Categories
Vipra Foundation

పాశాంకుశ (పాపాంకుశ) ఏకాదశి

                పాశం అంటే యమపాశం, యముడిచేతిలోని చావుతాడు. దాంతోనే…పాపుల్ని నరకానికి లాక్కెళ్లేది. ఈరోజున కనుక ఉపవాసం చేస్తే, ఆ వ్రతఫలం…అంకుశంలా యమ పాశాన్ని అడ్డుకుంటుందట! సమవర్తి అయిన యముడు కూడా ఏకాదశి వ్రతం చేసినవారి పట్ల కరుణ చూపుతాడట. తరువాత వచ్చే పున్నమి కూడా శ్రేష్ఠమైందే! ఈరోజు ‘కోజాగరీ వ్రతం’ చేస్తారు. కోజాగర్‌…మేలుకున్నదెవరు? – అని ఈ మాటకు అర్థం. అంటే, ఎవరెవరు జాగరణ చేశారో వాకబు చేసి మరీ లక్ష్మీదేవి కటాక్షిస్తుంది! నాటి రాత్రి పాచికలాడటం సంప్రదాయం. పండగల్లోని పరమార్థాన్ని తెలుసుకోగలిగితే…అదే వేయి వికాస గ్రంథాలకు సమానం. ఒక వ్రతం ఉపవాసం ద్వారా జిహ్వచాపల్యాన్ని ఓడించమని సూచిస్తుంది. మరో వ్రతం జాగరణ ద్వారా నిద్ర అనే బలహీనతను అధిగమించమని హెచ్చరిస్తుంది. పాచికలు ఆడమంటే, వ్యసనానికి బలైపోయి ఆస్తుల్ని తెగనమ్ముకోమని ప్రోత్సహించడం కాదు. పాండవులు జూదమాడి ఎన్ని కష్టాల్ని కొనితెచ్చుకున్నారో, ఆ ఒక్క దురలవాటు కారణంగా ధర్మరాజు అంతటివాడి వ్యక్తిత్వానికి ఎన్నెన్ని మరకలు

పడ్డాయో గుర్తుచేసుకోడానికి ఈ సమయం, చక్కని సందర్భం.

ఆశ్వీయుజమాసం శుక్లపక్షంలో వచ్చే పాశాంకుశ ఏకాదశి మాహాత్మ్యము శ్రీకృష్ణధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మ వైవర్త పురాణమునందు వర్ణించబడింది. ఆశ్వీయుజ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు, దాని వివరాలు తెలుపుమని ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగినపుడు ఆ దేవదేవుడు ఈ విధంగా పలికాడు.

ఓ రాజశ్రేష్ఠా! ఆ ఏకాదశి పేరు పాశాంకుశ ఏకాదశి. మనిషి యొక్క సమస్తమగు పాపములను నశింపజేసే ఆ ఏకాదశి మాహాత్మ్యాన్ని వివరిస్తాను విను. కొందరు దీనిని పాపాంకుశ ఏకాదశి అని కూడ పిలుస్తారు. ఆ రోజు ముఖ్యంగా పద్మనాభుని అర్చించాలి. ఆ ఏకాదశి జీవునికి స్వర్గసుఖాలను, మోక్షాన్ని, వాంఛితఫలాలను ఒసగుతుంది. విష్ణు నామోచ్చారణము చేత మనిషి ధరిత్రి పైన సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యాన్ని పొందగలుగుతాడు. బద్ధజీవుడు మోహవశముచే నానారకాలైన పాపకర్మలను చేయక పతితజీవులను ఉద్ధరించే శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించి వాటికి నమస్కరించినచో నరకమున పడకుండును.”

శివుని విమర్శించే వైష్ణవులు, విష్ణువును విమర్శించే శైవులు నిస్సందేహముగా నరకములో కూలుతారు. శతాశ్వమేధ యజ్ఞఫలము కాని, శత రాజసూయ యజ్ఞఫలము కాని ఈ ఏకాదశి పాలన వలన సంప్రాప్తించే పుణ్యానికి ఒక వంతు పోలవు. ఈ ఏకాదశిని పాటించడము వలన కలిగే పుణ్యానికి సమానమైన పుణ్యము ఈ జగత్తులో లేనేలేదు. కనుక పద్మనాభునికి పరమప్రియమైన ఈ ఏకాదశి యంతటి పవిత్రమైన దినము వేరొకటి లేదు.”

రాజా! ఏకాదశి నియమపాలనలో విఫలుడైనవాని దేహములో పాపాలు నివాసము చేస్తాయి. ఈ ప్రత్యేకమైన ఏకాదశిని పాటించేవాడు స్వర్గసౌఖ్యాలను, మోక్షాన్ని, రోగవిముక్తిని, సుందరమైన పత్నిని, ధనధాన్యాదులను పొందుతాడు. ఈ ఏకాదశిని పాటించి రాత్రి మొత్తము మేల్కొనియుండువాడు సులభంగా విష్ణులోకానికి చేరుకుంటాడు.”

ఓ రాజోత్తమా! ఈ ఏకాదశిని పాలనము చేయడము ద్వారా మనిషి తన తల్లి వైపు పది తరాలను, తండ్రి వైపు పది తరాలను, భార్య వైపు పది తరాలను ఉద్ధరించగలుగుతాడు. బాల్యము నందు గాని, యౌవనము నందు గాని, వృద్ధాప్యమునందు గాని ఈ ఏకాదశిని పాటించినవాడు. సంసారక్లేశములను అనుభవింపడు. ఈ పాశాంకుశ లేదా పాపాంకుశ ఏకాదశిని నిష్టగా పాటించేవాడు సమస్త పాపవిముక్తుడై జీవితాంతమున విష్ణుపదాన్ని చేరుకుంటాడు. బంగారమును, నువ్వులను, భూమిని, గోవులను, ధాన్యమును, జలమును, గొడుగును, పాదరక్షలను దానమిచ్చినవాడు యమసదనానికి వెళ్ళవలసిన పని ఉండదు. పుణ్యాచరణము లేకుండ ఆ రోజును గడిపివేసేవాడు శ్వాసించుచున్నప్పటికిని మృతుడే అనబడతాడు. అతని శ్వాసక్రియ కొలిమి తిత్తులతో పోల్చబడుతుంది.”

రాజా! ఇతరుల లాభము కొరకు చెఱువులను, బావులను త్రవ్వించేవాడు, నేలను గృహాలను దానమిచ్చేవాడు. యజ్ఞయాగాది కర్మలను చేసేవాడు యముని దండనకు గురికాడు. పుణ్యఫలము వలననే మానవులు దీర్ఘకాలము జీవిస్తారు, రోగదూరులౌతారు. సారాంశమేమంటే ఈ ఏకాదశి పాలనము వలన కలిగే ప్రత్యక్షఫలము దేవదేవుని భక్తియుత సేవ; కాగా భౌతికలాభములు పరోక్ష ఫలములై యున్నవి.”.

(ముఖ్యసూచన : ఏకాదశిరోజు బ్రహ్మహత్యాపాతకము లేదా గోహత్యాపాతకము వంటి ఘోరమైన పాపాలు ఐదురకాలైన ధాన్యాలను ఆశ్రయిస్తాయి. కనుక చరమలాభాన్ని పొందగోరే శ్రద్ధావంతులు ఆ రోజు వాటిని భుజించరాదు. 1) బియ్యము, బియ్యము నుండి తయారైనట్టి పిండి, అటుకులు, పేలాలు వంటివి, 2) గోధుమపిండి, మైదాపిండి, రవ్వ 3) బార్లీ వంటివి, 4) పెసరపప్పు, కందిపప్పు వంటి పప్పుదినుసులు, బఠానీలు వంటివి, 5) ఆవాలు, నువ్వులు, వాటి నుండి తీసే నూనె అనేవే ఆ ఐదురకాల నిషిద్ధధాన్యాలు. వీటిని తింటే ఏకాదశి వ్రతభంగము జరిగినట్లు అవుతుంది. పాలుపండ్లతో ఉపవాసము చేయడము శ్రేష్ఠము, ద్వాదశిరోజున ధాన్యముతో వండిన ప్రసాదముతో పారణచేయడం ద్వారా ఏకాదశి వ్రతము పూర్తవుతుంది.)

           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)