కొమురం భీమ్ గిగిజన గోండు తెగకు చెందిన వీరుడు. గిరిజనోద్యమ నాయకుడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించి వీరమరణం పొందాడు. ఇతను కొమురం చిన్నూమ్ సోంబాయి దంపతులకు 1900 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకా లోని సంకేపల్లి గ్రామం లో జన్మించాడు. ఈ మహావీరుడు తెలంగాణ కావడం, ప్రతి తెలంగాణీయుడు గర్వించే విషయం. భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది.స్వాతంత్య్రానికి పూర్వం 1935లో రాష్ట్రంలో నైజాం ప్రభుత్వం నిరంకుశత్వ పాశవిక పాలనలో అడవి తల్లిని నమ్ముకుని, నీతినిజాయితీతో జీవిస్తున్న అమాయ కులైన గిరిజనులపై అటవీ, రెవెన్యూ శాఖల దౌర్జన్యంతో పాటు దోపిడిదారులు దోచుకుంటుండగా, ఆ నాటి అక్రమాలను ఎదిరించి గిరిజను లను చైతన్య పరిచి నైజాం పాలనను ఎదిరించి పోరాడిన వీరుడు కొమురంభీం. అన్ని వర్గాల చేత అణగదొక్కబడుతూ, దోపిడీ, దౌర్జన్యాలకు గురవు తున్న సాటి గిరిజనులకు భూమి, భుక్తి, విముక్తి కోసం పాలకులతో పోరాడి, పోరాట స్ఫూర్తిని ముందు తరాల వారికి అందించి మహా మనిషిగా నిలిచిన గిరిజనుల ఆరాధ్య దైవం కొమురంభీం. సాటి గిరిజనుల కోసం పాలకులతో పోరాటం చేసిన ఆదివాసి తెగల గిరిజనులలో భీం ఆధ్యునిగా పేర్కొనవచ్చు. అటవీ భూములను నైజాం ప్రభుత్వం భూస్వాములకు పట్టాలు చేస్తున్న క్రమంలో చేతికి వచ్చిన పంటను తన్నుకుపోతున్న గిరిజనేతర సిద్దిక్‌లను హతమార్చిన కొమురంభీం అక్కడి నుంచి పారిపోయారు. బల్లార్ష, చాందాలలో కూలి పని చేసుకుంటూనే చదవడం, రాయడం నేర్చుకుంటూ రాజకీయాలు ముఖ్యంగా గిరిజనుల తిరుగుబాటు గురించి బాబిజరి కేంద్రంగా 12 గ్రామాలను పొందుపరిచి గిరిజనులపై దౌర్జన్యాలను ఎదుర్కొంటూ వచ్చాడు. అటు అటవీ శాఖ దౌర్జన్యాలకు తోడు అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చెల్లించకుండా దోపిడీలు కొనసాగి స్తున్న దోపిడీ వ్యాపారులపై కొమురంభీం నిప్పులు కురిపించారు. ఈ దశలో పోరాటం ఒక్కడి వల్ల కాదని గిరిజనులందరిని సంఘటిత పరిచి వారికి జరుగుతున్న అన్యాయాలను, మోసాలను వివరించారు. గోండులను సమీకరించి భూమి పోరాటాలను గురించి ఎప్పటికప్పుడు బోధించసాగారు. ఆయన అవిరామంగా చేసిన కృషి, ప్రయత్నాలు ఫలించాయి. గిరిజనులందరు వాస్తవాలు తెలుసుకుని కొమురంభీం నాయకత్వాన్ని బలపరిచారు. భీం నాయకత్వంలో గిరిజనులు అప్పటి ఆసిఫాబాద్ కలెక్టర్‌ను కలిసి తమకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ఒక నివేదిక సమర్పించారు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు.
“జల్ జంగల్ జమీన్” పేరుతో గిరిజన హక్కుల కోసం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసాడు. అయినా నిజాం ప్రభుత్వం గిరిజనుల సమస్యలు పరిష్కరించక పోగా చర్చల పేరుతో కొము రం భీంను వేధింపులకు గురి చేసింది. చివరికి జోడేఘాట్ కేంద్రంగా చేసుకుని గోండుల హక్కుల సాధన కోసం ఉద్యమం మరింత తీవ్రం చేశారు కొమురంభీం. అక్కడికి చేరుకునే పోలీసు, అటవీ శాఖ అధికారులను బంధించి సవాల్ విసిరారు. ఈ దశలో జోడేఘాట్‌కు వెళ్లడానికి ప్రభుత్వాధి కారులు భయపడటంతో పరిస్థితి క్షీణిస్తోందని ప్రభుత్వం పలు విధాలుగా ఆలోచించి ఉద్యమ నాయకుడు కొమురంభీంను వదిలించు కోవాలని కుట్ర పన్నింది. కుట్రలో భాగంగానే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దింపింది. జోడేఘాట్ నుంచి పోలీసు బలగాలను తిప్పి కొట్టడానికి కొమురంభీం వీరోచితంగా పోరాడారు.
ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు మరియు జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 సెప్టెంబర్ 1 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. అది గిరిజనులు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ద పౌర్ణమి కావడంతో అప్పటి నుండి ఆశ్వీజ మాస పౌర్ణమి నాడు జోడే ఘాట్‌లో గిరిజనులు భీం సంస్మరణ సభలను వర్ధంతిని జరుపుకొంటూ వస్తున్నారు.హక్కుల సాధన కోసం కొమురంభీం గిరిజనులకు పోరాటం నేర్పించి తాను తనువు చాలించారు. ప్రభుత్వ యంత్రాంగం జోడేఘాట్‌లో భీం వర్ధంతికి హాజరువుతూ గిరిజనుల సమస్య లను పరిష్కరించడం జరుగుతోంది. ఒక దశలో అప్పటి పీపుల్స్‌వార్ దళాల ఆధ్వర్యంలో భీం వర్ధంతి నిర్వహించడం జరిగింది. భీం నేర్పించిన పోరాటాలతోనే నేడు జిల్లాలో ఆదిమ గిరిజనులు తమ హక్కుల కోసం నడుం బిగించి పోరాటాలు సాగిస్తున్నారు.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)