ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని పురాణగాథలు చదివినా సరిపోదు. ఈ ఏకాదశిని ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకుని మోక్షం పొందిన ఎందరో పుణ్యపురుషులు ఉన్నారు మన పురాణాలలో. ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతతని ఇవ్వటమే కాదు శారీరికంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పదిహేను రోజులకొకసారి ఒక రోజు మొత్తం ఏమి తినకుండా ఉండటం వల్ల కడుపుకి విశ్రాంతి లభించి, ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.
మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత. ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే (శుక్ల పక్ష) ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు. దీనినే “ధాత్ర ఏకాదశి” అనీ అంటారు. ఈ రోజు ఉసిరి చెట్టు కి విశేష పూజలు చేస్తారు. విష్ణు మూర్తి ఈ రోజు ఉసిరి చెట్టులో కొలువుతీరి ఉంటాడని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాదు లక్ష్మి దేవి, కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసముంటారని ప్రతీతి. రాధా కృష్ణులు కూడా హోలికి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీలలాడుతూ ఉంటారని మన పురాణగాథలు చెపుతున్నాయి.
ఈ ఏకాదశికి సంబంధించిన కథని చూసినట్లయితే చిత్రసేనుడు అనే రాజు, ఆ రాజ్యంలోని ప్రజలు క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవారట. ఒకసారి వేట కోసం అడవికి వెళ్ళిన చిత్రసేన మహారాజు దారి తప్పి రాక్షసుల చేతుల్లో చిక్కుకుంటాడు. వాళ్ళు అతనిని బంధించి తమ స్థావరానికి తీసుకొని వెళ్తారు. స్పృహతప్పి పడిపోయిన చిత్రసేనుడి దేహం లో నుండి ఒక కాంతి పుంజం బయటకి వచ్చి ఆ రాక్షసులని హతమారుస్తుంది. కొద్ది సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ పది ఉన్న రాక్షసులని చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతం వల్ల నువ్వు సురక్షితంగా రక్షించబడ్డావు అని ఆకాశవాణి పలుకుతుంది. ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలందరూ చిత్రసేనుడికి జైజైలు కొట్టి అప్పటినుంచి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ ఒకే ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని చేయటం ప్రారంభించారు.
ఈ ఏకాదశి రోజున భక్తీ శ్రద్ధలతో ఉసిరిచెట్టుని పూజించిన వారికి సకల సంపదలు కలిగి, దేహాన్ని విడిచాకా మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. అవకాశం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటకాలు తిన్నా, ఉసిరిని దక్షిణతో కలిపి బ్రాహ్మణులకు దానం ఇచ్చిన విశేష ఫలితాలు లభిస్తాయట. మనం కూడా ఆ నారాయణుడి కృపకి పాత్రులం అవుదాము.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)