Categories
Vipra Foundation

తాళ్ళపాక అన్నమాచార్య జయంతి

       తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 – ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.

       అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాధురంధరుడుగా ప్రసిద్ధికెక్కినవాడు. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. మధురంగా పాడుతుంది. ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాథ. కొండలయ్య తాను ధరించే “బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని” వారికందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య.

       లక్కమాంబ గర్భవతి అయింది. వైశాఖమాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నత దశలో వుండగా నారాయణసూరి, లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైనది, మగశిశువు ఉదయించాడు. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. నారాయణసూరి ఆ శిశువునకు ఆగమోక్తంగా జాతకర్మ చేశాడు.

       “అన్నం బ్రహ్మేతి వ్యజనాత్” అనే శ్రుతి ప్రకారం నారాయణసూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశాడు. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయగురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్ళపాక సాహిత్యంలోను, శాసనాల్లోను కనిపిస్తాయి.

అన్నమయ్య బాల్యం

“హరి నందకాంశజుం డగుట డెందమున

పరమ సుగ్యాన సంపద పొదలంగ………”

       అన్నమయ్య బొసి నవ్వులు వొలకబోస్తూ నలుగురినీ మురిపించేవాడు. మాటి మాటికి వెంకటప్పకు జోతలు పెట్టేవాడు. వెంకన్న పేరు చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు. వేంకటపతికి మొక్కుమని చెబితేనే మొక్కేవాడు. వేంకటపతిమీద జోలపాడనిదే నిద్రపోడు. లక్కమాంబ భక్తిగీతాలు పాడుతుంటే పరవశించి పోయేవాడు. నారాయణసూరి కావ్యాలలో అర్ధాలు వివరిస్తూవుంటే తానూ ఊ కొట్టేవాడు. ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వేంకటపతి మీది ధ్యానంతో ప్రొద్దులు గడిపేవాడు. అన్నమయ్యకు అయిదు సంవత్సరాలు వయస్సులో నారాయణసూరి ఆర్యుల సమ్మతి ప్రకారం ఉపనయనం చెయించాడు.

తిరుమల పయనం

       ఒకనాడు (8వ ఏట) ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుచుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయెను. అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది. అప్పుడు పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు.

తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు.

సంసారం, సంకీర్తనం

       అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు. ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు. అప్పటినుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు.

రాజాశ్రయం

       విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీకృష్ణదేవరాయలుకు తాత), టంగుటూరు కేంద్రంగా ఆ సీమ (“పొత్తపినాడు”) పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి “మూరురాయర గండ” అనే బిరుదుండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో హరిదాసకూటాలలో ప్రసిద్ధమయ్యింది.

అంత్య కాలం

       రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. “మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే” అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు “సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే” అన్నాడట.

95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.

ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. “పదకవితా పితామహుడు”, “సంకీరత్నాచార్యుడు”, “పంచమాగమ సార్వభౌముడు”, “ద్రవిడాగమ సార్వభౌముడు” – ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.

దొరికిన పెన్నిధి

1922లో, 14,000 అన్నమయ్య కీర్తనలు, ఇతర రచనలు లిఖించిన 2,500 రాగిరేకులు తిరుమల సంకీర్తనా భాండాగారం (తరువాత పెట్టిన పేరు)లో లభించాయి. ఇది తిరుమల హుండీకి ఎదురుగా ఉన్న ఒక రాతి ఫలకాల గది.

ప్రాజెక్టులు, సంస్మరణా కార్యక్రమాలు అన్నమయ్య యొక్క విస్తృత పద సంపదను ఉపయోగించుకొని ప్రజలలో వేంకటేశ్వరుని మధురభక్తిని మరియు శరణాగతిని ప్రోత్సహించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు స్థాపించబడింది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)