Categories
Vipra Foundation

లక్ష్మీపూజ విశిష్టత

      దీపం శ్రీ లక్ష్మీదేవి స్వరూపం … అనేక దీపాల నడుమ ఆ తల్లికి ఆహ్వానం పలకడమే దీపావళి. సాధారణంగా అమావాస్య రోజున శుభ సంబంధమైన కార్యక్రమాలు చేపట్టరు. కానీ ఈ అమావాస్యని ‘మహానిశి’గా భావిస్తుంటారు. లక్ష్మీదేవిని ఆరాధించడానికి … ఆమె అనుగ్రహాన్ని సంపాదించడానికి ఇది అత్యంత పవిత్రమైన ముహూర్తంగా పేర్కొంటారు. ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

      ఈ మహానిశి వేళలోనే అమ్మవారు తన కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరింపజేయడానికి బయలుదేరుతుంది. ఇతరులకి హానికలిగించని విధంగా ఎవరైతే జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారో, ఏ ఇంట నిత్యం దైవారాధన జరుగుతూ వుంటుందో అమ్మవారు ఆ ఇంటి దగ్గర ఆగుతుంది. తాను ప్రసాదించే దానిలో ఇతరులకి సహాయపడే గుణం కలిగినవారి ఇంటి వాకిట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అనునిత్యం ఏ ఇల్లు పచ్చనితోరణాలతో .. చక్కని ముగ్గులతో .. పసుపు కుంకుమల అలంకరణలతో కళకళలాడుతూ వుంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించి అక్కడ లక్ష్మీకళను ఉంచుతుంది.

      అందువలన ఈ రోజు ఉదయాన పూజా మందిరాన్ని పూలమాలికలతో అలంకరించాలి. పూజామందిరం ఎదురుగా చెక్కపీట వేసి దానిపై పసుపు రంగు వస్త్రం పరిచి దానిపై స్వస్తిక్ గుర్తు గీయాలి. స్వస్తిక్ గుర్తుపై రాగిచెంబును కలశంగా వుంచి … ఆ కలశంలో కొన్ని నీళ్లు పోసి అందులో కొన్ని గులాబీ రేకులు … కొన్ని సగ్గుబియ్యం … రెండు నాణాలు వెయ్యాలి. కలశంపై కొబ్బరిబొండాం వుంచి దానికి స్వస్తిక్ గుర్తుపెట్టాలి. ఆ తరువాత పసుపు గణపతిని తయారుచేసి … దీపారాధన చేసి పూజ ప్రారంభించాలి.

      అమ్మవారి వెండి ప్రతిమను పంచామృతాలతో అభిషేకించి ఆ తరువాత మట్టి ప్రమిదల్లో 12 దీపాలను నువ్వుల నూనెతో వెలిగించాలి. తామరపువ్వులతోను .. బంతులతోను .. గులాబీలతోను .. పసుపు అక్షింతలతోను అమ్మవారిని పూజించాలి. ఆ తల్లికి నువ్వులతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. తమకి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించమని అమ్మవారిని కోరుకోవాలి.

       పూజ పూర్తయిన తరువాత అక్షింతలను తలపై ధరించాలి. ఈ విధంగా అమ్మవారిని సంతోషపెట్టడం వలన, కోరిన వరాలను ప్రసాదిస్తుందని అంటారు. ఈ రోజున అమ్మవారు, ధనలక్ష్మి .. ధాన్యలక్ష్మి .. ధైర్యలక్ష్మి .. విద్యాలక్ష్మి .. విజయలక్ష్మి .. సంతాన లక్ష్మి .. రాజ్యలక్ష్మి .. వీరలక్ష్మి రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)