Categories
Vipra Foundation

వైశాఖ బహుళ ఏకాదశి అపరైకాదశి

వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నాడు విష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఉపవాసాన్ని మనం పాటిస్తే, మన దుఃఖం, బాధ, అవినీతి లాంటి చెడుగుణాలు దూరమవుతాయని భక్తులు ఎంతగానో నమ్ముతారు. ఇది భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో పిలువబడుతుంది. పంజాబ్, జమ్మూ & కాశ్మీర్ మరియు హర్యానాలో, అపారా ఏకాదశిని ‘భద్రకళి ఏకాదశి’ ‘అజల ఏకాదశి’ గా జరుపుకుంటారు మరియు భద్రాకాళి దేవిని పూజించడం ఈ రోజును కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ‘భద్రకాళి జయంతి’గా జరుపుతారు. ఒరిస్సాలో దీనిని ‘జలకృత ఏకాదశి’ అని పిలుస్తారు మరియు అక్కడ జగన్నాథ్ గౌరవార్థం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. దక్షయజ్ఞ సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక, అగ్నికి ఆహుతి అయిపోతుంది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు, తన జటాజూటం నుంచి భద్రకాళిని సృష్టించాడు. దుష్టసంహారం చేసే ఈ భద్రకాళి, అమ్మవారి ఉగ్రరూపాన్ని తలపించినా… భక్తులకు మాత్రం శాంతమూర్తే! ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని ఓ నమ్మకం. అందుకే ఈ రోజు భద్రకాళి పూజ జరుగుతుంది. అపర అంటే చాలా అర్థాలే వినిపిస్తాయి. వేదాంతంలో పరం అంటే ఆధ్యాత్మికం అనీ, అపర అంటే లౌకికమైన అని అర్థం. ఈ అపర ఏకాదశితో సాంసారిక కష్టాలు కూడా నెరవేరిపోతాయని ఈ అర్థానికి సూచన కావచ్చు.

అపర అంటే శిశువుని కప్పి ఉండే మాయపొర అని కూడా అర్థం వస్తుంది. అపర ఏకాదశి రోజు భగవదారాధనలో మునిగితే… మన మనసుని కమ్ముకుని ఉన్న మాయ కూడా తొలగిపోతుందనే సూచనేమో! అపర ఏకాదశి గురించి సాక్షాత్తు విష్ణుమూర్తి, ధర్మరాజుతో చెప్పిన మాటలే పై అర్థాలకు బలం చేకూరుస్తాయి. ‘అపర ఏకాదశి రోజున తనను నిష్ఠగా పూజిస్తే… గొడ్డలితో చెట్టుని నరికినట్టుగా, అగ్ని అడవిని దహించేసినట్టుగా, సూర్యుడు చీకటి చీల్చిపారేసినట్టుగా మన పాపాలన్నీ నశించిపోతాయని’ చెబుతారు.

శ్రీమహావిష్ణువు అవతరించిన అవతారాల్లో ఒక్కొ అవతారానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వీటిలో ముఖ్యంగా వామనావతరాన్ని గురించి చెప్పుకోవాలి. అపర ఏకాదశి రోజున వామనావతరంలో ఉన్న విష్ణువును పూజిస్తారు. ఈ రోజున వామన అవతారాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వారు సర్వపాపాల నుంచి విముక్తి పొందుతారని భక్తులు ఎంతగానో నమ్ముతారు. గంగాస్నానం నేడు ఎంతో ప్రత్యేకమైంది. అపర ఏకాదశి రోజున గంగా స్నానం చేయడం వల్ల పూర్వకాల పాపాలు కూడా పరిష్కరమవుతాయని అంటారు.

అపారా ఏకాదశి వ్రతాన్ని చేసేవారు గత మరియు ప్రస్తుత పాపాలను సులభంగా వదిలించుకోగలడని మరియు మంచితనం మరియు సానుకూలత మార్గాన్ని పొందగలడని నమ్ముతారు.ఈ రోజున ఉపవాసం ఉండే వారికి అపరిమితమైన సంపద లభిస్తుందని నమ్ముతారు. ఏకాదశి ఉపవాసం దశమి నుంచి మొదలై ద్వాదశి వరకు కొనసాగుతుంది. ఈ రోజు ఉపవాసం పాటించే వ్యక్తి ఉదయాన్నే నిద్రలేచి గంగా నీటితో స్నానం చేయాలి. ఉపవాసం ప్రారంభించడానికి ముందు శుభ్రమైన బట్టలు ధరించాలి. ఉపవాసం పాటించే ప్రజలు సూర్యాస్తమయం తరువాత ఆహారం తీసుకోకూడదని గమనించాలి. అలాగే అపరాఏకాదశి సందర్భంగా వ్యక్తి తప్పనిసరిగా సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి.

                అపర ఏకాదశి రోజు పూజ చేసేందుకు గాను ప్రత్యేక స్థలాన్ని ఎంచుకుని అక్కడ శుభ్రపరుచుకోవాలి. అనంతరం విష్ణువు, లక్ష్మీ దేవి విగ్రహాలకు గంగా జలంతో అభిషేకం చేయాలి. విష్ణువు విగ్రహానికి పువ్వులు, తమలపాకు, కొబ్బరి మొదలైనవి అర్పించాలి. తర్వాత మీ కోరికలన్నీ నెరవేర్చడానికి విష్ణువును ప్రార్థించాలి. సాయంత్రం విష్ణువు విగ్రహం ముందు దీపాన్ని వెలిగించాలి. ఈ రోజు అన్న దానం చేయాలి. పూజలు చేసిన అనంతరం ప్రజలకు ప్రసాదం పంపిణీ చేయాలి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)