(22-07-1925 :: 05-11-1987)
నిజాం నిరుంకుశత్వంపైన నిప్పులు చెరిగిన ధీశాలి… నాతెలంగాణ కోటిరతనాలవీణ అంటూ చాటి చెప్పిన దార్శనికుడు.. నిర్బంధాలకు వెరువకుండా నిలబడి పోరాడిన దాశరది కష్ణమాచార్యులు ఓరుగల్లు బిడ్డ. మానుకోట ఒడిలో.. చిన్నగూడురు బడిలో ఎదిగిన పోరుబిడ్డ. ఆ మహనీయుడు నాటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా పనిచేశారు.
వరంగల్ జిల్లా మరిపెడ మండలంలోని చిన్నగూడురు గ్రామంలో వెంకటాచార్యులు, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఇద్ధరు అబ్బాయిలు జన్మించారు. ఆ ఇద్దరు అబ్బాయిలు దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు. వీరిలో పెద్దవాడయిన కృష్ణమాచార్యులు 1925 జూలై 22న జన్మించారు. ఈయన పద్య కవితలో దిట్ట కాగా, చిన్నవాడయిన రంగాచార్యులు వచన కవితలో ఖండాంతర ఖ్యాతిని సంపాదించారు. దాశరథి కృష్ణమాచార్యుల ప్రాథమిక విద్యాబ్యాసం అంతా చిన్నగూడురులోని పాఠశాలలోనే జరిగింది. హైస్కూల్ విద్యను ఖమ్మం జిల్లా గార్లలో పూర్తి చేసారు. మొదటి నుంచి పోరాట స్వభావం ఉన్న దాశరథి నాటి నిజాం రాక్షసపాలనను ససేమీరా సహించలేక పోయారు. నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా జంకుతున్న కాలంలో ‘ఓ..నిజాం పిశాచమా.. కానరాడు నినుబోలిన రాజు మాకెన్నడేని.. తీగలను తెంచి అగ్నిలో దింపినావు..నా తెంలంగాణా కోటి రతనాలవీణ’ అంటూ గర్జించిన కలం వీరుడు దాశరధి. అంతటితో ఆగకుండా.. ‘ఎముకలు నుసి చేసి పొలాలు దున్ని… భోషాణములన్ నింపిన రైతులదే తెలంగా ణా..ముసలి నక్కకు రాచరికంబు దక్కునే ?!..’ అంటూ ఆగ్రహంతో ప్రశ్నించిన ధీరుడు దాశరథి. మా నిజాంరాజు జన్మ.. జన్మాల బూజు… అని గళమెత్తి గర్జిస్తే దాశరథిని గొలుసులతో బంధించి వరంగల్ వీదుల్లో ఈడ్చుకుని వెళ్లారు. వరంగల్ సెంట్రల్ జైల్లో కఠిన కారాగార శిక్ష విధించారు. కారాగారం దాశరది కలంలోని వేడిని.. వాడిని ఆపలేకపోయింది. చెరసాలలోనే ఉంటూ 1949లో ‘అగ్నిదార’ కురిపించారు. 1950లో ‘రుద్రవీణ’ మోగించారు. అనంతర కాలంలో పునర్నవం, అమృతాబిషేకం, కవితాపుష్పకం, మహాంధ్రోదయం, మహాబోధి, గాలీబ్‌గీతాలు, దాశరథి శతకం, నవమి, తిమిరంతోసమరం, ఆలోచనలోచనాలు వంటి అనేక ప్రముఖ రచనలు ఆయన కలం నుంచి జాలువారాయి. సినిమా రంగంలోనూ తన కలం వాడిని చూపిన దాశరథి వాగ్దానం, ఇద్దరు మిత్రులు, బలిపీఠం, పూజ వంటి చిత్రాలకు సాహిత్యాన్ని అందించారు.
వరించిన అవార్డులు
తన జీవితకాలంలో మహాకవి దాశరథి అనేక సత్కారాలు అందుకున్నారు. 1949లో మహాకవి బిరుదంతో ప్రారంభం అయిన ప్రస్తానంలో ‘కవిసింహ’ , ‘అభ్యుదయకవి చకవర్తి’, ‘యువకవి చకవర్తి’వంటి బిరుదులు ఆయనను వరించి వచ్చాయి. 1967లో ‘కవితాపుష్యకం’ సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు, 1972లో ప్రధానమంత్రి ఇందిరాగాంది చేతుల మీదుగా తామ్రపత్రం అందుకున్నారు. ‘తిమిరంతో సమరం సంపుటికి’ 1974లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాపపూర్ణ బిరుదు ఇచ్చి గౌరవించింది. 1976లో ఆగ్రా విశ్వ విద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ గౌరవ పట్టాను అందజేసింది. 1977 ఆగస్టు15వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దాశరధిని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఆస్థానకవిగా నియమించారు. 1978లో అమెరికాగ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంస్థ దాశరథిని ఆంధ్రకవితాసారథి బిరుదంతో సత్కరించింది. 1981లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డిలిట్ పట్టాతో సన్మానించింది.
చిన గూడూరులో విగ్రహావిష్కరణ
తెలంగాణాసాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో.. మానుకోటలో ఓ కార్యకమంలో ప్రసంగించడానికి వచ్చిన కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ దాశరథి వంటి గొప్పవ్యక్తికి ట్యాంక్‌బండ్ పైన విగ్రహం లేదన్న బాధకన్నా…అంతటి గొప్ప వ్యక్తి పుట్టిన చిన్నగూడురులో కూడా కనీసం ఓ చిన్న విగ్రహం లేదంటూ కంటతడిపెట్టడం పలువురిని కదిలించింది. చిన్నగూడూరుకు చెందిన విద్యాధికులు, యువకులు ఆమాటలకు విపరీతంగా స్పందించారు. ఊరంతా ఉమ్మడిగా కదిలి దాశరది నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని తమ ఊరి గొప్పతనాన్ని వెలుగెత్తి చాటుకున్నారు. విగ్రహ ఏర్పాటుకు స్పూర్తినిచ్చిన దేశపతి శ్రీనివాస్, ప్రజాకళాకారుడు గద్దర్, ప్రజాకవి జయరాజ్‌ల చేతులమీదుగా 2008 నవంబర్ 30న విగ్రహావిష్కరణ జరిగింది. దాశరథి గుర్తుగా గ్రామంలో ఆయన పేరిట గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసారు. అటువంటి మహనీయులను స్మరించుకోవడం చారిత్రక అవసరం.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)