱ్ఱం, బాణం, వజ్రం, నేత్రం, ముని, పగ్గం, అల్లెత్రాడు అని ఎన్నో అర్థాలు చెప్పవచ్చు. ‘‘ధేనునా మస్మి కామధుక్’’ అని గీతలో శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు. గోవు లక్ష్మీ స్వరూపం దీనికి ఒక పురాణ గాధ ఉంది. దేవతలందరూ వచ్చి గోవుతో తల్లీ మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికి భాగం ఇవ్వడం జరిగింది.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)