శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన పర్వదినంగా ఏకాదశి కనిపిస్తుంది. శ్రీమహా విష్ణువు అనుగ్రహాన్ని అనతికాలంలో కలిగించడం ఏకాదశి వ్రత ఫలితంగా చెప్పబడుతోంది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత వుంది. ప్రతి ఏకాదశి ఆ స్వామి పాదాల చెంత స్థానం కల్పించేదే .. ఆయన అనుగ్రహాన్ని అందించేదే. అలాంటి ఏకాదశులలో ఆశ్వయుజ బహుళ ఏకాదశి ఒకటిగా చెప్పబడుతోంది. దీనినే ‘రమా ఏకాదశి’ అని అంటారు.
లోక కల్యాణం కోసం ఆయన వివిధ అవతారాలను ధరించాడు. తన భక్తులు ఆపదల్లో వున్న సమయాల్లో తనని తాను మరిచి పరిగెత్తుకు వచ్చిన సందర్భాలు పురాణాల్లో కనిపిస్తూ వుంటాయి. అలాంటి శ్రీమన్నారాయణుడిని అనునిత్యం పూజించాలి … అనుక్షణం ఆరాధించాలి. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆ స్వామిని సేవించడం వలన లభించే పుణ్యఫలాలు మరింత విశేషంగా ఉంటాయని చెప్పబడుతోంది.
ముఖ్యంగా ‘ఏకాదశి వ్రతం’ ఆచరించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది. అలా ఆశ్వయుజ బహుళ ఏకాదశి రోజున కూడా వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి … శ్రీమహావిష్ణువును అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించవలసి వుంటుంది. విష్ణు సహస్ర నామం చదువుతూ జాగరణ చేయవలసి వుంటుంది.
శ్రీ మన్నారాయణుడిని పూజించిన అనంతరం సాలగ్రామం … పెసరపిండితో చేసిన లడ్డూలు … బెల్లం దానంగా ఇవ్వాలని చెప్పబడుతోంది. ఈ విధంగా రమా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన అనేకమైన దోషాలు నివారించబడతాయి … అనంతమైన పుణ్యఫలితాలు కలుగుతాయి. అందుకు నిదర్శనంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన అనేకమంది కథలు ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తూ ఉంటాయి.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)