గురు నానక్ దేవ్ (Guru Nanak) ఏప్రిల్ 15వ తారీఖు 1469లో పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్ లో జన్మించాడు. ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. ఇతను హిందూ మరియు ఇస్లామియా మత గ్రంథాలు చదివాడు కానీ ఇతను ఈ రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతమును స్థాపించాడు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతము. వీరు ఏక్ ఓంకార్ (ఏకైక దేవుడు)ని నమ్మతారు.
పూర్తి వివరాలు : గొప్ప సంఘసంస్కర్తగా, మత గురువుగా ప్రసిద్ధిని పొందిన గురునానక్ 15వ శతాబ్దానికి చెందిన అతి విశిష్టమైన వ్యక్తి. ఇతడు పవిత్రతనూ, న్యాయాన్నీ, మంచితనం, భగవత్ ప్రేమలాంటి విషయాలను గురించి ప్రజలకు ఉపదేశం ఇచ్చాడు. లాహోర్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న నగరం)కు సమీపంలో ఉన్న తల్వండి రాయె భోయిలోని ఖత్రీల కుటుంబంలో గురునానక్ 1469 ఏప్రిల్ 15వ తారీఖున పౌర్ణమి రోజున జన్మించాడు. తృప్త, మెహతా కలు ఇతడి తల్లిదండ్రులు. ఇతడి తండ్రి ధనవంతుడైన ఒక గొప్ప జమీందారు వద్ద కొలువు చేశాడు. తన తల్లిదండ్రులకు గురునానక్ మూడవ సంతానం. ఇతడి జన్మస్థలమైన తల్పండిని ఈ రోజు మనం నన్‌కానా సాహిబ్ అనే పేరుతో పిలుస్తున్నారు. పసితనం నుండీ నానక్‌కు గురుభక్తి మెండుగా ఉండేది. అందరికీ ముక్తి మార్గం చూపేందుకు అతడు ఒక చోటు నుండీ మరొక చోటుకీ పోయేవాడు. అతడు సుదూర ప్రాంతాల వరకు టిబెట్, బెంగాల్, దక్కన్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, కందహార్, టర్కీ, బాగ్దాద్, మక్కా, మదీనాలను ప్రయాణం చేశాడు. అతడు భగవంతుడిని వాహేగురు అని పిలిచాడు. ప్రజలు తమను తాము అర్పించుకోవాలని ప్రజలకు అతడు సలహా ఇచ్చాడు. ఇతడు సిక్కుల మతాన్ని స్థాపించాడు. గొప్ప కవిగా, వేదాంతిగా, మానవతావాదిగా పేరును పొందాడు. ఇతడిని విశ్వకవి రవీంద్రనాధ్ టాగూర్ “మానవాళి గురుగు”గా అభివర్ణించాడు.
గురునానక్ అతి అమూల్యమైన కొన్ని ఉపదేశాలు :
* బయట కనబడే తీరు ముఖ్యం కాదు. బయటి రూపాన్ని చూసి మనిషి ప్రాశస్త్యాన్ని మనం అంచనా వేయలేము.
* భగవంతుడే అతి ముఖ్యమైన వాడు. దేవుడు ఒక్కడే అని అతడు ఉపదేశం చేశాడు.
* ఇతరుల సంపాదనపై ఆధారపడి జీవించకూడదు.
* దయ, సంతృప్తి, సహనం, సత్యం ఇవే ముఖ్యమైనవి.
* ఆకలితో అలమటించే వారికి అన్నం యిచ్చేవారినీ, గుడ్డల అవసరం ఉన్నవారికి గుడ్డలను ఇవ్వగల్గే వ్యక్తినే భగవంతుడు ప్రేమిస్తాడు.
* అందరూ గొప్ప పుట్టుక కలవారే.
* పేరాశను జయించిన వారిని భగవంతుడు ప్రేమిస్తాడు.
* అర్ధంలేని ఆచారాలు రూపరహితుడైన భగవంతుడిని అర్ధం చేసుకునే మార్గపు అవరోధాలు అవుతాయి.
* పవిత్రమైన హృదయంతో అతడిని ధ్యానించడం, అతడిని ప్రశంశించడం అన్నవే ముక్తి మార్గాలు.
సిక్కు గురువుల జాబితా :-
పేరు పుట్టిన తేదీ గురువుగా స్వీకారం స్వర్గస్థులైన తేదీ వయస్సు
1 గురునానక్ 15 ఏప్రిల్ 1469 20 ఆగష్టు 1507 22 సెప్టెంబర్ 1539 69
2 గురు అంగద్ 31 మార్చి 1504 7 సెప్టెంబర్ 1539 29 మార్చి 1552 48
3 గురు అమర్ దాస్ 5 మే 1479 26 మార్చి 1552 1 సెప్టెంబర్ 1574 95
4 గురు రామదాస్ 24 సెప్టెంబర్ 1534 1 సెప్టెంబర్ 1574 1 సెప్టెంబర్ 1581 46
5 గురు అర్జన్ 15 ఏప్రిల్ 1563 1 సెప్టెంబర్ 1581 30 మే 1606 43
6 గురు హరగోవింద్ 19 జూన్ 1595 25 మే 1606 28 ఫిబ్రవరి 1644 48
7 గురు హరరాయ్ 16 జనవరి 1630 3 మార్చి 1644 6 అక్టోబర్ 1661 31
8 గురు హరక్రిష్ణ 7 జులై 1656 6 అక్టోబర్ 1661 30 మార్చి 1664 7
9 గురు టెగ్ బహాదూర్ 1 ఏప్రిల్ 1621 20 మార్చి 1665 11 నవంబర్ 1675 54
10 గురు గోవింద సింగ్ 22 డిసెంబర్ 1666 11 నవంబర్ 1675 7 అక్టోబర్ 1708 41
11 గురు గ్రంధ సాహిబ్ తెలియదు 7 అక్టోబర్ 1708 తెలియదు తెలియదు
“గురుగ్రంధసాహిబ్” సిక్కుల పవిత్ర గ్రంధం. పదిమంది సిక్కు గురువుల ఉపదేశాలూ, వారి సూక్తులూ ఇందులో సంగ్రహించబడి వున్నాయి. ఇందులో హిందూమతపు, మహమ్మదీయుల మతపు పండితుల, భక్తుల రచనలు చాలా ఉన్నాయి. ఈ మత గ్రంధమే సిక్కుమతానికి మార్గదర్శకత్వం వహిస్తుంది.సిక్కులు తమ మత స్థాపకుడి పటాన్నె ఆరాధిచడంగానీ ఏ ఇతర గురువుల పటాన్ని తమ మత గ్రంధం వద్ద పెట్టడం కానీ చేయరు. గురుగ్రంధ సాహెబ్‌ను గౌరవిస్తారు. “నేను దేవుడిని కాదు. నేను అతడి అవతారం కూడా కాదు. అతని సందేశాన్ని అందజేసే మత ప్రవక్తను మాత్రమే” అని గురునానక్ చెప్పాడు.
నన్నాహాల్ సింగ్ రాసిన ఈ కవిత గురునానక్ సంపూర్ణ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది “పవిత్ర హృదయంతో అతడు పవిత్రతను ప్రబోధించాడు. ప్రేమావతారుడైన అతడు ప్రేమనౌ నేర్పాడు. వినయ సంపన్నుడైన అతడు విధేయతను నేర్పాడు. సదాచార సంపన్నుడైన అతడు దైవత్వాన్ని బోధించాడు. శాంతి దూత అయిన అతడు న్యాయాన్ని వాదించాడు. సమానత్వం, పైత్రతల సాకార రూపమైన అతడు భగవంతుడిపట్ల భక్తి, సదాచారం, గౌరవం ఉండాలని తెలియజేశాడు”.
గురు నానక్ తన జీవిత చివరి సంవత్సరాల్లో ఉచిత ప్రసాదం లభించే కర్తార్ పూర్ లో జీవించారు. తన ఆహారాన్ని మత భేదం, కుల భేదం, ధన భేదం లేకుండా పంచుకునేవారు గురు నానక్. గురు నానక్ పొలాల్లో పనిచేసి జీవిక సాగించేవారు. కొత్త సిక్ఖు గురువుగా భాయ్ లెహ్నాను ప్రకటించాకా 22 సెప్టెంబర్ 1539లో 70వ ఏట మరణించారు.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)