Categories
Vipra Foundation

మోక్షదా ఏకాదశి

       సృష్టి ఆరంభంలో మధుకైటభులనే రాక్షసులకు మోక్షమీయదలచి ఈ ఏకాదశినాడు ఉత్తర ద్వారము నుండి తిరిగి వైకుంఠమును ప్రసాదించినట్లు పురాణగాధ. ఉత్తర ద్వారము అంటే తరించే మార్గము కనుక ఈ ఉత్తర ద్వారము నుండి మోక్షమును ప్రసాదించుట చేత ఈ ఏకాదశిని ‘మోక్షదా ఏకాదశి’ అని కూడా వ్యవహరిస్తారు.

       మార్గశుద్ధ ఏకాదశిని ‘మోక్షదైకాదశి’ అని అంటారు. పూర్వం వైఖానసుడనే రాజునకు తన తండ్రి నరకంలో ఉండి యమయతనలు పడుతూన్నట్లు కలవచ్చింది. అందుకు అతను మార్గశిరశుద్ధ ఏకాదశినాడు ఉపవాసం ఉండి నియమాలతో వ్రతం చేశాడు. ఆ వ్రత ఫలితంగా అతని తండ్రి స్వర్గలోకానికి చేరాడు. తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనికి ‘మోక్షదైకాదశి’ అని పేరు వచ్చింది. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి జనన మరణ రహితమైన మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెబుతారు.

       తల్లిదండ్రులు గతించిన కుమారులు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణ్వాలయానికి వెళ్లి విష్ణువును దర్శనం చేసుకుంటే, పితృదేవతలు విష్ణుసాయుజ్యం పొందుతారని చెబుతారు. ఈ రోజే భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేసిన రోజు. అందువల్ల గీతా జయంతిగా ప్రసిద్ధి.

       భారత యుద్ధ సమయంలో అర్జునుడు బంధువర్గాన్ని సంహరించడానికి సంశయించాడు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు అతనికి తత్తో్వపదేశం చేశాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. ఈ ఉపదేశం, యుద్ధ ప్రారంభ దినం నాటి ఉదయం జరిగింది.

     కార్తీక బహుళ అమావాస్యను భగవద్గీత పుట్టిన రోజుగా జరుపుతారు. గీతా జయంతిని ఈమాసములోనే జరపవలసి వుంటుంది. ఉత్తరాదిన కొన్ని ప్రాంతాల్లో మార్గశిరశుద్ధ ఏకాదశిని గీతాజయంతి జరుపుతున్నట్లు కనిపిస్తుంది. మార్గశిర శుద్ధ త్రయోదశి నుండి పుష్యశుద్ధ పాడ్యమి వరకు గల పద్ధెనిమిది రోజులు భారత యుద్ధం జరిగిందనీ, శుద్ధ త్రయోదశికి రెండు రోజుల ముందుగా, మార్గశిర శుద్ధ ఏకాదశినాడు భగవద్గీత చెప్పబడిందనీ అందుచేత ఆ రోజు గీతాజయంతి జరపడం సమంజసమని అంటున్నారు.

       పూర్వము దక్షిణ భారతదేశంలోని పాండ్య దేశపు రాజైన వల్లభరాయని ఆస్థానములో ‘పరతత్వ నిర్ణయం చేసి’ మహా భక్తునిగా గజారోహణ సమ్మానాన్ని పొందుతున్న పెరియాళ్వారు (విష్ణుచిత్తుల) వారి వైభవాన్ని చూడటానికి శ్రీ భూనీళా సమేతుడై గరుడ వాహనముపై శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయిన పవిత్రదినము కూడా ఇదే. ఆ జగన్నాధుని కీర్తిస్తూ శ్రీ పెరియాళ్వారులు ‘పల్లాండు’ ఆలపించిన పవిత్ర దినము కూడా ఇదే. ఇట్టి పరమపవిత్రమైన వైకుంఠ ఏకాదశినాడు శ్రీమన్నారాయణమూర్తిని ఎవరైతే సేవిస్తారో వారు పునర్జన్మ లేనివారై దుర్లభమైన పరమపదాన్ని పొందుతారని శ్రీపాంచరాత్ర ఆగమశాస్తమ్రు బోధిస్తోంది.

       ఇంతటి మహిమాన్వితమైన శ్రీ వైకుంఠ (ముక్కోటి) ఏకాదశినాడు భద్రాద్రి దివ్య క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా జరిగే ‘ఉత్తర ద్వార దర్శన’ మహోత్సవంలో సీతా లక్ష్మణ సమేతుడైన, గరుడవాహనరూఢుడైన రామనారాయణమూర్తియైన శ్రీ భద్రాద్రి వైకుంఠ రాముని దర్శించి, సేవించిన వారు సకల పాప విముక్తులై సర్వ శ్రేయస్సులను పొందుతారు.

శ్లో॥ ఉత్తర ద్వార మాసీనం ఖగస్థం రఘునాయకమ్

యః పశ్యతి సభద్రాద్రౌ యాతివై పరమాంగతిమ్

‘భద్రాద్రి నిలయం రామం నత్వా పాపైః ప్రముచ్యతే’

        భద్రాద్రి నిలయుడైన శ్రీరాముని సేవించిన వారు సకల పాప విముకులై తరలించగలరని బ్రహ్మ పురాణము పేర్కొన్నది. పురణాంతర్గతంగా పేర్కొన్న సప్త జీవ నదులలో మూడవదైన పరమపవిత్రమైన గోదావరి నదిలో స్నానమాచరించి శ్రీ స్వామిని సేవించుకున్న వారికి సకల సంపదలు సంప్రాప్తిస్తాయి.

       అన్ని వ్రతాలలోకెల్ల శ్రీ వైష్ణవ సాంప్రదాయములలో ప్రధానమైన వ్రతములు రెండు. వాటిలో ఒకటి ధనుర్మాస వ్రతము కాగా. రెండవది ద్వాదశీ వ్రతము. ప్రతి జీవికి ఏదో ఒక పరమార్థము ఉంటూనే ఉంటుంది. ఆ జీవి పూర్వ జన్మల పాపపుణ్యముల ననుసరించి ప్రస్తుత జన్మములయందు పండితుడిగానూ, రాజుగానూ, యోగిగానూ, భోగిగానో జన్మించి మళ్లీ ప్రస్తుత జన్మలోని పుణ్య పాప కర్మలను బట్టి వచ్చే జన్మములో పండితుడిగానో, రాజుగానో తరాజుగానో పుట్టుతుంటాడు.

       ప్రతి జీవి పుట్టుట, గిట్టుట సహజము. అనివార్యమైన ఈ కర్మను ఎవరూ తప్పించుకొనలేరు. అట్లు తప్పించుకొనవలెనన్న, శాశ్వతమైన ఆనందము పొందవలెనన్న భగవదనుగ్రహము కావాలి. అట్టి భగవదనుగ్రహము చేతనే శాశ్వతమైన బ్రహ్మలోకమునకేగి నిత్యాన్నందమును అనుభవించుచుండును. అక్కడ జరామరణ బాధలు లేక నిత్య సంతుష్టాంతరంగుడై విరాజిల్లుచుండును. అట్టి స్థానమునే బ్రహ్మలోకము అని, కైవల్యమని, పరమపదమని చెప్పుచుందురు.

       పురుషార్థములు నాలుగు, ధర్మము, అర్థము, కామము, మోక్షము. మూడవ పురుషార్థమైన కామమును పొందవలెనన్న రెండవ పురుషార్థమైన అర్థము అత్యవసరము. నాల్గవ పురుషార్థమైన మోక్షమును పొందవలెనన్న ఒకటవ పురుషార్థము ఆవశ్య ఆచరణీయము.

       నేటి రోజులలో ఆద్యంతములైన ధర్మ మోక్షములతో పని లేదు. మధ్యమైన అర్థకామములతోనే ప్రపంచము సాగిపోతున్నది. ఎంతదూరము సాగినా, ఎంతకాలము గడిచిన దీనికి అంతం… అనంతమైన, అఖండమైన అద్వితీయమైన పురుషార్థ శ్రేష్టమైన మోక్షమును పొందినప్పుడే. అంత వరకు ఏ జీవికి శాంతి వుండదు. శాశ్వత సౌఖ్యము ఉండదు. అట్టి స్థితిని పొందడానికి ధర్మమును ఆచరించాలి. అట్టి ధర్మములు ఏవనగా, అగ్నిష్టోమ, అతిరాత్ర, అప్తోర్యామ, వాజపేయ, సాంతపన, అశ్వమేధ, రాజసూయాది యాగములే. కాని యిట్టి యాగములను చేయడానికి సర్వులకు సౌలభ్యము కాని, ఆర్థిక స్థోమత కాని వుండదు. మరివాటి ఫలితములను పొందడానికి సులువైన మార్గములు ఏమనగా వ్రతములు, పూజలు, పునస్కారములు, ఉపవాసములు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)