చూపులో కరుణ, మోములో చిద్విలాసం.. ఆయనే ‘మెహర్ బాబా’
దాదాపు 44 ఏళ్లు అంటే.. జులై 10, 1925 నుంచి సమాధిని పొందే వరకు మౌనదీక్షలో గడిపారు ఆ బాబా. కేవలం చేతి సైగలతోనే సంభాషించేవారు. ప్రజలతో బహిరంగ సమావేశాలు నిర్వహించి కుష్టువ్యాధిగ్రస్థులకు, పేదవాళ్ళకు, మానసిక వ్యాధులతో బాధ పడుతున్నఎందరికో సేవలు చేసిన భారతీయ ఆధ్యాత్మిక గురువు. ఆయనే మెహెర్ బాబా. ఆయన జన్మనామం మెర్వన్ షెరియార్ ఇరానీ.
మెహర్ బాబా ఫిబ్రవరి 25, 1894లో మహారాష్ట్రలోని పూనాలో జన్మించారు. 19 సంవత్సరాల వయసులో మెహర్ బాబా ఆధ్యాత్మిక అన్వేషణను ప్రారంభించి, 1922 లో ఆయనే ఒక సాంప్రదాయాన్ని ప్రారంభించారు. 1940వ దశ్కమంతా బాబా సూఫీలో భాగమైన మాస్ట్స్ అనే ప్రత్యేక వర్గానికి చెందిన ఆధ్యాత్మిక సాధకులతో కలిసి జీవనాన్ని సాగించారు.
బాబా జీవిత పరమార్థం గురించి, పునర్జన్మ గురించి, భ్రమతో కూడిన లోకంతీరు గురించి అనేక ఉపన్యాసాలను ఇచ్చి ప్రజలకు సరైన దిశానిర్దేశనాన్ని చూపించారు. ఈ ప్రపంచం మిథ్య అనీ భగవంతుడొక్కడే సత్యమనీ, ప్రతి ఒక్కరు తమలోని పరమాత్మను తెలుసుకోవాలని భోదించారు. ఖచ్చితమైన గురువు ఎలా ఉంటాడో ఆయన విశదపరిచారు. ఎదుటివారి లోపాలను ఎత్తి చూపడం కన్నా మనని మనం సంస్కరించుకోవడంలోనే గొప్పతనముందని, ఇతరులకు చెడు చెయ్యక పోవడమే మనం చేయగలిగే మంచి అని బోధించారు. భౌతిక సుఖాలకోసమెంత తపించిపోతామో అంతకు రెట్టింపు తపన పరమాత్మవైపు పడగలిగితే తప్పకుండా భగవంతుని దర్శనం లభిస్తుందని అన్నారు. ఇటువంటి ఆయన బోధనలు డిస్కోర్సెస్, గాడ్ స్పీక్స్ అనే పుస్తకాలలో పొందుపరచబడ్డాయి. బాబాజాన్ వల్ల దివ్యస్థితిని, ఉపాసనీ మహరాజ్ వల్ల లోకస్థితిని పొందిన ఆయన 1921 సంవత్సరం ఆఖరుకల్లా అవతార పురుషుడయ్యారు. మెహర్‌బాబాను ‘పర్వర్‌దిగార్’ గా షిరిడీ సాయిబాబా సంబోధించారు. ఆయన అవతారుడని తెలిపారు. 1922లో అవతారోద్యమం ప్రారంభించి, శిష్యులకు శిక్షణ ఇచ్చారు. హజరత్ బాబాజాన్ , ఉపాసనీ మహరాజ్ , షిరిడీ సాయిబాబా, నాగపూర్‌లోని తాజుద్దీన్‌బాబా, పూణే సమీపంలోని నారాయణ్ మహరాజ్ అనే ఐదుగురు సద్గురువులచే మెహర్ బాబా అవతారుడని పిలువబడ్డారు.
ఆధ్యాత్మిక కారణాలచే 44 సంవత్సరాలు మౌనం వహించారు. ఈ మౌన వ్రతంలోనే 13 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. మౌనంలోనే ఆయన 1969 జనవరి31న మహా నిర్యాణం పొందారు. అప్పటి నుంచి ఏటా మహారాష్ట్రలోని అహ్మదాబాద్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహరాబాద్‌లో నిర్యాణం పొందిన రోజున బాబా అనుయాయులు కలుస్తారు. ప్రస్తుతం 72 దేశాలలో మెహర్‌బాబా కేంద్రాలు పనిచేస్తున్నాయి. బాబా బోధించిన సత్యం, ప్రేమలను అవి విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన బోధనల్ని ఒకసారి మనసారా స్మరించుకుందాం.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)