(21-12-1928 —-10-06-2015)
శివానందమూర్తి గారి జీవిత విశేషాలు : కందుకూరి శివానంద మూర్తి మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. భారతదేశం లోనూ, విదేశాల్లోనూ ఆయనకు ఎంతో మంది శిష్యులు, అభిమానులు ఉన్నారు. సంప్రదాయం, సంస్కృతి అంశాల మీద ఎన్నో పుస్తకాలు రచించారు.
ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 1928, డిశంబర్ 21న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సర్వమంగళ, వీరబసవరాజులు శివభక్తులు, దాదాపు 200 శివాలయాలను నిర్మించారు. చిన్నతనం నుండి శివానందమూర్తి ఆధ్యాత్మిక విషయాల పట్ల, ముఖ్యంగా యోగశాస్త్రం పట్ల ఎంతో ఆసక్తి కనబర్చేవారు. 1949 లో సైన్సు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సభ ఆర్డినేట్ సర్వీస్ లో చేరారు. పోలీసు డిపార్టుమెంటులో హన్మకొండలో పని చేస్తున్నప్పుడు కూడా ఆర్తులకు, పేదవారిక సేవచేయడం పట్ల, హిందు ధర్మ బోధన పట్ల ఎక్కువ సమయం వెచ్చించే వారు. ఆఫీసరుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి సేవాకార్యక్రమాల పట్ల, సాంస్కృతిక సేవ పట్ల దృష్టి సారించారు.
సమున్నతమైన భారతదేశం, సనాతన ధర్మంల వేళ్లూనుకున్న ప్రాచీన సంస్కృతి పట్ల ఆయనకు అమితప్రేమ. సన్యాసులతో సహా అందరూ ప్రజాసంక్షేమానికి ట్రస్టీలుగా, సంరక్షకలుగా తమ వంతు కర్తవ్యం నిర్వర్తించాలని తన ప్రసంగాల్లో తరుచూ చెబుతుంటారు. హిందు ధర్మం, దాని చరిత్ర, సంగీత సాహిత్యాలు, నాట్యనాటకాల విషయాల్లో ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం.
రాజకీయ, సాంస్కృతిక ఆధ్యాత్మిక చరిత్ర మీద ఆయన రాసిన వ్యాసాలు ఒక తెలుగు డైలీలో ప్రచురితమై తరువాత భారతీయత పేరిట రెండు సంపుటాలుగా ముద్రితమయ్యాయి. కఠోపనిషత్ మీద ఆయన రాసిన కఠయోగ అన్న పుస్తకం బహథా ప్రశంసలు అందుకని, కంచి పీఠం పరమాచార్య, శృంగేరీ శంకరాచార్యుల మన్ననలను చూరగొంది. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన డేవిడ్ ఫ్రాలీ “అద్వైతం, జ్ఞానం, యోగం, దాని అంతర్వాహినుల గురించి తెలిసిన విశిష్ఠమైన వ్యక్తి శివానంద మూర్తి” అన్నారు. హిందూ వివాహ వ్యవస్థ (2006), మహర్షుల చరిత్ర (2007), గౌతమబుద్ధ (2008) ఆయన ఇతర రచనల్లో ముఖ్యమైనవి. సరైన జీవన విధానం పట్ల సామాన్యుడికి స్ఫూర్తినిస్తూ ఆంధ్రభూమిలో ఆయన రాసిన 450 పైగా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పురాణాలు, కావ్యాలు, సాహిత్య గ్రంథాల నుంచి ఆంధ్రదేశ చరిత్రను క్రోడీకరించి మనకథ పేరిట గ్రంథస్తం చేశారు. ఇది హైదరాబాదు దూరదర్శన్ లో 13 భాగాలుగా ప్రసారమైంది.
భారతీయ కళలను కాపాడుకోవాలనే తపనతో విశాఖపట్నం, భీమిలిలో ఏర్పాటు చేసిన ఆనందవనం ద్వారా ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించారు. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టుకు ఆయన ప్రధాన ధర్మకర్త. భారతీయ సంప్రదాయ సంగీతాన్ని, నాట్యాన్ని ప్రోత్సహించేందుకు శివానంద కల్చరల్ ట్రస్ట్, ఆంధ్రా మ్యూజిక్ అకాడెమీలను నెలకొల్పి తెలుగు రాష్ట్రాలు సహా ఎన్నో ప్రాంతాలలో సాంస్కృతిక, కళారంగాలకు విశిష్ట సేవలందించారు. రికార్డింగుల కోసం ఆనందవనం ఆశ్రమంలో అత్యాధునికమైన రికార్డింగ్ హాల్ ను నిర్మించారు. ఇక్క డ వర్క్ షాపులను నిర్వహిస్తుంటారు. లలిత కళలు, సాంకేతికం, విజ్ఞానం, వైద్యం, జర్నలిజం, మానవశాస్త్రాలు, ఇతర రంగాల్లో కృషి చేసిన వారిని ఈ ట్రస్టు ఒక వేదిక మీదకు తీసుకుని వచ్చిన సన్మానిస్తూ ఉంటారు. ప్రతి ఏటా హైదరాబాదులో ఈ అకాడెమీ సంగీతోత్సవాలను నిర్వహిస్తుంది.
చెన్నైలోని శ్రీరాజలక్ష్మి ఫౌండేషన్ ఆయనను 2000 లో రాజలక్ష్మి ఆవార్డుతో, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సన్మానించాయి.
శివానందమూర్తి గారు చిన్నప్పటి నుండే ఆయనలో ఆధ్యాత్మిక లక్షణాలు కలిగి ఉండేవారని ఆయన గురించి బాగా తెలిసినవారు చెపుతుంటారు. అత్యంత నిరాడంబరంగా ఉండే ఆయన ప్రచారార్భాటాలకి దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక భోధనలు చేసేవారు. ఆయన ప్రవచనాలు ప్రధానంగా సనాతన ధర్మం మీదనే సాగుతుంటాయి. సనాతన ధర్మాన్ని చిత్త శుద్దితో పాటిస్తే భారతదేశానికి పునర్వైభవం సిద్ధిస్తుందని చెబుతుంటారు. సనాతన ధర్మాచారం వల్ల విలువలు ఏర్పడి ఆత్మగౌరవం ఇనుమడిస్తుందని అంటారు.
సద్గురు శివానందమూర్తి గారు 10-06-2015 బుధవారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా మూలుగురోడ్డులో గల గురుకుల ధామ్ లో 2.30 గంటలప్పుడు ఆయన కన్నుమూశారు. 87 ఏళ్ల వయసు గల ఆయన గత కొంతకాలంగా వృద్దాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శివానందమూర్తి గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయన కుమారుడికి ఫోన్ చేసి సద్గురు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎండల ధాటికి ఆయన అస్వస్థులయ్యారు. అప్పటి నుండి ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. చివరికి 10-06-2015, బుధవారం రోజు తెల్లవారుజామున ఆయన కైలాసప్రాప్తి చెందారు.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)