మానవులు పుడతారు … చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు … వీరిని “మృతంజీవులు” అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -, కాళోజీ నారాయణరావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ….
తెలంగాణ తొలిపొద్దు కాళోజీ!-‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం, బిజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించిన కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్న డ, ఇంగ్లిష్ భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడ’వ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి. బిజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది.
ప్రాథమిక విద్యానంతరం హైదరాబాద్ పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజ్‌లోనూ, హనుమకొండలోని కాలేజియేట్ హైస్కూల్‌లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. 1939లో హైదరాబాద్‌లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించారు. నిజామాంధ్ర మహా సభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌తో కాళోజీ అనుబంధం విడదీయరానిది.
మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామ్‌కిషన్‌రావు, పీవీ నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ సామాన్యుడే నా దేవుడని ప్రకటించిన కాళోజీ 2002 నవంబర్ 13న తుదిశ్వాస విడిచారు.
అనితర సాధ్యం కాళోజీ మార్గం
‘ఒక ప్రధానిగా ఎన్నో ఒడిదొడుకుల్ని సునాయసంగా ఎదుర్కొన్నాను. ఎన్ని సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాను. ప్రపంచాధినేతలను చూసి కూడా కించిత్తు జంకలేదు. ఆ భగవంతునికి కూడా భయపడను కానీ కాళోజీ నారాయణరావు చూస్తే వణికిపోతాను’ అని పి.వి.నర్సింహారావు కాళోజీ సంస్మరణ సభలో అన్న మాటలు ఆయనను ప్రేమించే అందరికీ వర్తిస్తాయి. కాళోజీ పై ఉన్న గౌరవం, ప్రేమ ఎప్పటికీ చెరిగిపోనిది. నాకు కాళోజీ అంటే ఒక్కసారిగా భయం, భక్తి ఆవహిస్తాయి. తరగతి గదికి వెళ్లే ఉపాధ్యాయుడు ఈ రోజు పిల్లల నుంచి తానేమి నేర్చుకుంటానని భావిస్తారు. కాళోజీ నిరంతర అన్వేషి. కాళోజీ సాహిత్య మేధోమథనం, కాళోజీ తెలుగు సమాజ జీవనచిత్రం. మొత్తంగా ఆయన తెలంగాణ సమాజముఖచిత్రం. కాళోజీ పౌరహక్కుల ఉద్యమ పోరుకేక. కాళోజీ అన్యాయంపై తిరగబడ్డ గుండె ధైర్యం. అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న కాళోజీ నారాయణరావు అవార్డును ఆయన 10వ వర్ధంతి సందర్భంగా నాకివ్వటం నాకెంతో గర్వకారణంగా ఉంది.
ఇప్పటి వరకు నా జీవితంలో పొందిన అనేక పురస్కారాల కంటే కాళోజీ అవార్డు అందుకోవటం అన్నింటికన్నా ఉన్నతమైనదిగా భావిస్తాను. ఇప్పటి వరకు నా జీవితంలో అనేక సన్మానాలు పొందాను. కానీ కాళోజీ అవార్డు పురస్కారం నా జీవితానికి కొనసాగింపుగా చేస్తున్న సన్మానంగా భావిస్తాను. కాళోజీ మిత్రుల పేరుతో కాళోజీ ఫౌండేషన్ వారు ప్రకటించిన అవార్డును అందుకోవటం కంటే ఆనందం నాకింకొటిలేదు. ఎవస్టు శిఖరాన్ని ఎన్నిసార్లైనా అధిరోహించి రావచ్చును కానీ కాళోజీ స్థాయికి ఎదగటం మాత్రం కనాకష్టం. అందువల్ల ఈ అవార్డు తీసుకోవటం వల్ల కాళోజీ కావటానికి శాయశక్తులా కృషి చేయటమే చేయగలను. ఎందుకంటే కాళోజీ కావటం ఎవరికీ సాధ్యంకాదు కాబట్టి ఆ మార్గం లో కొన్ని అడుగులు వేసి నడిచేందుకు ప్రయత్నించటమే మనముందున్న కర్తవ్యం. నేను శాసనమండలిలో కాళోజీ నారాయణరావు ప్రాతిధ్యం వహించిన ఉపాధ్యాయ నియోజకవర్గం సీటులో ఆరేళ్ల్లు కూర్చున్నాను. నేను అనేకసార్లు శాసనమండలిలో సభ్యులందరికీ గర్వంగా చెప్పాను. నేను చుక్కా రామయ్యనే కానీ కాళోజీ వారసుణ్ణి అని చెప్పాను. ఆ వారసత్వంతోనే తెలంగాణకు జరిగిన అన్యాయాల్ని గొంతెత్తి చెప్పగలిగాను. ఆ ధైర్యం, స్ఫూర్తి కాళోజీ అందించాడు.
తెలంగాణకు జరిగిన అన్యాయాల్ని శాసనమండలిలో ధైర్యంగా బయటపెట్టగలిగినవాడు కాళోజీ నారాయణరావు. తెలంగాణలో ఉన్న ఫ్యూడల్ వ్యవస్థను కూల్చడానికి మహత్తర సాయుధ పోరాటమే జరిగింది. ఆంధ్ర మహాసభ చైతన్య దివిటీలను అందించింది. ఈ ఫ్యూడల్ వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలించటానికి ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులు ‘విశాలాంధ్ర’ సునాయాసన మార్గంగా భావించారు. విశాలాంధ్ర వస్తే ఫ్యూడల్ వ్యవస్థ పోతుందన్న భావనతో వాళ్లు ఒప్పుకున్నారు. మొత్తం ఆలోచనాపరులు అలాగే ఆలోచించారు. విశాలాంధ్ర వస్తే ఏం జరుగుతుందని ఆశించారు. అందుకు భిన్నంగా వాతావరణం మారింది. తెలంగాణలో పాతదొరలు పోయి ఆధునిక దొరలు ఆవిర్భవించారు. అందువల్లనే తెలంగాణ ఆగ్రహించింది. 1956 నుంచి మూడేళ్లలోనే మారిన పరిస్థితులు చూసిన ప్రజలు 1969 ఉద్యమ అగ్గి అయి భగ్గున మండారు. సమస్త తెలంగాణ ప్రజానీకం విశాలాంధ్ర జెండా వదిలిపెట్టి తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఎత్తుకుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయటం వల్లనే దీర్ఘయావూతగా రాష్ట్ర సాధన ఉద్యమం కొనసాగుతూ వచ్చింది.
తెలంగాణ నేల నుంచి పెండ్యాల రాఘవరావులాంటి ఉన్నతులు ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు. భీమిడ్డి నర్సింహాడ్డి, మగ్ధూం, రావి నారాయణడ్డి, ఆరుట్ల రాంచంవూదాడ్డి, నర్రా రాఘవడ్డి, ఉప్పల మనుసూరులాంటి వాళ్లు శాసనసభ్యులుగా వచ్చారు. ఎమ్మెల్యేగా పనిచేసి కూడా చెప్పులు కుట్టుకుంటూ సాధారణ జీవితం గడుపుతూ చరివూతలో ఉన్నతస్థానాలను అలంకరించిన ఉప్పల మనుసూరులాంటి మహానీయులు, ధర్మభిక్షం లాంటి ప్రజల మనుషులు పార్లమెంటు, శాసనసభ్యులుగా ఎంపికవుతూ వచ్చారు. ప్రజల హృదయాలను ఆవిష్కరించిన జననేతలే ఇక్కడ ప్రజావూపతినిధులుగా ఎన్నికవుతూ వచ్చారు తప్ప ఈ నేల నుంచి వ్యాపారవేత్తలను పార్లమెంటుకు పంపలేదు. ఈరోజు రాష్ట్రంలో ఎంపీలను చూస్తుం కార్పొరేట్ రంగం నుంచి వస్తున్నారు.
ప్రజల హృదయాలలో ఉండగలిగినవారు చెప్పిన మాటకే సమాజమంతా కట్టుబడి ఉంటుంది. అందువల్లే కాళోజీ ఏ నినాదంతో పోరాడారో అదే నినాదంతో ఈ రోజు తెలంగాణ సమాజం కదిలివస్తుంది. ప్రజావూపతినిధి అంటే ప్రజల మనోభావాలను చెప్పగలగాలి. అన్యాయాలను ప్రతిఘటించినవాడు కాళోజీ. ప్రాంతాలకు అతీతంగా పోరాడగలిగిన ఉన్నతుడు కాళోజీ. మానవ హక్కుల కోసం గొంతు పెకిలించి పౌరహక్కుల నినాదమయ్యాడు. జన కవిత్వాన్ని పండించినవాడు. నిరంతరం ప్రజాఉద్యమాల్లో పాలు పంచుకున్నవాడు. అధికారాన్ని ధిక్కరించినవాడు. గొప్ప దేశభక్తడు అయిన మా అన్న రామేశ్వపూరావు భుజాల మీద పెరిగానని అందువల్లనే తాను అదృష్టవంతుణ్ణయ్యానని కాళోజీ చెప్పుకునేవాడు. కాళోజీకి కుటుంబ సంపదను, సామాజిక ఆలోచనల భావజాలాల్ని అందించిన అభ్యుదయ భావాల వనం రామేశ్వపూరావు.
ఇద్దరు అన్నదమ్ములు కాళోజీ రామేశ్వరావును, కాళోజీ నారాయణరావులను విడిగా చూడలేం. కాళోజీ ప్రతిష్ఠలో రామేశ్వరరావు కృషి ఉంది. నాకు చదువు చెప్పించిన న్యాయవాది తాండ్ర వెంకవూటామ నర్సయ్యకు కాళోజీ సోదరులు ఆప్తులు. ఆయన దగ్గరే కాళోజీ ప్రాక్టీసు చేశారు. తమతో విభేదించే వారిని కూడా అక్కన చేర్చుకునే మనస్తత్త్వం తెలంగాణ ప్రజలకుంది. నాందేడ్‌కు చెందిన బి.టి. దేశ్‌పాండేను, ఆంధ్ర ప్రాంతానికి చెందిన రామకృష్ణారావును చెన్నూరు ఎమ్మెల్యేగా తెలంగాణ నేల ఆలింగనం చేసుకుంది. తెలంగాణ ప్రాంతం వారికి ప్రాంతీయ భేదాలు లేవు. ఇక్కడ ఇతర ప్రాంతాలవాళ్లు ఎంపీ లు, ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణవాళ్లను ఎవరినైనా ప్రజావూపతినిధులుగా ఎన్నుకున్నారా? తెలంగాణ ప్రజలకు ప్రాంతీయతత్త్వం ఉందని కొందరు చేస్తున్న ఆరోపణలు దుర్మార్గమైనవి. ఇది తెలంగాణపై మార్కెట్ సమాజం చేస్తున్న కుట్రలుగా భావించాలి. ప్రాంతీయతత్త్వంలేని విశ్వనరులు తెలంగాణ ప్రజలు.
ప్రపంచ తెలుగు మహాసభలను ఎందుకు బహిష్కరించాలంటే?
తెలంగాణే తెలుగు భాషను బతికించింది. తెలంగాణ ప్రజలు తెలుగు భాషను, తెలుగు సంస్కృతి రెండువందల సంవత్సరాలు తమ గుండెల్లో పెట్టుకుని కాపాడా రు. తెలుగుభాషంటే ప్రేమ, గౌరవం తెలంగాణ గుండె నిండా ఉంది. తెలుగుకు ప్రాచీన భాషా హోదా కోసం తెలుగునేలంతా తిరిగితే ఆనవాళ్ల ఎక్కడా దొరకలేదు. కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో శాతవాహనుల కాలం నాటి ఆనవాళ్ల లభించటమే తెలుగుకు ప్రాచీన భాషాహోదా లభించడానికి కారణభూతమయ్యాయి. తల్లి శిశువును కాపాడినట్లు తెలుగు భాషను తెలంగాణ రక్షించింది. ఎన్నో దశలలో మనమంతా ఒక్క సూత్రానికి కట్టుబడ్డ తెలంగాణ ప్రజల్ని గేలిచేశారు. మా భాష ను, మా సంస్కృతి హేళన చేస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి. తిరగబడి తీరుతారు. అసలు ప్రాంతీయ విద్వేషాలను ఎవరు రెచ్చగొట్టారు? తెలుగు భాషను సంరక్షించి పోషించిన తెలంగాణను ద్వేషిస్తే, పలచనచేసి చూస్తే తెలంగాణ అస్తిత్వ ఉద్య మం పొడుస్తున్న పొద్దుగా పొడవదా మరి.
ఒక ప్రాంతం తెలంగాణ సంస్కృతి గేలిచేస్తుంటే ఇక్కడ మాత్రం దివాకర్ల వెంకటావధ శతజయంతి సభలు, గురజాడ అప్పారావు శత జయంతి సభలు జరుపుకున్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు క్షోభిస్తుంటే, వేయిమంది దాకా ఆత్మబలిదానాలు చేసుకుని తమ ప్రాణాల్ని చెట్లకు వేలాడదీసి నినదిస్తుంటే రాష్ట్ర ప్రభు త్వం ప్రపంచ తెలుగు మహాసభలు ఎలా జరుపుతుంది? ప్రపంచ తెలుగు మహాసభల్ని అందుకే బహిష్కరిస్తున్నాం. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ మహాసభల్ని తెలంగాణ సమాజం బహిష్కరిస్తుంది. అధికారానికి లొంగిపోకుండా ధిక్కరించి నిలవమని చెప్పిన కాళోజీ స్ఫూర్తిగా ఈ తెలుగు మహాసభలను బహిష్కరిస్తున్నాం.
ప్రపంచ మహాసభల పేరున తెలంగాణ ప్రజల గుండె గాయాలను మాన్పలేరు. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు తెలంగాణలో జరుగుతున్న ఆత్మబలిదానాల గురిం చి ఆందోళన చెందుతుంటే ఈ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు జరపటంలో అర్థం ఏమిటి? కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో తెలుగు భాష కోసం అక్కడి ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయి. మరి మన తెలుగుగడ్డ మీద వీళ్లు చేసింది. ఏమి టి? మన ప్రభుత్వం తెలుగు భాషను మార్కెట్ చేసింది. ఇపుడు ఈ తెలుగు మహాసభలను రాజకీయం చేస్తున్నారు. మనదంతా ఒకటే భాష అని భాషా కత్తిని ఉపయోగించి తెలంగాణ ఉద్యమాన్ని అణచటం కోసం తిరుపతిలో ప్రపంచ మహాసభలు జరుపుతారా? తెలుగు భాషాభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు. అధికారం చేస్తు న్న కుట్రలకు వ్యతిరేకం. హైదరాబాద్‌లో జీవవైవిధ్య సదస్సు పోలీసుల రక్షణలో చేయవలసిన గతి ఎందుకు ఏర్పడింది? చివరకు సదస్సు శాంతిభవూదతల సమస్యగా మారింది. హైదరాబాద్ నగరం మిలటరీతో నింపి జీవవైవిధ్య సదస్సు జరుపుకుంటారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. జీవవైవిధ్య సదస్సులాగే పోలీసుల రక్షణలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకోండి.
ప్రపంచ మహాసభలలో చేసే సన్మానాలను తెలంగాణ ప్రజలు, కవులు, రచయితలు, కళాకారులు తిరస్కరించి తీరుతారు. కాళోజీ పురస్కారాన్ని అందుకోవటం పద్మశ్రీ పురస్కారాలకంటే ఉన్నతమైనది. ఈ కాళోజీ పురస్కారం అందుకొంటున్న ఈ తరుణంలోనే ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించేందుకు సిద్ధపడుతున్నాను. ప్రజల కోసం పనిచేసే మహత్తర ఉద్యమాల్లో మునుందు ముందుకు సాగటానికి ఓ కాళోజీ నువ్వు నాలోకి పరకాయ ప్రవేశం చేయమని వేడుకుంటున్నాను. నేను చాలా చిన్నవాణ్ణి. నాలో శక్తిని నింపమని కాళోజీని ప్రార్థిస్తున్నాను. కాళోజీ అవార్డు అందుకోవటం ద్వారా నేను ధైర్యాన్ని నింపుకుంటున్నాను.
మళ్లీ నేనెందుకు కౌన్సిల్‌కు పోనంటే?
శాసనమండలి అరణ్యరోదనగా మారింది. నేను ఎంపికైన ఆరేళ్ల నుంచి శాసనమండలిలో అజ్ఞాతవాసం చేసినట్లుంది. శాసనమండలి నుంచి ఇప్పుడు స్వేచ్ఛగా సమాజ కౌన్సిల్ ముందుకు వస్తున్నాను. కౌన్సిల్‌లో చైర్మన్ చక్రపాణి గంటకొట్టగానే కూర్చునేవాణ్ణి. ఆంధ్రమహాసభ నేర్పిన పాఠం, తెలంగాణ సాయుధ పోరాటం ఇచ్చిన శిక్షణ, జీవితాంతం క్రమశిక్షణ గల ఉపాధ్యాయునిగా జీవించటం వలన కౌన్సిల్‌లో చైర్మన్ బెల్‌కొట్టగానే వెంటనే కూర్చునేవాణ్ణి. నా మాటను, నా తెలంగా ణ ఉద్యమ మాటను శాసనమండలి వినేందుకు ఎందుకు ఒప్పుకుంటుంది చెప్పండి. అందుకే నేను ఆ డిసెంబర్ 9 తేదీనే అమెరికా నుంచి నా రాజీనామాను చైర్మన్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపాను. ఒక్కసారి రాజీనామా చేశానని ప్రకటించినవాణ్ణి తిరిగి మళ్ళీ పోటీకి దిగుతానా? తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తిరిగి రాజకీయ పునరుజ్జీవిగా ప్రజల ముందుకు వస్తాను. అప్పటి దాకా శాసనమండలి వైపు చూడను. అట్లాని ప్రేక్షకుడిలా కూర్చోను. పాలకుర్తి సోమనాథుడు, బమ్మెర పోతనలు నడయాడిన పాలకుర్తి, గూడూరు నుంచి వచ్చిన వాడిగా, ఐలమ్మ సాక్షిగా, దొడ్డి కొమరయ్య చిందించిన రక్తతర్పణ సాక్షిగా దీర్ఘకాల తెలంగాణ పోరాట గాయాల గుండె ఘోషల సంతకంగా ప్రజల పక్షం వహించి నిలబడతాను.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)