(1923 మే 28 – 1996 జనవరి 18)
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేసారు. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు.
బాల్యము, విద్యాభ్యాసము
నందమూరి తారక రామారావు 1923, మే 28 వ తేదీన, సాయంత్రం 4:32కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది.
కుటుంబం
1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకంను పెళ్ళి చేసుకున్నాడు.
తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలొ ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా; గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.
చలనచిత్ర జీవితం
రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్నికారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్తవయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేసాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు.
రామారావు 1947లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం ఆయన మద్రాసు సర్వీసు కమీషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు.
ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే ఆయనను మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే ఆయన తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. అంచేత ఆయన మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది. 1949లో వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్ పాత్ర పోషించాడు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు షావుకారు కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశాడు. థౌజండ్ లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవాడు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ (తరువాతి కాలంలో నిర్మాత అయ్యాడు) కూడా ఉండేవాడు.
రాజకీయ ప్రవేశం
1978లో ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన కాంగ్రేసు పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో శాసనసభ్యులచేత నామకార్థం ఎన్నిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలయింది.
1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగు విరామసమయంలో ఒక విలేఖరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా? ఆని అడిగాడు. దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగుప్రజల సేవకోసం కేటాయిస్తాను అని చెప్పాడు. ఆయన చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం.
అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసాడు. 1982 మార్చి 21 న హైదరాబాదు వచ్చినప్పుడు అభిమానులు ఆయనకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 సాయంత్రము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పాడు. ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించాడు. పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు. దానిపై నుండే ఆయన తన ప్రసంగాలు చేసేవాడు. దానిని ఆయన “చైతన్యరథం” అని అన్నాడు. ఆ రథంపై “తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!” అనే నినాదం రాయించాడు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్యరథమే స్ఫూర్తి.
రాజకీయ ఉత్థాన పతనాలు
1983 శాసనసభ ఎన్నికల్లో ఆయన సాధించిన అపూర్వ విజయం ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం. అధికారం చేపట్టిన తరువాత, అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ తగ్గింపు వీటిలో ప్రధానమైనది. ఈ నిర్ణయాల కారణంగా చాలా వేగంగా ప్రజాభిమానం కోల్పోసాగాడు. 1984 ఆగష్టు 16 న నాదెండ్ల భాస్కరరావు, అప్పటి గవర్నరు రాంలాల్, ప్రధానమంత్రి ఇందిరా గాంధీల లోపాయికారీ సహకారంతో రామారావును అధికారం నుండి తొలగించి, తాను దొడ్డిదారిన గద్దెనెక్కడంతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్ళాడు. జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు ఆయనకు ఎంతో సహాయం చేసాయి. ఫలితంగా సెప్టెంబర్ 16 న రామారావును తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్టించడం కేంద్రప్రభుత్వానికి తప్పింది కాదు. నెలరోజుల్లోనే, ఆయన ప్రభ తిరిగి శిఖరాగ్రానికి చేరిన సందర్భమిది.
1985-89 మధ్య కాలంలో తన ఏకస్వామ్యపాలన వలన ఎన్టీఆర్ ఎంతో అప్రదిష్ట పాలయ్యాడు. పార్టీలోను, ప్రభుత్వంలోను అన్నీ తానే అయి నడిపించాడు. ప్రజల్లో నిరసన భావం కలగడానికి ఇది ప్రధాన కారణమైంది. 1989లో ఎన్నికలకు కొద్ది నెలల ముందు మొత్తం మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరచి కొత్త మంత్రుల్ని తీసుకున్నాడు. ఈ కాలంలో జరిగిన కొన్ని కులఘర్షణలు కూడా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసాయి. 1989 ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెసు తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించి తిరిగి అధికారానికి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినా భారత దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రేసుకు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ విజయం సాధించాడు. 1991 లో నంద్యాల లోక్‌సభ ఉప ఎన్నికలలో కాంగ్రెసు తరపున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు నిలబడగా, ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవరినీ పోటీగా నిలబెట్టలేదు.
1994లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మధ్య నిషేధం, వంటి హామీలతో, మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారంపడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచాడు. అయితే ఆయన రెండవ భార్య లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగజేసుకోవటం వలన ఆయన చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చింది. పార్టీలో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు. పార్టీలో ముదిరిన సంక్షోభానికి పరాకాష్టగా ఆయన అల్లుడు, ఆనాటి మంత్రీ అయిన నారా చంద్రబాబునాయుడు తిరుగుబాటు చేసాడు. అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. అనతికాలంలోనే, 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించాడు. ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)