అందరికీ భోగి-సంక్రాంతి-కనుమ-ముక్కనుమ శుభాకాంక్షలు..!
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా మకర సంక్రాంతి జరుపుకోవడం మన ఆచారంగా అనాదికాలంగా వస్తోంది. ధనుర్మాసం ఆఖరి రోజు “భోగి” పండుగ. అప్పటివరకూ సూర్యుడు ధనూరాశిలో సంచరించి సంక్రాంతి రోజున మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణ ప్రారంభమౌతుందని భారతీయుల నమ్మకం. ఈ పండుగ రోజుల్లో పూజలూ, పిండివంటలూ, పతంగులూ మాత్రమే కాకుండా సరదాగా ఈ పండుగ వెనుక ఉన్న విజ్ఞానాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం..!
ఉత్తరాయణం అంటే “ఉత్తర దిశలో ప్రయాణం” అని అర్థం. అంటే సూర్యుడు దక్షిణం వైపుకు ఒకసారి (అరునెలలు పాటు), ఉత్తరం వైపు ఒకసారి (ఆరు నెలలు) ప్రయాణిస్తాడు. అది అందరికీ తెలిసిందే. అందులో, ఉత్తరదిశలో ప్రయాణించే కాలాన్ని “ఉత్తరాయణం”గా, దక్షిణదిశలో ప్రయాణించే “దక్షిణాయణం”గా వ్యవహరిస్తున్నాం. “మకర సంక్రమణం” అంటే మకర రాశిలోకి ప్రవేశించడం. అయితే, సూర్యుని ఉత్తర దిశా గమనం, మకర సంక్రాంతి కన్నా 25(సుమారు) రోజులు ముందే మొదలైపోతుంది. అంటే “ఉత్తరాయణం” ముందే ప్రారంభమైనట్టు…!
ఋతువులు ఏర్పడే క్రమం గురించి మనకి ముందే తెల్సు కదా… ఈ క్రింది చిత్రం దానికి సంబంధించినదే..!
సూర్యుడు మకరరేఖ (అంటే దక్షిణార్థ గోళంలో) ఉంటాడు. ఆరు నెలల తర్వాత అంటే కర్కాటకరేఖ (అంటే ఉత్తరార్థ గోళం) పైకి వస్తాడు. అంటే ఉత్తరంగా ప్రయాణించినట్టేగా..! అదే ఉత్తరాయణం …! అలాగే మరో ఆరు నెలలు తిరిగేసరికి మకరరేఖ పైకి వెళ్తాడు. అంటే దక్షిణంగా ప్రయాణించినట్టు., అది దక్షిణాయణం..! సంవత్సరంలో సూర్యుని కదలికలని(భూమికి సాపేక్షంగా) ఈ క్రింది చిత్రం స్పష్టతనివ్వవచ్చు..!
ఇక్కడ చెప్పేదేంటంటే, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం అనేది ఒక కొండ గుర్తు మాత్రమే..! నిజానికి ఉత్తరాయణం ఇంకా ముందే మొదలైపోతుంది. (తిలక్ ఆర్యవలస సిద్ధాంతాన్ని సమర్ధించిన విధంగా చూస్తే, ఉత్తర ధృవం వద్ద పగలు ప్రారంభమయ్యేది కూడా ఉత్తరాయణంలోనే డిసెంబర్ తర్వాతనే..!) ప్రతీ యేడాదీ., సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడానికీ, ఉత్తరాయణం ప్రారంభం కావడానికీ మధ్యలో 50 సెకండ్ల తేడా పెరుగుతొందని, ఇప్పటి పరిశీలన..! మన జ్యోతిష్కులు వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు.. అందుకే సంక్రాంతి, ప్రతీ 80 సంవత్సరాలకోసారి ఒకరోజు వాయిదా వేయబడుతూ వస్తోంది.
ఆర్యభట్టుని సూర్య సిద్ధాంతం ప్రకారం ఉత్తరాయణ ప్రారంభానికీ, సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడానికి మధ్యన ఉండే వ్యవధి గరిష్టంగా 27కి చేరి, ఆ తర్వాత తగ్గింపబడుతుంది (లేదా తగ్గిపోతుంది). ఈ లెక్క ప్రకారం 2294 సంవత్సరం తర్వాత మకర సంక్రాంతి ముందుకి జరుగుతూ వస్తుంది (80 ఏళ్లకోసారి..). కానీ ఇప్పటి ఆధునిక విజ్ఞానవేత్తల ఉద్దేశ్యం, అది అలా పెరుగుతూనే ఉంటుందని..!
సంక్రాంతికి ముందు రోజు అంటే భోగి రోజున మంటలు ఎందుకు వేస్తారు అనేదానిక్కూడా ఇక్కడే సమాధానం వెతుక్కోవచ్చు. ఉత్తరాయణ ప్రారంభం అయ్యే రోజుగానీ, ఆ ముందు రోజుగానీ, మొత్తం సంవత్సరంలో రాత్రిభాగం ఎక్కువగా ఉండే రోజు అవ్వడం వల్లన మంటలు వేసి పండగ మొదలుపెట్టడం వచ్చి ఉండచ్చు..! అయితే, ముందు చెప్పినట్టు ఉత్తరాయణ ప్రారంభం అవ్వడం వల్ల, సంక్రాంతి ఎక్కువ రాత్రి భాగం ఉందే రోజు అవ్వదు..! ఇప్పుడంటే, ఉత్తరాయణ ప్రారంభం(Winter solistice) గురించి సులువుగా చెప్పేస్తున్నాంగానీ, 200 సంవత్సరాల క్రితం సరిగ్గా చెప్పే విధానం జనంలో వాడుకలో లేదు కదా..! మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం అంటే ఖచ్ఛితంగా ఉత్తరాయణం మొదలైపోయిందని నిర్ధారించేసుకోవచ్చు కనక, మకర సంక్రమణం వరకూ ఆగి, అప్పుడు పండగ మొదలుపెట్టి ఉండవచ్చు..! సరే..! ఈ లెక్కన దక్షిణార్థగోళంలోని వారు అంటే ఆస్ట్రేలియా, న్యూజిలేండ్, దక్షిణ ఆఫ్రికా లాంటి చోట్ల మకర సంక్రాంతికి బదులు కర్కాటక సంక్రాంతి (జూన్ జూలైల దగ్గర) జరుపుకోవాలేమో..!
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)