Categories
Vipra Foundation

దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం (కర్కాటక సంక్రమణం ప్రారంభం)

      భారతదేశంలో ప్రాచీనకాలం నుంచి కాలగణo అద్భుతంగా చేశారు. ప్రతి సంవత్సరాన్ని రెండు అయనాలుగా విభజించారు. ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. పన్నెండు రాశుల్లో సూర్యుని ప్రవేశాన్ని బట్టి ప్రతినెలా సంక్రాతి వస్తుంది. ఆ పరంపరలో మకరరాశిలో సూర్యుని ప్రవేశం ‘మకర సంక్రాతి’గా నాటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంగా ఆచరిస్తారు. అదేవిధంగా కర్కాటక రాశిలో సూర్యుని ప్రవేశాన్ని దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంగా లెక్కిస్తారు. దీనినే కర్కాటక సంక్రాoతి అని కూడా అంటారు. కర్కాటక రాశిలో సూర్యుడి ప్రవేశం నాటి నుంచి మకరరాశిలో సూర్యుడి ప్రవేశం వరకు మధ్య కాలాన్ని దక్షిణాయనం అంటారు. ఆరునెలలు దక్షిణాయనం, ఆరునెలలు ఉత్తరాయణం.

      హిందూమతంలో దక్షిణాయన ప్రారంభం దేవతలకు రాత్రి సమయ ప్రారంభంగా విశ్వసిస్తారు. మానవుడి సంవత్సరకాలం దేవతలకు ఒకరోజు. దేవతలకు దక్షిణాయనం రాత్రి పూటగా, ఉత్తరాయణం పగటిపూటగా పరిగణిస్తారు. పురాణాలలో దక్షిణాయనం ప్రారంభమైన రోజు నుంచి విష్ణుమూర్తి నిద్రకు ఉపక్షికమిస్తాడని విశ్వాసం. దీనినే ‘దేవశయన ఏకాదశి’ అని కూడా అంటారు. ఈ సమయంలోనే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది.

కర్కాటక సంక్రాతి రోజున పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించడం లేదా పిండ ప్రదానం చేయడం పురాణకాలం నుంచి వస్తున్న ఆచారం. మరికొన్ని పురాణాలలో వరాహమూర్తి విష్ణుమూర్తిని పూజించిన రోజుగా ప్రసిద్ధికెక్కింది. తమిళనాడులో దక్షిణాయనం ప్రారంభ నాటి నుంచే ఆడి(ఆషాఢ మాసం) ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి ఎటువంటి పండగలు, శుభకార్యాలు చేసుకోరు. అదేవిధంగా దేవతలకు రాత్రిపూటగా భావించే దక్షిణాయనంలో కొన్ని ముఖ్యమైన పండగలు కూడా వస్తాయి.వాటిలో ప్రప్రథమంగా ‘వరలక్ష్మీ వ్రతం’ శ్రావణమాసంలో వస్తుంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ వ్రతాన్ని భారతదేశమంతా ఆచరించడం అందరికి తెలిసిన విషయమే. రుషులు, సన్యాసులు, పీఠాధిపతులు ఈ కాలంలో చాతుర్మాస్య దీక్షను చేపడుతారు.

దక్షిణాయనం ప్రాముఖ్యత :

     కర్కాటక రాశి నుంచి ధనస్సు రాశి వరకు సూర్యుని గమనాన్ని దక్షిణాయనంగా పరిగణిస్తారు అనగా ఈ సమయం నుంచి కాలంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయి. దానితో మానవుని జీవితం కూడా ప్రభావితమవుతుంది. దీనికి ఉదాహరణ కర్కాటక రాశిలో సూర్యుడి ప్రవేశం అనగా ఈ సమయం వర్షాకాలం. ఈ సమయంలో పంటలు, వ్యవసాయ పనులు ప్రారంభమై ఊపందుకొంటాయి. అదేవిధంగా మిగిలిన మూడు నెలలు చలికాలం వస్తుంది.

ఇక ఆధ్యాత్మికంగా ఇది చాలా విలువైన కాలం. శ్రావణ నుంచి కార్తీక మాసం వరకు చాతుర్మాస దీక్ష చేసే కాలం. ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనదిగా విశ్వసిస్తారు. విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్లే సమయం ఇది. ఆషాఢ శుక్ల ఏకాదశిని హరి శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు యోగనిద్రలో గడిపిన విష్ణువు తిరిగి ద్వాదశి లేదా ఉత్థన ద్వాదశి నాడు యోగనిద్ర నుంచి బయటకు వస్తాడని ప్రతీతి. ఇక ఈ సమయంలోనే ముఖ్య పండగలన్నీ వస్తాయి. నాగ చతుర్థీ, వరలక్ష్మీ వ్రతం, ఉపాకర్మ(క్షిశావణ పూర్ణిమ), శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, రుషిపంచమి, శ్రీ అనంత చతుర్దశి, దేవి నవరావూతులు, విజయదశమి, దీపావళి మొదలగు ముఖ్య పర్వదినాలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. మరో విధంగా దక్షిణాయనంలో పితృపక్షాలు వస్తాయి. ఉత్తరాయణం దేవతలకు ప్రీతికరం కాగా, దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించిందిగా భావిస్తారు. ఈ పితృపక్షాలలో తండ్రులు, తాతలు, తల్లి(చనిపోయిన పెద్దలకు) శ్రాద్ధకర్మలు నిర్వహించడం, వారి పేరుమీద పిండప్రదానం, దాన ధర్మాలు చేయడం ఆనవాయతీగా వస్తుంది.

     ఈ సమయంలోనే అయ్యప్ప మాలా దీక్షాధారణ, కార్తీక మాస దీక్షలు అన్నీ వస్తాయి. వాతావరణంలో వేగంగా జరిగే మార్పులకు తట్టుకొని రోగాల బారిన పడకుండా ఉండేలా పూర్వీకులు రకరకాల దీక్షలు, వ్రతాలు, ఆచారాలను ప్రవేశపెట్టి ఇటు శారీరక రక్షణతోపాటు, మనిషిని దైవం వైపు నడిపించేలా కాలాన్ని విభజించారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)