Categories
Vipra Foundation

కార్తీకపురాణం నాలుగో అధ్యాయము : దీపారాధన మహిమ

       వశిష్టుడిని చూసి జనక మహారాజు తిరిగి ఇలా అడుగుతున్నాడు. “మీరు చెబుతున్న ఇతిహాసాలు వినేకొద్దీ ఆసక్తి కలిగిస్తున్నాయి. మీరు చెబుతున్న విషయాలు వినేకొద్దీ తనివి తీరకున్నట్లే ఉన్నది. కార్తీకమాసంలో ప్రధానంగా ఎలాంటి పనులు చేయాలి? ఎవరిని ఉద్దేశించి పూజలు చేయాలో వివరించండి ప్రభూ…!” అని ప్రార్థించాడు.

       జనకుడి కోరికను మన్నించిన వశిష్టమహాముని ఇలా చెబుతున్నారు… ”ఓ జనకా! కార్తీక మాసంలో సర్వ సత్కార్యాలూ చేయొచ్చు. దీపారాధన అనేది అత్యంత ముఖ్యమైనది. అత్యంత ఫలితాన్ని ఇచ్చేది ఇదే. సూర్యాస్తమయ సమయంలో అనగా… సంధ్యవేళ శివకేశవుల సన్నిధిలోగానీ, తలుపుల దగ్గరగానీ దీపాలు వెలిగించిన వారి సర్వపాపాలు తొలగిపోతాయి. కార్తీకంలో దీపారాధన అనేది వైకుంఠ ప్రాప్తికి తొలిమెట్టులాంటిది. ఆవునేయితోగానీ, కొబ్బరినూనెగానీ, విప్పనూనె, అది లేనప్పుడు ఆముదముతోనైనా దీపాలను వెలిగించాలి. దీపారాధన ఏ నూనెతో చేసినా… ఆ ఫలితం ప్రాప్తిస్తుంది. ఇందుకు ఒక చక్కటి కథ ఉంది. చెబుతాను. శ్రద్ధగా విను.. ” అని ఇలా చెప్పసాగాడు…

శతృజిత్ కథ

       పూర్వము పాంచాల దేశాన్ని ఏలుతున్న రాజుకు సంతానం లేకపోవడంతో అనేక యజ్ఞ యాగాలు చేశాడు. చివరకు విసుగు చెంది గంగానదీ తీరంలో తపస్సు చేయసాగాడు. అంతట ఓ మునిపుంగవుడు అటుగా వచ్చి… ”ఓ పాంచాల రాజా…! నీకెందుకీ తపస్సు? నీ కోరిక ఏమిటి?” అని ప్రశ్నించాడు. దానికి పాంచాల రాజు ”మునిపుంగవా… నాకు అష్టైశ్వర్యాలు, రాజ్యం, సంపదనా ఉన్నాయి. అయితే నా వంశాన్ని నిలిపేందుకు పుత్ర సంతానం లేదు. అది నన్ను కృంగి కృశించేలా చేస్తోంది. అందుకే ఈ తీర్థంలో నేను తపస్సు చేస్తున్నాను” అని చెప్పాడు. అంతట ఆ ముని ”ఓయీ…! కార్తీక మాసంలో శివ సన్నిధిలో శివుడికి ప్రీతిగా దీపారాధన చేయి. నీకోరిక నెరవేరగలదు” అని చెప్పి వెళ్లిపోయాడు.

పాంచాలరాజు వెంటనే తన దేశానికి వెళఙ్ల పుత్రసంతానం కోసం అత్యంత భక్తిశ్రద్ధలతో కార్తీక మాసంలో నెలరోజులూ దీపారాధన చేయించి, దాన ధర్మాలు చేస్తూ నియమంగా వ్రతం ఆచరించాడు. ఆ పుణ్యకార్యం వల్ల రాజు భార్య గర్బం దాల్చింది. నవమాసాలు నిండిన తర్వాత ఒక శుభముహూర్తాన కొడుకుని కన్నది. రాజకుటుంబీకులు ఎంతో సంతోషంతో దేశమంతటా పుత్రోత్సవం చేయించారు. బ్రాహ్మణులకు దానధర్మాదులు చేశారు. ఆ పిల్లవాడికి ‘శతృజిత్’ అని పేరుపెట్టారు. ఎంతో గారాబంగా పెంచసాగారు. కార్తీకమాసంలో దీపారాధన వల్ల పుత్రసంతానం కలిగినందువల్ల తన దేశమంతటా ప్రతియేడు కార్తీకమాస వ్రతాలు, దీపారాధన చేయించాలని ఆదేశించాడు.

       శతృజిత్ అలా దినదినప్రవర్తమానమగుచూ… సకల శాస్త్రాలు అభ్యసించాడు. ధనుర్విద్య, కత్తిసాము తదితర విద్యల్లో ఆరితేరాడు. అయితే… యవ్వనంలోకి ప్రవేశించగానే… తల్లిదండ్రుల గారాబం, దుష్టుల సహవాసం వల్ల తన కంటికి నచ్చిన స్త్రీలను బలాత్కరించుచూ, వారి మానాన్ని దోచుకోసాగాడు. అతన్ని ఎదిరించిన వారిని దండించసాగాడు. అలా తన కామవాంఛ తీర్చుకొంటూ లోకకంటకుడిగా మారాడు.

       తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన సంతానమని అతని తప్పులను చూసీచూడనట్లు వినీ విననట్లు ఉండసాగారు. శత్రుజిత్ ఆ రాజ్యంలో తన కార్యాలకు అడ్డుచేప్పేవారిని నరుకుతానని కత్తిపట్టుకుని తిరుగుతూ ప్రజల్ని భయకంపితులను చేశాడు. ఒకరోజు అతనికి ఒక బ్రాహ్మణ పడుచు కనిపించింది. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుడి భార్య. అమిత రూపవతి. ఆమె అందచందాలను వర్ణించడం మన్మథుడి తరమూ కాదు. ఆమెను చూడాగానే రాకుమారుడు కొయ్యబొమ్మలా నిశ్చేష్టుడై కామవికారంతో నిల్చుండిపోయాడు. ఆమెవద్దకు వెళ్లి తన కామవాంఛను తెలిపాడు. ఆమె కూడా అతని సౌందర్యానికి మోహితురాలైంది. కులం, శీలం, సిగ్గు విడిచి అతని చేయి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకుని పోయి భోగాలను అనుభవించింది.

       ఇలా ఒకరికొకరు ప్రేమపరవశంతో ప్రతిరోజూ అర్ధరాత్రివేళలో అజ్ఞాత ప్రదేశంలో కలుసుకునేవారు. కొంతకాలం తర్వాత ఆ సంగతి ఆ బ్రాహ్మణుడికి తెలిసింది. దీంతో తన భార్యను, రాకుమారుడిని ఒకేసారి చంపాలని నిర్ణయించుకున్నాడు. ఒక కత్తి సంపాదించి, సమయం కోసం నిరీక్షించసాగాడు. ఆ రోజు కార్తీక పౌర్ణమి. ఆ ప్రేమికులిద్దరూ పాడుబడ్డ శివాలయంలో కలుసుకోవాలని అనుకున్నారు. అర్ధరాత్రి వారు రహస్య మార్గంలో వెళ్లారు. ఈ సంగతిని పసిగట్టిన ఆ బ్రాహ్మణుడు సైతం అంతకు ముందే కత్తితో అక్కడ సిద్ధంగా ఉండి, గర్భగుడిలో నక్కి కూర్చున్నాడు. కాముకులిద్దరూ గాఢాలింగనం చేసుకుని, చీకటిగా ఉన్నందున దీపం పెట్టాలని అనుకున్నారు. అంతట ఆమె తన పైట చెంగును చించగా, ఇద్దరూ కలిసి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించారు. ఆ తర్వాత వారిద్దరూ మహదానందంతో రతిక్రీడలు సల్పుకొన్నారు. అదే అదునుగా భావించిన ఆ బ్రాహ్మనుడు తన కత్తిని తీసి ఒకే వేటుతో తన భార్యను, ఆ రాకుమారుడిని ఖండించాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కార్తీక పౌర్ణమి, సోమవారం కావడం వల్ల కన్నుమిన్ను తెలియనంతగా కామంతో కళ్లుమూసుకుపోయిన రాకుమారుడు, ఆ బ్రాహ్మణ స్త్రీలను శివసాన్నిధ్యానికి తీసుకెళ్లేందుకు శివదూతలు రాగా… బ్రాహ్మణుడిని తీసుకెళ్లేందుకు యమకింకరులు వచ్చారు. దీంతో ఆ బ్రాహ్మడు ”కన్నూమిన్నూ కానని రీతిలో కామక్రీడలు సాగిస్తూ వ్యభిచరించే ఆ మూర్ఖులకోసం శివదూతలు రావడమేమిటి? నాకోసం యమదూతలు రావడమేమిటి?” అని ప్రశ్నించాడు.

       ఆ మాటలకు యమకింరులు ఇలా చెబుతున్నారు… ”ఓ విప్రోత్తమా…! ఎవరెంతటి నీచులైనా.. ఈ రోజు అత్యంత పవిత్రమైన దినం. కార్తీకపౌర్ణమి, సోమవారం కలిసి వచ్చింది. తెలిసో తెలియకో వారు శివాలయంలో దీపం వెలిగించారు. ఆ కారణంగా అప్పటి వరకు వారు చేసిన పాపాలన్నీ నశించిఓయాయి. కాబట్టి వారిని కైలాసానికి తీసుకెళ్లేందుకు శివదూతలు వచ్చారు” అని చెప్పారు.

       ఈ సంభాషణ అంతా విన్న రాకుమారుడు ”అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలా ఉన్నా.. మేం ముగ్గురం ఒకే సమయంలో ఒకే స్థలంలో చనిపోయాం. కాబట్టి ఆ ఫలితమంతా మా అందరికీ వర్తించాల్సిందే” అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణుడికి దానం చేశారు. వెంటనే ఆ బ్రాహ్మణుడు సైతం పుష్పక విమానమెక్కి శివసాన్నిధ్యాన్ని చేరాడు.

       “జనక మహారాజా…! శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ఆ ప్రేమికుల పాపం పోవడమే కాకుండా, కైలాస ప్రాప్తికూడా కలిగింది. కాబట్టి కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొందుదురు” అని వశిష్టుల వారు వివరించారు.

ఇతి శ్రీ స్కాందపురాణాంతర్గత తవశిష్ట ప్రోక్త కార్తీక పురాణం చతుర్థ అధ్యాయ: సమాప్త:

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)