శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీకమాసం నెలరోజులూ పర్వదినాలే. కార్తీకంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి, తులసికోటముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ దూప దీప నైవేద్యాలను సమర్పిస్తారు.
ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకిమైన, అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది మామూలు రోజులలో భగవదారాధన మీద అంతగా శ్రద్ధ పెట్టనివారు, గుడిలో కాలు పెట్టనివారిని సైతం పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకెళ్తుంది. వారిని దేవుని ముందు కైమోడ్చేలా చేసి, పాపాటు పటాపంచలు చేసి మోక్షప్రాప్తి కలిగిస్తుంది ఈ మాసం.అందుకే ఇది ముముక్షువుల మనసెరిగిన మాసం
న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్
నారోగ్య సమముత్సాహం న దేవ: కేశవాత్పర:
కార్తీక మాస మహత్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహరాజునకు వివరించగా శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. ఈ మాసంలో ప్రతీరోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దానిక ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉన్నత ఫలితాలు కలుగుతాయి.కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నానాదులు కూడా అత్యంత విశిష్టమైనదే.నదీ స్నానం,ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో అచరించదగ్గ విధులు.కార్తీక మాసంలో శ్రీమహా విష్ణువు చెరువులలో, దిగుడు బావులలో,పిల్లకాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం.కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలో గంగ, యమున, గోదావరి,కృష్ణ,కావేరి,నర్మద, తపతి,సింధు మొదలైన నదులన్నింటి నీరూ ఉరిందని భావించాలి.
కార్తీక పురాణాధ్యాయ పరిచయము
1 వ అధ్యాయము : కార్తీకమాహత్మ్యము గురించి జనకుడు ప్రశ్నించుట, వశిష్టుడు కార్తీక వ్రతవిదానమును తెలుపుట, కార్తీకస్నాన విదానము.
2 వ అధ్యాయము : సోమవార వ్రత మహిమ, సోమవార వ్రతమహిమచే కుక్క కైలాసమేగుట.
3 వ అధ్యాయము : కార్తీకస్నాన మహిమ, బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట.
4 వ అధ్యాయము : దీపారాధన మహిమ, శతృజిత్ కథ.
5 వ అధ్యాయము : వనభోజన మహిమ, కిరాతమూషికములు మోక్షము నొందుట.
6 వ అధ్యాయము : దీపదానవిధి – మహత్యం, లుబ్దవితంతువు స్వర్గమున కేగుట.
7 వ అధ్యాయము : శివకేశవార్చనా విధులు.
8 వ అధ్యాయము : శ్రీహరి నామస్మరణాధన్యోపాయం, అజామీళుని కథ.
9 వ అధ్యాయము : విష్ణు పార్షద, యమదూతల వివాదము.
10 వ అధ్యాయము : అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము.
11 వ అధ్యాయము : మంథరుడు – పురాణమహిమ.
12 వ అధ్యాయము : ద్వాదశీ ప్రశంస, సాలగ్రామదాన మహిమ.
13 వ అధ్యాయము : కన్యాదానఫలము, సువీరచరిత్రము.
14 వ అధ్యాయము : ఆబోతునకు అచ్చుబోసి వదులుట (వృషోసర్గము), కార్తీకమసములో విసర్జింపవలసినవి, కార్తీక్మాసశివపూజాకల్పము.
15 వ అధ్యాయము : దీపప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతిలో నరరూపమొందుట.
16 వ అధ్యాయము : స్తంభదీప ప్రశంస, దీపస్తంభము విప్రుడగుట.
17 వ అధ్యాయము : అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము.
18 వ అధ్యాయము : సత్కర్మానుష్ఠానఫల ప్రభావము.
19 వ అధ్యాయము : చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణము.
20 వ అధ్యాయము : పురంజయుడు దురాచారుడగుట.
21 వ అధ్యాయము : పురంజయుడు కార్తీక ప్రభావము నెరంగుట.
22 వ అధ్యాయము : పురంజయుడు కార్తీకపౌర్ణమీ వ్రతము చేయుట.
23 వ అధ్యాయము : శ్రీరంగక్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట.
24 వ అధ్యాయము : అంబరీషుని ద్వాదశీ వ్రతము.
25 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని శపించుట.
26 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని శరణు వేడుట.
27 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట.
28 వ అధ్యాయము : విష్ణు (సుదర్శన) చక్ర మహిమ.
29 వ అధ్యాయము : అంబరీషుడు దూర్వాసుని పుజించుట – ద్వాదశీ పారాయణము.
30 వ అధ్యాయము : కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి.
కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు.
కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను.
నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమరోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను.
శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను.
ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను.
ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడుపువ్వులతోనూ పూజించవలెను.
ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.
కార్తీక మాసంలో పండుగలు
శుక్లపక్ష విదియ : భాతృ ద్వితీయ
దీనికే యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం అని పేర్లు, ఈ దినం పురుషులు సొంత ఇంటిలో భోజనం చేయరాదు. ఈ దినం సోదరి ఇంటిలోగాని, లేదంటే సోదరితో సమానమైనవారి ఇంట భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే అపమృత్యుభయం, నరకలోకభయం తొలగిపోతాయి. అంతే కాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యస్త్రీగా ఉంటూందని శాస్త్రవచనం.
శుక్లపక్ష చవితి ” నాగుల చవితి
కార్తీక శుక్లపక్ష చవితినాడు మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నాగులచవితి పర్వదినం జరుపుకుంటారు.
శుక్లపక్ష ఏకాదశి : ప్రభోదన ఏకాదశి
ఆషాడ శుక్ల పక్ష ఏకాదశి నాడు పాలకడలిలో శేషశయ్యపై శయనించి, యోగనిద్రలో గడిపిన శ్రీమహావిష్ణువు ఈ దినం నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనికి ‘ఉత్థాన ఏకాదశీ లేదా ‘ప్రబోధన ఏకాదశి ‘ అని పేర్లు. ఈ దినం ఉపవాస వ్రతం పాటించి శ్రీమహావిష్ణువును పూజించవలెను. అంతేకాకుండా తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతానికి ఈ ఏకాదశి చివరిరోజు.
శుక్లపక్ష ద్వాదశి: క్షీరాబ్ది ద్వాదశి
పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసింది ఈ రోజే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి ,చిలుకుద్వాదశి అని పేర్లు. శ్రీమహాలక్ష్మిని శ్రిమహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే . ఈ రోజు ఇంటి యందున్న తులసికోట వద్ద శ్రీమహావిష్ణువును లక్ష్మీసమానురాలైన తులసిని పూజించవలెను.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)
కార్తీక స్నానసంకల్పం
ప్రార్ధన : ‘నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమొస్తుతే || (అనుకుంటూ ఆచమనం చేసి)
సంకల్పం : దేశ కాలౌ సంకీర్త్య – గంగావాలుకాభి సప్తర్షి మండల పర్యంతం కృతవారాశే: పౌదరీ కాశ్వమేధాది సమస్త క్రతు ఫలావాప్తర్ధం, ఇహ జన్మని జన్మాన్తరేచ బాల్య కౌమార యౌవన వార్ధ కేషు జాగ్రత్ స్వప్న సుషుప్త్య వస్థాషు జ్ఞానతో జ్ఞానతశ్చ, కామతో కామతః స్వత: ప్రేరణయా సంభావితానాం సర్వేషాం పాపానా మపానో దనార్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, క్షేమ స్థయిర్య విజయా యురారోగ్యై శ్వర్యాదీనాం ఉత్తరోత్త రాభి వ్రుద్ధ్యర్ధం శ్రీ సివకేశావానుగ్రహ సిద్ధర్ధం వర్షే వర్షే ప్రయుక్త కార్తీకమాసే ………. వాసర (ఏ వారమో ఆవారం పేరు చెప్పుకొని) యుక్తాయాం ………… టితో (ఏ టితో ఆ తిథి చెప్పుకోవాలి) శ్రీ ………. (గోత్ర నామం చెప్పుకొని) గోత్రాభి జాతం ……. (పేరు చెప్పుకొని) నామతే యోహం – పవిత్ర కార్తీక ప్రాతః స్నానం కరిష్యే || (అని, స్నానం చేయాలి). అనంతరం
మంత్రం : ” తులారాశింగతే సూర్యే, గంగా త్ర్యైలోక్య పావనీ,
సర్వత్ర ద్రవ రూపేన సాసం పూర్ణా భవేత్తదా || “
అనే మంత్రముతో – ప్రవాహానికి ఎదురుగానూ, తీరానికి పరాన్ గ్ముఖం గానూ స్నానం ఆచరించి, కుడిచేతి బొటనవ్రేలితో నీటిని ఆలోడనం చేసి, 3 దోసిళ్ళ నీళ్ళు తీరానికి జల్లి, తీరం చేరి, కట్టుబట్టల కోణాలను నీరు కారేలా పిండాలి. దీనినే యక్షతర్పణ మంటారు. అనంతరం (పొ) డి వస్త్రాలను, నామాలను ధరించి, ఎవరెవరి కులాచారాల రీత్యా వారు వారు సంధ్యావందనం గాయత్ర్యాదులను నెరవేర్చుకొని నదీతీరంలో గాని, ఆలయానికి వెళ్లిగాని – శివుణ్నో, విష్ణువునో అర్చించి ఆవునేతితో దీపారాధానం చేసి, అనంతరం స్త్రీలు తులసి మొక్కనూ, దీపాన్నీ- పురుషులు కాయలున్న ఉసిరి కొమ్మనూ, దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణయుతంగా దానం చేయాలి.
దానముచేయువారు చెప్పవలసిన మంత్రము
ఓం ఇదం ఏతత్ అముకం (ఒమిటి చిట్టా రోధనాత్ – ఇద మేతత్ దారయిత్వా ఏత దితి ద్రుష్ట యామాస అముకమితి వస్తు నిర్దేశన – మితి (స్మార్తం) అద్య రీత్యా ( రీతినా) (అద్యయితి దేశకాలమాన వ్రుత్యాది సంకల్పం రీత్యేతి ఉద్దేశ్యయత్ ) విసర్జయేత్ (అని – ప్రాచ్యం)దదామి (అని వీనం) ఎవరికీ తోచిన శబ్దం వారు చెప్పుకోనవచ్చును.
దానము తీసుకోనువారు చెప్పవలసిన మంత్రం
(దానం చేసేటప్పుడు, ఆ దానాని పరిగ్రహించే వ్యక్తి ఈ దిగువ విషయాలను స్మరిస్తూ దానం తీసుకోవాలి).
ఓం ………… ఏతత్ ……………. ఇదం
( ఓమితి చిత్త నిరోధనస్యాత్ – ఏటదితి కర్మణ్యే – ఇద్మిటి కృత్య మిర్ధాత్) అముకం – (స్వకీయ ప్రవర చెప్పుకోనవలెను).
అద్యరీత్యా – దేశకాలమాన పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకొని – దాత్రు సర్వపాప అనౌచిత్య ప్రవర్త నాదిక సమస్త దుష్ఫల వినాశనార్ధం అహంభో (పునః ప్రవర చెప్పుకొని) – ఇదం అముకం దానం గృహ్ణామి ……….. (ఇద మితి ద్రుష్ట్య్వన, అముక్మిటి వస్తు నిర్దేశాది త్యా దయః) అని చెప్పుకోనుచూ ‘ పరిగ్రుహ్ణామి లేదా ‘ స్వీ గ్రుహ్ణామి అని అనుచూ స్వీకరించాలి.
శ్రీ శివ స్తోత్రం
శ్లో || వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగ ధరం వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం ||
శ్రీ విష్ణు సోత్రం
శ్లో || శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘ వర్ణం శుభాంగం
లక్ష్మీ కాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం
వందేవిష్ణుం భవభయ హారం సర్వలోకైక నాథం ||
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)