Categories
Vipra Foundation

మాఘ పౌర్ణమి

     మహా మాఘి ……….. మాఘ పౌర్ణమిచాంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసానికి ఆ నక్షత్రం పేరు వర్తిస్తుంది. పౌర్ణమి నాడు మఘ నక్షత్రం ఉండుట వలన ఈ మాసానికి మాఘమాసం అని పేరువచ్చిం.

”అకార్తీక మాసం దీపానికెంత ప్రాధాన్యత ఉందో మాఘమాసంలో స్నానానికంత ప్రాశస్త్యం. మాఘమాసం సంవత్సరానికి సంధ్యా సమయమంటారు. ఈమాసంగురించి పద్మపురాణంలో వివరంగా ఉంది.

    మాఘస్నానం చిరాయువు, సంపద, ఆరోగ్యం, సౌజన్యం, సౌశీల్యం, సత్సంతానం కలగచేస్తుంది. ‘తిల తైలేన దీప శ్చయా: శివగృహే శుభా:’ అని శివ పురాణం పేర్కొంది. దీన్నిబట్టి శివాలయంలో ప్రదోషకాలంలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. సంవత్సరంలో ఇది పదకొండో మాసం. గృహనిర్మాణాలు ప్రారంభిస్తే మంచిది. ఈ మాసంలో ఆదివారాలు విశేషమైనవి. ఆదివారాల్లో స్నానా నంతరం సూర్యుడికి అర్ఘ్యమివ్వడంతో పాటు సూర్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించడం, ఆదివార వ్రతం చేయడం మంచిది. ఆదివారాలు తరిగిన కూరగాయలు తినకూడదంటారు.

   తెలుగునాట మాఘపాదివారాల్లో స్త్రీలు నోము నోచుకుంటారు. ఈ నెల్లో వచ్చే నాలుగాదివారాలు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గు పెట్టి సూర్యోదయ సమయానికి సూర్యారాధన చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు.

       యజ్ఞంలో అశ్వమేధం, పర్వతాల్లో హిమాలయం,వ్రతాల్లో సత్యనారా యణస్వామి వ్రతం, దానాల్లో అభయదానం, మంత్రాల్లో ప్రణవం, ధర్మాల్లో అహింస, విద్యల్లో బ్రహ్మవిద్య, ఛందస్సులో గాయత్రీ, ఆవుల్లో కామధేనువు, వృక్షాల్లో కల్పతరువు ఎంతగొప్పవో స్నానాల్లో మాఘ స్నానం అంత మహిమాన్వితమైంది. సూర్యుడు మకరరాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడో, ఆనాటి నుంచి ప్రాత:స్నానం తప్పక చేయాలి. నదులు, చెరువులు, సముద్రతీరాలదగ్గర లేదా బావివద్దా స్నానంచేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని పద్మ పురాణం స్పష్టం చేస్తోంది.

      ప్రతిరోజూ పర్వదినమే: ఈ మాసంలో ప్రతిరోజూ పవిత్రమైనవే. శుద్ధ విదియ త్యాగరాజస్వామి ఆరాధన చేస్తే, తదియనాడు ఉమాపూజ, లలితా వత్రం చేయాలంటుంది చతుర్వర్గ చింతామణి. చవితిరోజు ఉమాదేవిని, గణపతిని పూజించాలంటారు. ఇక పంచమిని శ్రీపంచమనీ, మదన పంచ మని కూడా వ్యవహరిస్తుంటారు. ఇది సరస్వతీదేవి జన్మదినం. సర్వత్రా చదువుల తల్లిని, రతీ మన్మధుల్ని పూజిస్తారు. ఈ రోజున వసంతోత్సవ ఆరంభం అనీ, పంచాంగ కర్తలు వసంత పంచమిని ఉదహరిస్తారు. షష్ఠి రోజున మందార షష్ఠి, వరుణ షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు.

      ఇక మాఘశుద్ధ సప్తమే ‘రథసప్తమి’గా జరుపుకుంటారు. ఈ రోజు సూర్యుని పూజించాలి. అష్టమిని భీష్మాష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజు భీష్ముడిని పూజించటం సత్ఫలితాలనిస్తుంది. నవమిని మహానంద నవమి అని, స్మృతి కౌస్త్తుభం, నందినీదేవి పూజ చేయాలని చతుర్వర్గచింతామణి చెబుతుంది. ఇక ఏకాదశినాడే పుష్యవంతుడనే గంధర్వుడు ఉపవసించి శాపవిముక్తయ్యాడు. ఈనాడే గోదావరి సాగరసంగమమైన అంతర్వేదిలో శ్రీమహాలక్ష్మీ నరసింహాస్వామి వారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.

      భీముడు ఏకాదశీవ్రతం చేసి, కౌరవులను జయించిందీ రోజే. శుద్ధ ద్వాదశినాడు వరాహ రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువునీ భక్తి ప్రపత్తులతో అర్చిస్తారు. త్రయోదశిని విశ్వకర్మ జయంతిగా పాటిస్తారు. విశ్వకర్మ దేవశిల్పి కావటంతో మహాపురుషుడిగా భావిస్తారు. మాఘ పౌర్ణమి అన్ని రోజుల్లోకెల్లా అత్యంత శ్రేష్ఠమైనది. దీన్ని ‘మహామాఘి’ అని కూడా పిలుస్తారు.

      బహుళ పాడ్యమినాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు. ఇక శ్రీరాముడు రావణ సంహారంకోసం లంకవెళ్ళేందుకు సేతునిర్మాణం బహుళ ఏకాదశి నాడే పూర్తి అయిందంటారు. ద్వాదశి ముందురోజు ఉపవాసముండి ద్వాదశినాడు నువ్వులు దానమిచ్చి, తలస్నానం చెయ్యాలంటారు. అందుకే దీన్ని తిలద్వాదశీ వ్రతం ఆచరిస్తారు.

      ధర్మశాస్త్ర పురాణ తిహాసాలు నేర్చుకునేందుకు త్రయోదశి మంచిరోజని చెబుతారు. బహుళ చతుర్దశి మహాశివరాత్రి. పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవ శుభదినం. ఈనాడు భక్తిశ్రద్ధలతో మనస్సును లగ్నం చేసి ఏకాగ్రతతో మహాశివుణ్ని ఎవరైతే స్మరిస్తారో వారికా పరమేశ్వరుడు తప్పక మోక్షాన్ని ప్రసాదిస్తాంటారు. ఉపవాసం, జాగరణకు ప్రశస్తమైన రోజిది. అమావాస్య స్వర్గస్తులైన పితరులకు తర్పణం వదిలే రోజు.

      అత్యంత మహమాన్వితమైన మాఘమాసం నెలరోజులూ క్రమం తప్పకుండా స్నానదానాదులను నిర్వహించడం వల్ల సకల పాపాలు, సర్వ రోగాలు, దరిద్రాలు నశించి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అన్నిటా జయం లభిస్తుంది. మాఘమాసంలో శ్రీమహావిష్ణువుతో పాటు పరమశివుడికి అభిషేకంచేసి, అర్చించి శివాలయంలో ప్రదోషకాలంలో దీపారాధన చేస్తే దీర్ఘాయుష్షుతో పాటు సుఖశాంతులు వర్ధిల్లుతాయి.

      కాబట్టి ప్రతివారూ ఈ మాసంలో ఆయా కార్యక్రమాలు నిర్వహించి పరమేశ్వరుని కరుణా కటాక్షాలు పొందేందుకు ప్రయత్నిద్దాం.

    –          వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)