అజామీళుడిని తీసుకెళ్తున్న విష్ణుదూతలతో యమదూతలు వాగ్వాదానికి దిగారు. విష్ణుదూతలిలా అంటున్నారు… ”ఓయీ యమదూతలారా. మేం విష్ణు దూతలం. వైకుంఠం నుంచి వచ్చాం. మీ ప్రభువైన యముడు ఎవరిని తీసుకురమ్మని మిమ్మల్ని పంపాడు?” అని ప్రశ్నించారు. దానికి వారు ”ఓ విష్ణుదూతలారా… మానవుడు చేసే పాపపుణ్యాలకు సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం, ధనంజయాది వాయువులు, రాత్రింబవళ్లు, సంధ్యాకాలం సాక్షులుగా ఉండి, ప్రతిరోజూ మా ప్రభువుకు విన్నవించుకుంటారు. మా ప్రభువు వారి కార్యకలాపాలను చిత్రగుప్తుడి ద్వారా మాకు చూపించి, ఆ మనిషి అవసానదశలో మమ్మల్ని పంపుతారు” అని చెప్పుకొచ్చారు.
పాపుల గురించి విష్ణుదూతలకు యమదూతలు ఇలా వివరిస్తున్నారు… ”అయ్యా… అసలు పాపులు అనే పదానికి నరకంలో ప్రత్యేక నిర్వచనాలున్నాయి. వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించు వారు, గోహత్య, బ్రహ్మ హత్యాది మహాపాపాలు చేసినవారు, పర స్త్రీలను కామించిన వారు, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను – గురువులను – బంధువులను- కుల వృతిని తిట్టి హింసించు వారు, జీవ హింస చేయు వారు, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారును, జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేయు వారును, చేసిన మేలు మరచిన కృతఘ్నులు, పెండిండ్లు శుభ కార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారు పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమ ధర్మరాజు గారి ఆజ్ఞ” అని చెప్పుకొచ్చారు.
తమ సంవాదానిన కొనసాగిస్తూ… ”ఈ అజామీళుడు బ్రాహ్మణుడై పుట్టి, దురాచారాలకు లోనై, కులభ్రష్టుడై జీవ హింసలు చేసి, కామాంధుడి ప్రవర్తించాడు. వావి వరసలు లేకుండా కూతురువరస యువతితో సంబంధం పెట్టుకున్న పాపాత్ముడు. వీడిని విష్ణులోకానికి ఎలా తీసుకెళ్తారు?” అని ప్రశ్నించగా… విష్ణుదూతలిలా చెబుతున్నారు. ”ఓ యమకింకరులారా! మీరెంత అవివేకులు? మీకు సూక్షధర్మాలు తెలియవు. ధర్మసూక్షాలు ఎలా ఉంటాయో చెబుతాం వినండి. సజ్జనులతో సహవాసము చేయువారు, జపదాన ధర్మములు చేయువారు- అన్నదానం, కన్యాదానం, గోదానం, సాలగ్రామ దానం చేయువారు, అనాథ ప్రేత సంస్కాములు చేయువారు, తులసి వనము పెంచువారు, తటాకములు తవ్వించువారు, శివ కేశవులను పూజించు వారు, సదా హరి నామ స్మరణ చేయువారు, మరణ కాలమందు ‘నారాయణా’ యని శ్రీహరిని గాని, ‘శివ’ అని ఆ పరమశివుని గాని స్మరించు వారు, తెలిసిగాని తెలుయక గాని మరే రూపమున గాని హరి నమ స్మరణ చెవిన బడిన వారును పుణ్యాత్ములు! కాబట్టి అజా మీళుడు ఎంత పాపత్ముడైనాను మరణకాలమున ‘నారాయణా’ అని పలికాడు” అందుకే విష్ణుసాన్నిద్ధ్యానికి అతను అన్నివిధాలా అర్హుడు” అని వివరించారు.
అజామీళుడికి విష్ణుదూతల సంభాషణ ఆశ్చర్యాన్ని కలిగించింది. ”ఓ విష్ణుదూతలారా! పుట్టిన నాటి నుంచి నేటి వరకు శ్రీమన్నారాయణ పుజగాని వ్రతములు గాని, ధర్మములుగాని చేసి యెరుగను. నవ మాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణ మిల్లలేదు. వర్ణాశ్ర మాములు విడిచి కుల భ్రష్టుడనై, నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచో ‘నారాయణా’ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధలనుంచి రక్షించి వైకుంఠానికి తీసుకెళ్తున్నారు. ఆహా! నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వ జన్మ సుకృతము, నా తల్లి తండ్రుల పుణ్య ఫలమే నన్ను రక్షించినది” అని పలుకుతూ… సంతోషంగా విమానమెక్కి వైకుంఠానికి వెళ్లడు.
“కాబట్టి ఓ జనక మహారాజా! తెలిసిగానీ, తెలియక గానీ నిప్పును ముట్టినప్పుడు బొబ్బలెక్కడం, బాధకలగడం ఎంత నిజమో… శ్రీహరిని స్మరించినంతనే పాపాలు నశించి, మోక్షాన్ని పొందుతారనడం అంతే కద్దు” అని వివరించారు.
ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి నవమధ్యాయ: – తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)