“శరీరే జర్ఝరీ భూతే, వ్యాధిగ్రస్తే కళేబరే, ! ఔషథం జాహ్నవీ తోయం, వైద్యోనారాయణోహరిః !!”
ప్రాణం పోసేది దేవుడైతే.. ప్రాణం నిలిపేవాడు డాక్టర్. అందుకే వైద్యోనారాయణో హరి అన్న నానుడి నిజం. ప్రతి వృత్తి దేనికదే సాటి అయినప్పటికీ వైద్య వృత్తి వాటికి భిన్నమైనది. మృత్యువు చివర అంచులదాకా వెళ్ళిన వారికి ప్రాణం పోసే శక్తి ఈ వృత్తికి ఉంటుంది. అందుకే వైద్య వృత్తి పవిత్రమైనది . నిబద్దత , త్యాగనిరతి డాక్టర్ల నైజం. తమ వ్యక్తిగత జీవితాన్ని పక్కకు పెట్టేసి తెల్లకోటుకే ప్రాదాన్యమిస్తారు. ఎదుటవ్యక్తి ప్రాణాలు కాపాడడానికి …ఎప్పుడు రోగికి మంచి చేయాలనే తపన పడేవాడే నిజమైన డాక్టర్. జీవితకాలం రోగుల సేవలో తరించిపోయే డాక్టర్ల కోసం ప్రపంచమంతా ఒక రోజును కేటాయించింది. అదే వాల్డ్ డాక్టర్స్ డే. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు.
ఇవాళ డాక్టర్స్ డే. దీనికి అనేక ఏళ్ల చరిత్ర ఉంది. డాక్టర్ బీసీ రాయ్ ప్రముఖ భారతీయ వైద్యుడు. ఆయన సేవలతో భారతీయ వైద్య రంగానికి విశిష్ట గుర్తింపు తీసుకొచ్చారు. కోల్ కతా మేయర్ గా, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా , కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పని చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎంగా కూడా పని చేశారు. ఆయన సమాజానికి చేసిన సేవలకు ప్రతిష్టాత్మక భారత రత్న అవార్డు లభించింది. బీసీ రాయ్ స్మారకార్థం ప్రతి ఏటా జూలై ఒకటిన డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఎంతోమంది డాక్టర్లు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్స్ డే సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకుందాం.
సాక్షాత్తు భగవంతునిగా భావించే వైద్య వృత్తి లో ఉంటూ, మంచి సేవా భావం కల్గిన వైద్యులందరికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)