Categories
Vipra Foundation

గోపాష్టమి విశిష్టత – కార్తీక శుక్లపక్ష అష్టమి (గో పూజ పరదేవతా పూజ)

కార్తీక మాసం లోని ప్రతిరోజు ఏదో ఒక విశేషంతో కూడి యున్నది. గోపాష్టమి దీపావళికి ఎనిమిదో రోజున వస్తుంది. కార్తీక శుద్ద అష్టమి, దీన్నే గోప అష్టమి అని విశేషంగా పిలుస్తారు. గోవు సర్వ దేవతల నిలయం.సకల దేవతలు వివిధ భాగాలలో కొలువై ఉంటారు.గోవుకి ప్రదక్షిణలు చేసి, గోవు యొక్క ప్రుష్ఠ భాగం అనగా వెనక తోక భాగం వైపుకి వెళ్ళి పసుపు, కుంకుమలు సమర్పణ చేసి వీలయితే అరటి పళ్ళు కాని, నీటిలో నాన బెట్టిన నవ ధాన్యాలను బెల్లం తో కలిపి పెట్టడం వల్ల నవగ్రహాలతో పాటు సకల దేవుళ్ళ అనుగ్రహము కలుగుతుంది. వాస్తవానికి గోవు అన్నది బ్రహ్మ సృష్టిలో లేదు.గోవుని అష్ట వసువులు వేల సంవత్సరాల యజ్ణము చేసిన తర్వాత ఉద్భవించిన మాతృ స్వరూపం.తర్వాత గోవు సకల దేవతలకు నియమం అయింది. ఒక్కో భాగం మీద ఒక్కో దేవిదేవతలూ ఆశీనులై ఉంటారు.గోవును సందర్శన చేసినప్పుడు కామధేను స్తుతి కాని ఎదైనా గోవు యొక్క నామం కాని జపం చేయాలి.గోవుకి ఏదైనా తినిపిస్తే అది సకల దేవతలకు ఆరగించిన ఫలితాన్నిస్తున్నది.

గోపూజ పశు పూజ కాదు. అది పరదేవతకు పూజ చేయడం. చతుర్ముఖ బ్రహ్మ సృష్టిలో అన్ని ప్రాణులు వచ్చాయి. గోవు ఒక్కటి మాత్రం బ్రహ్మ సృష్టిలోనిది కాదు. అష్ట వసువులూ ఒక్క సంవత్సరం పాటు హోమం చేసి, ఆ తపశ్శక్తి చేత ఒక గోవును సృష్టించారు. ఆ గోవు యొక్క సంతానంగా ఇవాళ ఇన్ని గోవులు వచ్చాయి.

వేదం గోవుని ఏమని చెప్పిందంటే “గౌరగ్నిహోత్రః” అంది. గోవు “అగ్నిహోత్రము”. అగ్ని స్వరూపమే గోవు. అంటే అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో, గోవు కూడా అంత ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు. మీరు ప్రతీ రోజూ యజ్ఞం చేసి అగ్నిహోత్రం యొక్క అనుగ్రహం పొందడం ఎంత కష్టమో, అంత తేలికగా పొందడానికి అవకాశం గోపూజ.

గోవు పృష్ట భాగమునందు కాస్త పసుపు, కుంకుమ వేసి నమస్కారం పెడితే లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలు అవుతుంది. లక్ష్మీదేవి ఉండే స్ధానములు ఐదే. 1.ఏనుగు కుంభస్థలం 2.ఆవు వెనక తట్టు 3.తామరపువ్వు 4.బిళ్వదళం వెనుక ఈనెలు ఉండే భాగం 5.సువాసిని పాపట ప్రారంభస్ధానం. అందుకే గోవుని ఆరాధన చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

ఒక్క గోదానానికి మాత్రం వేదం ఏం చెప్పిందో తెలుసా! గోవుని దానం చేస్తే పుచ్చుకున్నవాడు వెయ్యి గోవులు పుచ్చుకున్నాడని, మీరు వెయ్యి గోవులు ఇచ్చారని వేస్తారు. గో సహస్రమని తప్ప, ఒక్క గోవుని దానం చేసాడని వెయ్యరు. ఒక్క గోదానంలోనే ఆ గొప్పతనం.

మీకొక రహస్యం చెప్పనా! గోసేవ చేసాడనుకోండి, గోగ్రాసం పెట్టాడనుకోండి. అంటే కాసిన్ని పచ్చగడ్డి గోవుకి తినిపించి, ప్రదక్షిణం చేసి, గంగడోలు ఇలా దువ్వి, గోవు పృష్టభాగంలో పసుపు, కుంకుమ వేసి వెళితే ఏం చేస్తారని చెప్పిందో తెలుసా వేదం! ఆయన సేవించిన ఆవు శరీరానికి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్కపెడతాడు. ఒక్కొక్క వెంట్రుకని ఒక్కొక్క సంవత్సరంగా తీసుకుని ఆ సంవత్సరంలో ఈయన నూరు యజ్ఞాలు చేసారని లెక్క వేస్తారు.

“కామాక్షి పరదేతకు అరటిపండు తినిపించడం సాధ్యంకాదు. కానీ పరదేవతకు అరటిపండు తినిపిస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక్క గోవుకు అరటిపండు తినిపిస్తే అంత ఫలితమూ వస్తుంది”.

**గవో మేచాగ్రతో నిత్యం! గావః పృష్టత ఏవచ!

గావో మే హృదయేచైవ! గవాం మధ్యే వసామ్యహం!**

భావముగోవులు నా ఎదుట, నా వెనుక, నా హృదయమునందు నిత్యము ఉండుగాక, నేను ఎప్పుడూ గోవుల మధ్య ఉందును గాక (స్కాంద పురాణాంతర్గతము).

శ్రీ కృష్ణ భగవానుడు గోపూజ చేసి మనకు తరుణోపాయం చూపారు. అందుకే గోపూజ చేసిన వారికి మోక్షం సులభ సాధ్యము. గోవు సమస్త దేవతా స్వరూపము.

గోమహత్యము :

గోపాదాలు – పితృదేవతలు,

పిక్కలు – గుడి గంటలు,

అడుగులు – ఆకాశగంగ,

కర్ర్ఇ – కర్ర్ఏనుగు,

ముక్కొలుకులు – ముత్యపు చిప్పలు,

పొదుగు – పుండరీకాక్షుడు,

స్తనములు- చతుర్వేదములు,

గోమయము – శ్రీ లక్ష్మి,

పాలు – పంచామృతాలు,

తోక – తొంబది కోట్ల ఋషులు,

కడుపు – కైలాసము,

బొడ్డు – పొన్నపువ్వు,

ముఖము – జ్యేష్ఠ,

కొమ్ములు – కోటి గుడులు,

ముక్కు – సిరి,

కళ్ళు – కలువ రేకులు,

వెన్ను – యమధర్మరాజు,

చెవులు – శంఖనాదము,

నాలుక – నారాయణ స్వరూపము,

దంతాలు – దేవతలు,

పళ్ళు – పరమేశ్వరి,

నోరు – లోకనిధి.

ప్రాతఃకాల గో దర్శనం శుభప్రదము.

పూజించుట మోక్షప్రదము.

స్పృశించుటచే ఉత్తమ తీర్థ స్నాన ఫలము కలుగుతుంది.

ఉదయాన్నే లేచి గో మహాత్మ్యాన్ని పఠిస్తే సకల పాపాలు తొలిగిపోతాయి.

అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, తెలిసీ తెలియక చేసిన పాపాలు నశిస్తాయి.

మధ్యాహ్న కాలములో పఠిస్తే వెయ్యి గుళ్ళల్లో దీపారాధన చేసిన ఫలము, జన్మాంతరము ఐదోతనము ఇచ్చునట్లు, రాత్రి పూటపఠిస్తే యమబాధలు వుండవు.

గోమహాత్మ్యాన్ని ఒకసారి పఠించినవారికి మూడు నెలల పాపము, సంధ్యవేళ గోమహాత్మము పఠించిన వారి ఇంటికి శ్రీ మహాలక్ష్మి స్వయముగా విచ్చేస్తుంది.

కాళరాత్రి గోమాహాత్మ్యము పఠిస్తే కాలయముని భయము దూరమవుతుంది.

నిత్యము గోమాహాత్మ్యము పఠించిన వారికి నిత్యము చేసిన పాపములు దూరమవుతాయి.

విన్నవారికి విష్ణులోకము చెప్పిన వారికి పుణ్యలోకము ప్రాప్తిస్తాయి.

ఎదురుగా కదలాడే తల్లి, తండ్రి, గురువు, గోమాత వంటి ప్రత్యక్ష దైవములను గుర్తించలేక దేవుడెక్కడున్నాడు అనుకొనే అజ్ణానులము మనము, కనుక మిత్రులారా మనము చేయవలసినది కేవలము చదవటము మాత్రమే, చదివి పుణ్యమును సంపాదించుకోవటము ఎంతసులభము.

ఓం కామధేనవే నమః

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)