అత్రి మహాముని తిరిగి అగస్త్యుడికి ఇలా చెబుతున్నాడు…
పురంజయుడు వశిష్టులు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు శుచియై దేవాలయానికి వెళ్లి, శ్రీమన్నారాయణుడిని షోడశోపచారాలతో పూజించాడు. శ్రీహరిని గానం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేసి, సూర్యోదయమైన వెంటనే నదికి పోయి, తిరిగి స్నానమాచరించి తన ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో విష్ణుభక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసి మాలలు ధరించి, పురంజయుడి వద్దకు వచ్చి… ”ఓ రాజా! విచారించకు… నువ్వు వెంటనే చెల్లా చెదురై ఉన్న నీ సైన్యాన్ని తీసుకుని, యుద్ధ సన్నద్ధుడివై శత్రురాజులతో పోరాడు” అని చెప్పి పంపాడు. దెబ్బతిని క్రోదంతో ఉన్న పురంజయుడి సైన్యం రెట్టింపు బలాన్ని ప్రయోగిస్తూ పోరాడసాగింది. పురంజయుడు, అతని సైన్యం ధాటికి శత్రురాజులు నిలవలేకపోయారు. అంతేకాకుండా… శ్రీమన్నారాయణుడు పురంజుడి విజయానికి అన్నివిధాలా సహాయపడ్డాడు. ఓటమిపాలైన కాంభోజాది భూపాలరు ”పురంజయా… రక్షింపుము… రక్షింపుము” అని కేకలు వేస్తూ కాలికి బుద్ధి చెప్పారు. పురంజయుడు విజయలక్ష్మితోకలిసి తిరిగి తన రాజ్యానికి వెళ్లాడు.
శ్రీహరిని నమ్మినవారికి ఓటమి ఉండదనే విషయాన్ని పురంజయుడి వృత్తాంతం నిరూపించింది. అంతకు ముందు కూడా శ్రీహరి అని ప్రార్థించినంతనే ప్రహ్లాదుడికి అతని తండ్రి హిరణ్యకశిపుడు ఇచ్చిన విషం అమృతతుల్యమైంది. ఎన్నో సందార్భల్లో అధర్మం ధర్మంగా మారింది. దైవానుగ్రహం లేనప్పుడు ధర్మమే అధర్మమవుతుంది. తాడు కూడా పాములా కరుస్తుంది. కార్తీక మాసమంతా నదీస్నానమొనర్చి, దేవాలయంలో జ్యోతిలను వెలిగించి దీపారాధన చేసినట్లయితే…సర్వ విపత్తులు తొలగిపోతాయి. అన్ని సౌక్యాలు సమకూరుతాయని అగస్త్యుల వారికి అత్రి మహర్షి వివరించారు.
ఇతి స్కాంధపురాణాంతర్గతేన వశిష్ట ప్రోక్త: కార్తీక మహత్య: 22 అధ్యాయ: సమాప్త:
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)